ప్రబోధానందం నాటికలు/ఎగువవాడు - దిగువవాడు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఎగువవాడు - దిగువవాడు

స్టేజిమీద ఒక బ్రాహ్మణుడు వస్తూవుంటే, అతనికి ఎదురుగా మాదిగ కులస్థుడొకడు వచ్చుచుండెను. అంతలో...

బ్రాహ్మణుడు :- ఓరే చండాలుడా! బ్రాహ్మణుణ్ణి దారిలో పోతూవుంటే నా ప్రక్కనే నీవు పోతావా? అంటరానివాడివి, మాంసము తినేవానివి, నీచునివి సత్‌బ్రాహ్మణుని ప్రక్కగా పోకూడదని నీకు తెలియదా? నువ్వు చేసిన పనికి నేను తిరిగి స్నానము చేసి శుద్ధి చేసుకోవలెను.

చండాలుడు :- ఏమి స్వామి! మీరు వస్తూంటే మీ ప్రక్కగా మేము పోకూడదా? ఇక్కడున్నది ఒకే దారికదా! దారిలో పోవునపుడు ఎవడైనా ప్రక్కగానే పోతాడు. అంతమాత్రాన ఇన్ని మాటలనుచు నన్ను అంటనివాడి వని, నీచుడవని అనవచ్చునా?

బ్రాహ్మణుడు :- ఇపుడు ఎదురుగా వచ్చావు దానికే స్నానము చేయాలి, ఒకవేళ నన్ను తగిలియుంటే మూడురోజులు శుద్ధికార్యము చేసుకోవలసి వచ్చేది.

చండాలుడు :- నేను నిన్ను తగలలేదు కదా! ఎదురుగా వచ్చినందుకు నీకేమి అంటుకొన్నది?

బ్రాహ్మణుడు :- చండాల దర్శనమే మహాపాపమ్‌ అని వేదాలలో వ్రాసియుంది. తగిలితే మరీ పాపమని కూడ ఉంది. నీవు మాదిగవాడివి నేను బ్రాహ్మణున్ని అందుకే అంతగా చెప్పేది.

చండాలుడు :- నీవు బ్రాహ్మణునివి, నేను మాదిగవాడినా? అయితే ఇపుడొక మాట అడుగుతాను చెప్పగలవా? నీవు బ్రాహ్మణునివని, నేను దిగువవాడినని ఎలా చెప్పగలుగుచున్నావు?

బ్రాహ్మణుడు :- నేను పుట్టుకతోనే బ్రాహ్మణకులములో పుట్టాను. కనుక బ్రాహ్మణున్ని, నీవు మాదిగకులములో పుట్టావు. కనుక మాకు దిగువవానివే. ఇందులో ఏమైనా సంశయమా?

చండాలుడు :- బ్రాహ్మణుడని, దిగువవాడని పుట్టుకతోరాదు. వాడు చేసే పనినిబట్టి, వానికున్న గుణమునుబట్టి ఉండునని భగవద్గీతలో కూడ చెప్పారు. బ్రహ్మజ్ఞానము కలవానిని బ్రాహ్మణుడని, బ్రహ్మజ్ఞానము లేని వానిని వానికంటే దిగువవాడని ఒక గురువుగారు కూడ చెప్పారు. ఆయన చెప్పిన దానినిబట్టి, జగతిలో రెండే కులములున్నవనీ, దైవజ్ఞానము తెలిసిన వాడు ఎగువ కులమువాడనీ, జ్ఞానము తెలియనివాడు వానికంటే దిగువ కులమువాడనీ తెలియుచున్నది. ఇపుడు బ్రహ్మజ్ఞానమును నీకంటే నేనే ఎక్కువ తెలిసినవాడిని కాబట్టి నేనే బ్రాహ్మణున్ని, తక్కువ తెలిసినవాడివి కాబట్టి నీవే దిగువవానివి.

బ్రాహ్మణుడు :- చతుర్వేదములు కంఠాపాటముగా చెప్పువాడిని, నిత్యము గాయిత్రీమంత్రమును ఉచ్ఛరించువానిని, ఎన్నో యజ్ఞములు చేసిన వానిని, నన్నే జ్ఞానము లేనివాడిననీ, నీకంటే దిగువవాడిననీ అంటావా?

చండాలుడు :- నీవు నన్ను మాదిగువవాడంటే, అంటరానివాడంటే, నేను నీకు వివరము చెప్పవలసివచ్చినది. వేదములను కంఠాపాటముగా పారాయణము చేయుటగానీ, ఏ మంత్రమునైన జపించుటగానీ, యజ్ఞములు చేయుటగానీ జ్ఞానముకాదని, దానివలన దేవుణ్ణి తెలియలేరని, భగవద్గీతలో భగవంతుడే చెప్పియున్నాడు కదా! భగవంతుడు గీతలో చెప్పిన దాని ప్రకారము నీవు నాకంటే దిగువవానివి కాదా! మాలాంటి జ్ఞానులందరికి నీవు మాదిగువవానివే. భగవద్గీతలో దేవుడు చెప్పిన దానిప్రకారము జ్ఞానము తెలిసి, దాని ప్రకారము ప్రవర్తించు నేనుగానీ, నాలాంటివారుగానీ అందరు ఎగువవారే. మాకంటే విభిన్నముగా యజ్ఞాలు చేసే మీరు, వేదమంత్రాలు వల్లించే మీరు మాదిగువవారే.

బ్రాహ్మణుడు :- ఏమిటీ వైపరీత్యము. నీవు ఎగువవాడివా, నేను దిగువ వాడినా.

చండాలుడు :- అవును ముమ్మాటికి నిజము.

బ్రాహ్మణుడు :- (తలపట్టుకొని) కాదు కాదు నేనే బ్రాహ్మణున్ని, నీవు మాదిగువవానివే.

చండాలుడు :- సరే నీవే బ్రాహ్మణునివి అనుకుంటాము. నేను ఎదురుగా వస్తే నీకేమి అంటుకొన్నది. నాది పంచభూతములచే నిర్మాణమైన శరీరమే నీది అంతే, శరీరములలో ఏ తేడాలేదు, ఏ అంటులేదు. ఇకపోతే లోపలున్న జీవాత్మ నీ శరీరములో ఒకచోట, నా శరీరములో మరొకచోట ఉన్నదా? అట్లు కూడలేవు. అన్ని శరీరములలో జీవాత్మలు గుణచక్రములోనే ఉన్నవి. కాబట్టి అవియు సమానమే! వాటికి అంటులేదు. ఇక ఆత్మ విషయానికివస్తే అది అందరిలో బ్రహ్మనాడిలోనే ఉన్నది. అదియు అంటులేదు. శరీరము, ఆత్మలు అన్నీ సమానమైనపుడు మీరేమిటిని ‘అంటు’ అనుచున్నారు. అంటు అంటే దానికి పరిష్కారము శుద్ధి అంటే నేను ఒప్పుకోను, అంటు ఏమిటో ఎక్కడుందో చెప్పి తీరవలసిందే.

బ్రాహ్మణుడు :- అంటు ఏమిటో నాకు తెలియదు. మాపెద్దలు చెప్పారు అందువలన నేను చెప్పాను.

చండాలుడు :- మీరు బ్రతుకుతెరువు కొరకు మంత్రాలు నేర్చుకొన్నారు. సంపాదనకొరకు పంచాంగములను పట్టుకొన్నారు. పెళ్ళికి అర్థము చెప్పకుండానే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇది జ్ఞానమగునా?

బ్రాహ్మణుడు :- పుట్టిన తర్వాత ఏదో ఒక పని చేయాలి కదా! మా వలననే హిందూసంస్కృతి మిగిలివున్నది కదా!

చండాలుడు :- ఊ....... మీకు హిందూసంస్కృతి అన్న పదమునకు అర్థము తెలుసునా? హిందూ సాంప్రదాయములను సర్వనాశనము చేసినది మీరు కాదా! నేడు మీ అసమర్థతవలన హిందూమతములోని ఎన్నో కులములవారు ఇతర మతములలోనికి పోయారు. ఏమీ తెలియని అమాయక యువకులను, మనము హిందువులమని హిందూధర్మములను కాపాడుకోవాలని, పరమతములను ద్వేషించాలని కొన్ని హిందూసంఘముల పేరుతో ప్రోత్సహించినది మీరు కాదా! నేడుగల హిందూ సంఘములకు మతతత్త్వమును నేర్పారుగానీ, హిందూధర్మములు ఇవియని తెలిపారా? మీకు విరుద్ధముగ మాట్లాడిన హిందువులనైన పరమతస్థులుగా చిత్రీకరించ లేదా! హిందూధర్మములులేవో తెలియని హిందూసంఘములు గ్రుడ్డిగా హిందువులనే హింసించలేదా! ఆదిశంకరాచార్యులకంటే ఎక్కువగా హిందూ ధర్మములకు వివరముచెప్పే గురువును, విపులముగా భగవద్గీతను వ్రాసిన గురువును, హిందూమతములోనే ఎంతో పెద్దజ్ఞానులచేత ఇది నిజమైన జ్ఞానమనీ ప్రశంసింపబడిన గురువును, మీరు తయారుచేసిన హిందూ సంఘములు గుర్తించకపోవడమేకాక, మేము ఏమీ చేయుచున్నామను ఆలోచనే లేకుండ గురువుగారు వ్రాసిన భగవద్గీతను నడిరోడ్డులో మీరు తగులబెట్టారు కాదయ్యా! కాల్చినవారు. అందులో ఏముంది అని చూచారా? మనము ఎవరిని అవమానిస్తున్నామని ఆలోచించారా? అంతగ్రుడ్డిగా హిందువులు హిందువుల మీదికే దాడి చేయుచున్నారంటే ఇదంతా మీచలవకాదా! ఈ రోజు మా స్ఫూర్తితో భగవద్గీత శ్లోకాలను అనర్గళముగా చదివే ఇతర మతస్థులను చూస్తున్నాము. మీ చలువతో భగవద్గీత అంటే ఏమిటో తెలియని హిందువులను ఎందరినో చూస్తున్నాము. ఇదంతయు ఎవరి వలన జరిగినది. మీ వలననే! మీరు తయారు చేసిన హిందూసమాజములో దేవుడు అనినా, సృష్టికర్త అనినా అర్థముకాక, ఈ పదములు ఇతర మతస్థులవని మనవి కావంటున్నారు. ఆదినుండి ఉన్న సృష్ఠికర్త అను పేరును, దేవుడు అను పేరును నిన్న మొన్న పుట్టిన ఇతర మతములవారికి లీజుకిచ్చినట్లు అవి మనవికావంటున్నారు. ఇలాంటి హిందూసమాజమునకు పునాదివేసినది మీరు కాదా! తాచెడ్డకోతి వనమెల్ల చెరిచినట్లు, మీరు అజ్ఞానులై పోయి హిందూసమాజమునే అజ్ఞానమ వైపు నడిపించారు. మహోన్నతమైన జ్ఞానము కల్గినవారై పూర్వపు ఇందువులుండెడివారు. నేడు తమ ధర్మమును తామే గుర్తించలేని హిందువులు దైవభక్తిని వదలి దేశభక్తిని కల్గియుండాలంటున్నారు. చివరకు దేశభక్తి కూడ పోయి మతభక్తి ఏర్పడినది. దానివలన అజ్ఞాన హిందువులమై పోవడమేకాక, మనమే మత హింసలను ప్రోత్సహిస్తున్నాము. ఇదంతయు చూస్తే హిందూసమాజములో అధర్మములు పూర్తి చెలరేగి పోయాయి. అధర్మములను అణచివేయుటకు నేడు ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద గురువుగారు వస్తే, మీ స్వార్థబుద్ధితో అద్వైతము హిందువులదని, త్రైతము ఇతర మతస్థులదని నమ్మించారు. ఆదిశంకారాచార్యుని అద్వైతము పూర్తిగా తప్పని పూర్వము నాలాంటి చండాలుడు వాదించి గెలిస్తే, ఆనాడు శంకరా చార్యుడే చండాలుని కాళ్ళుపట్టుకొని నమస్కరించి ఓడిపోయానన్నాడు. ఆ విషయము బయటికి తెలిస్తే బాగుండదని, శివుడు చండాలుని వేషముతో వచ్చియుంటే, శంకరాచార్యుడు ఆయన కాళ్ళకు నమస్కరించారని కప్పిపుచ్చుకున్నారు. ఇప్పటికైన వేదాలు మన ప్రమాణ గ్రంథములుకాదు భగవద్గీత మన ప్రమాణ గ్రంథమని నమ్మి జ్ఞానమును తెలిసి హిందూత్త్వ ధర్మములేవో ప్రజలను తెలుసుకోనివ్వండి.


ఇంతచెప్పినప్పటికి అసూయతో అర్థము చేసుకోలేకపోతే నీవు ఎప్పటికి మాదిగవానివే. చెప్పింది అర్థము చేసుకొని ఆచరిస్తే నిజమైన బ్రాహ్మణునివవుతావు. నమస్తే.

-***-