ప్రబంధరత్నాకరము/పరిచయము
పరిచయము
ఇది పూర్వసంకలనగ్రంథము. గ్రంథనామము ప్రబంధరత్నాకరము. సంకలనగ్రంథకర్త పెదపాటి జగ్గన. పెదపాటి జగన్నాథకవి అని ప్రసిద్ధము. “అరయ రామప్రెగ్గడకులాగ్రణి గంగయమంత్రిజగ్గ” అని సంకలనగ్రంథకర్తను జగన్నాథస్వామి సంబోధించినట్లు స్వప్నవృత్తాంతమునందు కలదు. (1.4) అందువలన “రామాప్రెగ్గడ” ఇంటిపేరని ఒక అభిప్రాయము కలదు. (ఆంధ్రకవితరంగిణి. పదియవ సంపుటము. 1953. పుట 92.) రామప్రెగ్గడ కులాగ్రణి అనగా రామప్రెగ్గడ వంశమునందు శ్రేష్ఠుడని అర్థము. జగ్గన వంశావతారవర్ణనమునందు మూలపురుషుడు రామప్రెగ్గడ అనియు కలదు. (1.9) ఆ వంశావతారవర్ణనమునందే “శ్రీ పెదపాటి పురీబాలగోపాలకృష్ణప్రసాదితశ్రీల వెలసి ........ జగ్గనమంత్రివరుఁడు” అని కలదు. (1.21) పెదపాడులోని బాలగోపాలకృష్ణుని అనుగ్రహము కల జగ్గన పెదపాడు నివాసి అగును. పెదపాడు ఊరిపేరు. ఊరిపేరు ఇంటిపేరగుట సర్వసాధారణము. “పెద్దపాటి జగ్గన్న నామధేయప్రణీతం” బని ఆశ్వాసాంతగద్యలందు కలదు.
ప్రబంధరత్నాకరమునందు పింగళి సూరన, భట్టుమూర్తిప్రభృతుల పద్యములు లేవు కావున జగన్నాథకవి 1550-60 ప్రాంతము వాడని ఒక అభిప్రాయము కలదు. (ఆంధ్రకవితరంగిణి. పదియవ సంపుటము. పుట 96.) కాని తదనంతరుడగు అద్దంకి గంగాధరుని తపతీసంవరణపద్యము కలదు. అంతేకాదు. ప్రబంధరత్నాకరము పూర్తిగా లభింపలేదు. తంజావూరు సరస్వతీమహలు గ్రంథాలయమునందు తాళపత్రగ్రంథము తృతీయాశ్వాసమువఱకు మాత్రమే కలదు. అందు తృతీయాశ్వాసమునందు పెద్ద గ్రంథపాతము కలదు. ఆ పెద్దగ్రంథపాతము, తదుపరి తృతీయాశ్వాసము, చతుర్థాశ్వాసము చాలవఱకు గల ప్రత్యంతరము కలదు. (సాహిత్యసంపద. 1989. పుటలు 256-257) ప్రథమాశ్వాసము నందలి ప్రణాళికనుబట్టి (27వచ.) పంచమాశ్వాసమును ఉండవలయును. ఉపలబ్ధము కాలేదు. ఉపలబ్ధమైన అసమగ్రప్రతియందు పింగళి సూరన, భట్టుమూర్తి ప్రభృతుల పద్యములు లేవని, ప్రబంధరత్నాకరము పదునాఱవశతాబ్ధి గ్రంథమని నిర్ణయించుట ప్రామాదికము.
తంజావూరి ప్రతియందు –
. | నీ వెంత వేడుకొన్నను | 123 |
అను పద్యము కలదు. ఇది నెల్లూరి ముత్తరాజు పద్మావతీకల్యాణములోని పద్యముగ కలదు. ఇందు “దేవుఁడు నహి గురువు న్నహి” అను పలుకుబడి కలదు. పద్మావతీకల్యాణమే అర్వాచీనగ్రంథ మనిపించును. అందలి పద్యమును సంకలించిన ప్రబంధరత్నాకరము అంతకంటె అర్వాచీనగ్రంథమగును.
ప్రత్యంతరమునందు –
సీ. | బొమ్మంచులువ్వంగమలు గజపొప్పళ్ళు | |
తే. | మండలాచరణంబులు నిండు జంత్రి | |
| తోరహస్తుకకలంభీలు దుప్పటములు | 105 |
అను పద్యము కలదు. ఇది అంగద బసవయ ఇందుమతీకల్యాణములోని పద్యముగ కలదు. ఇందు “షీట్” అను ఇంగ్లీషుపదము కలదు. షీట్ అనగా నేప్ కిన్, క్లాత్ ఆర్ టవల్, ఏ బ్రాడ్ పీస్ ఆఫ్ లినెన్ ఆర్ కాటన్ స్టఫ్ అని ఇంగ్లీషు నిఘంట్వర్థములు. ఇంగ్లీషుపదమును ప్రయోగించిన ఇందుమతీపరిణయమే పదునాఱవశతాబ్ది గ్రంథము కాఁజాలదు. పదునేడవశతాబ్ది గ్రంథము కావచ్చును. అందలి పద్యమును సంకలించిన ప్రబంధరత్నాకరము పదునెన్మిదవశతాబ్ది గ్రంథమగును.
తంజావురు సరస్వతీమహలు గ్రంథాలయములోని “ప్రబంధరత్నాకరము,” కాకినాడ ఆంధ్రసాహిత్యపరిషత్కార్యాలయములోని “ఉదాహరణపద్యములు,” — ఈ రెండు సంకలనగ్రంథములలోని అముద్రితగ్రంథపద్యములు ప్రబంధరత్నావళి పేర ప్రకటింపఁబడినవి. అందు ప్రబంధరత్నాకరము తృతీయాశ్వాసమునందలి పెద్ద గ్రంథపాతములోని పద్యములు, చతుర్థాశ్వాసములోని పద్యములు లేవు. అంతేకాదు. ప్రబంధరత్నాకరమునందు అనేకపద్యములకు ఆకరములు లేవు. ఆకరములు లేని పద్యములెల్ల తత్పూర్వాకరములలోని పద్యములుగ ప్రబంధరత్నావళియందు ప్రదర్శింపబడినవి. ఆకరములు లేని పద్యములెల్ల తత్పూర్వాకరములలోని పద్యములు కావు. కొన్ని అగును. కొన్ని కావు. కాని పద్యములు ప్రశ్నార్థకచిహ్నయోగ్యములు. ఆ యీ కారణములవలన, ప్రబంధరత్నాకరము పూర్తిస్వరూపము ప్రత్యక్షమగుటకు తంజావూరిప్రతిని, ప్రత్యంతరమును మేళవించిన ప్రబంధరత్నాకరము ప్రత్యేకగ్రంథము, పరిష్కృతగ్రంథము ఆంధ్రసాహిత్యజిజ్ఞాసువులకు ఆవశ్యకము.
తంజావూరి ప్రతికి నకలు కాగితపుప్రతి ఆంధ్రవిశ్వకళాపరిషత్తు గ్రంథాలయమునందు కలదు. 13-3-1892 నాటి ప్రత్యంతరము కాగితపుప్రతి నాయొద్ద కలదు. (సాహిత్యసంపద. 1989 పుటలు 256-7) రెండును మేళవించి, ముద్రితములైన ఆకరగ్రంథములను ప్రబంధరత్నావళిని సంప్రదించి, పరిష్కరించినదీ ప్రబంధరత్నాకరము. ఇందు సంకలితములైన అంశములు నూటడెబ్బదియైదు. తొమ్మిదివందలనాలుగు పద్యములు. ఆకరములైన ఉపలబ్ధకృతులివి:
నన్నెచోడుడు (?) — కుమారసంభవము
నన్నయ — భారతము
తిక్కన — భారతము
ఎఱ్ఱన — భారతము, నృసింహపురాణము
మూలఘటిక కేతన — దశకుమారచరిత్ర, ఆంధ్రభాషాభూషణము
మంచన — కేయూరబాహుచరిత్రము
బద్దెన — నీతిశాస్త్రముక్తావళి
అప్పమంత్రి — చారుచర్య
నాచన సోమన — ఉత్తరహరివంశము
భాస్కరాదులు — భాస్కరరామాయణము
రావిపాటి త్రిపురాంతకుడు — త్రిపురాంతకోదాహరణము
శరభాంకుడు — శరభాంకలింగశతకము
శ్రీనాథుడు — శృంగారనైషధము, భీమఖండము, కాశీఖండము
(వల్లభామాత్యుడు) — (క్రీడాభిరామము) వీథినాటకము
బమ్మెర పోతన — భాగవతము
విన్నకోట పెద్దన — కావ్యాలంకారచూడామణి
మడికి సింగన — వాసిష్ఠరామాయణము, పద్మపురాణము
నిశ్శంక కొమ్మన — శివలీలావిలాసము (వీరమాహేశ్వరము)
జక్కన — విక్రమార్కచరిత్ర (సాహసాంకము)
దగ్గుబల్లి దుగ్గన — నాసికేతోపాఖ్యానము
భైరవుడు — శ్రీరంగమాహాత్మ్యము
ఏర్చూరి సింగన — షష్ఠస్కంధము
పిల్లలమఱ్ఱి పినవీరన — శాకుంతలము, జైమిని భారతము
నంది మల్లయ, ఘంట సింగయ — ప్రబోధచంద్రోదయము కొరవి గోపరాజు — సింహాసనద్వాత్రింశిక
మొల్ల — మొల్ల రామాయణము
నంది తిమ్మన — పారిజాతాపహరణము
ధూర్డటి — శ్రీ కాళహస్తీశ్వరమాహాత్మ్యము
మాదయగారి మల్లన — రాజశేఖరచరిత్ర
సంకుసాల నృసింహకవి — కవికర్ణరసాయనము
హరిభట్టు — ఉత్తరనరసింహపురాణము
చరిగొండ ధర్మయ — చిత్రభారతము
ఎడపాటి (పెద్దపాటి) ఎఱ్ఱన — మల్హణచరిత్రము
ప్రౌఢకవి మల్లన — రుక్మాంగదచరిత్రము
శేషనాథుడు — పర్వతపురాణము
కూచిరాజు ఎఱ్ఱయ — కొక్కోకము, సకలపురాణసారము (అముద్రితము)
అద్దంకి గంగాధరుడు — తపతీసంవరణము
నూతనకవి సూరయ — ధనాభిరామము
అనుపలబ్ధకృతులివి:
తిక్కన — విజయసేనము
రావిపాటి త్రిపురాంతకుడు — అంబికాశతకము, తారావళి
శ్రీనాథుడు — వల్లభాభ్యుదయము
తెనాలి రామలింగన — హరిలీలావిలాసము, కందర్పకేతు(కేళీ)విలాసము
కానుకొలను అన్నమరాజు — అమరుకము
చిమ్మపూడి అమరేశ్వరుడు — విక్రమసేనము
పెదపాటి ఎఱ్ఱాప్రెగ్గడ — కుమారనైషధము
తేళ్ళపూడి కసవరాజు — కళావతీశతకము
భాస్కరుని కేతన — కాదంబరి
బొడ్డపాటి కొండయ — చాటువులు
చిరుమూరి గంగరాజు — కుశలవోపాఖ్యానము
చంద్రమౌళి (?) — హరిశ్చంద్రకథ
చోడయ — సాముద్రికము
చౌడన్న — నందనచరిత
త్రిపురారి — ప్రేమాభిరామము
అముడూరి నరసింగభట్టు — షోడశరాజచరిత్ర
నారాయణదేవుడు — మదనకళాభిరామము
పొన్నాడ పెద్దిరాజు — ప్రద్యుమ్నచరిత్ర
భావన పెమ్మన — అనిరుద్ధచరిత్ర
బొడ్డపాటి పేరయ(మరాజు) — చాటువులు, పద్మినీవల్లభము, మంగళగిరివిలాసము, శంకరవిజయము (రాజశేఖరవిజయము), సూర్యశతకము
ప్రెగడపల్లి పోతరాజు — గోదావరీశతకము
పోలమరాజు — పర్వతపురాణము
అంగద బసవయ్య — ఇందుమతీకల్యాణము
తులసి బసవయ్య — సావిత్రికథ
భాస్కరుడు — శృంగారరత్నాకరము
నండూరి మల్లయ — హరిదత్తోపాఖ్యానము
నంది మల్లయ — మదనసేనము
మద్దికాయల మల్లయ — రేవతీపరిణయము
ఘటకాశి(మదిరాసి) మల్లుభట్టు — జలపాలిమాహాత్మ్యము
పణదపు మాధవుడు — ప్రద్యుమ్నవిజయము
నెల్లూరి ముత్తరాజు — పద్మావతీకల్యాణము
జయతరాజు ముమ్మయ — విష్ణుకథానిధానము
రంగనాథుడు — ?
వాసిరాజు రామయ్య — బృహన్నారదీయము
ఎలపర్తి రామరాజు — రామలింగశతకము
ఉభయకవి లక్కాభట్టు — శతపక్షిసంవాదము
సర్వదేవుడు — ఆదిపురాణము
సర్వన — షష్ఠస్కంధము
కంచిరాజు సూరయ — కన్నప్పచరిత్ర
దామరాజు సోమయ్య — భరతము
నాచిరాజు సోమయ్య — మత్త(ద?)లీలావిలాసము
పెదపాటి సోమరాజు — శివజ్ఞానదీపిక, కేదారఖండము, అరుణాచలపురాణము, రత్నావళి
పాలపర్తి సోమేశ్వరుడు — ?
? — కళావిలాసము
? — కామందకము
? — చాటువులు
? — నిజలింగచిక్కనికథ
? — నీతిసారము
? — పంచతంత్రి
? — పురుషార్థసారము
? — వెంకటవిలాసము
ఇవి గాక ఆకరములు లేని పద్యములు కవుల గ్రంథములును ఇంకను కలవు. సుమారు శతాధికగ్రంథములనుండి సహస్రాధికపద్యములను సంఘటించిన సంకలనగ్రంథము పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరము.
ఇందలి “భీమకవి - దశావతారము” పద్యము (1-33) సరిగా లేదు. అది “ఉదాహరణపద్యములు” అను సంకలనగ్రంథమున ఇటు కలదు.
సీ. | శ్రుతిసుధాక్ష్మాభక్తసురజననీవధూ | |
ఆ. | జెరివి తార్చి యెత్తి చేరి బంధించి ని | |
ఇందును అందును మొదటిపాదమునందు “శంకర” అని కలదు. అది “సంకర” అగును. ఇందు రెండవపాదమునందు “బౌద్ధ” అని కలదు. అందు “బుద్ధ” అని కలదు. అది స్పష్టము. ఇందు మూడవపాదమునందు “స్థివిముక్త” అని కలదు. అందు “స్త్రీవిముక్త” అని కలదు. అది సరియైనది. నాల్గవపాదము మారిపోయినది. అందలి నాల్గవపాదము కంటె ఇందలి నాల్గవపాదము నయము. పద్యమునందు క్రమాలంకారము కలదు. 1. శ్రుతి, కగము (మత్స్యము), నముచి(), పుచ్ఛాగ్రము — మత్స్యావతారము
2. సుధ, కూర్మము, మందరము, పృష్ఠము — కూర్మావతారము
3. క్ష్మా, కిటి, కుదానవుడు, దంష్ట్ర — వరాహావతారము
4. భక్తుడు (ప్రహ్లాదుడు), నరమృగము, కుదానవుడు, నఖము — నృసింహావతారము
5. సురలు, కుబ్జుడు, బలుడు (బలి), గుణము (దానగుణము) — వామనావతారము
6. జనని, రాముడు, అర్జునుడు (కార్తవీర్యుడు), పరశువు — పరశురామావతారము
7. వధువు, రాముడు, పంక్తిముఖుడు, బాణము — రామావతారము
8. మల్లుడు, అనంతుడు, ముష్టికము, కరము — కృష్ణావతారము
9. సంకరము, బుద్ధుడు, స్త్రీవిముక్తులు (సన్యాసులు), అంగము (అష్టాంగయోగము) — బుద్ధావతారము
10. ధర్మము, కల్కి, ఖలులు, ఖురపుటములు — కల్క్యవతారము
ఈ పద్యము “దశావతారములకు భీమన చెప్పినది” అని “ఉదాహరణపద్యము” లందు కలదు. వేములవాడ భీమన పేర ప్రబంధరత్నాకరమునందు ఈ క్రింది పద్యము కలదు.
ఉ. | శ్రీలలనాతనూభవవిశేషజగజేజయమూలమన్మథా | 119 |
ఈ రెండు పద్యములును వేములవాడ భీమన వచియించు ఉద్దండలీలకు నిదర్శనములే.
శ్రీనాథుని వల్లభాభ్యుదయములోని సీసపద్యమునందలి ఎత్తుగీతము తంజావూరి ప్రతియందు సంస్కరణయోగ్యము కాని స్థితిలో కలదు. అది ప్రత్యంతరమునందు సంస్కరణావశ్యకము లేని సమ్యక్స్థితిలోనే కలదు.
సీ. | రజనీవధూకర్ణరజతతాటంకంబు | |
| దుగ్ధపాథోరాశి తొలిచూలి సంతతి | |
తే. | చంద్రకాంతశిలామణిస్థలకృపీట | 199 |
[1]తంజావూరిప్రతిలోని – కానుకొల్లు అన్నమరాజు అమరుకము, పణిదపు మాధవుని ప్రద్యుమ్నవిజయము, తులసి బసవయ్య సావిత్రికథ, లక్కాభట్టు శతపక్షిసంవాదము, పెదపాటి సోమయ అరుణాచలపురాణము, కేదారఖండము, చిమ్మపూడి అమరేశ్వరుని విక్రమసేనము, భావన పెమ్మన అనిరుద్ధచరిత్ర, నంది మల్లయ మదనసేనము, పొన్నాడ పెద్దిరాజు ప్రద్యుమ్నచరిత్ర, బొడ్డపాటి పేరయ శంకరవిజయము (రాజశేఖరవిజయము), తెనాలి రామలింగయ్య హరిలీలావిలాసము, కందర్పకేళీవిలాసము, నండూరి మల్లయ హరిదత్తోపాఖ్యానము, ఘటవాసి మల్లుభట్టు జలపాలిమాహాత్మ్యము, అంగద బసవయ ఇందుమతీకల్యాణము, అముడూరి నరసింగభట్టు షోడశరాజచరిత్ర, జయతరాజు ముమ్మన విష్ణుకథానిధానము, అజ్ఞాతకవి కళావిలాసము అను గ్రంథములనుండి అప్రకటితపూర్వములైన అనేకపద్యములు ప్రత్యంతరమునందు కలవు. అంతేకాదు. తంజావూరు ప్రతిలో లేని నారాయణదేవుని మదనకళాభిరామము, త్రిపురారి ప్రేమాభిరామము, పెదపాటి సోమరాజు రత్నావళి, అజ్ఞాతకవి నిజలింగచిక్కనికథ, నాచన సోమరాజు మత్తలీలావిలాసము, అజ్ఞాతకవి వెంకటవిలాసము, ప్రెగడపల్లి పోతరాజు గోదావరీశతకము, శరభాంకుని శరభాంకలింగశతకము అను గ్రంథములనుండి కూడ అనేక పద్యములు ప్రత్యంతరమునందు కలవు.
ఆంధ్పవిశ్వకళాపరిషత్ — గ్రంథాలయములోని తంజావూరుప్రతి నకలు కాగితపుప్రతికి, ప్రత్యంతరము కాగితపుప్రతికి మఱొకప్రతిని వ్రాసి, వానిని సంప్రదించునెడ చదువుటో, సరిజూచుటో చేసి, చిత్తుప్రతికి మఱల శుద్ధప్రతిని వ్రాసి సహకరించిన డాక్టర్ మోడేకుర్తి వెంకటసత్యనారాయణగారికి—
ముద్రణదోషములను సవరించునెడ సహకరించిన ఆచార్య కోలవెన్ను మలయవాసిని, డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి, డాక్టర్ సజ్జా మోహనరావులకు—
ముద్రణకార్యమును నిర్వహించిన ఆంధ్రాయూనివర్సిటీప్రెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ డి. వి. కృష్ణారావుగారికి, వారిసిబ్బందికి—
ముద్రణభారమును వహించిన ఆంధ్రవిశ్వకళాపరిషత్ అధిపతులకు—
కృతజ్ఞతలు.
18-12-91
ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి
- ↑
క. తంజావూరిప్రతి నకలు కాగితపుప్రతి
చ. నాయొద్దనున్న ప్రత్యంతరము కాగితపుప్రతి
ట. ప్రబంధరత్నావళి
త. ప్రబంధమణిభూషణము
గ. ముద్రితగ్రంథము