ప్రపంచ చరిత్ర/సంవత్సరాది బహుమానము

వికీసోర్స్ నుండి

నేను చెప్పినట్లుగా నీ వదృష్టవంతురాలవు. మన దేశమున విజృంభించిన స్వాతంత్ర్యోద్యమము నీవు కన్నులార చూచుచున్నావు . మీఅమ్మ ఎంత దైర్యశాలిని : ఎంత ఉత్తమురాలు 1 ఇట్టి తల్లి నీకుండుట ఎంత అదృష్టము ! నీ కెన్నడైన సంశయము కలిగినను, చిక్కులు తటస్థించినను ఆమెకన్న నీకు ప్రియమగు సఖు లెవరు?

ఉందునా యింక, చిట్టితల్లీ : హిందూదేశమునకు సేవ చేయుటకై నీపు ధైర్యశాలినివగు యోధాగ్రణివగుదువుగాక. నీకు నా ప్రేమాశీస్సులు .


1

సంవత్సరాది బహుమానము

సంవత్సరాది, 1931

నీవు ముస్సోరీలోను, నేను అలహాబాదులోను ఉన్నప్పుడు, రెండు సంవత్సరములక్రితము, నేను నీకు వ్రాసిన జాబులు జ్ఞాపకమున్నవా? అవి బాగున్నవని నీవు నాతో చెప్పియుంటివి. అట్టి జాబులను మరల వ్రాసి ఈ మన ప్రపంచమునుగూర్చిన అధికవిషయములు నీకు చెప్ప కూడదా? యని యాలోచించుచుంటిని. కాని అట్లుచేయుటకు సంకోచించి తిని. ప్రపంచముయొక్క గతచరిత్రను, మహాపురుషులను, నారీమణులను, మహత్కార్యములను స్మరించుట సంతోషముతోకూడిన పనియే. చరిత్ర చదువుట మంచిదే. అంతకన్న మనోజ్ఞమైన, సంతోషకరమైన విషయము చరిత్రను నిర్మించుటకు తోడ్పడుట, ఈదేశములో నేడు చరిత్ర నిర్మింప బడుచున్నదన్న విషయము నీకు తెలిసినదేకదా ! ఇండియాపూర్వచరిత్ర పెద్దదేకాని అది అజ్ఞాతముగా నున్నది. అందు కొంత భాగము విచారకరమైనది, దుఃఖకరమైనది. తలచుకొన్నచో మనము తలలువాల్చి కంటతడి పెట్టుకో వలసివచ్చును. కాని మొత్తముమీద ఇండియా పూర్వచరిత్ర దివ్యమైనది. మనము గర్వింపదగినది. తలచుకొని సమ్మోదము నంద దగినది. అయినను పూర్వచరిత్ర స్మరించుటకు నేడు మనకు తీరికలేదు. ఇండియాభావియే మన హృదయముల నాక్రమించుకొన్నది. ఈ భావికే మనమిప్పుడు రూపము నిచ్చుచున్నాము. మన కాలమును, శక్తిని దేని కొరకై వినియోగించుచున్నామో అట్టి వర్తమానముకూడ మనమనస్సుల నాక్రమించుకొన్నది.

ఇక్కడ నాయినీచెరసాలలో ఇష్టము వచ్చినట్లు చదువుటకుగాని, వ్రాయుటకుగాని నాకు తీరిక కలదు. కాని నామనస్సు కుదురుగా నుండుట లేదు. బయట జరుగుచున్న గొప్ప పోరాటమునుగూర్చి నే నూహించు కొనుచుందును. ఇతరు లేమి చేయుచున్నారో, వారితో నున్న నే నేమి చేసియుండెడివాడనో యని ఆలోచించుకొనుచుందును. వర్తమానమును, భావియు నన్ను పూర్తిగా ఆక్రమించుకొన్నవి. గతకాలమునాటి విషయములను తడవుటకు నాకు తీరిక యేదీ ? కాని నా యభిప్రాయము పొరపాటని నే ననుకొనుచున్నాను. బయట జరుగు కార్యములలో నేను కలుగజేసికొనలేనప్పుడు నే నేల విచారించవలెను ?

అయితే నేను వ్రాయకుండుటకు నిజమైన కారణము – రహస్యముగా నీ చెనిలో చెప్పుదునా? - వేరొకటి యున్నది. నీకు బోధించుటకు నా కెంతమాత్రము జ్ఞానమున్నదని నేను సందేహించుచున్నాను. నీవా ఆనాటికానాడు వడివడిగా పెరుగుచున్నావు. జ్ఞానార్జన చేయుచున్నావు. నేను పాఠశాలలోను, కాలేజీలోను, తరువాతను నేర్చుకొన్నదంతయు నీకు నేర్పుటకు చాలినంత లేదు, అథవా అది నీకు తెలిసిన విషయమై చప్పగా నుండవచ్చును. కొంతకాలమైన పిమ్మట నీవే నాకు తెలియని విషయము లెన్నోబోధించవచ్చును. నీజన్మదినమున నీకువ్రాసినజాబులో చెప్పినట్లు నేను మిక్కిలి తెలివిగల పురుషునివంటివాడను కాను. తెలివి యధికమై పగిలిపోదునేమో యన్న భయముతో నాతడు రాగిరేకులను తనచుట్టును బిగించుకొన్నాడట.

నీవుముస్సోరీలో నున్నప్పుడు ప్రపంచము యొక్క బాల్యమును గూర్చి నేను నీకు వ్రాసియుంటిని. అప్పుడు వ్రాయుట నాకు సులభముగానే యుండెను. ఏలయన ఆకాలమునకు సంబంధించిన విషయములు మనకు స్పష్టముగ తెలియవు. అతి ప్రాచీనకాలమునుండి వెలువడినతోడనే చరిత్ర క్రమక్రమముగా ప్రారంభమగును, మానవుడు ఏవిధ ప్రాంతముల తన వింతజీవితయాత్ర ప్రారంభించును. ఒకప్పుడు వివేకయుక్తముగాను, వేరొకప్పుడు పిచ్చిగాను, తెలివితక్కువగాను ఉండు మానవుని చర్యలను గ్రహించుట సులభసాధ్యముకాదు. గ్రంథసహాయమున గ్రహించుటకు మనము ప్రయత్నించవచ్చును. కాని నాయినిచెరసాలలో పుస్తకభాండాగారము లేదు. పూర్వాపరసందర్భములతో ప్రపంచచరిత్ర నీకు చెప్పవలేనని యున్నదిగాని అట్లుచేయుట సాధ్యముకాదని తోచుచున్నది. బాల బాలికలు ఒక్క దేశముయొక్క చరిత్ర మాత్రమే నేర్చుకొనుట - అదైనను ఏవో కొన్ని సంవత్సరములు, కొన్ని యంశములు కంఠస్థము చేయుట - నా కెంతమాత్ర మిష్టములేదు. అన్యోన్యసంబంధము కలిగి సమగ్రముగా నుండునది చరిత్ర . ప్రపంచమున ఇతరభాగములందు జరుగు వృత్తాంతములు తెలిసినగాని ఏయొక్క దేశచరిత్రయైనను నీ కర్థముకాదు. ఒకటిరెండు దేశములకు సంబంధించిన చరిత్రను మాత్రమే, యిట్టి సంకుచికపద్ధతిని నీవు నేర్చుకోవని నమ్ముచున్నాను. ప్రపంచచరిత్రను పరీక్షచేయుదు వనియు నమ్ముచున్నాను.

మన మనుకొనునట్లు వివిధ మానవవర్గములలో గొప్ప భేదము లేదని సదా జ్ఞప్తియం దుంచుకొనుము. పటములును, అట్లాసులును వేర్వేరు రంగులతో దేశములను మనకు ప్రదర్శంచును. మానవులలో భేదములున్న మాట వాస్తవమేకాని వారిలో దగ్గర పోలికలుకూడ ఉన్నవి. పటములలోని రంగులను బట్టిగాని, దేశముల పొలిమేరలనుబట్టిగాని మనము భ్రమపడరాదు. ఈవిషయమును మనము మనస్సులో పెట్టుకో పలెను.

నాకిష్టమున్న చరిత్ర నుగూర్చి నేను నీకు వ్రాయజాలను. గత కాలమునుగూర్చియు, గతకాలమున నివసించి, ప్రపంచ నాట్యరంగమున పెద్దపాత్రలు ధరించినట్టి పురుషులను గూర్చియు నీకప్పుడప్పుడు వ్రాయుదును.

నా జాబులు నీకిష్టముగా నుండునో లేదో. అవి సీ కౌతకమును రేపెట్టునో లేదో నేను చెప్పలేను. నిజమునకు వాని నెప్పుడు నీవు చూతువో, అసలు చూతువో లేదో కూడ నాకుతెలియదు. చిత్రము; మన మంత సమీపములో నుండియు ఇంతదూరముగానున్నాము. ముస్సోరీలో నీవు ఎన్నియో వందల మైళ్ళదూరములో నున్నావు. అయినను నాకిష్టమై నన్నిమారులు నేను నీకు జాబులు వ్రాయగలను. నిన్ను చూడవలెనని గట్టిగా బుద్ధిపుట్టిన నేను నీకడకు పరుగెత్తిరాగలను. ఇప్పుడు మనము యమునానది కద్దరిని ఇద్దరిని, ఉన్నాముగదా ! దూరములో లేముగదా ? అయినను నాయినీచెరసాల ఎత్తైనగోడలు మనలను కలిసికోకుండ చేయుచున్నవి. పక్షమున కొక జాబు నేను వ్రాయవచ్చును. పక్షమున కొకజాబు నాకురావచ్చును. పక్షమునకొకసారి ఇరువదినిముషములపాటు మిత్రులో, బంధువులో నన్ను సంచర్శించి మాటాడుటకు రావచ్చును. అయినప్పటికి ఇట్టి కట్టుబాట్లు మంచివే. సులభముగా లభించు వస్తువులపై మనకు గౌరవముండదు. కారాగారానుభవము వాంఛింపదగిన విద్యాశిక్షణ యని నాకు నానాటికి నమ్మకము కలుగుచున్నది. ఎంతయదృష్టమో కాని నేడు మనదేశప్రజలు వేలకొద్ది యిట్టి విద్యాశిక్షణ నందుచున్నారు.

ఈ జాబులను నీవు చూచి ఇష్టపడుదువో లేదో నేను చెప్పజాలను. నా యానందముకొరకే నేను వీనిని వ్రాయ సంకల్పించితిని. అవి నిన్ను నా సమీపమునకు తీసికొనివచ్చును, నీతో సంభాషణ చేయుచున్నట్లే నేను భావించుకొందును. తరుచుగా నేను నిన్ను తలచుకొనుచుందును. ఈ రోజున నా మనస్సులో నీవులేని క్షణములేదు. ఈదినము సంవత్సరాది. తెల్లవారుజామున పరుపుపై పరుండి నక్షత్రములను చూచుచు గతించిన సంవత్సరమును గురించియు, అది తెచ్చి పెట్టినఆశలు, సంతాప ములు, సంతోషములనుగురించియు, ఆచరించిన, సాహసముతో కూడిన మహత్కార్యములను గురించియు నేను మననము చేసితిని. ఎరవాడ చెరసాలగదిలో కూర్చుండి, తన ఇంద్రజాలస్పర్శవల్ల మనమాతృదేశమునకు మరల యౌవనమును, శక్తినికలిగించిన బాపుజీని స్మరించితిని. తాత[1]ను, ఇతరులను పెక్కురను స్మరించితిని. ముఖ్యముగా మీ అమ్మను, నిన్ను తలచుకొంటిని. తరువాత కొంత సేపటికి ఉదయమున వార్తవచ్చినది. - మీ అమ్మను పట్టుకొని జైలుకు తీసికొని వెళ్ళిరని. అది నా కింపైన ఉగాదిబహుమానము. ఇట్లుజరుగునని ఎంత కాలమునుండియో అనుకొనుచున్నాను. అమ్మ పూర్తిగా సుఖముగాను, సంతుష్టితోను, ఉండుననుటకు సందేహములేదు.

కాని నీవు ఒంటరివి అయితివి. పక్షమునకొకమారు నీవు అమ్మను చూడవచ్చును. పక్షమున కొకమారు నీవు నన్ను చూడవచ్చును. మా సందేశము లొకరివి ఇంకొకరితో చెప్పవచ్చును. అయితే కాగితము, కలము తీసికొని నేను కూర్చుందును నిన్ను, తలచుకొందును. అప్పుడు నీవుసన్న సన్నగా నాపజ్జకువత్తువు. మన మెన్నియో విషయములనుగూర్చి ప్రసంగించుకొందము. గత కాలమునుగూర్చి కలలుకందము. గత కాలము కన్న భావికాలమును గొప్పగాచేయుటకు మార్గములు కనుగొందము. కాబట్టి ఈ సంవత్సరాదిదినమున మనము దృఢసంకల్పము చేసికొందము. ఈసంవత్సర మవసానదశకు వచ్చిఅంత మొందుటకు పూర్వమేమనము భావినగూర్చి కన్న కలలను వర్తమానమునకు దగ్గరగా తీసికొని రాగలుగుటకు సంకల్పము చేసికొందము, ఇండియా గత చరిత్ర కొక దేదీప్యమానమగు పుటను చేర్చగలుగుటకు సంకల్పము చేసికొందము.

  1. ఇందిర తాతగారైన మోతీలాల్ నెహ్రూ.