ప్రబోధ తరంగాలు/481-517

వికీసోర్స్ నుండి

481. భూమి మీద మనుషులు గ్రహములుగ (దయ్యములుగ) గుడిలోని దేవతలు విగ్రహములుగ ఉన్నారు.

482. దేవాలయముల ప్రతిమలలో దేవతలను జీవుళ్ళుండగ మనుష శరీరములలో సాధారణ జీవుళ్ళు గలరు.

483. దేవాలయములో స్థూలముగనున్న ప్రతిమలుపు పరమాత్మను తెలుపు చిహ్నములని తెలియక అక్కడున్న దేవుళ్ళను ప్రజలు ఆరాధిస్తు దేవదేవుడైన పరమాత్మను గుర్తించలేక పోవుచున్నారు.

484. దేవాలయములు భావ సహితమైన కట్టడములుగ, పరమాత్మ జ్ఞానమును బహిర్గతము చేయునవిగ, గురుబోధనకు సమానమైనవిగ ఉండవలెను.

485. పూర్వము పెద్దలచే నిర్మింపబడిన దేవాలయములు రెండే. అవి ఒకటి నిరాకార ప్రతిమయైన లింగము గల గుడి. రెండవది ఆకారముతో కూడుకొన్న రంగని గుడి.

486. లింగము మీద మూడు ఆత్మలను సూచించు మూడు విభూతి రేఖలను, రంగని ప్రతిమ మీద శరీరములో బ్రహ్మనాడియందే దేవుడున్నాడని సూచించు మూడునాడుల గుర్తయిన నామమును తీర్చిదిద్దారు.

487. కాలక్రమమున లింగము శైవుల దేవుడని, రంగడు వైష్ణవుల దేవుడని భావించబడి నేటికి శైవుల ఆధీనములో లింగము వైష్ణవుల ఆధీనములో రంగడు గలడు.

488. రూపము లేని దేవుడు, రూపముగల భగవంతునిగ వచ్చునని తెలుపుటకు రూపములేని గుండును లింగముగ, రూపమున్న రంగని ప్రతిమగ పూర్వము చూపించారు.

489. దేవునికి అందరు సంతానమేనని తెలియునట్లు, వైవాహిక జీవితము యొక్క అర్థము మొదటిలోనే తెలియునట్లు, పెళ్లి కూతురు పెళ్లికొడుకు అని ఆ కొద్దిసేపు అంటున్నాము.

490. పెళ్లి జీవితములో ఒక పెద్ద జ్ఞానసందేశమైన కార్యము. పెళ్లిలో చేయబడు ప్రతి కార్యమునందు విశేషమైన జ్ఞాన అర్థము ఇమిడి ఉండును.

491. పెళ్లి జరిగిన తర్వాత పెళ్లిలో చేసిన కార్యములకు అర్థము తెలియక, వారి జీవితములో జ్ఞానము తెలియక ప్రవర్తించితే, వారు భార్యాభర్తలు కారు. అది స్త్రీపురుషుల అక్రమ సంబంధ మగును. పెళ్లి కార్యముల అర్థములకు అనుగుణముగ నడుచుకొనువారే నిజమైన భార్యాభర్తలు.

492. పెళ్లిలో తాళికట్టక ముందు పెళ్లికి కొడుకు కూతురై, సోదరి సోదరులైన స్త్రీపురుషులు పెళ్లి తర్వాత వారి జ్ఞాన ఆచరణతో భార్య (భరించబడునది) భర్త (భరించువాడు) సమానమైన బాధ్యతలు కలిగి ఆలుమగలు కావలెను.

493. యమలోకము స్వర్గలోకము రెండు మానవుని జీవితములో మిళితమై ఉన్నవి. యమ స్వర్గలోకములు పైనో క్రిందో లేవు. రెండు భూమిమీదనే గలవు.

494. సుఖముల రూపముతో స్వర్గలోకము, దుఃఖముల రూపముతో యమలోకము ఇక్కడే గలవు. 495. శరీరములోపల వచ్చు రోగము, మనోరోగము స్వయముగ యముడు (ఆత్మ) విధించు బాధలని, శరీరము బయటినుండి వచ్చు బాధలు యమకింకర్లు (బంధువులు, శత్రువులు) విధించు బాధలని తెలియవలెను.

496. జీవితములో జరుగు బాధలుగాని, సుఖములుగాని అన్నిటికి మూలకారణము శరీరములోనున్న కర్మయే కారణమని తెలియాలి.

497. సుఖ దుఃఖములు అనుభవించుటకు కారణమైన కర్మ నీతలలోని కర్మచక్రము నుండి ప్రారబ్దరూపముగ వచ్చుచున్నది. అలాగే చేయుచున్న పనులలో సంభవించెడి క్రొత్త కర్మయిన ఆగామికర్మ కర్మచక్రములోనే చేరుచున్నది.

498. జీవితమునకే కారణమయినది మరియు మరణములో శరీరము నుండి సూక్ష్మముగ పోవుచు జననములో ఎవరికి కనపడకుండానే శరీరములోనికి వచ్చుచున్నది ఒక ఆకారము గలదు. అదియే బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రముల చట్రము. ఈ నాల్గుచక్రములలోనే ఆత్మ, జీవాత్మ, ప్రారబ్ధ సంచిత కర్మలు, కర్మలు అనుభవించు కాలము, ఆ కాలములో చరించు నవగ్రహములు గలవు. ఈ నాల్గు చక్రములను తెలుసుకొని వాటి స్థానమైన నుదుటి భాగములో ధరించడము గొప్ప జ్ఞానమగును.

499. సాధారణ స్థితిలో ఉన్నవాడు త్రైతములో గలడు
జ్ఞానయోగములో ఉన్నవాడు ద్వైతములో గలడు.
మోక్షము పొందినవాడు అద్వైతములో గలడు. 500. అన్నదానము ఆత్మకు, జ్ఞానదానము జీవాత్మకు చెందుతుంది.

501. అన్నదానము కర్మను బట్టి ఉండును. జ్ఞానదానము శ్రద్ధను బట్టి ఉండును.

502. ఆకలి బాధకు అన్నము అవసరమైనట్లు, విషయబాధకు జ్ఞానము అవసరము.

503. కడుపులో ఆకలిబాధ ప్రతి మనిషికి ఉన్నట్లే, తలలో విషయబాధ ప్రతి మనిషికి ఉండును.

504. కడుపులేని జీవరాసిలేనట్లు, తలలేని జీవరాసి కూడ లేదు.

505. కడుపు తల ఉన్నవారికందరికి ఆహారమును జ్ఞానమును దేవుడు తయారు చేసి ఉంచాడు.

506. మనిషి కడుపుకొరకు అన్నమునే వెదుకుకొనుచున్నాడు. కాని తలకొరకు జ్ఞానమును వెదుకుకోవడము లేదు.

507. రోమములు, ఈకలున్న మనుషులు, పక్షులు ఆత్మకు గుర్తుగ రోమములు, ఈకలులేని పాములు చేపలు మాయకు గుర్తుగ ఉన్నవి.

508. పెళ్లి అనగా దైవము అని అర్థము కాగా, వివాహము అనగా ఇద్దరికి వర్తించునదని అర్థము. ఈ అర్థములు ప్రపంచక నిఘంటులో ఉండవు. కేవలము పరమాత్మిక ఘంటులో ఉండును.

509. ఘంటు అనగ మూట, నిఘంటు అనగా ఉత్త మూట అని తెలుసుకో! 510. ఒక మనిషిని దేవుడంటుంటారు కాని మనిషిలో దేవుడున్నాడని, దేవునిలో మనిషున్నాడని చాలామందికి తెలియదు.

511. అంతులేని ప్రకృతి పరమాత్మ హద్దులో ఉన్నది. అలాగే ప్రకృతి స్వరూపమైన స్త్రీ, పరమాత్మ స్వరూపమైన పురుషుని హద్దులో ఉండడము ధర్మము.

512. ఏ సిద్ధాంతమైన మనిషిలోపల ఊహకందినదే, మనిషిలోపల ఊహకందించినవాడే సిద్ధాంతకర్త. అటువంటపుడు సిద్ధాంతకర్తగ లోపలి వానిని చెప్పకుండ బయట మనిషి పేరు చెప్పుకోవడము అధర్మము కాదా!

513. పెళ్లంటే నూరేళ్ళపంట అంటారు. జీవితమంటే మూన్నాళ్ళ ముచ్చట అంటారు. దీనినిబట్టి జీవితముకంటే పెళ్ళే పెద్దదని తెలియుచున్నది.

514. నాలుక అంటే భయములేనిదని అర్థము. అలాగే నీవు కూడ తలలోని నాలుకవలె ఉండవలెను.

515. ధనమున్నవాడు తనవద్ద ధనము లేదని చెప్పడము, జ్ఞానము తెలియనివాడు తనకు జ్ఞానము తెలుసునని చెప్పుకోవడము సహజము.

516. ఊహ ఒక్కమారు మాత్రము వస్తుంది. ఆలోచన అనేకమార్లు వస్తుంది.

517. ఊహ ఆత్మది, ఆలోచన మనస్సుది. మనస్సు ఊహించిందని, ఆత్మ ఆలోచించిందని అనకూడదు.