Jump to content

ప్రజ్ఞా ప్రభాకరము/జననాదికము

వికీసోర్స్ నుండి

2

జననాదికము

సర్వజిన్మాఘ బహుళై కాదశీ మంగళవారమున ఉదయాది 19 గడియలకు జ్యేష్ఠా చతుర్థచరణమున - క్రీ. 1888 ఫిబ్రవరి 7 తేదిని - కృష్ణాతీరమున పెదకళ్ళేపల్లి గ్రామమున నేను జన్మించితిని. నా జాతకచక్రము జన్మకాల ఘటికాది వివేచనతో నా బాల్యమున మా నాయనగారు వ్రాసి యుంచినది కలదు గాని - నేను దాని నెల్ల నిందుదాహరింప వల దనుకొంటిని. జ్యోస్యులకు దాని పరిశీలనపు టలజడి వల దని నా కోరిక.

మా యూరు పూర్వము వేదశాస్త్రాది విద్యావిదులగు విప్రులతో సర్వ వర్ణములవారితో విలసిల్లినది. నా పసితనము నాఁటికిఁ గూడ వేద శ్రౌత సాహిత్య విశారదు లనేకులు మా గ్రామమం దుండిరి. శ్రీ వత్స గోత్రులగు వెలనాటి వైదిక బ్రాహ్మణుల వంశము నాది. శేషమ్మ మా తల్లిగారి పేరు. సుందరశాస్త్రి మా తండ్రిగారి పేరు. ఆ పుణ్యదంపతులకు నలువురు పుత్రులు, నలువురు కుమారైలును కలిగిరి. నేఁటికిని సోదరలము నల్వురము సుఖముగా నున్నాము. నాకు అక్కగారు అన్నగారు నిద్దఱగ్రజులు. తర్వాతివా రవరజులు. మా తల్లి పరమసాధ్వి.

మా తండ్రిగారు కొంత కొంతగా స్మార్త వైదిక జ్యౌతిష శిల్ప సంస్క్రత సాహిత్యముల నేర్చిన వారు. ఆంధ్ర మున మంచి సాహిత్యమును కొంచెము కవితా పరిజ్ఞానమును గలవారు. వైద్య విద్యా విశారదులు. పారంపర్యముగా పురోహితత జీవిక యయినను మా తండ్రిగారు ప్రధానజీవిక వైద్యముగా వర్దిల్లిరి. మా తల్లిదండ్రులు పరస్పరము ప్రేమమయులు. వివాహ మయిన తర్వాత వారెన్నడు భిన్నస్ధలములలో నెక్కువ నాళ్లు వసించి యెఱుగరట!

దంపతులు గాఢానురక్తులగుచో, సత్సంకల్పులగుచో, రసభావానందమయు లగుచో తత్సంతానము చిరంజీవిత్వాది గుణగణ్యమై వెలయఁగల దని ఇటీవలి నా గట్టి యెఱుక. ఇందు కెన్నో తార్కాణ లెఱుగుదును.

మా తల్లిదండ్రుల ప్రగాఢనురాగము తత్సంతాన మగు మా కింత దాఁక క్షేమారోగ్యదికము ప్రసాదించిన దని నా విశ్వాసము. మాతండ్రిగా రెనుబదిమూఁడేండ్లు నిరామయ దీర్ఘజీవితము గడిపిరి. వారి తండ్రిగారును నెనుబదిమూఁడేండ్లు జీవించిరి. మా తాతగా రవసానకాలమున కుమారుని బిలిచి "నాయనా! నీవును నావలె నెనుబదిమూఁడేండ్లు జీవించగల" వని మా తండ్రిగారి నాశీర్వదించి రట! పలుమారులు మా నాయనగా రీ యాశీర్వాదమును జెప్పుకొనుచుండెడివారు. వారి యాశీర్వాదము మా తండ్రిగారియెడ ఫలించినది! మా తల్లిదండ్రులు సంపన్నులు కారు గాని సంపన్నుల కంటె సుఖముగా జీవిక గడపిన వారు. పుత్రపౌత్రాదులతో మా యూర మాయిల్లు దోసతోటవలె నుండెడిది. మా యింట మా నాయనగారు నూఱింటిదాక జన్మోత్సవములు వారి కాలమున జరపినట్లు లెక్కించుచుండెడివారు.