Jump to content

ప్రబోధ తరంగాలు/518-561

వికీసోర్స్ నుండి

518. ముందే నిర్ణయించుకోవడమును "పథకము" అంటాము. పుట్టినపుడు నిర్ణయించబడిన దానిని "జాపథకము" అంటాము. జాపథకము అనునదే నేడు జాతకము అను పేరుతో కలదు.

519. అద్వైతులు విశిష్టాద్వైతులు, ద్వైతులు ఆత్మను మరిచారు. పరమాత్మను జీవాత్మను గురించే మాట్లాడారు.

520. పరమాత్మనూ జీవాత్మనూ కాక, ఆత్మ కూడ ఒకటి కలదని చెప్పినది ఒకేఒక త్రైతసిద్ధాంతము.

521. అద్వైతులు పరమాత్మను మాత్రము చెప్పగ విశిష్టాద్వైతులు పరమాత్మను కొంత విశిష్టముగ చెప్పారు. ద్వైతులు పరమాత్మను జీవాత్మను గురించి చెప్పారు.

522. ఆత్మను గురించి ప్రత్యేకించి చెప్పినది త్రైతసిద్ధాంతము ఒక్కటే.

523. ఒకే పరమాత్మను గురించి చెప్పినవారు అద్వైతులు, విశిష్టాద్వైతులు కాగ, పరమాత్మ, జీవాత్మ అను ఇరువురిని చెప్పినవారు ద్వైతులు కాగ, పరమాత్మనూ, జీవాత్మనూ, ఆత్మనూ ముగ్గురిని గురించి చెప్పినవారు త్రైతులు.

524. అవధులులేని సమాచారమును మోసుకొచ్చినవాడు అవధూత ఒక్కడే. అతను ఎప్పుడో ఒకపుడు భూమివిూదకు వస్తాడు. అతనే భగవంతుడు.

525. తామసులు, రాజసులు, సాత్త్వికులు, యోగులని మనుషులను నాల్గు తెగలగా గీతలో భగవంతుడు చూపగా, అదే మనుషులు అజ్ఞానులుగ, జ్ఞానులుగ, యోగులుగ, భగవంతునిగ నాల్గురకములుగా ఉన్నారని త్రైతసిద్ధాంత ఆదికర్త తెలుపుచున్నాడు. 526. గుణములలోని అరిషట్‌వర్గములోని మొదటి ఆశా చివరి అసూయా రెండూ ప్రత్యేకముగ మనిషిలో పనిచేయుచున్నవి.

527. అంతఃకరణములలోని మొదటి మనస్సు చివరి అహము రెండూ ప్రత్యేకించి పని చేయుచున్నవి.

528. శరీరములోని మనస్సును గుఱ్ఱముగ, అహమును కాకిగ పోల్చవచ్చును.

529. మనో విషయములను గుఱ్ఱపునాడగ, అహంకార పనులను కాకినాడగ చెప్పవచ్చును.

530. గుఱ్ఱపునాడను లేకుండ చేసుకొంటే బ్రహ్మయోగమూ, కాకినాడను లేకుండ చేసుకొంటే కర్మయోగమూ లభ్యమగును.

531. ఆధ్యాత్మికమనునది శరీరము బయటలేదు. శరీరములోపలే ఉన్నది.

532. పక్షి పగలు ఎంత ఎగిరినా సాయంకాలమునకు తిరిగి తన గూడును చేరినట్లు, మనసు ఎన్ని విషయములలో తిరిగినా చివరకు తిరిగి తన గూడు అయిన బ్రహ్మనాడినే చేరును.

533. నీవు అందరికి మామ అవ్వాలంటే చందమామకావాలి. చందమామ కావాలంటే దైవజ్ఞానము తెలియాలి.

534. "" అంటే కాదు అని అర్థము. "మమ్‌" అంటే నేను అని అర్థము. "నామమ్‌" అంటే నేను కాదు అని అర్థము.

535. "సం" అంటే జ్ఞానము, "అంతకమ్‌" అంటే ఏమాత్రములేనిది అని, అంతమైపోయినదని అర్థము. సంతకము అంటే జ్ఞానములేనిదని అర్థము. 536. 'దస్‌' అంటే పది అనీ, 'కత్‌' అంటే విషయములతో కుడుకొన్న జాబులని అర్థము. 'దస్‌ కత్‌' అంటే పది విషయములతో కూడుకొన్నదని (దశేంద్రియముల సమాచారముతో కూడుకొన్నదని) అర్థము.

537. 'సిగ్‌' అనగ గుర్తు అని, 'నేచర్‌' అనగ ప్రకృతి అని అర్థము. 'సిగ్‌నేచర్‌' అనగ ప్రకృతికి గుర్తు అని అర్థము.

538. ఆత్మను గురించి చెప్పుకొంటే ఆధ్యాత్మికము అవుతుంది. జీవాత్మను గురించిగానీ, పరమాత్మను గురించి చెప్పుకొంటే ఆధ్యాత్మికము గాదు.

539. ఒకే పరమాత్మను గురించి చెప్పు అద్వైతులుగానీ, విశిష్టాద్వైతులు గానీ, జీవాత్మ పరమాత్మలను ఇద్దరిని గురించి చెప్పు ద్వైతులుగానీ, ఆత్మను గురించి చెప్పనిదే ఆధ్యాత్మికులు కాలేరు.

540. ఆత్మను గురించి సవివరముగ చెప్పుచున్న త్రైతులు మాత్రమే నిజమైన ఆధ్యాత్మికులు.

541. తెలియని దానిని తెలుపునది ఆత్మ మాత్రమే. అందువలన పరిశోధన ఆత్మదే! సిద్ధాంతమూ ఆత్మదే!!

542. ఈశ్వరుడు అనగా అధిపతి అని అర్థము. జీవేశ్వరుడు అనగా ఆత్మ, పరమేశ్వరుడు అనగా పరమాత్మ, ఏ ఈశ్వరుడుకాని వాడు జీవాత్మ.

543. అయమాత్మ బ్రహ్మ అనుమాట పూర్తి తప్పుు. నీ ఆత్మ ఆత్మేకానీ బ్రహ్మకాదు. 544. అయమాత్మ బ్రహ్మ అంటే ఆత్మకంటే వేరుగనున్నానను పరమాత్మ మాటయొక్క అర్థమే తప్పగును.

545. నీ ప్రక్కనున్నవాడు ఆత్మ, నీ చుట్టూ ఉన్నవాడు పరమాత్మ, ఒక్కచోటున్న నీవు జీవాత్మవు.

546. నఖలు, శిఖలు రెండు ఆత్మకు చిహ్నములు, ముఖము ఒక జీవాత్మకు గుర్తు.

547. భయమూ ధైర్యమూ రెండూ శరీరములోనే ఉన్నాయి. రెండూ గుణములలాంటివే.

548. భయమును శరీరములోపల నీవే లేకుండ చేసుకోవలెను. అంతేకానీ బయటి దేవతలు నీ భయమును లేకుండ చేయలేరు.

549. గుడిలో దేవతలు హస్తమును చూపునది నీ హస్తమును నీవు చూచుకొమ్మని. కానీ అది అభయహస్తము కాదు.

550. వాయువుతో కూడుకొన్నది ఆయువు. అందువలన వాయువైన శ్వాస ఉన్న కాలమునే ఆయువు అంటున్నాము.

551. నీ తల్లి ప్రకృతి, నీ తండ్రి పరమాత్మ నీతోపాటు పుట్టినవారందరు జీవుళ్ళు. అందువలన అందరు నీకు సోదరులు సోదరీలుగా ఉన్నారు. ఈ విషయమునే అందరికి తెలియునట్లు పెళ్లి దినము నిన్ను పెళ్లికొడుకు అట్లే నీ భార్యను పెళ్లి కూతురు అంటున్నారు.

552. పుస్తకము, మస్తకము (తల) రెండు సమాచార నిలయములే.

553. పుస్తకములో ఏ సమాచారమైన ఉండవచ్చును. అట్లే మస్తకములో ఏ సమాచారమైన ఉండవచ్చును. 554. పుస్తకములోని సమాచారమును బట్టి ప్రకృతికి సంబంధించినదిగ, పరమాత్మకు సంబంధించినదిగ విభజించవచ్చును.

555. పుస్తకములోని సమాచారము కావ్యములుగ, పురాణములుగ, చరిత్రలుగ, శాస్త్రములుగ వ్రాయబడి ఉన్నది.

556. మస్తకములోని విషయములు కూడ తామసముగ, రాజసముగ, సాత్త్వికముగ, యోగముగ పేర్చబడియున్నవి.

557. నోటి నుండి వచ్చుమాట నీతితో(న్యాయముతో) కూడుకొని ఉండాలని, అట్లుకాకపోతే జ్యోతితో(జ్ఞానముతో) కూడుకొనియైన ఉండాలన్నారు. జీవితములో అటు ప్రపంచ న్యాయములోకానీ, ఇటు దైవజ్ఞానములోగానీ ఖ్యాతి గడించాలని అందరికి జ్ఞప్తియుండులాగ మూతి, నీతి, జ్యోతి, ఖ్యాతి అన్నారు.

558. చావులో 24 భాగములతో కూడుకొన్న శరీరము నిన్ను వదలి పోవుచున్నది. అదియే వర్ధంతి.

559. పుట్టుకలో 24 భాగములతో కూడుకొన్న శరీరము నీకు తగులుకొనుచున్నది. అదియే జయంతి.

560. చావుతర్వాత, పుట్టుక ముందు నీకు శరీరములేదు. కానీ అపుడు నీవు, నీ ఆత్మ, నీ కర్మ, నీ గుణములు నాల్గుచక్రముల చట్రములో ఇమిడియున్నాయి.

561. ఆ చక్రముల చట్రము బ్రతికిన శరీరములో నుదిటి భాగములో ప్రతిష్ఠింపబడి ఉన్నది.