ప్రపంచ చరిత్ర/వేయి సంవత్సరముల చీనా చరిత్ర

వికీసోర్స్ నుండి



11

వేయి సంవత్సరముల చీనా చరిత్ర

జనవరి 16, 1931

బయటి ప్రపంచమునుండి వార్తలు వచ్చినవి. మనోవ్యాకులత్వము దుఃఖము కలిగించు వార్తలు. అయినను గర్వము, సంతోషము పొందదగిన వార్తలు. షోలాపూరు ప్రజల దుర్భరావస్థ మాకు వినవచ్చినది. ఈవార్త విన్నప్పుడే దేశము నలుమూలల జరిగిన సంగతులు కూడ మాకు కొద్దిగా తెలియవచ్చినవి. మన యువకులు తమ ప్రాణము లర్పించుచున్న సమయమున, వేలకొద్ది మన స్త్రీ పురుషులు క్రూరమగు లాఠీ దెబ్బలకు గురియగుచున్న సమయమున, ఇచ్చట చేతులు కట్టుకొని కూర్చుండుట కష్టముగా నున్నది. ఇది మనకు మంచి తరిఫీదు. మనలో ప్రతియొక్క స్త్రీకిని, పురుషునకును తమతమ సామర్థ్యములు పరీక్షించుకొనుటకు తగిన తరుణములు తటస్థించునని యూహించెదను. బాధల నెదుర్కొనుటకు మనవారు ఎట్లు సాహసముతో ముందంజవేయుచున్నారో తలచుకొనినప్పుడును. శత్రువు ఉపయోగించు ప్రతి క్రొత్త సాధనము, కొట్టు ప్రతిదెబ్బ ఎట్లు వారిని బలయుతులనుగాను, ప్రతిఘటించు పట్టుదల గలవారినిగాను చేయుచున్నవో తలచుకొనినప్పుడును మన హృదయము లుప్పొంగు చున్నవి.

ప్రస్తుత వార్తలు మనస్సు నాక్రమించినప్పుడు ఇతర విషయములనుగూర్చి యాలోచించుట కష్టము. కాని వట్టి ఊహలవలన ప్రయోజనములేదు. నికరముగా పనిచేయవలసి వచ్చినప్పుడు మన మనస్సులను మనము నిగ్రహించుకొనవలెను. కాన మనము ప్రాత కాలమునకు పోవుదము. కొంతసేపు మన ప్రస్తుత కష్టములకు దూరముగా ఉందము.
ప్రాచీనచరిత్రలో ఇండియాకు సోదరియైన చీనాకు పోదము. చీనాలోను, తూర్పు ఆసియాలోని ఇతర దేశములైన జపాను, కొరియా, ఇండోచీనా, సయాం, బర్మాలలోను ఆర్యుల ప్రశంసరాదు. ఇచ్చటనున్న వారు మంగోలియా జాతులు.

5000 సంవత్సరములకు పూర్వమందో, అంతకంటెను పూర్వమందో పడమటినుండి చీనాపై దండయాత్ర వచ్చినది. దండయాత్ర చేసిన తెగలుకూడ మధ్య ఆసియానుండియే వచ్చినవి. వారు నాగరీకమున కొంత వృద్ధిచెందినవారే. వ్యవసాయము వారికి తెలియును. వారు పశువుల మందలను పెట్టుకొనుచుండిరి. మంచి యిండ్లు కట్టుట వారికి వచ్చును. వారి సంఘము బాగుగా అభివృద్ధి జెందియుండెను. వారు హోయాంగ్‌హో. అనగా పచ్చనదివద్ద నివాసము లేర్పాటుచేసికొని రాజ్యతంత్రమును నిర్మించుకోనిరి. చాలా వందల సంవత్సరముల కాలములో చీనా దేశమును వారు వ్యాపించిరి. వారి శిల్పములను, కళలను వృద్ధిజేసికొనిరి. చీనాప్రజలు ముఖ్యముగా వ్యవసాయదారులు. వారి నాయకులు నిజముగా కులపెద్దలే, వీరినిగురించి ఇదివరలో నీకు వ్రాసియుంటిని. 6, 7 వందల సంవత్సరములకు తరువాత - అనగా నేటికి 4000 సంవత్సరములకు పూర్వము - యావో అను పురుషు డొకడు చక్రవర్తి యనిపించుకొన్నట్లు మనకు తెలియుచున్నది. ఇతడు చక్రవర్తి బిరుదమును పెట్టుకొన్నప్పటికిని కులపెద్దవంటివాడే కాని ఈజిప్టు, మెసపొటేమియాల నేలిన చక్రవర్తులవంటివాడు మాత్రముకాడు. చీనాప్రజలు వ్యవసాయదారులుగానే ఉండిపోయిరి. కేంద్రప్రభుత్వము వారికి లేదు.

తమ ప్రజలచే కుల పెద్ద లెన్నుకొనబడెడివారని నీకు చెప్పియుంటిని. తరువాత ఆ పదవి వంశపరంపరగా సంక్రమించుచుండెను. చీనాలో ఇట్లు సంభవించెను. యావో అనంతరము అతని పుత్రుడు చక్రవర్తి కాలేదు. దేశమునందు మిక్కిలి సమర్దుడగువాని నింకొకనిని అతడే నియమించెను. కొంతకాలమైన పిమ్మట చక్రవర్తి బిరుదము వంశపరంపరా గత మయ్యెను. 400 సంవత్సరముల పైకాలము హిసియావంశము చీనాను పరిపాలించెనని చెప్పుదురు. చిట్టచిపరి హిసియా చక్రవర్తి మిక్కిలి క్రూరుడై యుండుటచే ప్రజలు తిరుగుబాటు చేసి యతనిని పదభ్రష్టుని చేసిరి, షంగ్ వంశము, లేదా ఈన్ వంశము అని చెప్పబడు వేరొకవంశము తరువాత ప్రభుత్వమునకు వచ్చెను. సుమారు 650 సంవత్సరములపాటు ఈ వంశము రాజ్యము చేసెను.

వేయి సంవత్సరములకు పైబడిన చీనా చరిత్రను ఒక చిన్న పేరాలో, రెండుమూడు వాక్యములతో నేను చెప్పి వేసితిని. విశాలమగు చరిత్ర భాగముల నిట్లు చేయగలుగుట ఆశ్చర్యకరముకాదా ? కాని నా చిన్న పేరామాత్రము 1000. లేదా 1100 సంవత్సరముల కాలమును కుదించలేదని నీవు గ్రహించవలెను. రోజులు, నెలలు, సంవత్సరములలో కాలమును గణించుటకు మన మలవాటు పడితిమి. నూరు సంవత్సరముల కాల మననేమో స్పష్టముగా ఊహించుట మనకు కష్టము, నీ వయస్సు పదమూడు సంవత్సరములు ఎంతో పెద్దకాలముగా కనిపించును కాదూ? ఒక్కొక్క సంవత్సరము గడచినకొలది నీపు పెద్దదాస వగుచుందువు. ఇట్టి సందర్భములో వేయి సంవత్సరముల చరిత్రయన నీవెట్లు గ్రహించగలపు : అది దీర్ఘ కాలము. తరమువెంబడి తరము వచ్చును, పోవును, పట్టణములు గొప్ప నగరములగును. పిమ్మట శిథిలమగును. వాటి స్థానే క్రొత్తసగరములు జన్మించును. కడచిన వేయి సంవత్సరముల చరిత్రను తలచుకొనుము, అప్పుడు బహుశా ఈదీర్ఘ కాలము నీ కర్థముకావచ్చును. ఈ వేయి సంవత్సరములలో ప్రపంచమం దెట్టి యాశ్చర్యకరమగు మార్పులు కలిగినవో ?

చిరవిజ్ఞాన సంప్రదాయములతోను, 500 లేదా 600 సంవత్సర ములో. అంతకు పైబడియో నిలిచిన వంశములతోను కూడుకొన్న చీనా చరిత్ర అద్భుత మైనది.

ఒక పేరాలో నేనుముగించిన 1100 సంవత్సరములలో చినా ఎంత మందముగా అభివృద్ధి జెందినదో ఊహించుకొనుము. క్రమ క్రమ ముగా కులపెద్దలు రాజ్యము చేతుపద్దతి క్షీణించిపోయినది. కేంద్ర ప్రభుత్వము తలయెత్తి అభివృదిలోనికి వచ్చినది. సర్వాంగ శోభితమగు రాజ్యము పొడచూపినది. ప్రాచీనకాలమందు సైతము వ్రాత యను కళ చీనాకు తెలియును. కాని చీనావారి వ్రాత మన వ్రాతకు భిన్నముగా నుండును, ఇంగ్లీషు, ఫ్రెంచివ్రాతలకును భిన్నముగా నుండును. దానికి అక్షరమాల లేదు. వారి వ్రాత చిహ్నముల రూపముననో, బొమ్మల రూపముననో ఉండును.

640 సంవత్సరములు పరిపాలనచేసిన పిమ్మట షాంగ్ వంశము విప్లవము కారణముగా అంతరించెను. పిమ్మట ఒక క్రొత్త వంశము - చౌవంశము-ప్రభుత్వమునకు వచ్చెను. ఈ వంశము షాంగ్ వంశము కన్న ఎక్కువకాలము ర్యాజముచేసెను. ఇది 867 సంవత్సరములు నిలిచెను. ఈ వంశము రాజ్యముచేయుచున్న కాలమునందే చీనా రాజ్యము సర్వాంశోభిత మయ్యెను. ఈ కాలమునందే చీనా తత్త్వజ్ఞు లిద్దరు-కంప్యూసియస్ అను నతడును, లోచే అను నతడును నివసించియుండిరి. ముందు ముందు వీరిని గురించి కొంత నేర్చుకొందము.

షాంగ్ వంశమును ప్రజలు తరిమివేసినప్పుడు, వారి పెద్దయుద్యోగులలో ఒకడైన కీచే అనువాడు చౌవంశమువారిని కొలుచుట కిష్టపడక దేశాంతరవాసము చేసెను. 5000 మంది అనుచరులతో అతడు చీనా విడిచి కొరియాకు పోయెను. ఆ దేశమున కీతడు చోజన్ అను పేరు పెట్టెను. చోజన్ అనగా ఉదయప్రశాంతి గల దేశము అని యర్థము. కొరియా (చోజన్ ) చీనాకు తూర్పుగానున్నది. కాస కీచే తూర్పుగా ఉచయసూర్యునిపైపు వెళ్లెనన్నమాట. బహుశా అతడు కొరియాకు తూర్పుగా ఇక దేశములేదని తలచియుండవచ్చును. అందువల్ల నే ఆపేరాదేశమునకు పెట్టెను. కిచేతో కొరియాచరిత్ర ప్రారంభమయ్యెను. ఇది క్రీస్తు పుట్టుటకు 1100 సంసత్సరములకు ముందుమాట. ఈ క్రొత్త దేశములో కీచే చీనాదేశకళలను, .శిల్పవృత్తులను, గృహనిర్మాణమును, వ్యవసాయమును పట్టుపరిశ్రమను ప్రవేశపెట్టెను. చీనా నుండి పలువురు జనులు కీచేవెనుక కొరియాకు పోయిరి. కీచెసంతతివారు చోజన్‌దేశమును 900 సంవత్సరములకాలము పరిపాలించిరి.

చోజన్‌కు తూర్పుగా దేశములు లేకపోలేదు. దానికి తూర్పుగా జపాను ఉన్నట్లు మనకు తెలియును. కీచే చౌజన్ వెళ్ళినప్పుడు జపా నులో ఏమి జరుగుచున్నదో మనకు తెలియదు. చీనా చరిత్రవలెగాని, కొరియా (చోజన్) చరిత్ర వలెగాని జపానుచరిత్ర అంత ప్రాచీనమైనది కాదు. జసాను దేశస్థులు చెప్పుమాట ఏమనగా-వారి ప్రథమచక్రవర్తి జిమ్ముటెన్నొ అనువాడనియు, అతడు క్రీస్తు పుట్టుటకు 600 లేదా 700 సంవత్సరములకు ముందు రాజ్యము చేసెననియు, అతడు సూర్యదేవి సంతతివాడని వారి నమ్మకము. జపానులో సూర్యుని స్త్రీ దేవతగా భావింతురు. జపానుయొక్క ప్రస్తుతచక్రవర్తి జిమ్ముటెన్నొ సంతతి వాడని వారు చెప్పుదురు. కాబట్టి అతడు సూర్యసంతతివాడని పలువురు జపానీయులు నమ్ముదురు.

మన దేశమందుకూడ రాజపుత్రులు ఆ విధముగానే తమ మూల పురుషుడు సూర్యుడో, చంద్రుడో అని చెప్పుదురు. వారిలో రెండు వంశము లున్నవి. కొందరు సూర్యవంశస్థులు, కొందరు చంద్రవంశస్థులు. ఉదయపూరు మహారాజా సూర్యవంశస్థులలో పెద్ద. తన వంశమెంతో ప్రాచీనమైనదని ఆయన చెప్పెను. మన రాజపుత్రులు అసామాన్యులు. వారి వీర్యమును, పరాక్రమమును, వర్ణించు కథల కంతములేదు.


12

ప్రాచీనకాలము పిలుచు పిలుపు

జనవరి 17. 1931

సుమారు 2500 సంవత్సరముల పూర్వమువరకు ప్రాచీన ప్రపంచము ఏవిధముగా ఉండవచ్చునని ఊహించబడుచున్నదో దానిని ఇంత