ప్రబోధ తరంగాలు/ముందు మాట

వికీసోర్స్ నుండి

ముందుగా చెప్పునది


"ప్ర" అను అక్షరమునకు విశిష్టమైన అర్థమున్నది. పంచ భూతములను పంచ అని పిలుస్తు వాటి యందు "ప్ర" ను పెట్టడమైనది. దానితో ప్రలయము అయినది. ఇట్లు ఉన్నదానికి విశిష్టతను విశేషతను చేర్చునది "ప్ర" అని తెలియుము. అదే పద్దతిలో ఇచ్చట బోధకు "ప్ర" ను చేర్చడమయినది. దానితో ప్రబోధ అయినది. ప్రబోధ అనగ విశిష్టమైన బోధ అనియు, అన్ని బోధలకంటే ప్రత్యేకత ప్రాముఖ్యత గల బోధ అనియు తెలియుచున్నది. మేము చెప్పు బోధలో ప్రత్యేక త్రైత సిద్ధాంతము ఉండుట వలననే ప్రబోధ అని పేరు పెట్టడము జరిగినది. మా బోధలలోని సారాంశమైన కొన్ని వాక్యములను "ప్రబోధ తరంగాలు" అని పేరు పెట్టి వ్రాయడము జరిగినది. వేమన పద్యమందు ఎక్కువ అర్ధమిమిడినట్లు ప్రబోధ తరంగాలలో కూడ విశేష అర్ధముండునని తెలుపుచున్నాము.

భాషా ప్రావీణ్యత లేని ఈ వాక్యములలో భావ ప్రావీణ్యత ఎక్కువగా ఉండును. చాలా పుస్తకములలో పది పేజీలు చదివిన అందులో గుర్తింపదగిన విషయముండదు. చదువుటకు ఇంపుగా ఉండినప్పటికి అందులో గ్రహించవలసిన విషయము లేకపోవుటచే ఎంత చదవిన లాభముండదు. మా పుస్తకములలో అలా కాక ప్రతి పేజీలోను కొంత క్రొత్తవిషయమూ,గుర్తింపదగిన సారాంశముండును. అంతేకాక మేము చెప్పువిషయము ఇంకా సులభముగా అర్ధమగునట్లు, ఒక్కొక్క సారాంశమును ఒక్కొక్క వాక్యముగ వ్రాయడము జరిగినది. అలా వ్రాసినదే ఈ "ప్రబోధ తరంగాలు" అను గ్రంథము. ఈ పుస్తకములో ఏడు వందలకు పైగా వాక్యములున్నవి. ప్రతి వ్యాకము గొప్ప సందేశమై ఉన్నది. కొందరి మనస్సులో ఎంతో కాలమునుండి ఉన్న సంశయములకు మరియు ఎన్ని గ్రంథములను చదివినప్పటికి తీరని ప్రశ్నలకు, సూటిగా జవాబు చెప్పినట్లు ఇందులో వాక్యములు గలవు. ప్రతి వాక్యము ఒక క్రొత్త విషయమును తెలుపుచు,కొన్ని ప్రశ్నల సమూహమునకు ఒకే జవాబై ఉన్నది. కొన్ని వాక్యములు ప్రత్యేకించి ఒక్కొక్కటి ఒక గ్రంథ సారాంశము కలిగి ఉన్నవి. అందువలన జ్ఞాన జిజ్ఞాసులకు అధికముగా మేలు చేయునని మేము నమ్ముచున్నాము. మా నుండి చెప్పబడు ప్రతి విషయమునకు శాస్త్రబద్దత ఉండవలెననునది మా ఉద్దేశ్యము. శాస్త్రబద్దత లేని ఎంత గొప్ప విషయమైన అప్పుడు వినేదానికి బాగుండినప్పటికి తర్వాత జీవితములో ఉపయోగపడదు. బత్తాయి (చీనీ) పండు రసము వెంటనే త్రాగుటకు రుచిగ బాగుండును,కానీ ఒక అరగంట తర్వాత చెడిపోయి రుచి మారిపోయి ఉండును. అప్పటికి బాగున్నా భవిష్యత్తులో బత్తాయి రసము త్రాగుటకుపయోగపడదు. తేనె అలాకాక మొదట ఎలాగున్నదో అలాగే ఉండి, ఎంత కాలమైన రుచి మారనిదై ఎలప్పుడు ఉపయోగపడును. ఈ విధముగనే మా బోధలు జీవితములో ఎప్పుడైన ఉపయోగపడునవై ఉండును. విన్నపుడు రుచిగ ఉండి తర్వాత జీవితములో ఉపయోగపడని జ్ఞానవిషయములు కాక, ఎల్లపుడు ఒకే జ్ఞాన సారంశము కల్గి జీవితములో ఉపయోగపడునవే ఈ ప్రబోధ తరంగములని తెల్పుచున్నాము.

ఇట్లు

ఇందూ ధర్మప్రదాత

సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు