Jump to content

ప్రబోధచంద్రోదయము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

ప్రబోధచంద్రోదయము

పంచమాశ్వాసము

క.

శ్రీరమణీరమణీయవి
హారసుధాపూర హారహరహసితయశో
ధారాకుధరపటువ్యా
హారవిజిత గంగమం త్ర్యనంతయ గంగా!

1


వ.

అవధరింపు మిట్లు విన్నవించిన శ్రద్ధావధూటిం గనుంగొని విష్ణుభక్తిమహా
దేవి నీవలనం గామక్రోధాదులపరాజయంబు విని సంతోషం బింతంత
యని చెప్పరాదు మనంబున నొక్కసందేహం బున్నది మహాహనంబున
మోహుం డేమి యయ్యె ననిన సర్వేశ్వరీ దూరదృష్టి దూరశ్రవణంబులు
మొదలయిన యోగోపవర్గంబులుం దాను నెక్కడ నడంగెనో కాని యడ
పొడ గనరాడనిన విష్ణుభక్తి చింతానుషక్తస్వాంతయై యిది యొక్కటి
మిక్కిలిం గొఱగామి యయ్యెనని యిట్లనియె.

2


క.

కేళ్లంగి వేసిన ట్లా
త్రుళ్ళడమున మోహుఁ బట్టి తునుమాడక యీ
పిల్లలఁ దునుముట కూఁకటి
వ్రేళ్ళుండన్ ముసిఁడికొసలు విఱచుటగాదే.

3


గీ.

దండి గల్గిన బుద్ధిమంతుండు దనకు
బలిమి కలిమియుఁ గొనసాగవలసెనేని
శత్రువు ఋణంబుఁ జిచ్చు నెచ్చరికతోడఁ
గడమవెట్టక కడముట్ట నడఁపవలయు.

4


చ.

అతఁడును బుత్రపౌత్రవిలయంబునఁ బుట్టినశోకవహ్నిచే
వెతవడి ప్రాణముల్ విడువ వేఁడుచునుండె నటన్న వానికిన్

మతి నిజ మయ్యెనేని మనమన్కిత మంతయుఁ దీరు నాత్మకున్
గుతిలము మాను నాఖలునకు స్మృతి గల్గదు గాని యేమిటన్.

5


ఆ.

అనిన శ్రద్ధ పల్కె నావిష్ణుభక్తితో
దేవి నీదృఢప్రతిజ్ఞవలనఁ
జయ్యనన ప్రబోధచంద్రోదయం బగు
మనసు తనువుతోడ మనఁగలేదు.

6


క.

అని విష్ణుభక్తియు మనం
బునకున్ వైరాగ్యమహిమ పుట్టించుటకున్
బనిచిన వ్యాససరస్వతి
చను నపు డామనసు శోకసంతాపమునన్.

7


సీ.

హా! కామరాగమదాది పుత్రకులార
                          కానరారేల నాకూనలార!
కడుపు చుమ్మలు చుట్టఁగా నెట్లు నే నిర్వ
                          హించెద నను నూఱడించరయ్య!
హా! యసూయాదికన్యకలార! న న్ననా
                          థను విడిచి యిట్లు పోజనునె మీకు
నక్కటా! హింసాదులైన కోడండ్రార!
                          యెక్కడ నున్నారు దిక్కు నాకు


గీ.

నేది యేదితి మిమ్ముల నిన్నినాళ్ళు
పాపకర్మపుదైవ మీపగిది మిమ్ము
నొక్కరుని జిక్కకుండఁగ నుక్కడంచె
బాపురే నాదురంతదౌర్భాగ్యమహిమ.

8


చ.

విసమువిధాన నెక్కుడు వివేకముఁ జూపుచుఁ బ్రాణమారుత
గ్రసనము చేయుచున్ దనువు రాచుచు మర్మవిభేది వేదనన్
వెసఁ గలిగింపుచుం దనువు వేఁదుఱు గొల్పెడి శోకసంజ్వరం
బసదృశభంగినంచు మన సాతురతంబడి మూర్ఛ చెందినన్.

9

గీ.

చేరి సంకల్పుఁ డప్పుడు సేదదేర్ప
హృదయవల్లభయైన ప్రవృత్తి యెందుఁ
బోయెనో యన నద్దేవి పుత్రశోక
జనితవేదన నెదపడి సమసె ననిన.

10


మ.

కలకంఠీ! ననుఁ బాసి నీ వెఱుఁగ వేకాలంబు నే నిన్నుఁ బా
సి లయంబందినయట్ల యుందు విధిదుశ్చేష్టాప్రభావంబునన్
నలినాక్షీ! నినుఁ బాసియున్ బ్రతుకుచున్నాఁడన్ గదా ప్రాణముల్
బలవంతంబు లటంచు నమ్మనసు నేలం దెళ్ళి మూర్ఛిల్లినన్.

11


మ.

చతురత్వంబున సేదదేర్ప మన సాసంకల్పుతో నాకు నీ
హితముం జేయుము నీహితత్వమున నింకే "నుష్ట ముష్ణేణ శా
మ్యతి" యన్ మాట నిజంబుగా హృదయశోకాగ్నిం జితిజ్వాలికా
ప్రతతిన్ మానుపుకొందు నంచుఁ జితిఁ బేర్పంబంచె సంకల్పునిన్.

12


క.

అంతట డగ్గఱి యావే
దాంతసరస్వతి మనంబు నడలింపుచుఁ బ్రా
ణాంతవ్యవసాయం బిది
యింతులకుంగాక నీకు నెన్నికయగునే!

13


క.

భావంబు లనిత్యము లని
యీ వెఱుఁగవె? వినవె పెక్కు లితిహాసపురా
ణావళులు పుట్టువునకుం
జీవునకును లంకెయను విచారము వలదే.

14


మ.

శతకల్పాయువులైన పంకజభవుల్ శక్రాదిదిక్పాలకుల్
దితిజుల్ దివ్యమునీశ్వరుల్ వసువు లద్రిక్షోణివారాసులున్
శతకోటుల్ చనఁ బాంచభౌతికము పంచత్వంబునం బొందు ట
ద్భుతమే బుద్బద మంబులం గలియదే దుఃఖింపఁగా నేటికిన్.

15


క.

లోకంబు లనిత్యములను
లోకాంతరమైన తెలివిలో నిలుపదగున్

శోకము నిత్యానిత్యవి
వేకుల చిత్తములఁ జేర వెఱచున్ మనసా!

16


క.

ఏకము నిత్యము బ్రహ్మము
వైకల్పితవికృతు లున్న వస్తువు లెల్లన్
ఏకత్వ మెఱుఁగువారికి
శోకము మోహంబు లేదు సుమ్మీ మనసా!

17


క.

మనసు సరస్వతిఁ గనుఁగొని
జననీ! నామనసు శోకసంతాపమునన్
బొనుఁగుపడి వివేకమునకుఁ
గొనఁగొఱయై చాల నూలుకొనదని పలుకన్.

18


గీ.

వాణి యతనిఁ జూచి వత్స! యీవిభ్రాంతి
నీకె కాదు కలదు నిఖిలమునకు
స్నేహదోష మధికమోహంబు పుట్టించు
మోహమే యనర్థమూల మరయ.

19


శా.

క్లేశప్రాయబహుప్రియోరువిషవల్లీబీజముల్ విత్తఁగా
నాశాస్నేహమయాంకురంబు లుదయంబౌ శోకవైశ్వానరా
వేశంబుల్ కొనసాగ నందుఁ బొడమున్ వేవేలు శాఖాశిఖల్
గా శోకద్రుమముల్ కుకూలహుతభుక్కల్పంబుచే దేహికిన్.

20


సీ.

అనవుడు మనసు వేదాంతశారదఁ జూచి
                          దేవి! నీ వెంత బోధించి తేని
శోకాగ్నిచేతఁ జీకాకైన కతమున
                          నెదను బ్రాణము ధరియింపఁ జాల
నంతకాలమున ని న్నవలోకనము చేయఁ
                          గంటిఁగా కిఁక నింతకంటే మేలు
కలుగునే యన వత్స! కాఁగాదు మరణప్ర
                          యత్నంబు పాపమయంబులైన

గీ.

నీపరిగ్రహములును ము న్నిపుడు మీఁద
మేలుచేయంగఁ గొఱగావు మీఁదు మిగుల
నధికదుఃఖంబు పుట్టించు నంతమొంది
వీనికై యేల జంతువుల్ వేఁగు నకట!

21


ఉ.

ఎక్కితి వెన్ని పర్వతము లేఱులు దాఁటితి వెన్ని దేశముల్
త్రొక్కితి వెన్ని చొచ్చితివి క్రూరవనస్థలు లెన్ని యాశతో
మ్రొక్కితి వెంద ఱర్థమదమూఢుల కీవు కుటుంబరక్షకై
యక్కట! యిన్నికష్టముల నొందియు రోయవు కాఁపురంబుపైన్.

22


చ.

అనవుడు నాసరస్వతికి నమ్మన సిట్లను దేవి! యాన తి
చ్చినవిధమంతయుం దలఁప సిద్ధమయైనఁ దనందుఁ బుట్టి లా
లనమును బొందుచున్ హృదయలగ్నత నుండెడువారు లేకపో
యిన వెత ప్రాణమారుతము లేగినకంటెను దుస్సహం బిలన్.

23


ఆ.

అని శారదాంబ మనసుఁ గనుంగొని
పట్టి మమత యింతపట్టు చేసెఁ
బెంచినట్టికోడిఁ బిల్లి భక్షించినఁ
జెందువగపు పిచ్చుకందుఁ గలదె?

24


ఉ.

కాన ననర్థమూల మగు కాలిన నీమమతావికారమున్
మానుట యేల దేహజననక్రియలన్ దముఁదామె చంపుచున్
బ్రాణులుకొన్ని పుర్వుల నపత్యము పేరిడి తద్వియోగశో
కానలదగ్ధు లౌదు రహహా! యివి యెక్కడి మోహబంధముల్?

25


వ.

అనవుడు న్మనంబు వ్యాససరస్వతి గనుంగొని దేవీ! నీయానతిచ్చినట్ల
తప్పదైనను మమకారగ్రంధి దురుచ్ఛేదంబై యున్నయది వినుము.

26


క.

విడువని యభ్యసనంబున
వడియెక్కిన స్నేహసూత్రవల్లులఁ బెనుపం
బడిన ఘనమోహపాశము
విడిపించుకొనంగ లేక వేఁగెద ననినన్.

27

ఉ.

సాటువయైన త్రోవ మనసా! విను మున్ను భవాంబురాశిలోఁ
గోటులసంఖ్యలైన జనకుల్ జననుల్ బహుథా తనూభవుల్
గాటపు బుట్టువొందరు పొకాలరు వీరలసంగమంబు మి
థ్యౌట పొరింబొరిం దలఁపుమా! కృతకృత్యుఁడ వయ్యె దిత్తఱిన్.

28


గీ.

జనని భవదీయవదనేందుజనితమైన
యమలబోధోపదేశవాక్యామృతములఁ
గడుగఁబడియును దనజాడ విడువలేక
మఱియు నామది శోకాగ్ని మలినమయ్యె.

29


క.

అటుగాక మిక్కిలిని సం
కట పఱపుచు నున్నయావగపుం డిఁక నే
మిట మాను నానతిమ్మనఁ
బటుకృప నమ్మనసుతోడ భారతి పల్కెన్.

30


ఆ.

ఏటుపోటు వ్రేటు నేమియులేక మ
ర్మములు సెలలు వాఱి మాననట్టి
భీకరంబులైన శోకవ్రణంబుల
కౌషధం బచింతయండ్రు బుధులు.

31


సీ.

తల్లి! వేదాంతశాస్త్రసరస్వతీదేవి!
                          మనసు నాకేమిట మట్టుపడక
మాటికి మాటికి మారుతాహతఘన
                          ప్రచ్ఛన్నచంద్రబింబంబు పోలెఁ
జింతాపరంపరఁ జిక్కుజీ రయ్యెడు
                          విను వత్స! మానసవికృతి యొక
శాంతతత్త్వంబు లక్ష్యంబు చేసినఁ గాని
                          మానదు తల్లక్ష్యమర్మ మరయ

గీ.

నతిరహస్యంబు చెప్ప రా దన్యజనుల
కైనఁ గానిమ్ము నీవు శోకాతురుండ
వగుట నుపదేశ మిచ్చెద నది యెఱింగి
నిండుమనమున నిల్పి ధన్యుండ వగుము.

32


లయగ్రాహి.

నందకధరున్ ఘనపురందరమణిప్రతిము నిందిరమనోహరు ముకుందు హరిఁ గానీ
చందనమరాళబిసకుందధవళాంగు గిరిమందిరు నుమారమణు నిందుధరుఁ గానీ
పొందుగ సదా మససునం దలఁచియైనఁ జిర మంద మగుతత్పరముని దలఁచియైనం
డెందములు పాపములు వడిం దొలఁగు ఘర్మమునఁ గుంది మడుగుం దదయ డిందుపడులీలన్.

33


వ.

తత్పరమబ్రహ్మానందసాధనంబులైన యంతర్లక్ష్యంబులు బహిర్లక్ష్యం
బులు ననేకవిధంబులు గలవు. వానిలోని కొన్నియుత్తమంబుల నెఱిం
గించెద మూలాధారంబున మొలచి షట్చక్రంబులఁ జించుకొని పెడతెరు
వున వెడలి నిజశిఖాసంస్పర్శనంబునం గరంగిన చంద్రమండలసుధా
ధారలు తదాధారాలవాలంబు నిండుచుండ నెడతెగని యెలమిం బెరుగ
నాపరంజ్యోతిర్లతిక భావించుటయు హృదయకమలంబున నీవారశూక
తనుతరంబై కనుపట్టు తేజంబను సువర్ణశలాకయందు భావనరత్నంబు
గ్రుచ్చుటయు సహస్రదళకమలాంతరస్థితపరమాకాశంబుఁ దలంచు
నప్పుడు పొడము ననాహతనాదంబు వినుటయు వెండియుఁ బురుషుఁడుం
జెలువయుంగాని యనంతకోటిసూర్యాగ్నిచంద్రుల మించు తేజంబును
బరిపూర్ణంబుగా సంస్మరించుటయు దృశ్యంబులన్నియు శూన్యంబులుగాఁ
దలంచుటయు నిందులో నొక్కమార్గంబునం బడినఁ జాలు నతండ పర
మేశ్వరుండు జిహ్వజిడ్డంటనికైవడి సంసారదోషంబు లతనిఁ బొరయవని
సకలనిష్కళతత్వస్వరూపంబు తెలిపిన మనం బూఱడిల్లి కృతార్థుండ
నైతినని సరస్వతీదేవిపాదంబుల కెరఁగి నిల్చినం జూచి యద్దేవి వత్సా!

యిప్పుడు నీహృదయం బుపదేశక్షమంబయ్యె నటుగావున నింక నొక్కటి
చెప్పెద.

34


ఆ.

జడున కీయసారసంసారవిభ్రాంతి
కతనఁ దల్లిఁ దండ్రి సతుల సుతులం
గడచు టధికదుఃఖకారణము వివేక
ఘనున కిది విరక్తికారణంబు.

35


మ.

అన వైరాగ్యుఁడు వచ్చె నిట్లనుచు నీలాంభోజపత్రంబు క
న్నను సూక్ష్మంబగుతోలు మేన నిటు లంటంజేసెఁగా కంబుజా
సనుఁ డీచందము గాకయున్న సతతస్రావ్యస్వమాంసంబు గై
కొనఁ బైమూఁగినఁ దోలవచ్చునె శివాఘూకోగ్రకాకంబులన్.

36


మ.

ధన ముద్యన్నిధనంబు దేహము విపత్సంతానగేహంబు భా
మనితాంతంబు ననర్థసేమవిషయోన్మోదంబు భేదంబు గ
న్గొన లోకంబున శోక మిట్లెఱిఁగి నూల్కోలేరు ప్రాణు ల్కటా!
యనవద్యాత్మసమేధమానసుఖపద్యాహృద్యసంచారముల్.

37


సీ.

అని వచింపుచుఁ జేరఁ జనుదెంచు వైరాగ్యుఁ
                          గని భారతీదేవి మనసుతోడ
వత్స! నీతనయుండు వైరాగ్యుఁ డేతెంచె
                          నితని సంభావింపు మిప్పు డనిన
మన సాసరస్వతిమాటకు హర్షించి
                          కదిసి మ్రొక్కినసుతుఁ గౌఁగిలించి
పుత్రక! నీవు మున్ పుట్టినప్పుడె నన్ను
                          విడిచిపోవుటఁ జేసి వెడఁగనైతి


గీ.

నిన్నుఁ జూడంగ నిపుడు నానెమ్మనమున
నాటుకొనియున్న శోకచింతాభరంబు
ప్రొద్దుపొడుపునఁ జీకట్లుపోలె దొలఁగె
ననిన వైరాగ్యుఁ డిట్లను జనకుతోడ.

38

మత్తకోకిల.

త్రోవఁ బాంధులు పుష్కరంబునఁ దోయదంబులు వార్ధిలో
నావికుల్ సలిలప్రవాహమున న్నగంబులు కూడుచున్
బోవుచుండెడి కైవడిం బితృపుత్రబంధుల పోక స్వా
భావికం బని కోవిదుల్ మదిఁ బట్టుకొల్పరు శోకమున్.

39


మణిగణనికరము.

అనవుడు మనసున నతిముదమున న
వ్వనరుహభవనుని వనజవదనా
తనయునిపలుకు లితరమరయఁగ నా
మనసునఁ గలిగిన మమతయుఁ దొలఁగెన్.

40


శా.

ఆవిశ్రామపుఁదోఁటలో మధుసుగంధాంధీకృతాళివ్రజ
వ్యావల్గన్మలయానిలాంకురము లావామాక్షులం జూడ నేఁ
డావిర్భూతవివేక మార్జితతమం బైనట్టి నాబుద్ధికిన్
భావింప న్మృగతృష్ణికార్ణవసమప్రాయంబులై తోఁచెడున్.

41


వ.

అనవుడు వ్యాససరస్వతి మనసుం గనుంగొని గృహస్థున కొక్కముహుర్త
మాత్రంబైన నాశ్రమధర్మంబు విడిచియుండుట తగవుగాదు గావున
నీ విదిమొదలు నివృత్తింగూడి విహరింపుమనిన మనస్సు సిగ్గుపడి యను
మానించుట యెఱింగి పుత్రకా! యిట్టిగట్టి తెలివి గలిగిన సంసారయోగికి
దన కనుకూలయైనవనితం గూడి మెలంగుట ప్రబోధోదయంబునకుం
బ్రాఁతిగాని హానిగాదు. సకలాశ్రమంబులోన గృహస్థాశ్రమంబున భోగ
మోక్షంబులు సంపాదింపంజాలు నిది యెఱింగికదా సదాశివుం డుమాదేవి
తోడ నొక్కకుత్తికగా మనుచున్నవాఁడు వెన్నుం డిందిరాదేవికిం దన
డెందంబు మందిరంబు గావించి యానందంబునం బొందు నరవిందనంద
నుండు చదువులమచ్చెకంటి న్మెచ్చి మొగమిచ్చి యచ్చపుమచ్చికలం బొద
లెడు వీరికి మువ్వురికి నాదికారణంబైన పరమపురుషుఁడును జీవాత్మిక యైన
పరశక్తి ననురక్తిం గూడిమాడి వేడుకలం గ్రీడింపుచుండు నటుగావున
నీవు నిప్పుడు పొడమిన పరిజ్ఞానంబు పదిలపఱుపనోపు నివృత్తిమత్తకాశిని
సహధర్మచారిణిగా శమదమసంతోషాదికపుత్రు లుపచారంబులు సలుప
వివేకుండు భవదనుగ్రహంబున నుపనిషద్దేవిం బరిగ్రహించి యమనియ

మాదిమంత్రిరక్షితంబైన యౌవరాజ్యంబు పాలింప నిన్నూఱడింప విష్ణు
భక్తిచేతం బంపువడి వచ్చిన యీమైత్రి మొదలయిన చెల్లెండ్రు నలువు
రకుఁ గన్నులపండువుగా నాయుష్మంతుండవై సామ్రాజ్యంబు చేయుము
నీకు నీరీతి చిత్తస్వాస్థ్యంబు గలిగిన క్షేత్రజ్ఞుండును నిజప్రకృతిం గూడు
నది యెట్లంటేని.

42


సీ.

ఈవును బుత్రసమేతుండవైతేని
                          శాశ్వతుఁ డయ్యును నీశ్వరుండు
భవజరామరణాద్యుపప్లవంబులఁ బొంది
                          యుండఁ జూడంగ నిత్యుండుఁబోలె
నొక్కఁడ యయ్యును బెక్కులు బుద్ధిమం
                          తులలో ననేకమూర్తులు ధరించి
చాంచల్యమునఁ బొందు జలధివీచీతతిం
                          బ్రతిబింబితార్కబింబంబుఁ బోలె


గీ.

కొడుక! నీవు నివృత్తితోఁ గూడితేని
నిర్మలాదర్శలక్షితనీరజాప్త
బింబమును బోలి నిశ్చలత్వంబు నొంది
సంతతానందము వహించు నంతరాత్మ!

43


మ.

అని భోధించిన శారదారమణిపాదాంభోజయుగ్మంబుపై
మన సత్యంతకుతూహలంబునఁ బ్రణామంబు ల్ఘటింపంగ నా
వనజాతాసనురాణియున్ మనసుతో వత్సా! మృతజ్ఞాతిబం
ధునికాయంబున కీనదిం జలుపుమా తోడ్తో నివాపాంజలుల్.

44


వ.

అనవుడు నమ్మన సట్లు గావించె నిత్తెఱం గంతయు దివ్యచిత్తంబున
నెఱింగి విష్ణుభక్తిమహాదేవి శ్రద్ధం గనుంగొని శ్రద్ధాంగనా! మనమనికితం
బంతయుఁ బాసె నింక నీవు జీవమహారాజువద్దికిం జని యచ్చటం జేయ
వలసిన కృత్యంబు లనుసంధింపుచుండు మని పనిచి శాంతిం జూచి నీవు
వివేకునికడకుం జని యతనికిఁ బరిచారంబులు సలుపుము నేనును నతనికి

ననర్గళశ్రేయఃప్రాప్తి యగున ట్లనుగ్రహించెదనని పనిచిన సమీపంబునకుం
జనుదెంచి దండప్రమాణంబు గావించిన శాంతిం గనుంగొని వివేకుండు
సాదరభాషణంబుల నిట్లనియె.

45


చ.

ప్రియసతి నందనుల్ పొలియఁ బెద్దకుమారుఁడు మోహుఁ డేడనో
భయమున డాఁగఁగా మనసు భారతిసూక్తి విరక్తి గాంచి నీ
ర్ణయమతిఁ గేశపంచకపరాఙ్మఖుఁ డయ్యె నటౌటఁ జేసి య
వ్యయ మగుతత్త్వబోధమున కాత్మ సమీహ ఘటించుఁ గావుతన్.

46


గీ.

నీవు మత్ప్రియ నుపనిషన్నీరజాక్షి
వెదకి ప్రార్థన మొనరించి వేగ తోడి
తెమ్ము పొమ్మన్నఁ జనుచు నత్తెఱవ గనియె
శ్రద్ధఁ దమతల్లి మధ్యమార్గంబునందు.

47


క.

కని మ్రొక్కి తల్లి యెచటికిఁ
జనుదెంచెద వింతసంతసంబున నన్నున్
గనుఁగొనక సంభ్రమింపుచు
ననఁ బుత్రిని లెస్స యెఱిఁగి తౌనౌ వినుమా!

48


గీ.

మోహముఖదుష్టవర్గంబు ముడుఁగు పడియె
శమదమాదికశిష్టరక్షణము గలిగె
వశ్యపరివారుఁడై జగత్స్వామి యలరె
నింతకంటెను సంతోష మేది గలదు.

49


క.

జీవేశ్వరుండు జీవులు
కైవశమై మెలఁగ నతిసుఖస్థితి నుండం
గా వీక్షించిన నమృత
ప్లావిత మైనట్లుగాఁ దలంపరె పుత్రీ.

50


సీ.

అనవుడు శాంతి యిట్లనియెను మనసుపై
                          భక్తి జీవునకు నేపాటి గలదు

చెఱఁ బడ్డయతనికిఁ జెఱఁ బెట్టి నతనిపైఁ
                          గలభక్తి మనసుపైఁ గలదు పతికి
నెట్లైన జీవుండె యేలునో యీ రాజ్య
                          మౌ మనం బతనియం దడఁగెనేని
మఱి జీవభర్తకు మాయమీఁద ననుగ్ర
                          హము కొంత గలదె లే దది యనర్థ


గీ.

మూలమని దాని నిప్పుడు మూలముట్టు
గాఁగ జెఱిచెద నంచు నాగ్రహము చేయుఁ
గాని యట్లైన నిప్పు డేకరణి చెపుమ
రాజునడవడి యనిన నాశ్రద్ధ పలికె.

51


సీ.

అనుకూలభార్య నిత్యానిత్యచింత సు
                          హృత్తువైరాగ్యుండు హితజనములు
యమనియమాదు లత్యాసన్నవర్తులు
                          శమదమాదులు నుపచారసతులు
మైత్ర్యాదివనితలు మన్ననపాత్రమై
                          తిరుగుచుండెడి సహచరి ముముక్షు
బలసముచ్ఛేద్యాది బలములు మోహనసం
                          కల్పమమత్వసంగప్రభృతులు


గీ.

గాఁగ జీవేశ్వరుండు నిష్కంటకముగ
నేలుచున్నాఁడు సామ్రాజ్య మివ్విధమున
ననిన నాశాంతి సతికి నిట్లనియె జీవ
పురుషునకు ధర్మునకుఁ గొంత పొందు గలదె.

52


వ.

అనవుడు శ్రద్ధాంగన తనయనుంగుఁదనయ శాంతిం జూచి యిట్లనియె.
వైరాగ్యోదయం బైనది మొద లిహపరసుఖవిముఖుం డగుటంజేసి జీవపురు
షుండు నరకజననం బైనపాపంబునకు వెఱచినట్లు నశ్వరంబును బంధ
కారణంబును నగు పుణ్యంబునకు వెఱచుఁ దత్సుకృతకర్మంబును నిష్కా

మం బయ్యేనేని యెట్టకేలకు నించుకంత యంగీకరించు ధర్ముండును
జీవపురుషుండు ప్రత్యక్ప్రవణుం డగుట యెఱింగి తన్నుఁ గృతకృత్యుఁ
గా దలంచుకొని తనుదానె వదలువల్లయ్యె నన శాంతి తల్లింజూచి యింత
యును లెస్స యెఱింగించితివి నాఁడు యుద్ధమధ్యంబునఁ బరాజితుండై
యోగోపసర్గంబులుం దానును గూడ డాఁగిన మోహుం డేమి చేసె ననిన
శ్రద్ధాంగన తనకూఁతు శాంతి నవలోకించి యట్టిదురవస్థం బొంది మహా
మోహుండను దురాత్ముండు జీవపురుషుం డుపసర్గసక్తుండైన వివేకుండు
నుపనిషచ్చింత దొఱంగు నని నిశ్చయించి మధుమతింగూర్చి దూర
దృష్టి దూరశ్రవణంబులు మొదలైన యుపసర్గంబులం బనిచిన నవియును
జీవపురుషునియొద్దికిం జని యింద్రజాలవిద్యఁ జూపుటయుఁ దదనుభా
వంబునఁ.

53


సీ.

శతకోటియోజనశబ్దంబు లైనను
                          వీనుల కప్పుడె వినఁగవచ్చె
ధారుణీగర్భనిధానస్థలంబులు
                          కన్నుల కప్పుడె కానవచ్చె
నశ్రుతవ్యాఖ్యాన మాశుకవిత్వంబు
                          జిహ్వకు నప్పుడే చెప్పవచ్చే
నీలోకములలోన నెచ్చోటికైనను
                          నడుగుల కప్పుడె నడువవచ్చెఁ


గీ.

బరశరీరప్రవేశంబు జరపవచ్చె
స్త్రీల నాకర్షణమ్ములు చేయవచ్చెఁ
దలఁచినటువంటి రూపంబు దాల్పవచ్చె
బురుషున కదృశ్యరూపంబు పొందవచ్చె.

54


క.

ఆవేళన్ మది విదిత
స్థావాసకృతాభిమాను లగువేల్పులు దన్
సేవింపఁగ నమ్మధుమతి
జీవేశ్వరుఁ గదియు మాత్రఁ జిత్రము కాఁగన్.

55

కందగర్భితమణిగణనికరము

కలికి యొకతె యలకము లలిబలమున్
బలె నలిక తలముపయిఁ గడలుకొనన్
గలకల నగియెడు కనుఁగవతళుకుల్
తళతళ మెఱయఁగఁ దను బలుకుటయున్.

56


సీ.

పోవుచో నప్పు డప్పురుషుని యెదుటఁ గ
                          న్పట్టె సిద్ధాహ్వయపట్టణంబు
కనకసైకతరత్నకలహంససంసదా
                          నందితరమణీయనదులతోడ
మరకతచ్ఛాయకోమలదళప్రచ్ఛన్న
                          వాచాలశుకవనవాటితోడ
సౌధకక్ష్యాంతరసంచారపాంచాలికా
                          సమయువతిసంఘంబుతోడ


గీ.

సృమరహిమవారిధారాగృహములతోడ
భ్రమరసంకులకమలాకరములతోడ
విమలినవిధుకాంతమణికుట్టిమములతోడ
సమదమాయూరశైలకుట్టిమములతోడ.

57


వ.

అ ట్లతిమనోహరంబును నానారత్నమయంబునునై యింద్రచాపనిర్మితం
బునుం బోలెనున్న యప్పురంబు ప్రవేశించునప్పు డుప్పరిగల మీఁద నుండి
తనమీఁద నవ్వులుం బువ్వులుం జల్లు విద్యాధరపల్లవాధరలను హరి
వాణంబుల నిల్పిన రత్నంపుంగళుకులఁ గన్నులతళుకుల నివాళించుయక్ష
పద్మాననలను సరిలేనిరూపుల కోపుల నటించు నచ్చరమచ్చెకంటులను దమ
కోమలశరీరసంపదలం బొదలు వీణెలమేళనంబులు సమేళంబులు నెఱుపు
గంధర్వచందనగంధులను విలోకించుచు వివిఢవితానతోరణప్రసవ
మరందబిందుతుందిలేందిందిరం బైనరాజమందిరంబు ప్రవేశించె నంత.

58

సీ.

కంకణంబులు మ్రోయఁ గడిగెఁ బాదాబ్జంబు
                          లురుకుచంబులు గల యొకమిటారి
చెకచెక చెక్కుల యొకచకోరేక్షణ
                          కట్టాణిముత్యాలగద్దె నిలిపె
లీలఁ గర్పూరతాంబూల మర్పణఁ జేసె
                          వెకలిమాటల తోడి యొకపిసాళి
నకనక లైన నెన్నడల యొక్కలతాంగి
                          చొక్కపుఁజెంగల్వసురటి విసరె


గీ.

నిట్టిసంసారసుఖము చేపట్టె నాత్మ
మాయ మునుపటనే యిది మంచిదనియె
నంతకైనను మనసు తా ననుమతించి
యుబ్బి మున్నాడి సంకల్పుఁ డుత్సహించె.

59


క.

అన విని శాంతిమృగేక్షణ
జననీ జీవుం డసారసంసారసుఖం
బను వలఁ గ్రమ్మఱఁ జిక్కెనె
యనవుడు శ్రద్ధావధూటి యాత్మజతోడన్.

60


శా.

అంతన్ జీవుని పార్మ్వవర్తి యగుతర్కామాత్యుఁ డాయిద్దఱిన్
సంతప్తాయసఖండలోహితకటాక్షక్రూరుఁడై చూచి వీ
రెంతే కష్టమతుల్ సభాబ్దబకముల్ హేయంపుసంసారవి
భ్రాంతిజ్వాలల నిన్ను ద్రోయ నకటా భావింపలే వీశ్వరా!

61


క.

గాటపు సంసారాంబుధి
దాఁటం గైకొన్న యోగతరి విడిచి వృథా
యేటికి నీ వీనిప్పుల
యేటం బడెదన్న జీవుఁ డిది యేననుచున్.

62


ఉత్సాహ.

మేలుమేలు తర్క నన్ను మేలుకొల్పి యెంతయున్
మేలుచేసి తనుచు నతని మెచ్చిమెచ్చి పొగడుచున్

జాలుఁ జాలు నింక విషయసంగ మనుచు మధుపతిన్
జాల దిక్కరించె ననిన శాంతి సంతసంబునన్.

63


క.

జననీ నామదిలోపలి
మనికిత మంతయును బాసె మఱి యెచ్చటికిన్
జనియెద వన జీవేశ్వరుఁ
డనుపంగ వివేకుఁ బిల్వ నరిగెద ననినన్.

64


ఆ.

నన్ను నవ్వివేకనరనాథుఁ డుపనిష
త్తురుణిఁ బిల్వ నంపెఁ దల్లి నీవు
నతనిఁ బురుషునొద్ద కతివేగఁ దోతెమ్ము
తెత్తు నేను నుపనిషత్తు వెదకి.

65


క.

అని శాంతిశ్రద్ధలు తమ
పనులకుఁ జని రంత జీవపతి యాత్మగతం
బున విష్ణుభక్తిమహిమకు
నెనలేదని చొక్కి చొక్కి యిట్లని పలికెన్.

66


సీ.

అసదృశక్లేశోర్ము లన్నియు దాఁటితి
                          ధృఢమమత్వములను దెరలఁ బడక
తప్పించుకొంటి నుద్యత్క్రోధబాడబ
                          జ్వలనసముద్భటజ్వాలమునకు
విడిపించుకొంటి నక్కడకక్కడకు నడ్డ
                          పడెడి తృష్ణాలతాబంధనములు
పుత్రపౌత్రకళత్రమిత్రవక్రగ్రహ
                          మర్మగగ్రంథులు మాన్చుకొంటి


గీ.

ఘోరసంసారవారిధితీరమునకుఁ
జేరితిని గాన నింక నే సిలుగు లేదు
నాకు నొడగూడె నిర్భరానందలీల
బాపురే విష్ణుభక్తి కృపాగుణంబు.

67

వ.

అని పురుషుడు సంతోషించునవసరంబున వివేకమహారాజు శ్రద్ధాంగ
నాసమేతుండై చనుదెంచి జీవపురుషున కభివాదనంబు చేసిన నప్పురు
షుండు వివేకుం జూచి వత్సా! నీకు మేము మ్రొక్కందగుఁ గాని నీచేత
మ్రొక్కించుకొనుట తగదు. జ్ఞానవృద్ధుండవు నుపదేశకర్తవుంగాన మాకుఁ
బితృసమానుండవు. మున్ను ధర్మమార్గంబు మఱచి నష్టసంజ్ఞులైనవేల్పులు
తమతనయులచేత బోధితులైరి గావున నీవును బితృత్వంబు వహించుట
ధర్మంబని పురుషుండు వివేకుని బహుభంగులఁ బ్రస్తుతింపుచుండె నట
శాంతియు విష్ణుభక్తివలన ము న్నెఱింగినది గావున గోవిందమందిరంబైన
మందరగిరి కందరంబున శ్రీగీతమఱుంగునం దర్కవిద్యాభయభ్రాంతయై
యున్న యుపనిషత్తరుణి కడకుంజని తోడుకొని వచ్చుసమయంబున
నయ్యుపనిషత్తరుణి శాంతిం జూచి నెచ్చెలీ! యతండు నామచ్చిక నెల్లను
బొరపొచ్చెంబు చేసి నన్ను నిన్నిదినంబు లొల్లకుండె ననఁ దధావిధాపన్న గ
దంష్ట్రాంకురహస్రాంతకుహరంబునఁ జిక్కియున్న వివేకమహారాజు
నిట్లని దూఱం దగవు గాదనిన శాంతిం జూచి చెలియా! వివేకుని కడ్డంబు
లాడెదవుగాని నాపడ్డపా ట్లెఱుంగవుగదా యనుచు దైన్యభాషణంబుల
నిట్లనియె.

68


ఉత్సాహ.

కన్నకన్న ధూర్తులెల్లఁ గాసిపెట్టి దాసిఁగా
నన్ను నేల వలసి తివియు నలియు బాహుకటకముల్
చిన్నపోయె మణులు రాలెఁ జిక్కుపడియెఁ గురులు న
న్నిన్నినాళ్ళు నవ్వివేకుఁ డిట్లు తప్పు చేయుటన్.

69


సీ.

నావుడు నుపనిషద్దేవి కిట్లను శాంతి
                          తలఁప వివేకునితప్పు గాదు
కపటమహామోహఖలుఁడు ప్రబోధోద
                          యముఁ జూడఁజాలక యాత్మకామ
ముఖ్యవిఘ్నంబులు మొలపించి నిను వివే
                          కునిఁ బెడఁబాపి యఘోరదురిత

ఫలమునఁ దనుదానె భగ్నమై పోయె నీ
                          కోర్కు లన్నియు నొడఁగూడె నిపుడు


గీ.

నీవు నిలువంగ వలదిఁక నిట్టిపాట్ల
కోర్చి పతిమేలు గోరుచునుంటిగాన
నిన్నుఁ బోలంగఁ గులసతు లున్నవారె
కావున వివేకభూపాలుఁ గనుము మనుము.

70


క.

అన నుపనిషత్తు శాంతిం
గని యిట్లనె వినుము చెలియ గారవమున న
న్ననుపుచు భగవద్గీతా
వనిత రహస్యమున నొక్కవాక్యము చెప్పెన్.

71


క.

చని యేరికైన జీవుఁడు
పెనిమిటి యగు నవ్వివేకపృధివీశుఁడుఁ బ
ల్కినమాటలకు సదుత్తుర
మొనరింపఁ బ్రబోధచంద్రుఁ డుదయము నొందున్.

72


మానిని.

అంచుఁ గృపామతి నానతియిచ్చె వయస్యగతత్రసనై యెట్లుగా
గొంచక పెద్దలకుం బ్రతిమాటలు గొబ్బున నే నొనగూర్తు ననన్
జంచలలోచన శాంతి మహోపనిషత్సతి కిట్లను శారద వా
యించు విపంచి నటించుచు మించి రహించు మృదూక్తుల నింపొదవన్.

73


ఉ.

జీవునకున్ వివేకునకుఁ జెప్పెఁ జుమీ హరిభక్తి మున్ను
చే వివరంబుగా వినినఁ జిత్తములోపలిచిక్కు దీఱునం
చీవిధమెల్ల నీ వెఱిఁగి యింక వివేకున కాత్మకున్ మనో
భావకురాలవై మెలఁగి పాపుము వారల సంశయస్థితుల్.

74


ఆ.

అనిన నుపనిషత్తు నాత్ముని డగ్గఱి
వినతి చేయఁ జూచి వినయమునను

దల్లి! మేము చేయఁదగు నీకు నీనమ
స్కార మమలబోధకర్త్రి వగుట.

75


క.

దేవీ! నీకుం దల్లికి
భావింపఁగ నెంతవాసి భవబంధములన్
గావించుఁ దల్లిఁ ద్రుంతువు
నీ వీసుజ్ఞానబోధ నిశితకృపాణిన్.

76


తోటకము.

అని పల్క వివేకున కర్థిమహో
పనిషత్సతి మ్రొక్కి యుపాంతరభూ
మి నధిష్ఠితయైన నమేయకృపన్
గని జీవుఁడు పల్కె సకౌతుకుఁడై.

77


విద్యున్మాల.

అమ్మా! యిన్నా ళ్ళత్యంతాయా
సమ్ముం జెందన్ సచ్ఛన్నాకా
రమ్ముం జొప్పారంగా నెచ్చో
నెమ్మే నె మ్మొందున్ నీవుంటన్.

78


చ.

మఠముల రచ్చలన్ దివిజమందిరతీర్థతటంబులన్ వృథా
పఠరులఁ గూడియుండ బహువాసరముల్ చనె నన్నవారు నీ
కఠినతరార్థముల్ తెలియఁగాఁ గలదే యన లేరు వాదక
ర్మఠులు మదుక్తిచోళసతిమాటలకైవడి సంశయింపుచున్.

79


గీ.

వేదు లనుచుఁ బురాణార్థవేదు లనుచుఁ
వాదు లనుచును నద్వైతవాదు లనుచుఁ
బరధనాపేక్ష నూరక తిరుగువారు
కానఁగలరె మదీయార్ధగౌరవంబు.

80


సీ.

అంతటఁ గృష్ణాజినాజ్యసమిజ్జుహు
                          స్రువపాత్రపశ్విష్టిసోమముఖ్య
యాగపరీవారయజ్ఞవిద్యాదేవి

                          బహువిధపుస్తకభారసహిత
యై రాఁగఁ జూచి నాయర్థ మేపాటైన
                          నిది యెఱుంగనె యంచుఁ గదియ నరుగ
నది నన్నుఁ బూజించి యమ్మ! నీకెయ్యది
                          కోర్కి చెప్పు మటన్నఁ గొన్నినాళ్ళు


గీ.

న న్నిముడుకొమ్ము కరుణ ననాథ ననిన
నదియు నీకర్మ మేమని యడుగుటయును
దెలియ నిట్లంటి మంథానకలితసలిల
జలధిజనితసుధాసారచారుఫణితి.

81


ఉ.

ఎవ్వనియందు విశ్వ ముదయించు నడంగుఁ దలంప నిజ్జగం
బెవ్వనిదీప్తిఁ గానఁబడు నెవ్వనితేజము చిత్సుఖాత్మకం
బెవ్వనిఁ బుణ్యులెల్ల గుణియింపుచు ద్వైతతమంబుఁ బాసి తా
రెవ్వలనన్ భవంబునకు నేగరు వాని నుతింతు నక్రియన్.

82


వ.

అనవుడుఁ దన్నుం గనుంగొని యజ్ఞవిద్య సాక్షేపంబుగా నిట్లనియె.
మొదలు నక్రియుం డగుపురుషున కీశ్వరత్వం బెక్కడిది భవచ్ఛేదన
సామర్థ్యంబు సత్కర్మంబునకుం గలదు గాని వస్తువిచారంబు బుద్ధికి లేదు
గావున నతండు భవచ్ఛేదనకరంబు లైనసత్కర్మంబులు శాంతమన
స్కుండై చేసి నూఱేండ్లు బ్రతకవలయు నట్లు గావున నప్రయోజంబై న
నీమతంబు మా కసమ్మతంబు నీకుం గనుకఁ గొన్నిదినంబు లిచ్చట నుండఁ
దలంపు గలదేని కర్తయు భోక్తయునైన పురుషునిం బ్రశంసింపుచు నుండు
మని పలికె ననిన వివేకుండు వికవిక నవ్వి హోమధూమశ్యామలితనయన
యైన యజ్ఞవిద్య దుష్ప్రజ్ఞత్వంబునుం గుతర్కత్వంబును నేమని చెప్పెడిది
స్వభావంబున నచంచలంబగు లోహంబు దానచేతనం బయ్యుఁ జుంబక
పాషాణసన్నిధానంబునం గదలు కరణి నస్వతంత్ర యగుమాయ యీ
శ్వరదృష్టి ప్రేరితయై చేష్టించి జగంబులు కల్పించుచుండు నిట్టి యీశ్వ
రునిమహిమ తమోంధు లయినవారలు గానలేరు. కర్మంబులచేత నజ్ఞా

సమయసంసారంబు చెడుననుట చీకటిచేతఁ జీకటి చెడు ననుటగాదె
స్వభావవిలీనంబులుఁ దమోమయంబులు నైనజగంబు లెవ్వని తేజంబు
వలనం బ్రకాశించు నట్టి పరమపురుషు నెఱింగిన ధన్యుండు మృత్యువును
గెలుచు నిదియె తక్క భవభంధనధిక్కారియగు మార్గంబు వేఱొక్కటి
లే దనిన జీవపురుషుం డుపనిషత్తుం జూచి యజ్ఞవిద్య మఱియు నేమనియెం
జెప్పుమనిన.

83


తరళ.

వినుము తన్మఖవిద్య యిట్లను వింతగా ననుఁ జూచి యో
వనిత నీదగునట్టి దుస్సహవాసవాసన నాహితుల్
మనసులోపలఁ గర్మకాండము మానఁ జూచెద రింతటన్
జనుము నీ కనువైనచోటికిఁ జాలు నీ కెద మ్రొక్కెదన్.

84


క.

అంటను నచట వెడలి నేఁ
గంటిన్ మీమాంసఁ గర్మకాండ సహచరిన్
వెంట గుదియైన కర్మపుఁ
బంటల వేర్వేఱ నేరుపఱిచినదానిన్.

85


ఆ.

చూచి యజ్ఞవిద్యజోటి వేఁడినయట్లు
వేఁడ నదియు నన్ను వివరముగను
యజ్ఞవిద్య యడిగినట్ల న న్నడిగిన
నంటి దానితోడ నన్నయట్లు.

86


వ.

అపుడు.

87


సీ.

అప్పుడు మీమాంస యాత్మశిష్యులవద
                          నాంభోజములు గదియంగఁ జూచి
యీకాంతమాటలు లోకోత్తరఫలంబు
                          లనుభవింపఁగఁ జేయు నాత్మయట్లు
గానఁ గర్మోపయోగమున నిచ్చటనుండ
                          నిం డన నొకశిష్యుఁ డిచ్చగించె

నంతఁ గుమారిలుం డను హితశిష్యుండు
                          మీమాంసఁ జూచి యీకోమలాంగి


గీ.

పొగడ దుపయుక్తకర్మునిఁ బురుషు నెందుఁ
దానకర్తయు భోక్తయౌ వానిఁ గాని
యనిన మఱియొకప్రియశిష్యుఁ డనియె నొక్క
పురుషుఁడేకాక వేఱె యీశ్వరుడు గలఁడె.

88


క.

అనినఁ గుమారిలగురుఁ డి
ట్లను లౌకికపురుషుకంటె నపరుఁడు గలఁడా
యని పలుకంగా నేఁటికి
వినుమా! యని చెప్పఁదొడఁగె వివరము గాఁగన్.

89


ఉ.

ఆతఁడు చూచుచుండు జగదావళి చేష్టలు సర్వసాక్షియై
యీతఁడు మోహబద్ధుఁ డతఁ డిచ్చఁ గ్రియాఫలమానఁ జేయుఁ దా
నీతఁడు తత్ఫలంబు లతఁ డేలు శరీరుల నెల్ల నీతఁ డి
చ్ఛాతతకర్మశేషగతసంగుఁ డతం డతఁ డౌట యెట్లనన్.

90


క.

అన విని వివేకనరపతి
ఘనసంతోషాబ్ధిఁ దేలి కౌమారిలుఁడా
కని పలికితి వౌ నౌరా
మనుమా కల్పం బటంచు మఱియున్ మఱియున్.

91


భుజంగప్రయాతము.

సుపర్ణంబు లారెండు జోకై మహాపా
దపం బొక్క టందుండుఁ దత్పక్షులం దొ
క్కపక్షీశ్వరుం డాను గాంక్షన్ ఫలం బొ
క్క పక్షీశుఁ డొల్లండు కాంతి న్వెలుంగున్.

92


క.

అనినఁ బురుషుఁ డుపనిష
ద్వనితామణిఁ జూచి యిట్లు దైన్యంబున నీ

చనిన తెరు వెల్లఁ జెప్పుము
జననీ! యనఁ బలికె నుపనిషత్సతి మఱియున్.

93


సీ.

అంత మీమాంసచే ననిపించుకొని తర్క
                          విద్యలఁ బొడగంటి వివిధమతుల
నందు నొక్కత నిగ్రహచ్చలజాతీమ
                          న్న్యాయాలి చెవిదండ ననును జల్ప
మనఁ దాను బహువాదములు చేయు నొక్కతె
                          విశ్వవిశేషంబు విస్తరించు
నొకతె పురుషుఁడును బ్రకృతియు వేఱను
                          క్రమమున మహదహంకారముఖ్య


గీ.

తత్వగణనాపరాయణత్వంబు దాల్చి
నట్టివారల డాయంగ నరిగి చోటు
వేడ నీకర్మ మేమని విద్య లడిగె
నంటి మీమాంసతోడ నన్నట్ల నేను.

94


వ.

అప్పుడు వారిలో నొక్కతర్కవిద్య కర్కశభాషణంబుల నోసి యభాసు
రాలా! విశ్వంబును బరమాణువులవలన జనియించె ననక నిమిత్తకారణం
బున యీశ్వరునివలన జనియించె ననుచు వదరెద వని యదరవైచె, మఱి
యును వెక్కసపుటలుక నోసి యోసి! జీవుండె యీశ్వరుం డనుచు నద్దే
వునికి లేనివికారంబును వినాశధర్మంబు నాపాదించెదవని కోపించె వెండి
యు నొక్కతె మండిపడి యోసి! పండితవిశ్వంబును బ్రకృతివలనఁ బుట్టె
నంటి వని తిట్టె ననిన వివేకుండు కటకటా! పాపతర్కవిద్య లెట్టిదుర్మతులు
పరమాణువులుం బ్రకృతియు నుపాదానంబు లనుట మిథ్యప్రమేయజాతంబు
ఘటపటాదికంబువోలెఁ గార్యంబని యెఱుంగలేక చీకుద్రవ్వెడిని బుట్టు
టయుఁ జెడుటయుఁ గలిగి గంధర్వనగరస్వప్నేంద్రజాలంబులీల నిజంబు
గాని జగంబు స్వాత్మావబోధుండైన శివుని నెఱుంగనివారికి ముక్తాశుక్తి
వెండియైనకరణి దోఁచు నెఱుక గలవారికి రజ్జువు సర్పంబు గానిపగిది నిజంబు
తోఁచు నిర్వికారత్వంబు వికారంబుగాఁ దెలియుట ముగ్ధవధూవికల్పవిలసి

తంబు నానావర్ణంబులయిన మేఘంబుల వికారంబు గగనంబునకు మూఢు లా
పాదించుకరణిం బ్రపంచోదయప్రళయంబులు పరమేశ్వరుని కాపాదింతురు
గాక నిత్యనిర్మలనిష్కళత్వంబులు గల యతనికి నొక్కవికారంబు గలదే
యని పలుకు వివేకునిం జూచి పురుషుడు నాకర్ణించి యుపనిషత్తుం జూచి
తర్కవిద్యలు నీతోడ మరేమి పలికె ననిన నుపనిషద్వధూటి యిట్లనియె.

95


ఉ.

అంతటఁ దర్కవిద్యలు వృథాతిశయంబున దొమ్మి రేఁగి యీ
జంత జగల్లయంబున విశంకటముక్తి ఘటించునంచు న
త్యంతముఁ బ్రేలుచున్నయది నాస్తికురాలిటఁ బట్టి కట్టి బా
ధింత మటంచు నందఱు నతిత్వరితంబున వెంటఁ బట్టినన్.

96


మహాస్రగ్ధర.

తల వీడన్ గోక జాఱన్ దరళకుచతటితారహారాళిముక్తా
ఫలము ల్చల్లాడిరాలన్ బదకరకటకభ్రష్టభూషావిశేషం
బులు చొప్పుల్దప్ప నెండం బురపుర నడుగు ల్పొక్కఁగాఁ గుక్క లడ్డం
బులు వెంటంబట్ట వేగంబునం జనుహరిణీపోతముంబోలె భీతిన్.

97


స్రగ్విణి.

దండకారణ్యమధ్యంబు కాల్ద్రోవలో
గుండనేఁ గవ్వపుంగొండకుం బోవ నం
దుండు శ్రీవిష్ణుభృత్యుల్ సముద్దండదో
ర్దండనృత్యద్గదాదండచండాకృతిన్.

98


ఆ.

వెడలి నన్నుఁ జూచి వెఱవకు వెఱవకు
మనుచుఁ గరుణ నాకు నభయ మిచ్చి
తర్కవిద్యలను బ్రతారించి మోఁదిరి
గుదెల నెముకలెల్ల గుల్లలుగను.

99


సీ.

అప్పు డాతర్కవిద్యలు పికాపికలై య
                          దాయదలై దిగంతముల కుఱికె
నాపుత్రి శ్రీగీత ననుఁ జేరఁగా వచ్చి

                          కడుసంభ్రమంబునఁ గౌఁగిలించి
నాదువృత్తాంతమంతయు విని నన్నూఱ
                          డించి యో తల్లి! దుఃఖించవలదు
నీకుఁ గీ డొనరించునీచులఁ జూడఁ జా
                          లునె విశ్వసాక్షి త్రిలోకవిభుఁడు


గీ.

చెప్పఁడే తొల్లి తెలియ నాచిన్మయుండు
ఎవ్వ రేమనినా వారి కెగ్గు దలఁచి
రట్టిమనుజాధములనెల్ల నసురయోని
సంభవులఁ జేతు నే నని చక్రధరుఁడు.

100


క.

తను నెఱుగనివారల నే
మనగలదనఁ బురుషుఁ డనియె హర్షముతో నే
యనువున నేఁ బరమాత్ముఁడ
నన నుపనిషదణ్ణవదన యానతి యిచ్చెన్.

101


ఆ.

అతనికంటె వేఱ యనరాదు నిన్ను నీ
కంటె వేఱ యనఁగఁగాద యతని
మాయకతన ద్వివిధమై యుండు నాదేవుఁ
డంబుబింబితార్కబింబ మనఁగ.

102


వ.

అనుచు బహుప్రకారంబుల బోధించిన.

103


చ.

ఉపనిషదబ్జనేత్ర వినయోక్తుల యర్థ మెఱుంగలేక జీ
వపురుషుఁ డవ్వివేకుఁ గని వత్స! జరామరణాదిసంగతుం
జపలుని భేదయుక్తు నను సత్యచిదాత్ముని గాఁగఁ బల్కె నీ
విపులవిలోచనామణి సవిస్తరభంగుల నన్నుఁ దెల్పుమా!

104


క.

నావుడు వివేకుఁ డిట్లను
నావిభునిం జూచి “తత్త్వమసి" యనువాక్యం
బే వివరించెద శాంతం
బై వెలిఁగెడు తత్త్వ మీవ యగు టెఱుఁగఁబడున్.

105

క.

ఇది నేఁ గా నిది నేఁ గా
నిది నేఁ గా ననుచు నిశ్చయింపుచురా ని
ర్వదియైదు నడచి యెయ్యది
తుదిఁ దోఁచెడి నదియె నీవు ధ్రువమని పలికెన్.

106


వ.

పురుషుం డి ట్లుపనిషద్వివేకులు చెప్పినవాక్యంబుల యర్ధంబులు పలుమాఱు
నాలోచించునవసరంబున నిదిధ్యాసంబు వచ్చి వివేకపురుషుల కనతి
దూరంబుననున్న యుపనిషద్దేవిం జేసన్న చేసి పిలిచి "విష్ణుభక్తిమహాదేవి
నాచేత నొక్కరహస్యంబు నానతిచ్చి పుచ్చె నది వినుము. దేవతలు సంక
ల్పయోనులు గాన వివేకునిసన్నిధానమాత్రంబున గర్భిణివైన నీజఠర
గోళంబునఁ గ్రూరసత్వయగు విద్యయను కన్యకయుఁ బ్రబోధచంద్రుండను
కుమారుండు నుండుట యెఱింగితి నందు విద్యాకన్యకారత్నంబును సంక
ర్షణవిద్యచేత మనస్సుచే సంక్రమింపం జేయుము. ప్రబోధచంద్రునిఁ బురు
షునియందు నిల్పుము. నీవును వివేకునిం గూడుకొని నాసమీపమ్మునకుఁ
జనుదెమ్మని పలికెనని చెప్పిన నిదిధ్యాసనంబు పురుషునిఁ బ్రవేశించె
నత్తఱి నుపనిషత్తరుణియు విష్ణుభక్తి యానతిచ్చినవిధంబు చేసె నప్పుడు
పురుషుండు ధ్యాననిమీలితాక్షుఁ డగుటయు.

107


చ.

దగదగమంచుఁ గ్రొమ్మెఱుఁగుతండము కైవడి గంటలాఱునున్
బగుల మనంబుఁ జించుకొని మానిన విద్య యనంగఁ బుట్టి తా
నగుచు గ్రసించెఁ దత్పరిజనంబులతో నవలీల మోహు న
మ్మగువకు లోనఁ బుట్టె నసమానవిభూతి ప్రబోధచంద్రుఁడున్.

108


చ.

కలుగునొ కల్గదో యవునో కాదొకొ తోఁచునొ తోఁచదో తుదిన్
నిలుచునొ నిల్వదో యనెడు నిర్భరసంశయ మెల్లవాని ని
ర్మలసహజప్రకాశమహిమంబును బొందుదు రెల్లవారు నేఁ
గలిగినయట్టినాఁడ యిదె కల్గితి నేను బ్రబోధచంద్రుఁడన్.

109


క.

అనుచుం బురుషున్ డగ్గఱి
వినతులు గావింప నతఁడు విమలానందం

బునఁ గౌఁగిలించి యాహా!
ఘనతిమిరములేని రేపకడవలె నయ్మెన్.

110


గీ.

గాఢమోహాంధకారవికల్పనిద్రి
తములు వోవఁ బ్రబోధచంద్రముఁడు పొడమె
శ్రద్ధమతి శాంతి మొదలు సర్వమును గలయఁ
జూఁడఁగా నేనె తత్పరంజ్యోతి నైతి.

111


ఉ.

ఒక్కటి సంశయిం చడుగనొల్లక యొక్కటి గూడఁ బోక యే
దొక్కటియైనఁ గోరి మఱియొక్కెడ కేగక శాంతిఁ బొంది మీ
రుక్కలివార్థిమోహములరోఁతలు మాని గృహంబులందునే
నిక్కపుమౌనిభావమున నెమ్మది నుండుఁ డఖండపూర్ణతన్.

112


క.

ఇది కలిగె ననుచు నుబ్బిక
యిది లేదని స్రుక్కుపడక యెప్పుడు సమతన్
బొదలిన సౌఖ్యామృతసం
పద లబ్బెడు విష్ణుభక్తిమహిమము కతనన్.

113


వ.

అని యిట్లు పురుషుండు విద్యాప్రబోధచంద్రోదయంబుననైన పరమానం
దంబునం బొందు నవసరంబున విష్ణుభక్తిమహాదేవి చనుదెంచి యింత
కాలంబునకుఁ గదా మదీయమనోరథంబు సంపూర్ణంబయ్యె. మంచును విరి
యించి ప్రతాపించు సహస్రాంశుకరణి మహామోహన మదాహితవ్యూ
హంబు విదళించి నిన్ను విలోకింపఁగలిగె ననినంబురుషుండు దేవీ!
భవత్ప్రసాదంబు గలవారికి నసాధ్యంబు గలదే యని పాదంబుల
కెరఁగినఁ గరుణాకటాక్షవీక్షణంబుల నాదరించి సుజ్ఞానసింహాస
నంబున నిలిపి పరిపూర్ణచంద్రమండలకలశపరమామృతంబున
నభిషేకించి పట్టంబు గట్టిన నతండును గృతకృత్యుండగు వివేకుండు
మంత్రిగా నిరుపమానససదానందసామ్రాజ్యంబు చేయుచుండె నిట్లు
సకలవేదాంతసారంబయిన ప్రబోధచంద్రోదయంబను నిమ్మహాకావ్యంబు
వినినఁ జదివిన వ్రాసిన నపరిమితార్థంబులు సిద్ధించు నీకృతియున్న

రాజ్యంబునందు సువృష్టియు ధనధాన్యాదిసమృద్ధియుం గలుగు. రాజులు
ప్రజానురాగంబున మెలంగుదురు. జసులకు నఖండపూర్ణజ్ఞానంబు సిద్ధించు.

114


శా.

ముగ్దామీనపతాక నాకతటినీమూర్ధన్యసద్భోధ సు
స్నిగ్ధాలోకనమాత్రరక్షితకవిశ్రేణీవచోవైఖరీ
దుగ్ధాంభోధి విజృంభణాధికరణేందుస్వచ్ఛకీర్తిచ్ఛటా
దిగ్దాశాధిప చంద్రకాంతభవనా తిప్పాంబికానందనా!

115


క.

విభవమహేంద్ర! యనంత
ప్రభువరకృతవివిధపుణ్యపరిపాకఫల
ప్రభవ! భవాంబుధితారక
శుభతత్వజ్ఞానసారశోభితహృదయా!

116


మంగళమహాశ్రీ.

శ్రీరమణశీతకరశేఖర సరోజభవసేవిత ధనేశ్వరరహస్యో
దార వివిధోపనిషదర్ధమహిమైకనిలయప్రతిభ నిర్మలచరిత్రో
దార శిబికర్ణవిబుధక్షితిజఖేచరవదాన్యగుణజై త్ర ఘనదాన
స్పారశిబికాధవళచామరతురంగకరిసంఘయుత మంగళమహాశ్రీ.

117

గద్య. ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాదలబ్ధసారస్వా
తాభినంది నంది సింగయామాత్యపుత్ర మల్లయమనీషితల్లజ
మలయమారుతాభిధాన ఘంటనాగయ ప్రధానతనయ
సింగయకవిపుంగవ ప్రణీతంబైన ప్రబోధచం
ద్రోదయంబను మహాకావ్యంబునందు సర్వం
బును బంచమాశ్వాసము.