ప్రబోధానందం నాటికలు/నాయనగంటు - అమ్మగంటు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నాయనగంటు - అమ్మగంటు

అది భూలోకములోనే యమధర్మరాజు కొలువు తీరిన సభ, మధ్యలో యమధర్మరాజు యొక్క సింహాసనముండగా ప్రక్కనే చిత్రగుప్తుని ఆసనము ఉంటుంది. అక్కడ మొదట ఇద్దరు యమకింకరులు, ఒక పోలీస్‌ అధికారిని, ఒక రాజకీయనాయకుణ్ణి, ఒక వడ్డీవ్యాపారస్తుణ్ణి, ఒక ఉద్యోగస్థుణ్ణి తీసుకు వచ్చి ఒక్క ప్రక్క నిలబెడుతారు. వేరొక ప్రక్కన ఆధ్యాత్మికవేత్తను, ఒక శైవుడిని, ఒక వైష్ణవుడిని కూర్చోబెడతారు. అంతలో ముందుగా చిత్రగుప్తుడు ప్రవేశించి యమకింకరులను చూచి...

చిత్రగుప్తుడు :- కింకరులారా ఈ దినము, ఈ గంటలో, ఈ జిల్లాలో ఆయుస్సు తీరిన వారు కేవలము ఏడుగురేనా?

కింకరులు :- అవును చిత్రగుప్తా! ఈ ఏడుమంది మాత్రమే కలరు.

చిత్రగుప్తుడు :- ఈ నలుగురిని ఒక ప్రక్క నిలబెట్టి మిగత ముగ్గురిని మరొక ప్రక్క ప్రత్యేకముగా కూర్చోబెట్టారు దేనికి?

కింకరులు :- ఈ నలుగురు వేరువేరు పనులు చేయుచున్ననూ సర్వ సాధారణ మనుషులే. ప్రక్కనున్న ఈ ముగ్గురు జ్ఞానమును తెలిసిన గొప్పవారు, అందువలన ప్రక్కన కూర్చోబెట్టాము.

చిత్రగుప్తుడు :- వీరు ఎవరైనదీ, వీరు చేసిన పాపములు, పుణ్యములు ఎవైనవీ వీరి చిట్టా అంతా వ్రాసుకొన్న మనకు తెలుసు, కానీ వీరికి, వీరు చేసుకొన్నవి ఏమిటో తెలియాలి కదా! యమధర్మరాజు రాకముందే వీరు భూమిమీద సంపాదించుకున్నదేదో యమగుప్తుడినై నేను తెలిపెదను. అట్లే మరొక ప్రక్కనున్న ముగ్గురి జ్ఞానుల విషయమును యమధర్మరాజే తెలుపును. ఎవరిది వారికి తెలియాలి కదా! చివరగా వీరు చేసిన తప్పులను చెప్ప వలసినది గుప్తుడనైన నేనూ, శిక్ష చెప్పవలసినది సమవర్తి అయిన యమధర్మరాజు. ఇక మొదటిగా ఉద్యోగస్థుడైన రామావతార్‌ను ముందు హాజరు పెట్టండి. (యమకింకరులు ఒక ప్రక్కనున్న నలుగురిలో రామావతార్‌ను తీసుకువచ్చి చిత్రగుప్తుని ముందుంచారు.)

చిత్రగుప్తుడు :- ఏమయ్యా! రామవతార్‌! నీపేరు చాలా బాగుంది. కానీ నీ జీవితమంతా లంచావతార్‌గా బ్రతికావుకదయ్యా! ఎంతోమందిని పీడించి వారివద్ద తీసుకొన్నది, డబ్బురూపములోని పాపమని ఇప్పటికైనా తెలుసుకో. నీ బిడ్డకు ఇచ్చిన కట్నము, నీ ముగ్గురు కొడుకులకు పంచి ఇచ్చిన ఆస్తులు అన్నీ నీవు ఉద్యోగము చేస్తూ లంచముగా తీసుకొన్నవే. లంచము తీసుకొని కొందరిని బాధపెట్టిన పాపము, లంచమివ్వడానికి తమవద్ద డబ్బులు లేవని చెప్పుకొన్న ఆడవారిని బలవంతముగా లంచము బదులు శీలము దోచుకొన్న పాపము పెద్దవికాగ, మరెన్నో పాపములు గలవు. నీవు చేసిన పనులు పాపములై నీవెంటనే ఉన్నవి. వాటిని అనుభవించుటకు శిక్షను యమధర్మ రాజు నిర్ణయించగలడు. కింకరులారా! మరొకనిని ప్రవేశపెట్టుము. (కింకరులు వడ్డీవ్యాపారుణ్ణి ముందుకు తెచ్చారు.)

చిత్రగుప్తుడు :- ఓహో ఇతను వడ్డీవ్యాపారి సుబ్బానాయుడు గారా! నీవు చేసిన మోసాలు లెక్కలేనన్ని పాపాలరూపములో ఉన్నాయి. ఎదుటి మనిషి అవసరాన్ని ఆసరాగా చేసుకొని, ఫైనాన్సు వ్యాపారమని మూడురూపాయల వడ్డీనుండి ఇరవైరూపాయల వడ్డీవరకు ఇచ్చిన ఘనుడవు. ఎంతోమంది దగ్గర భూములు, ఇండ్లు వడ్డీక్రింద లాగుకొన్న మహానుభావుడవు. ప్రపంచములో డబ్బుతప్ప ఏదీ గొప్పదికాదని, ఇతరులకు కూడ నీతి చెప్పిన వానివి. డబ్బుకోసము నీ అన్నదమ్ములను కూడ మోసము చేసినవానివి. నీవే ఒక స్వామీజీని తయారుచేసి, అతని ద్వారా కొందరికి మీరు కాపురము చేసే ఇల్లు బాగాలేదని, వాస్తుదోషముందని తొందరగ అమ్మివేయమని చెప్పించి, ఆ ఇల్లును తక్కువ రేటుకు కొనడము, అలాగే భూములను కూడ అమ్మించి, వాటిని నీవే కొనడము మహాపాపములై నీనెత్తిన కూర్చొన్నవి. నీవు మరుజన్మలో ఇదే భూమిమీద ఏమి అనుభవించాలో యమధర్మరాజే నిర్ణయించగలడు. కింకరులారా! మరొకనిని ముందుకు తెమ్ము. (యమ కింకరులు పోలీస్‌ ఆఫీసర్‌ను ముందుకు తెచ్చారు.)

చిత్రగుప్తుడు :- ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు గారా! ఇపుడు నీవు పోలీస్‌ అధికారివికావు. సాధారణ మనిషివేనని గుర్తుంచుకో. ఉద్యోగము రాకముందు ఏ స్థోమతలేని నీవు, ఉద్యోగము కొరకు ఎంతోమంది దేవతలకు మ్రొక్కుకొన్నావు. ఉద్యోగమొచ్చి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ అవుతూనే, నేను పోలీస్‌ను అను గర్వమును నెత్తికెక్కించుకొన్నావు. మనుషులను హీనముగ జంతువుల క్రింద జమకట్టావు. అధికారమదముతో తప్పుచేయని మర్యాదస్తులను దూషించావు. ఆత్మజ్ఞానముగల గురువును, వారి శిష్యులను తప్పు చేయకున్ననూ అదే పనిగ దూషించి తప్పుడుకేసు బనాయించావు. నీకు ఏమాత్రము ఆత్మజ్ఞానము తెలియకుండినా, మీది జ్ఞానమేనా అని గురువునే నిందించి కొట్టేదానికి పూనుకొన్నావు. మిగతా పాపులకంటే నీ పాపమే అధికము, యమధర్మరాజు నిన్ను ఏ విధముగా శిక్షించునో! ఇప్పటికైనా నీ అధికారము, నీ హోదా కొంతకాలమేనని, నీవు సాధారణ జీవాత్మవేనని తెలుసుకో. కింకరులారా చివరిగానున్న అతనిని కూడ ప్రవేశపెట్టండి. (యమకింకరులు రాజకీయనాయకుణ్ణి ముందుకు తెచ్చారు.)

చిత్రగుప్తుడు :- మీరు రాజకీయములోని మంత్రివర్యులు అధికారమే అన్నిటి కంటే మించినదిగా తలచినారు అధికారముంటే డబ్బు దానంతటికదే వస్తుందని తలచినారు. అధికారము కొరకు ఎన్నో హత్యలు చేయించినారు. అధికారముతో ఎన్నో అక్రమాలు చేసిన తమరు, పాపమును కూడ అదే మాదిరి సంపాదించుకొన్నారు. తమరు చేసిన పాపములు ఏవీ చిన్నవిలేవు. అధికారమును కాపాడుకొనే దానికి, పోలీసులచేత చాలామందిని జైళ్ళలోనికి త్రోయించావు. కొందరిలో గ్రామకక్షలు పెంచి హత్యలు చేయించావు. కోట్ల ఆస్తులు సంపాదించావు. అయినా నీవెంట ఒక్కరూపాయి కూడ రాలేదు కదా! ఇపుడు నీవెంట కోట్లరూపాయలకు సమానమైన పాపము వచ్చినది. దానిని అనుభవించుటకు ఒక జన్మసరిపోదు. ఈ భూమిని ఎందరో రాజులు నీకంటే గొప్పగ పరిపాలించారు. ఒక్కడు కూడ పిడికెడు మట్టిని కూడ వెంట తీసుకుపోలేదు. నీ తర్వాత కూడ ఎందరో రాజకీయము లో మంత్రులుగా ఉండగలరు. వారుకూడ అంతే. ఎవరూ ఏమీ మూటగట్టుక పోరు, మూటకట్టుక పోయేది పాపము మాత్రమే. నీ పాపము మూటకు సమానమైన శిక్షను యమధర్మరాజు చెప్పగలడు. (అంతలో చిత్రగుప్తుడు మరొక ప్రక్కయున్న జ్ఞానులవైపు చూచి) మీరు జ్ఞానమార్గములో ఉన్నవారు, మీ హోదాను నేను గుర్తించలేను. మీ పాప పుణ్యములను స్వయముగా యమధర్మరాజే చెప్పగలడు. (అంతలో యమ ధర్మరాజు సభలోనికి వచ్చు సూచనగా శబ్దము వినిపిస్తుంది.) జీవాత్మలకు సమవర్తి అయిన, శరీరాంతర్గత బహిర్గత నివాసి అయిన, మాయను తిరగ వ్రాసిన యమా పేరుకల్గిన, దండనకర్తయిన కాలయముడు విచ్చేయుచున్నాడు. జాగ్రత్త! జాగ్రత్త!! జాగ్రత్త!!!
(అపుడు యముడు ఠీవిగా సభలో ప్రవేశించి సింహాసనము మీద కూర్చొనును.)

చిత్రగుప్తుడు :- సమవర్తీ! ఇటు ప్రక్కనున్న వారు అజ్ఞానమార్గములో నడిచినవారు. ఒకరు పోలీస్‌ అధికారి, ఒకరు వడ్డీవ్యాపారి, ఒకరు ఉద్యోగస్థుడు, ఒకరు రాజకీయమంత్రిగారు ఉన్నారు. వీరి పాపములను నేనే వ్రాశాను, కావున కొన్నింటిని మాత్రము వారికి గుర్తు చేశాను. అటువైపు ఉన్నవారు జ్ఞానమార్గములో నడచినవారు, వారి కర్మలను చూచువానివి నీవే కావున వారిని ప్రక్కన పెట్టాము.

యమ :- అజ్ఞానమార్గములో నడచి అమ్మగంటును సంపాదించు కొన్నవారిని ఒకప్రక్కగా, జ్ఞానమార్గములో నడచి నాన్నగంటును సంపాదించుకొన్నవారిని మరొకప్రక్కగా ఉంచడము మంచిదే. కానీ నేను చూడవలసిన ఈ ముగ్గురిలో కూడ, నాన్నగంటును సంపాదించుకొన్నవారు లేరు. అందులో ఒకరు మాత్రము నీవనుకొన్నట్లు పూర్తి జ్ఞానమార్గములో నడచినవాడున్నాడు. మిగత ఇద్దరూ ఇటు పూర్తి అమ్మగంటునుకాక, అటు పూర్తి నాన్నగంటును కాక మధ్యరకముగా ఉంటూ, అమ్మకంటే కొంత తక్కువైన చిన్నమ్మగంటును సంపాదించుకొన్నారు. మీరనుకొన్నట్లు వీరిరువురు నాన్నగంటును సంపాదించుకోలేదు, కావున వారిని జ్ఞానికి అజ్ఞానులకు మధ్యలో నిలబెట్టండి.

(యమభటులు యమధర్మరాజు చెప్పినట్లు వైష్ణవుణ్ణి, శైవుణ్ణి ఇద్దరినీ మధ్యలో నిలబెట్టారు.)

చిత్రగుప్తుడు :- యమా! ప్రకృతి సంబంధమైన (ప్రపంచసంబంధమైన) ధనమును సంపాదించిన వారు అమ్మగంటుకలవారనీ, పరమాత్మ సంబంధ జ్ఞానధనమును సంపాదించినవారు నాన్నగంటుకలవారనీ మాకు తెలియును. కానీ అటు, ఇటు కానీ పిన్నమ్మగంటును సంపాదించినవారనగా, మాకు అర్థముకాలేదు ప్రభూ! నాకే అర్థముకానిది వీరికేమి తెలియును. కావున వీరికీ నాకూ అర్థమగునట్లు, ధర్మములను తెలిసిన మీరే తెలుపమని కోరుచున్నాము.

యముడు :- చిత్రగుప్తా! అమ్మలాంటిదే అమ్మ చెల్లెలే చిన్నమ్మ. అలాగే ప్రకృతిలాంటిదే ప్రకృతి భావములున్నదే మరొక దేవతలభక్తిని చిన్న ప్రకృతి అనుకొనుము. ప్రకృతిని కోకిలగా, దేవతా ప్రకృతిని కాకిగా పోల్చి చెప్పెదము వినుము. ‘కుహూ’ అని అరిచేది నల్లనికోకిల, అలాగే ‘కావు’ అని అరిచేది నల్లనికాకి. కోకిలలాంటిది నల్లనిదే కాకి, కానీ దాని అరుపులో, దీని అరుపులో కొద్దిగ తేడా ఉంటుంది. కోకిల ‘కు’ అంటే కాకి ‘కా’ అంటుంది. ఇంకొక విషయమేమంటే, కోకిల తనగ్రుడ్లను ఎప్పుడు పొదగదు. కాకులు లేనపుడు కాకిగూటిలో కాకిపెట్టిన గ్రుడ్లమద్యలో, కోకిల తన గ్రుడ్డును పెట్టివస్తుంది. కాకి తనగ్రుడ్లతో పాటు తన గ్రుడ్డువలెనున్న కోకిల గ్రుడ్డును గుర్తించలేక దానిని కూడ పొదుగుట వలన, కోకిల పిన్నమ్మ అని కాకికి పేరువచ్చినది. అలాగే ప్రకృతి భావములు కోకిల మాదిరీ, దేవతల భావము కాకి మాదిరీయున్నది. కాకి, కోకిల రెండూ ఎలా నల్లగా ఉన్నవో అలాగే ప్రకృతి భావము, దేవతల భావము రెండు గుణములుగానున్నవి. ప్రపంచములో వచ్చినట్లే, దేవతల ముందర కూడ కోర్కె మొదలగు గుణములన్నియు చెలరేగుచున్నవి. అందువలన ఆధ్యాత్మికము అని పేరు పెట్టుకొని, ఆదికర్త అయిన దేవున్ని వదలి, కోకిల ప్రకృతిలోయుండి, కాకి దేవతలను ఆరాధించు వారిని చిన్నమ్మగంటువారని చెప్పవలసివచ్చినది. వీరు ఇద్దరు అలాంటి చిన్నమ్మగంటుగలవారే. ఆధ్మాత్మిక గురువుల మని పేరుపెట్టుకొని, ఆత్మను ఏమాత్రము ఆరాధించక, తెలుసుకోక, లోపలి ఆత్మధ్యాసను వదలి బయటి దేవతలను ఆరాధించుచున్నారు. దేవతల ఆరాధనలు ప్రకృతి జనిత కోర్కెలను కల్గించగా, ఆ కోర్కెల విధానముతోనే ఆదిలో పుట్టిన అసలైన దైవత్వములను చెడగొట్టి, దైవజ్ఞానమును శైవము, వైష్ణవము అని చీల్చివేశారు. శైవ గురువులు భూమిమీద పుట్టకముందు నుండి నేను విభూతిరేఖలు ధరించుచున్నాను కదా! వీరి లెక్కలో నేను కూడా శైవుడనా? వైష్ణవములేని రోజుల్లోనే నామమును ధరించిన వారెందరో ఉన్నారు కదా! వారు అప్పుడు వైష్ణవులా? వీరు దేవతలు, దేవతలపార్టీల మాయలోపడి, మాయకు తిరుగబడి ‘‘యమా’’ అని పేరు కల్గిన నన్ను కూడ శైవుడన్నందుకు నీలకంఠాచార్యుణ్ణి, విష్ణువును కూడ వైష్ణవుడన్నందుకు, నారాయణబట్టును భూమిమీద పుట్టించి, 90 సంవత్సరములు వృద్ధాప్య యములో అనేక కష్టములు, అనేక అనారోగ్యములతో బాధ పడునట్లునూ, యౌవనములో వైష్ణవ, శైవ తెగల తగాదాలతో పోట్లాడుచు అనేక సమస్యలతో సతమతమౌచు, దైవత్వ జ్ఞానము యొక్క గట్టు దొరకక కాలము గడుపునట్లు, వీరు సంపాదించుకొన్న చిన్నమ్మగంటును అనుభవించునట్లు శిక్ష విధించు చున్నాను.

నీలకంఠాచార్యులు :- యమధర్మరాజా! ఇది చాలా అన్యాయము. నేను నా జీవితమంతయు శంకరభక్తుడనై, వీరశైవుడనై బ్రతికాను. నేనేమి తప్పు చేయలేదు. నన్ను కైలాసానికి పంపించు, భూలోకానికి పంపవద్దు.

యముడు : -(బిగ్గరగా నవ్వుచూ!) ఓరీ మూర్ఖుడా! కైలాసము ఉన్నది భూమిమీద కాదా? యమలోకము మొదలగు నీవు అనుకొను లోకములన్నీ భూమిమీదనే ఉన్నవి. ఇకమీదట శైవము అనుమాట లేని కాలములోనున్న వారికి శైవులని పేరు కరిపించవద్దు. అలా చేయడము వలన భయంకరమైన పాపమువస్తుంది.

నారాయణబట్టు :- యమధర్మరాజా! నన్ను విష్ణుసన్నిధికి పంపించు. భూలోకమునకు వద్దు. నన్ను దయచూడు.

యమధర్మరాజు :- నీవు పరమమూర్ఖునివి, నేను సమవర్తిని. మీవలె నాకు దయాగుణముండదు. నాకు దయలేకున్ననూ, నా ధర్మము ప్రకారము నేను నిన్ను పంపునది విష్ణుసన్నిధికే. విష్ణుసన్నిధి భూలోకములోకాక ఎక్కడున్నదను కొన్నావు? నీవనుకొను అన్నీ లోకములు భూమిమీదనే ఉన్నాయి. ఇకనైనా భక్తితో రాజకీయపార్టీలాంటి వైష్ణవమును వీడి ఆత్మజ్ఞానమును తెలుసుకొనుటకు ప్రయత్నించు. (యమధర్మరాజు ఆత్మజ్ఞాని వైపు చూచి) నా ముఖాననున్న మూడు విభూతిరేఖలకు అర్థము తెలిసిన ఆత్మజ్ఞానీ! నీవు ‘‘మాయ’’ను జయించి ‘‘యమా’’ను మెప్పించావు. నీకు కర్మనునది ఏమాత్రము లేదు. కర్మయోగము వలన నీకర్మ అంతయు కాలిపోయినది. నీకు జన్మరాహిత్యము తప్ప జన్మ సాహిత్యములేదు. నీ వలన భూమిమీద జ్ఞానదీపము వెలిగినది. నీ జ్ఞానమును అర్థము చేసుకోలేక నిన్ను దూషించిన వారంతయు క్షమించరాని పాపమును మూటగట్టుకున్నారు.

ఆత్మజ్ఞాని :- యమధర్మరాజా! నాదొక మనవి. భూమిమీద అజ్ఞానము సాధారణ మనుషులలో లేదు. సామాన్యులు, జ్ఞానము తెలియని అమాయకులేగానీ, అజ్ఞానులుకాదు. జ్ఞానులమనుకొని మచ్చుకైన శరీరములోని ఆత్మజ్ఞానమును తెలియక బాహ్యముగా అనేక పేర్లతో, అనేక అరాధనలతో, అనేక సమాజములుగా, అనేక స్వాములుగా, అనేక బాబాలుగా ఉన్నవారే అజ్ఞానులుగా ఉన్నారు. వారు చెప్పు బోధలలో దేవునికి, భగవంతునికి అర్థము తెలియదు. శివునికి, శంకరునికి తేడా తెలియదు. యోగమునకు, యజ్ఞముకు బేధము తెలియదు. దేవునికి, దేవతలకు తారతమ్యము తెలియదు. జ్ఞానమును తెలియని వారందరు మేము గొప్పగ తెలిసినవారమనుకొని, ప్రజలను తప్పుదారి పట్టించడము వలన ఇలాంటి ఉద్యోగస్థులు, పోలీస్‌లు, వ్యాపారస్థులు, రాజకీయనాయకులు పాపాత్ములగు చున్నారని నా అభిప్రాయము. అందువలన భూమిమీదున్న స్వామీజీలలోను, పీఠాధిపతులలోను మార్పువచ్చునట్లు చేయమని నా విన్నపము.

యముడు :- నిజము చెప్పితివి. నీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను. అందువలనే యమధర్మరాజు తీర్పులో సాధారణ మనుషులకు ఒకమారు అనుభవిస్తే అయిపోవు శిక్షయుండగా, జ్ఞానులమనుకొన్న అజ్ఞానులు దేవుని విషయములో పాపము చేయుచుండుట వలన, వారికి రెండు యుగములు అనుభవించు శిక్ష విధింపబడుచున్నది. నీవు వారిలో మార్పును అడిగావు, కావున గురువులలోను, స్వాములలోను, పీఠాధిపతులలోను, బాబాలలోను మార్పు తెచ్చుటకు ఇప్పటికే త్రైతసిద్ధాంత ఆదికర్త భూమిమీద పుట్టియున్నారు. ఆయన వలననే నీవు కోరిన మార్పు జరుగగలదు.


కింకరులారా! మీరు మహాభూతములుగా, స్వల్పభూతములుగా ఉపభూతములుగా, గ్రహములుగా విడిపోయి వీరు నలుగురు పాపమును అనుభవించునట్లు చేయండి. లంచాలతో బ్రతికిన ఈ ఉద్యోగస్థునికి మరుజన్మలో ఉద్యోగము లేకుండ కూటికి, గుడ్డకు కరువుగా బ్రతుకునట్లు చేయండి. పోలీస్‌ ఆఫీసర్‌గా గర్వముతో బ్రతికి అనేకుల మీద తప్పుడు కేసులు బనాయించిన వానిని, రేపుజన్మలో తప్పుడు కేసులోనే జైలుకుపోయి జీవితాంతము జైలులో గడుపునట్లు చేయండి. పోలీస్‌గా ఉన్నపుడు గురువును నిందించినందుకు వందజన్మలు చర్మరోగముతో బాధపడునట్లు చేసెదను. వడ్డీ వ్యాపారముతో అనేకులను పీడించిన ఇతనిని పాముజన్మకు పంపించి, ఇతని వలన బాధపడిన వారిచేత, పాము కనిపిస్తూనే రాళ్ళతో కొట్టునట్లు చేసి, దిన దినము భయముతో బ్రతుకునట్లు చేయండి. ఇక రాజకీయనాయకునికి, ఇతను చేసిన హత్యాపాపమునకు చిన్నవయస్సులోనే శత్రువులచేత చేతులను నరుకునట్లు చేసి, జీవితాంతము మొండిచేతులతో బ్రతుకునట్లు చేయండి.


మాయకు వ్యతిరేఖమైన ధర్మమును తెలిసిన యమధర్మరాజునైన నేను చెప్పిన మాటకు తిరుగులేదు. కావున నాకు వ్యతిరేఖమైన ‘‘మాయ’’ వైపు ఉంటారో, మాయకు వ్యతిరేఖమైన ‘‘యమా’’ వైపు ఉంటారో యోచించు కోండి. ఇంతటితో ఈ సభను చాలించెదము.

-***-