ప్రబోధ తరంగాలు/49-95
49.అజ్ఞానజనితమైన పశుపక్ష్యాదులు ఆహార, నిద్ర, సంభోగ విషయ కార్యకలాపాలలో జీవిస్తున్నాయి. ఎంతో జ్ఞానమున్న మానవుడు అలాగే చరిస్తే వాటికి మానవునకు తేడా ఏమున్నది?
50.అహమును అణచి, కాయమును కర్తవ్యానికి వదిలినవాడే అసలైన కర్మయోగి.
51. విషయమనే గాలానికి సుఖమనే ఎరను తొడిగి ఆశజూపి, కర్మమనే బుట్టలో చేపయనే జీవున్ని బంధించుచున్నది మాయ అను జాలరి.
52.కర్మమనే తప్పుకు ప్రకృతియనే చెరసాలలో జీవుడు శిక్షను అనుభవిస్తున్నాడు. కర్మరహితమైనపుడు జీవునకు మోక్షమను విడుదల లభించును.
53. ఇరుసును ఆధారము చేసుకొని చక్రము చలించురీతిగా ఆత్మనాధారము చేసుకొని కర్మ గుణచక్రములు చలించుచున్నవి.
54. దేవుడుంటే చూపించమని దెబ్బలాటకు దిగకు. కర్మను వదులు, క్షణాల్లో కనిపిస్తాడు. అపుడు నీవే దేవునివి.
55.గుణాలను ఆజ్ఞాపిస్తాడు గురుదేవుడు, గుణాల ఆజ్ఞలో చరిస్తాడు ధరజీవుడు.
56. గుణాతీతుడైన దేవున్ని గుర్తించాలంటే, నీవు కూడా గుణాతీతుడవైతేనే సాధ్యపడుతుంది.
57. గుణాల ఊబిలోపడి కూరుకుపోవుచున్న జీవా! ఆత్మజ్ఞానాన్ని అందుకో నిన్ను బయటకు అదే లాగుతుంది.
58.దేవుని శక్తిచే ప్రభవించిన ప్రకృతి శరీర సహాయముతో బ్రతికి బట్టగడుతున్న జీవా! దేవుడులేడని భావించవద్దు. 59. అందాలన్ని ప్రకృతివే, కానీ పరమాత్మ లేనిదే అవి ప్రకాశింపవు.
60. జ్ఞానదృష్టిచే ప్రకృతిని పరిశోధించు! ప్రకృతిలోనే పరమాత్మ తత్త్వాన్ని పరిగ్రహించగలవు.
61. జన్మరహితమే అద్వైతసిద్ధి. ఆలోచన సహితమే మాయసిద్ది.
62. ఆసనాదుల సాధనము వలన అంగారోగ్యమే కల్గును. ఆత్మైక్యత కల్గదు. అవి ఆరోగ్య అసనాలేకానీ యోగాసనాలు కావు.
63. వికలాంగ జీవుల చూచి విచారిస్తున్నావా? వెనుక జన్మలలో వారెంత ఘోరపాపముచేసారో! ఇప్పుడీ విధంగా శిక్షను అనుభవిస్తున్నారు.
64. వృద్ధాప్యములో దైవాన్ని తెలుసుకొందామని ఊహిస్తున్నావా! చింతల చిక్కులలో చిక్కి చితిగిపోయిన మనస్సునకు ఆత్మావగాహన అతుకదు.
65. మోక్షమను గృహములోనికి ప్రవేశించాలంటే మూడు మెటికలు ఎక్కవలసి వస్తుంది. అవియే 1) భక్తి 2) జ్ఞానము 3) యోగము లేక ప్రారబ్ధ, ఆగామి, సంచిత కర్మలను దాటవలసి వస్తుంది.
66. భక్తి వలన జ్ఞానము, జ్ఞానము వలన యోగము, యోగము వలన తత్త్వము, తత్త్వము వలన ముక్తి సిద్ధిస్తుంది.
67. దైవజ్ఞానమంటే ఏమిటోగాదు. ఆత్మవిషయములను (ధర్మములు) తెలుసుకొనడమే.
68. బాహ్యంగా అగ్నితో చేయు యజ్ఞము కట్టెలను, అంతరంగములో జ్ఞానాగ్నితో చేయు యజ్ఞము కర్మలను కాల్చును. 69. కర్మ లేనిదే కనురెప్ప కూడా కదలదు. అహము లేనిదే ఏ కర్మ రాదు.
70. జీవుని కర్మను కార్యరూపముతో కష్టసుఖాలను అనుభవింప- చేయుటకే ప్రకృతి శక్తులు లోపల బయట ప్రబలి ఉన్నాయి.
71. జీవుడు అహంకారముతో చేయు అన్ని పనులకు రెండు విధాల ఫలితాలుంటాయి, అవి 1) స్థూల ఫలము 2) సూక్ష్మ ఫలము . 72. జీవుడు వెనుక జన్మలలో సూక్ష్మ ధనము (కర్మ)ను ఈ జన్మలో స్థూలంగా అనుభవిస్తున్నాడు. ఈ జన్మలోని సూక్ష్మఫలమును తరువాత జన్మలలో అనుభవిస్తుంటాడు.
73. జీవుడు సంపాదించుకొనేది పాపమూ, పుణ్యము. అనుభవించేది దుఃఖము, సుఖము.
74. మంచివైనా, చెడువైనా వాటి ఫలితాలమీద ఆశ వదలి కార్యములు చేస్తే వాటి కర్మ జీవులకంటదు.
75. మనస్సనే పశువును జ్ఞానమను ఖడ్గముచే ఆత్మకు బలిచేయుము అప్పుడే అవ్యయానందమనే వరాన్ని ఆత్మ ప్రసాదిస్తుంది.
76. ఆనందమనే ఆశచూపి అన్ని కష్టాలు పెడుతున్నది మాయ, జీవుల మాయాసమ్మోహిత మగ్నులజేసి, పంచభూతములను పరికరములచే పరమాత్మ ఇస్తున్న ఇంద్రజాల ప్రదర్శనమే ఈజగత్ చర్యలు.
77. కుతంత్రాలతో బుద్ధి, మంతనాలతో మనస్సు, నిర్ణయాలతో చిత్తము, జీవుని కీర్తించడములో అహము ఎడతెరపి లేకుండ ఉన్నవి. 78. ఉపవాసాలూ, వ్రతాలతో వళ్ళు జెడుతుందిగాని, జీవా! అవి నిన్ను ఉద్ధరించలేవు. యోగాలతో ఊహించరానిస్థితిని అందుకోగలవు.
79. మాయను జయించిన వారే మహనీయులు, కానీ మాయతో కూడుకొన్న మాటలు చెప్పువారు కారు.
80. తపస్సుకు తపనకు కాలవ్యత్యాసమే తేడా, తపస్సు పెద్దకోరిక, తపన చిన్న కోరిక.
81. తపనలు, తపస్సులు వదిలినపుడే తత్త్వం గోచరిస్తుంది.
82. మనసును ఒకే విషయముపై నిలిపే అలవాటు చేస్తే తర్వాత అది ఆ విషయమునుండి మరలి వచ్చుట మహా కష్టమగును.
83. మనస్సు అనే చెట్టుకు విషయములను వేర్లు ఆధారము. వేర్లు తెగితే చెట్టు కూలిపోయినట్లు విషయములు ఖండించితే మనస్సు కూలిపోతుంది.
84. ఒక కోర్కె తీర్చుకొనేటప్పటికి పది కోర్కెలు నీలో ఆవిర్భవిస్తుంటే ఇంక కోర్కెలు తరిగేదెప్పుడు?
85. అజ్ఞాన జీవులకు ఆయుస్సు అయిపోతుంటే, ఆశలు పెరుగుతూ పోతున్నాయి.
86. బాహ్య సంసారాన్ని వర్జించినవాని కంటే లోపల సాంగత్యాన్ని వర్జించినవాడే సత్యమైన సన్న్యాసి.
87. ఎప్పుడు జ్ఞానం తెలుసుకోవాలని సంకల్పం కల్గుతుందో, ఆ క్షణములోనే ప్రయత్నించు. ఎందుకంటే మనస్సు చంచలమైనది. జీవితం అస్థిరమైనది.
88. సంకల్పాలులేని జ్ఞప్తియే నీకు దేవునికి మధ్యలోగల ఆత్మను గ్రహిస్తుంది.
89. నిన్ను నీవు తెలుసుకోగలిగినంత మాత్రమున నీ బయటనున్న పరబ్రహ్మాన్ని తెలుసుకోలేవు. కర్మ అయిపోయి నీ శరీరము వదలిన తర్వాతే పరబ్రహ్మ తెలియును.
90. విషయములనే విష వృక్షాలతో నిండిన అజ్ఞానారణ్యములో అలమటిస్తున్న జీవా! అందుకో ఆధ్యాత్మికాయుధాన్ని అడుగంటా కూల్చివేయి ఆ అరణ్యాన్ని, అప్పుడే అఖండ పరబ్రహ్మమనే బయలులో సేద తీర్చుకొంటావు.
91. నీచవాంఛలకు నీమదిలో తావీయకు అవి నిన్ను ఆత్మజ్ఞానానికి అతిదూరం చేస్తాయి.
92. సౌఖ్యాలు కల్గించే కర్మలు తన ప్రమేయమని, బాధలు కలిగించే కర్మలు దైవప్రమేయమని భావించుట అజ్ఞానమగును.
93. నీ దేహములో సర్వాంగాలు నావి అంటున్నావు నావి అంటున్న నీవెవ్వరో తెలుసుకోలేకున్నావు.
94. కలిమి కల్గినపుడు కానరాడు దేవుడు, లేమి కలిగినపుడు మాత్రమే జ్ఞాపకానికి వస్తాడు.
95. జగమంతా నిండిన జగన్నాథుడే భగమునుండి ఉద్భవించి భగవంతుడైనాడు. అతడే రాయబారి, అవధూత.