Jump to content

ప్రబోధ తరంగాలు/1-48

వికీసోర్స్ నుండి

ప్రబోధ తరంగాలు

1. చెరుకునుండి రసాన్ని ఆస్వాదించి పిప్పిని వదులునట్లు, గ్రంథములోని భావాన్ని గ్రహించి భాషను వదులు వారు పరిశుద్ధ పాఠకులు.

2. నిరంతర ఆత్మచింతనచే నిన్ను నీవు తెలుసుకోవడమే నిజమైన నీ స్వంతపని.

3. జ్ఞాన మార్గమందు ప్రయాణించాలనుకొనే వారికి అజ్ఞానులే కంటక సమానులై అవరోధములు కల్పించుచుందురు.

4. పిచ్చివానికి రత్నమిచ్చినా దానితో వాడు ప్రయోజనము పొందనట్లు మూర్ఖ చిత్తునకు జ్ఞానోపదేశము చేసినా దానితో వాడు ప్రయోజనము పొందడు.

5. ఆహారపదార్థాల వలన శరీరమూ, గుణవిషయాల వలన మనస్సూ జీవించుచుండును.

6. జ్ఞానేంద్రియాలతో కూడి మనస్సు, విషయములను జీవునకు తెల్పును. జీవుడు అజ్ఞానవశమున అహంకారముతో కూడి ఆ విషయ సుఖదుఃఖములను అనుభవించును.

7. అల్ప సుఖాలకాశించి జీవుడు అజ్ఞానముతో అనంత కష్టాలెన్నో ఎదుర్కొంటున్నాడు.

8. బాహ్యనేత్రాలకగుపించే చీకటి భానోదయము వలన అంతరించును. మనోనేత్రాలకగుపించే చీకటి జ్ఞానోదయం వలన అంతరించును.

9. దేహశుద్ధికి స్నానమవసరము, దేహి (జీవాత్మ) శుద్ధికి జ్ఞానమవసరము.

10. ఒక జన్మలో శరీరములోనికి జీవుడు ప్రవేశించడము ఒక పర్యాయమే మరల నిష్క్రమించడము కూడ ఒక పర్యాయమే.

11. జీవ శరీరాలు భూమిమీద జన్మించు విధానం అన్నిటికి ఒకేరకంగా ఉంటుంది. కాని మరణించడము మాత్రము నాల్గు విధములుగా ఉంటుంది.

12. జీవునకు కర్మ అనుభవించడము వలన అయిపోతున్నది, కానీ అహంకారము మరింత కర్మను సంపాదించి పెట్టుచున్నది.

13. అజ్ఞానము వలన అహంకారము, అహంకారము వలన ఆగామికర్మ జీవునకు కలుగుచున్నది.

14. పరిశుద్ధమైన ఔషధాన్ని సేవించిన శరీరరోగము వదలిపోవునట్లు, పరిశుద్ధ జ్ఞానశక్తిని పొందిన జీవున్ని కర్మరోగము వదలిపోతుంది.

15. ఆరోగ్యమియ్యని ఔషధమూ, ఆత్మజ్ఞానమియ్యని బోధ నిష్ప్రయోజనము.

16. కామ, క్రోధ, లోభ, మోహ, మధ మత్సరములను ఆయుధములచే జీవుడు తన్నుతానే హింసించుకొంటున్నాడు.

17. శరీరమనే గృహమందు అజ్ఞానమనే అంధకారములో ఉన్న జీవుడు జ్ఞానదివ్వెను వెల్గించి చూచుకొంటేనే తన్నుతాను తెలుసుకోగలడు.

18. అహంకారము తొలగక అజ్ఞానము అంతరించదు. అజ్ఞానము అంతరించక ఆత్మదర్శనము కాదు.

19. పంచభూతములచే నిర్మింపబడిన శరీరములు పంచభూతముల వలనే నశిస్తున్నాయి.

20. అష్ట ఐశ్వర్యాలతో తులతూగేవారిని చూచి నేను అలాలేనని అసూయచెందితే ప్రయోజనమేమి? ముందు జన్మలలో వారు చేసుకొన్న పుణ్యఫలమే వారినాస్థితియందుంచినది.

21. అపారమైన సముద్రములోని జలబిందువువంటిది శరీరములోని జీవాత్మ.

22. బాహ్యపూజలకన్నా భావపూజయే దేవునికి ఇష్టము.

23. ఆహారపదార్థముల ప్రభావము వలన గుణప్రభావములు మారవు. కానీ గుణప్రభావము వలన ఆయా ఆహారముల తినుటకు అభిలాషకల్గును.

24. చేప దాని స్వస్థానమైన నీటియందుంటేనే దానికానందము అలాగే మనస్సు దాని స్వస్థానమైన ఆత్మయందుంటేనే దానికానందము.

25. సంకల్పాల రాహిత్యము చేసుకోవడమే సత్యమైన బ్రహ్మయోగము.

26. ఆడంబర పూజలన్ని అజ్ఞానానికి దోహదం చేస్తాయి. కానీ ఆత్మభావాన్ని అందించలేవు.

27. పాత్ర కడిగి చేసిన పాకమూ, పాత్రలెరిగి చేసిన జ్ఞానదానము పరిశుద్ధ ఫలమిచ్చును. 28. నీతి, న్యాయము బాహ్యోన్నతికి, జ్ఞాన, ధర్మము ఆత్మోన్నతికి దోహదము చేస్తాయి.

29. మాయ బయటున్నదని భావించకు. అది నీలోనే ఉన్నది. మాయలోపడుట బయటకాదు నీ తలలోనేయని తెలుసుకో.

30. అపరిమిత వేగముతో తిరిగే నీ మనస్సును స్వాధీనము చేసుకో ఆత్మయంటే ఏమిటో అర్థమౌతుంది.

31. మతాలు, కులాలు మానవులు నిర్మించుకొన్నవే కాని మహాత్ములు నిర్మించినవి కావు.

32. దేహ భావమే మాయపాశము. దేహి భావమే దివ్యజ్ఞానము.

33. సర్వజీవి సమన్వయమౌ శాస్త్రమును బోధించునతడే జగద్గురువు.

34. గారడిలాంటి విద్యలజూచి జ్ఞానమనుకోవడము, ఎండమావులను చూచి నీరనుకోవడము రెండూ ఒక్కటే.

35. కర్మచేత గుణములు, గుణములచేత మనస్సు, మనస్సుచేత శరీరము చలించుచుండును. అది తెలియకపోతే అజ్ఞానమే అగును.

36. బాహ్య సంసార వ్యామోహమను మధుపాన మత్తునకు సత్యాన్ని తెలుసుకొనే సత్తా ఎక్కడిది?

37. అడ్డాలు తిరిగే మనస్సును అరికట్టక, గడ్డాలు పెంచి తిరిగినా కర్మ తొలగదు.

38. ఉన్నత జ్ఞానం నీలో ఉత్పన్నము చేసుకొనకనే ఉపదేశము కావాలని ఉబలాటపడకు. ఉపదేశాన్ని భరించే శక్తి నీ హృదయానికున్నప్పుడే ఆ ఉపదేశము సిద్ధిస్తుంది. 39. జ్ఞానమును తెలిసి మనసును జయించినవాడే మహాత్ముడు, కానీ అజ్ఞానపు మాటలు చెప్పువాడుకాడు.

40. అందాలను చూచి ఆనందించు, అంతే! వాటిననుభవించాలని ఆశించావా ఆ తర్వాత కష్టాలు ఎదురౌతాయి.

41. శరీరాన్ని నాశనముచేసి అందులోగల జీవున్ని వేరు చేయగలరు, కానీ ఏ మానవుడు ఒక శరీరాన్ని తయారుచేసి అందులో జీవాన్ని నింపలేడు.

42. అసలైన ఆత్మజ్ఞానము అవగాహనమయ్యే వరకు విషయాల విషవలయము నుండి జీవున్ని విడిపించడము వీలుకాదు.

43. అదుపులేకుండా నీలో ఆవిర్భవించే ఆలోచన తరంగాలకు ఆనకట్టవేయ్‌, అప్పుడే అలౌకికమైన ఆత్మభావాన్ని అందుకోగలవు.

44. అశయే ఆత్మావగాహనకు అవరోధముకాని ఆలుబిడ్డలుకాదు.

45. మత వైషమ్యాల మాయలోబడ మహోన్నత భావాన్నిమలచుకో ఆత్మశిఖరాన్నధిరోహించగలవు.

46. సమ్మతినుండి ఉద్భవించినవే అన్నిమతాలు, కానీ మతిని నిల్పునట్టి మతమే మహోన్నతమైనది.

47. అన్ని మతాలు అచలస్థితివరకే. ఆ పైన అన్ని హరిస్తాయి.

48. సారవంతమైన భూమిలో వేసిన బీజము, సత్యవంతుని హృదయములో నాటిన జ్ఞానము సత్ఫలితమిచ్చును.