Jump to content

ప్రపంచ చరిత్ర/ప్రాచీనకాలము పిలుచు పిలుపు

వికీసోర్స్ నుండి

జనులు కీచేవెనుక కొరియాకు పోయిరి. కీచెసంతతివారు చోజన్‌దేశమును 900 సంవత్సరములకాలము పరిపాలించిరి.

చోజన్‌కు తూర్పుగా దేశములు లేకపోలేదు. దానికి తూర్పుగా జపాను ఉన్నట్లు మనకు తెలియును. కీచే చౌజన్ వెళ్ళినప్పుడు జపా నులో ఏమి జరుగుచున్నదో మనకు తెలియదు. చీనా చరిత్రవలెగాని, కొరియా (చోజన్) చరిత్ర వలెగాని జపానుచరిత్ర అంత ప్రాచీనమైనది కాదు. జసాను దేశస్థులు చెప్పుమాట ఏమనగా-వారి ప్రథమచక్రవర్తి జిమ్ముటెన్నొ అనువాడనియు, అతడు క్రీస్తు పుట్టుటకు 600 లేదా 700 సంవత్సరములకు ముందు రాజ్యము చేసెననియు, అతడు సూర్యదేవి సంతతివాడని వారి నమ్మకము. జపానులో సూర్యుని స్త్రీ దేవతగా భావింతురు. జపానుయొక్క ప్రస్తుతచక్రవర్తి జిమ్ముటెన్నొ సంతతి వాడని వారు చెప్పుదురు. కాబట్టి అతడు సూర్యసంతతివాడని పలువురు జపానీయులు నమ్ముదురు.

మన దేశమందుకూడ రాజపుత్రులు ఆ విధముగానే తమ మూల పురుషుడు సూర్యుడో, చంద్రుడో అని చెప్పుదురు. వారిలో రెండు వంశము లున్నవి. కొందరు సూర్యవంశస్థులు, కొందరు చంద్రవంశస్థులు. ఉదయపూరు మహారాజా సూర్యవంశస్థులలో పెద్ద. తన వంశమెంతో ప్రాచీనమైనదని ఆయన చెప్పెను. మన రాజపుత్రులు అసామాన్యులు. వారి వీర్యమును, పరాక్రమమును, వర్ణించు కథల కంతములేదు.


12

ప్రాచీనకాలము పిలుచు పిలుపు

జనవరి 17. 1931

సుమారు 2500 సంవత్సరముల పూర్వమువరకు ప్రాచీన ప్రపంచము ఏవిధముగా ఉండవచ్చునని ఊహించబడుచున్నదో దానిని ఇంత వరకు సంక్షేపముగా చూచితిమి. మన పర్యవేక్షణము మిక్కిలి సంక్షేపమైనది. ఒక విధముగా అభివృద్ధి చెందినట్టియు, లేదా ఏదో ఒకవిధమైన చరిత్ర గలిగినట్టియు దేశమును గురించియే మనము ముచ్చటించు చుంటిమి. ఈజిప్టులో పిరమిడ్లు, స్ఫిన్క్సు, ఇంకను ఇచ్చట వివరించుటకు వీలులేని యితర విషయములు ఏ గొప్ప నాగరీకము విజృంభించి నప్పుడు విలసిల్లి నవో దానిని స్పృశించితిమి. ఈ గొప్ప నాగరీకత ఉచ్చస్థితి ననుభవించి, మనము ముచ్చటించుకొనుచున్న కాలమునాటికే క్షీణించుటకు మొదలుపెట్టెను. క్నోస్సోసుకూడ అంతరించుటకు సిద్ధముగా నున్నది. చీనాలో విశాల కాలభాగములనుగూర్చి ముచ్చటించితిమి. ఆ కాలములో చీనా గొప్ప కేంద్ర సామ్రాజ్యముగా పెరిగి వృద్ధిజెందినది. వ్రాత, పట్టుతీయుట మున్నగు అనేక అందమగు విషయము లచ్చట తలయెత్తివృద్ధిజెందినవి. కొరియా జపానులను కొద్దిగా పరిశీలించితిమి. సింధులోయలో నున్న మొహెంజదారోలోని శిథిలములనుబట్టి తెలియవచ్చు ప్రాచీననాగరీకతను గూర్చియు, విదేశములతో వర్తకము సాగించిన ద్రావిడుల నాగరీకతనుగూర్చియు, ఆర్యులనుగూర్చియు కొద్దిగా తెలిసికొంటిమి. ఆరోజులలో ఆర్యులు రచించిన కొన్ని గ్రంథములను, వేదములను, ఉపనిషత్తులను, మహాకావ్యములైన రామాయణ మహాభారతములను గమనించితిమి. ఉత్తర హిందూస్థానము నాక్రమించి. పిమ్మట దక్షిణమునకు పోయి ప్రాచీనద్రావిడులతో కలిసి క్రొత్త నాగరీకమును, సంస్కృతిని నిర్మించిన ఆర్యుల నంటిపోతిమి. వారు నిర్మించిన నాగరిక సంస్కృతులలో కొంత ద్రావిడులపాలును, ఎక్కువగా ఆర్యుల పాలును ఉన్నట్లు తెలిసికొంటిమి. ప్రజాపరిపాలనా పద్ధతులమీద వారి గ్రామసంఘములెట్లు పట్టణములుగాను, నగరములుగాను పరిణమించినవో, వారి వనవాటికలందలి యాశ్రమములు విశ్వవిద్యాలయములుగా ఎట్లు పరిణమించినవో తెలిసికొంటిమి. మెసపొటేమియా, పరిషియా దేశములలో ఒక సామ్రాజ్య మంతరించినపిమ్మట వేరొక సామ్రాజ్య మెట్లు పెరిగినదో, అందొక్క తుదిసామ్రాజ్యము, డరయస్‌క్రింద ఇండియాలోని సింధునదివరకు ఎట్లు వ్యాపించినదో సంక్షేపముగా తెలిసికొంటిమి. పాలస్తీనాలో హీబ్రూలు అల్పసంఖ్యాకు లైనప్పటికిని, ప్రపంచమునం దొకమూల నివసించుచున్న వారైనప్పటికిని, ఎట్లు ప్రపంచదృష్టి నాకర్షించిరో కొద్దిగా చూచితిమి. అంతకన్న గొప్పరాజుల పేళ్లు నామమాత్రా వశిష్టములైనప్పటికిని, బై బిలులో వారి పేళ్ళుండబట్టి వారి రాజులైన డేవిడ్, సామన్‌ల పేళ్ళు నేటివరకు ఎట్లు నిలిచియున్నవో చూచితిమి. గ్రీసులో, ఆర్యుల క్రొత్తనాగరీకత, క్నోస్సోస్‌యొక్క ప్రాచీననాగరికతా శిధిలముపై ఎట్లు లేచి వృద్ధిచెందినదో గమనించితిమి. నగరరాష్ట్రములు వెలసినవి. గ్రీకుల వలసలు మధ్యధరాతీరప్రాంతముల లేచినవి. ఉచ్చస్థితి ననుభవింపనున్న రోమును, దాని ప్రబలప్రతిస్పర్థి కార్తేజియును అప్పుడప్పుడే చరిత్రాకాశమున ఉదయించుచున్నవి.

పై విషయములన్నియు దీజ్మాత్రముగా చూచితిమి. ఎత్తుకొనని దేశములను గురించి కూడ కొన్ని విషయములు నీకు నేను చెప్పియుండ వలసినదే - ఉత్తర యూరోపులోని దేశములు, ఆసియా కాగ్నేయముగా నున్నదేశములు. ఆ తొలిరోజులలోనే దక్షిణఇండియానుండి హిందూ నావికులు బంగాళాఖాతమును దాటి మలయా ద్వీపకల్పమునకును, దానికి దక్షిణముగానుండు ద్వీపములకును పోయియుండిరి. కాని ఎచ్చటనో ఒకచోట హద్దు పెట్టుకొనవలెను ; లేకున్న ముందుకుసాగి పోజాలము.

మనము ముచ్చటించుకొన్న దేశములు పురాతన ప్రపంచమునకు సంబంధించినవి. ఆ రోజులలో దూరదేశములకు రాకపోక లెక్కువగా లేవని నీవు జ్ఞాపకముంచుకోవలెను. సాహసికులగు నావికులు సముద్రములపై ప్రయాణములు సాగించిరి. కొందరు వర్తకమునకు, ఇంకను ఇతరకార్యములకు భూమిమీద దూరప్రయాణములు చేసిరి. కాని ప్రమాదము లధికముగా నుండుటచే ఇట్టి ప్రయాణములు అరుదుగా జరుగు చుండెను. భూగోళ శాస్త్రజ్ఞాన మాకాలమున మిక్కిలి కొంచెము. భూమి గుండ్రముగాగాక బల్లపరుపుగా నుండెనని యాకాలపువారి నమ్మకము. ఆ కారణమున సమీపమందున్న చేశములను గురించి యేకాని ఇతర దేశములను గురించి ఎవరికిని ఎక్కువగా తెలియదు. గ్రీసులోని జనులు చీనా, ఇండియాను గురించి ఏమయు నెరుగరు. చీనా, ఇండియాదేశస్థులకు మధ్యధరాదేశముల సంగతి తెలియదు..

దొరికినచో పురాతన ప్రపంచపటము నొకమారు చూడుము. ప్రాచీన గ్రంథకర్తల ప్రపంచవర్ణనలును, పటములును మన కిప్పుడు నవ్వు పుట్టించును. ఆ పటములలో వేర్వేరు దేశముల స్వరూపములు అసాధారణముగా నుండును. నేడు తయారైన పురాతనకాలమునకు సంబంధించిన పటములు మనకు సహాయకారులుగా నుండును. పురాతన కాలమునుగూర్చి చదువునప్పుడు అట్టి పటముల సహాయమును నీవు తీసి కొందువని ఆసించుచున్నాను. దేశపటమువల్ల ప్రయోజన మధికముగా నుండును. అది లేనిదే చరిత్ర బోధపరుచుకొనుట కష్టము. నిజానికి చరిత్ర నేర్చుకొనుటకు పటములును, బొమ్మలును ఎన్నిఉన్న అంత మంచిది - పురాతన కట్టడముల బొమ్మలు, శిధిలముల బొమ్మలు, పురాతనకాలమునకు సంబంధించిన వస్తువుల బొమ్మలు. చరిత్ర వట్టి అస్థిపంజరమువంటిది. దానిని కప్పుటకు బొమ్మలున్నప్పుడే అది సజీవముగా మనకు కనిపించును. స్పష్టమగు మానసిక చిత్రముల పరంపరయే చరిత్ర. అట్టి మానసికచిత్రము లాకారము పొందునప్పుడే చరిత్ర పఠనమువలన మనము లాభము పొందవచ్చును. అట్టి సందర్భములలోనే చరిత్ర చదువుచున్నప్పుడు చరిత్రసంఘటనలు మన కన్నులముందర జరుగుచున్నట్లే తోచును. అది మనలను ఆకర్షించు చక్కని నాటకమయి యుండవలెను. ఒకప్పు డానాటకము సుఖాంతము కావచ్చును. తరచు అది దుఃఖాంతమై యుండును. ఈ నాటకమునకు రంగము ప్రపంచము. కడచిన కాలమునాటి గొప్ప పురుషులు, స్త్రీలు అందలి పాత్రలు. చరిత్ర ఊరేగింపువంటిది. దానిని చూచి ఆనందించుటకు బొమ్మలును, దేశపటములును కొంత సహాయముచేయును. ప్రతిబాలునకు, బాలికకు అవి అందుబాటులో ఉండవలెను. ప్రాచీనచరిత్రకు సంబంధించిన శిథిలములను స్వయముగా చూచుట బొమ్మలను చూచుటకన్న మంచిది. వీటి నన్నింటిని చూచుట సాధ్యముకాదు. ప్రపంచమందంతటను అట్టి శిథిలములుకలవు. జాగరూకతతో పరికించుచుండిన మనకు సమీపమందే కొన్ని ప్రాచీన శిథిలములు మనము పరిశీలించుటకు లభ్యము కావచ్చును. పెద్ద పెద్ద వస్తుప్రదర్శనశాలలకో చిన్నచిన్న వస్తువులను, శిథిలములను ప్రోగుచేసి యుంచుచురు. ప్రాచీనచరిత్రకు సంబంధించిన శిథిలము లిండియాలో అధికముగాగలవు. మిక్కిలి ప్రాచీనకాలమునకు సంబంధించినవి కొద్దిగానే ఉన్నవి. ఇంతవరకు అట్టివి, మనకు తెలిసినవి మొహంజదారో, హరప్పలలో ఉన్నవి. మిక్కిలి ప్రాచీనమైన భవనము లీయుష్ణదేశములో కూలిపోయి మట్టిలోకలిసిపోయియుండును. బహుశా పెక్కులు మట్టిలో కప్పబడి నేటికిని నిలిచి యుండవచ్చును. వాటిని త్రవ్వినప్పుడు మనకు ప్రాచీనశిథిలములు, శాసనములు దృష్టి గోచరమగుసు, మన దేశ ప్రాచీనచరిత్ర మనకు క్రమక్రమముగా వెల్లడియగును. మిక్కిలి పురాతనకాలమున మన పూర్వులేమి చేసెడివారో ఈ రాళ్ళను, ఇటుకలను, సున్నమునుబట్టి మనము తెలిసికొందుము.

నీవు ఢిల్లీ చూచియుంటివి. నేటి పట్టణము చుట్టుపట్టులలో కొన్ని శిథిలములను, ప్రాతకట్టడములను చూచియుంటివి. ఈమారు వాటిని చూచినప్పుడు ప్రాచీనకాలమును తలచుకొనుము. అప్పు డవి నిన్ను ఆకాలమునకు కొంపోయి, నీకు చరిత్రను బోధించును. పుస్తకములట్లు బోధించలేవు. మహాభారత కాలమునుండియు ఢిల్లీ నగరమందును తత్పరిసరములందును జనులు నివసించుచుండిరి. వారు దానికి పెక్కు పేరులు పెట్టిరి – ఇంద్రప్రస్థము, హస్తినాపురము, తుగ్ల ఖాబాదు, షాజహానాబాదు. ఇంకా ఎన్నో పేర్లుండవచ్చు. నాకు తెలియదు. వృద్ద వ్యవహారమేమనగా - ఏడుచోట్ల ఏడు ఢిల్లీనగరము లుండెడివట. నగ రము స్థలముమారుటకు కారణము యమునానదిగతి మారుచుండుటయే . ఇప్పుడు ఎనిమిదవ నగరము మనము చూచుచున్నాము. దాని పేరు రైసీనా. దానినే క్రొత్త ఢిల్లీ అందురు. ఇది నేటి పరిపాలకుల ఉత్తరువు ప్రకారము లేచినది. సామ్రాజ్యమువెనుక సామ్రాజ్య మీఢిల్లీ లో వృద్ధిపొంది తుద కంతరించినవి.

నగరములన్నింటిలో ప్రాచీనమైన వారణాసికి (కాశీకి) వెళ్ళుము. దాని మర్మరధ్వనులు చెవియొగ్గి వినుము. అది దాని పురాతనగాథ నీకు చెప్పుచున్నది కాదా ! సామ్రాజ్యములు పుట్టిపెరిగి అంతరించుట అది చూచినది. దానికి మాత్రము చలనములేదు. బుద్ధుడు తన నూతన సందేశముతో అక్కడికి వెళ్ళినాడు. కలకాలమునుండియు కోట్లకొలది జనులు మనశ్శాంతిని పొందుటకై దానిని దర్శించినారు. ముసలిపండు, దుర్బలమైనది. మలినముగానున్నది. వాసనవేయుచున్నది. అయినప్పటికిని సజీవముగానున్నది. యుగము లిచ్చిన బలముతో ప్రవర్థమాన మగుచున్న దీవారణాసి. మనోహరము, అద్భుతావహమునై నది కాశీ. దాని కన్నులలో నీవు ఇండియా ప్రాచీనత్వమును దర్శింపగలవు. గంగానదీ మర్మరధ్వనులలో కడచిన యుగముల కంఠధ్వనులు నీ వాలింపగలవు.

లేదా, మనకు సమీపమందున్న మన అలహాబాదు (ప్రయాగ)లోని పురాతన అశోక స్తంభమును దర్శించుము. అశోకచక్రవర్తి ఆజ్ఞప్రకారము దానిపై చెక్కిన శాసనమును చదువుము. 2000 సంవత్సరములనాటి అశోకుని కంఠధ్వని నేడు వినగలవు.


13

ధన మెచ్చటికి పోవును?

జనవరి 18, 1931

నీకు ముస్సోరీకి వ్రాసిన ఉత్తరములలో, వేర్వేరు తరగతుల ప్రజలెట్లు వృద్ధిజెందిరో నీకు తెలియజెప్పుటకు ప్రయత్నించితిని. తొలి మానపులు తిండి సంపాదించుటకు సైతము ఎంతో కష్టపడువారు. వారు