ప్రబంధ రత్నావళి/అనుబంధము-1

వికీసోర్స్ నుండి

అనుబంధము – 1

సీ. శ్రీకరనవపుండరీకసంపదలకుఁ గవయైన నేత్రయుగ్మంబుతోడ,
శంఖశార్ఙ్గస్ఫురచ్చక్రగదాశోభి తములైన హస్తపద్మములతోడ,
నూర్జితమకుటకేయూరకౌస్తుభచారు రమణీయమణిభూషణములతోడఁ,
బదియాఱు వన్నెల పసమించుతళుకుల వలనైన పసిఁడిదువ్వలువతోడ,
గీ. నిరతమును గూర్మి మీఱి పేరురమునందుఁ
గాఁపురంబున్న దుగ్ధాబ్ధికన్యతోడ
శ్రీజగన్నాథుఁ డెలమి నాశిత్రనిధాన
మర్థిఁ గల నాకుఁ బ్రత్యక్షమైనఁ జూచి. 1

సీ. నీలాచలాగ్రసన్నిహితనివాస! వాసవార్చితదివ్యవస్తునిరత!
రతగోపకన్యకాచతురతాతత్పర! పరతత్త్వవాసనాప్రకటసార!
సారసోధ్బవనుత! శయనపారావార! వారణోద్ధర దయావరవిశేష!
శేషాహితల్ప! సుస్థిరసచ్చిదానంద! నందవ్రజస్ఫుటోన్నతవిహార!
గీ. హారకేయూరమకుటమంజీరవిసర!
సరసభూషణభూషితస్ఫారరుచిర!
చిరదయాలోల! రక్షణస్నేహవిజయ!
జయ జగన్నాథ! దేవతాసార్వభౌమ! 2

గీ. అనుచు వినుతించువారు నాదు నెమ్మనను సెలఁగ
ననఘుఁ డాద్యుండు పురుషోత్తమాఖ్యపురపు
శ్రీజగన్నాయకుండు సమాశ్రితనిధాన
మాదరంబున నిట్లని యానతిచ్చె. 3

ఉ. అరయ రామప్రెగ్గడ కులాగ్రణి గంగయమంత్రిజగ్గ! మా
పేరిటివాఁడ, వెప్పుడును బ్రేమ ఘనంబుగు మాకు నీపయిన్,
గౌరవలీల నీవు సమకట్టిన మేలిమి కావ్యసార మిం
పారఁగ మత్సమర్పణము నన్వహకీర్తిగఁ జేయు నావుడున్. 4

వ. మనమునఁ బ్రమోదాయత్తుండనై యిట్లని వితర్కించితి. 5

చ. జనసుతులౌ కవీశ్వరుల సత్కృతిసారము కావ్యసార వ
ర్ణనమని చేసి నీలగిరినాథుని కర్పణ సేయుటొప్పుఁ జ
క్కనిపదియాఱువన్నెకనకంబున వాసన కమ్మకస్తురిన్
గనదురు కాంతియును, జెఱకునన్ ఫలమబ్బుట భాగ్యమే కదా! 6

వ. అని కృతనిశ్చయుండనై జగన్నాథదేవకరుణాసుధాసారంబునఁ గావ్యసారం బొనరింపఁ బ్రారంభించి మదీయవంశావతారం బభివర్ణించెద. 7

సీ. తన ప్రభుత్వము దేవతాప్రభుత్వమున కెం తయు నొప్పు వేయు నేత్రముల వానిఁ
దన లావుననె భూతధాత్రీతలం బెల్లఁ దలఁ బూనుకొను వేయు తలల వానిఁ
దనపేరుఁ దడవిన జనుల పాపౌఘముల్ మర్దించు వేయు నామముల వానిఁ
దన మూర్తి త్రిభువనతమస మౌల సనంగఁ దఱిమెడు వేయుఁ పాదముల వానిఁ
తే. దనదు కూరిమిసుతునిఁగాఁ గనిన వానిఁ
దరమె వర్ణింప సంతతోదారకీర్తి
ననుపమజ్ఞానమూర్తి దయానువర్తి
భవ్యగుణఖనిఁ గశ్యపబ్రహ్మమౌని. 8

శా. ఆ మౌనీంద్రుశుభాన్వయప్రకటదుగ్ధాంభోధిశుభ్రాంశుఁ డౌ
రామప్రెగ్గడగంగరాజునకు విభ్రాజద్యశస్స్ఫూర్తి వ
ల్లామాత్యుం డుదయించి కాంచె నురుభవ్యాకారులన్ బేర్మి రా
మామాత్యాగ్రణి గంగరాయని సముద్యద్బంధుమందారులన్. 9

వ. అందగ్రజుండు. 10

ఉ. దండెగు[?] ప్రత్తిపాటిపురధాముఁడు వల్లన రామమంత్రి తా
నిండిన వేడ్క నారరథినీపతి వీరమనున్ వివాహమై
కొండయ తిమ్మమంత్రిమణికోవిదులం గనియెం బ్రసూనకో
దండజయంతతుల్యసముదంచితరూపవిలాసవంతులన్. 11

వ. తదనుజుండు. 12

చ. శరనిధికన్యకామణిని శౌరి వరించిన సొంపునన్ మనో
హరగుణశాలి గంగసచివాగ్రణి సమ్మతిఁ బెండ్లియాడె నా
హరితపవిత్రగోత్రుఁడగు నబ్బురిలింగన కూర్మిపుత్త్రి సు
స్థిరగుణధాత్రిఁ జానమ నశేషశుభాంచితగాత్రి నుర్వరన్. 13

చ. సతతము సజ్జనార్థిబుధసన్నుతులై విలసిల్లునట్టి దం
పతులకు నుద్భవించితిమి పంకజనాభు కృపాసమృద్ధిచే
ధృతి నమరాద్రితుల్యులగు తిమ్మయమల్లయలున్ సమున్నత
స్థితిఁ గవిమిత్రబాంధవవిధేయుఁడ జగ్గనమంత్రివర్యుఁడన్. 14

వ. అందగ్రజుండు. 15

శా. భారద్వాజనితాంతగోత్రుఁడని చెప్ప న్మించు నాదాతెపల్
సూరామాత్యుని పుత్త్రి నమ్మనను సంశోభాంగి[?] నుద్వాహమై
సారోదారుఁడు తిమ్మమంత్రి గనియెన్ సత్పుత్త్రునిన్ వేంగనన్
గారామొప్పఁగఁ గొండమంత్రిమణి నా గంగయ్యచానార్యులన్. 16

వ. తదనుజుండు. 17

తే. లలి భరద్వాజగోత్రుఁడౌ వెలఁగలేటి
కొండనామాత్యశేఖరు కూర్మిపుత్త్రి
వసుధ రామాంబఁ బెండ్లియై వల్లమంత్రి
మదనసమమూర్తి సింగనామాత్యుఁ గనియె. 18

సీ. శాశ్వతవిక్రమైశ్వర్యసంపదలందుఁ గపికేతు వృషకేతు గరుడకేతు
భుజబలకారుణ్యభూరిప్రతిజ్ఞుల బలరాము రఘురాముఁ బరశురాము
సత్కావ్యవితరణసౌందర్యములయందు బాణుఁ బన్నగబాణుఁ బ్రసవబాణు
ఘనతరమానసకాంతిపెన్నిధులందు రారాజు ద్విజరాజు రాజరాజు
తే. సాటి సేయంగఁ దగుఁ జతుర్జలధివేష్ఠి
తావనీచక్రరాజసభాంతరముల
రమ్యతరభాగ్యగుణశాలి రామప్రెగడ
మంత్రిగంగయవల్లనామాత్యువరుని. 19

వ. తదనుసంభవుండు. 20

సీ. శ్రీపెదపాటిపురీబాలగోపాల కృష్ణప్రసాదితశ్రీల వెలసి
ఘనవైష్ణవమతజ్ఞ కందాళతిరుమలా చార్యకృపాకటాక్షమున నలరి
కావ్యలక్షణలక్ష్యగణితాదిసత్కళా ప్రజ్ఞావిశేషవైభవము గలిగి
రాజవిద్వత్సభారసికబాంధవమాన నీయ ధర్మాచారనియతి మెఱసి

తే. మల్లప్రెగ్గడ వీరనామాత్యపుత్త్రి
రామ నభిరామ గుణధామ రామనామ
కామినీమణిఁ బెండ్లియై ఘనగృహస్థ
మహిమఁ జెలువొందు జగ్గన మంత్రివరుఁడ. 21

షష్ఠ్యంతములు

క. శ్రీరమణీరమణునకును
నారదశుకజనకసనకనలినాసనహృ
న్నీరజనిరతోపాసన
కారణపదకమలయుగళకలితాకృతికిన్. 22

... ... ... ... ...

వ. ఏను విన్నవింపఁబూనిన ప్రబంధరత్నాకరంబునకు వర్ణనాక్రమం బెట్టిదనిన నారాయణస్తుతియు శంకరప్రభావంబును ద్రిపురవిజయాభిరామంబును నర్ధనారీశ్వరంబును హరిహరాత్మకంబును బ్రహ్మస్తుతియుఁ ద్రిమూర్తిస్తుతియు లక్ష్మీగౌరీసరస్వతీప్రభావంబును నష్టదిక్పాలకాది దేవతాప్రార్థనంబును వినాయకషణ్ముఖ మైలారగుణోత్కర్షయుఁ జంద్రాదిత్యులప్రభావంబును వైనతేయశేషవ్యాసవాల్మీకిసుకవిప్రశంసయుఁ గవిత్వలక్షణంబును గుకవినిరసనంబును మన్మథవిభ్రమంబును బురవర్ణనయుఁ బ్రాకారపరిఖాప్రాసాదధ్వజసాలభంజికాగోపురదేవాలయగృహవిలసనంబును బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రజాతి విస్తారంబును విపణివిభ్రమంబును బుష్పలావికాభిరామంబును వారాంగనావర్ణనయుఁ బామరభామనీచతురతయుఁ జెంచెతల యొప్పును బుణ్యాంగనాజనవిశేషంబును నుద్యానవనసరోవరచయసుభగంబును మలయమారుతంబును గజాశ్వపదాతివర్గవిలసితంబును [1ఆ] నాయకోత్కర్షయు సభావర్ణనయు నృత్తగీతవాద్య సాహిత్యమంజసంబును నాశీర్వాదంబును నీరాజనవిధానంబును ఛప్పన్నదేశంబుల నామంబులును రాజ్యపరిపాలనంబును స్త్రీవర్ణనయు నవలోకనంబులును నన్యోన్యవీక్షణంబును దశావస్థలును స్త్రీపురుషవిరహంబులును విరహభ్రాంతియు శిశిరోపచారంబులును సఖీవాక్యంబులును మన్మథచంద్రాదిప్రార్థనంబులును దద్దూషణంబులును వైవాహిక పతివ్రతా లక్షణంబులును నభ్యంగనవిధియును సూపకారవిరాజితంబును విషనిర్విషవిశేషంబులును భోజనమజ్జనతాంబూలంబులును గేళీగృహంబులును సురతప్రకారంబును సుర తాంత్యశ్రమంబును, సంతానవాంఛయు, గర్భలక్షణంబును పుత్త్రోదయంబును, బాలెంతలక్షణంబును, బాలక్రీడయు, శైశవంబును, యౌవనప్రాదుర్భావంబును, సాముద్రికంబును, [2ఆ] రాజనీతియు, సేవకనీతియు లోకనీతియు, సుజనప్రవర్తనంబును, గుజనవ్యాప్తియు, నన్యాపదేశంబులును, సూర్యాస్తమానంబును సాంధ్యరాగంబును, సాయంకాలసమీరణంబును, దీపకళికావిధానంబును, విదియచందురుని చందంబునుఁ, దారకావర్ణనంబును, జక్రవాకవియోగంబును, విటవిడంబనలక్షణశృంగారంబులును, విటలక్షణంబును, వేశ్యాలక్షణంబును, గుటీ వేశ్యాచేష్టలును, వేశ్యమాతృప్రగల్భంబులును, భద్రదత్తకకూచిమారపాంచాలలక్షణంబులును, జిత్తినీహస్తినీశంఖినీపద్మినీజాతిప్రకారంబును, బాలాయౌవనాప్రౌఢాలోలాలక్షణంబులును, గూటప్రకారంబును రతివిశేషంబును, రతివర్ణనంబును, గళాస్థానవిశేషంబులును, బ్రణయకలహంబును, నందుఁ గూర్మి గలుగుటయు, నంధకారంబును, నిశివిడంబంబును, జారసంచారలక్షణంబును, జంద్రోదయంబును, జంద్రకిరణలాంఛనచంద్రికావిభ్రమంబులును, జకోరికావిభ్రమంబును, జకోరికావిహారంబును, వేగుఁజుక్క పొడుచుటయుఁ, గుక్కుటారావంబును, జంద్రతారకాస్తమానంబులును, బ్రత్యూషంబును, బ్రభాతమారుతంబును, నరుణోదయంబును, బ్రభాతరాగోదయంబును, [3ఆ] మధ్యాహ్నసూర్యవిడంబంబును, గ్రీష్మవర్షాశరద్ధేమంతశిశిరవసంతర్తువర్ణనంబులును, వనవిహారంబును, దశదోహదంబులును, నళికోకిలకీరహంసవిరావసంచారలక్షణంబులును, జలకేళియు, వస్త్రాభరణవర్ణనంబును, మధుపానసిద్ధపురుషప్రభావంబును, యోగినీప్రభావంబును, ద్యూతలక్షణంబును, మృగయావినోదంబులును, మృగలక్షణంబును, సముద్రవర్ణనంబును, దల్లంఘనవిధంబును, సేతుబంధంబును, నదీవర్ణనంబును, బుణ్యక్షేత్రప్రభావంబును, వ్రతమాహాత్మ్యంబును, గిరివర్ణనంబును, నారదాగస్త్యాదిమహర్షిప్రభావంబులును, వైరాగ్యయోగతపోలక్షణంబులును, దపోవిఘ్నంబును, దేవతాప్రత్యక్షంబులును, దండయాత్రయు, శంఖభేరీరవంబులును, గుణధ్వనియు, రథాస్త్రవేగంబులును, బాణపాతంబును, బ్రతిజ్ఞయు, వీరాలాపంబులును, దూతవాక్యంబులును, హీనాధిక్యంబులును, రణప్రకారంబును, మల్లయుద్ధంబును, రణభయంబును, రణాంత్యంబును, లోభదైన్యగుణంబులును, మనోవ్యధయును, ధనికదారిద్ర్యక్షుద్వార్ధకలక్షణంబులును, రోదనంబును, శకునంబును, స్వప్నఫలంబును, దిగ్విజయంబును, ధర్మోపదేశం బును, శృంగారంబును, భావవిస్తారంబును, గీర్తియు, భూభరణంబును, గాంభీర్యధైర్యగుణంబులును, దానవిశేషంబును, ధాటీచాటుధారావిశేషంబులును, బరోక్షంబును, గల్పితకల్పవల్లియు, చక్రికానాగపుష్పఖడ్గగోమూత్రికామురజాదిబంధంబులును, బాదగోపన పాదభ్రమక పంచవిధవృత్త చతుర్విధగర్భకందవృత్త పంచపాదవృత్తంబులును, నిరోష్ఠ్యంబును, ద్వ్యక్షరియును, నవరసోత్పత్తియు, నను వర్ణనంబులు గలుగఁ గవీంద్ర కావ్యనామంబులతో వివరించెద.