Jump to content

ప్రజ్ఞా ప్రభాకరము/ఉపక్రమము

వికీసోర్స్ నుండి

C. V. V.

నమస్కారము

ప్రజ్ఞా ప్రభాకరము


శ్రీ నిరంత రానందని శ్రేయసార్ధ
    సాధకము, సర్వకిల్బిషబాధకము, స
    మగ్రవిజ్ఞానదము, మహామహిమఘనము
    శరణ మగు మాకు సద్గురుచరణయుగము

ఉపక్రమము

సత్యజ్ఞానందాత్మకమగు పరతత్త్వము తత్ప్రుతి కూలగతితో అవివేకజీర్ణారణ్యమున జిక్కి చీకాకు పడుచున్న యనదును నన్ను త్రోవకు దెచ్చి కాపాడిన తీరును మిత్రగోష్టిలో విన్నవించుకొనుటకొఱ కే నా యీ గ్రంధ రచన ప్రయత్నము. దీని రచనమున నాకు పురుషోత్తముఁ డగు గాంధి స్వచరిత్ర రచనావిధానము దారిదివ్వె. గులాబి మొగ్గను గడుపునఁ బెట్టుకొని దాని గ్రంముకొని కఱకు నూగు తొడిమ ఱేకేతొలుత గాన వచ్చినట్టుగా ఉపక్రమమున నిందు ప్రభాకర నామకుఁడ నగు నేనే కానవత్తును గాని, నాలోని దివ్య తత్త్వపుఁ బూవు వికాసము చెందిన పిదప, నది సువాసనను సౌకుమార్యమును వన్నెలను వెలార్పఁ జొచ్చిన పిదప, దాని గొని యానందింపఁ గోరువారికి నేను తత్ప్రుదర్శకుడనుగానే, యంగుళీగ్రాహ్య మగు తొడిమను గానే యడుగునఁ బడి యుండి కానవత్తును. అప్పుడిది ప్రజ్ఞా చరిత్రమే కాని ప్రభాకర చరిత్రము గాదు. ప్రభాకరచరిత్ర మయినను ఆ ప్రభాకరుడు తొల్లింటి నేను గాక వేఱొకఁ డే.

పరుషము నిష్ప్రయోజన మబద్ధ మనార్యము చేరరాదు నా
విరచనలందు, డెందము పవిత్రముగా విలసిల్లి సత్యసుం
దరము పరార్ధ యుక్త మగుత త్త్వమునే వెలయింపఁ గావలె౬,
గురుచరణారవిందములకుం బ్రణమి ల్లెదా నేర్మికై.

--- ---