Jump to content

ప్రపంచ చరిత్ర/ధన మెచ్చటికి పోవును?

వికీసోర్స్ నుండి

రము స్థలముమారుటకు కారణము యమునానదిగతి మారుచుండుటయే . ఇప్పుడు ఎనిమిదవ నగరము మనము చూచుచున్నాము. దాని పేరు రైసీనా. దానినే క్రొత్త ఢిల్లీ అందురు. ఇది నేటి పరిపాలకుల ఉత్తరువు ప్రకారము లేచినది. సామ్రాజ్యమువెనుక సామ్రాజ్య మీఢిల్లీ లో వృద్ధిపొంది తుద కంతరించినవి.

నగరములన్నింటిలో ప్రాచీనమైన వారణాసికి (కాశీకి) వెళ్ళుము. దాని మర్మరధ్వనులు చెవియొగ్గి వినుము. అది దాని పురాతనగాథ నీకు చెప్పుచున్నది కాదా ! సామ్రాజ్యములు పుట్టిపెరిగి అంతరించుట అది చూచినది. దానికి మాత్రము చలనములేదు. బుద్ధుడు తన నూతన సందేశముతో అక్కడికి వెళ్ళినాడు. కలకాలమునుండియు కోట్లకొలది జనులు మనశ్శాంతిని పొందుటకై దానిని దర్శించినారు. ముసలిపండు, దుర్బలమైనది. మలినముగానున్నది. వాసనవేయుచున్నది. అయినప్పటికిని సజీవముగానున్నది. యుగము లిచ్చిన బలముతో ప్రవర్థమాన మగుచున్న దీవారణాసి. మనోహరము, అద్భుతావహమునై నది కాశీ. దాని కన్నులలో నీవు ఇండియా ప్రాచీనత్వమును దర్శింపగలవు. గంగానదీ మర్మరధ్వనులలో కడచిన యుగముల కంఠధ్వనులు నీ వాలింపగలవు.

లేదా, మనకు సమీపమందున్న మన అలహాబాదు (ప్రయాగ)లోని పురాతన అశోక స్తంభమును దర్శించుము. అశోకచక్రవర్తి ఆజ్ఞప్రకారము దానిపై చెక్కిన శాసనమును చదువుము. 2000 సంవత్సరములనాటి అశోకుని కంఠధ్వని నేడు వినగలవు.


13

ధన మెచ్చటికి పోవును?

జనవరి 18, 1931

నీకు ముస్సోరీకి వ్రాసిన ఉత్తరములలో, వేర్వేరు తరగతుల ప్రజలెట్లు వృద్ధిజెందిరో నీకు తెలియజెప్పుటకు ప్రయత్నించితిని. తొలి మానపులు తిండి సంపాదించుటకు సైతము ఎంతో కష్టపడువారు. వారు వేటాడుచుండిరి. రోజుకు రోజు పళ్లు, గింజలు సంపాదించుకొను చుండిరి. తిండికై వెదకుకొనుచు ఒక చోటినుండి ఇంకొక చోటికి పోవుచుండిరి. క్రమక్రమముగా వారు తెగలుగా తయారైరి. ఇవి నిజముగా పెద్ద కుటుంబములే. తెగలోని మనుష్యులు కలిసి జీవించుచు, కలిసి వేటాడుచు నుండువారు. ఒక్కరట్లు చేయుటకన్న తెగలోనివారు కలిసి చేయుట క్షేమకరము. అప్పు డొక గొప్ప మార్పు వచ్చినది. అది వ్యవసాయమును కనిపెట్టుట. నిరంతరము వేటాడుటకన్న వ్యవసాయ పద్ధతుల ననుసరించి భూమిని దున్ని పంటలు పండిచుట సులభమని వారు గ్రహించిరి. దున్నుట, విత్తుట, నూర్చుట అన్నప్పుడు భూమి వద్ద నివసించుట యగును. ఇదివరలోవలె వారు పర్యటన చేయ వీలులేదు. పొలములను కనిపెట్టుకొని ఒక్కచోట వా రుండవలెను. ఈ విధముగా పల్లెలు, పట్టణములు లేచినవి.

వ్యవసాయము ఇతరమార్పులనుకూడ ప్రవేశ పెట్టినది. భూములు పండగా వచ్చిన ఆహారపదార్థములు ఒక్కమారు వినియోగించుటకు కావలసినదానికన్న అధికముగా నుండెను. పెచ్చుగానున్న పదార్దములు నిలువచేయవలసియుండెను. వేటాడు దినములలోకన్న నేడు జీవితమున చిక్కులు ఎక్కువగా నుండెను. కొందరు పొలములలోను, ఇతర స్థలములందును పనిచేయుచుండిరి. మరికొందరు పై పెత్తనము, కలియ గట్టుకొనివచ్చుట _ అను పనులను చేయుచుండిరి. పెత్తనదార్లు, కలియ గట్టుకు వచ్చువారు క్రమక్రమముగా బలవంతులైరి. వారే కులపెద్దలు, అధికారులు, రాజులు ప్రభువులు అయిరి. అధికార మున్నదికాబట్టి వారు పెచ్చుగా పండిన పంటలో చాలభాగము తమకొరకు అట్టే పెట్టుకొనుచుండిరి. ఆ విధముగా వారానాటికానాడు భాగ్యవంతులైరి. పొలములలో పనిచేయువారికి పొట్ట నింపుకొనుటకు చాలినంత మాత్రము మిగులుచుండెను. కొంతకాలమైనపిమ్మట ఈ పెత్తనదారులును, కలియ గట్టుకొనివచ్చువారును తమపనులు తాము, బద్దకమువల్ల నైతేనేమి, అసామర్థ్యమువల్ల నైతేనేమి, చేయుట మానుకొనిరి, వారు ఏమియు చేయకున్నను వ్యవసాయదారులు పండించిన పంటలో అధికభాగము పుచ్చుకొను విషయములో మాత్రము శ్రద్ధవహించుచుండిరి. తామేమియు చేయనక్కరలేదనియు, ఇతరులు చేసిన కష్టమును అనుభవించుటకు తమకు హక్కున్నదనియు వారూహించ మొదలిడిరి.

చూచితివా. వ్యవసాయము వచ్చుటవల్ల జీవితవైఖరి ఎట్లు మారినదో ? వ్యవసాయము ఆహారము సంపాదించుటకు మంచి పద్దతిని ప్రవేశపెట్టుటవల్లను, సులభముగా ఆహారముదొరుకునట్లు చేయుటవల్లను అది సంఘము యొక్క పుట్టకీట్లను మార్చివేసినది. అది ప్రజలకు విరామమిచ్చినది. వేర్వేరు తెగల మనుష్యులు ఏర్పడిరి. ప్రతియొక్కడును ఆహారమును సంపాదించుటకు పాటుపడుటలేదు. కొందరు వేరొకపని చేసికొనవచ్చును. అనేకరకముల కళలు తలయెత్తినవి. క్రొత్తవృత్తులు : ఏర్పాటైనవి. కాని అధికారము ప్రజలను కలియగట్టుకువచ్చు వారిచేతులలోనే ముఖ్యముగా నిలిచిపోయెను.

ఆహారమును, ఇతర జీవితావసరములను తయారుచేయుటకు నూతన పద్దతులు వచ్చినప్పుడు ఎట్టి గొప్ప మార్పులు తటస్థించినవో పిదప కాలపు చరిత్రలో నీవు తెలిసికొందుపు, ఆహారమును వలేనే ఎన్నియో ఇతరవస్తువులను సైతము మానవులు వాంఛించుచుండిరి. కాన ఉత్పత్తిపద్ధతులలో గొప్పమార్పు వచ్చినప్పుడు సంఘమందుకూడ గొప్పమార్పులు కలుగుచుండెను. ఇందుకై నీకొక పెద్ద దృష్టాంతము చూపెదను. కర్మాగారములు పనిచేయుటకును, రైళ్ళను, ఓడలను నడుపుటకును నీటి ఆవిరిని వినియోగించినప్పుడు ఉత్పత్తి పంపకము చేయు పద్ధతులలో గొప్పమార్పు వచ్చినది. శిల్పులును, పనివాండ్రును సామాన్యోపకరణముతో, చేతులతో, వస్తువులు చేయుటకు కొంతకాలము పట్టును. ఆవిరి నుపయోగించు కర్మాగారము లింతకన్న త్వరగా ఆ వస్తువులను తయారుచేయగలవు. ఒక గొప్ప యంత్రము నిజముగా ఒకపెద్ద పనిముట్టు. ఆహారపదార్ధములను, కార్మాగారములలో తయారైన పదార్థములను దూరదేశములకు త్వరలో తీసికొని పోవుటకు రైళ్ళును, ఓడలును ఉపకరించినవి. ప్రపంచమునం దంతటను పరిస్థితులలో ఎట్టిమార్పు వచ్చినదో నీ వూహించుకోగలవు.

ఆహారపదార్థములను, ఇతరవస్తువులను త్వరలో ఉత్పత్తిచేయు నూతనపద్ధతులు చరిత్రలో అప్పటప్పట కనిపెట్టబడినవి. ఉత్పత్తి చేయుట కింతకన్న మంచిపద్ధతులను ప్రవేశ పెట్టినచో ఎక్కువ సరకు ఉత్పత్తియగుననియు, ప్రపంచము భాగ్యవంత మగుననియు ప్రతి యొక్కనికిని ఎక్కువగా పదార్థములు లభ్యమగుననియు, నీ వనుకొనవచ్చును. నీ ఊహ కొంతవరకు సరి. కొంతవరకు తప్పు. ఉత్పత్తికి శ్రేష్ఠపద్దతులుపయోగించుటవల్ల ప్రపంచము భాగ్యవంతమైనమాటనిజమే కాని ప్రపంచములో ఏ భాగ మట్లు భాగ్యవంతమైనది ? మన దేశములో ఇంకను కటిక దారిద్ర్యము, దైన్యము నిలిచియున్నవనుట నిర్వివాదము . కాని ఇంగ్లాండువంటి భాగ్యవంతమగు దేశములోకూడ ఇట్లే ఉన్నది. ఎందువల్ల? ధన మెచ్చటికి పోవును ? నానాటికిని ధనము అధికముగా వచ్చుచున్నను బీదవారు బీదరికములోనే కొట్టుకొనుచుండుట ఆశ్చర్యమే. కొన్ని దేశములలో బీదవారిస్థితి కొంతవరకు నయము. కాని వచ్చిన ధనముతో పోల్చిచూచిన వారి బాగు బహుస్వల్పమనియే చెప్పవలెను. కాని ఈ ధన మెవరికి పోవుచున్నదో మనము సులభముగా కనుగొనగలము , పెత్తనదార్లును, నలుగురిని కలియగట్టుకు వచ్చువారును ఉన్నారుగదా ! వారు లాభములలో అధికభాగము తాము సంగ్రహించుటచే ఈ ధనము వారి వశమగుచున్నది. ఇంతకన్న వింతవిషయ మేమనగా - సంఘములో కొన్ని తెగలు బయలు దేరినవి. వారెట్టిపనిని చేయరు సరికదా ఇతరులు చేసినదానిలో అధికభాగము తాము తీసికొందురు. నమ్ముదువో లేదో - ఈ తెగ మనుష్యులు గౌరవింపబడుచున్నారు. కొందరు వివేకహీనులు తమ బ్రతుకునకై రాము స్వయముగా పనిచేసికొనుట గౌరవలోపమని భావించుచున్నారు. మన ప్రపంచ పరిస్థితు లిట్లు తలక్రిందుగా తయారైనవి. ఆహారమును పండించుచున్నప్పటికిని రైతు బీదస్థితిలో నున్నాడన్న ఆశ్చర్యమేమి ? ప్రపంచభాగ్యమునకు కారకుడై కర్మాగారములలో పనిచేయు కార్మికుడు బీదస్థితిలో నున్నాడన్న ఆశ్చర్యమేమి? మనదేశమునకు స్వాతంత్ర్యము కావలెనని మనము కోరుచున్నాము. ఈ తలక్రిందు పరిస్థితులను చక్కజేయ లేనప్పుడు, కార్మికునకు అతని కష్టమునకు ఫలము దక్కనప్పుడు ఎందు కీస్వాతంత్ర్వము? రాజనీతిశాస్త్రమును గూర్చియు, పరిపాలనా కళనుగూర్చియు, ఆర్థికశాస్త్రమునుగూర్చియు, దేశభాగ్యమెట్లు విభజించవలెనో యన్న విషయమునుగూర్చియు పెద్ద పెద్ద పుస్తకములు వ్రాయబడినవి. చదువుకొన్న పండితు లీవిషయములమీద ఉపన్యాసము లిత్తురు. ప్రసంగములు, చర్చలు జరుగుచునేయున్నవి. కాని కార్మికులు బాధపడుచున్నారు. 200 సంవత్సరములకు పూర్వము వాల్టేరు అను ప్రసిద్ధ ఫ్రెంచి గ్రంథకర్త రాజకీయవేత్తలు మున్నగువారిని గూర్చి ఈ విధముగా అన్నాడు - "పొలమును దున్నుచు, ఇతరులకు బ్రతుకు తెరుపు కల్పించువారిని ఆకలిచే చచ్చునట్లు చేయు కళ వారు తమ చక్కని రాజకీయములలో కనిపెట్టినారు."

ప్రాచీనమానవు డింకను ముందుకు సాగిపోయి క్రమముగా ప్రకృతి నాక్రమించెను. వనములను నరికివేసెను, ఇండ్లను కట్టెను. భూమిని దున్నెను. కొంతవరకు మానవుడు ప్రకృతిని వశపరచుకొన్నట్లే చెప్పుదురు. ప్రకృతిని వశపరచుకొనుట యనుమాట జనులు వాడుదురు. ఇది అనాలోచితమగు మాట. నిజముకాదు. ప్రకృతిని మానవుడు అర్థము చేసికొన మొదలు పెట్టినాడు ఆనుట ఇంతకన్న మంచిది. ఎంత బాగుగా అర్ధము చేసికొనునో అంత చక్కగా అతడు దానికి సహకారము చేసి తన యవసరములకు దానిని వినియోగించుకొన గలుగుచున్నాడు. వెనుకటిరోజులలో ప్రకృతిని చూచినను, ప్రకృతిలో గోచరమగు కార్యములను చూచినను మనుష్యులు భయపడువారు. వాటిని అర్థము చేసికొని గ్రహించు టకు బదులు, పూజించి శాంతికై నైవేద్యము లర్పించెడివారు. ప్రకృతి వన్యమృగమైనట్లును, దానిని మంచిచేసికొని శాంతింప జేయవలసినట్లును వారి ఊహ. పిడుగులు, మెఱుములు, అంటువ్యాధులు వారిని భయపెట్టెను. నై వేద్యములపల్లనే వాటిని వారింపవచ్చునని వా రూహించిరి. అమాయకులనేకులు సూర్య చంద్ర గ్రహణములు భయంకర విపత్తులని భావింతురు. అవి ప్రకృతిలో జరుగు సామాన్య సంఘటనలని గ్రహించుటకు బదులు జను లనవసరముగా ఆవేశపూరితులై , సూర్య చంద్రులను రక్షించుటకై స్నానములు చేసి ఉపవాసము లుందురు. సూర్య చంద్రులు తమ్ము తాము రక్షించుకొను స్థితిలోనే ఉన్నారు. వారికొరకై మనము బెంగపడ నవసరములేదు. .

నాగరీకము, విజ్ఞానము ఎట్లు అభివృద్ధిచెందినవో తెలిసికొంటిమి. గ్రామములలోను, పట్టణములలోను ప్రజలు నివాసము లేర్పరచుకొనుటతో ఇవి ప్రారంభించినవని తెలిసికొంటిమి. ఆహారపదార్థము లధికముగా వచ్చుచుండుటచే వారికి తీరిక చిక్కినది. వేట, తిండి గాక మరి యితర విషయములనుగూర్చి వా రాలోచించగలిగిరి. ఆలోచనలు వృద్ధిపొందిన కొలది కళలు, వృత్తులు, విజ్ఞానము వృద్ధినందెను. జనసంఖ్య వృద్ధియైన కొలది జనులు సన్నిహితముగ నివసించుట యవశ్యమైనది. వారు ఒక రొకరిని ఎప్పుడును కలుసుకొనుచున్నారు. ఒకరితోనొకరు పనిబెట్టుకొనుచున్నారు. కలిసిమెలిసి ఒక్కచో నుండవలసివచ్చినప్పుడు ఒకరి మంచి ఒకరు చూడవలయును. తమ స్నేహితులకుగాని, పొరుగువారికిగాని ఇబ్బంది కలిగించుపనులు వారు చేయరాదు. అట్లుకానిచో సాంఘిక జీవనమే పొసగదు, దృషాంతముగా ఒక కుటుంబమును తీసికొనుము. కుటుంబము సంఘముయొక్క ఒక చిన్న తునుక. అందలి జను లన్యోన్యముగా నున్న వారు సుఖముగా జీవించగలుగుదురు. అన్యోన్యానురాగ ముండును కాబట్టి కుటుంబములో సుఖజీవనము కష్టసాధ్యము కాదు. ఒక్కొక్కప్పుడు మనము ఇతరుల కష్టసుఖములను గమనించకుండ మెల గుట తటస్థించవచ్చును. మనకు సంస్కృతిగాని, నాగరీకముగాని లేనట్లు మెలగుదుము. కుటుంబముకన్న పెద్దదగు సంఘమునందు సరిగా ఈ విధముగానే జరుగుచున్నది - మన పొరుగువారైనను అంతే. ఏక నగరవాసులైనను అంతే. మన దేశస్థులైనను అంతే. ఇతర దేశస్థులైనను అంతే. జనసంఖ్య పెరుగుటవల్ల సాంఘిక జీవనము అధికముగా గడప వలసి వచ్చినది. నిగ్రహముతో ఇతరుల కష్టసుఖము లోలోచించి మెలగ వలసివచ్చినది. సంస్కృతి. నాగరీకము అన నేమో నిర్వచించుట కష్టము. నేను నిర్వచించ ప్రయత్నించను. ఆత్మనిగ్రహము లేక ఇతరుల కష్టసుఖములను పాటించనివాడు. సంస్కృతిలేనివాడని నిష్కర్షగా చెప్పవచ్చును.


14

క్రీస్తుకు పూర్వము ఆరవ శతాబ్ది : మతము

జనవరి 20, 1931

చరిత్రయొక్క దీర్ఘ ఘంటాపథమును బట్టి పోవుదము. మనమొక మైలురాయి చేరుకొన్నాము, 2500 సంవత్సరములకు పూర్వము, ఇంకొకవిధముగా చెప్పవలసివచ్చిన, క్రీస్తుకు పూర్వము సుమారు 600 సంవత్సరములు. ఇది సరియైన తేదీయని భావింపకుము, ఇంచుమించుగా ఒక కాలనిర్దేశమును మాత్రము చేయుచున్నాను. ఈకాల ప్రాంతమున గొప్పపురుషు లనేకులుండిరి; గొప్ప తత్వజ్ఞులు, మత స్థాపకులు వివిధ దేశములలో, చీనా, ఇండియాలు మొదలు పరిషియా, గ్రీసుల వరకు ఉండిరి. వీరందరును సరిగా ఒకేకాలమున లేరు. సమీప కాలములలో వారుండుటచే క్రీస్తు పూర్వము ఆరవ శతాబ్ది ప్రసిద్ధిగన్న కాలఖండమైనది. అప్పుడు ప్రపంచమున భావతరంగ మొక్కటి - నాటి పరిస్థితులలో అసంతృప్తి, పరిస్థితులు బాగుపడునను ఆశ, కోరిక ఆవరించి యుండవచ్చును .