ప్రబోధానందం నాటికలు/రావణ బ్రహ్మ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రావణ బ్రహ్మ

ఆకాశవాణి :- బ్రహ్మా! రావణబ్రహ్మా!! మూడుకాలములను తెలిసిన త్రికాలజ్ఞానివి, మూడు యోగములను తెలిసిన బ్రహ్మజ్ఞానివి, మూడు ఆత్మల వివరమును తెలిసిన ఆత్మజ్ఞానివయిన ఓ రావణబ్రహ్మ! త్రేతాయుగము నాటి నిన్ను గురించి కలియుగములోని మనుషులు చెడు ఉద్దేశము కలిగియున్నారు. వారి ఉద్దేశములో నీవు రాక్షషుడవట, నీచుడవట, కామాంధుడవట, యజ్ఞములను నాశనము చేయించిన దుర్మార్గుడవట, సీత స్వయంవరమునకు పోయి శివధనస్సును ఎత్తలేక భంగపడినవాడివట, పరకాంత వ్యామోహముచే సీతాదేవిని అపహరించి ప్రాణముమీదికి తెచ్చుకొన్న అజ్ఞానివట. పదితలలు ఉన్నప్పటికి తెలివిలేనివాడివై, ఒక్కతల కల్గిన రాముని చేతిలో చచ్చిన ఛవటవట, స్త్రీలను గౌరవించని వాడివట, దైవభక్తిలేని మూఢునివట, ఈ విధముగా ఎన్నో రకముల నిన్ను దూషించుచున్నారు. నిన్ను చంపిన రాముణ్ణి దేవునివలె తలచి పూజిస్తున్నారు. కలియుగములోని ప్రజలు ఎందుకు ఆ విధముగ నీమీద దురుద్దేశము కల్గియున్నారు. వీటికి సమాధానము నీవే చెప్పాలి!


రావణుడు :- ఆత్మ స్వరూపమై ఎవరికి కనిపించని ఓ దివ్యవాణీ! నీకు నా నమస్కృతులు. స్వయాన నీవే నన్ను త్రికాలజ్ఞానియని, ఆత్మజ్ఞానియని, బ్రహ్మయని సంభోదించినపుడు, కలియుగములో మంచిచెడు విచక్షణా జ్ఞానములేని మానవులు ఏమంటే నాకేమి? భూమిమీద ద్వాదశ గుణములలో చిక్కి, వాటి వివరము తెలియని మానవులు, అజ్ఞానముతప్ప జ్ఞానమేమిటో తెలియని మానవులు, దేవతలు తప్ప దేవుని గురించి రవ్వంత కూడ తెలియని మానవులు, జనన మరణ అంతరార్థము ఏమాత్రము తెలియని మానవులు, భగవంతునికి, దేవునికి తేడా తెలియని మానవులు, శరీరమును నడిపించుశక్తిని గురించి తెలియని మానవులు, చివరకు తనెవరో తనకే తెలియని మానవులు, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము తెలియని మానవులు, శ్రీరాముణ్ణి మంచివాడనిన, రావణబ్రహ్మను చెడ్డవాడనిన, తెలివిలో తేజస్సున్నవారు ఎవరు నమ్మరు. అయినప్పటికి నీవు ప్రత్యేకించి అడిగావు కావున అజ్ఞాన అంధకారములో చిక్కుకొని చదువులుండి సంస్కారములేనివారు, భక్తియుండి భావములేనివారు, సన్యాసముండి సాక్షిని తెలియనివారు, ఆచారములుండి అర్థము తెలియని మనుషులు తెలియునట్లు, ఆలోచించునట్లు నేను చెప్పవలసిందే! ఈ ప్రజలు వినవలసిందే.


సీత స్వయంవరమునకు నేను పోయి శివధనస్సును ఎత్తలేక భంగపడినానా? సీత స్వయంవరము భారతదేశములో జరుగుచుండగ, లంకలోని నాకెట్లు తెలిసింది? ఎవరైన సముద్రమును దాటివచ్చి నన్ను ఆహ్వానించారా? అప్పటి కాలములో సముద్రమును దాటుటకు ఏ సదుపాయములు లేవే! అంతకుముందు ఎవరూ దాటని సముద్రమును సీత అన్వేషణకు హనుమంతుడు మాత్రము ఎగిరి దాటినాడని చెప్పినపుడు, రవాణాసౌకర్యములేని ఆ దినములలో ఎవరూ లంకలోనికి రానట్లే కదా! సీత స్వయంవరమును గురించి తెలుపనట్లే కదా! స్వయంవర విషయము నాకు తెలియకున్నను, తెలిసినట్లు వర్ణించి, నేను అక్కడికి పోకున్నను పోయినట్లు చిత్రించి, చివరకు శివధనస్సును ఎత్తకున్నను ఎత్తలేని నిర్భలునిగ రూపొందించి, రావణుడు చెడ్డవాడన్నట్లు చేశారు. ఈ విషయమును వ్రాసినది ఆనాటికవులు. ఆనాటి కవులు ప్రాంతీయ అభిమానముతో వారు ఆర్యులని, మేము ద్రావిడులమని, ద్రావిడులను రాక్షసులుగ, ఆర్యులను దేవతలుగ చిత్రించి చెప్పిన చరిత్రే రామాయణము. రామాయణములో నన్ను రాక్షసుడని రాముణ్ణి దేవుడని అన్నారు. నేను ఎలా రాక్షసుణ్ణో, రాముడు ఎలా దేవుడో యోచించవలసిన బాధ్యత మీదే.

స్వయంవరమునకు ఆహ్వానించబడిన వారందరు భారతదేశములోని చిన్న చిన్న సామంతరాజులు. అటువంటి సామంతరాజులు వచ్చిన స్థలమునకు లంకేశ్వరుడైన నేను, లంకాద్వీపమునకు చక్రవర్తినైన నేను పోగలనా? అప్పటికే మండోదరి అను భార్యాసమేతుడనై, ఇంద్రజిత్‌ అను వివాహమైన కుమారయుతుడనై, వయస్సు పైబడిన నేను కూతురుతో సమానమైన, కూతురువయస్సున సీత స్వయంవరమునకు పోగలనా? పోయాననుట అసత్యము. అంతకుముందే కైలాసపర్వతమును శివునితో సహా ఎత్తిన నేను, సీతాదేవి ఎత్తిన ఒక ధనస్సును ఎత్తలేనా? స్వయంవరములో సీత ఎత్తిన ధనస్సును ఎత్తలేని వాడిని, అడవిలో సీతను మట్టిగడ్డతో సహా ఎలా ఎత్తుకు పోయాను? సీతను ఎత్తగలిన బలముకల నేను సీత ఎత్తిన ఒక వస్తువును ఎత్తలేనా? సీతను ఎత్తుకు పోయినమాట వాస్తవమేగానీ ధనస్సును గురించి కవులు అల్లిన సమాచారమంతా కల్పితము.


రావణునికి పది తలలున్నాయనుట పూర్తి అసత్యము. నాకు పది తలలు లేవు. కానీ పది తలలకున్నంత తెలివి, జ్ఞానముగలవాడిని కనుక ఆనాడు నన్ను దశకంఠుడు అన్నారు. సూక్ష్మముగ దశకంఠుడనే కానీ భౌతికముగ అందరికున్నట్లు ఒక్క తలమాత్రమున్నది. కనిపిస్తున్న ఒక్క తలను వదలి రామునికి ఒకటి, రావణునికి పది అనుట అవివేకము కాదా!... రావణ అను గంభీరమైన నామధేయముకల్గిన నన్ను అసురుడని నాలోలేని అసురత్వము కనిపించునట్లు రావణాసురుడనుట భావ్యమా!...


పదినెలలు పర్యంతము నా ఆధీనములోనున్న సీతాదేవికి ఎటువంటి అసౌకర్యము లేకుండునట్లు, ఒంటరితనము తోచనట్లు, పదిమంది స్త్రీలను ఆమె సేవకు వినియోగించాను. రావణుడు నన్ను అసభ్యముగ మాట్లాడాడని గానీ, అట్లు ప్రవర్తించాడనిగానీ, సీతాదేవి ఎవరితోనూ నన్ను గురించి చెప్పలేదే. అరణ్యమునుండి ఆమెను లంకకు తీసుకువచ్చేటపుడు కూడా సీతను తాకకుండ భూమితో సహా పెకలించుకొని తెచ్చాను. నాలో పరకాంత వ్యామోహముండినా, నేను కామాంధుడనైనా, ఒంటరిగ చిక్కిన అబలను మానభంగము చేసెడివాడిని కదా!.... అట్లు చేయలేదే!... చేతకాకనా! ధర్మము తెలుసును కనుక అలా చేయలేదు. నాభార్య మండోదరిదేవికి కూడ సీతను ఏ ఉద్దేశముతో తెచ్చానో తెలుసు. త్రికాల జ్ఞానినైన నేను నా మరణము శ్రీరాముని చేతిలో లంకలోనే ఉన్నదని, కనుక రాముణ్ణి లంకకు రప్పించుట కొరకు సీతను తెస్తున్నానని, ముందే నాభార్య మండోదరి దేవికి చెప్పాను. జరుగబోవు భవిష్యత్తు తెలిసిన నేను గొప్పవాడినా! ముందు ఏమి జరుగుతుందో తెలియక, బంగారుజింక ఉంటుందా అని యోచించక, అడవిలోనికి పోయిన రాముడు గొప్పవాడా!... ఈ విషయములోనైన రామునికి ఒకతల తెలివి, రావణునికి పదితలల తెలివి కలదని ఇప్పుడైన ఒప్పుకోక తప్పదు.


సీతను నేను బిడ్డవలె ఆదరిస్తే, ఆ విషయమునే సీతాదేవి రావణ బ్రహ్మ నన్ను కూతురులాగ చూచుకొన్నాడని చెప్పినప్పటికి, రాముడు సీతను అనుమానించి అగ్నిపరీక్షకు నిలబెట్టడము స్త్రీజాతిని అవమానపరిచినట్లు కాదా!... ఈ విషయమును చూస్తే స్త్రీలపట్ల అగౌరవముగ ప్రవర్తించినవాడు రాముడా? రావణుడా? ఎవడైన రాముడనియే ముమ్మాటికి చెప్పకతప్పదు.


రాముడు అశ్వమేధయాగము చేసి అశ్వమును వదలినపుడు, రాముడు స్వయాన తమకు తండ్రియని తెలియని లవకుశులు, అశ్వమును బంధించినపుడు, వారిచేతిలో రాముని సైన్యము ఓడిపోయినపుడు, మొదట లక్ష్మణుడు, ఆ తర్వాత రాముడు లవకుశుల వద్దకు పోయినపుడు, లవ కుశులు రామునిలోని లోపములన్ని బయటపెట్టి, దుర్భాషలాడిన విషయము ప్రజలకు తెలియదా! స్వంత కుమారులే రాముణ్ణి ఒప్పుకోలేదని ప్రజలకు తెలియదా! ఆ సందర్భములోనే సీత అక్కడికి వచ్చినపుడు, లవకుశులు తన కుమారులేనని తెలుసుకొన్న రాముడు, సీతను తిరిగి అయోధ్యకు పిలువగ, నీ చేతిలో అవమానముపాలై అడవిలో విడువబడిన తర్వాత కూడ తిరిగి వచ్చి నీతో నేనెలా కాపురము చేసేదని, అట్లు చేయుటకంటే చావడము మేలని, సీతాదేవి కొండమీదినుండి దూకి ఆత్మహత్య చేసుకోవడము ప్రజలకు తెలియదా! అంతవరకు ప్రాణాలతోవున్న ఆమె ఆ దినమే ఎందుకు లేకుండ పోయిందో తెలుసా? అప్పటి వరకు అడవిలో ఒక అభాగ్యురాలిగ బ్రతికిన సీత, ఇక మీదట రాముని భార్యగ బ్రతుకదలచు కోలేదు కనుక, తిరిగి రాముని భార్యననిపించుకోవడము ఇష్టము లేదు కనుక, ప్రేమలేని రాముని వద్ద బ్రతకడము నరకము కనుక, ఇదంతా ప్రజలకు తెలియదా! తెలిసిన తర్వాత కూడ రాముణ్ణి దేవునిగ, నన్ను రాక్షసునిగ వర్ణించి ప్రజలను తప్పుదోవ పట్టించిన కవులు ఏ పాటివారో మీరే యోచించండి.


అపరబ్రహ్మననీ, బ్రహ్మజ్ఞానిననీ, రావణబ్రహ్మననీ పేరుగాంచిన నాకు యజ్ఞములంటే ఏమిటో తెలియదా! బాహ్యయజ్ఞములు ధర్మ విరుద్ధములని, దేవుని మార్గమునకు ఆటంకములని, అధర్మములైన యజ్ఞములను చెడగొట్టిన నేను ధర్మపరుణ్ణా లేక యజ్ఞములను కాపాడ దలచిన రాముడు ధర్మపరుడా! అధర్మములను త్రుంచివేయుటకు దేవుడు భూమిమీదకు వస్తానని గీతలో చెప్పలేదా! ద్వాపరయుగములో గీతయందు యజ్ఞముల వలన నేను తెలియబడనని చెప్పిన ధర్మము ప్రకారమే నేను త్రేతాయుగములోనే, అధర్మములైన యజ్ఞములను నాశనము చేశాను. అనాడే ధర్మపరుణ్ణి, బ్రహ్మజ్ఞానిని అనిపించుకొన్నాను. భగవద్గీతకు అనుకూలముగ నడచినవాడను నేను, భగవద్గీతకు వ్యతిరేఖముగ నడచిన వాడు రాముడు. రాముడు ధర్మపరుడు, రావణుడు అధర్మపరుడనుకున్న ఈ కాలపు గ్రుడ్డి ప్రజలను అడుగుచున్నాను. ఇప్పుడు చెప్పండి ఎవరు ధర్మపరుడో, ఎవరు అధర్మపరుడో.


ధర్మము ప్రకారము యజ్ఞములను నాశనము చేసిన నన్ను దుర్మార్గుడని ప్రజలచేత నమ్మించి, వారి భుక్తికొరకు రాజుల దగ్గర ధనమును తీసుకొని యజ్ఞము చేయుట, ద్వాపరయుగములో పెరిగిపోవడమును గమనించిన దేవుడు తానే శ్రీకృష్ణునిగ భూమిమీదకు వచ్చాడు.

శ్లో॥

యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌ ॥

ఎప్పుడైతే ధర్మములకు ముప్పుకలుగుతుందో అపుడే నేను భూమి మీద అవతరిస్తానని చెప్పిన దేవుడు, వ్యాసుడు మొదలగు మహర్షులని పేరుగాంచిన వారున్నపుడే భూమిమీద అవతరించాడు. దీనినిబట్టి యజ్ఞములు పెచ్చుగ చేయు మహర్షులు అధర్మపరులనేగా అర్థము! దీనిని బట్టి యజ్ఞములను రక్షించినవాడు ధర్మపరుడా? యజ్ఞములను చెడగొట్టిన వాడు ధర్మపరుడా? ఎవడు ధర్మపరుడో యోచించండి.


ఇకపోతే నేను అజ్ఞానినని, దైవభక్తి ఏమాత్రము లేనివాడినని, సుందరకాండయని పేరుపెట్టి పాట పాడువారు కూడ కలరు. పరబ్రహ్మ స్వరూపమైన, పురుషోత్తమునికి మారురూపమైన ఈశ్వరలింగమును పూజించాను, కానీ అన్యదేవతను ఎక్కడా నేను ఆరాధించలేదే! దేవునికి అన్యముగనున్న దేవతలను, సూర్యున్ని ఆరాధించిన ఘనత రామునికున్నదే కాని, నాకు లేదే! విశ్వమంతా వ్యాపించిన ఈశ్వరుడయిన పరమ్మాతను ఆరాధించిన నేను దైవభక్తి లేనివాడినా!


నా చావు ముహూర్తము తెలిసిన నేను యుద్ధరంగములో పగటిపూట సూర్యకాంతి కల్గిన మిట్టమధ్యాహ్నము, శుక్లపక్షములో, ఉత్తరాయణమున మరణించి, విశ్వవ్యాప్తుడనై అన్ని చూస్తున్నాను. త్రేతాయుగములో నేను ఆటంకపరచిన యజ్ఞములు నేటికినీ సాగుచుండడమేకాక, నన్ను అధర్మ పరుడని అనడమేకాక, యజ్ఞములు, వేదములు, తపస్సులు అధర్మములన్న గీతను కూడ ఎవరూ పట్టించుకోలేదు. అందువలన అలనాటి రావణబ్రహ్మగ మీరు ప్రయాణించు మార్గమేదో తెలుసా? అని అడుగుచున్నాను నేను ఆశించిన సమాజమేనా ఇది? అని ప్రశ్నించుచున్నాను. మాయా ప్రభావము చేత నిజము తెలియక మభ్యపడిపోయి, రావణుడు దుర్మార్గుడని, క్రొవ్వుపట్టిన కామాంధుడని, లోకకంఠకుడని ప్రచారము చేయు ఎందరో స్వాములను, మఠాధిపతులను, పీఠాధిపతులను, పరమహంసలను, మహర్షులను, జ్ఞానము ముసుగు తగిలించుకొన్న మాయా గురువులను ప్రశ్నించుచున్నాను. స్వామి, మహర్షి అను పదమునకు అర్థము మీకు తెలుసునా? తృప్తిగా, రుచికరమైన భోజనము చేయుచు కష్టమనునది లేక సుఖమునకుమరిగి వళ్ళుపెంచిన మీకా క్రొవ్వుపట్టినది? లేక పరాక్రమవంతుడనై యుద్ధ రంగమున అరివీర భయంకరుడై చెలరేగిన నావంటి వీరునికా? మానవుని దైవత్వంవైపు తీసుకుని వెళ్ళవలసిన బాధ్యతగల మీరు, పనికిమాలిన ప్రవచనాలు, పిట్టకథలు, అశాస్త్రీయమైన ఆగమశాస్త్రపు చర్చలు, పుక్కిటి పురాణాలతో కాలక్షేపము చేయుచు సోమరులై, కర్మక్షేపము చేయు మీరు, నిజమైన దేవుని జ్ఞానమును ప్రజలకు అందించక, వారిని మాయా మార్గమున నడిపించుచున్నారు. ఇందుకు తగిన ప్రతిఫలము మీరు తప్పక అనుభవించెదరుగాక! దైవనింద చేసిన వారికి జ్ఞానపు గట్టుకూడ దొరకకుండ చేస్తానని దేవుడు చెప్పిన ప్రకారము, మరుజన్మలోనైన మీరు ఈ భూలోకమునందు కరువుకాటకాలకు నిలయమైన ఆఫ్రికాఖండమున పుట్టి ఆకులు, అలుములు తినుచు ఆకలికి తట్టుకోలేక చివరికి పచ్చి ఉడతలను, పచ్చని మిడతలను, తొండలను తినుచు దుర్భరమైన జీవితమును గడుపుదురుగాక! మీ క్రొవ్వు కరుగునుగాక! ఇదే....మోక్షముతో దైవత్వమును పొందిన నాయొక్క శాపము.... ఆ పరమాత్మ ఈ మాయా గురువులకు విధించు శిక్ష!


ఓ ప్రజలారా! ఇప్పటికైన జ్ఞాననేత్రము తెరచి, నిజమైన దైవజ్ఞానమును గుర్తించి, స్వచ్ఛమైన హేతువాదులై, మాయా జ్ఞానమును చెప్పువారిని ప్రశ్నించండి! నిలదీయండి! నిట్టనిలువున తాట వలవండి! నిజమైన దైవమార్గమును గుర్తించి దానిలో ఎదురయ్యే ఏ అడ్డంకులనైన ఎదుర్కొనండి.

శ్లో॥

శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్వనుష్టితాత్‌ ।
స్వధర్మేనిధనం శ్రేయః పరధర్మో భయావహః ॥

అన్న దేవుని సందేశమే ఊపిరిగా జీవిచండి.


ఆకాశవాణి :- శభాష్‌ రావణబ్రహ్మ! కుక్కకాటుకు చెప్పుదెబ్బవలె నీవిచ్చిన సమాధానము ఈ మానవులను ఆలోచింప చేయునుగాక! నీ గురించి చెడుగా ప్రచారము చేయు మాయా గురువులకు చెంపపెట్టు అగునుగాక! ఇప్పటికైన ప్రజలకు నీపై సదుద్దేశము కలుగునుగాక!


రావణబ్రహ్మ :- నా గురించి ఎందరో చెడుగ చెప్పుకున్నను, నా నిజ స్వరూపమును, నాయొక్క పవిత్రతను ఏనాడో ఈ ప్రపంచానికి తెలియజేసిన ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులకు నా నమస్కృతులు, నేను గొప్ప వాడినని, నా జ్ఞానము గొప్పదని, నేను స్వచ్ఛమైన ధర్మపరుడినని తెలిసి ఇప్పటికి నన్ను గురించి చెప్పు ప్రబోధ సేవాసమితి వారున్న చోటికి వచ్చాను, మనసువిప్పి మాట్లాడాను. యజ్ఞములు, వేదములు, ధానములు, తపస్సులు దేవుని ధర్మములు కావను గీతవాక్యమును గుర్తుంచుకొనిన వారి హృదయా లలో ఎప్పటికి ఉంటాను. ఇక సెలవు...

-***-