ప్రబోధచంద్రోదయము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

ప్రబోధచంద్రోదయము

చతుర్థాశ్వాసము

క.

శ్రీగౌరీకుచకుంభా
భోగమృగమదానులేపభూషితవక్షో
భాగశివదత్తనిర్మల
భోగాంగ యనంతమంత్రిపుంగవ గంగా!

1


వ.

అవధరింపు మట్లు శ్రద్ధాలలనవలన విష్ణుభక్తిమహాదేవిసందేశంబు విని పర
మానందంబు నొంది సుకృతకర్మవ్యవసాయపరులకు దైవసాహాయ్యంబు
గలుగునని పెద్దలు చెప్పుట నిజమయ్యె నిప్పుడు విష్ణుభక్తిమహాదేవి పనకుఁ
దానె నామీఁది యనుగ్రహంబున నీశ్రద్ధావధూటిచేత నీవు కామాదుల గెలువ
నుద్యోగింపుము నేను దో డయ్యెద నని యానతిచ్చి పుత్తెంచెం గావున నింక
నస్మదీయమనోరథం బప్రయాసంబున సిద్ధించు నని వివేకమహారాజు
మహామోహునిచేత జగంబులు మోసపోవుతెఱం గంతరంగంబునఁ
దలంచి.

2


చ.

అనఘ మనంత మచ్యుతచిదాత్మసుధాంబుధినిస్తరంగమం
దనిశము మగ్నులయ్యుఁ జని యానక సంస్కృతి యన్ మరీచికా
వననిధి వెంట వెంటఁ జని వారక యీఁదుచు నాస్పదింపుచున్
మునుఁగుచు లేచుచుందు రిదె మూఢజనంబులు మోహచేష్టలన్.

3


ఆ.

ఇట్టిమోహభూత మిరవగు సంసార
సాల మనవబోధమూలయుతము
కాన నీశ్వరాంఘ్రికమలార్చనాజాత
బోధగజము చేరి పోవవైచు.[1]

4

క.

ఆమోహున కాధారము
కాముం డటుగాన వానిఁ గడ తేర్చు బలో
ద్ధాముఁడు వస్తువిచారుం
డామేటిం బిలువవలయు నని పణిహారిన్.

5


క.

పనిచిన వస్తువిచారుఁడు
చనుదెంచుచు నాత్మలోన సకలజనులు మో
హునికతమునఁ గామునికత
మునను భ్రమలఁ బొంది మోసపోయెద రయ్యో!

6


చ.

సవరని దంచు నిబ్బరపుఁజన్నుల దంచు సుధాంశుమండలీ
సువదన యంచు బిత్తరపుఁజూపులు దంచు లతాంగీ యంచు మో
హవశతఁ బొంది చొక్కి కొనియాడి రమించు బుధుండుఁ గామినిన్
శివశివ భ్రాంతి గాని యశుచిప్రతి మౌట యెఱింగియుండియున్.

7


గీ.

వికటదుర్గంధభీభత్సవేషములకు
నాలయంబులు చర్మమాంసాస్థిపంజ
రములు నైనవధూశరీరంబులకును
వ్యాధిగృహముల కింతైన వాసి గలదె.

8


ఉ.

మెత్తనిదుప్పటంబులను మెత్తినకస్తురి కప్పరంబులన్
ముత్తెపుఁబేరులన్ సురభిపూరితపుష్పములన్ వృథా వెలిన్
హత్తిన వేడ్కఁ జూతు రహహా! మతిహీనులు లో నెఱుంగ రీ
బిత్తరివారనారు లనుపేరిట జంగమనారకంబులన్.

9


సీ.

నికటమలద్వారనిర్గతదుర్గంధ
                          వాతూలసంఘాతవాసితంబు
వితతకోణత్రయీవిస్తారితానేక
                          సాంద్రకంటకరోమసంవృతంబు
కలుషభూరిరజోవికారసముద్భవా
                          సారశోణితపంకసంకులంబు

విస్రగంధాలయాజస్రపరిస్రవ
                          బహుతరప్రస్రావవల్వలంబు


గీ.

నైన భవదీయమందిరప్రాంగణమున
కెట్టు దివిచెదు యోగ్యులై నట్టిఘనుల
భృంగమౌర్వినినాదకంపితసమస్త
పటువియోగిజనప్రాణ! పంచబాణ![2]

10


క.

అని పలికి మిన్ను చూచుచు
మనసిజునిం గూర్చి యోరిమాలా! యీలా
గున బ్రమయించెద వేలా
జనులు నిరాలంబనమున జనితుఁడ వయ్యున్.

11


మ.

ననుఁ గామించిన దీలతాంగి నను నానందంబుగాఁ జూచి యి
వ్వనజాతానన కౌగిలించె నను నివ్వాహమాక్షి కాంక్షించె నం
చు నరుల్ భ్రాంతి వహింతు రేల పిశితాస్థుల్ కూడి రూపైన మో
హినియే కార్యము కానరాని పురుషుం డీక్షింపఁ గాంక్షింపఁగన్.

12


క.

అనుచు న్వస్తువిచారుఁడు
చనుదెంచి వివేకనృపతి చరణంబులకున్
వినతుండై తచ్చాసన
మునఁ జేరువజమ్ముఖాణమునఁ గూర్చుండన్.

13


మ.

అతనిం జూచి వివేకుఁ డిట్లను మహాత్మా! మాకు సమ్మోహునిం
బ్రతిపక్షు న్విదళింపఁగావలయు సంగ్రామంబున న్వానికిన్
హితుడు న్వీరుడునైనకామునకు నిన్నే యెంచుకొన్నాఁడ నేఁ
బ్రతిగా నాయుధవిద్య నీకుఁ గలదా భంజింపఁ దత్కామునిన్.

14


క.

అనవుడు వస్తువిచారుఁడు
జననాథా! వాని కైదుశరము లవియు నం

టినఁ గందుపువ్వు లాకా
ముని గెలువ న్నాకు నస్త్రములు వలయునొకో.

15


చ.

తొలితొలి నింద్రియంపువెలిత్రోవలఁ బాఱుమనంబుఁ బట్టుచున్
గలికిచకోరలోచనలఁ గాంచినయప్పుడు వారిమేనిలో
పలఁగలరోతలున్ ముదిమిభంగులు మాటికి మాటికి న్మదిన్
దలఁచినఁ జిత్తజుండు తనుతానె నశించెడు నేటి కస్త్రముల్.

16


చ.

ప్రవిమలసైకతంబులయి పాఱెడుపుణ్యపుటేఱులున్ బరి
స్రవదురునిర్ఘరంబు లగుశైలములున్ వనభూములున్ బుధ
ప్రవరసమాగమంబులుఁ బరాశరసూను నిబద్ధశాస్త్రవాక్
శ్రవణముఁ గల్గ నెక్కడిపిశాచము దీమరుడున్ గృశాంగులున్.

17


చ.

తరుణి యనంగ మారునిప్రధానశరం బది భగ్నమైనఁ ద
త్పరికరముల్ సుధాంశుఁడు గదంబవనాగతకోమలానిలాం
కురములుఁ జంద్రికానిశలుఁ గోకిలకీరమధువ్రతంబులున్
బరువపుఁబువ్వుతోఁటలు నపార్థములైనవి గావె చూడఁగన్.

18


క.

కావున నన్నుం బనిపిన
వేవేగ విచారఘోరవిశిఖంబులఁ గాం
డీవి జయద్రథుఁ జంపిన
కైవడిఁ బరబలముఁ ద్రుంచి కాము జయింతున్.

19


క.

అని పల్కిన వస్తువిచా
రుని నాయితపడఁగఁ బంచి క్రోధుని భంజిం
ప నుపాయముఁ దలఁచి వివే
కనృపతి పణిహారిచేత క్షమఁ బిలిపింపన్.

20


వ.

అదియుం జనుదెంచు నప్పు డాత్మగతంబున.

21


క.

భ్రూకుటితరంగభీకరుఁ
డై కనలి పరుండు తప్ప నాడిన సుజనుం

డేకలకయుఁ బొందఁడు మరు
దాకంపితకంపవిరహితాబ్దియుఁ బోలెన్.

22


మ.

అలయంగా జగడింపకే మిగుల దేహంబెల్ల నొప్పింపకే
దలనొప్పేమియుఁ జెందకే హృదయసంతాపంబునం బొందకే
దలఁపంగా రిపుహింస మున్నగుననర్థవ్రాతముం జేరకే
చులకంగా విదళింతుఁ గోధునిఁ గడున్ జోద్యంబునే నూఱకే.

23


సీ.

క్షమ యిట్లు పల్కుచుఁ జనుదెంచి పణిహారి
                          విన్నవింపంగ వివేకవిభుని
సమ్ముఖంబై భక్తి సాగిలి దండప్ర
                          ణామంబుఁ గావించి స్వామి! నన్ను
నేయూడిగముఁ గొన నిప్పుడు పిలిపింప
                          నవధరించితి రన నాదరమునఁ
గూర్చుండ నియమించి క్రోధుని
                          భంజించుకొఱకునై పంపవలసి


గీ.

నిన్నుఁ బిలిపించినార మటన్న దేవ!
పంత మొక్కటి వినుము నీపాదమాన
యాహవంబున నామహామోహునైన
నుక్కడంగింతుఁ గ్రోధుఁ డేలెక్క నాకు.

24


ఉ.

కావున వేగ నద్దురితకారి నకారణ మధ్వరక్రియా
దేవతపశ్శ్రుతుల్ చెఱుపఁ ద్రిమ్మరుత్రిమ్మరిఁ గన్నులన్ వృథా
పావకకీలముల్ నిగుడుపాతకి నే ననిఁ గిట్టి చండికా
దేవి లులాయదానవు వధించినలీల వధింతుఁ గ్రోధునిన్.

25


వ.

అప్రయాసంబున వాని వధియించునుపాయంబును విచారించెద.

26


సీ.

క్రోధించునతనిఁ గన్గొని మందహాసకం
                          దళితవక్త్రంబుతో నిలుపవలయుఁ

గ్రూరభాషణముల రొదచేయునాతనిఁ
                          బరికించి కుశలోక్తిఁ బలుకవలయు
హెచ్చి చేపట్లకు వచ్చునాతని విలో
                          కించి ప్రార్ధనయుఁ గావించవలయు
మొత్తునాతనిఁ జూచి మున్నీటిదుష్కృత
                          ములు పోయె ననుచును దలఁపవలయు


గీ.

నకట! యీప్రాణి యవిదితాత్మకుఁడు గాన
దైవికమున మహావిపత్ప్రాప్తుఁడయ్యె
ననుచు దయచేయవలయు నిట్లైన వారి
యెదుట నిలువంగఁ గ్రోధుని కెన్నితలలు.

27


క.

కదనమునందును గ్రోధునిఁ
జదిపినఁ దము దామె మిగులు సదమదమై కూ
లుదురు పరుషతాహింసా
మదపైశున్యాభిమానమాత్సర్యాదుల్.

28


క.

అనవుడు నాక్షమఁ గడుమ
న్నన నాయితపడఁగ ననిపి నరపతి లోభుం
దునుమగఁ జాలినసంతో
షునిఁ బిలిపించుటయు వచ్చుచో నతఁడు మదిన్.

29


వ.

కృపణుల నుద్దేశించి కృపాపరాయణత్వంబున.

30


శా.

స్వేచ్ఛాలబ్ధము లైనవన్యఫలముల్ తృప్తాస్థగాఁ గల్గగా
నచ్ఛస్వాదుజలంబు వాహినులయం దవ్వారిగాఁ బాఱఁగాఁ
బ్రచ్ఛాయస్థలపల్లవప్రకరతల్పం బబ్బఁగా నేలయా
శాచ్ఛన్నుల్ ధనికాంగణంబులు వృథా సంతాపముం బొందఁగన్.

31


క.

ధనమృగతృష్ణార్ణవజల
మునఁ దిరుగ నిజప్రయత్నములు భగ్నములై

నను విఱుగఁడస్సి మూఢుఁడు
చెనఁటిమనసు వజ్రశిలలఁ జేసిరొ సుమ్మీ.

32


మ.

ధన మార్జింపుదు రార్జితంబయిన తర్ద్రవ్యంబు బేరంబుచేఁ
గొనసాగింపుదు వడ్డివాసివలనన్ గూర్తున్ మఱిం గొంతయం
చనిశోద్భూతమనోరథంబున ధనధ్యానంబుఁ గావించు న
య్యను మోహావృతుఁ బట్టి మ్రింగు నహహా! యాశాపిశాచం బిలన్.

33


చ.

వలయుధనంబుఁ గూర్పఁగ నవశ్యము నన్న వియోగనాశముల్
గలుగు నిజంబు దాని కటుగాన ఘటించిన సొమ్ము పోయినన్
గలఁగుట మంచిదో మొదటఁ గాంక్షయె లేక సదా సుఖస్థితిన్
మెలఁగుట మంచిదో కృపణ! నీమదిలోపల నిశ్చయింపుమా!

34


చ.

ముది మను తెల్లత్రాఁచు తనమూర్ధము మ్రింగెడి మృత్యుదేవి య
ప్పిదపఁ బరిగ్రహంబులను పెన్బులులుం దినఁ గాచుకొన్న వ
త్యదయత నిట్లెఱింగి కృపణా! ప్రమాదామృతవారిరాశిలో
విదిలిచికొమ్ము లోభపదవీపరిషిక్తరజఃపరంపరల్.

35


వ.

అని పల్కి వేత్రవతీపురస్సరంబుగా సంతోషుండు వివేకుసమ్ముఖంబై
సాగిలి మ్రొక్కిన మహారాజు నతని నత్యాదరంబునఁ దనసమీపంబునఁ
గూర్చుండ నియమించి భవదీయప్రభావం బెఱుంగుదు దుర్జయుండగు
లోభుని భంజింప నీచేతంగాని కాదు గావున వేగ నాయితపడి కాశికానగ
రంబునకుఁ బైనంబు గమ్మనిన సంతోషుండు మహాప్రసాదంబని బహు
ముఖంబుల సంచరింపుచు ముజ్జగంబుల నిర్జించుచు దేవద్విజాతివధ
బంధనలబ్ధవృద్ధి యగులోభరావణునికి దాశరథి నయ్యెదనని ప్రతిజ్ఞ పలికి
చనియె నంతట వినీతవేషుండగు నొక్కపురుషుండు వచ్చి విజయప్రయాణ
మంగళద్రవ్యంబు లన్నియు సమకూఱె మౌహూర్తికనివేదితంబైన
ముహుర్తంబును డగ్గరె నని విన్నవించి తదనుశాసనంబునఁ బ్రస్థానపట
హంబు వ్రేయించిన.

36

సీ.

కటితటీకటదానగంధభ్రమద్భృంగ
                          భీకరకరిఘటాబృంహితముల
భీషణవిద్వేషివేషియథోచిత
                          వేషఘోటకఘోరహేషితముల
ధనురాదివివిధాయుధధ్వజాధిష్ఠిత
                          నిష్ఠురస్యందననిస్వనముల
ఖడ్గమయూఖాంధకారితాశాముఖ
                          వీరభటప్రోద్భటారభటులఁ


గీ.

గాహళారవభేరిభాంకారములను
గంచుకివ్యూహభూరిహుంకారములను
బద్మజాండంబు బీటలు వారుచుండ
దళదశంబులు చక్రతీర్థంబు వెడలె.

37


క.

అప్పుడు వివేకనరపతి
ముప్పిరిగొను వేడ్క రత్నములటెక్కెములన్
విప్పగు రుచు లొగిఁ గుప్పలు
గప్పెడు రథరాజ మెక్కి కదలెడువేళన్.

38


చ.

వెరవరి సూతుఁ డిట్లను వివేకుని దేవర! చూచితే ధరన్
గొరిజెలు మోపి యోపవనఘోటకము ల్వడిఁ బారుచున్న వం
బరపథమం దమందరయ మందర ఘూర్ణితవార్నిధి ధ్వని
స్ఫురణరథంబు మ్రోయఁగ రజోవిసరం బెడతెవ్వకుండఁగన్.

39


క.

చేరువ నిదె కనుపట్టెను
వారాణసి సకలభువనపావనతటినీ
వారిప్రవాహనిర్మల
హారావృత యగుచుఁ జూడు మప్పురిసొబగున్.

40


శా.

ధారాయంత్రపరిస్ఫురజ్ఝరుల సత్కారాన్వితంబుల్ సుధా
గారంబుల్ శిఖరస్ఫురన్మణిపతాకంబుల్ మహాసౌధముల్



.

రారా నెంతయు నొప్పుచున్న వవిగో రాజేంద్ర! సౌదామనీ
రారజ్యద్ధవళాబ్దరాజిక్రియఁ దారావీథితో రాయుచున్.

41


క.

చంచలగరుదంచలమద
సంచరదళి సంచయాతిసంఛన్నదళో
దంచితసుమకంచుకితము
లెంచఁ గొలఁదిగాక మించె నివె పూఁదోఁటల్.

42


చ.

సురనదిఁ దోఁగి నీరజరజోభసితంబు ధరించిరాలు క్రొ
వ్విరుల శివార్చనల్ సలిపి వెంబడి వచ్చుమధువ్రతాళిఝం
కరణముచేతఁ బాడి లతికాభుజముల్ కదలంగ నాడెడున్
బరిసరపుష్పితోపవనబంధురమంధరగంధవాహముల్.

43


గీ.

విద్యకైవడి ముక్తికి విడిది యగుచు
నాత్మవిధమున నానందమైన యిచట
నున్నసర్వేశునౌదలపిన్నచంద్రు
నవ్వుచున్నది గంగ ఫేనములచేత.

44


సీ.

వీరు పో మనరాక విని భయభ్రాంతులై
                          కామాదులెల్లను గలఁగఁబాఱి
గుంపులు గుంపులు గూడుచు నున్నవా
                          రనిన వివేకుండ నతనిఁ జూచి
కానిమ్ము మనల మిక్కడఁ దేరు డిగ్గి య
                          య్యాదికేశవదేవునాలయంబు
చూత మీహరి పరంజ్యోతి యీకాశీలోఁ
                          బ్రాణము ల్విడుచు పుణ్యాత్ములెల్ల


గీ.

నితనిఁ గలియుదురని పెద్ద లెపుడుఁ జెప్పు
చుందురనిపల్కి కాంచనస్యందనంబు
డిగ్గి గుడి చొచ్చి యాదేవు డగ్గఱంగఁ
జని వివేకుండు ప్రణమిల్లి వినయమునను.

45

దండకము.

జయ జయ వినయానతేంద్రాది బృందారకశ్రేణి చూడామణీరాజి
నీరాజితోపాంత పాదద్వయాంభోజ రాజన్నఖద్యోత విద్యోతిత
స్వర్ణపీఠా నిరాఘాటమాయారుచి ద్వేషణాద్వైతవిభ్రాంతి సంతాన
సంతప్త వందారు సంసారనిద్రాపహారైకదక్షా దినాద్యక్ష నక్షత్ర
నాథార్క్ష విశ్వక్షమామండలోద్ధార వేళాకరాళోరుదంష్ట్రాగ్ర సంఘ
ట్టనా విస్ఫురచ్ఛైలసంఘాత మాపాణి సంవాహరోమాంచ వజ్జంఘ
మును పెనుఘనముల్ బలారాతి పంపంగ నేతెంచి వర్షంబు
లొప్పంగ మంద ల్చలింపంగ జాతానుకంపం గడుంజిత్రమౌ
లీలతో వేల గోవర్ధనచ్ఛత్రముం బట్టవే మట్టవే కాళియాహిస్ఫటల్
సగ్గుగా మ్రగ్గఁగాఁ గ్రోలవే పూతనాప్రాణముల్ శోణముల్ నీ
భుజాచక్రధారాళికిం గైటభాకుంఠకంఠాస్థిజాలంబు లాలెంబు నీకున్
జగత్కంటకచ్ఛేదముల్ వేదముల్ గానఁగాలేవు నీపాదముల్
హాటకాక్షానుజుం బట్టిబిట్టల్కఁ క్రొవ్వాడిగోళ్ళ న్వడిం జించి చెండా
డఁగాఁ బుట్టురక్తంపుఁబెన్నీటిలోఁ దెట్టువ ల్గట్ట నాదైత్యుప్రేవుల్
ప్రవాళంపుఁబ్రోవుల్వలె న్మించఁగాఁ జూచి గర్జించు నీపౌరుషో
త్కర్షముల్ హర్షము ల్చేసెఁగా దేవతాకోటికిన్ మాటికిన్ లోక
సంరక్షణార్ధంబు నీ విట్టిలీలావతారుండవౌ దింతియేకాక యాకా
రము ల్నీకు లేవో నిరాకార పాల్కడలి వెడలి యేతెంచి లక్ష్మీచకో
రాక్షి నీకంఠభాగంబున న్వైచు మాంగళ్యదామంబు నెత్తావి కేతెంచు
లేఁదేఁటిదాఁటుల్ భవన్నీలదేహాచ్ఛవిచ్ఛాదిదచ్ఛాయలై ఝుంక్రి
యై కానుమేయత్వముం బొందు గోవింద యాభక్తసందోహమున్
మోహనందేహముం బాపి భోధత్వముం జూపి రక్షించు మంచున్
బునర్నమ్రుఁడై.

46


క.

ఆకేశవుగుడి వెడలి వి
వేకుఁడు పటమంటపముఁ బ్రవేశించి మహా
నీకములు దారుకలిత
ప్రాకారములోన విడిసె బహుశిబిరములన్.

47

శా.

అంతం గుంకుమపంకపాటలిమతో నస్తాద్రిపై నిల్చె భా
స్వంతుం డిందుఁడు నింద్రగోపరుచిఁ బూర్వక్ష్మాధరం బెక్కె వా
రెంతేఁ జూడఁగ నొప్పినప్పుడు వివేకేశప్రతాపప్రభా
ప్రాంతంబందలి వెంటపంజువలెఁ దద్రాకాదినాంతంబునన్.

48


సీ.

మోహుపక్షమువారి మొగములపగిది నం
                          బోరుహవ్రాతఁలు ముచ్చముణిఁగె
వికసించెఁ దొగలు వివేకునిపక్షంబు
                          వారల చిత్తోత్సవంబుకరణి
మోహునిబంధుసమూహంబు కైవడిఁ
                          గోకసమూహంబు శోకమందెఁ
జెలఁగెఁ జకోరకములు వివేకక్షమా
                          ధవునినెయ్యంపుబంధువులపగిది


గీ.

ముదిసె నిశ మోహురాజ్యసంపద యనంగఁ
దెల్లవాఱె వివేకుని తెలివి యనఁగఁ
దొలఁగెఁ జుక్కలు మోహునిబల మనంగఁ
దరణి పొడిచె వివేకప్రతాప మనఁగ.

49


వ.

అప్పు డుభయపక్షంబులవారును యుద్ధసన్నద్ధు లగుటయు విష్ణుభక్తిమహా
దేవి శ్రద్ధం గనుంగొని నే నిట్టి బెట్టిదంబైన హింసాప్రయాససమరంబుఁ
జూడఁజాల సాలగ్రామం బనుభాగవతతీరంబునకుం జనియెద నీవిచ్చటి
వృత్తాంతంబంతయుఁ దెలిసివచ్చి పూసగ్రుచ్చినతెఱంగున నెఱింగించుమీ
యని నియోగించి కాశికాక్షేత్రంబు విడిచి శాంతితోడంగూడి విజయంబు
చేసె వివేకుండును భండనంబున మహామోహుని సపరివారంబుగా భంజిం
చినవెనుక శ్రద్ధాదేవి మోహాదిసహోదరహానిజనితచింతాపరవశత్వంబున.

50


క.

ఘనపవనాహతతరుఘ
ట్టనభవదావాగ్నిచే నడవి చెడుచందం

బున జ్ఞాతివైరమున హె
చ్చినకినుకం గులము చెడుట సిద్ధంబైనన్.

51


గీ.

అంత కంతకుఁ జెరిగెడు నాత్మలోన
నారదు వివేకజలదసహస్రములను
నకట! దుర్వారదారుణంబైనయట్టి
సోదరవధావ్యసనసంభవోరువహ్ని.

52


మ.

నదులైనన్ గిరులైన వారినిధులైనం బొంద విధ్వంసమున్
బదిలం బేమియు లేనియీతృణకణప్రాయుల్ ఘనంబౌ కృధా
స్పదమై త్రిమ్మరుమృత్యుదేవతకు లక్ష్యంబే యిటౌ టే నెఱుం
గుదు నైన న్మది బాంధవవ్యవసనదృగ్గోషంబుచే నేఁగెడిన్.

53


చ.

కఱుకులు దుష్టవర్తనులు కామమదాదు లశౌచ్యు లౌట నే
నెఱిఁగినఁ దోడఁబుట్టు లని యీమమకారదురంతదుఃఖపుం
జుఱజుఱ యంతరాత్మఁ జుఱుచూడ్కులు చూడెడి మర్మసంధులన్
బెఱికెడి దేహశోషకరనిర్భరకీలలఁ బ్రజ్వలింపుచున్.

54


క.

శ్రీవిష్ణుభక్తిఁ జూడక
యీవగ పాఱదని తలఁచి యేగెను శ్రద్ధా
దేవత సాలగ్రామ
గ్రావాంతికచక్రతీర్థరాజంబునకున్.

55


సీ.

చనుచుండ నచ్చోట సకలసంయమిసేవ్య
                          మాన యయ్యును ఖిన్నమాన యైన
శ్రీవిష్ణుభక్తి నీక్షించి శాంతివధూటి
                          దేవి! యిదేమి నీదివ్యచిత్త
మున విచారము పుట్టెనన విష్ణుభక్తి యి
                          ట్లను శాంతితోడ నాహవమునందు
బలవంతుఁ డగుమోహువలన వివేకున
                          కేమయ్యెనో యని యెఱుఁగ లేక

గీ.

తలఁకుచున్నా ననఁగ దేవితలఁపునందు
నిట్టిదయ గల్గఁగా వివేకేశ్వరునకుఁ
గాలు ములు గాఁడునే సదా మేలె గాక
వెఱపు వలదన శాంతితో విష్ణుభక్తి.

56


క.

తనవారలయభ్యుదయము
తనకన్నారఁ గను గన్న దాఁకను హృదయం
బనిశంబు నపాయాశం
కను దామరపాకునీరుగతిఁ దల్లడిలున్.

57


వ.

విశేషించి శ్రద్ధాదేవిరాక తడవగుటంజేసి డెందంబు గుందుచున్నదని
పల్కుచున్నంత నావిష్ణుభక్తిమహాదేవిన్ డగ్గఱి శ్రద్ధావధూటి సాష్టాంగ
దండప్రణామంబు గావించి యద్దేవి యడుగం దనసేమం బెఱింగించి
తనకూఁతురు శాంతి మ్రొక్కినఁ గౌఁగిలించి విష్ణుభక్తిమహాదేవిసమ్ము
ఖంబున నిలువ నద్దేవి శ్రద్ధాంగనా! యుద్ధవృత్తాంతం బెఱింగింపు మనిన
బద్ధాంజలియై శుద్ధబుద్ధస్వరూపిణి నగు నీతో విరుద్ధపడు దురాత్ములకుఁ
దగిన యట్లయ్యె నవ్విధంబు సవిస్తరింబుగా విన్నవించెద నీవు హింసా
ప్రయాససమరంబు చూడఁజాలక యిచ్చటికి విచ్చేసినవెనుక బలబల
వేగుటయు నుభయపక్షంబులం గలబలంబులు విజయఘోషణాహూయ
మానానేకవీరభటసింహనాదబధిరితరోధోంతరంబును బృథులరథ
తురగఖురఖండితభూమండలోద్ధూతధూళిధూసరితభాస్కరంబును
సముత్తాలకర్ణతాళస్ఫాలనోచ్చలత్సమదకరికుంభసిందూరసంధ్యాయ
మానదశదిశాముఖంబును బ్రళయజలధీరధ్యానభీషణపటహఘోషణం
బునుగా మోహరించునప్పుడు వివేకమహారాజు మోహునికడకు నైయా
యికదర్శనంబు రాయబారంబు పంపినం జని యిట్లనియె.

58


శా.

ఈకాశీముఖదివ్యతీర్థముల వాహిన్యద్రిసీమంబులన్
శ్రీకాంతారమణాలయంబుల శివక్షేత్రంబులన్ బుణ్యసు
శ్లోకస్వాంతములందు నుండక పో కాలుం డట్లు పోకుండినన్
మీకాయంబుల మాంసఖండము లనిన్ మెక్కున్ బిశాచావళుల్.

59

సీ.

అనుచు నైయాయికుం డాడుమాటలు విని
                          కోపించి మోహుండు కుటిలనిటల
పటునటత్భ్రుకుటియై తటతటను గటము
                          లదరంగ నీదుర్ణయంబు ఫలము
లనుభవించు వివేకుఁ డంచుఁ భాషండశా
                          స్త్రంబుల నర్థశాస్త్రములమీఁదఁ
బంపువెట్టిన మనపౌఁజులముందు
                          నిలిచె సరస్వతి జలజహస్త


గీ.

యగుఁచు వేదపురాణేతిహాసతర్క
శాస్త్రములు శైవవైష్ణవసౌరముఖ్య
బహువిధాగమజాలంబు బలిసికొలువ
నిర్మలాంగంబు పండువెన్నెలలు గాయ.

60


శా.

ఆవాణీసతియగ్రభాగమున సాంఖ్యన్యాయకాణాదభా
ష్యావళ్యావృతపార్మ్వ యై దశశతన్యాయస్ఫురద్భాహ యై
తా వేదత్రయలోచనత్రితయ యై ధర్మాస్య యై సంగర
క్ష్మావిక్రీడకు వచ్చె దుర్గవలె మీమాంసామహాదేవియున్.

61


ఆ.

అనిన శాంతి పలికె నమ్మ! యీతర్కాగ
మంబు లొకటి కొకటి మచ్చరించు
చుండు నెపుడు నిప్పు డొక్కటై యుండుట
యెట్టు చెప్పు మనినఁ బట్టి! వినుము.

62


క.

తమలోన నొంటకుండిన
సమసంభవు లైనవారు శత్రులయెడలన్
సమయము గూడుదు రెదిరికిఁ
దమగు ట్టిచ్చుట శుభప్రదముగా దగుటన్.

63


గీ.

కాన వేదప్రసూతంబు లైనశాస్త్ర
సంచయంబులు వేదరక్షణముకొఱకు

నాస్తికులు గెల్వ నొక్కటౌ నాగమములు
తత్త్వమే చెప్పుఁగాన భేదంబు లేదు.

64


శా.

తత్త్వం బవ్యయ మచ్యుతం బమల మద్వంద్వం బనాకార మా
తత్త్వంబే గుణయుక్తమైన హరిరుద్రబ్రహ్మముఖ్యాఖ్యమౌఁ
దత్త్వార్థం బిది వేఱె చెప్పు బహుశాస్త్రప్రోక్తమార్గంబు
తత్త్వం బందె యడంగుఁ జూడగ సముద్రం బందు నేర్లుం బలెన్.

65


వ.

అప్పుడు.

66


క.

కరిఁ గరి హరి హరి నరదం
బరదము భటు భటుఁడుఁ దాఁకి యయ్యిరుమొనలన్
సరిఁ బోరిరి శరముద్గర
కరవాలప్రముఖశస్త్రఘట్టన మమరన్.

67


మహాస్రగ్ధర.

ప్రవహించెన్ సైనికాళీపలలనికరముల్ పంకము ల్గా మధేభ
ప్రవరోత్తుంగాంగశైలప్రకరహతరయాపాండురచ్ఛత్రిపంక్తుల్
కవలై క్రీడించుచక్రాంగములగములుగాఁ గంకముల్ రంకముల్ గా
వివిధాస్త్రచ్ఛిన్నభిన్నద్విషదవయవజోద్వృత్తరక్తస్రవంతుల్.

68


వ.

ఏతాదృశరుధిరప్రవాహావగాహకౌతూహలవిహితకోలహలవాచాల
భూతభేతాళవిహరణకారణంబును ఖడ్గఖడ్గసంప్రహరణస్పురస్ఫుట
విస్ఫులింగాలింగితపతంగకిరణంబును విశంకటకిరీటఘటితవీరవర
శిరఃకరోటిమస్తిష్కశోషకస్యేనపటుత్రోటికోటివిరచితమణివికర
ణంబును భూతనాథాంగీకృతనూతనకపాలమాలికాభరణంబును నైన
మహారణంబున మహామోహుపంపున నెరజార నేయుపాషండాగమంబులకు
నగ్రేసరం బైనచార్వాకతంత్రంబు కాలుమట్లనె పోయె ఖండితపాషండా
గమంబులై విజృంభించుచుండుననియు సదాగమంబులఢాకకుం గాక

సాగరతీరపారసీకమగధాంగవంగకళింగాదికమ్లేచ్ఛప్రాయదేశంబులఁ
బవేశించె దిగంబరకాపాలికాదులు పామరబహుళానూనమాళవాభీరములం
దాఁగె న్యాయసముదాయావయవమాంసకలితయైన మీమాంసచేత విధ్వం
సితంబు లైననాస్తికతర్కంబులు దిగంబరకాపాలికులు పోయిన
త్రోవనె పోయె నంతట వస్తువిచారుండు భీమవిక్రమంబునఁ గాముని
నామం బడంచె క్రమావధూటి క్రోధపారుష్యహింసాదుల గీ టడంచె సం
తోషుండు లోభతృష్ణాదైన్యానృతవాదస్తేయపరిగ్రహంబుల నిగ్రహించె
ననసూయ మాత్సర్యంబు నుత్సార్యఁ జేసె హర్షిత్కర్షభావన మదంబును
సదమదంబు గావించె నప్పుడు వివేకమహారాజు జయలక్ష్మిపరిష్వంగపుల
కితాంగుండై మంగళతూర్యంబులు చెలంగ వందిసందోహప్రశంసంబులు
గ్రందుకొనఁ బరమానందంబునఁ గాశికానగరంబు బ్రవేశించె నని
విన్నవించిన.

69


చ.

ఋభుగిరిధీర శశ్వదురరీకృతబాంధవపక్షపాత ధీ
నిభవిభవాభిరామ ధరణీతరణీపరిణీతబాహ ది
క్ప్రభుసభికాభివర్ణితశుభప్రదశోభియశఃప్రభావ సౌ
రభవిభవాభియాతివిభురాజ్యరమాధికభాగ్యభూషితా.

70


క.

ప్రఖ్యాతనాచికేతూ
పాఖ్యానమహాప్రబంధపరిమళితసుధీ
వ్యాఖ్యానశ్రవణోదిత
సౌఖ్యా సంఘటితచిత్తశంకరసఖ్యా.

71


భుజంగప్రయాతము.

నయప్రాప్తితోత్తేజన ప్రౌఢశౌర్యో
దయోద్ధూతవిద్వేషిధాత్రీభుజంగ
ప్రయాతావధిక్ష్మాధరస్థాపితోద్య
జ్జయస్తంభసంభారిజంధారిభోగా.

72

గద్య. ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాదలబ్ధసారస్వ
తాభినంది నంది సింగయామాత్యపుత్ర మల్లయమనీషి
తల్లజ మలయమారుతాభిధాన ఘంటానాగయ
ప్రధాన తనయ సింగయకవిపుంగవ ప్రణీ
తంబైన ప్రబోధచంద్రోదయంబను మహా
కావ్యంబునందుఁ జతుర్థాశ్వాసము.

  1. ఇది యొకప్రతియం దున్నది. ప్రక్షిప్తమయి యుండును.
  2. ఇది యొకప్రతిలోనే యున్నది. ప్రక్షిప్త మని తోఁచుచున్నది.