ప్రబోధ తరంగాలు/562-604

వికీసోర్స్ నుండి

562. నీవు, నీ ఆత్మ, నీ కర్మ, నీ గుణములు రహస్య ప్రదేశములో రహస్యముగ ఉన్నవి. ఎవరికి తెలియవు.

563. నీలోని నీరహస్యమును తెలుపు నిమిత్తము త్రైతులు బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములనబడు నాలుగుచక్రముల గుర్తును నుదిటి విూదనే ధరిస్తున్నారు.

564. బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రముల వివరమును తెలిసిననాడు తన యొక్క రహస్యమును తెలిసినట్లగును.

565. బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రముల వివరము తెలియనివాడు ఎవడైన అటు ఆత్మజ్ఞానముకానీ, ఇటు జీవాత్మ జ్ఞానముకాని తెలియనివాడే.

566. తనలోని నాల్గుచక్రములను తెలియనివారు అద్వైతులుకానీ, విశిష్టాద్వైతులు కానీ, ద్వైతులుకానీ ఆత్మజ్ఞానులు కాలేరు.

567. మనో యోచనలు అందరికి తెలుస్తున్నవి. కాని అహంకారము ఎవరికి తెలియకుండ పని చేయుచున్నది.

568. తెలియకుండ పనిచేయు అహమును నల్లని కాకిగ, తెలిసేటట్లు పనిచేయు మనస్సును తెల్లని గుఱ్ఱముగ పోల్చి చెప్పవచ్చును.

569. కాకిని (అహమును) వశము చేసుకోవడమును కర్మయోగముగ గుఱ్ఱమును (మనస్సును) అదుపు చేయడమును బ్రహ్మయోగముగ వర్ణించవచ్చును.

570. శరీరములోపలి జ్ఞానము తెలియనివాడు ఎప్పటికి దైవజ్ఞానమును తెలియలేడు. మోక్షమును పొందలేడు. 571. లోపలి జ్ఞానము తెలియకనే, బుద్ధుడు బయటి భార్యా పిల్లలను వదలి పెట్టి పోయాడు.

572. నీ అన్న ఆత్మ, నీ తండ్రి పరమాత్మ ఉన్నది నీశరీరములోనే అని మరువద్దు.

573. భౌతిక శాస్త్రమును తెలిసినవారికి శరీరములోని ఎముకలు, కండలు, మెదడు, రక్తము మాత్రమే కనిపించును. కానీ మనస్సు, బుద్ధి, చిత్తము, అహములు ఏమాత్రము కనిపించవు.

574. శరీరములో భాగములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహము అనునవే ఎవరికి కనిపించనపుడు, శరీర భాగములుకానటువంటి జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ఎలా కనిపించును?

575. వ్యాసుడు 18 పురాణములను, 6 శాస్త్రములను వ్రాశాడు. కాని వాటిలో కొన్నిటిని చెప్పి వ్రాయించినవాడు వ్యాసుని శరీరములోని ఆత్మని తెలియవలెను.

576. వ్యాసుని శరీరము నుండి ఆత్మ 18 పురాణములను, 5 శాస్త్రములను మాత్రమే వ్రాయించినది. ఆరవ శాస్త్రమును ఆత్మ స్వయముగ వ్రాయలేదు.

577. పరమాత్మ తెలుపగ ఆత్మగ్రహించి శరీరముతో దానినే వ్రాయించినది. అదియే ఆరవ శాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రము.

578. ఆత్మకు కూడ తెలియని ఆరవ శాస్త్రమును మనిషి నాకు తెలుసుననుకోవడము అజ్ఞానము కాదా?

579. ఆత్మ నుండి తెలిసిన సిద్ధాంతమును నేను కనిపెట్టానని చెప్పుకోవడము అహము కాదా? 580. ఏ సిద్ధాంతమైన మనిషిది కాదు, వానిలోని ఆత్మది. న్యూటన్‌ సిద్ధాంతమును న్యూటన్‌ కనిపెట్టలేదు. అతని ఆత్మ చెప్పినది.

581. ఊరు అనగ ఊరునదని, లేక ఊట కల్గినదని అర్థము. నీ ఊరు ఏదో తెలుసునా?

582. ఏడు ఊటలు కల్గినది నీ ఊరు. ఏడు ఊటలున్న ఊరు నీ శరీరమేనని తెలుసుకో.

583. శరీరమనే ఊరులో 24 మంది సహచరులతో నీవు నివసిస్తున్నావని మరువద్దు!

584. ఊరులో నీవున్నా ఊరంతా నీవులేవు. ఊరులోపల ఒక ఇంటిలో మాత్రము నీవున్నావు. ఆ ఇల్లు ఒక్కటే నీది.

585. నీవున్న శరీరమంతా నీది కాదు. శరీరములోపల ఒకచోట మాత్రము నీవున్నావు. ఆ చోటు మాత్రమే నీది.

586. ఊరికి ఒక పెద్ద ఉంటాడు అతనిని ఇపుడు సర్పంచ్‌ అని, పూర్వము పాలెగాడు అని అనెడివారు. అలాగే శరీరమునకు ఒక పెద్ద ఉన్నాడు. అతనే ఆత్మ. ఊరును పూర్వము పాలెము అని దాని పెద్దను పాలెగాడు అని అనెడివారు.

587. నేరస్థుడు తన పని ఫలితమైన పాపమును పొందినవాడు. రోగస్థుడు తన పాపఫలితమైన శిక్షను పొందినవాడు.

588. తప్పు ఏదైన నేరము అవుతుంది. ప్రపంచములో అన్యాయముగ ప్రవర్తించినవాడు ఎవడైన నేరస్థుడే అవుతాడు. 589. నేరము ఏదైన దానిఫలితము పాపమే అవుతుంది. పాపము ఏదైన దాని ఫలితముగ జీవునకు బాధ కలుగుచునే ఉండును.

590. జరిగిపోయిన కాలములోని నేరస్థుడు, జరుగుచున్న కాలములో రోగస్థుడు. జరుగుచున్న కాలములోని నేరస్థుడు, జరుగబోవు కాలములో రోగస్థుడు అవుతాడు.

591. చేయుచున్న నేరము ముందే ప్రకృతిచే నిర్ణయమైన పతకము లోనిదే. ఎవడు స్వయముగ చేయలేదు. కానీ తానే చేశానని అనుకోవడము వలనే రోగమును పొందవలసివచ్చినది.

592."జాగ్‌" అనగ మేలుకోవడము లేక మెలుకువ కల్గియుండడము, "గత్‌" అనగ గడచిపోయినదని అర్థము. జాగ్‌+గత్‌=జాగ్గత్‌ అయినది. కాలక్రమమున రూపాంతరము చెంది జాగ్రత్‌ అయినది. దానినే జాగ్రత్త అనికూడ ఉచ్ఛరించుచున్నాము.

593. గడచిపోయిన పుట్టుకను గురించి తలచుకొని, రాబోవు చావును గురించి మెలుకువ కల్గియుండవలెను.

594. తన చావును తాను జ్ఞప్తి చేసుకొనువాడు జాగ్రత్త కల్గినవాడు. తన చావును మరచినవాడు అజాగ్రత్తపరుడు.

595. నాకు ఎన్నో పుట్టుకలు, ఎన్నో మరణములు గడచిపోయాయి. అవన్ని నాకు తెలియవు. నాకు తెలిసినది, ప్రస్తుతము నేను జన్మించియున్నాను. ఇక వచ్చేది మరణమే. దానిని గురించి నేను మెలుకువగానే ఉన్నానని జ్ఞాని అనుకొనుచుండును.

596. స్త్రీ అవివాహితగా ఉన్నపుడు ఇద్దరు భర్తలు కల్గియుంటుంది. వివాహమైన తర్వాత ముగ్గురు భర్తలు కల్గియుంటుంది. అందువలన స్త్రీకి కనిపించే భర్త ఒకడు, కనిపించని భర్తలు ఇద్దరు కలరని చెప్పవచ్చును.

597. శరీరములో గుణములు వేరు, ఆత్మవేరుగ ఉన్నాయి. జీవుడు గుణములను వదలినపుడే ఆత్మ తెలియును.

598. ఏ గుణముచేత ఆత్మను తెలియలేము. అందువలన ఆత్మ జ్ఞానమునకు ప్రేమ అను గుణము, దయ అను గుణము, దానము అను గుణము పనికిరావు.

599. చాలామంది అహమును ఒక గుణము అనుకొనుచున్నారు. కానీ అహము గుణముకాదు. శరీరములోని ఒక భాగమే అహము.

600. గుణములు శరీరములోని భాగములుకావు. శరీరములోనే శరీరమునకు అతీతముగ ఉండి, శరీరముకానటువంటి బ్రహ్మ కాల, కర్మ, గుణచక్రములను నాల్గుచక్రముల సముదాయములో క్రిందగల గుణచక్రములో గుణములు కలవు.

601. శరీరముకాని గుణములు మొత్తము 36, శరీరములోన అంతఃకరణములు నాలుగు, వాటిలో అహము ఒకటి.

602. శరీర అంతర్భాగములైన అహము వలన కర్మయోగము, మనస్సు వలన బ్రహ్మయోగము, బుద్ధి వలన భక్తియోగము కల్గుచున్నవి.

603. దేవునికి దయలేదు. దయయేకాదు మరి ఏ గుణములేదు.

604. దేవునికి ప్రేమ లేదు. అసూయలేదు. కానీ ఇష్టము అయిష్టము గలవు.