ప్రపంచ చరిత్ర/చరిత్ర మనకేమి బోధించును?

వికీసోర్స్ నుండి

2

చరిత్ర మనకేమి బోధించును?

జనవరి 5, 1934

చిట్టీ. నీకు నే నేమి వ్రాయను? ఎక్కడ మొదలు పెట్టను? గత కాలముకు స్మరించినంతనే అసంభ్యాకములగు చిత్రములు నామనస్సులో పరుగులుదీయును. కొన్ని చిత్రములు మిగతవానికన్న ఎక్కువకాలము నిలుచును. అవి నాకు ప్రియమైనవి. వానినిగురించి నేను మననము చేయ ప్రారంభింతును. అనుకొనకుండనే గతసంఘటనలను నేటి సంఘటనలతో పోల్చుచును. అందుండి నాకు మార్గదర్శకముగా నుండు ఉపదేశములను కనుగొనుటకు ప్రయత్నింతును. కాని మానవునిమనస్సు ఎంతటి వింత కలగూరగంప? సంబంధములేని ఆలోచనలు, క్రమము తప్పిన చిత్రములు దానినిండ యుండును. అది ఒక క్రమములో చిత్రపటము లమర్చిని ఒక చిత్రశాలవంటిది. అయితే తప్పు పూర్తిగామనది కాదు. మనలో పెక్కురము తమ మనస్సులలో జరిగిన కార్యము లొక క్రమపద్ధతిని ఇంతకన్న చక్కగా నమర్చుకొనగలముకాని ఒక్కొక్కప్పుడు ఆకార్యము లెంతో వింతగా క్లిష్టముగా నుండి ఏక్రమపద్ధతిలోను ఇముడవు.

ప్రపంచము నెమ్మదిగానై నను నిస్సందేహముగా నభివృద్ధిజెందిన దనియు, సామాన్య అల్పజంతువులు పరిణమించి పెద్ద జంతువులుగా మారినవనియు, చివరకు ఉత్తమజంతువగు మానవుడు వచ్చినాడనియు మేధాశక్తివలన నితరజంతువులను మించినాడనియు చరిత్ర మనకు భోధించవలయునని ఇదివరలో నీకు వ్రాసి యుంటినని నా యూహ. అనాగరికస్థితినుండి నాగరిక స్థితికి మానవుడు అభివృద్ధి చెందివచ్చుటయే చరిత్ర చెప్పవలసిన యంశమందురు. జనులందరును కలిసి మెలసిపని. చేయవలెనను భావము - అనగా సహకారభావము ఎట్లు వృద్దియైనదో నేను కొన్ని యుత్తరములలో వ్రాసియుంటిని. లోకకళ్యాణముకొరకు మనమందరముకలిసి పనిచేయుట మనయాదర్శముగా పెట్టుకొనవలయుననియు కొన్ని లేఖలలో నేను నీకు తెలియజేసితిని. కాని ఒక్కొక్కప్పుడు పెద్దచరిత్రభాగములను చూచినప్పుడు ఈఆదర్శము ముందడుగువేసినదా యని సందేహము కలుగును; మనము నాగరీకులము, అభివృద్ధి చెందితిమి అని చెప్పుటకు నోరాడదు. నేడు సహకారలోపము కావలసినంత యున్నది. స్వార్థపరత్వముతో ఒక దేశ మింకొకచేశముపైని, ఒకజాతి యింకొక జాతిపైనిబడి పీడించుచున్నవి. ఒకమానవు. డింకొక మానవుని లోబరుచుకొని లాభమందుచున్నాడు. కోట్లకొలది సంవత్సరముల యభివృద్ధి యనంతరమున మన మిట్టి హీనస్థితిలో, లోపములతో నున్నప్పుడు వివేకము, విజ్ఞానముగల మానవులవలె సంచరించుట నేర్చుకొనుటకు మరెంతకాలముపట్టునో ? ఒక్కొక్కప్పుడు, మన కాలమున కంటెను మెరుగుగా కనిపించు గత కొలము గురించి మనము చరిత్రలో చదువుదుము. అప్పటివారెక్కువ విజ్ఞానవంతులుగను, నాగరీకులుగను కనిపింతురు. ఇది చదివినప్పుడు మనలోకము ముందుకు పోపుచున్నదో, వెనుకకు పోవుచున్నదో చెప్పుట సందేహాస్పదముగా నుండును. గతకాలమున మన దేశచత్రలో, నిస్సంశయముగా, దీవ్యత్ ఘట్టములు కలవు. నేటికాలమునకన్న నన్నివిధముల నుత్తమమైనవి. .

పలుదేశములలో గతకాలమున దివ్యఘట్టము లున్నమాట వాస్తవమే - ఇండియాలో, ఈజిప్టులో, చీనాలో, గ్రీసులో, ఇంకను ఇతర దేశములలో. ఈ దేశములలో అనేకము హీనస్థితికి పడిపోయిన మాట కూడ వాస్తవమే. ఇట్లు జరిగినప్పటికిని మన మదైర్యము జెందరాదు, ప్రపంచము విపులమైనది. కొంతకాలముపాటు ఒకదేశము ఉచ్ఛస్థితికి వచ్చినను. నీచస్థితికి పడిపోయినను దానివలన లాభముగాని, నష్టముగాని మొత్తము ప్రపంచమునకు ఉండదు. నేటికాలమున పలువురు మన గొప్ప నాగరీకతను తలుచుకొనియు, శాస్త్రము కనిపెట్టిన యద్భుతవిషయములను తలుచుకొనియు మురిసి పోవుటకద్దు. శాస్త్రము అద్భుతవిషయములను కనిపెట్టినమాట నిజమే , శాస్త్రజ్ఞులు గౌరవార్హులే. కాని డాబులుకోట్టువా రెన్నడును గొప్పవారు కారు. అనేక విషయములలో మానవు. డితరజంతువులకన్న నెక్కువ యభివృద్ధిలోనికి రాలేదని జ్ఞాపకముంచుకొనుట మంచిది. కొన్నివిషయములలో కొన్నిజంతువులు మానవునికన్న ఉత్తమస్థితిలో నున్నవని చెప్పవచ్చునేమో! ఇది తెలివితక్కువమాటగా తోచవచ్చును. తెలివి తక్కువ మనుష్యులు నవ్వవచ్చును. నీ విప్పుడే మీటర్లింకు వ్రాసిన తేనెటీగజీవితమును గురించియు, చెదపురుగులను, చీమలను గురించియు చదివియున్నావు. ఈ కీటకములు తమ సంఘముల నెట్లు క్రమపద్ధతిలో పెట్టుకొన్నవో చూచి నీ వాశ్చర్యపడియుందువు. చేతనములందెల్ల నీ కీటకములు మిక్కిలి నీచములని మనము వీనిని ఈసడింతుము. అయినప్పటికిని ఈ చిన్నజీవులు మానవునికంటె బాగుగా సహకారవిద్య నేర్చుకొన్నవి ; సంఘ క్షేమమునకై ఆత్మార్పణముచేయుట నేర్చుకొన్నవి, అన్యోన్య సహకారము, సంఘ శ్రేయస్సునుగోరి ఆత్మార్పణముచేయుట నాగరీక లక్షణములైనచో చెదపురుగులును, చీమలును మానవునికన్న మిన్నలని తప్పక చెప్పక తప్పదు.

మన ప్రాచీన సంస్కృత గ్రంథములలో నొక శ్లోకమున్నది. దాని భావ మిది-- "కుటుంబముకొరకు వ్యక్తిని పరిత్యజించుము. సంఘము కొరకు కుటుంబమును పరిత్యజించుము. దేశముకొరకు సంఘమును పరిత్యజించుము. ఆత్మకొరకు లోకమును పరిత్యజించుము." ఆత్మయన నేమో బహుకొద్దిమందికి తెలియును. వారు దానిని గురించి చెప్పగలరు. మనలో ప్రతి యొక్కడు దానికి ఒక్కొక్క విధముగా అర్థము చెప్పవచ్చును. కాని ఈ సంస్కృతశ్లోకమునుబట్టి మనము నేర్చుకొనవలసిన విషయము - సహకారము. సంఘక్షేమమునకై ఆత్మార్పణము. చాలకాలమునుండి మనము గొప్పతనమునకుదారిచూపు ఈపరమధర్మమును విస్మరించితిమి. అందువల్లనే పతితుల మైతిమి. కాని మరల నేడు దానిఛాయలు పొడగట్టు చుస్నవి. దేశమునందు కదలిక పుట్టినది. పురుషులు, స్త్రీలు, బాలురు, జాలికలు చిరునవ్వుతో మాతృదేశవిముక్తికై కష్టములను, బాధలను గణించ కుండ ముందంజవేయుట చూచిన ఎంత యాశ్చర్యకముగా నుండును ! వారుమందహాసము చేయవలసినదే. సంతోషముగా నుండవలసినదే. మహదుద్యమమున పాల్గొను ఆనందము వారిదికాదా ! అదృష్టవంతులకు త్యాగానందముకూడ రాగలదు. నేడు మనము ఇండియా సంకెళ్లు సడలించుటకు ప్రయత్నించుచున్నాము. అది మహత్కార్యము. అంత కన్న మహత్కార్యము మానవకోటి శ్రేయస్సుకొరకు పనిచేయుట. బాధను, దుఃఖమును పారదోలుటకు మానవకోటి చేయుచున్న పోరాటములో మన పోరాట మొక భాగమని మనము భావించుచున్నాము కాబట్టి లోకకల్యాణమునకు చేతనైనంతవరకు మనమును సహాయము చేయుచున్నట్లు భావించుకొని సంతసింపవచ్చును.

అంతదనుక నీవు ఆసందభవనములో కూర్చుండుము. మీ అమ్మ మలక్కా చెరసాలలో కూర్చుండును. నేనీ నాయినీ చెరసాలలో కూర్చుందును. ఒకరినొకరము చూచుకోలేకపోతిమిగదాయని అనుకొనుచుందుము కదూ? మనము ముగ్గురము మరల కలిసికొనబోవు రోజును తలుచుకొనుము. ఆ రోజు ఎప్పుడు వచ్చునాయని నేను కనిపెట్టుకొని యుందును. ఆ యాలోచనలవల్ల నా గుండెలో బరువు తగ్గినట్లుండును. నాకుత్సాహము కలుగును.