Jump to content

ప్రబంధరత్నాకరము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

ప్రథమాశ్వాసము

సీ.

శ్రీ కరనవపుండరీకసంపదలకుఁ
              గవయైన నేత్రయుగ్మంబుతోడ
[శంఖశార్జ్ఞ]స్ఫురచ్చక్రగదాశోభి
              తములైన హస్తపద్మములతోడఁ
నూర్జితమకుటకేయూరకౌస్తుభచారు
              రమణీయమణిభూషణములతోడఁ
బదియాఱువన్నెల పస మించు తళుకుల
              వలనైన పసిఁడి దువ్వలువతోడ


తే.

నిరతమును గూర్మి [మీఱి] పేరురమునందుఁ
గాపురంబున్న దుగ్ధాబ్ధికన్యతోడ
శ్రీ జగన్నాథుఁ డెలమి నాశ్రితనిధాన
మర్థిఁ గల నాకుఁ బ్రత్యక్షమైనఁ జూచి.

1


సీ.

నీలాచలాగ్రసన్నిహిత[నిత్య]నివాస!
              వాసవార్చితదివ్య వస్తునిరత!
[1]శతగోపకన్యకాచతురతాతత్పర!
              పరతత్త్వవాసనాప్రకటస్వాంత!
సారసోద్భవనుత! శయనపారావార!
              వారణోద్ధరదయావరవిశేష!
శేషాహితల్పసుస్థిరస[చ్చి]దానంద!
              నందవ్రజస్ఫుటోన్నతవిహార!


తే.

హారకేయూరమకుటమంజీరవిసర
సరసభూషణభూషితస్ఫారరుచిర!
చిరదయాలోల! రక్షణస్నేహవిజయ!
జయజగన్నాథ! దేవతాసార్వభౌమ!

2


తే.

అనుచు వినుతించు నాదు నెమ్మనము సెలఁగ
ననఘుఁ డాద్యుండు పురుషోత్తమాఖ్యపురపు
శ్రీ జగన్నాయకుఁడు సమాశ్రితనిధాన
మాదరంబున నిట్లని యానతిచ్చె.

3


ఉ.

అరయ రామప్రెగ్గడకులాగ్రణి గంగయమంత్రిజగ్గ! నా
పేరిటివాఁడ వెప్పుడును బ్రేమ ఘనంబగు మాకు నీపయిన్
గౌరవలీల నీవు సమకట్టిన మేలిమి కావ్యసార మిం
పారఁగ మత్సమర్పణము శాశ్వతకీర్తిఁగఁ జేయు నావుఁడున్.

4

వ.

మనమునఁ బ్రమో[2]దాయత్తుండనై యిట్లని వితర్కించితి.

5


చ.

జననుతులౌ కవీశ్వరుల సత్కృతిసారముఁ గావ్యసౌరవ
ర్ణనమని చేసి నీల[గిరినాథుని కర్పణ] సేయు టొప్పుఁ జ
క్కని పదియాఱువన్నె కనకంబున వాసన కమ్మకస్తురిన్
గనదురుకాంతియన్ జెఱకునన్ ఫల మబ్బుట భాగ్యమేకదా!

6


వ.

అని కృతనిశ్చయుండనై జగన్నాథదేవకరుణాసుధాసారంబునఁ గావ్యసారం బొనరింపఁ బ్రారంభించి మదీయవంశావతారం బభివర్ణించెద.

7


సీ.

తన ప్రభుత్వము దేవతాప్రభుత్వమున కెం
              తయు నొప్పు [3]వేయి నేత్రముల వానిఁ
దన లావుచే భూతధాత్రీతలం బెల్లఁ
              దలఁ బూనుకొను [4]వేయి తలల వానిఁ
దనపేరుఁ దడవిన జనుల పాపౌఘముల్
              మర్దించు [5]వేయి నామముల వానిఁ
దన మూర్తి త్రిభువనతమస మౌల సనంగఁ
              దఱిమెడు [6]వేయి పాదముల వానిఁ


తే.

దనదు కూరిమి సుతునిఁగాఁ గనిన వానిఁ
దరమె వర్ణింప సంతతోదారకీర్తి
ననుపమజ్ఞానమూర్తి దయానువర్తి
భవ్యగుణ[7]ఖని కశ్యపబ్రహ్మమౌని.

8


శా.

ఆ మౌనీంద్రుశుభాన్వయప్రకటదుగ్ధాంభోధిశుభ్రాంశుఁ డౌ
రామప్రెగ్గడగంగరాజునకు విభ్రాజద్యశఃస్ఫూర్తి వ
ల్లామాత్యుం డుదయించి కాంచె నురుభవ్యాకారులన్ బేర్మి నా
[8]రామాత్యాగ్రణి గంగరాయని సముద్యద్బంధుమందారులన్.

9


వ.

అందగ్రజుండు.

10


ఉ.

దండెగు ప్రత్తిపాటిపురధాముఁడు (వ)ల్లన (నారమంత్రితా(వ)ల్లన)
నిండిన వేడ్క నారరథినీవతి వీరమనున్ వివాహమై
కొండయతిమ్మమంత్రిమణికోవిదులన్ గనియెన్ బ్రసూనకో
దండజయంతతుల్యసముదంచితరూపవిలాసవంతులన్.

11


వ.

తదనుజుండు.

12


చ.

శరనిధికన్యకామణిని శౌరి వరించిన సొంపునన్ మనో
హరగుణశాలి గంగసచివాగ్రణి సమ్మతిఁ బెండ్లియాడె నా

హరితపవిత్రగోత్రుఁడగు నబ్బురిలింగన కూర్మిపుత్త్రి సు
స్థిరగుణధాత్రి చానమ నశేషశుభాంచితగాత్రి నుర్వరన్.

13


చ.

సతతము సజ్జనార్థిబుధసన్నుతులై విలసిల్లునట్టి దం
పతులకు నుద్భవించితిమి పంకజనాభు కృపాసమృద్ధిచే
ధృతి నమరాద్రితుల్యులగు తిమ్మయమల్లయలున్ సమున్నత
స్థితిఁ గవిమిత్రబాంధవవిధేయుఁడ జగ్గనమంత్రివర్యుఁడన్.

14


వ.

అందగ్రజుండు.

15


శా.

భారద్వాజనితాంతగోత్రుఁడని చెప్ప న్మించు [9]నాఁ దాడెపల్
సూరామాత్యుని పుత్త్రి నమ్మనను సంశోభాంగి నుద్వాహమై
సారోదారుఁడు తిమ్మమంత్రి గనియెన్ సత్పుత్త్రులన్ [10]వెంగనన్
గారామొప్పఁగఁ గొండమంత్రిమణి నా గంగయ్యచానార్యులన్.

16


వ.

తదనుజుండు.

17


తే.

లలి భరద్వాజగోత్రుఁడౌ వెలగలేటి
కొండనామాత్యశేఖరు కూర్మిపుత్త్రి
వసుధ రామాంబఁ బెండ్లియై వల్లమంత్రి
మదనసమమూర్తి సింగనామాత్యుఁ గనియె.

18


సీ.

శాశ్వతవిక్రమైశ్వర్యసంపదలందుఁ
              గపికేతు వృషకేతు గరుడకేతు
భుజబలకారుణ్యభూరిప్రతిజ్ఞుల
              బలరాము రఘురాముఁ బరశురాము
సత్కావ్యవితరణసౌందర్యములయందు
              బాణుఁ బన్నగబాణుఁ బ్రసవబాణు
ఘనతరమాన[11]సకాంతి పెన్నిధులందు
              రారాజు ద్విజరాజు రాజరాజు


తే.

సాటి సేయంగఁ దగు [12]సప్తజలధివేష్ఠి
తావనీచక్రరాజసభాంతరముల
రమ్యతరభాగ్యగుణశాలి రామప్రెగడ
మంత్రిగంగయవల్లనామాత్యువరుని.

19


వ.

తదనుసంభవుండు.

20


సీ.

శ్రీపెదపాటిపురీ[13]బాలగోపాల
              కృష్ణప్రసాదితశ్రీల వెలసి
ఘనవైష్ణవమతజ్ఞ కందాళ తిరుమలా
              చార్యకృపాకటాక్షమున నలరి

కావ్యలక్షణలక్ష్య[14]గణితాదిసత్కళా
              ప్రజ్ఞావిశేషవైభవము గలిగి
రాజవిద్వత్సభారసికబాంధవమాన
              నీయధర్మాచారనియతి మెఱసి


తే.

మల్లప్రెగ్గడవీరనామాత్యపుత్త్రి
రామ నభిరామ గుణధామ రామనామ
కామినీమణిఁ బెండ్లియై ఘనగృహస్థ
మహిమఁ జెలువొందు జగ్గన మంత్రివరుఁడు.

21

షష్ఠ్యంతములు

క.

శ్రీరమణీరమణునకును
నారదశుకజనకసనకనలినాసనహృ
న్నీరజనిరతోపాసన
కారణపదకమలయుగళకలితాకృతికిన్.

22


క.

నీలాచలనిలయునకును
నీలాచలదమలనయననీరజరవికిన్
నీలాంభోరుహశతముఖ
నీలాభున కఖిలలోకనేతకు హరికిన్.

23


క.

రాజీవాయతమూర్తికి
రాజీవదళాక్షునకును రామునకును వై
రాజ[15]స్ఫూర్జితకీర్తిత
రాజకళాధరున కఖిలరక్షామణికిన్.

24


క.

అంభోనిధికన్యాకుచ
కుంభపరీరంభదంభగుంభనబాహా
స్తంభచతుష్టయసంభ్రమ
సంభారారంభునకును జలజాక్షునకున్.

25


క.

శరణాగతవత్సలునకు
తరుణారుణకోటితుల్యధామునకు లస
ద్వరుణాలయగతగురుసుత
కరుణాశరణునకు శ్రీజగన్నాథునకున్.

26


వ.

ఏను విన్నవింపఁబూనిన ప్రబంధరత్నాకరంబునకు వర్ణనా[16]గౌరవం బెట్టిదనిన నారాయణస్తుతియును శంకరప్రభావంబును
ద్రిపురవిజయాభిరామంబును నర్ధ[17]గౌరీశ్వరంబును హరిహరాత్మకంబును బ్రహ్మస్తుతియును ద్రిమూర్తిస్తుతియును
లక్ష్మీగౌరీసరస్వతీప్రభావంబును నష్టదిక్పాలకాదిదైవతాప్రార్థనంబును వినాయకషణ్ముఖ[18]భైరవమైలారగుణోత్కర్షయును

జంద్రాదిత్యులప్రభావంబును వైనతేయశేషవ్యాసవాల్మీకిసుకవిప్రశంసయుఁ గవిత్వలక్షణంబును గుకవినిరసనంబును
మన్మథవిభ్రమంబును బురవర్ణనయుఁ బ్రాకార[19]పరిఖాప్రాసాదధ్వజసాలభంజికాగోపురదేవాలయగృహవిలసనంబును
బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రజాతివిస్తారంబును విపణివిభ్రమంబును బుష్పలావికాభిరామంబును వారాంగనావర్ణనయుఁ
బామర[20]భామలచతురతయుఁ [21]జెంచెతలయొప్పును బుణ్యాంగనాజనవిశేషంబును నుద్యానవనసరోవరచయసుభగంబును
మలయమారుతంబును గజాశ్వపదాతివర్గవిలసితంబును నాయకోత్కర్షయు సభావర్ణనయు నృత్తగీతవాద్య
సాహిత్యమంజసంబును నాశీర్వాదంబును నీరాజనవిధానంబును [22]ఛప్పన్నదేశంబుల నామంబులును
రాజ్యపరిపాలనంబును స్త్రీవర్ణనయు నవలోకనంబును నన్యోన్యవీక్షణంబును దశావస్థలును [23]స్త్రీవిరహపురుషవిరహంబులును
విరహభ్రాంతియు శిశిరోపచారంబులును సఖీవాక్యంబులును మన్మథచంద్రాది[24]ప్రార్థనలును దద్దూషణంబులును
[25]వైవాహికాపతివ్రతాలక్షణంబులును [26]నభ్యంగనవిధియును సూపకారవిరాజితంబును విషనిర్విషవిశేషంబులును భోజన
మజ్జనతాంబూ[27]లంబులును గేళీగృహంబులును సురతప్రకారంబును సురతాంత్యశ్రమంబును సంతానవాంఛయు
గర్భలక్షణంబును పుత్త్రోదయంబును బాలింతలక్షణంబును బాలక్రీడయు శైశవంబును యౌవనప్రాదుర్భావంబును
సాముద్రికంబును రాజనీతియును సేవకనీతియును లోకనీతియును సుజనప్రవర్తనంబును గుజనవ్యాప్తియు
నన్యాపదేశంబులును సూర్యాస్తమానంబును సాంధ్యరాగంబును సాయంకాలసమీరణంబును దీపకళికావిధానంబును
విదియచందురునిచందంబును దారకావర్ణనంబును జక్రవాకవియోగంబును విటవిడంబనలక్షణశృంగారంబును
[28]గువిటలక్షణంబును వేశ్యాలక్షణంబును [29]గుటిలవేశ్యాచేష్టలును వేశ్యమాతృప్రగల్భంబులును
భద్ర[30]దత్తకూచిమారపాంచాలలక్షణంబులును జిత్తినీహస్తినీశంఖినీపద్మినీజాతిప్రకారంబును
బాలయౌవనాప్రౌఢలోలాలక్షణంబులును గూటప్రకారంబును రతివిశేషంబును రతివర్ణనంబును గళాస్థానవిశేషంబులును
బ్రణయకలహంబును నందుఁ గూర్మి గలుగుటయు నంధకారంబును నిశివిడంబంబును జారసంచారలక్షణంబును
[31]దూతికావాక్యంబులును చోరలక్షణంబులును జంద్రోదయంబును జంద్రకిరణలాంఛనచంద్రికావిభ్రమంబును
జకోరికావిహారంబును వేగుఁజుక్కు వొడుచుటయుఁ గుక్కుటారావంబును జంద్రతారకాస్తమానంబులును బ్రత్యూషంబును
బ్రభాతమారుతంబును నరుణోదయంబును బ్రభాత[32]రాగోదయంబును [33]సూర్యోదయంబును
మధ్యాహ్నసూర్యవిడంబంబును గ్రీష్మవర్షాశరద్ధేమంతశిశిరవసంతర్తువర్ణనంబులును వనవిహారంబును దశదోహదంబులును
నళికోకిలకీరహంసవిరావసంచారలక్షణంబులును జలకేళియు వస్త్రాభర[34]ణంబులును మధుపానసిద్ధపురుషప్రభావంబును
ద్యూతలక్షణంబును మృగయావినోదంబులును మృగలక్షణంబును సముద్రవర్ణనంబును దల్లంఘన[35]విధంబును
సేతుబంధనంబును నదీవర్ణనంబును బుణ్యక్షేత్రప్రభావంబును వ్రతమాహాత్మ్యంబును గిరివర్ణనంబును
నారదాగస్త్యాదిమహర్షిప్రభావంబులును వైరాగ్యయోగతపోలక్షణంబులును దపోవిఘ్నంబును దేవతాప్రత్యక్షంబులును
దండయాత్రయు శంఖభేరీరవంబులును గుణధ్వనియును రథాస్త్రవేగంబులును బాణపాతంబును బ్రతిజ్ఞయు
వీరాలాపంబులును దూతవాక్యంబులును హీనాధిక్యంబును రణప్రకారంబును మల్లయుద్ధంబును రణభయంబును
రణాంత్యంబును లోభదైన్యగుణంబులును మనోవ్యధయును ధనికదారిద్ర్య[36]క్షుద్వార్ధకలక్షణంబులును రోదనంబును
శకునంబును స్వప్నఫలంబును దిగ్విజయంబును ధర్మోపదేశంబును శృంగారంబును భావవిస్తారంబును గీర్తియు
భూభరణంబును గాంభీర్యధైర్యగుణంబులును దానవిశేషంబును [37]ఖడ్గనూపురప్రతాపగుణంబులును
నుత్తరప్రత్యుత్తరంబులును ధాటీచాటుధారావిశేషంబులును బరోక్షంబును గల్పితకల్పవల్లియు చక్రికా నాగపుష్ప ఖడ్గ
గోమూత్రికా మురజాది బంధంబులును బాదగోపన పాదభ్రమక పంచవిధవృత్త చతుర్విధగర్భకందవృత్త
పంచపాదవృత్తంబులును నిరోష్ఠ్యంబు ద్వ్యక్షరియును నవరసోత్పత్తియును నను వర్ణనంబులు గలుగఁ
గవీంద్రకావ్యనామంబులతో వివరించెద.

27

హరిస్తుతి

[38]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము (1 పీ)

శా.

శ్రీరామావసుధాపయోధరములం [39]జేదోయి రెంటన్ సమ
ప్రారంభంబునఁ జిత్రభంగి మకరీపత్రాంకముల్ వ్రాసి ని
ర్వైరప్రేమల నిద్దఱందు సమసారస్యంబునం దేలు నా
శ్రీరంగేశుఁడు మమ్ము నిర్మలసుఖశ్రీయుక్తులం జేయుతన్.

28

ప్రౌఢకవి మల్లయ్య – రుక్మాంగదచరిత్ర [1-2]

చ.

కలశపయోధికన్య మృదుగండమరీచులనీడఁ జూచుచున్
దిలకముఁ గమ్మకస్తురిఁ బ్రదీప్తముగాఁ గొనగోర దిద్దు ను
త్పలదళమేచకద్యుతికదంబశరీరుఁడు [40]మాధవుండు ని
చ్చలు కరుణాకటాక్షమున సన్మతితో మముఁ బ్రోచుఁగావుతన్.

29

జయతరాజు ముమ్మయ - విష్ణుకథానిధానము

శా.

శ్రీరామాస్పదమైన పేరురముపై శ్రీవత్సచిహ్నంబుఁ దా
నారూఢంబుగఁ దాల్చి [41]శ్రీకిఁ దగు చిహ్నల్ గల్గువాఁడౌట సొం
పారన్ దెల్లమి సేయు దేవుఁడు కృపావ్యాసక్తుఁడై మామక
ప్రారంభంబు నిరంతరాయశుభసాఫల్యంబుగాఁ జేయుతన్.

30

[?]

సీ.

శృంగారవిభుఁడని చెప్పంగనేటికి
              భావజుఁ గొడుకుఁగాఁ బడసెననినఁ
గారుణ్యనిధియని గణుతింపనేటికి
              సృష్టిరక్షణ నిత్య[42]శీల మనినఁ
బరమపావనుఁడని ప్రణుతింపనేటికి
              గంగఁ బాదంబునఁ గాంచెననిన
ఘనవైభవుండని కొనియాడ నేటికిఁ
              గలిమి ముద్దియ కులకాంత యనిన

తే.

[43]విష్ణువె యడుగనేటికి విశ్వమూర్తి
[44]యగుట నచ్యుతుండఁట నిత్యుఁ డనఁగ నేల
యని మునీంద్రులు గొనియాడ నతిశయిల్లు
నమ్మహాత్ముండు సర్వలోకాధికుండు.

31

కంచిరాజు సూరయ - కన్నప్పచరిత

ఉ.

కారణమేమి? రక్కసు నఖంబుల వ్రచ్చితి నాఁడు నీకుఁ బెం
పారఁ గుఠారమబ్బదొ? పురారివిరించులు చేరి యేటికిన్
[45]గోరను బోవు సేఁతలకు గొడ్డలి యన్నఁ దొఱంగితో వినం
గోరెదనన్న యిందిరకుఁ గోర్కులు నిచ్చు ముకుందుఁ గొల్చెదన్.

32

భీమకవి - దశావతారము

సీ.

శ్రుతిసుధాక్ష్మాభక్తసురజననీవధూ
              మల్లశంకరధర్మ మహితబుద్ధి
[46]కగకూర్మ [47]కిటినరమృగ [48]కుబ్జరామ రా
              మానంతబుద్ధకల్క్యాహ్వయముల
నముచిమందరకుదానవబలార్జునపంక్తి
              ముఖముష్టి కస్త్రీవిముక్తఖలులఁ
దత్పుచ్ఛకర్పరదంష్ట్రాగ్రనఖపద
              పరశుబాణహలాంగఖురపుటములఁ


ఆ.

జెరివి తాల్చి యెత్తి చీరి బంధించి ని
ర్జించి యేసి యేర్చి చెఱిచి మట్టఁ
గణఁగుచున్న శౌరి కరుణావిధేయుఁడై
మనలఁ గోర్కు లిచ్చి మనుచుఁగాఁత.

33

ఈశ్వరస్తుతి

[49]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము 3.పీ

మ.

ముకుటాగ్రస్థితచంద్రచంద్రిక సదా ముంపన్ బ్రభాతం బెఱుం
గక శశ్వత్వరిరంభణానిరతసౌఖ్యస్నిగ్ధుఁడై జాయఁ బా
యక లీలాపరుఁడైన శంకరుఁడు నిత్యప్రీతి సంధించుతన్
సకలాహ్లాదముగా మదీయకృతికిన్ శబ్దార్థదాంపత్యమున్.

34

ప్రౌఢకవి మల్లయ్య – రుక్మాంగదచరిత్ర[1-1]

ఉ.

శ్రీమయపత్రముల్ జటలఁ జెల్వగు నభ్రతరంగిణీకణ
స్తోమము పుష్పముల్ ఫలము సోముఁడునై పొలు[50]పొంది పార్వతీ
కోమలదేహవల్లిఁ బెనగొన్న సమంచితదక్షవాటికా
భీమయదేవకల్పక మభీష్టఫలంబులు మాకు నీవుతన్.

35

[2-135]

సీ.

కదలి పాఱని తేరు వదలఁజాలని పేరు
              పఱపఁగా నెఱపఁగా నెఱుగరేని
సానఁబట్టని యమ్ము మేనఁబెట్టని సొమ్ముఁ
              బుట్టఁగాఁ చెట్టుఁగా [51]ముట్టరేనిఁ
గంతు గంధపుఁ బూఁత వింత చందపు మేఁతఁ
              బూయఁగా మేయఁగా డాయరేని
మింటఁబుట్టని ధార యొంటఁగట్టని చీర
              తల యందు మొలయందు [52]నిలుపరేని


తే.

[53]మెఱపువిల్లు విలాసంబు నెఱుపునిల్లు
గలుగ నుతి కెక్కరేని నా కరము లెత్తి
మ్రొక్క నటువంటి దైవసమూహములకుఁ
గ్లేశభవభంగ! యిష్టకామేశలింగ!

36

జయతరాజు ముమ్మయ - విష్ణుకథానిధానము

ఉ.

అడఁగఁ గెంజడల్ దొలఁకియాడఁగ జాహ్నవి దిక్కు లెల్ల న
ల్లాడఁగ భూతధాత్రి యసియాడఁగ నాకము నాకసంబు నూ
టాడఁగ ముజ్జగంబు గొనియాడఁగ నిచ్చలు నీవు తాండవం
బాడఁగ గౌరినిన్ సరసమాడఁగఁ జేరునటా! మహానటా!

37

బమ్మెర పోతరాజు – భాగవతము [ప్రథమస్కంధము] [1-2]

ఉ.

వాలిన భక్తి మ్రొక్కెద నవారితతాండవకేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజాముఖపద్మమయూఖమాలికిన్
బాలశశాంకమౌళికిఁ గపాలికి మన్మథగర్వపర్వతో
న్మూలికి నారదాదిమునిముఖ్యమనస్సరసీరుహాళికిన్.

38

రంగనాథుఁడు

ఉ.

గోశతపంచవార్థులును గోయుగవార్ధులు గోత్రివార్ధులున్
గోశరవార్ధులున్ విదితగోశత[వార్ధులు] పంచవార్ధు లా

కేశవతల్ప పద్మభవ కేకిసవాహన దానవేశ దే
వేశుల కిచ్చునట్టి పరమేశ్వరుఁ డీవుత మా కభీష్టముల్.

39

[శేషనాథుఁడు - పర్వతపురాణము] [1-5]

ఉ.

తత్తఱపాటుతో నిరులు తద్దయు మాన్పఁగఁ జాలు కన్ను ను
వ్వెత్తున వేల్పుమూఁకలకు విందులు వెట్టెడి కన్నుదమ్మియున్
మొత్త మెలర్ప లచ్చికిని [54]మున్నుగఁ బుట్టిన ముద్దుఁబట్టి మే
నెత్తిలఁ జూచు కన్ను గల యిట్టిఁ[డి] వేలుపుఁ గొల్తు నిచ్చలున్.

40

దామరాజు సోమయ - భరతము

ఉ.

అంబరసీమఁ దారలు జటాటవి మల్లెవిరుల్ భుజాంతరా
ళంబున హారసంతతు లిలాస్థలిఁ బువ్వుల వర్షముల్ ప్రసూ
నంబులు సత్కృతాంజలి ననందగి మౌక్తిక తుల్యమౌళిగం
గాంబుకణంబు లుట్టిపడ నాడెడు శంభుఁడు మమ్ముఁ బ్రోవుతన్.

41

బొడ్డుపాటి కొండయ – త్రిపురవిజయము

[చాటువులు]

సీ.

తొమ్మిది తునుకల నెమ్మిఁగూర్చిన తేరు
              సరిజోకఁ గూడని చక్రయుగము
నొకముఖంబున గడ్పనోపనిసారథి
              రూపింపరాని వారువపు సమితి
బెడిదంపుఁ దెగలకుఁ బెలుచైన విలుకమ్మి
              గాలిచేఁ బ్రొద్దులు గడపు నారి
పదివంకలై చాయఁ బాఱని బాణంబు
              పడి [55]బత్యములు లేని భటగణంబు


తే.

పొందువడఁజేసి, దైత్యుల పురము లేసి
యఖిలజగములు రక్షించు నట్టి జోద
వనుచుఁ గొనియాడుదురు నిన్ను ననుదినంబు
నంగభవభంగ! తిరుకాళహస్తిలింగ!

42


సీ.

కడఁగి యెక్క[56]డికైనఁ గదలని యరదంబు
              యరదంబుపై నిల్చినట్టి విల్లు
వింటికిఁ గాఁపుగా విహరించు చక్రముల్
              చక్రములను బ్రొద్దు జరపు శరము

శరమునఁ బొడమిన చక్కని సారథి
              సారథి [57]చేగొన సాగు హరులు
హరుల సామర్థ్యంబు లరసిన శింజిని
              శింజినిఁ దరిత్రాడు సేయు బలము


తే.

పొందువడఁజేసి దైత్యుల పురములేసి
యఖిలజగములు రక్షించు నట్టి జోద
వనుచుఁ గొనియాడుదురు నిన్ను ననుదినంబు
నంగభవభంగ! తిరుకాళహస్తిలింగ!

43


సీ.

దేహంబు మిక్కిలి తిరమైన రథముగా
              ఘననేత్రయుగము చక్రములు గాఁగ
నూర్పు లశ్వంబులై యొప్పారుచుండంగ
              దొరయు పళ్ళెరము సూతుండు గాఁగ
నవ్యాంగమతి శూరసాయకంబది గాఁగ
              సొరిదిఁ గుంతలములు జోడు గాఁగఁ
దలమైన విహరణస్థలము కార్ముకముగా
              నలువైన హారంబు నారి గాఁగఁ


తే.

నన్నియును నీ మహత్త్వంబె యగుటఁజేసి
లీలఁ ద్రిపురంబు లేసి గెల్చితివి గాక
నీకు నొరులు [58]సహాయులై నిలువఁగలరె
నంగభవభంగ! తిరుకాళహస్తిలింగ!

44

కవిలోకబ్రహ్మ - పెదపాటి సోమరాజు - శివజ్ఞానదీపిక

సీ.

కవగూడి నడక సాఁగని బండి[59]కండ్లును
              దొమ్మిది తునుకల తొడుసు తేరు
పెక్కు బ్రాహ్మణుల చేఁజిక్కిన [60]గుఱ్ఱాలు
              చిలుకుల నఱిగిన చివుకు టిరుసు
బహుముఖవిభ్రాంతిఁ బడలిన సారథి
              వినువీథి [61]నుఱిమిన [62]విరుగు విల్లు
పదిబ్రద్దలై [63]యొడ్డు వాసిన బాణంబు
              పొరలెత్తి పోయిన బోలు నారి


తే.

పట్టఁ బసలేదు సాధనప్రకరశక్తి
విషమ[64]లక్ష్యంబు లైనట్టి విమతపురము
లెల్ల సాధించి గెల్చితి వేక[65]హేతి
బాపు! త్రిపురాంతకేశ్వర! భక్తవరద!

45

పాలపర్తి సోమేశ్వరుఁడు

సీ.

వింటి క్రిందటి కొమ్ముఁ [66]బెకలించి పెరికిన
              భూకాంతకును నాభి పొలుపు మిగిలె
నమ్ము పుచ్చు[67]కొనిన నమితతరంగ[68]మై
                             పాల[69]సముద్రంబు ప్రజ్వరిల్లె
బండికండులు రెండుఁ బండ్లిగిలించినఁ
              గలువలు దామరల్ సెలిమిఁ జేసె
వాజులఁ గొనివచ్చి వరరథంబున బూన్పఁ
              జిచ్చుకు నాకలి చిచ్చు పుట్టె


తే.

నారి సంధింపఁ గశ్యపనారి వణఁకెఁ
[గోల] సంధింప లచ్చికి [70]జాలి పుట్టె
విల్లుఁ దెగఁబాపి పురములు ద్రెళ్ళ నేసి
తరిది విలుకాఁడ వౌదువో శరభలింగ!

46

బొడ్డపాటి పేరయ - చాటువులు

సీ.

ఖండఖండంబునఁ గదిసిన [71]తేరున
              భంగంపుటిరుసు పొసంగఁగూర్చి
విజ్జోడువడి నిచ్చ వినువీథిఁ దిరిగెడు
              చక్రంబు లొనగూడ సంఘటించి
తలకొన్న భీతిఁ గొందలపడు బహుముఖ
              [72]భ్రాంతసారథి నేరుపరిగ నిలిపి
పలుకఁ బదక్రమంబుల నలుజాడలఁ!
              బోయెడి [73]గుఱ్ఱాలఁ బూనుకొలిపి


తే.

కుంటి వింటను బలువంక కోలఁ దొడిగి
విషమలక్ష్యంబు లే గతి వేసితయ్య
వేల్పు లెవ్వరు నీ సాటి విజయవాటి
మల్లికార్జునలింగ! యుమాప్రసంగ!

47


సీ.

బంట్లున్న పాలెంబు బలువిల్లుగాఁ జేసి
              నవమణి వలయంబు నారి సేసి
నుదుటి నెన్నడిమికన్నును ముల్కిగాఁ జేసి
              దక్షిణాంగంబె యస్త్రంబు సేసి
చేకొఱతల వాని జోక సారథి సేసి

              తన మూర్తి నొకట రథంబు సేసి
కనుదోయిఁ జక్రయుగ్మముగ యోజన సేసి
              సమత నూరుపుల నశ్వములఁ జేసి


తే.

యన్నియును నీ యధీనంబు లగుటఁ జేసి
పురము లేసితిగాక నీ కొరులు తోడె
వేల్పు లెవ్వరు నీ సాటి విజయవాటి
మల్లికార్జునలింగ! యుమాప్రసంగ!

48


సీ.

కాంతులఁ జూపట్టు కండ్లమరించిన
              తిరమైన విపులపుఁ దేరునందు
విద్యల [74]ప్రోడయౌ వృద్ధసారథి నిల్పి
              యతఁడు శిక్షించు హయములఁ బన్ని
[75]వన్నెవాసుల మించు తిన్నని [76]రావిల్లు
              చొక్కు[టఁ] బై నారి నెక్కువెట్టి
గఱితోడఁ గూడ నాకసపుఁ [77]బ్రసూతి నీ
              ళ్ళమ్మొనఁ బదనిచ్చు నమ్ముఁ దొడిగి


తే.

యమరభటు లార్వ దైత్యపురములు గెడపి
విజయ మొందిన జోద వీ విశ్వమునను
వేల్పు లెవ్వరు నీ సాటి విజయవాటి
మల్లికార్జునలింగ! యుమాప్రసంగ!

49

రంగనాథుఁడు

చ.

అదలని తేరు తేరునకు నాదరువై[78] తగు విల్లు వింటికిన్
గుదురగు నారి నారిపయిఁ [79]గున్కు శరంబు శరంబు బొడ్డునన్
బొదలిన యంత యంత ముఖముల్ నిజవాసములైన గుఱ్ఱముల్
చెదరక నీకు [80]నెట్లు పనిసేయునయా! [81]గిరిజేశనాయకా!

50

అర్ధనారీశ్వరము

ప్రౌఢకవి మల్లయ్య – రుక్మాంగదచరిత [1-29]

సీ.

పులితోలు [82]రెంటెంబు వెలిపట్టు [83]గెంటెంబుఁ
              గటిమండలంబున గరిమఁ దనర
భసితాంగరాగంబు బహుగంధయోగంబు
              బాహుమధ్యంబునఁ బరిఢవింప
శీతాంశునవకాంతి సేమంతి పూబంతి

              యుత్తమాంగమునందు నొఱవుఁ జూప
గండ[84]పెండేరంబు కలితమంజీరంబు
              పాదపద్మములందుఁ [85]బ్రతిఘటింప


తే.

నర్ధనారీశ్వరస్వామియై తనర్చు
దక్షపురభీమలింగంబు దయ పొసంగ
నర్థి గల నాకుఁ బ్రత్యక్షమైనఁ జూచి
మోద మిగురొత్తఁ బాదాబ్జములకు మ్రొక్కి.

51

ఎలుపర్తి రామరాజు - రామలింగశతకము

సీ.

గంగాప్రవాహంబు కన్నెగేదఁగిఱేకు
              నమృతాంశురేఖ ముత్యాలసేస
యురగేంద్రహారంబు కురువిందములపేరు
              విసము కప్పురముతో వీడియంబు
ప్రాఁత కంకటి కాలు పంకసంజాతంబు
              జింకపిల్లయు రాచచిలుక బోద
యిభచర్మచేలంబు యింద్రగోపపుఁ బట్టు
              భూతిపుంజము నవ్యపుష్పరజము


తే.

హేమ[86]గోత్రకోదండంబు నిక్షుధనువు
గలుగు నర్థనారీశ్వరాకారమునను
భువనజాలంబు భక్తులఁ బ్రోవుమయ్య
రాజహంసరథాంగ! శ్రీరామలింగ!

52

రావిపాటి త్రిపురాంతకుఁడు

ఉ.

పామును హారము న్నెలయుఁబాపట సేసయు నేరు మల్లికా
దామము తోలుదువ్వలువ దట్టపుభూతియుఁ జందనంబు మై
సామున జాలు నందముగ సన్నిధి చేసినఁ జూడఁగంటి నే
నా మదిలోఁ [87]గుమారగిరినాథుని శైలసుతాధినాథునిన్.

53

హరిహరము

హరిభట్టు – ఉత్తర నరసింహపురాణము

సీ.

మందారకుసుమంబుఁ జందురుండును గూడి
              మౌళిభాగంబునఁ గీలుకొనఁగ

ఫణికుండలంబును మణికుండలంబును
              గండభాగంబునఁ గప్పుకొనఁగ
వరచక్రశూలాబ్జవరదహస్తములందుఁ
              గంకణభుజగకంకణము లమరఁ
గనకకౌశేయంబు గజరాజచర్మంబు
              మునుకొని కటి[88]భాగమున నటింప


తే.

దిమిరమును జంద్రికయు జోక నమరినట్లు
పుండరీకోత్పలద్యుతుల్ [89]పొదలినట్లు
నీలవజ్రంబు లొకచోట నిలిచినట్లు
హరిహరాకృతి త్రిభువనానంద మయ్యె.

54

జయతరాజు ముమ్మన - విష్ణుకథానిధానము

సీ.

లసదురఃస్థలంబునఁ బసనైన గళమున
              విలసితలీల శ్రీ నిలిపినారు
చరణంబు పట్టున జడలలో చుట్టున
              ననువొందఁ[90]గా గంగ నునిచినారు
భవ్యగుణంబున దివ్యదేహంబున
              నొఱపు మీఱఁగ భూతి [91]నొఱసినారు
తిరముగా మూఁపునఁ గరమొప్ప రూపునఁ
              బొలుపొందఁగా ధాత్రిఁ బూనినారు


తే.

తెల్ల గలయిండ్ల నిలిచి వర్తిల్లినారు
ఇరువు రిరువుర భార్యల నేలినారు
పెక్కుమొగముల కొడుకులఁ బెనిచినారు
హరిహరులు వీరు సర్వలోకాధిపతులు.

55

నాచిరాజు సోమన – ఉత్తరహరివంశము [2-181]

సీ.

సారసంబున [92]లేవ నీరసంబునఁ [93]జావ
              పద్మాసనుఁడు వీరి పాలఁగనియె
రూపు గంటఁ జెలంగఁ జూపు మంట నలంగఁ
              బంచబాణుఁడు వీరి పాలఁగనియె
వరములు వడయంగ శిరములు గెడయంగఁ
              బంఙ్క్తికంఠుఁడు వీరి పాలఁగనియె
గేహరక్ష నటింప దేహశిక్ష ఘటింప
              బాణాసురుఁడు వీరి పాలఁగనియెఁ

తే.

గనియెఁ జిత్రంబునకు వీరి గలసియుండ
మనుపఁ జెఱుపంగఁ [94]జెఱుపంగ మనుప నేర్తు
రెల్ల లోకములకు దైవ మేకమగుట
హరిహరాత్మక మెఱిఁగితి మనిరి సురలు.

56

కవిలోకబ్రహ్మ - శివజ్ఞానదీపిక

[పెదపాటి సోమరాజు]

సీ.

బవరాన సూతుఁడై పార్థున కాతండు
              నచ్చినాఁ డీతండు మెచ్చినాఁడు
చంచత్కృపాస్ఫూర్తిఁ బంచాస్త్రు నాతండు
              పెంచినాఁ డీతండు నొంచినాఁడు
శేషపన్నగరాజు సెజ్జగా నాతండు
              వ్రాల్చినాఁ డీతండు దాల్చినాఁడు
హాలాహలముఁ జూచి యల్లంత నాతండు
              చెంగినాఁ డీతండు మ్రింగినాఁడు


తే.

చక్రి యాతండు వసుమతిచక్రి యితఁడు
[95]సవనపరుఁ డాతఁ డీతండు హరణ[96]పరుఁడు
విశ్వమయుఁ డాతఁ డీతండు విశ్వనాథుఁ
డనుచు హరిహరనాథుల నభినుతింతు.

57

బ్రహ్మస్తుతి

[97]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము పీ. 2

చ.

పొలయలుకన్ జపంబునకుఁ బూని కనుంగవ లెల్ల [98]మోడ్చియుం
దలపున మంత్రవర్ణమయతన్ గనుపట్టిన వాణిఁ జూచి న
వ్వొలయఁగఁ గౌఁగలించి [99]సుసుఖోన్నతిఁ జెందెడి విశ్వతోముఖం
డెలమిఁ దలిర్ప మత్కృతికి నీవుత విశ్వజనాభిముఖ్యమున్.

58

జయతరాజు ముమ్మయ - విష్ణుకథానిధానము

చ.

వల పెటువంటిదో ముసలివాఁ డనవచ్చునె యద్దిరయ్య ప
ల్కుల జవరాలు దాఁ జదువులోన జపంబులలోనఁ బాయ ద
గ్గలముగ నెల్ల ప్రొద్దును మొగంబునఁ గట్టిన [100]యట్టులుంటు (నీ)
నలువకు నంచుఁ [101]గాముఁడన నవ్వు విధాత శుభంబు లీవుతన్.

59

త్రిమూర్తిస్తుతి

చ.

కమలజకృష్ణశంకరులు కాంచననీలపటీరవర్ణు లా
గమనగచంద్రధారు లఘకంసపురారు(లు) హంసతార్క్ష్యగో
గమనులు జన్మపోషలయకారులు వాక్కమలాంబికేశ్వరుల్
శమకరుణావిభూతిగుణసక్తులు ప్రోతురు మమ్ము నెప్పుడున్.

60

అష్టదిక్పాలకస్తుతి

ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదచరితము [1-10]

చ.

హరిశిఖి[102]దంతి దైత్యవరుణానిలయక్షశివుల్ గజాజ[103]కా
సరనరనక్ర[104]కైణహయశాక్వరయానులు వజ్రశక్తి ము
ద్గరశరపాశకుంతసృణికార్ముకహస్తులు భోగశుద్ధిసం
గరజయశౌర్యసత్త్వజవకామ్యవిభూతులు మాకు నీవుతన్.

61

లక్ష్మీస్తుతి

ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదచరిత [1-6]

సీ.

[105]తమము [106]క్రొన్నెలవిండ్లు తమ్ములు శ్రీ [107]లద
              ములు [108]చంపకము [109]ముత్యములు పగడము
శశి [110]కందుకము [111]సంకు జక్కవల్ [112]వసుగుహల్
              బిసము లబ్జంబులు పెసరుగాయ
లలరులు ఫణివీచు లభ్రంబు నుడి రావి
              యాకు సైకత మంటు లతనుదొనలు
మఱిపండులు ప్రసూనమంజరుల్ కూర్మముల్
              మణులు తార లిగుళ్ళు మరునిపలక


తే.

యనఁగఁ దగు ముప్పదియునాల్గు నంగకముల
గంధగజయాన కలకంఠి కనకవర్ణ
పుష్పగంధి లతాంగి కర్పూరహాస
నీరవధికన్య మాయింట నిలుచుఁగాత.

62

పెద్దిరాజు అలంకారము [1-2]

ఉ.

పంకజముం దొఱంగి తదుపాంతచరన్మధుపప్రసక్తికిన్
గొంకి ఝషాది(రూ)పములకుం జను నాథునివింత య(క్కుపై)

[113]గింకిరి గాఁగ లచ్చి పరికించి యజస్రము నుండుఁగాత ని
శ్శంకఁ జళుక్యవిశ్వనృపసత్తము పుణ్యకటాక్షదృష్టులన్.

63

బమ్మెర పోతరాజు – భాగవతము [ప్రథమస్కంధము] [1-11]

మ.

హరికిం బట్టపుదేవి పుణ్యములప్రో [114]వర్థంపుఁబెన్నిక్క చం
దురుతోఁబుట్టువు భారతీగిరిసుతల్ దోనాడు పూబోణి తా
మరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా
సురతన్ లేములఁ బాపుతల్లి సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.

64

పార్వతీస్తుతి

బమ్మెర పోతరాజు – భాగవతము [ప్రథమస్కంధము] [1-10]

ఉ.

అమ్మలఁ గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలఁ బె
ద్దమ్మ సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ దన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి [115]యిచ్చుత మహత్త్వకవిత్వపటుత్వసంపదల్.

65

ఏర్చూరి సింగరాజు - షష్టస్కంధము [1-7]

క.

కాళికి సన్నుతబహులో
కాళికిఁ గమనీయవలయకర[116]కీలితకం
కాళికిఁ దాపసమానవ
కేళికి వందనము సేసి కీర్తింతు మదిన్.

66

మడికి సింగన – వాశిష్ఠరామాయణము [1-2]

ఉ.

శ్రీ యన విష్ణు పేరురముఁ జెన్ను వహించి యలంకరించి దా
క్షాయణి నాఁగ శంభుమెయి సామున నెక్కొని వాణి నాఁగ నా
తోయజగర్భు నెమ్మొగముఁ దూఁకొని యేలెడు నాదిశక్తి సు
శ్రీయుఁ జిరాయువున్ సరస[117]సిద్ధకవిత్వము మాకు నీవుతన్.

67

రావిపాటి త్రిపురారి [అంబికాశతకము]

ఉ.

భారతివై సరోజభవుపాల వహించి రమావధూటివై
నీరజనాభుఁ జెంది ధరణీధరనందనవై మహేశ్వరున్

గోరి వరించితమ్మ నినుఁ గొల్వక యూరక యేలఁగల్గు సం
సారసుఖంబు లీమనుజసంతతికిన్ దలపోయ నంబికా.

68

సరస్వతీస్తుతి

శ్రీనాథుని నైషధము [1-5]

సీ.

సింహాసనము చారుసితపుండరీకంబు
              చెలికత్తె చెలువారు పలుకుఁజిలుక
శృంగారకుసుమంబు చిన్నిచుక్కలరాజు
              పసిఁడికిన్నెరవీణ పలుకుఁదోడు
నలువ నెమ్మోముఁదమ్ములు కేళిగృహములు
              తళుకుటద్దంబు సత్కవుల మనసు
వేదాదివిద్యలు విహరణస్థలములు
              చక్కని రాయంచ యొక్కిరింత


తే.

యెపుడు నే దేవి కా దేవి యిందుకుంద
చంద్రచందనమందారచారువర్ణ
శారదాదేవి మామకస్వాంతవీథి
నిండువేడుక విహరింపుచుండుఁగాత.

69

[118]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [1-5]

శా.

కాసారంబులు సాహిణంబులు సరిత్కాంతుండు పూఁదోట వి
ద్యాసీమంబులు రచ్చపట్లు సురకాంతాలోకసీమంతభూ
షాసింధూరము పాద[119]లాక్ష యగు భాషాదేవి మత్ప్రౌఢజి
హ్వాసింహాసన మూనుఁగాతఁ [120]గృతియుక్తాలంక్రియాహంక్రియన్.

70

పెద్దిరాజు - అలంకారము [1-3]

చ.

వరచతురాననప్రతిభ [121]వాసికి నెక్కఁ బదక్రమంబులన్
దిరుగుచు నంగవిభ్రమము ధీముకురంబులఁ గానిపించుచున్
సరసవచస్సవిత్రి యగు చామ యలంకృతులన్ దనర్చి సు
స్థిరతఁ జళుక్యవిశ్వనృపశేఖరు హస్తమునందు నుండెడున్.

71

తులసి బసవయ్య - సావిత్రికథ

మ.

లలితాహంకృతిచేత రాచిలుక తాళం బుగ్గడింపం గరాం
చలవాచాలవిపంచికారణచంచద్గానముం గూడి యు

జ్జ్వలసాదాంబుజరత్న[నూపుర]చల[122]ద్వాద్యంబు [123]పెంపొంద వా
గ్జలజాతాక్షి యొనర్చు నా హృదయరంగక్షోణి నృత్యక్రియన్.

72

[124]మడికి సింగన – పద్మపురాణము – ఉత్తరఖండము

చ.

అమృతము వంటి కాంతి కమలాసను పట్టపుదేవి వేదశా
స్త్రముల విహారభూమి కల ప్రాణుల కెల్లను బల్కుదోడు వి
శ్వమున సమస్తవిద్యల విశారద శారద నాదు వక్త్రప
ద్మమున వసించి మత్కృతిఁ జమత్కృతి పుట్టఁగఁ జేయుఁగావుతన్.

73

చిమ్మపూడి అమరేశ్వరుఁడు - విక్రమసేనము

చ.

చదువుచునున్నవే చిలుకచాయ నురస్స్థలరాగదీధితుల్
పొదవిన సాంధ్యరాగరుచిఁ బొందిన యిందుని కాంతిఁ బోలు సొం
పెద యలరంగఁ జొచ్చి సుఖియించు శుకాంచితపాణి వాణి మ
ద్వదనకు శేశయానననివాసినియై విలసించుచుండెడున్.[125]

74

[126]మడికి సింగన – పద్మపురాణము – ఉత్తరఖండము

ఉ.

వాడని తమ్మిచూలి తలవాకిటఁ గాపురముండు దేవి నీ
రేడు జగంబులుం దనకు నిమ్మగు వేడుకఁ బొమ్మరిండ్లుగా
నాడెడు కన్య విప్రులకు నాశ్రయమయ్యెడి పల్కుచేడె వా
దోడగుఁగాక మాకుఁ గృతిఁ దూకొను నిశ్చలవాక్యసిద్ధికిన్.

75

ఎఱ్ఱన – అరణ్యపర్వము[127] [4-216]

ఉ.

అంబ నవాంబుజోజ్జ్వలకరాంబుజ శారదచంద్రచంద్రికా
డంబరచారుమూర్తి వికటస్ఫుటభూషణదీప్తదీపికా
చుంబితదిగ్విభాగ [128]శ్రుతిసూక్తవివిక్తనిజప్రభావ భా
వాంబరవీథివిశ్రుతవిహార ననుం గృపఁజూడు భారతీ.

76

వినాయకస్తుతి

పెద్దపాటిసోమరాజు - అరుణాచలపురాణము

ఉ.

తారకజిచ్చిఖండి శివతాండవమాడిన తండు మర్దలా
ధారరవంబు మేఘునినదంబని చేరినఁ జూచి నాసికా
ద్వారబిలంబు జన్నిదపువ్యాళము చొచ్చినఁ దొండమెత్తి ఘీం
కారము సేసి నవ్వు వెనకయ్య కృతీశ్వరు మన్చుఁగావుతన్.

77

జయతరాజు ముమ్మన - విష్ణుకథానిధానము

చ.

స్ఫురదురుకర్ణతాళమునఁ బుట్టిన గాడ్పున విఘ్నవారిదో
త్కరములఁ బాఱఁదోలి మదధారల విశ్వముఁ దొప్ప [129]దోచుచున్
గరివదనుండు దోడుపడుఁగాత మహాగణనాథుఁ డర్థితోఁ
గరవరదస్తవంబు పని గైకొని [130]సల్పిన నాకు సత్కృపన్.

78

[131]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [1-4]

మ.

నను మన్నింపుము నీకు మామ యగు [132]మైనాకుండు నాకాధినా
థుని మ్రోలం బడునంచుఁ బార్వతి వియద్ధూత్కారముల్ మాన్చినన్
దనతుండంబునఁ చీల్చియున్న జలధిన్ దాఁ గ్రమ్మరన్ గ్రుమ్మరిం
చిన శుండాలముఖుండు మామకకృతిశ్రీ కిచ్చు నిర్విఘ్నతన్.

79

అభినవదండి కేతన – దశకుమారచరిత [1-5]

ఉ.

గ్రక్కున నేత్రయుగ్మము కరద్వితయంబున మూసిపట్టి యా
మిక్కిలి కంటికిన్ దనదు మిక్కిలి హస్తము మాటుసేసి యిం
పెక్కెడి బాలకేళిఁ బరమేశ్వరు చిత్తము పల్లవింపఁగాఁ
దక్కక ముద్దునం బొలుచు దంతిముఖుం గొలుతున్ బ్రసన్నుఁగాన్.

80

కంచిరాజు సూరయ - కన్నప్పచరిత

ఉ.

[133]కొమ్మును దొండమున్ కఠినకుంభయుగంబును [నయ్యుమాకపో]
లమ్ముల చారుకాంతిఁ దొడలన్ వలిచన్నులఁ బోలు పుత్త్రకుం
డిమ్ములఁ దల్లిఁ బోలి జనియించిన సంచితభాగ్యవంతుఁడౌ
నమ్మయటంచు సిద్ధసతు లక్కునఁ జేర్చు గజాస్యుఁ గొల్చెదన్.

81

చిమ్మపూడి అమరేశ్వరుని విక్రమసేనము

చ.

పరముఁడు కంధరస్థలముపై నిడి వేడుక ముద్దులాడఁగాఁ
గరమున మౌళిగంగ యుదకంబులు మెల్పునఁ చీల్చి యాదిశీ
కరములు భూషణేందునకు [134]గౌరవతారకలీలఁ జేయు త
త్కరివదనుండు మత్కృతికిఁ దా సుముఖస్థితి[135]తోడఁ దోడగున్.

82

దామరాజు సోమన - భరతము

ఉ.

నంది మృదంగరావము ఘనస్తనితం బని మ్రోలనున్న యా
స్కందుని వాహనం బగు శిఖండి యఖండితనృత్యమాడ భీ

తిం దన హస్తరంధ్రముగతిం జొరు నాభరణాహిరాజి [136]వో
వం దలయూపు విఘ్నపతి భాసురభూత్కృతి మమ్ముఁ బ్రోవుతన్.

83

షణ్ముఖస్తవము

జయతరాజు ముమ్మన - విష్ణుకథానిధానము

చ.

తమకముతోడఁ దల్లియును దండ్రియు నొక్కట ముద్దు వేఁడ సం
భ్రమమున వచ్చి తల్లిముఖపద్మముఁ దండ్రి మొగంబు లైదు వే
గమ తన యాఱుమోములను గైకొని ముద్దిడు మేటి[137]వేల్పు దాఁ
గొమరున నాదు వాణికి నకుంఠితశబ్దము లిచ్చుఁగావుతన్.

84

చిమ్మపూడి అమరేశ్వరుని విక్రమసేనము

చ.

చనవున రెండు వక్త్రములఁ జన్నుల పా ల్గుడువంగ నొక్క[138]మో
ము నగఁగ నొక్క యాననము ముద్దు నటింపఁగ నొక్క యాస్యముం
గనఁగ నిదేమి [139]లెక్కెదని యాలపనంబునఁ [140]జెక్కురింప ను
బ్బున నగు షణ్ముఖుం డెలమిఁ బొంది త్రిశక్తులు మాకు [141]నిచ్చుతన్.

85

భైరవస్తుతి

[వల్లభామాత్యుఁడు -] వీథినాటకము [?]

సీ.

చంద్రఖండములతో సరివచ్చు ననవచ్చు
              విమలదంష్ట్రాప్రరోహములవానిఁ
బవడంపుఁగొనలతోఁ బ్రతివచ్చు ననవచ్చుఁ
              గుటిలకోమలజటాచ్ఛటలవాని
నింద్రనీలములతో నెనవచ్చు ననవచ్చుఁ
              గమనీయతరదేహకాంతివాని
నుడురాజరుచులతో నొరవచ్చు ననవచ్చు
              చంచన్మహాట్టహాసములవాని


తే.

సిగ్గుమాలిన మొలవానిఁ జిఱుతవాని
నెల్లకాలంబు ములికినాఁ డేలువాని
నర్థి [142]మోపూర నవతారమైనవాని
భైరవునిఁ [143]గొల్వ వచ్చిరి భక్తవరులు.

86

మైలారస్తుతి

[వల్లభామాత్యుఁడు] వీథినాటకము [145]

సీ.

శనివారసిద్ధి సజ్జనపారిజాతంబు,
              [వరదాత] యాదిత్యవార[భోగి]
మా లచ్చి రమణుండు మాపాలి పెన్నిధి
              [144](మాళవీప్రియభర్త మహితయశుఁడు
కత్రశాలస్వామి కరుణాపయోరాశి
              పుణ్యకీర్తనుఁ [145]డైన [146]ప్రోలి యయ్య
[147]పల్లెమ్మనాయకుం డెల్ల వేల్పుల రాజు
              [148][గనపవేఁటల వేడ్కకాండ్ర భర్త


తే.

మంచు కుంచాలఁ గొలువంగ మాయలేళ్ళఁ
బట్టి కట్టంగ నేర్చిన బాసవెల్లి
భైరవుని తోడిజోడు మైలారుదేవుఁ
డోరుఁగంటి నివాసి మే లొసఁగుఁగాత].

87

రావిపాటి - త్రిపురారి

మ.

పొల గయ్యంబుల ముద్దుటల్క కలనన్ బుష్పాయుధారాతి మ్రొ
క్కుల దీర్పన్ దలమీఁదఁ గాననగు నీ క్రొమ్మేను పుణ్యాంగనా
తిలకంబైన భవానిపాదనఖపంక్తిం జెంద డెందంబులోఁ
దల తాల్చు న్నెలతోడి మక్కువలు చంద్రా! రోహిణీవల్లభా!

88

వైనతేయస్తుతి

భైరవుని శ్రీరంగమాహాత్మ్యము [1-3]

ఉ.

ఆయతచండతుండనిహతాహినికాయునిఁ దప్తహాటక
చ్ఛాయుని సర్వవేదమయసన్నుతకాయుని దేవదానవా
జేయుని నప్రమేయుని నశేషవిహంగకులాధిపత్యధౌ
రేయునిఁ బ్రస్తుతింతు సుచరిత్రవిధేయుని వైనతేయునిన్.

89

భావన పెమ్మన - అనిరుద్ధచరిత్ర

సీ.

ఉప్పరం బెగయఁగ నొదవిన వెరవున
              సడిసన్న రోహణశైల మనఁగ
వినతాసుతాకృతి వినువీథి వర్తిల్లు
              బాలభానుప్రభాపటల మనఁగఁ

జైతన్యసంపదాస్పదభాతి దివిఁ బర్వు
              శాతమన్యవచాపభూతి యనఁగ
జడధి నుండక మింటఁ జరియించుటకు మూర్తి
              పొలుపు దాల్చిన రత్నపుంజ మనఁగ


తే.

వివిధమండనభవవిభావిభవజటిల
నిఖిలదిక్చక్రవాళుఁడై నిరుపమాన
జవసముల్లాసగగనసంచారగరిమ
చెలువు నెలవయ్యె నప్పు డప్పులుఁగుఱేఁడు.

90

శేషస్తుతి

నన్నయభట్టు – ఆదిపర్వము [1-1-104]

చ.

బహువనపాదపాబ్ధికులపర్వతపూర్ణసరస్సరస్వతీ
సహితమహామహీభర మజస్రసహస్రఫణాళిఁ దాల్చి దు
స్సహతరమూర్తికిన్ జలధిశాయికిఁ బాయక శయ్యయైన య
య్యహిపతి దుష్కృతాంతకుఁ డనంతుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.

91

భైరవుని శ్రీరంగమాహాత్మ్యము [1-2]

మ.

శయనంబై యుపధానమై నిలయమై సచ్ఛత్రమై పాదుకా
ద్వయమై మంగళపీఠమై మృదులవస్త్రంబై సమస్తోచిత
క్రియలన్ జక్రికి నిత్యసన్నిహితమూర్తిన్ బొల్చు శేషాహి న
క్షయమేధానిధిఁ గావ్యలక్షణకళాచార్యున్ బ్రశంసించెదన్.

92

చాటువులు

ఆ.

పదియుఁ బదియుఁ బదియుఁ బదియేనుఁ బదియేను
నిరువదేను నూటయిరువదేను
నూఱు నూఱు నూఱు, యిన్నూఱు మున్నూఱు
తలలవాఁడు మిమ్ము ధన్యుఁజేయు.

93

మదనస్తుతి

చిమ్మపూడి అమరేశ్వరుని విక్రమసేనము

చ.

గొనయము తమ్మినూల్ చెఱకుఁగోల ధనుర్లత [149]పువ్వుటమ్ము లే
టును నొకమాయ మాయతో నతనుఁ[150]డున్ మును నుగ్రు జయించి జీవరా
శి నొడుచు టేమిచెప్పనని చేయు నుతుల్ దగు మోహనప్రవ
ర్తన గల కాముఁ డీవుత ముదంబున [151]మా కిలఁ గామసౌఖ్యముల్.

94

కళావిలాసము

సీ.

పృథులవిశ్వంభరారథమున కెదురుగాఁ
              బూన్పించె నెవ్వఁడు పువ్వుఁదేరు
కాంచనాచలకార్ముకమునకు సాటిగాఁ
              జేపట్టె నెవ్వాఁడు చెఱకువిల్లు
[152]నవిహతపాశుపతాస్త్రమ్మునకు వాఁడి
              మిగిలించె నెవ్వండు చిగురుఁదూపు
నతులితామరదానవాదిబలంబుల
              గెలిపించె నెవ్వఁ డయ్యళిబలంబు


తే.

నట్టి జగజెట్టి మన్మథుఁ డఖిలలోక
ములకు వెఱగొంగ జీవుల మూలకంద
మతనియిలు సొచ్చి వెడలనియతఁడు గలఁడె
యతనియమ్ములఁ బడకున్నయతఁడు గలఁడె.

95

వ్యాసస్తుతి

తిక్కనసోమయాజి – భీష్మపర్వము [6-1-71]

ఉ.

ప్రాంశుపయోదనీలతనుభాసితు నుజ్జ్వలదండధారుఁ బిం
గాంశుజటచ్ఛటాభరణు నాగమపుంజపదార్థ[తత్త్వ]ని
స్సంశయకారుఁ గృష్ణమృగచర్మకృతాంబరకృత్యు భారతీ
వంశవివర్ధనున్ ద్రిదశవందితు సాత్యవతేయుఁ గొల్చెదన్.

96

శ్రీనాథుని భీమఖండము [1-6]

మ.

తలఁతున్ భారతసంహితాధ్యయనవిద్యా[153]నిర్మితిప్రక్రియా
నలినప్రోద్భవునిన్ గళిందతనయాంతర్వేదిపుణ్యస్థలీ
పులినాభోగకృతావతారు నపరాంభోజాక్షు నక్షీణని
ర్మలసాహిత్యకళాసమృద్ధికయి పారాశర్యమౌనీశ్వరున్.

97

కూచిరాజు ఎఱ్ఱయ - సకలపురాణసారము

ఉ.

నీరజనేత్ర కృష్ణమృగనేత్ర నవారుణనేత్ర వృష్టివ
న్నీరదగాత్రు వేదగణనిర్మలసూత్రుఁ బురాణభారత
స్ఫారకథాచరిత్రు ఘనపాపనికుంజలతాలవిత్రు దు
ర్వారతపస్సమాధిజితశత్రుఁ బరాశరపుత్త్రుఁ గొల్చెదన్.

98

వాల్మీకిస్తుతి

శ్రీనాథుని భీమఖండము [1-5]

శా.

శ్లోకంబుల్ శతకోటిఁ గాండములుగా సూత్రించి రామాయణం
బేకైకాక్షర మెల్లపాపములు మాయింపంగ నిర్మించి సు
శ్లోకుండైన పురాణసంయమివరుం జూతు న్మనోవీథి వా
ల్మీకిన్ బ్రహపదావతీకర్ణకవితాలీలావతీవల్లభున్.

99

సుకవిప్రశంస

శ్రీనాథుని భీమఖండము [1-7]

సీ.

ప్రణుతింతు రసభావభావనామహనీయ
              కవితాసముల్లాసుఁ గాళిదాసు
గణుతింతు నిరవద్యగద్యపద్యనిబంధ
              పరితోషితస్థాణు భట్టబాణు
భజియింతు సాహిత్యపదవీమహారాజ్య
              భద్రాసనాసీనుఁ బ్రవరసేను
వర్ణింతు నంభోధివార్వీచిసంభార
              గంభీరవాక్సముత్కర్షు హర్షు


తే.

భాస శివభద్ర సౌమిల్ల భల్లటులకు
మాఘ భారవి బిల్హణ మల్హణులకు
భట్టి చిత్తప కవి దండిపండితులకుఁ
గీలు కొల్పుదు నొసలిపైఁ గేలుదోయి.

100

[1-9]

ఉ.

పంచమవేదమై పరఁగు భారతసంహిత నంధ్రభాషఁ గా
వించెఁ బదేనుపర్వములు విశ్వజగద్ధితబుద్ధి నెవ్వఁ డ
క్కాంచనగర్భతుల్యున కఖండితభక్తి నమస్కరింతు ని
ర్వంచితకీర్తివైభవవిరాజికిఁ దిక్కనసోమయాజికిన్.

101

పెద్దపాటి యెఱ్ఱాప్రెగడ - కుమారనైషధము

సీ.

ఈశుచేఁ గాంచి సాహిత్యవిద్య ధరిత్రి
              నిల్పినయట్టి పాణిని భజించి
శ్లోకార్థమునఁ జంద్రజూటు మెప్పించి యి
              ష్టార్థముల్ గన్న మల్హణు నుతించి
గద్యంబు చెప్పి శంకరునిచేఁ గరములు
              ప్రతిభతోఁ బడసిన బాణుఁ దలచి

శతకంబు చెప్పి భాస్కరుని మెచ్చగఁ జేసి
              యురుదేహుఁడైన మయూరుఁ గొలిచి


తే.

భవుని మెప్పించి కన్నులు [154]వడసి తెచ్చి
వనిత కిచ్చిన కాళిదాసునికి మ్రొక్కి
హరుని [155]వినతులచేఁ <ref>క.బాత</refబాస లాడఁజేసి
నట్టి ధట్టుని నన్నయభట్టుఁ బొగడి.

102

కవిలోకబ్రహ్మ – అరుణాచలపురాణము

[పెదపాటి సోమరాజు]

సీ.

వ్యాసుని వాల్మీకి వరరుచి వామను
              [156]భాను క్షేమేంద్రునిఁ బ్రవరసేనుఁ
గర్ణామృతు మయూరుఁ గాలాంతకుఁ గళింగు
              కవిదైత్యు శివదాసుఁ గాళిదాసు
భట్టార హరిచంద్రు భట్టనారాయణు
              భట్టగోపాలుని భట్టబాణు
భాసు భామహు సార్వభౌముని శివభద్రు
              భారవి భవభూతి భర్తృహరిని


తే.

రాజశేఖరుఁ జోరు మురారిఁ గృష్ణ
మిశ్రు జయదేవు దండి సౌమిల్లు సోమ
చంద్రు [157]దిఙ్నాగు విజయ విశాలదేవు
హర్షుఁ జిత్తపు శాతవాహను సుబంధు
మాఘ మల్హణు బిల్హణు మఱియుఁ గలుగు
[[158]ప్రథితగీర్వాణకవులను బ్రణుతి సేసి].

103

[?]

సీ.

ప్రతిభావిలంఘితభారతబహుకథా
              ఘట్టు నన్నయభట్టుఁ గడు భజించి
యుభయభాషాప్రౌఢిమోద్యన్మహా[159]రాజ్య
              భాజిఁ దిక్కనసోమయాజిఁ బొగడి
వాక్ప్రతోషితదక్షవాటీమహాస్థాన
              భీము వేములవాడ భీముఁ గొలిచి
భావబంధనిబంధ పరమేశ బిరుదప్ర
              [160]శర్మ నెఱ్ఱయ [161]శర్మ నుతించి

తే.

భారతీహారు భవదూరుఁ బ్రణుతి సేసి
సుకవికులసోము నాచనసోము నెన్ని
నవ్యకవితాసనాథు శ్రీనాథుఁ దలఁచి
సకలసరసాంధ్రకవుల కంజలి యొనర్చి.

104

జయతరాజు ముమ్మన - విష్ణుకథానిధానము

ఉ.

పూర్వకవీంద్రులన్ గొలుచు పూనికి నిప్పటివారిఁ గొల్తు ని
ర్గర్వత నిక్కవీంద్రులు పురాణకవీంద్రులకంటె తక్కువే
యుర్విని నేఁటివారగుట యొచ్చెమె నేఁడును దామ్రపర్ణిలోఁ
బూర్వపు ముత్తియంబులను బోలిన మౌక్తికరాజి లేదొకో.

105

అభినవదండి కేతన – ఆంధ్రభాషాభూషణము

ఉ.

మెచ్చుఁడు మెచ్చవచ్చునెడ మెచ్చకుఁ డిచ్చకు [162]మెచ్చరానిచో
మెచ్చియు మెచ్చు మ్రింగకుఁడు మెచ్చక మెచ్చితిమంచు [163]గృచ్ఛలై(?)
మెచ్చకుఁ డిచ్చ [164]మెచ్చఁ గని మెచ్చుఁడు మెచ్చొక మానమైనచో
మెచ్చియు మెచ్చకుండ[165]కయ మెచ్చుఁడు సత్కవులార! మ్రొక్కెదన్.

106

నిశ్శంకుని కొమ్మయ – శివలీలావిలాసము [1-12]

ఉ.

నన్నయభట్టుఁ గావ్యరచనా[166]విదుఁ దిక్కనసోమయాజి న
చ్ఛిన్నమహత్త్వ సం[167]విదితశేముషి నెఱ్ఱయప్రెగడన్ సము
త్పన్ననవప్రబంధరసభావకు నింపుగఁ బ్రార్థనాంజలుల్
మున్నుగ నాత్మలోఁ దలఁతు మువ్వుర మువ్వురఁ బోలు పుణ్యులన్.

107

కవిత్వలక్షణము

భైరవుని శ్రీరంగమహత్త్వము [1-14]

సీ.

శబ్దార్థరూఢి రసస్థితి బహువిధ
              వ్యంగ్యభేదములు భావములు గతులు
శయ్య లలంకారసరణులు రీతులుఁ
              బరిపాకములు దశప్రాణములును
వరవృత్తజాతులు వస్తువివేకంబుఁ
              గవిసమయముఁ జమత్కారములును
వర్ణనంబులు గణవర్ణఫలంబులుఁ
              దత్కులంబులు నధిదైవతములు

తే.

గ్రహములును శత్రుమిత్రయోగములు [168]దశలు
నంశవేధయు భూతబీజాక్షరముల
[169]పొత్తువులు దెల్పి [170]శాంతవిస్ఫురణఁ దనరు
సత్కవీంద్రుని కృతి బుధసభల వెలయు.

108

కవిలోకబ్రహ్మ - కేదారఖండము

సీ.

లలిఁ గావ్యనాటకాలంకారములు సూచి
              శబ్దప్రపంచంబు జాడఁ దెలిసి
వర్ణోద్భవవ్యక్తి వర్గగ్రహారిమి
              త్రస్నిగ్ధరూక్షచింతనము లెఱిఁగి
గణరూపదేవతాగ్రహమైత్రినక్షత్ర
              మాతృకాపూజాదిమార్గ మెఱిఁగి
జల్లి విక్రియ కాకు పొల్లు వ్యర్థముద్రాభ
              విరసంబు గ్రామ్యోక్తి పరిహసించి


తే.

కవిత సెప్పినఁ దగుఁగాక కవిసి నోరి
కొలఁదు లివ్వల నవ్వలఁ గూర్చి తెచ్చి
దిట్టకూళతనంబున వట్టి బిగిని
కావ్యమని చెప్ప మెత్తురే కవిజనములు.

109

[?]

మ.

పదలాలిత్యము వర్ణశుద్ధియును శబ్దస్థైర్యమున్ మంగళా
స్పదభావంబును రాజయోగ్యతయు దోషస్ఫూర్తిరాహిత్యమున్
సదలంకారవిశేషమున్ గలిగి విశ్వప్రాణసౌభాగ్యసం
పదమై తేజియుఁ బోలి క్రాలవలదా పద్యంబు హృద్యస్థితిన్.

110

[?]

శా.

సౌరభ్యంబును బంధచాతురగతిన్ శయ్యాచమత్కారశృం
గారంబున్ వివిధార్థముల్ సరససాంగత్యంబు నానాకళా
పారీణత్వము మంజువాగ్విభవమున్ బాంచాలరీతిం దగన్
వారస్త్రీయును బోలె నొప్పవలదా వర్ణింపఁ గావ్యం బిలన్.

111

చిమ్మపూడి అమరేశ్వరుని విక్రమసేనము

చ.

చవి యన [171]వేద [172]యామకరసంజ్ఞరసంబు లెఱింగి పానముల్
చవిగొను మాడ్కిఁ గావ్యమును జయ్యన మేలని పోక శబ్దముల్
చెవి ధరియించి యీ రసవిశేషము నెల్ల నెఱింగి మెచ్చు స
త్కవి విని మెచ్చఁజేయునది కావ్యముగాఁ గవియైనవారికిన్.

112

భైరవుఁడు - శ్రీరంగమహత్త్వము [1-20]

ఉ.

పుట్టకుఁ బుట్టి కోమలికిఁ బుట్టిన ప్రాఁగవు లాదరించి చేఁ
బట్టినఁ గాదె రాఘవనృపాలక ధర్మజకీర్తిచంద్రికల్
నెట్టన మూఁడులోకములు నిండిన విప్పుడు నిందునందు[173]లన్
ముట్ట నఖర్వసర్వసుఖమూలము కావ్యము వో దలంచినన్.

113

నీతిసారము - ల.శి. 1.50

ఉ.

ఆకులవృత్తి రాఘవుశరాగ్రములందుఁ దృణాగ్నలగ్ననీ
రాకృతి వార్థి నిల్చుట దశాసనుఁ డీల్గుట మిథ్య గాదె వా
ల్మీకులు చెప్పకున్నఁ గృతిలేని నరేశ్వరువర్తనంబు ర
త్నాకరవేష్టితావని వినంబడ దాతఁడు మేరు వెత్తినన్.

114

జయతరాజు ముమ్మయ - విష్ణుకథానిధానము

క.

సుతుఁడు దటాకము దేవా
యతనము నల్లిల్లు [174]నిధియు నారామము స
త్కృతియు నను సంతతులయం
దతిశయము ప్రబంధ మెపుడు నక్షయ మగుటన్.

115

కుకవినిరసనము

జయతరాజు ముమ్మయ - విష్ణుకథానిధానము

శా.

ఆహా కావ్యము మేలుమేలనమి యన్యాయంబు వో శారదా!
ద్రోహం బేటికిఁ గట్టుకో మనుచు సంతోషించునట్లుండు న
ట్లూహాదుల్ విని సత్కవీంద్రుఁ డితరుం డొచ్చెం బపేక్షించు సం
దేహించుం దన సొమ్ము పోయినగతిన్ దీనత్వమున్ బొందుచున్.

116

[175]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [1-16]

ఉ.

[176]సాంతము గాఁగ శబ్దహృదయజ్ఞులుగా రుచితప్రయోక్తలై
వింతలుగాఁ బ్రబంధముల వీథులు ద్రొక్కఁగ లేరు శక్తులై
దొంతర జల్లి బొంత లెడఁగూర్చి గతార్థము గూర్చు దుష్టవి
భ్రాంతుల సంగతిం దడవఁ బాసె రసజ్ఞులకుం గవిత్వముల్.

117

కవిలోకబ్రహ్మ - శివజ్ఞానదీపిక

క.

సుకవులు పలుకఁగఁ [177]గెలఁకులఁ
గుకవులు దా రఱతు [178]రౌర కొలఁకు లభ్రమర
ప్రకరము ఝంకారింపఁగ
బెకబెక మనకేల మాను భేకము లవలన్.

118

అమడూరి నరసింహభట్టు - షోడశరాజుచరిత్ర

శా.

జంఘాలప్రతిభాను లార్షకవితాసంజాతు లాశుక్రియా
సంఘస్రష్టలు సంఘశః [179]కమలజుల్ సాహిత్యసర్వంకషుల్
సంఘర్షార్హులు గాక కాకవులు లక్ష్యంబే హలిగ్రామఘా
ణంఘణైక్యశరణ్య బల్చ (?) జనిబంధల్ మత్కటాక్షేక్షుకున్.

119

మాదయగారి మల్లయ - రాజశేఖరచరిత [1-7]

శా.

గాఢార్థప్రతిపాదనక్రమకళాకౌశల్యముల్ లేక వా
చాఢక్కార్భటి [180]తోడ తామ తము [181]మఝ్ఝాయంచుఁ గైవారముల్
ప్రౌఢిం జేయుచుఁ బ్రాజ్ఞుల న్నగుచు గర్వగ్రంథులై యుండు న
మ్మూఢస్వాంతుల మెచ్చకుండుటయు సమ్మోదంబు మాబోంట్లకున్.

120

జక్కన - సాహసాంకము [1-17]

క.

ప్రతిపద్యముఁ జోద్యముగాఁ
గృతిఁ జెప్పిన నొప్పుఁగాక కృతి నొక పద్యం
బతిమూఢుఁడైనఁ జిత్రతఁ
బ్రతిపాదింపఁడె ఘుణాక్షరన్యాయమున్.

121

బొడ్డపాటి పేరమరాజు - సూర్యశతకము

శా.

ఈఁగల్ వోలె వ్రణంబులే వెదకుచు న్నీర్ష్యంబున న్మెచ్చకే
మూఁగల్ వోలె నిరంతరాస్యులగుచున్ మూర్ఖించి తర్కించినన్
వీఁగన్నేరని దుష్కవుల్ బ్రతుకనీ విక్రాంతులైవారి నో
రాఁగన్ బోవఁగనేల సత్కవులు సూర్యా! పద్మినీవల్లభా!

122

మడికి సింగన – వాశిష్ఠరామాయణము [1-7]

చ.

కదిసిన నోరవోయి యొరు కబ్బపు దొంతుల సత్పదార్థముల్
గదుకుచు నెట్టివారిఁ బొడగన్ను [182]గుఱ్ఱని స్నేహసౌఖ్యముల్
మదికి నసహ్యమై శునకమార్గమునం జరియించుచున్న త
ద్పదకవు లెల్ల మత్కవితఁ దప్పులు పట్టక వింద్రుగావుతన్.

123

అష్టాదశవర్ణన

పెద్దిరాజు – అలంకారము [3-92]

మ.

పురవారాశిమహీదరర్తుశశభృత్పూషోదయోద్యానపు
ష్కరకేళీమధుపాన[183]మోహనవియోగక్షేమయానస్వయం
వరపుత్త్రోత్సవమంత్రదూత్యరణదోర్వైక్రాంతిసంకీర్తనా
కర మష్టాదశవర్ణనాన్వితము సత్కావ్యంబు భవ్యం బిలన్.

124

ప్రౌఢకవి మల్లన – రుక్మాంగదచరిత్ర [1-18]

క.

వనజలకేళీరవిశశి
తనయోదయపానయానదౌత్యాబ్ధివివా
హనృపతివిరహఋతుమం
త్రనగాహవనగరవర్ణనలు దగుఁ గృతులన్.

125

పురవర్ణన

పెద్దిరాజు – అలంకారము [3-93]

క.

దుర్గమపరిఖావరణని
సర్గబలానీకచతురచాతుర్వర్ణ్యా
నర్గళసంపద్ఘనజల
వర్గస్తుతి వలయు నగరవర్ణనములకున్.

126

[3-94]

సీ.

గంభీరపరిఖ నాఁగ స్త్రీల కశ్రాంత
              కేళీవినోదదీర్ఘిక యనంగ
నుత్తాలసాల[184]1మన్యుల కుబ్బి దివిఁ బ్రాకఁ
              జేసిన దీర్ఘనిశ్రేణి యనఁగఁ
జతురచాతుర్వర్ణ్యసంఘ మర్థుల పాలి
              రాజితకల్పకారామ మనఁగఁ
భ్రాంతసంస్థితయైన భవజూటవాహిని
              భుక్తిముక్తిప్రదస్ఫూర్తి యనఁగఁ


తే.

నెప్పుడును నొప్పు రాజమహేంద్రవరము
ధరణిఁ గల్పించె నేరాజు తనదు పేర

నట్టి రాజమహేంద్రుని యనుఁగు మనుమఁ
డెనఁగుఁ జాళుక్యవిశ్వేశ్వరుండు.

127

[185]సంకుసాల సింగన – కవికర్ణరసాయనము [1-2]

సీ.

జాతరూపమనోజ్ఞజాతరూపంబైన
              కోటచే వలయాద్రి నోటుపఱిచి
మధుసుధారసపూర [186]మధు[ర]నీరంబైన
              పరిఘచే వారాశి భంగపఱిచి
నవరత్నచిత్రాభినవయత్నకములైన
              యిండ్లచేఁ గనకాద్రి యేఁపు గఱిచి
కాంతనిర్మలచంద్రకాంతబద్ధములైన
              కుట్టిమంబుల ధాత్రి గొంచె పఱిచి


తే.

కమలగర్భుండు దనసృష్టి గాని భువన
కోశదుర్గంబు నణగింపఁగోరి దీని
వేడ్క నిర్మించెననఁ బొల్చు విమతహృదయ
[187]ఘట్టనంబైన సాకేతపట్టణంబు.

128

తెనాలి రామలింగన్న - హరిలీలావిలాసము

సీ.

వినుతమాణిక్యవందనమాలికాకాండ
              కల్పితరోహితాకారరేఖ
జాలకానననిర్యదాలోలవాసనా
              గరుధూపపోషితకంధరాళి
చంద్రశాలాతిగర్జన్మృదంగధ్వాన
              విరచితపవిఘోషవిభవలహరి
సంభోగసంరంభసమయవిచ్ఛిన్నము
              క్తాహారమణికృతకనకనికర


తే.

మదనమదభారమంథరమత్తకాశి
నీ దృగంచలసంచితనిబిడచంచ
లాలతాతల్లజయు [188]నై యిలావివిక్త
వర్ష యన నొప్పు కాకుత్స్థవంశనగరి.

129

తులసి బసవయ్య - సావిత్రికథ

సీ.

హరినీలరుచిరమధ్యప్రభా[189]యోగంబు
              నంభోదరశ్రేణి నపహసింప
శశికాంతకుట్టిమచ్ఛాయాకలాపంబు
              వరబలాకావైభవమ్ము నెఱప
నంగనాచటులకటాక్షపాతంబులు
              సౌదామనీవిలాసములు సేయ
నిబిడభేరీశంఖనినదసంరంభంబు
              ఘనగర్జితప్రౌఢిఁ గైకొనంగఁ


తే.

గలహవిగళితసౌధాగ్రగతవధూటి
కాప్రసూనాళికరకా[190]ప్రకాస్తిఁ బెనుప
మహిమ నే ప్రొద్దు వర్షాగమంబు ఠేవ
దీపితం బయ్యె భోగవతీపురంబు.

130

జక్కన - సాహసాంకము [7-133]

సీ.

శ్రీకవితానూనచిత్రరేఖాయుక్తి
              కొమ్మలందును గోటకొమ్మలందు
నవరసపదవృత్తనానార్థగరిమలు
              రాజులందును గవిరాజులందుఁ
గరలోకసంతోషకరజీవనస్థితి
              సరసులందును గేలిసరసులందు
నవనవ[191]శ్రీసుమనఃప్రవాళవిభూతి
              మావులందును నెలమావులందుఁ


తే.

గలిగి సముదగ్రసౌధాగ్రతలసమగ్ర
శాతకుంభమహాకుంభజాతగుంభి
తోరురత్నవినూత్నశృంగార మగుచు
[192]సిరుల నొప్పారు విక్రమసింహపురము.

131

మాదయగారి మల్లయ్య - రాజశేఖరచరిత్ర [1-7]

సీ.

సౌధచరద్వధూజనదర్పణీభవ
              ద్ద్వివ్యలోకస్రవంతీజలంబు
రజతవప్రస్థాణుగజచర్మశాటీభ
              వత్పరిఘావారివలయితంబు

శాతమన్యవశిలాస్థగితకాంచీధామ
              భాసురోపవనాళిపరివృతంబు
పౌరప్రతాపవిభ్రాంతికృత్కుట్టిమ
              స్థలశోణమణిరుచిస్థపుటితంబు


తే.

బహువిధామోదమోదితభసలకలభ
విసరవిసృమరఝంకారవేణునినద
సరసగాయకగానరసప్రసంగ
సౌఖ్యతర మగునావంచికాఖ్యపురము.

132

పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [1-69]

సీ.

పద్మరాగోపల ప్రాకారరుచిజాల
              గండూషితవ్యోమమండలంబు
పాతాళజల[193]ఝరీపర్యాప్తకల్లోల
              సుకుమారపరి[194]ఖోప[195]శోభితంబు
[196]శక్రనీలశిలావిశాలగోపురరోచి
              రసమయజనితమిథ్యాతమంబు
కనకగోపానసీఖచితముక్తాఫల
              రాజివిలగ్నతారాగణంబు


తే.

రాజసదనాగ్రదేశవిరాజమాన
తోరణాలీనమణిగణద్యుతివితాన
విభవలక్ష్మీవిడంబితవిలసదింద్ర
చాపరుచిచాపలము హస్తినాపురంబు.

133

పెద్దపాటి యెఱ్ఱాప్రెగడ - మల్హణకథ [1-33]

సీ.

కువలయకమలాభినవమనోజ్ఞం బయ్యుఁ
              బంకజీవనపరిప్లవము గాక
ఘనసారపున్నాగకమనీయ మయ్యును
              గితవ[197]దుష్కనకసంయుతము గాక
సాధుదానప్రౌఢియూధపం బయ్యును
              విశ్రుత[198]ఖరసమన్వితము గాక
రాజితోత్తమజాతిరత్నాంకితం బయ్యు
              శృంగార[199]కూటదూషితము గాక


తే.

వరసరోవరచయమును వనచయంబు
నృపచయంబును దివ్యమంటపచయంబు
నెలమిఁ దనుఁబోలు నను పొగడ్తలు వహించె
భువనసారంబు కల్యాణపురవరంబు.

134

కోటవర్ణన

ఆదిపర్వము

చ.

పరిఘజలంబులం దమరు పంకరుతహ్పోలకైతవాదిసుం
దరకుసుమంబులన్ ఘనపదంబున నుజ్జ్వలతారకానిరం
తరకుసుమంబుల న్వెలయుఁ దత్పురవప్రము పాదపీఠికా
శిరముల కొప్ప నర్చనలు సేసిన పువ్వుల యవ్విధంబునన్.

135

పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [1-71]

మ.

దివిఁ బ్రాకారము ముట్టియుండఁగఁ దదుద్దేశంబునం గోటతో
దవులుం జక్రమ నిక్కమంచుఁ బురిమీఁదన్ రాక పార్శ్వంబులం
గవనుంద్రోవ ననూరుయత్నమున రాఁగా [200]నౌటఁగాఁబోలు బో
రవితే రుత్తరదక్షిణాయనములం బ్రాపించి దీపించుటల్.

136


క.

పురికొల్పు రత్నదీప్తుల
నరుణములై చుక్కలుండ నంగారకునిన్
బరికించి యిందుఁ దెలియక
కరము విచారింతు రెంత కార్తాంతికులున్.

137

పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

క.

కోటతుద మకరప్రభ
దీటుగొనం బర్వి పరులదృష్టికి నొప్పున్
బాటించి మేయ దివి రవి
ఘోటకముల కజుఁడు పసురు కొలిపినభంగిన్.

138

[201]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [1-3]

క.

పట్టణరమ బిరుదునకై
పట్టిన పగలింటి దివియ దాగునఁ గోటన్
జుట్టును దన్మణిగణరుచి
ఘట్టితతేజమునఁ దిరుగు ఖరకరుఁ డెపుడున్.

139

బమ్మెర పోతరాజు – దశమస్కంధము [10-1-1594]

క.

కోటయు మిన్నును దమలోఁ
బాటికి జగడింప నడ్డవడి నిల్చిన వా

చాటులగతిఁ దారకములు
కూటువులై కోటతుదలఁ గొమరారుఁ బురిన్.

140

తెనాలి రామలింగయ్య - హరిలీలావిలాసము

క.

పురనిధిరక్షకునై ఫణి
పురము వెడలి [వెట్టి] వెట్టి పొంగారు ఫణా
ధరపరివృఢుకరణి భయం
కరమగుఁ బ్రాకారపరిధి కడు నచ్చెరువై.

141

పరిఖలు

జక్కన - సాహసాంకము [1-64]

చ.

ధరణికిఁ గోట చక్రగిరి దాని కగడ్తట వారి రాసులా
పరిఖలు కోటలో నునికి భావ్యము గాదని యబ్జసూతి భా
సురముగఁ జక్రభూధరము చుట్టును వార్థులు నిల్పె నాఁగ శ్రీ
కరముగఁ గోటచుట్టును నగడ్తలు చెల్వగు నప్పురంబునన్.

142

ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదచరిత [1-72]

సీ.

కాలకంధరచాపఖండనోద్ధతరాఘ
              వామోగతీవ్రశరాగ్నిఁ దెగక
కలశోద్భవోదగ్రకఠినహస్తకుటీర
              కోణకోటరమునఁ గ్రుంకఁబడక
యౌర్వానలాభీలదుర్వారభీకర
              జ్వాలికావలిచేతఁ గ్రోలఁబడక
యక్షుద్రరౌద్రబాహాటోపపక్షిరా
              ట్పక్షవిక్షేపంబు పాలుగాక


తే.

రమణఁ జూపట్టు రత్నాకరంబు నాఁగ
ఘుమఘుమారంభగంభీరఘూర్ణమాన
మీనకమఠోగ్రనక్రసమృద్ధిచేతఁ
బరఁగు విదిశాపురంబునఁ బరిఖజలధి.

143

తెనాలి రామలింగయ్య - హరిలీలావిలాసము

చ.

సరళదలత్సరోజఘనసారపరాగపరంపరాపరి
స్ఫురితసువర్ణవర్ణమును బూరితదిఙ్ముఖహంసనాదమే
దురమును నై యగడ్త కనుదోయికిఁ బండువు సేయ మ్రోయుఁ ద
త్పురవరలక్ష్మి యెప్పుడును బూనెడు కాంచనకాంచియో యనన్.

144

[202]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [1-4]

క.

పరిఖాకమఠముపైఁ దన
భరియించిన ధరణి నిల్పి ప్రాక్కమఠము త
చ్చిరవ హనశ్రమహతికా
పరిఖాజలఖేలనంబు పలుమఱు సలుపన్.

145

తులసి బసవయ్య - సావిత్రికథ

చ.

ఉరగవధూజనంబులు పయోధరసంభృతకుంకుమాంకముల్
గరఁగ నిరంతరంబు నవగాహన మర్థి నొనర్పుచుండఁగా
నరుణరుచిం గనుంగొనంగ నందమగు బరిఖాంబుతోయ మ
ప్పురిఁ దనఘోరవీరరసముం బ్రకటింపుచునున్నకైవడిన్.

146

సౌధములు

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

సీ.

బహువర్ణరత్నప్రభాతతి దివికి నొ
              ప్పఁగ [203]వనాంతశ్రీవిభాతి గాఁగ
నగ్రస్థితాంగనాస్యామోదములు దివ్య
              సరిదబ్జములకు వాసనలు గాఁగ
రమ్యస్థలములు నిర్జరుల చూడ్కికిఁ [204]గామ
              రాగజాకరముల లాగు గాఁగ
రజతకుట్టిమకాంతిరాజరోచుల కెదు
              రరుగు [205]చుట్టపుఁబిండు వరుస గాఁగ


తే.

సరసలీలావిలాసవిస్ఫురణ గలుగు
రమణ రమణులచే నప్డు గొమరు మిగిలి
పొడవు సొబగును గలిగి యప్పురమునందు
ధర్మనిర్మితహర్మ్యముల్ పేర్మి నడరు.

147

తులసి బసవయ్య - సావిత్రికథ

సీ.

సురవాహినీహేమసరసిజమ్ములు గోయ
              జను లర్థి నిడిన నిచ్చెన లనంగ
నభ్రంబు పాథోధి యనుచు నేఁగఁగ నిల్చి
              సాగిన శరదభ్రచయము లనఁగ
జవభిన్నరవిరథాశ్వములు నిల్వఁగ నోలిఁ
              బన్నిన పటికంపుఁదిన్నె లనఁగ

తే.

భూమికాంచితన్వమణిస్తోమధామ
మండలాఖండలాచ్ఛకోదండఖండ
పటలవర్తితదేహళీబర్హికులము
లగుచు నప్పురి సౌధంబు లతిశయిల్లె.

148

పోతరాజు భైరవుఁడు – శ్రీరంగమహత్త్వము [4-258]

సీ.

తెరల వ్రాసిన [206]వ్రాఁత దీపించు పులులకు
              మది లోఁగుఁ జందురుమచ్చ యిఱ్ఱి
తూలాడు పడగలతుదల తాఁకున [207]నుల్కి
              రవితేరిహరు లుప్పరమ్ము దాటుఁ
[208]గేళాకుళులలోని కెందమ్మితూఁడులు
              వింతగా నజు నెక్కిరింత [209]నంజు
రమణఁ బెంచిన మయూరంబులు వేలుపుఁ
              గన్నెలతోఁ దాళగతుల నాడు


తే.

ననిన నందులఁ దమిఁ జెప్ప నరుదులైన
సవడి గ్రహరాజు మేడల సవరణలను
మేటి పొడవులు నిట్టిట్టి పాటి వనుచు
జగములోపల మఱి వేఱె పొగడనేల.

149

నంది మల్లయ్య - మదనసేనము

సీ.

తళతళమను పతాకలతోడ రవికాంతి
              దలతలమనెడి రత్నములతోడఁ
గనఁగన సొబ గధికంబైన పొడవుతో
              గనకనమను హేమకాంతితోడఁ
గలకలఁ బల్కు చిల్కలతోడ గృహదీర్ఘి
              కలఁ గలహంససంఘములతోడఁ
బరిపరి గతినాడు బర్హులతో నిజో
              పరిపరిగతి మేఘపంక్తితోడఁ


తే.

దముల విహరించుఁ బారావతములతోడ
భ్రమదళివ్రాతసుమవితానములతోడఁ
బ్రమదవనవాసనలచేతఁ బ్రమద మొసఁగి
యెనయు నీమేడతోఁ బ్రతి యెనయఁ గలదె.

150

[210]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [1-7]

శా.

ఏణీలోచన లాత్మవక్త్రరుచిచే నేణాంకసౌభాగ్య మ
క్షీణప్రౌఢి హరింప సౌధపథసంకీర్ణేంద్రనీలోపల
శ్రేణీనిర్మలకుట్టిమంబులపయిన్ శీతాంశుఁడున్ బెద్దయై
ప్రాణాచారము పడ్డ యట్ల ప్రతిబింబవ్యాప్తిచేతం దగున్.

151

[1-8]

చ.

అహరహముం బ్రభాతముల హర్మ్యతలోపరిచంద్రశాలికా
గృహములఁ గామినీసురతకేలివిసూత్రితహారమౌక్తిక
గ్రహణపరాయణంబులగుఁ గావునఁ దన్మతిఁ బ్రాంతతారకా
గ్రహములఁ జంచులం గమిచి కాయుఁ బురిం జిఱుప్రోది పార్శ్వముల్.

152

మాదయగారి మల్లయ - రాజశేఖరచరిత [1-45]

శా.

నీడల్పాఱు పసిండిమేడలపయిన్ నీలాలకల్ పుట్టచెం
డాడం దాఁకిన కందుగాని శశియం దంకంబు గాదంచు వా
దాడన్ వచ్చిన యంకకానికిఁ దదీయాశంకవో వీటి పెన్
ప్రోడల్ దోడ్కొనిపోయి చూపుదురు తన్నూత్నక్రియాకేళికల్.

153

తెనాలి రామలింగయ - హరిలీలావిలాసము

ఉ.

పున్నమచందమామఁ బొరపుచ్చు సుధారస మొయ్యఁ జిల్కుచున్
సన్నము గాఁగ నూరి ఘనసారమునన్ బ్రతిపాక మిచ్చి మీఁ
ద న్నెఱయంగ [211]నర్కినవిధంబున వెన్నెల గాయ నప్పురిన్
సున్నపుమేడ లభ్రపదచుంబిశిరోగృహరాజి రాజిలన్.

154

బమ్మెర పోతరాజు – దశమస్కంధము [10-1-1597]

ఉ.

ఆయతవజ్రనీలమణిహాటకనిర్మితహర్మ్యసౌధవా
తాయనరంధ్రనిర్గత[212]సితాభ్రమహాగరుధూపధూమముల్
తోయదపంక్తులో యనుచుఁ దుంగమహీరుహరమ్యశాఖలన్
జేయుచునుండుఁ దాండవవిశేషము లప్పురిఁ గేకిసంఘముల్.

155

పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [1-70]

ఉ.

ఆపురి నున్నతస్ఫటికహర్మ్యవిభాపటలంబు నింగి ను
ద్దీపితమైనఁ జూచి యిది దివ్యతరంగిణి యెత్తి వచ్చెఁ దా
నీ పయిత్రోవ నంచు బయలీఁదుచుఁ గోయఁ దలంతు రగ్రసం
స్థాపితహేమకుంభములు తామరలంచు వియచ్చరాంగనల్.

156

ఏర్చూరి సింగయ్య - కువలయాశ్వచరిత

ఉ.

చల్లనిపండువెన్నెలల సౌధతలోన్నతహేమవేదులం
దల్లన వల్లభుల్ గదిసినట్లు సుధాకరుఁ జూచి ప్రాణముల్
ఝల్లన రాహువుం దలఁచి సయ్యనఁ బాపుదు రంకసంగతో
త్ఫుల్లవధూముఖంబులను బొల్పగు కస్తురిపత్రభంగముల్.

157

నన్నయభట్టు – ఆదిపర్వము [1-8-71]

ఉ.

ఇమ్ముగ విశ్వకర్మ రచియించిన కాంచనహర్మ్యతుంగశృం
గమ్ముల రశ్మిరేఖలు ప్రకాశములై కడుఁ బర్వి తత్సమీ
పమ్మునఁ బాఱుచున్న ఘనపంక్తులయం దచిరద్యుతప్రతా
నమ్ములఁ గ్రేణిసేయుచు ననారతముల్ విలసిల్లు నప్పురిన్.

158

తులసి బసవయ్య - సావిత్రికథ

ఉ.

అన్నగరంబు హర్మ్యములయందు ఘటించిన పద్మరాగర
త్నోన్నతకాంతిమండలము [213]లొక్కమొగిన్ జదలేటఁ బర్వినన్
కిన్నెరకాంత లాత్మఁ [214]దిలకింతురు జంబునదీప్రవాహ మి
ట్లెన్నడు వచ్చె నింగికని యెత్తిన [215]శంకల సంభ్రమంబులన్.

159

పడగలు

శ్రీనాథుని నైషధము [2-41]

శా.

వేదాభ్యాసవిశేషపూతరసనావిర్భూతభూరిస్తవా
సాదబ్రహ్మముఖౌఘ[216]విఘ్నితనవస్వర్గక్రియాకేలిచే
నాదిన్ గాధితనూజుచే సగము సేయంబడ్డ మిన్నేఱు ప్రా
సాదస్వచ్ఛధుకూలకైతవమునన్ జాలంగ నొప్పుం బురిన్.

160

మాదయగారి మల్లయ - రాజశేఖరచరిత [?]

క.

ఖరకరహిమకరులును వా
సరముల దివసాత్యయముల సాకేతపురో
దరకేతుపటలి నొడువన్
దెరలరె రవిశశులుం గడుఁ దీవ్రత నిగుడన్.

161

పణిదపు మాధవుడు – ప్రద్యుమ్నవిజయము

చ.

ఎడపక దివ్యవస్తువు లనేకము లుండుటఁజేరసి యేమిటన్
గడమ యిడంగరాని నిజగర్భభరంబున దేవతాపురిం

దొడరుట కప్పురంపుబిరుదుల్ గగనంబున కెత్తెనో యనన్
బొడవున నాడుచుండు నృపపుంగవ! మారుతవైజయంతికల్.

162

[217]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [1-6]

ఉ.

కన్నులపండువై పొలుచుఁ గన్గొన నప్పురలక్ష్మి సారెకున్
వి న్ననువొప్ప విచ్చు నెఱివేణితెఱంగున మందమారుతో
ద్యన్నిజకేతనాంచలకరాగ్రములం బ్రవిసారితంబులై
యున్నతసౌధశైలశిఖరోపరిలంబితమేఘలేఖికల్.

163

సాలభంజికలు

[218]పణిదవు మాధవుఁడు - ప్రద్యుమ్నవిజయము

ఉ.

పోలఁగ [219]నిందులన్ గలుగు పుష్పసుగంధుల రూపవైభవ
శ్రీ లరయంగఁ గోరి యటఁ జేరిన ఖేచరయక్షదైవత
స్త్రీ లని సంశయింపఁగఁ బురీజను లద్భుతదర్శన[220]క్రియా
చాలనదూరత న్నెఱయు సౌధహిరణ్మయసాలభంజికల్.

164

గోపురములు

నన్నయభట్టు – ఆదిపర్వము [1-8-77]

చ.

తమము నణంచుచున్ వెలుఁగుఁ దత్పురగోపురశాతకుంభకుం
భముల విచిత్రసన్మణిగభస్తివితానములన్ విచిత్రవ
ర్ణములగు నాత్మవాహముల నమ్మక పల్మఱుఁ జూచి యన్యవా
హములని సంశ[221]యప్రణిహితాత్ముఁ డగున్ హరిదశ్వుఁ డెప్పుడున్.

165

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

క.

పురగోపురశిఖరంబులం
గరమరు [222]దగు పద్మరాగకలశము [223]లొప్పున్
చరమాచరమాద్రులపై
సరిఁ బున్నమఁ దోఁచు [224]సూర్యచంద్రుల కరణిన్.

166

పెదపాటి యెఱ్ఱాప్రెగడ - కుమారనైషధము

క.

కురువిందవజ్రమయగో
పురకాంతులవలనఁ బ్రొద్దుపోకలు రాకల్

167

పరికింప నరిది యయ్యును
సరసిజకైరవవికాససంపద దెలియన్.

1667

[225]ఏర్చూరి సింగరాజు - కువలయాశ్వచరిత

ఉ.

గోపురగోపురప్రతిమ గోపురముల్ చెలువొంద నప్పురిన్
మాపులు రేపులుం గనలు మంజులగీతవినోదకృత్యముల్
చూపఁగఁ గిన్నెరాదు లవి చూచునెపంబున వచ్చి నేర్తు రా
లాపవిశేషనర్తనవిలాసకలాపముల న్ముదంబులన్.

168

ఎఱ్ఱాప్రెగడ - మల్హణకథ [1-35]

చ.

[226]గములుగఁ బద్మరాగములఁ [227]గమ్రమరీచులు చౌకళింపఁగా
గమలవనంబు నెన్నఁడు వికాసము [228]గుందవు వజ్రమౌక్తికా
సమరుచిచంద్రికన్ గుముదషండములుం గసుగందకుండు నాఁ
గొమరగు దివ్యరత్నమయగోపురవైభవ మెన్న నేటికిన్.

169

దేవగేహములు

జక్కన - సాహసాంకము [1-67]

చ.

వరకనకప్రభాతివిభవంబున మేరుమహీధరంబులై
నిరుపమవజ్రమౌక్తికవినిర్మలకాంతుల వెండికొండలై
సురుచిరరత్నదీధితుల సొంపున రోహణపర్వతంబులై
పురమున దేవగేహములు పొల్పెసలారును వైభవోన్నతిన్.

170

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

చ.

ఇలకు నుపేంద్రుతోఁ దగిలి యీశుఁడు వేల్పులపిండు వెండి గు
బ్బలికిని [229]బైఁడికొండకును బాలెము నిచ్చలుఁ జేయు చంద్రసూ
ర్యుల నిలఁ దెచ్చిరో యనఁగ నొప్పగు నప్పురి హేమరత్నమం
డలిఁ దగి [230]రాగభోగపరిణాహము లయ్యెడి దేవగేహముల్.

171

గృహములు

[231]ఏర్చూరి సింగయ్య - కువలయాశ్వచరిత

శా.

ప్రాచీనంబులు రత్నకాంతులు లసత్ప్రాకారముల్ హేమముల్
సూచింపన్ ఘనవేదకుట్టిమము లాశుభ్రాంశుకాంతంబులై
యేచోట న్వరరత్నజాలములచే నింపొంది సొంపొందుచున్
వాచాగోచరమై గృహంబు లమరున్ వస్తుప్రశస్తోన్నతిన్.

172

పణిదపు మాధవుఁడు - ప్రద్యుమ్నవిజయము

తే.

తొలుత ముంగిళ్ళఁ గర్పూరధూళిఁ దుడిచి
సహజచందనజలములఁ జాఁపి చల్లి
చారుగృహములఁ గమ్మ కస్తూరి నలికి
మ్రుగ్గు లిడుదురు పురసతుల్ ముత్తియముల.

173

చిమ్మపూడి అమరేశ్వరుఁడు - విక్రమసేనము

క.

హరగిరి సురగిరి రోహణ
గిరు లీనిన కొదమ లనఁగ గృహములు పురి న
చ్చెరువగును గుడ్యరత్న
స్ఫురణను విలసిల్లి తగిన పొడవులతోడన్.

174

నన్నయభట్టు – ఆదిపర్వము [1-8-72]

చ.

అలఘుతరంబులై తుహినహారసుధారుచినిందురోచిరా
కులశశికాంతవేదిపృథుకుంజగళజ్జలనిర్ఘరంబులన్
విలసితజాహ్నవీవిమలవీచివిలోల[232]లసత్పతాకలం
బొలుపగుఁ దత్పురీభవనముల్ హిమశైలముఁ బోలి యున్నతిన్.

175

బ్రాహ్మణులు

పెదపాటి సోమయ్య - అరుణాచలపురాణము

సీ.

అంగయుక్తంబుగా నామ్నాయములు నాల్గు
              చదువంగనేరని సద్ద్విజాతి
[233]బ్రహ్మపద్మాదిపురాణాగమేతిహా
              సము లెఱుంగని బ్రహ్మసంభవుండు
భాట్టవైశేషికప్రాభాకరాదిశా
              స్త్రము లాఱు చూడని ధరణిసురుఁడు
స్వకులోచితములైన సప్తతంతువు లెల్లఁ
              బార మేదింపని బాడబుండు


తే.

కావ్యనాటకలసదలంకారముఖ్య
విద్యలన్నియు నెఱుగని విప్రవరుఁడు
పంచయజ్ఞంబులును లేని బ్రాహ్మణుండు
వెదకి చూచినఁ బొడమఁ డా వీటిలోన.

176

జక్కన - సాహసాంకము [1-69]

తే.

భూమిఁ దనతోడి యిరువురుఁ బూజ గొనఁగ
ధాత యా చందమునఁ బొందఁ దాను గోరి
వివిధభూసురాకారత వెలసె ననఁగ
బ్రహ్మసంఘంబు మెఱయు నప్పట్టణమున.

177

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

ఉ.

శీలము లీల లంగములు చేకొని క్రాలెడు వేదముల్ కలా
జాలము మన్కిపట్లు యతిసజ్జనసంపద దిట్ట లర్థి పూ
జాలలితప్రభావములు ++++++ ++++++ ++++++
వేలుపుఁబిండు పండువులు వీట ధరామరు లుత్తమస్థితిన్.

178

పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [1-76]

చ.

శ్రుతి గవుడొందినం గమలసూతికినైనను దీర్చిచెప్ప నే
రుతురు పురాణశాస్త్రములు ప్రొద్దున నిండ్లను గీరశారికా
తతులు పరీక్ష లీ విని ముదంబును బొందుదు రింద్రుపట్టమున్
క్రతువులు వే యొనర్చియును గైకొన రప్పురి విప్రసత్తముల్.

179

తెనాలి రామలింగయ - హరిలీలావిలాసము

ఉ.

వేదపురాణశాస్త్రములు వేడుక విద్యలు సర్వయజ్ఞసం
పాదనశక్తి నిత్యనిరపాయవిధిప్రతిపాలనంబు దా
రాదిమతత్వముం గనుట హస్త[234]గతామలకంబుఁ గంట ధా
త్రీదివిజావతంసుల కరిందమ [235]మన్పురిఁ గల్గు వారికిన్.

180

[236]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [1-9]

క.

క్రతుభుజులఁ గృపాపాచకు
లతిగూఢబ్రహ్మనిధికి సంజనికులు భా
రతికిని బేరోలగములు
బ్రతి లే కలరుదురు పురము బ్రాహ్మణవర్యుల్.

181

బమ్మెర పోతరాజు – దశమస్కంధము [10-1-1602]

క.

బ్రహ్మత్వము లఘు వగు నని
బ్రహ్మయు బిరుదులకు వచ్చి పట్టఁడు గాకా
బ్రహ్మాదికళలఁ దత్పురి
బ్రహ్మజనుల్ బ్రహ్మఁ జిక్కుఁ [237]పఱుపరె చర్చన్.

182

ఏర్చూరి సింగరాజు - కువలయాశ్వచరిత

శా.

ఆదిబ్రహ్మముఖాళి చాలక విహారార్థప్రయత్నంబుతో
వేదంబుల్ భువి ధర్మపోషణకు నై విఖ్యాతిగాఁ బుట్టెనో
కాదే నిట్టిమహత్త్వ మన్యులయెడన్ గానంబ నాఁ బొల్తు రా
భూదేవోత్తము లప్పురంబున మహాపుణ్యప్రభావంబులన్.

183

ప్రధానులు

బాలకాండ [1-26]

ఉ.

దానులు రాజ్యవర్ధనులు తత్త్వవిచారు లుదారు లింగిత
జ్ఞానులు మంత్రకోవిదులు సత్యవచస్కులు విద్విషత్తమో
భానులు ధీయుతుల్ చతురుపాయసమర్థులు రాజకార్యసం
ధానపరాయణుల్ వినయతత్పరు లాదిప్రధాను లప్పురిన్.

184

క్షత్రియులు

కవికర్ణరసాయనము [1-10]

శా.

పౌనఃపున్యముచేతఁ గాని రిపులం భంజింపలేఁడయ్యె భూ
దానం బొక్కెడఁ గాని షోడశమహాదానంబులం జేయఁ డిం
కే నీతిన్ జమదగ్నిరాముఁడు సముం డిద్ధప్రసిద్ధోన్నమ
ద్దానక్షాత్త్రగుణంబులం బురవరాంతక్షత్త్రియశ్రేణికిన్.

185

తెనాలి రామలింగయ - హరిలీలావిలాసము

ఉ.

ఏటి మహానుభావుఁ డిహిహీ జమదగ్నితనూజుఁ డేడు ము
మ్మాటులఁ గాని శత్రుమదమర్దనదక్షుఁడు గాఁడు గోత్రమే
తూఁటుగఁ [238]జేసి తల్లిమెడఁ ద్రుంచెగదా యని యీసడింతురౌ
గాటపుపంతగాండ్రు కులగణ్యులు [239]క్షత్రియరాజు లప్పురిన్.

186

పెద్దపాటి సోమయ్యగారు - అరుణాచలపురాణము

ఉ.

రాజులు విక్రమోగ్రమృగరాజులు విశ్రుతదివ్యకాంతి రే
రాజులు రూపరేఖ రతిరాజులు మానగుణంబునందు రా
రాజులు దానశక్తి ధనరాజులు వైభవభోగవృద్ధి స్వా
రాజు లనంగ నొప్పుదురు రాజితతేజులు తత్పురంబునన్.

187

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

శా.

అవ్యాయామపురారు లక్షుభితపారావారు లక్షీణపు
ణ్యవ్యాపారసురేంద్రు లగ్రహణచంద్రాదిత్యు లస్థావర

ప్రవ్యక్తామరభూరుహంబు లచతుర్భావాననబ్రహ్మలో
దివ్యద్వారవతీపురిం గలుగు ధాత్రీపాలు రెల్లప్పుడున్.

188

ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదచరిత [1-68]

ఉ.

మిత్రసమానతేజులు సమిద్రఘురాములు వైరివాహినీ
గోత్రమహీధరాఘ[240]శరకోటు లఖండనిరంకుశక్రమ
క్షాత్త్రులు సామజాశ్వరథచంక్రమణైకసమర్థు లుత్తమ
క్షత్త్రియు లర్కసోమకులసంభవు లుండుదు రప్పురంబునన్.

189

తులసి బసవయ్య - సావిత్రికథ

ఉ.

పోకులఁ బోయి యన్యసతిఁ బొందినవాఁడు సదా కళంకి దో
షాకరుఁ డుగ్రమూర్తి సముదగ్రవిషాగ్నిసహోదరుండు ప
ద్మైకవిరోధి సంతతజితాత్ముఁడు మా సరి [241]రా డటంచు ను
త్సేకముతోడ రాజు నిరసింతురు రాజకుమారు లప్పురిన్.

190

బొడ్డపాటి పేరయ్య

సీ.

కమలాకరస్ఫూర్తి కాసారములయందుఁ
              దమయందుఁ గలుగంగఁ దనరుచుండు
గంభీరజీవనక్రమ మగడ్తలయందుఁ
              దమయందుఁ గలుగంగఁ దనరుచుండు
ధారావిహార ముత్తమతురంగములందుఁ
              దమయందుఁ గలుగంగఁ దనరుచుండు
సుమనోవికాసంబు ప్రమదావనములందుఁ
              దమయందుఁ గలుగంగఁ దనరుచుండు


తే.

దానమహిమ సముత్తుంగదంతులందుఁ
దమకరములఁ గలుగంగఁ దనరుచుండు
సిరుల సంతోషమున ముఖ్యశీలవృత్తి
రణజయౌదార్యములఁ బురి రాజకులము.

191

వైశ్యులు

పెద్దపాటి సోమయ్య - అరుణాచలపురాణము

సీ.

విపణి [242]గోరో యన్న విబుధాచలంబైనఁ
              దెమ్మనఁ [243]దేని వైదేహికుండు
పులిజున్ను వలె నన్నఁ బొరుగిల్లు సూపక

              యాక్షణంబున నీని [244]యార్యవరుఁడు
మహనీయకౌస్తుభమాణిక్యమునకైన
              వెలఁ ద్రెంచనేరని విడ్వరుండు
గురుతరహాటకకోటికిఁ బడగలు
              కోటి యెత్తని వణిక్కుంజరుండు


తే.

మందునకునైన లేరు సమగ్రభోగ
భాగ్యసంక్రందనులు జగత్ప్రకటకీర్తు
లర్థిసంపత్ప్ర[245]దుల్ నిర్జితార్థపతులు
వర్ణితోదారు లప్పురి వైశ్యు లెల్ల.

192

జక్కన – సాహసాంకము [1-73]

చ.

పరుసని భూతివ్రాఁతయును బన్నగభూషణు పున్క కోరయున్
గరివరచర్మముం దొఱగి గ్రక్కున లేమికి బొమ్మఁ బెట్టఁడే
హరుఁడు కుబేరుచే వెడలి యాదట మా సఖుఁడైన నంచు న
ప్పురమున వైశ్యు లాడుదురు పుణ్యము పేర్మిఁ బ్రతాపధాములై.

193

పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

మ.

బహువస్తుక్రయవిక్రయక్రియలు సంపత్ప్రాప్తికై కాకయు
న్విహితాచారములైన చందములు వర్ణింపంగ నింతింత నా
మహిలో రాదని చెప్పనొప్పుదురు ధీమంతుల్ కుబేరార్చనన్
మహిమోదాహరణంబు లప్పురము కోమట్లెల్ల లక్ష్మీస్థితిన్.

194

ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదచరిత [1-69]

క.

మేటి ధనధాన్యసంపదఁ
గోటులకును బడగ లెత్తికొన నమ్మంగా
ఘోటుకగజరత్నాంబర
[246]కోటల గల వైశ్యు [లచటఁ] గోటుల తరముల్.

195

బమ్మెర పోతరాజు – దశమము [10-1-1605]

క.

రత్నాకరమై జలనిధి
రత్నము లీ నేర దేటి రత్నాకరమో
రత్నములఁ గొనుదు రిత్తురు
రత్నాకరజయులు వైశ్యరత్నములు పురిన్.

196

[247]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [1-11]

ఉ.

లేకి నిధివ్రజంబు లవలేశము కాంచనభూధరంబు ర
త్నాకరరత్నరాశు లడిగంట్లు మరున్మణికామధుక్సురా
నోకహముల్ క్రయోచితవినూతనవస్తువు లిట్టి వట్టి వన్
వాకుల కందరాని పురవైశ్యుల సంపద లెన్ని చూపుచోన్.

197

మాదయగారి మల్లయ్య – రాజశేఖరచరిత [1-50]

ఉ.

కాఁకరపండు వంటి జిగి గల్గిన మేలిపసిండి ధాత్రికిన్
వ్రేఁకముఁ ద్రవ్వి పోసినను వేయి యుగంబులు చెల్లు ధాన్యముల్
పోఁకకుఁ బుట్టె డమ్మినను బో నొకకల్పము పట్టు మాడ్కి పే
రేఁకటి దీఱ వైశ్యపతు లిండ్ల గనుంగొన నొప్పు నప్పురిన్.

198

తెనాలి రామలింగయ్య - హరిలీలావిలాసము

చ.

యుగములు వేయి వోవు నొక[248]యుద్ధరవుల్ గణుతించు[249]నంతకే
యుగములు లక్ష చెల్లుఁ [250]బొదినున్న ధనంబు మితింప నమ్మహా
యుగశతకోటు లేఁగు నితరోన్నతవస్తువు లెన్నఁ గీన వె
ల్తిగ నలకాధినాథులు గదే పురిలో మను వైశ్యపుంగవుల్.

199

ఏర్చూరి సింగయ్య - కువలయాశ్వచరిత

తే.

శేషఫణులకు మణులైనఁ జేరి యమ్మఁ
గోరి రత్నాకరంబైన గుత్త గొనఁగఁ
జాలి [251]పైవస్తుసంచయసమితి నొనరి
పరఁగుదురు వైశ్యవర్యు లప్పట్టణమున.

200

తులసి బసవయ్య - సావిత్రికథ

క.

అపూర్ణశంఖపద్మమ
హపద్మాధికధనాఢ్యులై పుణ్యజన
వ్యాపారవృత్తి పెంపున
నా పౌలస్త్యుని గణింప రప్పురవైశ్యుల్.

201

తిక్కన సోమయాజి - విజయసేనము

చ.

కొనియెదమన్న [252]బండరులు కోటుల కమ్ముదు రమ్మఁబూని తె
చ్చినసర కెంత పెద్దవెల సెప్పినఁ గొండ్రు తగంగ నిచ్చి న
చ్చిన[253]వెల దీర్చి లక్ష్మి తమ చెప్పిన యట్టుల సేయ సొంపు పే
ర్కొన [254]గుఱుతింపరాదు పురికోమటులన్ బ్రణుతింపనొప్పదే.

202

శూద్రులు

పెద్దిరాజు - ప్రద్యుమ్నచరితము

క.

ద్విజశుశ్రూషాపరవశు
లజనితపరివాదు లభినవాకృతులు మహా
సుజనచరిత్రులు ధీరులు
భుజవిక్రమధనులు ఘనులు పురి శూద్రజనుల్.

203

ప్రౌఢకవి మల్లయ్య – రుక్మాంగదము [1-70]

క.

అద్రులు ధైర్యంబున బల
భద్రులు భుజశక్తిసహితభంజనమున సౌ
భద్రులు తత్పురమునఁ గల
శూద్రులు [255]శూద్రకసమానశోభితవర్యుల్.

204

తెనాలి రామలింగయ్య - హరిలీలావిలాసము

ఉ.

ఆ కఱివేల్పుసామి చరణాబ్జములన్ జనియించినారు మం
దాకిని తోడునీడ లయినారు నిజంబుగఁ గమ్మ [256]గట్టు దా
మై కమనీయకీర్తిమహిమాతిశయంబున మించినారు భ
ద్రాకృతు లద్రిధీరులు ప్రభాద్రులు మాద్రులు శూద్రు లప్పురిన్.

205

పెదపాటి సోమయ - అరుణాచలపురాణము

ఉ.

బంటుతనంబు వైభవము భాగ్యము తేజము చాలఁ గల్గి ము
క్కంటిని దమ్మికంటి నధికంబగు భక్తి భజించి కేలిమైఁ
గంటకులన్ జయించి కలకాలము నర్థుల కోర్కిపంటలై
పంటలు బాడియున్ గలిగి పంటలు మీఱుదు రప్పురంబునన్.

206

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

ఆ.

రత్నగర్భగర్భరత్నంబు లవ్వీట
నర్థిఁ బుట్టుచుఁ గొనియాడ మరగి
వీథి వీథి నెపుడు విలసిల్లు నా నాప
ణముల వివిధరత్నసమితి వెలుఁగు.

207

నన్నయభట్టు - ఆదిపర్వము [1-8-73]

చ.

వననిధిలోని రత్నములు వాసుకిమూర్ధజరత్నసంఘముల్
గొనఁగ నవశ్యముం జనులకున్ సమకూరదు గాన నెప్పుడున్

గొనుఁడు పరార్థవస్తువులు గోరిన వానిన [257]యిత్తు మన్తెఱం
గునఁ బచరింతు రంగడులఁ గోమటు లప్పురి [258]సిద్ధరత్నముల్.

208

మాదయగారి మల్లయ్య - రాజశేఖరచరిత [1-46]

ఉ.

వారణవారికర్ణపుటవాతకిశోరసారసారక
ర్పూరపరాగముల్ నెఱయుఁబో పురవీథులఁ దార తార ము
క్తారమణీయమంటపవితానవినిర్గతకాంతివాహినీ
పూరములోపలం గలయఁబొల్చు వినిర్మలవాలుకాకృతిన్.

209

[259]సుంకసాల సింగయ్య – కవికర్ణరసాయనము [1-19]

ఆ.

ఉచితసమయ మగుటయును రత్నగర్భ ప్ర
సూతి నొందియున్న చొప్పు మెఱయు
వివిధమణిసమృద్ధి వీక్షింపఁగా నొప్పు
నప్పురంబులోన నాపణములు.

210

చిమ్మపూడమరేశ్వరుని విక్రమసేనము

ఆ.

నీర నగ్నియునికి యారయ విస్మయం
బనుచు బాడబాగ్ని కడరి యప్పు
రంబుఁ జొచ్చెనొక్కొ రత్నాకరము మణు
లనఁగఁ [260]బెలుచ నమరు నాపణములు.

211

పుష్పలావికలు

తెనాలి రామలింగయ్య - హరిలీలావిలాసము

సీ.

వలమానచంపకోత్పలమాలికాదిసం
              గ్రథనచాతురి నెఱ[261]కవులఁ బోలి
దళము [262]గెలిచిన సూత్రమున నూల్కొల్పు నే
              ర్పున యోధవీరుల పొలుపుఁ దెలిపి
ఖండితత్వమున రాగము గల పల్లవా
              వళిఁ [263]గోయుటల వేశ్య [264]వలపు నెఱపి
పలుతావు లరసి యెత్తులు పచరించు పెం
              పున జూదరుల ఠేవ వొడమఁ జేసి


తే.

తమ నిజాంగమరీచులు తత్తదన్య
పుష్పముల సావి నిక్కంపుఁ బువ్వు లమరు

పేరఁ బేర్కొను పౌరులఁ [265]గేరి కేరి
నవ్వుదురు పుష్పలావికానళినముఖులు.

212

[266]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [1-19]

సీ.

కరముల [267]కందించు విరులబంతుల కంటె
              వెడదోఁచు చన్నులు వేడ్కఁ బెనుప
మవ్వంబు గొన నెత్తు పువ్వు[268]టెత్తుల కంటెఁ
              గరమూలరుచి చూడ్కి గమిచి తిగువఁ
గోరిన నొసఁగెడు కొసరుపువ్వుల కంటె
              మొలకనవ్వులు డెందములు గరంప
నిరిడారు నలరుల నెత్తావిగమి కంటె
              సుముఖసౌరభములు చొక్కు [269]నినుప


ఆ.

జట్టికాండ్రఁ దమదు సరససుందరవిలా
సములచేతఁ దార జట్టిగొనుచుఁ
బురము వీథులకును భూషణప్రాయమై
క్రాలు పుష్పలావికాజనంబు.

213

కవిలోకబ్రహ్మ - అరుణాచలపురాణము

సీ.

భ్రమరికావలికప్పుఁ బ్రసవగుచ్ఛభ్రమద్
              భ్రమరకావలి కప్పు బాంధవింపఁ
గరముల కెంపును గమనీయహల్లకో
              త్కరముల కెంపు సఖ్యంబు సేయ
ముఖసౌరభములు నమోఘాతిముక్తక
              ముఖసౌరభంబులు మొనసి బెరయ
హాసవిస్ఫూర్తులు నతులవర్ణప్రతి
              హాసవిస్ఫూర్తులు నణఁగి పెనఁగ


తే.

[270]సరసములన్ గుందముల విలాసములు సూపి
వరుసఁ బువ్వులు జట్టికో [271]వచ్చినట్టి
జనుల మనసులు మును [272]వారు జట్టిఁగొండ్రు
పుష్పలావీవధూటు లప్పురమునందు.

214

పిల్లలమఱ్ఱి పినవీరయ్య - శాకుంతలము [1-83]

చ.

వెలకుఁ దగం బ్రసూనములు వేఁడుచు మార్వలికింప నెత్తులం
గలసి చిగుళ్ళు వెట్టి యడకట్టిన క్రొవ్విరిమొల్లపూవుటె
త్తులు దశనాధరద్యుతులఁ దోఁచినఁ బైకొన ఠీవిగా విటుల్
విలువఁగ వారిచిత్తములు విల్తురు తత్పురి పుష్పలావికల్.

215

జక్కన - సాహసాంకము [1-83]

ఉ.

[273]ఎత్తుల యొప్పుకంటె [274]సర మెత్తుట యొప్పఁగఁ జొక్కి విల్వకా
[275]ఱొత్తడిఁ బుష్పముల్ గొనర కూరక యున్కికి [276]నల్ల నవ్వుచున్
విత్తముతోన చిత్తములు వేగ హరింతురు నేర్పు మీఱఁగాఁ
జిత్తజువేఁట దిమ్మరులు బెల్వునఁ దత్పురిపుష్పలావికల్.

216

[277]పణిదవు మాధవుఁడు - ప్రద్యుమ్నవిజయము

క.

మెత్తని బంగరు రవరవ
లొత్తెడు కరమూలరోచు చొలయం[278]గాఁ దా
రెత్తులు గట్టెడు మిషమున
జిత్తినితన మెల్ల బయలుసేయుదు రచటన్.

217

వారస్త్రీలు

[279]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [1-20]

సీ.

గమనంబులే చాలుఁ గన్నులు దనియింప
              నృత్యంబు లేలొకో నేర్చి రిట్లు
పలుకులే చాలు వీనులకుఁ బండువు సేయ
              నెఱపాట లేలొకో నేర్చి రిట్లు
సౌందర్యములె చాలు సమ్మోహనమునకునై
              నేపథ్య మేలొకో నేర్చి రిట్లు
తారుణ్యములె చాలుఁ దలఁపులు గరఁగింప
              నెఱతనం బేలొకో నేర్చి రిట్లు


తే.

లిది ప్రియాతిరేక మిదిగదా నఖముఖ
సాధ్యమునకుఁ బరశుసంగ్రహంబు
వీరు గలుగ [280]మరుఁడు విజయి గాఁ డెట్లన
వఱలుదురు పురంబు వారసతులు.

218

ప్రౌఢకవి మల్లయ్య – రుక్మాంగదచరిత [1-71]

సీ.

శృంగారరసమునఁ [281]జికిలి సేయించిన
              కంతు మోహనసాయకంబు లనఁగ
మెఱసి [282]పోకను నిల్చి [283]మెలఁతలై కనుపట్టు
              కారుక్రొమ్మెఱుఁగుల గము లనంగ
వరరూపలావణ్యవైభవశ్రీమూర్తు
              లన మించు నవకల్పలత లనంగ
మురిపెంపు నడలచే గరువంబు దళుకొత్తు
              పసమించు రాయంచ పదువు లనఁగ


తే.

జిత్తజునితేరి కలికిరాచిలుక లనఁగఁ
గాంతిఁ జూపట్టు నవచంద్రకళ లనంగ
మగల నెలయించు మరుని దీమంబు లనఁగ
వారసతు లుందు రప్పురము నందు.

219

ఏర్చూరి సింగయ్య - కువలయాశ్వచరిత

సీ.

తమచూపు లొగిఁ బాంధతతులపైఁ బూనిన
              భావజు కరవాలభాతు లనఁగఁ
దమకురుల్ యువమృగేంద్రములకై తీర్చిన
              మరు నసమానంపుటురు లనంగఁ
దమహాసములు విటోత్కరమానములఁ బట్టు
              వలరాజు పువ్వులవల లనంగఁ
దమకాంతి పురుషులఁ దాపంబు నొందించు
              రతిరాజు మోహనరస మనంగ


తే.

జలజకాహళకదళికాపులినగగన
కోకబిసశంఖ[284]చంద్రాళికులముఁ దెగడు
పాదజంఘోరుకటిమధ్యపటుకుచోరు
బాహుగళవక్త్రకచముల పణ్యసతులు.

220

పిల్లలమఱ్ఱి వీరయ్య - శాకుంతలము [1-82]

సీ.

హరినీలరుచుల నీలాలకంబులు గావు
              చిత్తజు మధుపశింజినిలు గాని
క్రొన్నెలవంక లాగుల భ్రూలతలు గావు
              విషమాస్త్రు తియ్యనివిండ్లు గాని
యలసంబులైన వాలారుఁ జూపులు గావు

              రతిరాజు మోహనాస్త్రములు గాని
బంధురస్థితిఁ బొల్చు కంధరంబులు గావు
              కందర్పు విజయశంఖములు గాని


తే.

నళినదళలోచనలు గారు నడవ నేర్చు
కంతు నవశస్త్రశాలలు గాని యనఁగ
నంగకంబుల సౌభాగ్య మతిశయిల్ల
వారసతు లొప్పుదురు పురవరమునందు.

221

మాదయగారి మల్లయ – రాజశేఖరచరిత [1-48]

ఉ.

గబ్బిపిసాళి వాలుఁ దెలికన్నుల తేటమిటారి చూపులన్
మబ్బుకొనంగఁజేసి విటమానసముల్ దమి[285]వెల్లి ముంపుచున్
గుబ్బ మెఱుంగుఁ జన్నుఁగవ కుంకుమపూఁతల కమ్మతావి యా
గుబ్బులుగాఁ జరింపుదురు కొమ్మలు తత్పురమార్గవీథులన్.

222

మదిరాసి మల్లుభట్టు - జలపాలిమహత్త్వము

సీ.

కచభరకృష్ణమేఘంబులఁ బ్రభవించు
              మెఱుంగుఁదీగెలరీతి మేను లలర
[286]తారుణ్యవదనేందుదరహాసచంద్రిక
              లక్షిచకోరంబు లనుభవింప
నతులసౌందర్యాబ్ధి కధరబింబద్యుతుల్
              పవడంపుఁదీగెలబాగు మెఱయ
జగముఁ గెల్వఁగ దక్షనగరంబు దొన సేసి
              మరుఁడు దాచిన దివ్యశరము లనఁగ


తే.

సరసలీలావలోకన చతురగతుల
నప్సరఃస్త్రీసమూహంబు లభ్యసింపఁ
బద్మినీజాతిముఖ్యస్వభావములను
వన్నె [287]గలిగుందు రప్పురి వారసతులు.

223

అంగద బసవయ్య - ఇందుమతీకళ్యాణము

ఉ.

బీద శచీవిభుండు దితిబిడ్డ లవార్యులు వారు పల్మఱున్
బాధలఁ బెట్టఁగాఁ జెరలు పట్టఁగ నుండుట భారమంచు రం
భాదిమరున్నివాస [288]లసదప్సరల్ చనుదెంచి వచ్చిరో
నా దరఫుల్లపద్మవదనల్ విహరింపుదు రప్పురంబునన్.

224

పురస్త్రీలు

జయతరాజు ముమ్మయ – విష్ణుకథానిధానము

గూఢచతుర్థి

సీ.

వలపుల బొమలమై నిలుకడఁ గన్నులఁ
              బుష్పచాపధ్వజస్ఫూర్తి గలిగి
కాంతి[289]గంధంబులఁ గరములఁ దనువల్లిఁ
              గనకపంచమదామగరిమఁ దాల్చి
కురులను బొడ్డునఁ బిఱుఁదునఁ [290]గుచమున
              ఘనసరసీచక్రగతి వహించి
నేర్పున నగవున నిగ్గున [291]మోమున
              శారదామృతభానుసమితి నొంది


తే.

కౌను నఖముల సొబగును గల్గి చూపు
హరిమణిశ్రీ సమానత నతిశయిల్లి
రూపశుభలక్షణముల [292]నేపు మిగిలి
వెలఁదు లమరుదు రవ్వీట వేడ్కతోడ.

225

తెలుంగు గూఢచతుర్థి

సీ.

చూడ్కి [293]మోహననాభిసువిహారయోగ్యత
              వలరాజు బావిజావళము సేసి
యెలయింత బొమలమై మెలఁకువమాటల
              మరువింటిరసము [294]లీరసము సేసి
కళలఁ దనుప్రభగతి నటనంబున
              శారదమెఱుఁగుగజంబు గెలిచి
యెలమినవ్వునఁ గుచముల నిటలంబున
              మొలకవెన్నెలమొగ ముంపు దింపి


తే.

పలుక నేర్చిన రతనంపుఁబ్రతిమ లనఁగఁ
దిరుగ నేర్చిన వెన్నెలతీఁగె లనఁగ
పొంద నేర్చిన పుత్తడిబొమ్మ లనఁగ
నొప్పుదురు కామినీమణు లప్పురమునందు.

226

జక్కన - సాహసాంకము [1-78]

సీ.

మృగరాజమధ్యలై మిక్కిలి మెఱసియు
              వక్షోజకరికుంభరక్ష సేసి

చంద్రబింబాస్యలై చాల రాగిల్లియు
              నలకాంధకారంబు వెలయఁజేసి
పికనాదకంఠలై పెంపు వహించియు
              నధరపల్లవముల ననునయించి
కలహంసగమనలై కడు బెడఁగారియుఁ
              గరమృణాలంబులఁ గరము మనిచి


తే.

నవ్యకౌముదీస్మిత లయ్యు నయనపాద
సారసంబుల నెంతయు గారవించి
చిత్రసౌందర్యధుర్యలై చిగురుఁబోఁడు
లప్పురిఁ దనర్తు రెక్కుడు నొప్పిదముల.

227

[295]పణిదవు మాధవుడు - ప్రద్యుమ్నవిజయము

సీ.

గబ్బిబేడిసమీలు కన్నుల కెనవచ్చుఁ
              బలుమాఱు నవి మిట్టిపడకయున్నఁ
దొగలనెచ్చెలికాఁడు మొగమున కెనవచ్చు
              నొక యింత [296]మెరకందు నుండకున్నఁ
[297]గ్రొవ్విన జక్కవల్ కుచముల కెనవచ్చు
              ప్రొద్దువోయినఁ బాసిపోకయున్న
[298]మెఱుఁగులు మెత్తనిమేనుల కెనవచ్చుఁ
              దళతళఁ బొడకట్టి తలఁగకున్న


తే.

ననుచు సరసులు వర్ణింప నవయవాతి
విభ్రమవిలాసవిస్ఫూర్తి వినుతికెక్కి
గణన మీఱిన మానినీమణులు గలరు
బొగడఁబెట్టిన ద్వారకానగరమునను.

228

తులసి బసవయ్య - సావిత్రికథ

సీ.

బింబంబు హిమధామబింబంబు నణఁగించు
              మధురాధరాననమండలములు
మించులఁ బసిఁడిక్రొమ్మించులఁ దలపించు
              నతిమనోహరకటాక్షాంగరుచులు
నగములఁ గృష్ణపన్నగముల నగుఁ గుచ
              ద్వితయరోమావళీవిభ్రమములు
తమ్ములఁ దేటమొత్తమ్ముల నిరసించు
              నంఘ్రిద్వయీవినీలాలకములు

తే.

కరము కేసరిఁ గేసరోత్కరముఁ దెగడు
మధ్యకోమల[299]దంతాంశుమండనంబు
లవుర నుతియింప నజునకైనను వశమె
యప్పురంబున నొప్పారు నబ్జముఖులు.

229

తెనాలి రామలింగయ - హరిలీలావిలాసము

సీ.

ముదురుఁజీకఁటి మన్నెమూఁకకుఁ గైజీత
              మొసఁగు కుంతలములయొప్పు వెలయఁ
బండువెన్నెలరాజు బంటుగా నేలు చ
              క్కనిమొగములనిక్కు గని భజింపఁ
బసిఁడిగట్రేనిఁ జేపట్టుకుంచము సేయు
              జిగి మించి చన్నులబిగువు నిగుడ
గబ్బియేనికదొర గారాము గాఁగ మ
              న్నించు లేనడపులనేర్పు మెఱయ


తే.

నూరువులె గాదు రంభ మైయొఱపుఁ దమ వ
శంబు గావింపఁ బదనఖచయమె కాదు
విలసనముఁ దార పాటింప వీటఁ బద్మ
పత్రనేత్రలు చాలఁ [300]జూపట్టియుండ్రు.

230

బొడ్డపాటి పేరయ - పద్మినీవల్లభము

సీ.

గజముల నడలుఁ దత్కరముల జిగులుఁ ద
              త్కుంభగౌరవములుఁ గూర్చి కూర్చి
జలజస్ఫుటములుఁ దచ్ఛదవిభ్రమములుఁ ద
              త్కేసరసురభులు గిలిమి గిలిమి
మరువిండ్లుఁ దన్మౌర్విమధుకరరుచులుఁ ద
              దస్త్రంబు మొనలును నలమి యలమి
కనకవేదులు నందుఁ గాంతి నుగ్గులును దత్
              స్తగితసన్మణులును దార్చి తార్చి


తే.

గతులు నూరుకుచములు మొగములు నేత్ర
ములును దనుగంధములు బొమ లలకములును
చూపులు నితంబములును రుచులును దశన
ములును విధి సేసె నా నుండ్రు పురిఁ జెలువలు.

231

బాలకాండ [1-34]

చ.

పదములు చారుపద్మములు భాసురకంఠము లొప్పు శంఖముల్
రదములు కుందముల్ కచభరంబులు నీలము లట్లు గాన స
మ్మదమునఁ గాంతలై నిధులు మానుగ నున్నవి యైన నా పురిన్
సుదతుల తుచ్ఛమధ్యములఁ జొచ్చిన లేములు వాయ వెన్నడున్.

232

కవిలోకబ్రహ్మ - అరుణాచలపురాణము

చ.

వలుద కుచంబులున్ బవడ వాతెఱలున్ మెఱుఁగారు మేనులున్
బలుచని చెక్కుటద్దములుఁ బద్మపు మోములుఁ గంబుకంఠముల్
కలువలఁ బోలు కన్నులు వికాసపు నవ్వులుఁ జిల్క పల్కులున్
దలిరుల మించు పాదములుఁ దత్పురికాంతల కొప్పు నెంతయున్.

233

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

శా.

లీలం గాముని నోమఁ బోవునెడ కేళీనందనం బెంతయున్
జాల న్వాసన కెక్కు నొండొరువు లోజం బల్కుచోఁ జిల్కపిం
డోలో నాల్కుల తొక్కుఁ దక్కుఁ జని నీరాడంగ నంభోజినీ
రోలంబంబులు చొక్కు వీటి సతులన్ [రూపింప సామాన్యమే].

234

పామరభామలు

వీథినాటకము [4]

ఉ.

కందుకకేళి సల్పెడు ప్రకారమునన్ బురుషాయితక్రియా
తాండవరేఖ సూపెడు విధంబునఁ బామరభామ లేఁత యీ
రెండ ప్రభాతవేళ రచియించె నితంబభరంబుఁ జన్నులున్
గుండలముల్ కురుల్ గదలఁ గోమయపిండము లింటిముంగటన్.

235

భావన పెమ్మన - అనిరుద్ధచరిత

చ.

చెలువము లొప్ప రాజనపుఁజేలకుఁ గావలియున్న కాఁపుఁగూ
తుల నిడువాలుఁగన్నులును దోరపుఁజన్నులుఁ జూచి ధైర్యముల్
[301]పలపలనైన మందగతులన్ జనుచుండుదు రంగజాస్త్రముల్
దలముగఁ దాఁక నధ్వగులు తన్నగరాంతికమార్గభూములన్.

236

[?]

చ.

కలమవనప్రతానములు గాచుటకై చనుదెంచి యింపులన్
జిలికెడు మంజురీతి విలసిల్లఁగ నార్చుచు ముద్దు[302]టల్కలన్
జిలుకలఁ దోలి [303]లేజెమరు చెందఁ గొలంకుల కేఁగి చిల్కలన్
జిలుకల నాడుచుండుదురు చెన్నుగఁ బామరబాలికాజనుల్.

237

పుణ్యసతులు

చెదలువాడ ఎఱ్ఱాప్రెగడ - నరసింహపురాణము [1-49]

ఉ.

శ్రీసతికి న్మురారికిని సేసలు వెట్టిన పెండ్లిపెద్ద ల
బ్జాననుఁ డంబుజోదరమునందు జనించిననాఁడు చేరి యు
ల్లాసము పల్లవింప నుపలాలన సేసిన యమ్మ లెల్ల సం
తోషమునన్ ముకుందు సయిదోడులు తత్పురిపుణ్యభామినుల్.

238

ఏర్చూరి సింగయ్య - కువలయాశ్వచరిత

క.

నిరుపమధర్మస్థితిచే
వరపాతివ్రత్యనియతివైభవమున న
ప్పురిపుణ్యకాంత లమరిరి
గిరిఁ దత్పురివాణు లెల్ల కీర్తిత[304]గరిమన్.

239

శబరకాంతలు

[?]

ఉ.

మీఱిన భద్రనాగముల మీఁదికి దాఁటి తదీయకుంభముల్
చూరలు వట్టు కేసరికిశోరనఖావళినుండి రాలి సొం
పారిన మౌక్తికంబులు ప్రియంబున నేరి కిరాతబాలికల్
గీరనగింజ లాడుదురు కేళిఁ దలిర్పఁగఁ బక్కణంబులన్.

240

[?]

క.

గిటగిటనగు నెన్నడుములుఁ
బుటపుట నగు చన్నుఁగవలుఁ బున్నమనెలతోఁ
[305]జిటపొట లాడెడి మొగములుఁ
గటితటముల యొప్పు శబరికాంతల కొప్పున్.

241

ముక్కుతిమ్మయ - పారిజాతాపహరణము [2-87]

ఉ.

వంచనఁ బొంచి చేరువకు వచ్చిన చంద్రుని జింక నేసి హ
ర్షించియుఁ దత్సుధారసనిషేచనచే నది చావ[306]కున్కి వీ
క్షించుచు నేటు దప్పెనని చే విలునమ్ములుఁ బాఱవైచి ల
జ్జించి చరింపుచుండుదురు చెంచెత లగ్గిరిసానుభూములన్.

242

[307]పణిదవు మాధవుఁడు - ప్రద్యుమ్నవిజయము

ఉ.

పొంకపుగుబ్బలుం బునుఁగుఁ[308]బూతలుఁ దుమ్మెదకప్పుమేనులున్
జంకెనచూపులున్ జఘనసైకతసీమలఁ బారుటాకులున్
మంకెనచాయ [309]మోవులును మానితహస్తధనుశ్శరంబులున్
గొంకక భిల్లకామినులకుం దగియుండు బసిండిగుబ్బలిన్.

243

[?]

ఉ.

చెంచెత గుబ్బచన్నుఁగవ శీఘ్రతరంబుగ నంతనంత వ
ర్తించెను యౌవనో[దయ]విజృంభణ మెక్కిన నంతనంత శో
షించెను దాని నెన్నడుము జీవితనాథుఁడు వాని విల్లునున్
జెంచుల రాజులున్ [310]సవతి చేడియపిండును పక్కణంబునన్.

244

బొడ్డపాటి పేరయ - శంకరవిజయము

చ.

అడరి సరోజరాగమణు లామిషఖండము లంచుఁ గఱ్ఱకు
ట్లొడికము సేయు వేడుకల నుజ్జ్వలసన్మణు లేర్చి నిప్పులం
దిడియును భల్లుకవ్రజనిరీక్షణముల్ గని దివ్వె లంచుఁ దేఁ
డడవుదు రొయ్య మౌగ్ధ్యమునఁ దద్గిరిసీమఁ గిరాతబాలికల్.

245

ఉపవనము

తెనాలి రామలింగయ్య - హరిలీలావిలాసము

చ.

సరసులపొందు[311]లం దొసఁగఁజాలి బహూన్నతచారుశాఖలన్
బెరిఁగి మహాద్విజావనమె [312]పేర్చి నిజాయతిగాఁ [313]దనర్చి ని
ర్భరజనతాపసంహరణపాత్రము లయ్యు మహీజవాటికల్
పురి వెలి నిల్చె [314]మేటియు నపూజ్యుఁ డగున్ మధుపానుకూలతన్.

246

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

చ.

ఇతవులయందు [నెల్లఁ] దన యేపును సొంపును మవ్వముం జిర
స్థితిఁ జెలువొంద నోచి మరుసేనలకున్ బెనుప్రాపుగ న్సమా
తతముగఁ బెక్కునిల్కడలు దాల్చిన మాధవలక్ష్మియో యనన్
సతతము నొప్పెఁ జూడఁ బురనందనసుందరపాదపావళుల్.

247

[?]

చ.

లలితలతాంతపల్లవశలాటుఫలాంకితభూజరాజసం
కులబహుచిత్రవర్ణపటకూటకుటీరపటంబుగా లతా

మిళితవిలాసులై చెలువు మీఱుఁ బురీవనముల్ జగజ్జయా
కలితరమాభిరామనవకామమహాశిబిరంబులో యనన్.

248

[?]

మ.

కలయన్ గాడ్పునఁ దూలి పుప్పొడి దివిన్ [315]గప్పారు మారుండు వే
డ్కల కారామరమావసంతులఁ గణంకన్ బెండ్లి సేయించుచో
వెలయన్ బట్టిన యుల్లభంబుపగిదిన్ వేమాఱుఁ దద్భూమిపైఁ
జెలు వొందింపుచు రాలుఁ బుష్పవితతుల్ [316]చేకొన్న ప్రాలో యనన్.

249

నన్నయభట్టు - ఆదిపర్వము [1-8-78]

చ.

సరళతమాలతాలహరిచందనచంపకనారికేళకే
సరకదళీలవంగపనసక్రముకార్జునకేతకీలతా
గరుఘనసారసాలసహకార[317]మహీరుహరాజరాజి సుం
దరనవనందనావళులఁ దత్పురబాహ్యము లొప్పుఁ జూడగన్.

250

సంకుసాల [318]సింగయ్య - కవికర్ణరసాయనము [1-23]

మ.

అజహచ్చంద్రవిజృంభముల్ శుకపికాద్యారూఢనానావిధ
ద్విజమృష్టాన్నయథేష్టసత్రగృహముల్ దీవ్యన్మదోత్సేకభా
వజసర్వస్వము లంచితానిలమహాస్వారాజ్యముల్ దంపతీ
వ్రజతారుణ్యసమృద్ధిసాక్షులు పురప్రాంతస్థితారామముల్.

251

జక్కన - సాహసాంకము [1-88]

సీ.

శుకమంజులాలాపశుభకరస్థితి మించి
              పల్లవసందోహభాతిఁ దనరి
కలకంఠకూజితవిలసనంబుల నొంది
              రాకాంశురేఖల రమణ మెఱసి
హరిచందనస్ఫూర్తి ననిశంబుఁ దనరారి
              పుష్పసౌరభములఁ బొలుపు మిగిలి
సరసాళిమాలికాసంసక్తి విలసిల్లి
              విషమబాణాసనవృత్తిఁ జెంది


తే.

లలితమాకందవైభవంబులఁ దనర్చి
యతిమనోహరాకారత నతిశయిల్లి
యుద్యదుద్యానవాటిక లొప్పు మిగిలె
వారవనితలు నాఁ బురవరమునందు.

252

భైరవుఁడు - శ్రీరంగమహత్త్వము [4-273]

సీ.

మదషట్పదంబుల మధుపానభూములు
              రాజకీరంబుల రచ్చపట్లు
పుంస్కోకిలంబుల భోజనశాలలు
              మలయానిలంబుల మలయునెడలు
[319]నవమయూరంబుల నాట్యరంగంబులు
              మకరకేతను సభామండపములు
విటవిటీజనముల విరుల చప్పరములు
              మధులక్ష్మి [320]నైపథ్యమందిరములు


తే.

నల వసంతుని లీలావిహారసీమ
[321]లిట్టలంబగు [322]వలపుల పుట్టినిండ్లు
చిరపరిశ్రాంతపథికసంజీవనములు
పావనంబులు పురము కేళీవనములు.

253

నండూరి మల్లయ్య - హరిదత్తోపాఖ్యానము

చ.

నవరుచిపల్లవస్థితిఁ దనర్చి లసత్సుమనస్సమృద్ధివై
భవమున [323]నొంది గంధబహుబంధురతన్ దగి యాశ్రితద్విజో
త్సవములఁ బొల్చి వారవనితామణిరీతిఁ ద్రివిష్టపంబుఠే
వ వరగజంబుమాడ్కిఁ గ్రతువాటిగతిన్ బురితోట లొప్పగున్.

254

[324]బొడ్డపాటి పేరయ్య - శంకరవిజయము

ఉ.

ఆమని టెంకిపట్లు మలయానిలు నిత్యవిహారసీమముల్
కాముని పాలెముల్ శుకపికంబుల జీతపుటూళ్ళు కామినీ
కాముకవిశ్రమంబులకుఁ [325]గట్టని [326]యోవరు లా పురాంగనా
స్తోమమునందు నెందు నెలతోఁటలు శైలశిలోన్నతస్థితిన్.

255

సరోవరము

సంకుసాల సింగయ్య - కవికర్ణరసాయనము [1-24]

చ.

అలికులకుంతలంబులు రథాంగకులంబులు పద్మవక్త్రముల్
గలరవపద్మినుల్ కడువికాసముతోఁ దమయందు సక్తలై
యలర విహారవేళఁ దమునంటిన కాంతల మేని కస్తురిన్
జులకన సోడుముట్టు సరసుల్ సరసుల్ వలె నొప్పు నప్పురిన్.

256

జక్కన - సాహసాంకము [1-92]

చ.

సరసిజనాభుఁ డట్టె హరి సారససంభవుఁ డట్టె బ్రహ్మ యా
సిరియును నబ్జవాస యటె చిత్తమునం దలపోసి చూడఁగా
దొరమునె యీప్రసూనములతో నితర[327]ప్రసవవ్రజంబు నాఁ
బురమునఁ బద్మషండములు పొల్పెసలారు మనోహరంబులై.

257

[1-91]

చ.

కరిమకరాలయాఢ్యతఁ బ్రకాశగభీరత నచ్యుతస్థితిన్
వరకమలోదయస్ఫురణ వ్రాలుటఁ బన్నగలోకసంగతిన్
ధరఁగల వారికెల్లఁ బ్రమదంబున నాశ్రయమై తనర్చుటన్
బరఁగుఁ బురిం దటాకములు పాలసముద్రముతో సమంబులై.

258

చరిగొండ ధర్మయ్య – చిత్రభారతము [3-2]

సీ.

తనసొమ్ములై యున్న ఘనతరపద్మరా
              గప్రభాపటలి నల్గడలఁ బర్వఁ
దనజీవనస్థితి మనియెదమని రాజ
              హంసమండలము నెయ్యమునఁ గొలువఁ
దననిత్యమధురత్వమునకుఁ దక్కినవారిఁ
              జవుక సేయుచుఁ గవీశ్వరులుఁ బొగడఁ
దనకు నీడై సంతతంబును వికసించి
              పుండరీకంబులు దండి మెఱయఁ


తే.

దన్నుఁ బాయని సిరిఁ జూచి తలఁగ లేక
వేడ్క బ్రమదాళులెల్ల సేవించుచుండ
సరసులకు నెల్ల మేటియై సార్వభౌము
చందమున నుల్లసిల్లె నీ సరసి మెఱసి.

259

శ్రీనాథుఁడు - శృంగారనైషధము [1-98]

సీ.

శేషపుచ్ఛచ్ఛాయఁ జెలువారు బిసములు
              తన్మగ్నసురదంతిదంతములుగ
నిండార విరిసిన పుండరీకశ్రేణి
              యామినీరమణ[328]రేఖాళి గాఁగఁ
బ్రతిబింబితోపాంతబహులపాదపములు
              గర్భస్థశైలసంఘంబు గాఁగ
నేకదేశంబున నిందీవరంబులు
              [329]కాలకూటమయూఖఖండములుగ

తా.

బాలశైవాలవల్లరీజాలకంబు
బాడబానలభవధూమపఙ్క్తి గాఁగ
వారిరాశియుఁ బోలె గంభీరమైన
ఘనతటాకంబుఁ గాంచె నా జనవిభుండు.

260

నంది మల్లయ్య - మదనసేనము

సీ.

పరిఫుల్లహల్లకప్రభలు నిండినచోట
              సాంధ్యరాగద్యుతి చౌకళింప
వికచనీలోత్పలప్రకరస్థలంబుల
              గిఱికొన్న చీఁకట్లు గ్రేళ్ళు దాఁట
నిర్ణిద్రకుముదవనీప్రదేశంబులఁ
              దేఁటవెన్నెల పిల్ల తీపు లాడ
వికసితకనకారవిందబృందంబులు
              బెరయు నీరెండఁ బింపిళ్ళు గూయఁ


తే.

బగలు రేయును దమలోనఁ బగలు మాని
కలసి మెలసిన బాగులు గడలు కొల్పి
విమలమహిమలఁ దనరు నా విమలసరసిఁ
జూచి నివ్వెఱపడి రాజసూనుఁ డపుడు.

261

కేతన - కాదంబరి

సీ.

దీనిలోపలఁ గొన్నిదినము [330]లుండిన నుష్ణ
              కరుఁడైన నట శీతకరుఁడు గాఁడె
దీనిలోఁ తెరిగినఁ దానంబురాశిలోఁ
              గాదని జలశాయి గాఁపు రాఁడె
దీని తియ్యనినీరు దివిజులు [331]త్రావిన
              తమ యమృతంబు చేఁ దనుచు ననరె
దీని తోయంబులఁ దీర్థమాడిన [332]యంతఁ
              బాపాత్ములును మోక్షపదవిఁ గనరె


ఆ.

యనుచుఁ గొలనినీటి యతిశీతలత్వంబుఁ
బఱపు పెంపుఁ దీపుఁ బావనతయు
మనుజనాయకుండు గొనియాడి పడివాగె
త్రాట హయముఁ దిగిచి తఱియఁ జొచ్చె.

262

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

సీ.

వలరాజు వోసిన [333]నలినారువోలె బం
              ధురములగు జెఱకుఁదోఁటలకును
నలువచేఁ [334]బెరిఁగి దీనుల కీఁగియును లేని
              కల్పకంబులు వోని క్రముకములకు
మాధవుం డేదిన మవ్వంపుఁ [335]బొదల యే
              డ్తెఱ నివ్వటిలు నాకుఁదీఁగెలకును
బర్జన్యసత్కృతిఁ బసిఁడి [336]పండెడుచే ల
              నంగఁ [337]బేర్చిన రాజనంబులకును


తే.

దెట్టుపలు గట్టి నీటితోఁ దేలి పాఱు
తమ్మిపుప్పొళ్ళు ప్రోదులై దనరుచుండు
ననిన నవ్వీటి చెఱువుల యతిశయంబుఁ
బుడమిలో నింక [నేమని] పొగడవచ్చు.

263

సంకుసాల సింగయ - కవికర్ణరసాయనము [1-25]

సీ.

ప్రణయవాదముల దంపతులందు నుదయించి
              రంజిల్లు మానాంకురములు మేసి
సురతాంతవిశ్రాంతసుందరీజనముల
              వక్షోజతటఘర్మవారిఁ గ్రోలి
వనములు మధుగర్భవతులుగాఁ బూమొగ్గ
              మొదవుల కౌమారములు హరించి
విషయానుభవకథావిముఖవిరక్తుల
              పటుతరధైర్యవప్రములు గూల్చి


తే.

గంధలోభానుబంధిపుష్పంధయముల
ఝంకృతులచే ఖణిల్లన ఱంకె లిడుచు
విషమశరు పేర జన్నియ విడిచి రనఁగఁ
గ్రొవ్వి చరియించు నవ్వీటఁ గోడెగాడ్పు.

264

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరితము

సీ.

పరువంపు విరులపైఁ బొరసి యొండొకవనం
              బుల సౌరభంబులఁ బొరపు సేయుఁ
బక్కు వాసిన పువ్వుఁ బదువుతోఁ జెరలాడి
              యిలకు [338]నైవేద్యకం బలవరించుఁ
గొవ్విరులను దిరుగుడువడి పుప్పొడి
              దలిరాకులకు వింత చెలు వొనర్చుఁ

దనుపారఁ గొలఁకుల దగ నాడి వనకేళి
              జనులపైఁ బులుకలుఁ జాదుకొల్పుఁ


తే.

[339]గేరి మకరందములఁ దొలఁకించి మించి
మొనసి లేఁదీఁగెలకుఁ జిఱుముసురు గురియు
నప్పురారామముల నెల్ల నలసగతుల
మలసి సొంపారు నింపారు మారుతంబు.

265

ప్రౌఢకవి మల్లయ్య - రుక్మాంగదచరిత [5-45]

సీ.

వనజాత[340]కహ్లారవనజాతయుతసరో
              వరవీచికలమీఁద వ్రాలి వ్రాలి
కలకంఠశుకశారికాకంఠకాకలీ
              కలితచూతములపైఁ గ్రాలి క్రాలి
మల్లికామాధవీ[341]మందారనూతన
              సూనగంధములపై సోలి సోలి
కేళీవనాంతరకంకేలిశాఖా[342]శిఖాం
              దోలాగతాళిఁ బోఁదోలి తోలి


తే.

యల్లనల్లనఁ జనుదెంచె నలసగతుల
భావభవసంగరాయాసభామినీకు
చాగ్రసంజాతఘర్మంబు లణఁచి యణఁచి
చందనపుఁగొండఁ బుట్టిన చల్లగాలి.

266

పోతరాజు భైరవుఁడు - శ్రీరంగమహత్త్వము [4-275]

సీ.

పరిపాండుకేసర పరిణాహకేసర
              ప్రసవరాగంబు కొసరి కొసరి
వర్షితకాసారవరవీచికాసార
              శిశిరశీకరములఁ జెలఁగి చెలఁగి
గుణవతీమనసారకుచలిప్తఘనసార
              బహుళసౌరభముల బలసి బలసి
కమనీయమణిజాలఖచితసద్గృహజాల
              మాలికాంతరముల మలసి మలసి


తే.

సమదకరికటతటమదసలిలపాన
ముదితకలరవమధుకరమృదులచలిత
లలితవిపరీతగరుదంచలములఁ బొదలి
మలయపవనుండు పురిలోనఁ గలయఁ బొలయు.

267

మాదయగారి మల్లయ్య - రాజశేఖరచరిత [1-47]

ఉ.

వాడల వాడలం దిరుగు వారవధూటుల వక్రపద్మసం
క్రీడదనూనవాసనకుం గేలిసరోవరఫుల్లహల్లక
క్రోడసుగంధిగంధములకుం గలహంబులు చక్కఁబెట్టి చె
ర్లాడఁగఁజేయు సజ్జనుక్రియన్ మలయాచలవాతపోతముల్.

268

సర్వదేవుఁడు - ఆదిపురాణము[343]

చ.

మరువముఁ బొంది పొంది విరిమల్లియపువ్వులఁ జెంది చెంది కే
సరములఁ గ్రాలి క్రాలి జలజాతపరాగముఁ దోలి తోలి క
ప్పురమున నేచి యేచి సురపొన్నల వాసన మోచి మోచి తె
మ్మెరలు నిరంతరంబును భ్రమించుచునుండు వనాంతరంబునన్.

269

గజవర్ణన

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

సీ.

మించిన గతులు సాధించి యింద్రునికి మా
              ర్కొనియున్న కాల్గల కొండ లనఁగఁ
జేతనత్వంబులు చేకొని రవికిఁ గొ
              మ్ములు చూపు చీఁకటి మొన లనంగఁ
జేకల్గి యలుల కనేకదానము లిడ
              మెలఁగు తమాలభూమిజము లనఁగఁ
జిత్ర[344]వధాధుర్యసిద్ధులై గాడ్పుతో
              మోహరించిన కారుమొగుళు లనఁగఁ


తే.

నెల్ల చందంబులను గడు నెసకమెసఁగి
పొగడు సెగడును బడసి యప్పురిఁ జరించుఁ
దమ్ముఁజూచిన మెఱయుఁ బుణ్యమ్ము నొసఁగ
దావలంబైన భద్రదంతావళములు.

270

తెనాలి రామలింగయ్య - హరిలీలావిలాసము

సీ.

మదభిన్నకటగళన్మౌక్తికంబులు తొట
              తొట రాల మస్తవిధూననముల
నానమత్కుతలంబులగు పదక్రమముల
              ఘణఘణంకృతి నాభిఘంట లులియఁ
గీర్తిచంద్రికల యాకృతి దట్టమై ధళ
              ధళఁ బర్వ దంతకుంతముల రుచులు

పుష్కరపూత్కారములన కాలపు వాన
              కారు లెల్లెడఁ [345]దము తారఁ గురియఁ


తే.

దమకుఁ బరవాహినులలోను దఱియఁజొచ్చి
క్రీడ లాడుట యుచితంపు జాడ యనఁగఁ
బెరిఁగి సరయూజలంబుల సరసలీలఁ
గ్రాలఁ జనుచుండు నప్పురి గంధకరులు.

271

జక్కన - సాహసాంకము [1-86]

చ.

సురపతి దాడి నంబునిధిఁ జొచ్చిన యద్రులు నిచ్చలప్పురిం
దిరుగఁగ నాత్మఁ గోరి శరధిం బరిఖాకృతిఁ గాపు వెట్టి తా
రరుదుగ భద్రసామజములై సెలయేఱులు దానధారలై
తొరఁగుచునున్న మాడ్కి [346]నతిదుస్సహతం గరు లొప్పు నప్పురిన్.

272

బాలకాండ [1-29]

చ.

తరళితదంతకాంతిసముదంచితబృంహితనీలదేహముల్
పరఁగఁ దటిల్లతాస్తనితభాసురవారిధరంబులో యనన్
బొరిఁబొరి నేనుఁగుల్ దిరిగి పుష్కరిణీకరదానధార ల
ప్పురమునఁ బెల్లుగాఁ గురియు భూతలమంతయుఁ బంకిలంబుగాన్.

273

తులసి బసవయ్య - సావిత్రికథ

ఉ.

గైరికమండనంబులు నఖర్వసమున్నతపాదపంక్తియున్
హారిమదాపరాశి యపహార్యసమంచితసత్త్వరేఖయున్
ధారు[ణి] మీకు మాకు విదితంబుగ సాటియె పొమ్మటంచు దు
ర్వారగతిన్ హసించు గిరివర్గము [347]నప్పురి వారణౌఘముల్.

274

మాదయగారి మల్లయ - రాజశేఖరచరిత [1-51]

క.

అన్నగరి చిఱుతయేనుఁగు
గున్నలపై నెక్కి [348]నిక్కి కోయఁగ వచ్చున్
మిన్నేటి పసిఁడితామర
లన్నన్ మరి యేమి చెప్ప నందలి కరులన్.

275

[?]

ఉ.

చెక్కుల దాన మక్షులను సీధువు వీనుల సాగరంబు చే
ముక్కున శీకరాళి చనుముక్కుల చిక్కము శేఫసిన్మదం
బక్కున ఘర్మవారియు నిజాంఘ్రుల మేఘముఁ గారుచుండఁగా
నొక్కమదేభ మేఁగెఁ దలయూ[349]గులతోడి నగేంద్రమో యనన్.

276

బమ్మెర పోతరాజు - అష్టమము [8-40]

సీ.

తనకుంభములపూర్ణతకు డిగ్గి యువతుల
              కుచములు పయ్యెదకొంగు లీఁగఁ
దనయానగంభీరతకుఁ జాల కబలల
              యానంబు లందెల నండగొనఁగఁ
దనకరశ్రీఁ గని [350]తలఁగి బాలల చిఱు
              దొడలు మేఖలదీప్తిఁ దోడు పిలువఁ
దనదంతరుచికోటి తరుణుల నగవులు
              ముఖచంద్రదీప్తుల ముసుఁగు [351]దిగువఁ


తే.

దనదు లావణ్యరూపంబుఁ దలఁచి చూడ
నంజనాభ్రము కపిలాదిహరిదిగింద్ర
దయిత లందఱుఁ దనవెంటఁ దగిలి నడవ
కుంభివిభుఁ డొప్పె నొప్పులకుప్ప వోలె.

277

బొడ్డపాటి పేరయ - పద్మినీవల్లభము

క.

ఒక యెనిమి దణఁగె దిక్కుల
మకరంబున కొకటి యోడె మలహరుచే ము
న్నొక టూడె ధిక్కరింపఁగ
నిఁక నేలని మాఱు మలయు నేనుఁగులు పురిన్.

278

అశ్వవర్ణన

[352]సంకుసాల సింగయ్య - కవికర్ణరసాయనము [1-14]

సీ.

[353]కట్టడిఁ జెలియలికట్టయె కట్టఁగా
              బిగువుమై బేరెంబు వెట్టకుండ
లంఘనలాఘవోల్లసనంబు మై మొక్క
              లించి వార్థులు చౌకళింపకుండ
బిట్టు దిగంతముల్ ముట్టఁ జూపిన విధి
              పవమాను కడఁ దెగఁబాఱకుండ

భరతాభినయముల నిరపేక్షగా లోక
              దృష్టులు దనియ నర్తింపకుండ


తే.

రయముచేఁ జిత్తగతుల గెల్చియును బతుల
మతులలో ననువర్తింప మాకు వలసె
ననుచు సిగ్గున దలవంచుకొనిన విటులొ
యనఁగఁ [354]దగి యొప్పుఁ బురి నుత్తమాశ్వతతులు.

279

పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

సీ.

కమనీయచిత్రసంగతగతిక్రమముల
              దిగ్గజాదుల నడ ధిక్కరించి
లాలితగంభీరలఘుతరప్లుతముల
              హరిణసంఘంబుల నపహసించి
సవ్యాపసవ్యసంచరణమహోద్ధతిఁ
              బంచాననక్రీడ [355]బాహు సఱిచి
మహితనిరాయాసమధ్యాజవంబుల
              ననిలప్రయాణంబు లతకరించి


తే.

సముచితాన్వర్థపూర్ణవేగములచేతఁ
గెరలి వచ్చి తలంపులఁ గిక్కురించి
హేతి మాడ్కి నుప్పరముల నెసక మెసఁగి
పంచధారలు గల హయపంక్తు లడరు.

280

మాదయగారి మల్లయ్య - రాజశేఖరచరిత [1-52]

చ.

బిసరుహబంధుఁ గొండచఱిఁ బెట్టుట యొండెఁ బయోధి నీటిలో
మసలక వైచు టొండె నడుమ న్నిలఁబెట్టఁగ రాదు వాగె వె
క్కసములు మాకు నెందు సరిగావుసుమీ యని యాడుచుండు సం
తసమున భానురథ్యములఁ దత్పురితుంగతురంగసంఘముల్.

281

తెనాలి రామలింగయ్య - హరిలీలావిలాసము

ఉ.

చంగున దాఁటు ధేయనిన సప్తసముద్రములైన వేగ వా
గెం గుదియింప నిల్చు [356]నడిగెంటనె శస్త్రనిపాతధీరతన్
సంగరరంగవీథిఁ దమ స్వామికి గెల్పు ఘటించునట్టియు
త్తుంగతరంగరత్నములు తొంటి హయాకృతిశార్ఙి పుట్టువుల్.

282

పోతరాజు భైరవుఁడు - శ్రీరంగమహత్త్వము [4-269]

చ.

వెసఁ గదలించి హో యనిన [357]వ్రేల్మిడిలోనన నిల్చుఁ గంధరం
[358]బుసుమక బిట్టదల్చినను [359]భోరన సాగరమైన దాఁటు బ
ల్వసమున [360]ఱాఁగలన్ దఱిమి వాగె వదల్చిన [361]జువ్వనం జవం
బెసఁగఁగ గాలి మీఱుఁ బురి నెన్నిక కెక్కిన [362]కత్తులాణముల్.

283

(భాస్కరరామాయణము) బాలకాండ [1-30]

చ.

జవమున [363]భంజళిన్ మురళిఁ జౌకమునన్ [364]నడ నైదుధారలన్
వివిధవిచిత్రవల్గము వివేకములన్ బొలపంబునన్ శుభ
ధ్రువముల దూరభారముల రూపబలంబుల రూఢి కెక్కి యా
హవజయశీలముల్ గలుగు నశ్వము లెన్నఁగఁ బెక్కు లప్పురిన్.

284

తులసి బసవయ్య - సావిత్రికథ

క.

హరితురగము నరుణాంశుని
హరులుం గవగూడెనేని యగు సరిలేదా
సరి గావని యితరహయో
త్కరములన నగు నప్పురమునఁ గల హరులెల్లన్.

285

పణిదపు మాధవుఁడు - ప్రద్యుమ్నవిజయము

తే.

పట్టువడ [365]కతిచపలతఁ బాఱె మనసు
సూరిజననుత! రూపఱి సుడిసె గాలి
యండ గొనె నారిగట్టియై యాశుగంబు
లప్పురము గుఱ్ఱముల వేగ మరసిచూడ.

286

వీరభటులు

భాస్కరరామాయణము - బాలకాండ [1-32]

చ.

కులగిరి లెత్తనైన వడిఁ గుంభిని గ్రుంగఁగఁ [366]ద్రొక్కనైన వా
ర్ధులఁ గలపంగనైన జముఁ దుప్పలు దూలఁగఁ దోలనైన ది
గ్వలయమదేభకుంభములు వ్రక్కలు సేయఁగనైనఁ జాలు దో
ర్బలముల గెల్తు రాజిఁ బరిపంథుల నందుల వీరసద్భటుల్.

287

బమ్మెర పోతరాజు - దశమస్కంధము [10-1-1608]

క.

పులులపగిదిఁ గంఠీరవ
ములక్రియ శరభములమాడ్కి ముదితమదేభం
బుల[367]తెఱగున నానావిధ
కలహ[368]మహోద్భటులు భటులు గల రా వీటన్.

288

[369]సంకుసాల సింగయ్య - కవికర్ణరసాయనము (1-12)

క.

ప్రతివర్షంబును ధర ను
ద్ధతిఁ బడియెడి పిడుగులెల్లఁ దగఁ గూర్చిన రా
కృతులుగ నిర్మించెనొకో
శతధృతి యన వీట సుభటసంఘము వొలుచున్.

289

తులసి బసవయ్య - సావిత్రికథ

క.

బీరమునఁ బొదలి సమర
ప్రారంభమె పెండ్లి యనుచు బల[370]వర్గమునన్
వైరులకు వెన్ను చూపని
శూరవ్రజ మప్పురమునఁ జూడఁగ [371]నమరున్.

290

కవిలోకబ్రహ్మ - అరుణాచలపురాణము

(పెదపాటి సోమరాజు)

క.

తఱుము దురంతకునైనను
వెఱచఱువఁగ భద్రకరుల విఱుతురు హరి ను
క్కఱఁ బట్టి చట్ట లేరుదు
రుఱుకుదు [372]1రుగ్రాగ్నినైన నురుభటు లందున్.

291

పిల్లలమఱి వీరయ్య – శాకుంతలము [1-79]

క.

సంగరము లేక యుండిన
సింగంబులఁ బులుల సమదసింధురముల నే
కాంగిఁ దొడరి పడవైతురు
పొంగునఁ దమ కుబుసుపోక [373]పురవీరభటుల్.

292


మ.

విమలశ్రీపదపద్మజ ... ముఖావిర్భూతనానావిధో
త్తమభవ్యస్తుతిపాత్ర! పాత్రగురుపుత్త్రానంద నందానదా

నమహాకుంభివిదార! దారకలితాంతస్వాంత(కా)సారవి
భ్రమకేలీకలహంస! హంసశశినేత్రా! నేత్రపాదార్చితా.

293


క.

మానసికదురితమమహం
భోనిధిబాడబ! దయాభిపూర్ణాత్మ! ముని
ధ్యానపరాయణ! సురఖచ
రానీకప్రణుతమృదుపదాంబుజయుగళా!

294


మాలిని.

జలనిధిమదభంగా ......................
విలసితజితచైద్యా వేదవేదాంతవేద్యా
జలరుహదళనేత్రా సాధితారాతిగోత్రా
కలశజలధిగేహాకాంతపక్షీంద్రవాహా.

295


గద్య.

ఇది శ్రీజగన్నాథవరప్రసాదలబ్ధకవితాప్రాభవగంగయామాత్యత
నూభవ సకలబుధవిధేయ ప్రద్దపాటి జగ్గన్ననామధేయప్రణీతం
బైన ప్రబంధరత్నాకరంబునందు నారాయణస్తుతియును శంకర
ప్రభావంబును త్రిపురవిజయాభిరామంబును అర్ధనారీశ్వరంబును
హరిహరాత్మకంబును బ్రహ్మస్తుతియును త్రిమూర్తిస్తుతియును
లక్ష్మీగౌరీసరస్వతీప్రభావంబును, అష్టదిక్పాలకాదిదేవతాప్రార్థ
నంబును వినాయకషణ్ముఖభైరవమైలారగుణోత్కర్షయు చంద్రా
దిత్యుల ప్రభావంబును వైనతేయశేషవ్యాసవాల్మీకిసుకవి
ప్రశంసయు కవిత్వలక్షణంబును కుకవినిరసనంబును మన్మథ
విభ్రమమును పురవర్ణనయు ప్రాకారపరిఘాప్రాసాదధ్వజసాల
భంజికగోపురదేవాలయగృహవిలాసంబును బ్రహ్మక్షత్రియ
వైశ్యశూద్రజాతివిస్తారంబును విపణివిభ్రమంబును పుష్పలావికాభి
రామంబును వారాంగనావర్ణనయు పామరభామల చతురతయు
చంచెతల యొప్పును పుణ్యాంగనాజనవిశేషంబును ఉద్యానవన
సరోవరచయసుభగంబును మలయమారుతంబును గజాశ్వ
పదాతివర్ణవిలసితంబును నన్నవి ప్రథమాశ్వాసము.

296

  1. ట. రత
  2. క. దదాయకుఁడనై
  3. క.ట. వేయు
  4. క.ట. వేయు
  5. క.ట. వేయు
  6. క.ట. వేయు
  7. క. మౌని
  8. ట. రామ
  9. క. నాదాడేపల్, నాదాతెపల్
  10. క. వెంగలిన్, వేంగనన్
  11. క. సత్కార
  12. ట. చతుర
  13. క. పాల
  14. క. గణికాది
  15. క. స్ఫూర్తిత
  16. ట. క్రమం
  17. ట. నారీ
  18. ట. 'భైరవ' లేదు.
  19. క.ట. పరిఘా
  20. ట. భామినీ
  21. క. చంచలత
  22. ట. 'ఛప్పన్న'మొదలు 'అవలోకనంబును'వఱకు లేదు.
  23. ట. స్త్రీపురుషవిరహంబులును
  24. ట. ప్రార్థనంబులును
  25. ట. వైవాహిక
  26. ట. అభ్యంగవిధి
  27. ట. లాదులును
  28. ట. విట
  29. ట. గుటీ
  30. ట. దత్తక
  31. ట. దూతికాచోరులవిషయము లేదు.
  32. క. రంగో
  33. ట. అరుణోదయంబును
  34. క. 'వర్ణనం' లేదు.
  35. క. మథనంబును
  36. ట. క్షుదార్తిక
  37. ట. 'ఖడ్గ'మొదలు 'ప్రత్యుత్తరంబులును' వఱకు లేదు.
  38. సుంకసాల
  39. క. చేదోలు
  40. క. భూధవుండు
  41. క. శ్రీ క
  42. ట. శీలుఁ డనిన
  43. ట. విష్ణుఁడట యడ్గనేటికి
  44. ట. యనఁగ ?
  45. క. గోరున
  46. ట. గగకూర్య
  47. క. కిట
  48. క. కుంజ
  49. సుంకసాల
  50. క. పొందు
  51. క. బుట్ట
  52. క. చెలువ
  53. క. మేరు
  54. క. మున్నుగ, ట. ముద్దుగ
  55. ట. బత్తెములు
  56. ట. డనైన
  57. క. భోగాన, ట. మొగమున
  58. క. సహాయమై
  59. ట. కండులు
  60. ట. గుఱ్ఱమ్ము
  61. ట. నఱమిన
  62. ట. వీఁగు
  63. క. యొద్దు
  64. ట. శబ్దంబు
  65. క. హేలి, ట. హేల?
  66. ట. వికలించి
  67. ట. కొనగ
  68. ట. ముల్
  69. ట. సంద్రంబున
  70. ట. గోల
  71. ట. తేరును
  72. ట. భ్రాంతి
  73. ట. గుఱ్ఱముల్
  74. ట. ప్రోఁక
  75. ట. తన్నివాసుల
  76. ట. ప్రావిల్లు
  77. ట. నూటిని బాగు నెమ్మేనుఁ బస నిచ్చు
  78. క. వైన
  79. ట. గూన్కు
  80. ట. నెట్టి
  81. క. శిరికేశ, ట. గిరిజాధి
  82. క. రెట్టంబు
  83. క. గిట్టంబు
  84. క.పెండెరమున
  85. క.ప్రభ
  86. క.గొల్పు
  87. క.గొమార
  88. క.భారమున
  89. క.పొదరి, ట.పొదివి
  90. క.గంగను నిలిపినారు
  91. ట.మెఱసి
  92. క. లెద
  93. క. బోవ
  94. క.బెనుపంగ
  95. క.యవన
  96. క.వరుఁడు
  97. సుంకెసాల
  98. క.మోడ్చినన్
  99. క.ససుఖోన్నతి
  100. ట.యట్లయండు
  101. ట.గాముకులు
  102. క.దండి
  103. క.వాశ్చర
  104. క.యేణ
  105. క.తమ్మముల్
  106. క.నెలవిండ్లు
  107. క.లదములు
  108. క.చున్చుకము
  109. క.ముత్యమూ
  110. క.కందురము
  111. క.శంఖు
  112. క.వళు
  113. క.రాంకకుగాక
  114. క. అర్థంబు పెన్నీట
  115. క.యీవుత
  116. క.ధృత
  117. క.శిక్ష
  118. సుంక
  119. క.రక్ష
  120. క.ధృతి
  121. క.వాసన కెక్క
  122. ట.వాక్యంబు
  123. ట.సొంపొంద
  124. అయ్యలార్యుని
  125. ట.లేదు
  126. అయ్యలార్యుని
  127. క.నన్నయభట్టు – ఆదిపర్వము
  128. క.పదహస్త
  129. క.దోగుచున్
  130. క.నిల్చిన
  131. సుంక
  132. క.మైనాకంబు
  133. క.కొమ్ములు
  134. ట.కారవ[?]
  135. క.దోడుదోడగన్
  136. క.బోవం
  137. ట.వేలుపుంగొమరుఁడు
  138. క.మోమునదగగంగ
  139. ట.పల్కదని
  140. ట.బెక్కులించు[?]
  141. ట.నీవుతన్
  142. క.మోవూర
  143. క.గొలువ
  144. క.ఇహపరదాని జంభీరమగుఁడు ?
  145. క.డన
  146. క.బోలి
  147. క.పల్లెంబనాయఁడు యెల్ల
  148. తాటాకుశిథిలము. సగము పోయినది.
  149. ట.పూవులమ్ము
  150. క.డుర్వర
  151. ట.మీ
  152. క.అవిరళ
  153. క.నిర్మల
  154. క.బండి
  155. ట.వినుతులచే
  156. క.ట.బాణు
  157. క.దిఙ్మరు
  158. క.లో లేదు.
  159. క.రాజ
  160. ట.శర్ము
  161. ట.శర్ము
  162. ట.మెచ్చు
  163. ట.గ్రుచ్చలై, త.క్రుచ్ఛలై
  164. ట.మెచ్చుట
  165. ట.కయు
  166. విధి
  167. దిదిత
  168. క.యతులు
  169. క.పొంతువులు
  170. క.శాంతి
  171. క.వేగ
  172. క.యాన, ట-లో పద్యము లేదు.
  173. క.మున్
  174. క.నిధాన
  175. సుంకసాల
  176. క.అంతము
  177. క.నెలవుల, ట.గెళవులు
  178. క.తాకర
  179. ట.కలశజుల్
  180. క.చూపి
  181. క.మజ్జా
  182. క.బుట్టని
  183. క.మత్తది
  184. క.మర్త్యుల
  185. సుంకసాల
  186. క.మధునీరసంబైన
  187. క.పట్టణంబైన
  188. క.నయ్యి
  189. ట.భోగంబు
  190. క.ప్రశస్తి
  191. క.రోచమాన
  192. క.విరుల
  193. క.చరి
  194. క.ఘోష
  195. క.శోణి
  196. క.శక్రానిల
  197. క.దుష్కలిత
  198. క.ఖల
  199. క.విటవి
  200. క.జాలు
  201. సుంకసాల
  202. సుంకసాల
  203. ట.వనంత
  204. ట.గొమరౌ(?) గదా
  205. క.చుట్టుపూవాడ్లు
  206. క.ఘాత
  207. క.కన్కి
  208. క.కేతాకులుల
  209. క.నములు
  210. సుంకసాల
  211. ట.నల్కిన
  212. క.శిలా
  213. ట.నొక్క
  214. ట.దలకింతురు
  215. సంశయ
  216. క.లేఖిత
  217. సుంకసాల
  218. ఫణిధవు
  219. ట.నందులం
  220. ట.ప్రియా
  221. క.యింపఁ బ్రణితాత్ముఁడు
  222. ట.దై
  223. ట.లమరున్
  224. క.నూత్న
  225. క.ఏచూరి
  226. క.గములగు
  227. క.గ్రమ్ము
  228. క.నొందవు
  229. క.పేటి
  230. ట.నాగ
  231. క.ఏచూరి
  232. సత్వతారకటం
  233. ట.బ్రాహ్మపాద్మ
  234. క.లతా
  235. క.మప్పురి
  236. సుంకసాల
  237. క.పఱుతురు
  238. ట.జేత
  239. అగణ్యులు పుణ్యు లప్పురిన్
  240. క.శత
  241. ట.గా
  242. ట.కొరో
  243. క.కాని
  244. ట.యర్య
  245. క.చా
  246. క.కోటులు
  247. సుంకసాల
  248. క.యూధరవుల్
  249. క.శాంతికే
  250. ట.బొరి
  251. ట.పర
  252. క.బండములు
  253. ట.వెలిపార
  254. ట.గణుతింప
  255. క.శుక్రిక
  256. ట.కట్టి
  257. క.వచ్చి యెత్తెరం
  258. క.నిద్ధ
  259. సంకుసాల
  260. ట.జెలువ
  261. క.కౌల
  262. క.నే
  263. క.దో
  264. క.లఠివి
  265. క.గేలికే
  266. సుంకసాల
  267. క.ఖండించు
  268. క.బంతుల
  269. బెనుప
  270. ట.సారములగు తమ్ముల
  271. ట.గా
  272. ట.తారు
  273. క.వామ
  274. క.గర
  275. క.రొత్తిలి
  276. క.యట్ల
  277. ఫణిదపు
  278. ట.గను
  279. సుంకెసాల
  280. క.నరుఁడు
  281. క.జిలికి
  282. క.పోవక
  283. క.మెలుకలై
  284. క.చంద్రాది
  285. క.వెల్లబుచ్చుచున్
  286. ట.వదనేందు దరహాసవరశరచ్చంద్రిక
  287. ట.మెఱయుదు
  288. క.వస
  289. క.బంధంబు
  290. క.కుచయుగమున
  291. ట.మొగమున
  292. క.నేర్పు
  293. ట.మోమున
  294. ట.లేఁబరము
  295. ఫణదవు
  296. ట.మేనఁ గందుండకున్న
  297. ట.గ్రొవ్వున
  298. ట.పంక్తి లేదు.
  299. క.దంతాశి
  300. ట.జూపట్టుచుంద్రు
  301. క.వలమైన
  302. ట.పల్కులన్
  303. ట.పై
  304. ట.గతులన్
  305. ట.జిటచిట
  306. క.కుంట
  307. పణెదవు
  308. క.బూతయు
  309. ట.మోములును
  310. ట.సగమ
  311. ట.గల్దనఁగ
  312. ట.పేర్మి
  313. క.లడర్చి
  314. క.మేటి యనఁ బూజ్యుఁ డగున్
  315. ట.గప్పంచు
  316. క.చేతన్న
  317. క.వనాధిప
  318. బసవయ్య
  319. క.నగ
  320. క.నైవేద్య
  321. క.నిట్టలంబగు
  322. క.పువ్వుల
  323. ట.బొంది
  324. జొన్నపాటి
  325. క.గల్లని
  326. క.యోర్య+, ట.యోర్వకు
  327. క.ప్రభవ
  328. క.రేఖాంకురముగ
  329. క.గరళకూట
  330. క.లూనిన
  331. ట.త్రావి చూచినఁ దమ యమృతంబు చేఁదునారె?
  332. ట.నెంత
  333. ట.విలునాఱు
  334. క.జరిగి దివకుల కనియును లేని
  335. ట.బొరల
  336. క.నందెడు
  337. క.నేర్చిన
  338. ట.వేద్యంకంబు
  339. క.కేళి
  340. క.కల్హార
  341. క.వల్లికానూనప్ర
  342. క.శిఖాడోలా
  343. ట.లో పద్యము లేదు.
  344. ట.కుధాస్తరాస్తీర్ణులై (?)
  345. క.దిమదిమ గురియగ
  346. క.నరి
  347. ట.దత్పురి
  348. క.నెక్కి
  349. క.బల
  350. క.తలఁకి
  351. క.లిడగ
  352. సుంకసాల
  353. క.కంటివె
  354. క.పని
  355. క.పాడి చెఱచి
  356. ట.నడు
  357. క.వేలెటి
  358. క.బిసుమక
  359. క.వేగమె
  360. క.వాగలన్
  361. క.నొప్పునాననం
  362. క.ఖత్తులాణముల్
  363. క.భంజిణిన్
  364. క.మదజీర
  365. ట.కది
  366. క.దావ
  367. క.తీరున
  368. క.మదో
  369. సుంకసాల
  370. ట.వర్షమునన్
  371. ట.నొప్పున్
  372. యుగాగ్నికైన
  373. క.పురి