ప్రబోధ తరంగాలు/442-480

వికీసోర్స్ నుండి

442. కనీసము ప్రపంచ జ్ఞానము కూడ లేకుండ బుద్ధిచెడి త్కిపట్టి మురికిలో తిరుగు వారిని చూచి ప్రజలు వారిని గొప్ప మహాత్ములుగ భావించుచుందురు. అట్టివారిని బుద్ధి ఉన్న తిక్కవారిగ లెక్కించవచ్చును.

443. అవధులులేని పరమాత్మ సమాచారమును తెలుపుటకు వచ్చిన దూతలాంటి వాడే నిజమైన అవధూత.

444. ఒక విషయమును మోసుకొచ్చిన వానిని దూత అందుము. ఎల్లలులేని పరమాత్మ విషయమును మోసుకొచ్చినవాడు నిజమైన గురువు. అటువంటి వానినే అవధూత అనవచ్చును.

445. సంపూర్ణ పరమాత్మ జ్ఞానము తెలిసినవాడు గురువు లేక అవధూత. కాని ఏజ్ఞానము లేని పిచ్చివాడు అవధూత కాలేడు.

446. దేవుడు మనుషులను తయారు చేశాడు, కానీ కులములను తయారుచేయలేదు.

447. చాతుర్వర్ణ మయా సృష్టమ్‌ అని గీతలో దేవుడు చెప్పితే నాలుగు వర్ణములను నాలుగు కులముగ ఎందుకనుకోవాలి?

448. ఇతర దేశములో లేని కులములు ఈ దేశములోనే ఎందుకున్నాయంటే జవాబులేదు.

449. గుణములున్నవి మూడు, గుణములు లేనిది ఒకటిని కలిపి నాలుగువర్ణములని దేవుడు అంటే గుణములతో సంబంధములేని కులములను మానవుడు పెట్టుకొన్నాడు.

450. పుట్టుకలో కులము లేదు, చావులో కులము లేదు. కానీ పుట్టుకలో గుణమున్నది, చావులో కూడ గుణమున్నది. 451. ఏ గుణములో మరణిస్తే అదే గుణములో పుట్టుచున్నావని గీతలో దేవుడు చెప్పాడు. కాని ఏ కులములో చస్తే ఆ కులములో పుట్టుదువని చెప్పలేదు.

452. పుట్టిన తర్వాత కొంతకాలమునకు తెలియునట్టి కులము, మతము మనుషులు కల్పించుకొన్నవే కాని జన్మతః వచ్చినవి కావు.

453. కులాలు కుచ్చితముతో, మతాలు స్వార్థముతో కూడుకొన్నవి. కులాలకు మతాలకు దేవుడు అతీతముగ ఉన్నాడని తెలిసి నీవు ఆ విధముగ మారినపుడే దేవుడు తెలియును.

454. ఉపనిషత్తులను దేవుడు చెప్పలేదు. మనుషులు వ్రాసుకొన్నవే ఉపనిషత్తులు. అందులో కూడ కొన్ని లోపములు గలవు.

455. ఉపనిషత్తులలో కూడ లేని విషయములను (ధర్మములను) దేవుడు తెలిపి తనదే గొప్ప జ్ఞానమనిపించుకొన్నాడు.

456. మొత్తము ఉపనిషత్తులు 1108 కాగ అందులో ముఖ్యమైనవి 108 మాత్రమేనని కొందరనుచున్నారు. ముఖ్యమైన ఆ 108 ఉపనిషత్తులలో కూడ భగవంతుడు చెప్పిన భగవద్గీత లేదు.

457. దేవుడు చెప్పిన జ్ఞానమును వదలి మనుషులు చెప్పిన ఉపనిషత్తుల మీద భ్రమపెంచుకోవడము చూస్తే దైవజ్ఞానము మీద నమ్మకము లేనట్లే!

458. బాహ్యములో ఇతరులతో సంబంధము లేకుండ అనుభవించ వలసిన కర్మలను స్వప్నములో అనుభవింతురు. 459. బాహ్యములో విచిత్రమైనవి, జరుగుటకు వీలులేనివి జరుగు అవస్థయే స్వప్నావస్థ.

460. మనిషి జీవితములో కాలగమనము ఎక్కువ మూడవస్థలుగ జరుగుచున్నది. అవియే ఒకటి జాగ్రత్తావస్థ, రెండు స్వప్నావస్థ, మూడు నిద్రావస్థ.

461. జీవితములో సాధారణముగ జరుగునవి మూడవస్థలే. అయినప్పటికి కొన్ని లక్షలమందిలో ప్రయత్నించు వారికి మాత్రము జరుగు మరియొక అవస్థ గలదు. అదియే యోగావస్థ.

462. మన ఇష్టము ప్రయత్నము లేకున్నా జరుగు అవస్థలు నిద్ర, మెలుకువ, స్వప్నములు. నీ ఇష్టముంటే, నీ ప్రయత్నముంటే బహు అరుదుగా జరుగునది యోగావస్థ.

463. మనిషి ప్రారబ్ధకర్మము వలన నీ ఇష్టము లేకున్నా జరుగు అవస్థలు నిద్ర, మెలుకువ, స్వప్నములు. ప్రారబ్ధకర్మకు సంబంధములేనిది నీ ఇష్టము మీద ఆధారపడినది ఒకే ఒక అవస్థగలదు. అదియే యోగము.

464. దేవుడు తనను తెలుసుకొనుటకు మనుషులకు మూడు యోగములను తెలియజేశాడు.

465. మూడు యోగములలో రెండు ధర్మయుక్తమైనవి గలవు. ఒకటి ధర్మములకు అతీతమైనది.

466. ఒకటి బ్రహ్మయోగము (జ్ఞానయోగము), రెండవది కర్మయోగము (రాజయోగము) అనునవి ధర్మయుక్తమైనది. భక్తియోగము మాత్రము ధర్మములకు కూడ అతీతమైనది. 467. ఓంకార శబ్దము నోటితో పలికితే వస్తుంది. అదే శబ్దము నోటితో పలుకకుండానే సూక్ష్మముగ శరీరములోపల మ్రోగుచున్నది.

468. ఏ మతమునకు చెందిన మనిషిలోనైన ముక్కురంధ్రములలో కదలే శ్వాసలో "ఓమ్‌" శబ్దము ఇమిడి ఉన్నది.

469. "ఓమ్‌" ఒక మతమునకు సంబంధించినది కాదు. మనుషులందరికి, జీవరాసులందరికి సంబంధించినది.

470. ఓమ్‌ శబ్దమునకు శ్వాస కారణము, శ్వాసకు కారణము ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచములు కారణము, ఊపిరితిత్తుల కదలికకు శరీరమధ్యలోనున్న బ్రహ్మనాడిలో గల స్పందన కారణము. బ్రహ్మనాడిలోని స్పందనకు అక్కడున్న ఆత్మ కారణమై ఉన్నది.

471. ఇంద్రియార్థమైన శబ్దముతో కూడి మంత్రమైన "ఓం నమః శివాయ" అను మంత్రమును పంచాక్షరి అంటున్నారు.

472. పంచాక్షరిలో ఐదు అక్షరములు గలవని గుర్తించాలి. "ఓం" ను అక్షరముగ గుర్తించుకోకూడదు, ఓంను మినహా ఉన్నది ఐదక్షరములే కదా అని సమర్థించుకొన్నట్లయితే "ఓం నమోనారాయణాయ" అను మంత్రమును అష్టాక్షరి మంత్రము అనకూడదు. ఎందుకనగా ఓంను తీసివేసి చూస్తే ఏడు అక్షరముల మంత్రమే అగును. 473. అద్వైతుల పంచాక్షరియందో, విశిష్టాద్వైతుల అష్టాక్షరియందో ఏదో ఒక దానియందు తప్పుండునట్లు తెలియుచున్నది.

474. అద్వైతమునకు, విశిష్టాద్వైతమునకు, ద్వైతమునకుమించినది, శాస్త్రబద్దమైనది త్రైతసిద్ధాంతము.

475. విష్ణు, ఈశ్వర, బ్రహ్మలైన త్రిమూర్తులకు కూడ ఆకారములు పేర్లు గలవు. ఆకారముగాని, పేరుగాని లేనివాడే దేవుడు.

476. రూపనామ క్రియలులేని దేవుడు రూపనామక్రియలున్న త్రిమూర్తులను కూడ సృష్ఠించాడు. కావున మనకు దేవతలకు తండ్రి ఒక్క దేవుడే.

477. దేవుని దృష్ఠిలో దేవతలు, మానవులు అందరు సమానమే. దైవజ్ఞానము లేక పోతే దేవతలు కూడ దేవునికి దూరము కాగలరు.

478. దేవతలు గానీ, మనుషులు గానీ మహర్షి పదవినుండి బ్రహ్మర్షి హోదావరకు పోతేనే చివరకు దేవుడు తెలియును.

479. జ్ఞానమును బట్టి మానవునికి దైవమార్గములో గల హోదాలు మహర్షి, రాజర్షి, దేవర్షి, బ్రహ్మర్షి కాగ అజ్ఞానమును బట్టి ఒకే ఒక హోదాగలదు. అదియే బేవర్షి అనుపేరు.

480. మరణములు రెండు విధములు ఒకటి అకాలమరణము, రెండు కాలమరణము. అకాలమరణము పొందితే అదే జన్మమందు సూక్ష్మశరీరముతో జీవుడుండును. కాలమరణము పొందితే క్రొత్త శరీరమును మరుజన్మయందు పొందును.