ప్రబోధ తరంగాలు/143-195

వికీసోర్స్ నుండి

143. జన్మ జన్మకూ తనువు వేరు. తనువు తనువుకూ కర్మ వేరు. కర్మ కర్మకూ మనసు వేరు. మనసు మనస్సుకు బుద్ది వేరు.

144. జ్ఞానం, అజ్ఞానం రెండూ, నీలోనే ఉన్నాయి. కాని అజ్ఞానపు సంచిలో జ్ఞానం మూట గట్టబడి ఉంది.

145. దైవ సేవకై మనముండవలెను. కానీ మన ప్రయోజనముకై దైవముండకూడదు.

146. ఫలమాశించే కార్యము బంధము కలిగిస్తుంది. ఫలమాశించని కార్యము ముక్తిని కలిగిస్తుంది.

147. తల్లిగర్భము నుండి తనువు, బ్రహ్మగర్భము నుండి ప్రకృతి ఉద్భవించినది.

148. ప్రకృతి సంబంధమైన ప్రతి శరీరములందు, పరమాత్మ సంబంధమైన పురుషులిద్దరుంటారు. వారే క్షరాక్షరులు.

149. స్త్రీ పురుష సంయోగ ఫలము దేహకారణము. పాప పుణ్య సంయోగ ఫలము జీవకారణము.

150. నీవు నీ కర్మమనుభవించుటకై నీ శరీరము పుట్టింది కాని నీ శరీరం కర్మ అనుభవించుటకై నీవు పుట్టలేదు.

151. కర్మంటే ఏమిటో తెలుసుకొంటే కర్మనుండి విముక్తుడవు కాగలవు. మనస్సంటే ఏమిటో తెలుసుకొంటే మనస్సును జయించగలవు. ఆత్మ అంటే ఏమిటో తెలుసుకొంటే ఆత్మను చేరగలవు.

152. అన్ని పనులు నీ ఇష్టప్రకారము జరుగుతున్నాయనుకొంటున్నావు. నిజమేకానీ నీ ఇష్టం కర్మ ప్రకారం కలుగుతున్నది. 153. ఆత్మజ్ఞానం కలుగకపోవడమే జీవులకు అసలైన శిక్ష.

154. ఆత్మజ్ఞానమే కర్మలను సమిధల కాల్చు అగ్ని, ఆత్మజ్ఞానమే కర్మ జాడ్యాన్ని తీర్చు అమోఘ ఔషధము, ఆత్మజ్ఞానమే కర్మ మాలిన్యాన్ని కడుగు పరిశుద్ధజలము.

155. మధురమైన విషఫలాల వంటివి విషయసుఖాలు, అవి అనుభవించేటప్పుడు అతి మధురంగా ఉన్నా ఆ తరువాత అతి దారుణ ఫలితాలు కలిగిస్తాయి.

156. పుణ్యం కొరకు దానం చేస్తే సుఖం కొరకు జన్మ వస్తుంది.

157. నీవు చేయు దానం, యజ్ఞము, వేదపఠనము, తపస్సు అను నాలుగు విధానములవలన దేవున్ని తెలియుటకు సాధ్యముకాదని భగవద్గీతలో భగవంతుడు, మరియు పరమాత్మ తెలిపాడు.

158. ఇంద్రియాగోచరున్ని ఇంద్రియాతీతునివై గుర్తించాలి.

159. జ్ఞానము తెలిసేకొద్ది మనలో ఉన్న అజ్ఞానమెంతటిదో తెలియును.

160. మనిషికి గృహములాంటిదే జీవునికి శరీరము.

161. పిందె కాయగ, పండుగ మార్పు చెందినట్లు నీశరీరము కూడా యవ్వన, కౌమార, వృద్ధాప్యములలో మార్పు చెందుచున్నది.

162. చెట్టుఆకు రంగు మారిపోయినట్లు నీ శరీరము కూడా వృద్దాప్యములో రంగు మారిపోతుంది.

163. నీవు జాగ్రత్త, స్వప్న, నిద్రయను మూడవస్థలలో ఖైదీగా ఉన్నావు.

164. నీవు స్థూల, సూక్ష్మ, కారణమనెడి మూడు వస్త్రముల మధ్య చుట్టబడి ఉన్నావు. 165. ఆత్మ యోగసాధనకుతప్ప మిగతా వ్రత క్రతువులకు, తపస్సులకు, వేదపారాయణకు మరి ఏ ఇతర ఆచరణకు తెలియదు.

166. ఆత్మను తెలుసుకొన్నంత మాత్రముననే ముక్తిలేదు. కర్మనాశనము అయినపుడే ముక్తి.

167. అహమొక్కటియే కర్మ రహితమునకు, కర్మ సహితమునకు కారణము.

168. మనసొక్కటియే గుణ రహితమునకు, గుణ సహితమునకు కారణము.

169. భగవంతుడు సాకారుడు, పరమాత్మ నిరాకారుడు.

170. ప్రతికార్యము గుణము వలన, ప్రతి గుణము కర్మ వలన, ప్రతికర్మ కార్యము వలన కల్గుచున్నది. అందువలన జీవుడు చావు పుట్టుకలను చక్రమందు తిరుగుచున్నాడు.

171. జ్ఞానేంద్రియ విషయాల జ్ఞప్తియే నీలోని మనస్సు.

172. శరీరములోనికి జీవుడు ఎట్లు వచ్చునది తెలియని వారికి శరీరములోనుండి జీవము ఎట్లు పోవునది కూడా తెలియదు.

173. శరీరములో ఉన్నంత కాలము ఎంతటి యోగికాని పరమాత్మను తెలియలేడు.

174. ప్రకృతి కార్యములు స్వధర్మమనుకోకు, ఆత్మ కార్యములే స్వధర్మమని తెలుసుకో.

175. పాపములలో క్షమించబడు పాపము, క్షమించరాని పాపము అని రెండు విధములు గలవు. 176. లింగమొక్కటే అయినా అది మూడు విధములు. అంగమొక్కటే అయినా అది ఐదు విధములు.

177. తండ్రి శరీరానికి పుట్టేవారు పుత్రులు. గురువు జ్ఞానముతో తయారగువారు జ్ఞానపుత్రులు.

178. అయిన పనులకు నేను, కాని పనులకు కర్మయనకు. అన్నిటికి కర్మే కారణము.

179. ధర్మార్థ కామ మోక్షములనుట అసత్యము. కామార్థ ధర్మమోక్షములనుట సత్యము. ధర్మము వలన డబ్బు కామము వలన మోక్షము వచ్చుట అసత్యము.

180. ధర్మము వలన మోక్షము, కామము వలన ధనము లభ్యమగును.

181. నీ శరీరములో ప్రతి కదలిక ఆత్మదైనా అది కర్మననుసరించియే ఉండును.

182. ఆత్మ బయట లేదు. శరీరములందు ఉన్నదని గ్రహించు.

183. మరణములో ఆత్మ, జీవాత్మలు పోయిన శరీరములో మిగిలియున్నది పరమాత్మ ఒక్కటియేనని గ్రహించు.

184. "ధనమూల మిదమ్‌ జగత్‌" అంటారు. ఆ ధనమునకు కూడ కారణము కర్మే కావున కర్మమూల మిదమ్‌ జగత్‌ అను మాట సత్యమైనది మరియు సరియైనది.

185. బిడ్డకు తండ్రి ఎవరో తల్లికి తెలిసినట్లు, జీవునకు దేవుడెవడో గురువుకు మాత్రము తెలియును. 186. ఆహారము వలన శరీరారోగ్యము, విషయాహారము వలన మనో ఆరోగ్యము ఉండును.

187. ఆహారము గుణములకు కారణముగాదు. గుణములే ఆహారమునకు కారణమని తెలుసుకో.

188. అజ్ఞానముచేత లోకాలెక్కడో ఉన్నాయనుకోకు. అన్ని లోకాలు నీ తలలోనే ఉన్నాయి.

189. పుట్టను చూచినంత మాత్రముననే పుట్టలోని పామును గుర్తించలేరు. అట్లే శరీరమును చూచినంత మాత్రముననే శరీరములోని జీవాత్మను గుర్తించలేరు.

190. ప్రమిదలో చమురు అయిపోతూనే దివ్వె ఆరిపోయినట్లు శరీరములో కర్మ అయిపోతూనే జీవాత్మ అంతరించిపోవును.

191. జీవునకు సంకల్ప వికల్పములు కలిగించి, వాటి యోచనల ప్రకారం పనులజేయించి, అప్పటికప్పుడు సుఖదుఃఖ భావాలకు గురిచేస్తున్నదే ప్రారబ్ధకర్మము.

192. నీవెంత తాపత్రయపడినా నీ కర్మమునకు మించిన ఫలము కలుగబోదు.

193. జీవుల కర్మ తీరాలంటే రెండే రెండు మార్గాలు కలవు. అనుభవించడమో లేక జ్ఞానాగ్నికి ఆహుతి చేయడమో.

194. నీకంటే వేరుగానున్న ప్రకృతియే నీ శరీరము.

195. నీకంటే వేరుగానున్న ప్రకృతిని (శరీరమును) నీవుగా భావిస్తున్నంతవరకు నీలోని అజ్ఞానం అంతరించదు.