ప్రజ్ఞా ప్రభాకరము/శ్రద్ధాంజలి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రద్ధాంజలి

"Greatear love hath no man than this
that a man lay down hislife for his friends."
            st. john Xv, 12.

"మిత్రులకై తన ప్రాణ మర్పించుటకన్న నుత్కృష్ట ప్రేమను మానవుఁ డెఱుఁగడు" అన్నజీససు మహోదార ప్రవచనమునకు పరమ లక్ష్యభూతమైనది శ్రీ ప్రభాకర శాస్త్రి గారి పుణ్య జీవితము. వారు అందఱను మిత్రులు గనే భావించెడివారు. అధివ్యాధులచే దారి తెన్నులు తెలియక, నిస్పృహు లైనవా రాయనకు పరమమిత్రులు. అట్టివారి దుఃఖము లోను బాధలోను దూరి, వారే తాముగ భావించి, వారి యాపన్నివారణకై యాహొరాత్రములు పరితపించి, అ యనుతా పలబ్ద మగుఆత్మశక్తిచే బాధా నివారణ చేసెడి వారు శ్రీ శాస్త్రి గారు. అట్లు వారిని గట్టెక్కించిన పిమ్మట గూడ వారి యోగ క్షేమముల నరయుచు ఆపదలో నాదుకొనెవారు." సమర్ధ మాపత్సఖ" మనుస్తుతి వాక్యములకు వీ రెంతయు తాగి యుందురు.

"ఆపద గడవం బెట్టఁ గ
నోపి శుభం బయినదాని నొడగూర్పఁ గ మా
కీ పుట్టువునకుఁ బాండు
క్ష్మాపాలుఁడు నిన్నుఁజూపి చనియె మహాత్మా"

యని శ్రీకృష్ణుని గూర్చిన యుధిష్టిర సంబోధనము కలదు. శ్రీ శాస్త్రి గారిచే పరిరక్షితులై పెక్కు రిట్లే వారిని స్మరింతు రనుట కేవలము స్వభావోక్తి! వారి కరుణా ప్రసారముచే నుజ్జివితు లైనవారిలో నేనొకఁడను. ఆ కృతజ్ఞతను పురస్కరించికొని ఈ శ్రద్ధాంజలి నర్పింప సాహసించితిని. వ్యాధులను తపస్సుచే నివారించు టెట్లు? మరియు, ఒకవ్యాది నింకొక రుపశమిం పఁజేయు టెట్లు? అని పలువురు ప్రశ్నింతురు. ఇది న్యాయ్యమే. అట్టి యనుభవము పడయు వరకు నాకు నట్లే యుండెడిది. స్వయముగ నాకు దెలిసిన కొన్ని విశేషముల నుదాహరించి, సహృదలహములను రూపమున నాకు శ్రీ శాస్త్రిగా సత్యమదుర స్వభావ సంస్మరణావకాశమును, ఈ గ్రంధ రచనలో శ్రీ వారుద్దేశించిన ప్రయోజనము కొంతవఱకును చేకూరును.

  శ్రీ శాస్త్రిగారి 'ప్రజ్ఞా ప్రభాకర' రచనకు దొడగినప్పటికే భ్రుక్తరహిత తారక రాజయోగ మార్గమున ముప్పదేండ్లు సాధన మొనర్చి యుండిరి. ఈ సుదీర్ఘకాలమున నెన్నియో మహనీయాను భావములను వారు గడించిరి. తమ యనుభవములను, తమతోపాటు యోగదీక్షబడసినవారి యనుభూతులను, తమ వలన నుపకృతి బడసినవారి కధలను, వారు వేర్వేరు సంపుటములుగ బ్రకటింప నెచింరి. వారు సంకల్పించిన బృహగ్రంధమే రూపొందినచో నది నది తెలుఁగు వచన రచనలో మెఱుఁగులను చూపునది యేగాక, యోగాధ్యాసాధకులలోను, మనశ్సరీరతత్త్వవేత్తలలోను, రోగ చికుత్సకులలోను సంచనము గల్గింపఁజాలినది నుండెడిది.
  కాని వారా గ్రంధరచన కుపక్రమించి యిపుడు ప్రకటింపఁ బడిన భాగమును పూర్తి చేయునప్పటికి శ్రీ తిరుపతి దేవస్ధానమువారొక మ్యూజియమును నిర్మించుభారమును వారిపై నిడిరి. దానికై వారు ఆహార నిద్రా సౌకర్యములు మాని, పులులు చెరలాడు కడప యడవుల కడ మొదలిడి కమ్యునిస్టు గెరిల్లాల కాటపట్టు లగు కృష్ణాజిల్లా ముక్త్యాల, నైజాము రాష్ట్రము నల్లగొండ గుట్టలవఱకును గాలించి కన్నుల పండువును గూర్చు సుందర జిన బుద్ధ హిందూ విగ్రహములను బెక్కింటిని తిరుపతి చేర్చిరి. 
  ఈ విగ్రహముల వలన మనకు పూర్వ మాంద్రదేశములో సమతాధర్మ ప్రతి పాదక ములు, అహింసా ప్రబోధకములు నైన జైన బౌద్ధములు ప్రబలె ననియు, తదనుయాయుల కళారా ధనా ఫలితముగ పెక్కు మనోహర విహార విగ్రహదులు వెలసె ననియు, కాలక్రమమున ప్రజలకు వర్ణా శ్రమాచారముల పై నను, వైదిక యజ్ఞ యాగాదుల పై నను చూపు మ్రొగ్గె ననియు, అపుడు వారు పూర్వ శిల్పనిర్మాణములను చేజేతుల రూపుమాపిరనియు, తమ నూతనా వేశమునకు లొంగని వారిని చిత్రవధ సల్పి రనియు తెలియ నగును. నాఁటి దౌర్జన్య హింసా కాండకును, తరువాతి శక ములలోని మహమ్మదీయుల విధ్వంసక చర్యలకును, నేఁటి రజాకారు కమ్యునిస్టు దుండగములకును భేదము కన్పట్టదు.మానవతలోని పశుత్వ మవిచ్చిన్నముగ నాఁటినుండి నేఁటి వరకు సాగుచునే యున్నది! తనకు మంచిదని తోఁచిన దాని నితరులచే నంగీకరింపఁ జేయుటకు మానవుఁడొనర్చు సాధనలో హింసాకాండను వర్జింప నేరఁడా?
  ఈ శిలా లోహ విగ్రహములే గాక శ్రీ శాస్త్రిగారు కాళహస్తి సంస్ధాన భాండారమంతయు శోధించి తత్సంస్దానాదీశ్వరుల యుదారానుమతితో ఎన్నో అముద్రితగ్రంధములు, చిత్రములు, పూర్వపు వీరులు ధరించిన కవచఖడ్గాదులు సేకరించిర ఆంద్రప్రభ సంపాదకులగు శ్రీనార్లవారి సహాయమున బందరు నుండి శ్రీ కోటసుబ్బారావుగారలు బహుకాలము శ్రమించి సేకరించి ప్రాణతుల్యముగ భద్రపరచుకొన్న అమూల్య చిత్ర ప్రతిమాదుల మ్యూజియమును తిరుపతికి తరలించిరి.
  ఈ పని యంతయు నొకప్రక్క- మఱియొక వంక తిరుపతి దేవస్ధాన ప్రాచ్యకళాపీఠ యాజమాన్యమున శ్రీ అన్నమాచార్యా వర్ధంతి జరుపుట, కీర్తనలు ప్రచురణ, పావులూరి గణితము, ఉత్తరహరివంశము, లక్షణోద్ధారము, నన్నయకు పూర్వపు ఆంధ్ర భాష ఇత్యాదుల పరిష్కరించుట, వ్యాఖ్యానించుట, సమకూర్చుట, పరిశోధించుట జరపుచు, నన్నిచోడుని కుమారసంభమునకు వ్యాఖ్యానము రచించుట గూడ ప్రారంభించి యీ కార్యముల నన్నిటిని నేక కాలమున సవ్యసాచి వలె శ్రీ శాస్త్రిగారు నిర్వహించిరి. 

మ్యూజియము వస్తుసేకరణలో పెక్కు చిక్కు లుండెడివి. దారి డొంక లేని యొక కుగ్రామములో నొక చారిత్రాత్మక సుందర శిలా విగ్రహము కల దనియు, దానికై యెవరో బొంబాయి నుండి ధనవంతులు వచ్చిరనియు, ఆలస్యమైనచో తెలుగునాడు దాటిపోవుననియు తెలిసెడిది! సరి! అంతటితో శరీర శ్రమను లెక్కసేయక ఏదో రీతి నటకు చేరెడి వారు శ్రీ శాస్త్రి గారు. ఆ విగ్రహమే పుంత లోనో పడియుండెడిది. పసులకాపరులు కత్తి నూరుకొనుటకో, బాటసారులు కాలిబాడి వదల్చు కొనుటలో అది ఉపయోగపడుచుండెడిది. త్రవ్వి తీయుటకు తోడు దొరకరు. వెలికి తీసి దాని ప్రాముఖ్యమును దెలిపిన పిమ్మట ఊరివారు ఆ విగ్రహము నంచుకొని మేమే ఆరాదించుకొందుమని యడ్డగింతురు. వారిని సమాధానపఱచి ఆయా వస్తువులను తిరుపతి చేర్చుట యన లక్కయింటి నుండి ఏక చక్రపురమునకు చేరు నంతటి కధ! ఈ పని నంతయు శ్రీ శాస్త్రిగారు తమ ప్రియాంతే వాసులను, అందును ఉదయగిరి శ్రీనివాసాచార్యులను నూతగఱ్ఱగా గొని ఏ డెన్మిది నెలలలో బహు స్వల్ప వ్యయముతో నిర్వహించిరి. వేరొకరైనచో మంది సిబ్బందులతో గూడియైన, ఎంత ధనమో వెచ్చించియైన, నిరువ దేండ్లలోపున నైన ఈ పనిని సాధింప గల్గుదురా యని యెఱుక గలవారల చ్చెరువుఁజెందిరి.

  ఈ సందర్భమున నొక విషయము స్ఫురణకు వచ్చుచున్నది. గుంటూరులో నొక నూత్న పరిచయునికడ శ్రీ శాస్త్రిగారు కొన్ని గంటల కాలము వ్యయించి ఒక చిన్న పాలరాతిముక్కను తెచ్చిరి. దానిపై నేదో చెక్కడపు భాగము గలదు. ఈ రాత్రికే వారు తిరుపతి ప్రయాణము. సామానుల సర్దుగడలో దానిని మఱతు రేమో యని పలుమారులు సరిచూచికొనిరి. గాజుకు ప్పెలను భద్రము చేసినంత జాగ్రత్తతో దానిని సర్దించిరి. మాకీ యాందోళన బోధపడలేదు." ఇదియమూల్యశిల్పము. డూబ్రేలు అయినచో దీనికి పదివేలు రొక్క మిచ్చును" అని రైలుకడఁ జెప్పిరి. ఈ చిన్న వస్తువు మాటయే యిటులుండ వారు సేకరించిన మ్యూజియమునకు విలువ గట్టుట యసాధ్యమని తోచును. 
  ఇప్పడీ శిల్పకళాఖండము లన్నియు తిరుపతి దేవస్దానపు మ్యూజియములో మూగవోయి యున్నవి. వాని కాలనిర్ణయముఁజేసి, వాని సాంఘిక రాజకీయ ప్రాధాన్యతను, కళా ప్రాశ స్త్యమును గుర్తించి, వానిని పలుకు బొమ్మలనుగా జేయుగుతురబాధ్యత దేవస్దానము వారి యెడఁగలదు.
  ఇటు మ్యూజియముకై తిరుగులాట తోను, అటు అపూర్వ గ్రంధసంస్కరణ ముద్రణములు యొత్తిడితోను నలిగులియై శ్రీ శాస్త్రిగారి యారోగ్యము కొంత చెడినది. ఇంతలో గుంటూరు జిల్లా ఎద్దనపూడి యను గ్రామములో నొక బావిలో నేవో మహత్తరశిల్పములు గుప్తపఱుపఁ బడెననియు, వానిని సేకరింపవచ్చుననియు ఆసవెట్టిదుర్విధి శ్రీ శాస్త్రిగారి నటకుఁగొంపోయెను. జడివాన మోఁ కాటి బంటి నల్ల రేగడి బాడి. జోడెద్దుల బండి సైతము నడువ వీలు లేదు. కాలుదీసి కాలువేయ సాధ్యము గాదు. ఇట్టి మిత్తి యడకత్తెరలోఁక్కికొని అఱువదేండ్లవృద్ధు, భారపు మానిపి యగు శ్రీ శాస్త్రిగారు తీవ్ర జ్వరముతో నింటికిఁ జేరు కొనిరి. అప్పటికే వారి యారోగ్యము పూర్తిగా చెడినది. దానిని లెక్కచేయక నిరంతరము మంచము మిఁదనుండియే చివరి వఱకు వారి మామూలు కార్యముల నిర్వహించుకొనుచుండిరి. వారు తమ యోగకార్యముల నిర్వహించుకొని చుండిరి. వారు తమ యోగ మహాత్మ్యమున పలువురను మృత్యుదంష్ట్రుల నుండి వెలికి లాగిరి. అట్టి వార మనేకులము వారి చుట్టు నుండియు తుదకు నా మహానీయుని దక్కించుకొన నేరమైతిమి. ఈ హఠా ద్వార్త విన్న మహాకవి శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు చకితులై "తుదుకు నిన్నే జయించె మృత్యువు మహాత్మా" యని అప్రయత్నముగ వగచిరి. శ్రీ సత్యనారాయణగారు తమకు తెలియక యే, శ్రీ శాస్త్రిగారి ప్రేమ పాత్రులందరు ఆ నిముసమున భావించినదే పల్కిరి. అస్సాము భూకంప ములో హిమాలయ శృంగములు కొన్ని యదృశ్యమైన వన్న వార్తలతోపాటు, శ్రీ శాస్త్రిగారి నిర్యాణ వార్తను మేము వార్తాను మేము వార్తాపత్రికలలో జూచి వాపోయితిమి.
  తుదకు వారెంతో మక్కువతో బృహద్గ్రుంధముగా రచింపఁజూచిన ప్రజ్ఞాప్రభాకర మీతీరున నసంపూర్ణముగా, దుఃఖపుపుక్కిలింతగా ప్రకటింప వలసి వచ్చినది. దీని ముద్రణకగు వ్యయ మును శ్రీ శాస్త్రిగారి కిర్వదియేండ్ల నుండి ప్రియ శిష్యులైన చెన్నపురివాసి శ్రీ కంభంపాటి సత్యనారయణ శ్రేష్టి భరించి గురుదేవుల యెడఁ గల భక్తి ప్రపత్తులను వెల్లడించుకొనిరి. వీరి వృత్తి వెన్న వ్యాపారము. హృదయ ప్రవృత్తియు నవనీతసమానమే! శ్రీ శాస్త్రిగారు చెన్నపురి విచ్చేసినపు డెల్ల అచటి ఆప్తులందరును వీరియింటనే సమావేశమై వీరి యాదరణకు పాత్ర మగుచుండెడివారు. నేటికిని వారి యాదరణకు మేము ఋణపడియున్నాము.
                             

శ్రీ శాస్త్రిగారితో నాకు ప్రధమపరిచయ భాగ్యము 1939మే నెలలోకల్గెను. అప్పటికి సుమారు పది నెలల నుండి నేను తీవ్రానారోగ్యముతో పీడింపబడుచుంటిని. నా యనారోగ్యము తొలుత 106 డిగ్రీల మలేరియాతో నారంభ మైనది. అంతటిలో నాగిన నెట్లుండెడిదో! ఆవైద్యపద్ధతిలో క్వైనా వాడుదు రనియు, అది శరీరమునకు మంచిది కాదనియు,హొమియోపతి వైద్యములో క్వైనా వాడరనియు, ఆ పద్ధతి శ్రేష్ఠ మనియు ఎట్లో తలకెక్కెను. దానితోమరిరెండు నెలలుగడచెను. లాభము లేదు. పిదప ఆయుర్వేదము పై చిత్తము ప్రసరించెను ఎన్నో చేదు మందులు మ్రింగితిని. అందు కలకత్తావారి పంచతిక్త మని యొకటి గలదు.పేరుకు పంచాతిక్తమే కాని నిజముగా నది ప్రపంచతి క్తము. పగవానికైన వలదీ చేదులు! ఆ మిఁదట కేవలము నాటుమందులు వాడితిని. ఆ వైద్యుఁడు చురుకైన వాఁడే! నాటుమందులపై నాకుఁ గలయనాదరణను పోగొట్టు టకు కొన్ని తీయని మందుల నిచ్చి ఆహారవిషయములో కొంత స్వేచ్చ నిచ్చెడివాఁడు. కాని లాభము లేకపోయెను. తిరిగి అల్లో పతీకి చేరితిని. అప్పటికి నా శరీరస్థితి చాలమార్పు చెందెను. ఇరువది పౌనుల తూకము తగ్గినది. సాయంకాలమునకు 99.5 జ్వరము వచ్చెడిది. మానసికముగా ఎట్టి నిబ్బరమును లేదు. నరములు జిగి తగ్గి స్వల్పా వేసమునకే శరీరము తాళ లేకుండెడిది. నిద్ర లేదు. ఏమి తిన్నను వంట బట్టదు. ఈ స్థితిలో అల్లోపతి వైద్యము కొలఁదిగా సాయపడెను కాని వ్యాధి బోధపడ దు. ఎచటనైన భయపడతి నేమో యని వైద్యుఁ డనును.

ఈ స్థితిలో చెన్నపట్నములో లాఅప్రెంటిసు పరిక్షకు వెళ్ల వలసి వచ్చెను. నేను రైలు దిగి ట్రాము బస్సులలో ఎక్కగలనా యను సందేహముతో నుంటిని. తుద కెట్లో చెన్నపట్నము చేరి స్టేషనువద్దకు రావించుకొన్న మిత్రుని సాయముతో హొటలు చేరిపరిక్షలుగించుకొంటిని. తరువాత పేరుగన్న ఒక డాక్టరుగారిని చూచితిని. ఆయన కొక నర్సింగుహొము కలదు. రోజు కైదురూప్యముల నిచ్చి పది రోజు లందున్న నే గాని రోగనిదానము తెలియ దనిరి. నే నందు చేరెడి దినము స్థిర పఱచుకొని హొటలుకు వచ్చితిని.

గుంటూరు నుండి బయలు దేరునపుడే శ్రీ శాస్త్రిగారి యోగమాహాత్మ్యమును గూర్చి ట్రీట్మెంటును గూర్చి శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారి వలన తెలికొంటిని. ఎందుకైన మంచిదని శ్రీ శాస్త్రిగారికి వారికడ నొక పరిచయ లేఖను తీసి కొంటిని. ఆ లేఖ తీసికొని త్రోవలో నాలుగు కమలాఫలములను కొని ప్రొద్దుటనే తిరువలి క్కేణి వెంకటరంగం పిళ్ళె వీధి లోని నాల్గవ నెంబరు ఇంటి కేగితిని. తలుపు తట్టి లోని కేగుదునుగదా ఆశ్చర్యము పై నాశ్చర్యము!

శ్రీ శాస్త్రిగారి రచనలను చదివినపుడు వారి యాకార, వేష, భాషాచారములను గూర్చి నాకు తెలియక యే మనసులో నొక రూప మేర్పడెను. వారు సన్నముగాక లావుగాక బంగారువన్నెగల స్ఫురద్రూపి యగు ఆ చారపరాయణుఁ డని నా భావన! లావుగా, చామనచాయ మెఱుపు మేనితో నున్న వారిని పోల్చుకోలేక పోతిని. "ఏం! నాయనా! ఎవరు నీవు!" అని వారు స్నిగ్ధగంభీరమగు స్వరముతో నన్ను పలుకరించిరి.

నా యూహలో ఆ కంఠధ్వని యట్లుండు ననుకొనలేదు.నేను తేరుకొని వారికి నమస్కరించి " మాది గుంటూరు..." అని చెప్పునంతలో శ్రీలక్ష్మి నారాయణగారు లోనుండి వచ్చి నన్ను పరిచయము గావించిరి. వారి నచట కలియుదు నని నే నెఱుఁగను. ఏదో పనియుండి చెన్న నగరము వచ్చి ఆ క్రిందటి రాత్రియే వారిటకుఁ జేరిరట!

శ్రీ శాస్త్రిగారు నేను వారింటికి చేరుసరికి దంతధావన చేయుచుండిరి. అప్పటి కేడు గంటలు దాటియుండును. ఆసరికి వారు స్నానజపాదులను ముగించి యుందురని తలచిన నా కిది క్రొత్తగా నుండెను. వారితో పరిచయము పెరిగిన పిమ్మట తెలిసికొంటిని. సాయంకాలమందు యోగ చికిత్సకై వారికడ కేతెంచు నార్తులతో వారికి పెందలకడ తెమలదు. అందఱు వెళ్ళినపిమ్మట గూడ చాల ప్రొద్దు పోవువఱకు వారి వారి రోగ కారణాదుల నాత్మోద్బోధనము తెలిసికొనుటతో నిదుర యుండదు. ఒకప్పుడొక నిదురపోయి లేచి తెల్లవారు లా చింతతోనే కాలము గడపుదురు. ఇందుచే ప్రొద్దెక్క లేచుట జరిగెడిది. వేకువనే ఆచారపరాయణువలె వేషము సవరించుట కెక్కడ! అన్ని ఆచార ములను వారు జీవకారుణ్య యజ్ఞాగ్నిలో వ్రేల్చిరి.

దంతధావన చేసీ చేయుటతో నేఁ దెచ్చిన కమలా ఫలములను రుచి జూచి," బాగు న్నవి! కాని లోన డొల్ల జాస్తి. రసము తక్కువ" యనిరి. ప్రతి వస్తువును పరిశీలించి నాణ్యము తేల్చుట వారి కొక పరిపాటి.

ఆపిమ్మట నాకు యోగచికిత్స నిచ్చుటకు వారు సమ్మతించిరి. కాని ముందు నా భోజనవసతి యెట్లని యడిగిరి. హొటలులో నుందు ననఁగానే వారి కతృప్తి కల్గెను. హొటలులో ఆహారము ససిగా నుండదని వారి బెంగ. మామూలు సాంబారు మెతుకులు గాక మంచి నేయి, కూరలు, పాలు, పండ్లు తీసికొనవలె ననిరి." ఈ యాహరముతో నీ జబ్బు కుదురునను కొనవద్దు. కుదుర్చునది సర్వకర్తయగు నిశ్వరుడే! నీ శరీర పుష్టికి ఈ తిండి కావలయును" అని చెప్పిరి. నర్సింగుహొము సంగతి చెప్పగా అందు చేరవల దనిరి. వారి మాతజాడను బట్టి నా యనారోగ్యము చక్కబడు నని వారి తలంపుగా నేను గ్రహించి సంతసించితిని. నా కంఠస్వరము బలహీనముగా నున్నదని వారనిరి. ఆ మాట నాకు క్రొత్తగా తోచెను. కాని పూర్ణారోగ్యము బడసిన పిమ్మట పోల్చిచూచికొనఁగా వారి మాట సత్యమని తెలిసికొంటిని. ఇది యెందులకు వ్రాసితి ననగా శ్రీ శాస్త్రిగారు యోగచికిత్సకు వచ్చు వారిని మొదటి చూపులోనే నిశితముగ పరిక్షింతురని చెప్పుట కే!వచ్చెడివారి ఆకారము, ముఖవైఖరి, మాటతీరు, కఠస్వరము, అంగవిన్యాసము, వారు తెచ్చెడి కానుకలు మొదలగు వానిని బట్టి వారివారి స్వభావ ములను, అనారోగ్యము తీరున శ్రీ శాస్త్రిగారు గ్రహింతురు. వారి యూహ తప్పగుట నే నెన్నఁడు చూడ లేదు. ట్రీట్రెంటులలోనే గాక ఈ కుశలతను వారు నిత్య జీవితములో నొక వినోదముగా నవలంబించెడివారు. దస్తూరిని బట్టి స్వభావమును తెలిసికొనుట, జాబులపై పోస్టుమార్కులను చూడ కుండ చిరినామా వ్రాసిన తీరునుబట్టి ఆ కవరు ఎచటి నుండి వచ్చినదో చెప్పుట, ఒకప్పుడా జాబు చదువకయే అందలి విషయమును చెప్పుట మొదలగు చిన్నచిన్న వినోదవిమర్శలతో వారి చుట్టు నొక చల్లని ఆశ్చర్యకరమైన వాతావరణము కల్పించెడి వారు.

ఆ తొలిపూట ట్రీట్మేంటులో నా శరీర మంతట ఒక శక్తి ప్రవహించినట్లుండెను. చెమట యోడికలు గట్టెను. హొటలుకు పోయి చక్కగా భోజనము చేయుమనిరి. సాయంత్రము వరకు కాల మెట్లు గడ పెదవని యడగిరి. క్రొత్తచోట నేమి చేయుటకు తోచక విసుగు చెందుదునని వారి యాందో ళన! ట్రీట్మేంటుకు వచ్చిన వారి శారీరక, మానసిక సౌకర్యములను గూర్చి అంత శ్రద్ధగా విచారించెడి వారు శ్రీ శాస్త్రిగారు! చికిత్సాకాలములో చీకాకులు లేకుండ ఆనందముగ నుండ వలె నని వారి తలపు."ఏదో పుస్తకములతో కాలక్షేపము చేయుదు" నని నే నంటిని. శ్రీలక్ష్మి నారాయణగారు " ఈయన మంచి చదువరి. అందుచే ఉబుసుపోక కేమి చిక్కు లేదు" అని చెప్పిరి. దానికి శ్రీ శాస్త్రి గారు" పుస్తకాలన్నీ కట్టిపెట్టు. భోంచేసి కమ్మగా నిద్రపో" యనిరి. శ్రీ శాస్త్రిగారు బహుగ్రంధ పరిశో ధకులు. కాని పుస్తక పాండిత్యము పై వారి కభిమానము లేదు. మన మనశ్సరీరములే సర్వరహస్య ములను వెల్వఱించు పుస్తకములు. వానిని పఠించు తీరు అలవర్చుకొనుట మేలు అని వారి అభిప్రాయము. సాహిత్యమును గూర్చి వారి యూహలను తరువాత స్పృశించెదను.

సాయంత్రము తిరిగి నేను వచ్చినపుడు నాయాకలినిగూర్చి, భోజనపదార్ధములను గూర్చి, నిద్రను గూర్చి,వచ్చునపుడు తీసుకొన్న పాలు, పండ్లను గూర్చి, శరీర స్థితిని గూర్చియు వివరములడిగి తెలిసికొనిరి. నేను వారు చెప్పినట్లే నడచుకొనుటయు, నిద్రహారము లమరుటయు గుర్తించి బండి త్రోవను నడచుచున్నదని వారు తృప్తి చెందిరి.

వారికడకు వచ్చు ప్రతివారిని ఈరీతిగనే యే పూటకాపూట ప్రశ్నించి ధ్యానములో నేమి జరిగినదియు, ఇంటి వద్ద నెట్లున్నదియు తెలిసికొని ఉత్సాహపఱచుచు ఎవరికైన బాధ తగ్గనిచో కారణ మన్వేషించుచు, దోషములను దిద్దుచు, ఆ దిద్దుగడతో నారోగ్యము చక్క బడుట గమనించుచు, అనవరపరహిత కాంక్షతో కాలము గడపెడి వారు శ్రీ శాస్త్రిగారు.

ఆపట్టున నే నచట నలుబది దినము లుంటిని. ఆ కాలమున ట్రీట్మేంటుకు సంబం ధించిన వింత లనేకము జరిగెను. వాని నన్నింటి నిట వ్రాయ వలనుగాదు. నాకు సంబంధించిన వొకటి రెండు చెప్పి విడిచెదను.

శ్రీ శాస్త్రిగారి వద్దకు చేరునప్పటికి నాకు ఏమి తిన్నను వంటఁ బట్టెడిది గాదు. నిద్ర ససిలేదు. కాని వలసి నంత యాహరమును నిర్భయముగ తిసికొమ్మని రనియు, పవలుసైతము నిద్ర పొమ్మని రనియు వ్రాసితిని. నే నా మాటల నక్షరశః పాటించితిని గాని అందుచే నెట్టి యసౌకర్య ము కలుగ లేదు. కొన్నాళ్ళయిన పిమ్మట ఒక ఉదయము " ఈ పూట ఏమి తీసికొంటి" వని శ్రీ శాస్త్రిగా రడిగిరి. రెండిడ్దేనలు, పదకొండుకు భోజనమా?" అని శ్రీ శాస్త్రిగా రనిరి. ఎక్కువ తింటిని గాబోలునని నేను నివ్వెరపోయితిని.' నీ ఒడ్డు పోడుగులకు రెండిడ్దేనలేమూల? నాలుగు న్యాయము " అనిరి. మరునాఁడు తిరిగి యడిగిరి." నాలుగు తీసికొంటి" నంటిని." ఆపైన" అని యడిగిరి." మామూలు పద్ధతి నొక యరకప్పు కాఫీ తీసికొంటి" నంటిని." ఇది కేవల మక్రమము. జోడిడ్దేనల కొక యరకప్పు. రెండు జోళ్ళకు నిండు కప్పు" అనిరి. మరునాఁడట్లు చేసితిని." ఇడ్దేనలు మాత్రమేనా? ఈ శాస్త్రము నీకు తెలియదు. విను! మొదట రెండిడ్దేనలు. వాని పై కొంచెము కాఫీ, ఆ మిఁద నుప్పుమావ్, దాని కాచ్చాదన దోసె, ఆ కప్పు మిఁద ఒక కప్పు కాఫీ పోయవలె" నని కడుపు చెక్కలగు నట్లు నవ్వించిరి. ఆ యూపుతో పూట కెన్మిది ఇడ్దేనలు, భోజన మున నరవీ శెడు కూరలు, రెండు కప్పుల పెరుగు; మధ్యాహ్నము నిద్రలేచి అరడజను పేవాజప్పళపండ్లు, కిస్మిస్, అంజూరా, ఆపిల్ఫలములు; సాయంత్రము నాల్గుబోండాలు, కాఫీ; రాత్రిభోజనములో మామిడిపండ్లు- ఇంతవఱకువచ్చితిని. ఈ రాకాసితిండి నేఁడు నేనేనమ్మఁజాల నట్లున్నది. లేకున్న నిరువది రోజులలో నిరువది పౌనుల తూకము పెరిగి యుండ నను కొందును!

ఒక రోజున అన్నామలై విశ్వవిద్యాలయములో గణిత శాస్త్రాధ్యాపకులుగా నున్న ప్రొఫెసర్ నరసింగరావుగారు వచ్చిరి. వారుగూడ యోగమిత్ర మండలిలోని వారే. శ్రీ శాస్త్రి గారి ఇంటనే బస. ప్రసంగవశమున నా కధయంతయు శ్రీ శాస్త్రిగారు చెప్పిరి. వా రాశ్చర్యముతో వినిరి.ఈ మాటలు జరుగుచున్నంత కాలము నాలో గుబగుబ మని యేదో సంచలనము జరిగెను. ఉచ్చ్వాస నిశ్వాసములు దిర్ఘములాయెను. వెన్నెముక నిట్టనిలువున బుసగొట్టు త్రాచువలె నిలిచెను. రెండు భుజములు వెనుక కొత్తుకొని రొమ్ము విప్పారెను. శ్వాసను కొలుచు పద్ధతి నాకు తెలియదు గాని, కొలిచినచో నది రెండు బారలైన నుండు నేమో! మా మువ్వురకు నాశ్చర్యము కలిగెను." ఎట్టి వ్యాయామము లేకయే ఇంతటి శ్వాస యెట్లు కలిగినది? చూచితిరా! ఇదంతయు మాష్టరుగారి దివ్యానుగ్రహము!" అని శ్రీ శాస్త్రిగా రనిరి. మాష్టరుగా రన వారి గురుదేవులు. శ్రీ శాస్త్రి గారు తమ వలన బాగాయిన వారందరితోను తాము నిమిత్తమాత్రుడనియు, మాష్టరు గారి యనుగ్రహమే సర్వని ర్వాహక మనియు చెప్పెడివారు.

నే నచట నున్న దినములలో ట్రీట్మేంటుకు వచ్చెడివారు. వారిలో రిక్షాలాగువారు, కస వూడ్చుకొను వారు, ఆఫీసుర్లు, ఉపాధ్యాయులు, యునివర్సిటీ ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీయర్లు, లాయర్లు, సనాతనులు, శాయిబాబా మత ప్రవర్తకులు, కమ్యునిస్టులు, విద్యార్ధులు, కాంగ్రెసు నాయకులు మొదలగు పలు తెఱఁగులవా రుండెదివారు. తేలుక్జాటు, ఒడలు కాల్పు, గాలి సోకు, టైఫాయిడు, పరిణామశూల (Gastric ulcer) పైత్య కోశమున రాళ్లు (Gall stones), నంజు, జలోదరము మొదలగు అన్ని బాధలను శ్రీ శాస్త్రిగారు యోగ ట్రీట్మేంటు తోనే చక్క జేసెడివారు.

    వీరిలో మిక్కిలి దయనీయుఁడగు నొక బాలుని గూర్చి వ్రాసెదను. ఆ బాలుని తండ్రి రిక్షలాగు వాఁడు. నాలుగు రోజుల క్రిందట ఆ బాలుఁడు కాలు జారి పడెను. అప్పటి నుండియు వానికి స్మృతి కలదు గాని నోట మాట లేదు. కనుపాప లొక ప్రక్కకు తిరిగి వెర్రిగా చూచును. మూతి వంకరపోయి యున్నది. మెడ ఒక ప్రక్కకు వాలెను.కాలు సేతులు ముడుచుకొని పోయి స్వాధీనమున లేవు. వానిని చేతులపై మోసికొని వచ్చిరి. ఆ బాలుఁడు ముద్దగట్టిన బాధవలె నుండును. వానిని చూచుటతోడనే దెబ్బతిన్న లేగ దూడను జూచి యడల గోమాత వలె క్షోభించిపోయిరి శ్రీ శాస్త్రిగారు. ఇటు బాలునియవస్ద, అటు శాస్త్రిగారి యవస్ద చూడలేక పోయితిమి. ఆబాలునికి లోని కాహారమేమియు ఇవ్వలేదని తెలిసికొని వాని తల్లిదండ్రుల పైనను, వారి దరిద్రము పైనను కటకపడి ఇంటిలో నుండి ఒకకప్పు కాఫీ తెప్పించి స్వయముగా చిన్ని చెమ్చాతో వానినోటఁ బోసిరి. ఆ పిమ్మట వాని యారోగ్యమునకై ధ్యానము చేసిరి. ఈసరికి ఆ బాలుఁడు ప్రక్క యానుడుతో ఒక విధముగ కూర్చుండ గలిగెను. అంతట శ్రీ శాస్త్రిగారు వాని శరీరమంతయు నిమిరి సర్దిరి. వాడు సరిగా కూర్చుండ గలిగెను. చుట్టునున్న వారి మొగములు వికసించెను. ఇక వానిని నిలుచుండఁ జేసి నడిపింప వలెను. వానిని లెమ్మని చెప్పిరి. కాని వాఁడు తడుపు కొనునే గాని లేవలేఁడు. డ్రిల్లు చేయువారి నాజ్ఞాపించు సార్జంటు వలె నధికార గర్జనతో లెమ్మని తిరుగ ఆజ్ఞాపించిరి. అంతట వాఁడు లేచెను. అప్పుడు శ్రీ శాస్త్రి గారి తీరు చూచి తీరవలెను! ఒకప్రక్క యానందము! మరొకప్రక్క యాందోళనము! వాడు నడచి ననే గాని వారికి తృప్తి లేదు. వాకిలివఱకు రెండుమార్లు వాడు నెమ్మదిగా నడచెను. తరువాత వాని నింటికి గొంపొమ్మనిరి. వెనుక టివలెనే తండ్రి వాని నెత్తుకొనఁబోయెను. శ్రీ శాస్త్రి గారు వదలని వానిని నడచియే ఇంటికి పోమ్మనిరి. మే మందర మాశ్చర్యముతో చూచుచుండగా వాడు నడచి యింటికి చేరెను. 
                                         

ఈరీతిగా వ్రాయ మొదలిడినచో ఆ నలువది నాళ్లలోని ముచ్చటలే ఒక గ్రంధమగును. తరువాత నాల్గు సంవత్సర ములకు నేను తిరుపతిలో శ్రీ శాస్త్రిగారి పునర్ధర్సనము చేసినపు డచటి సంరంభ మింతిటికంటె మిక్కిలి హెచ్చుగా నుండెను. తిరుపతిలో ట్రీట్మేంట్ల పద్ధతి కొనసాగినతీరు చూడఁగా మానవకోటికి అమృతత్వసిద్ధి యబ్బనున్నది గాబోలు ననిపించెడిది. తిరుపతిలో నున్నపుడు జబ్బులను 'పో' యన్న పోవునట్లు తోచెడిది. కాని మదరాసులో చూడనిదుర్ఘటనలు కూడ తిరుపతిలో జరుగక పోలేదు. డాక్టరు లాస వదులుకొన్న చివరి ఘట్టములో కొంద ఱచ్చటికి చేరిన వారు కలరు. అట్టి వారిని మాత్రము మృత్యువున కేల వదలవలెనని శ్రీ శాస్త్రిగారు సాహసించి ట్రీటు చేసెడి వారు. వారిలో కొందఱు సురక్షితులై నేఁ టికిని సుఖజీవనము నెఱపుచున్న వారు కలరు. కాని కొన్నింట ట్రీట్మేంటు వలన నుపయోగము కన్పించుచు నే ఆయువు తిరెడిది. నూటికి నూరుగురను సాధ్యాసాధ్యాదశలయం దన్నింటను రక్షించుటే జరిగినచో నిక సాధన పూర్తి యయినట్లే కదా! అట్టి శుభముహుర్త మిప్పటికి రాలేదు. ఎప్పటికి వచ్చునో!

ఆధ్యాత్మిక శక్తి వలన శారిరకరుగ్మతలు మాన్పనగు నని పలువురు విశ్వసింపరు. నమ్మకుండుటయే న్యాయ్యము. బలవ త్తర ప్రమాణము లున్ననే గాని విశ్వసింప వీలుగాని క్రొత్త విషయ మిది! తొలుత టెలిఫోను పద్ధతిని ప్రదర్శించినపుడు అచట నున్న ఒక గొప్ప రాజకీయ వేత్త దాని నొక గారడీ యని నిరసించె నట! తాను మాటాడుచు, ఆ కంఠద్వ ని మఱొకరినుండి వచ్చుచున్నట్టు చేయు కళ (ventrilo quism) అనె నట పాశ్చాత్య భౌతిక శాస్త్ర పరిశోధకులు క్రొంగ్రొత్త విషయములను కని పెట్టినపుడు పలుమారులు వారి నప్పటి పండిత ప్రపంచము హసించుటయో, హింసించుటయో జరగెడిది. గెలీలియో నుండి జగదీశబోసు వఱకు శాస్త్రపరిశోధనా చరిత్రలో నిట్టి సన్నివేశములు పెక్కుగలవు. కాని అభూతజ్ఞాతము లగు విషయములను సునిశిత ముగను, పలుమారులును సంశోధింపక యే యొప్పుకొనుట వలన గూడ ఒప్పుమి గలదు. ప్రత్యేకించి ఆధ్యాత్మిక ప్రపంచమునకును, భౌతిక ప్రపంచమునకును నిచ్చెనలు వేయుపని చాల ప్రమాదభూయిష్ఠమైనది. మార్గమా క్రొత్తది. దారి చూపువారా లేరు. ఈ దారి ఎటకు గొంపోవునో తెలియదు. మన యాయుష్కాల ములో గమ్యస్దానమును చేరగలమో లేదో తెలియదు. అందుచే నీ రంగములోని యన్వేషకునకు

      "అసతో మా సద్గమయి 
       తమసో మా జ్యోతి ర్గమయ 
       మృత్యో ర్మామృతం గమయ"
                                                       బృహ. ఉ. 1, ౩. 28.
  అను నిత్యపధికుని ప్రార్ధన మొక్కటే తోడు,   క్రీస్తు ప్రభువుగూడ ఆత్మశక్తి చే అనేకులను నిరామయుల నొనర్చెనని విందుము. క్రైస్తవులలో నిట్టి నమ్మకమును, అనుభవములును నేఁటికిని గలవు. సెంటు బొర్నాడొటే గీతము (The song of st Berna dotte) అను నవలలోని వాస్తవిక కధయంతయు నిట్టిదే. ఫ్రార్సులోని LOURDES అను పట్టణములోని మఠము వద్ద నిత్యము అనేక దేశముల నుండి రోగులు వచ్చి ప్రార్దనలో పాల్గొని నిరోగు లగుదురట! అచట ప్రవేశము బడయునపుడే రోగిని ఒక డాక్టర్ల సంఘము పరిశీలించి రోగవివరములను వ్రాసి యుంతు రట! పిమ్మట వారు వెడలిపోవు నప్పటి శరీరస్ధితిని పరిశీలించి అది ఎంత వరకు నిజ మగుమార్పో కాదో నిర్ణయించి రికార్డు చేయుదు రట. జీవవైద్య శాస్త్రములలో నగ్రశ్రేణికి జెంది నోబెల్ బహుమతి బడసిన అలెక్సిస్ కెరోల్ అను మహనీయుఁడు MAN THE UNKNOWN అను గ్రంధములో నిట్టి చికిత్సను గూర్చి ఇట్లు వ్రాసినాఁడు. 
  "... The most important cases of miraculous healing have been recorded by the Medical Bureau of Lourdes. Our present cmnception of the influence of prayer upon patho logical lesions is based upon the observation of patients who have been cured almost instantaneously of various affecttons, osteites,suppurating wounds, lupus, cancer, etc- The only condition in dispensable to the occurence of the phenomena is prayer. But there is no need for the patient himself to pray, or even to have any religious faith. It is sufficient that some one around him be in a state of prayer. Such facts are of profound significance. They show the vality of certain relations, of still unknown nature between psychological and organic processes. They prove the objective importance of the spiritual activities, which hygienists, physicians, educators and sociologists have almost always neglected to study. They open to man a new world....." 
  నేఁటి విజ్ఞాన పరిశోధనవలన పెక్కు ప్రకృతిరహస్యములు వెల్లడి యయినవి. పదమూఁడు, పదునాలుగు శతాబ్దములలో శాస్త్రపరిశోధనతీరును పరికించిన వా రెవరును నేఁటి విజ్ఞానసముపార్జన సాధ్య మని యూహించి యుండరు. నేఁటి విజ్ఞానపరిశోధన జీవ జడ పదార్థములను వేర్పఱచు కక్ష్యాంతరములోనికి జేరుచున్నట్లు తోచును. మరియొక యడుగు వైచినచో నది విరాట్టునే చేరు నేమో! శాస్త్ర పరిశోధకులు వారి కవసర మయినపుడు పరిశోధనామార్గములను, పరికరములను మార్చుకొనుచునే యున్నారు. ఈ నూతనాన్వేషణకు వలయు మార్పులను జేసికొనుట వారి ప్రజ్ఞకు మించినది గాదు. కాన వేగిరపడి వేనిని త్రోసివేయవల దని మనవి! 
                 [3]
 శ్రీ శాస్త్రిగారి ప్రజ్ఞ బహుముఖముల ప్రసంరించినది. వారి వ్యక్తిత్వమును క్రొత్తవారికి పరిచయపఱచ గోరెడు రచన కెంతయో నేర్పు గావలెను. మరియు గ్రంథమా పెరుగును. అందుచే నేనిట కొన్ని కొన్ని పట్టులను స్పృశించి వదలెదను.
  కల్పనాసాహిత్యమును గూర్చి వారి యభిప్రాయము విశిష్ట మైనది. అట్టి గ్రంథములందు మనము చూచునది అసత్యమే! అసత్యపఠనలో కాలము వ్యయింప నేల? కవి ద్రష్టయైన గాని జీవితసమస్యల లోఁతు తెలియనేరఁడు. ద్రష్ట కాని వాని రచనలు కొలఁదిలోతున నూరెడిజలమువలె దుష్టములు.-నిజమైన కవిత్వమునకు శబ్దార్ధాలంకారముల యాడంబరముల పని లేదు. ద్రష్ట యైనవాని రచనలందు వస్తుగౌరవమునుబట్టి అన్ని యలంకారములు నందు స్వతస్సిద్ధముగ నేర్పడును. ఇందులకు గాంధీజీ రచనలే సాక్షి. మానవవిజ్ఞానకళ్యాణములను గూర్చు శాస్త్రవిషయగ్రంథములు పఠనీయములు.
  మరియు నిత్యజీవితములోని యనేక యథార్ధ సంఘటనలు కవితావస్తువుగ స్వీకరించి, కరుణరసప్రధానముగా నీతిప్రబోధకములుగా అలఁతి యలఁతి మాటల కూర్పుతో సుందరముగ రచింపనగు నని వీరు తలఁచెడివారు. ఆరీతిని వారు కడుపుతీపు, విశ్వాసము, కపోతకధ, మున్నాళ్లముచ్చట మొదలగు చిన్ని ఖండకావ్యములను రచించిరి.   
  పూర్వసాహిత్యమున భవభూతి మహాకవి యుత్తర రామచరిత్ర వీరిని పులకింపఁజేసెడిది. ఆనాటకమునకు వీరు చెప్పెడువ్యాఖ్య ప్రతిభాసమన్వితముగా నుండెడిది. శాకుంతల మన్న వీరి కభిరుచి తక్కువ. తుమ్మెద నెపముగా దంభము లాడుచు ప్రవేశించుదుష్యంతునిఁ జూచి వారు జుగుప్స పడెదరు! ఆ పాత్రకును నేఁటి రౌడీరసికునకు భేదము లే దని వారి యూహ. సాహిత్యమును గూర్చి వారికిఁ గల విశిష్టాభిప్రాయముల నన్నింటి నిట వ్రాయ ననువు గాదు. ఆ పనికి నేను చాలినవాఁడను కాను. వారి ఆత్మజిజ్ఞాస సాహితీరంగమున నెట్లు ప్రతిబింబించెనో చూపుటకు మాత్ర మిది వ్రాసితిని. తుదకు సాహిత్యవిమర్శయందును, చరిత్రపరిశోధనమందును కల్గు ఈర్ష్యాద్వేషాదులను రోసి వారు వానిని వదలి తమ జీవితమును మానవ సేవకే అంకితము జేసిరి. అ సందర్భమున వారు చెప్పిన పద్యములు.
  కవితాశిల్పము సల్పఁగాఁ దొలుత వేడ్కల్ రేగె నాకు౯, గృతుల్ 
  చివురెత్తె౯, వెస మోము మొత్తె, నిఁక నాచేఁ జెల్ల వీ కల్ల బొ 
  ల్లి వినోదంబు, లవే జరామరణముల్ చీడల్ హతం బార్చి పు 
  ట్టువు చెట్టు౯ సఫలీకరించుకొని యంటుల్ గట్టెద౯ మాలినై.
  త్రికరణశుద్ధిగా భవదధీనుఁడనై యితర ప్రవృత్తి వీ 
  డికొని పరార్ధలాభ మొకటే గమనించుచు నుందు, నింక మా 
  యికము ధనాదికమ్ము గణియింపను, సత్యదయోపకార సా 
  ర్థక మగునాత్మచింతనపథంబునఁ దప్పి చరింప నీశ్వరా!
  శ్రీ శాస్త్రిగారు కల్పనాసాహిత్యమును నిరసింతు రనియు, సాహిత్యమున సైతము కరుణను, నీతిని ప్రధాన ముగా నెంతురనియు, సాహిత్య కృషి యే వీడి రోగులకు ట్రీట్మెంటు చేయుటతో కాలము గడపెద రనియు వ్రాసిన దానిని బట్టి వారి సాన్నిధ్యమున నుండుట యన శుష్క వేదాంతములతో నీరసజీవనమును గడపుట యని తలపోయరాదు. ఆయన నిజముగా సత్యాన్వేషి! కళారాధకులు! ఉత్సాహజీవి! వారి ప్రతి పనియందును ఈ గుణములు కన్పించుచుండెడివి. రకరకముల రంగుపెన్సిళ్ళు, కలములు, చేతికఱ్ఱలు, వింత వింత వస్తువులు సేకరించుటయందు వారికి ప్రీతి యెక్కువ. ఈ పెన్సిళ్ళను సేకరించుటే వారి వంతు గాని వాడుకొనుట యందఱివంతు! ఇట్లే ఫౌంటెన్ పెన్నులు. దేనితో వ్రాసిన దస్తూరి సొంపుగా నుండునో యని చూచెడి వారు. చుట్టునున్నవారు తమ తమ పెన్నులతో పోటిపడెడు వారు. చిటికెనవ్రే లంతటి కొబ్బరికాయల నెచటి నుండియో తెప్పించి వానికి వెండి పొన్నులు, మూఁతలు చేయించి స్వయముగా మెఱుఁగు వెట్టి స్నేహితులకు బహూకరింతురు. ఇట్టిది నాకొకటి ఇచ్చిరి. నేను నశ్యము వాడనుగదా యని సందేహించితిని. నశ్యమునకైనచో వా రాపని చేయరు. ఆకాయలో దూదిపెట్టి అందు మంచి యత్తరు గాని యూడికొలాం గాని వేసి వాసన చూచుకొనవచ్చు నని వారు సలహానిచ్చిరి. ఇట్లే అనేకరకముల చేకర్రలను వారు స్వయముగా మెఱుగు పెట్టి స్నేహితుల కిచ్చెడువారు. తాటిచేవతో చేయబడి గుర్తింపరానివి, పామువలె ఏ డెనిమిది వంకరలు తిరిగినవి, పెద్ద పెద్ద వెండిపొన్నులతో మెఱయునవి యగు రకరకముల కర్రలు వారికడ నుండెడివి. ప్రార్ధనా మందిరములో కూర్చుండుటకు రకరకముల పొడల జింకలచర్మములు, పెద్ద పులిచర్మములు తెప్పించేడివారు, వారికడకు తెలుఁగునాటి నాలుగుమూలలనుండి అన్ని వర్ణములవారును, అన్ని తరగతుల వారును వచ్చెడివారు, విరందఱిని తమవచోచమత్కృతితో నలరించేడివారు. మరిము వారు వారు వాడిన క్రొత్త మాటలను గూర్చియు, వాని ఆనుపూర్వినిగూర్చియు అప్పటి కప్పడే ప్తెలాలజిని నిర్మించేడివారు. దోసె అనగా రెండు చేతుల వెడల్పుగల దనియు దో = రెండు + సెయ్ = చేతులు, అరసె యనగా అరచేతి వెడల్పు గలదనియు (అర +సెయ్) అనియు నా భక్ష్యములకు క్రొత్తరుచి కలుగునట్లు చెప్పేడి వారు. ఇంక పండ్లుకోయదగిన పరువనులు, వాడఁదగిన రీతులు, కూరల రుచుల బహుపరిశీలనతోచెప్పెడివారు. గుంటూరు, కృష్ణాలలోని గోగుపచ్చడిని గూర్చి 'కడుపుతిపు' అను చిన్న పద్యకావ్యములో వారు ఇట్లు వ్రాసిరి.                     
" పయరకూర వేచి పచ్చిమిరెపండ్ల నుక్కళించి పోసి యూరనిచ్చి

కొంత కొంత పొగిపికొను గోఁగుఁ బచ్చడిచవికి నింక నోరు చివికితిరు."

 ఈ యోగసాధకులకు పుష్టికరమ్తెన యాహారము అవసరము. ట్రిట్మెంటు చేయువారికి ఈ సౌకర్యము మిక్కిలి యవసరము. కాని మదరాసులోనున్న ఆరోజులలో శ్రీ శాస్త్రిగారికి ఏంబదిరూకల వేతనము, పెద్ద కుటుంబము. ఆ ప్తెన వచ్చిపోయేడివారు. సగము ప్తెగా యింటి అద్దెకె ఖర్చు, ఇక బియ్యము, పప్పు, కూరలు, పాలు, నేయి, కట్టెలు, బట్టలు, ఆహొ! నిజముగా నివి యన్నియు శాస్త్రిగారి కుండేడివా? ట్రీట్మెంటుకు వచ్చినవారివద్ద చిల్లిగవ్వ పుచ్చుకోనరు. ఎవర్తెన నాలుగుపండ్లు తేచ్చిరో వారి కనుమానము! ప్రతి ఫలము పుచ్చుకొని ట్రేట్మెంటు చేయు మనుచున్నారని. తెల్ల వారుసరికి, సాయంకాలమగుసరికి ట్రీట్మెంటు వేళకు దహదహ మని యాకలి! యోగసాధనకన్న నాకు చూడగా వారి సంసారసాధనయే కష్ట మనిపించినది. ఆ పేదరికముగూడ వారిని బాగావడభీముఖులనే గావించెడిది. ఇన్ని చిక్కులలోను వారు చలింపక "భారములన్నియు నీప్తెన వ్తెచి నిర్భాయుడన్తె యున్నానులే" అనియో, "తరము గాని ఎండవేళ కల్పతరు నీడ దొరకిన ట్లాయే ఈ వేళ!" అనియో గొంతెత్తి పిల్లవానివలె పాడుచుండఁగా మనము వేరొక ప్రపంచములో నున్నట్లు తోచెడిది.

ఆ పూటకు బియ్యము లేక, భగవంతుడేమి చేయునో చూతమని జరపిన కథలుకూడ కలవు. ఆపూట కెవరో ఇంతకన్న భాగ్యశాలి నెల్లూరినుండి శేరున్నర బియ్యము మూట గట్టుకుని పదిగంటలు ప్రోద్దేక్కునప్పటికీ తెచ్చి యిచ్చెను. ఇతఁడాదినము రావలసినవాఁడుగాదు. వీరి యవసరము తెలిసినవాఁడునుగాదు. మరియెక నాఁడు భోజనమునకు పూర్వమేయని జ్ఞాపకము-ఏదో మాటాడుచు ఇపుడు అనాసపండు తినిన బాగుండును అనిరి శాస్త్రిగారు, ఇంతలో తలుపు తెరచుకొని రాజమండ్రినుండి ఒకమిత్రుడు అనాసపండ్ల బుట్టను తెచ్చెను. లేమిడిచే నలిగులి యగుచున్నను దాని నుండియే ఒక వింత తృప్తీని కల్పించుకొనేడివారు శ్రీశాస్త్రి గారు, ఒక రాత్రి భోజనానంతరము విశ్రాంతిగా నిద్రపోబోవుచు నిట్లనిరి. "ఏమయ్యా! నాకు గలపరితృప్తి జార్జి సార్వభౌమునక్తెన నుండదు. ఈ పూట ఇచటకు బాధ పడుచు వచ్చినవా రెందరో నవ్వుచు బోయిరి నావలన ఈశ్వరుడిట్టి పుణ్యకార్యములను చేయించుచున్నాడు గదా యను తృప్తితో నేను హాయిగా నిద్రింపఁగలను. మరియు మన కేపూటకు వలయువాని నాపూటకు చుక్కలు చుక్కలుగా అమృతము స్యందించినట్లు భగవంతుఁ డనుగ్రహించు చున్నాఁడు. అప్పటికప్పడది యాస్యాద్యమ్తె హాయిని గొల్పు చున్నది. నిలువఁజేయువలె ననేపరితాపము గాని, నిలువచేసి దానిని సంరక్షించుకొనుటకు పడునవస్ధలుగాని నాకు లేవు గదా!" ఈ మాట విన్నవారికి ఎట్టి ఇక్కట్టులను, నాటంకములను, కష్టములను స్తెతము యోగి తనకు మేలు కలిగించు సాధనములుగ మార్చుకొనగలం డనుమహనీయ సత్యము స్పురించి తీరును!

 శ్రీ శాస్త్రిగారు నెఱపు ట్రీట్మెంటు పద్ధతినిగూర్చి పాఠకులుసరికి తెలియగోరుచుందురు. ఉభయసంధ్యల యందను నొకచో నుపవిష్టులై శాస్త్రిగారు వారు గురు దేవులను స్మరించి, నమస్కరించి, కనులు మూసికొని కొంత తడవు అతర్విక్షణములో నుందురు. వారిలో నేమి జరుగునో మనకు తెలియరాదు. రుగ్మతాపీడితులుగూడ ఆ సమయములందు వారి సన్నిధిని చేరి కూర్చుండి, వారి వారి యనారోగ్యములు నయమగునట్లు అనుగ్రహింపుమని కరుణాసముద్రుఁ డ్తెనభగ వానుని వేడికొని, కనులు మూసికొని శరీరములో నేమి జరుగునో సాక్షిమాత్రముగ గమనింతురు. కొందరుఱికి వింత వింత సుందరతరదృశ్యములు కనుపడును. కొందరికి శరీరమున నొవ్వు గలభాగమూలం దేదియో కదలించినట్లును, సవరించి నట్లును తెలియనగును. కొందరు చీకుచింతలు మరచి హాయిగా నిద్ర జేందుదురు. ధ్యానానంతరము శరీర ముత్సాహముగాను, బాధావిహీనముగను ఉండును. కొన్ని పూట లిట్లు జరగినచొ క్రమస్దిరారోగ్యమేర్పడును. ఎప్పటికప్పుడు ధ్యాననమయమున జరగిన విశేషము లన్నియు రికార్డు చేయబడుచుండును.
ఒకప్పుడు ఒకరి యనారోగ్యకారణము మానసికము అయి యుండవచ్చును. అట్టియెడ నాకారణము నన్వేషించి యేరుకకుఁ దెచ్చుకొని దిద్దుకొన్ననేగాని ఆ యనారోగ్యము చక్కబడదు, శారీరకమ్తేనను, మానసికమ్తెనను అనారోగ్య స్వరూప మంతయు చికిత్సకునికి అవగాహన కానిదే చక్కబడదు. ఇందునుగూర్చిన అద్బుతమ్తెన విశేషము లెన్నియో చికిత్సాక్తె వచ్చిన వారురికార్డు చేసినవె చాల గ్రంథము కలదు
 దగ్గర కూర్చున్న వారికే శ్రీశాస్త్రిగారు సుదూరమున నున్న వారికిగూడ చికిత్స జరపుటయు , ఆశ్చర్యకరముగ వారారోగ్యము పొందుటయు గలదు. ఒకప్పుడు ప్రమాద సమయ మనితోచినపుడు ఇతరోపాయము అన్నియు కట్టుబడి నపుడు, శ్రీ శాస్త్రిగారికి టెలిగ్రాము పంపుటయు, ఆ తంతి చేరి చేరక మున్నె ఇచట సౌఖ్యము గలుగుటయు గలదు.
 శ్రీ శాస్త్రిగారు వ్యక్తులకును, రుగ్మతలకును ట్రీట్మెంటు చేయుటయే గాక దేశము మొత్తమును పీడించుసమస్యల సుఖపరిష్కారమునక్తె గాఢామ్తెన తపస్సు చేయుటయుగలదు. 1946 ప్రాంతమందలి రాయలసీమ కరువునుగూర్చియూ, 1947 భారతదేశ స్వాతంత్ర్యమును గూర్చియూ వారు చేసిన అమోఘ తపస్సును, అందువారు పొందిన దివ్యానుభూతులును మరువ రానివి, ఈసందర్భమున గాంధిజీ ఉపవాసములలో శ్రీ శాస్త్రి గారు వారి క్షేమమునక్తె యెంతగానో కృషి చేసెడివారని వెల్లడించక యూరకుండఁజాలను. శ్రీశాస్త్రిగారు తమ సహజ వినయశీలమువలన నిట్టివి బహిరంగపఱచెడివారు అయన ఆహింసాత తత్వమును, హరిజనసంస్కరణ, దేవాలయప్రవేశ ఉద్యమములను బలపరచెడువారు. ఆ యధ్బుత విశేషము లెల్ల ప్రకటించవలసినదే! గ్రంధవి స్తరభీతిచే వాని నన్నింటిని వదలితిని వారి పరిచయు లెల్లరు వాని నెఱుగుదురు
  శ్రీ శాస్త్రిగారివలెనె పలువురు భృక్తరహిత తారక రాజయోగమున దీక్ష బడసిరి వారెవరు గాని ఇంతటి పట్టు దలతో, విజయవంతముగా నిత్యము ట్రీట్మెంటు పద్ధతిని గూర్చి వేఱు అభిప్రాయములు గూడ గలవు. ఒకటి ........... ట్రీట్మెంటు చేయు వారాపదలపాలగుదురు.  రెండు ఈ యోగముట్రీట్మెంటులకై ఏర్పడ లేదు అని వీరి మతము ఈ విషయమ్తె శ్రీ శాస్త్రిగారివలన మేము తెలిసికొన్న దేమనంగా:
                            

ఒకటి: ట్రేట్మెంటు పద్దతికి మూలసూత్రము పరులయార్తినిగూర్చి ఆపుకోలేని యనుతాపము, ఆ బాధ తనకే కల్గినదా యన్నంత వగపు. ఆ యనుతాపము ఆ బాధ తనకే కల్గినదా యన్నంత వగపు. ఆ యనుతాపమే బాదితుల యార్తిని దిర్చును, ట్రీట్మెంటు సలుపువాడు "ఏది! నాప్తె నీమత్రంము ప్రయోగింపు చూత" మను తీరున నుండ రాదు. అట్టిచో నేమియు జరుగదు.

ప్రధమమున శ్రీ శాస్త్రిగా రితరుల బాధనుగూర్చి తపించుటేగాని, అందువలన ప్రయోజన ముండుననిగాని, రోగ నివారణ జరిగినదని గాని గమనించ లేదు. కాని కొన్ని మారులు తివ్రానారోగ్యముచే బాధపడువారిని జూచి శ్రీ శాస్త్రిగారు దుఃఖితు లగుటయు, అతిశిఘ్రముగా వ్యాధి నివారింపబడుటయు గమనించి నిర్హేతుక జాయమానమగు అనుకంపమే సర్వరోగనివారక మని తెలిసికొనిరి.

మఱియు స్వపరభేదములను పాటించినచో ట్రీట్మెంటు పని చేయదు. మానవుల నందఱను నేకకుటుంబముగా జూచు సమత్వబుద్ధి యేర్పడినకొలది ఈ ట్రీట్మెంటు విధాన మద్భుతఫలితముల నిచ్చును. ఈ యోగము ననుసరించువారు పలువురున్నను ని ప్రత్యేకార్హత శ్రీ శాస్త్రిగారికే యబ్బుటకు కారణము వారి అపారకరుణాస్వభావమే కాని ట్రీట్మెంటు చేయువారికి ఆయా రోగుల బాధలు శేరిరకముగా చాయా మాత్రము కల్గుటయు నిజమే. 1926 ప్రాంతములో శ్రీ శాస్త్రిగారు బాహాటముగా, నిత్యకృత్యముగా ట్రీట్మెంటు నవలంబించినపుడు పలువురు మిత్రు లీ కారణమును జూపి వారింపఁజూచిరట! ఆ నాఁటిధ్యానములో శ్రీ శాస్త్రిగారు తమ గురు దేవులతో నీరీతి విన్నవించిరట___ "నిజముగా పరులబాధ తొలంగి ఆ కారణమున నాకు బాధ కల్గినను సమ్మతింతును ఆ తోలంగించునది నేనుకాదు. నా వెనుక నీవే దాగియున్నావు. సర్వదయామయుడ వ్తెననీవు నావలన పరుల బాధలను తొలగించి నన్ను బాధలో ముంతు వని నేను వేరతునా? నీ వెనుక నేను దాగ నేరనా?" ఈ విషయమునే దెలుపుచు శ్రీ శాస్త్రిగారు రచించిన పద్యములు:

    స్వామి ఆంతరనిలయా స్వయం వ్యక్తమ్తె వెలయ
    నాయజ్ఞానావరణము నాశముఁ జేయు మహాత్మా
    నే నను నయదమాధమ నిర్వాహము తొలగించి
    నీలో నను గలపుకొని సెగడగదే పరమాత్మా.
    నాలో గల వని యెఱుగక నానా బాధల పడితిని
    త్రో వెఱిగీతి నిప్పటికి దుఃఖము తిలగెను దేవా,
    దేవర ణా కిదేహము దేవళ మ్తె వెలసినది
    చక్కగా నెలకోని విశ్వస్వామిత్వము నేఱపగదే!
    అద్దమువలే దేహం బిది యమలినముగ జేసికొని
    నిద్దపుని తేజము జగదుద్దిప్తము చేయగదే!

అనుక్షణము త్వన్మయతాహ్లాదము హేచ్చేడువిధమున
  క్షణక్షణము మన్మయమ్తె జ్వలియింపగదే దేవా!
  అహంకారం మమకారము లడగార్చి క్రమక్రమముగ 
  కరగజేసికొని నీలో కన్నాతండ్రి! గడతెర్చుము.
  నాచాటున డాగియె దోబూచులాడు చున్నావా?
  చూచితి నిక నే నెమఱ నీచాటున డాగేదను.
  వేను కడుగిడ నిక నాథా! వెఱపు జెంద నిక నాథా!
  కడతేఱెద నిక నాథా ! కల్యాణం బిక నాథా.
  ఆ నాటి నుండి శ్రీ శాస్త్రిగారు దేహమును విడు తుదిక్షణము వఱకు నేకదీక్షతో ననేక భయంకరజాడ్యము లను మాన్చిరి నిజాము గా ట్రీట్మెంటువలన నెట్టి యపకార మ్తెన జరిగియే యున్నచో వారు భౌతిక కాయము నెన్నడో విడియుండవలసినది, క్షయ, జాలోదరము, ఉబ్బసము, మేనింజ్తేటిస్, గుండెజబ్బు, పాముకాటు మున్నగు ఉపద్రవముల నెన్నింటినో వారు చక్కబరచిరి. ఈ యోగ చికిత్సావిధానమున వారికి పాతిక సంవత్సములకు మించిన యనుభావము గలదు. అందు వారే పరమ ప్రామాణికులు!
  విశేషించి వారిట్లు చెప్పేడువారు " పరుల యనా రోగ్యములను సవరించు నెడ మన యనారోగ్యములు కూడా తొలగును" అని ఇది మాలో పెక్కు రకు  అనుభవపూర్వకముగా విదితమ్తెన విషయము.
  "దయగుణము బలవంతముగా తెచ్చి పెట్టుకోనునది గాదు, అది ఆకసమునుండి పుడమిప్తె పడు చల్లని జల్లువంటిది. దయఁజూపువానిని అది ద్వగునముగా వర్దిల్లఁజేయును" అని మహాకవి షేక్స్పియరు చెప్పినది అక్షరశః నిజము.
  "The quality of mercy is not strain'd;
  It droppeth as the gentle rain from heaven
  Upon the place beneath;it is ywice blest;
  It blesseth him that gives and him that takes:" 
      మరియు జీససు చెప్పినట్లు,
  "Blessed are the merciful:for they shall obtain mercy."__ Mathew, V, 7. 
  రెండు:___ ఈ యోగము ట్రీట్మేంటుకై యేర్పడ లేదను వారికి శ్రీ శాస్త్రిగారు ట్రీట్మేంటులే లేనిచో నిది యెవరికి కావలయును? అని సమాధానము చెప్పెడివారు. అభ్యాసకాలమున శరీరముణ జరుగుకొన్ని స్పందనముల కొఱకెవ్వరు దీని నాశ్రయింపరు అని పలికెడువారు. 
  ఇంతకు శ్రీ శాస్త్రిగారి సాధన వారి ప్రకృతి ననుసరించి విశిష్టమార్గ మవలంబించె నని తోఁచును. ఆత్మచింతన పదము కూడ సత్యదయోపకార సార్ధకముగానుండవలె నని వీరి నిశ్చయము. వీరి ఆత్మార్పణా విధానము జీమూతవాహనుని కధను, బౌద్ధజాతక కధలను స్మృతుకిఁ దెచ్చును.
  వీరి కడ ట్రీట్మేంటు పడయఁగోరి చేరిన వారు ఆరోగ్యమును బడసిన పిమ్మట తమ కారోగ్యమును ప్రసాదించిన దివ్యతత్త్వమును అన్వేషించెడివారు. మఱియు తమ బాధ నెపముగ వారు సర్వాంతర్యామి నెఱుకకు దెచ్చికొన ప్రయ త్నించెడి వారు. ఒరుల క్లేశము నపనయించుటకు చికిత్సకుఁడు వారితో నైక్యతను భావించని దే ఫలము కలుగ దని వ్రాసితిని. ఇట్టి యెడ ట్రీట్మేంటు అనేకముగా గన్పట్టుచు నేక మగుపదార్ధమును గురుతించుటలో నొక యాభ్యాసముగ పని చెయుచున్నది. మనలను మనము చూచికొనుట కేర్పడిన భ్రుక్తరహిత తారక రాజయోగ సాధనకు ట్రీట్మేంటు పద్ధతి సహాయకారియే యగుచున్నది.అవసరము కూడ నగుచున్నది.
  మఱియు- ఇతరుఁడు బాధపడుచుండఁ గా చూచి యోగి యూరకుండు టెట్లు?
  "ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున 
  సుఖం వా యది వా దుఃఖమ్ స యోగీ పరమో మతః"
          భగవద్గీత VI .32.
  "ఓ యర్జునా! ఎవఁడు సుఖములోను దుఃఖములోను సర్వులను తనవలెనే చూచునో వాఁడు పరమయోగి" అను భగవద్గీతా ప్రబోధమును గూడజ్ఞాప్తికిఁ దెచ్చుకొందము గాక!
                            

భృక్తరహితతారక రాజయోగము

శ్రీ శాస్త్రిగారు ట్రీట్మేంటులో బాగు చేసిన వారితో ఆ బాగు చేయునది తాము కామనియు సర్వాంతర్యామి, సర్వద యామయుఁడు నగు ఈశ్వరుఁడే యనియు చెప్పెడివా రని వ్రాసితిని. వారి గురుదేవులే సాక్షాత్పర బ్రహ్మము! కాని వారి పేరైన ఎన్నడును ఉచ్చరించెడివారు కారు. కారణము- ఈ యోగమును గూర్చి ప్రచారము చేయవల దని సాధకులను వారి గురుదేవులు శాసించియుండు టయే! చరమదశవరకును శ్రీ శాస్త్రిగారీ నియమమును పాటించెడివారు. అంతియేగాక ఆ యొర వడినే తమ్ముగూర్చి గూడ ప్రచారము నిరోధించెడివారు శ్రీ శాస్త్రిగారు. అందు చేతనే లోకమున వారి కృషి తెలియఁ దగినంతగా తెలియఁ బడలేదు. వారి వలన ఉపకారము పొందిన వారిలో కొందఱును, వారి యాంతర్యము నెఱిఁగిన మిత్రులు కొందఱును పత్రికాముఖమున వెల్వరించిన దుఃఖపు వెల్లువ వలననే పలువురు మొదటి సారిగా వీరు యోగ సాధకులని తెలిసికొనిరి. ఎవఁడు లోకమును విడిన పిమ్మట లోకము వానిని కృతజ్ఞతతో స్మరించునో అట్టివాని పుట్టువు గదా ధన్యము!

  శ్రీ శాస్త్రిగా రావలంబించినది భృక్తరహిత తారక రాజయోగము. దీనిని 1910లో కుంభకోణముణ నొక మహాపురుషుఁడు స్ధాపించెను. వారి నామాక్షరములే ఈ యోగమునకు మూలమంత్రము. వారిని స్మరించి నస్కరించిన వారికి బ్రహ్మజ్ఞాన మిత్తు నని వారిప్రతిన. బ్రహ్మైక్య మును పడయవలసినది ఏదో సమాధిదశలోనో లేక దేహము విడచిన పిమ్మటనో గా దనియు, ఈ ప్రజ్ఞాతోనే ఈ లోకము ననే ఈ దేహముతోనే యనియు, వారి మతము. వీరు చెప్పిన వానిని బోలినకొన్ని విషయములు పూర్వ గ్రంధములం దుండవచ్చును. కాని వీరు ఏ గ్రంధము పైనను ఆధారపడి యీ యోగమును ఆరంభింప లేదు.అది కేవలము నూతన సృష్టి! వీరు సర్వస్వతంత్రులు! మిగుల మహిమాన్వితులు! వీరి నీ మండలి వారు సాక్షాత్పర బ్రహ్మముగా తలఁతురు. పూజ, భజన, హారతి మొదలగు బాహ్యచిహ్నము లేవియు వీరు వల దందురు. వీరిని తలఁచి నమస్కరించి నచో శరీరములో యోగక్రియ ఆరంభ మగును. సాధకుని వంతు సాక్షి మాత్రముగ తనలో జరుగుమార్పులను గమనించుటయే. ముద్రలు గాని, ఆసనములుగాని, ప్రాణాయామముగాని, హఠయోగాభ్యాసముగాని అక్కఱ లేదు. వానిని నిషేధింతురు గూడ! అభ్యాసకాలమున ప్రజ్ఞ సాధకుని స్వాధీనములోనే యుండును.
  ఆహారవిషయమున కఠిననియమము లేవియు లేవు శరీరమునకు చల్లదనమును, పుష్టిని కల్గించు సాత్త్వి కాహారము తిసికోనవలెను. సాధనకై ఇల్లు వాకిలి వదల రాదు. సన్యాసము పనికి రాదు. ఎవరివృత్తి వారు సాగించుచునే సాధన చేయవలెను. సాధకులు తమ్మితరులు గుఱతించుటకై ఎట్టి యార్భాటమును ప్రకటింపరాదు. ఈ సాధన వలన అనేక మహత్తులు లభించును వీని నెన్నఁ డును దుర్వినియోగము చేయరాదు. మఱియు అవి ప్రధానములును గావు. ఈ యోగగౌరవమునకు తగినట్లు సాధకులు తమ ప్రవర్తనను నీతి మార్గమున నడపించుకొనవలెను.
ఇంకను ఈ యోగమును గూర్చి వ్రాయఁదగిన దెంతయో కలదు గాని ప్రస్తుతమున కింత యే చాలు నని విర మించుచున్నాను.
  గుంటూరు 
   ఖర                              కొత్త వెంకటేశ్వరరావు . 
  శ్రావణ బహుళ విదియ