ప్రజ్ఞా ప్రభాకరము/ప్రకాశక విజ్ఞప్తి

వికీసోర్స్ నుండి

ప్రకాశక విజ్ఞప్తి

మహర్షి సత్తములు, మహతవస్సంపన్నులు, ప్రజ్ఞపూర్ణులు నయినా శ్రీ గురుదేవులు ప్రభాకర శాస్త్రి వర్యుల యోగ జీవితము ప్రజ్ఞా సుందరము, ప్రభావసంపన్నము. శ్రీ ప్రభాకర శాస్త్రి గారు కారణజన్ములు! వసుదైవ కుటుంబకముగా వారి జీవితము సాగినది. ప్రేమర సపూర్ణము వారి హృదయము. మహామహిమోపేతము వారి ప్రజ్ఞ! పసినాఁట నుండి యంతర్వర్తినియయి యమృతత్వసిద్ధి సాధన మార్గమున వారిని నడిపించిన దివ్య ప్రజ్ఞా చరిత్ర మే నేఁడు మేము వెల్వఱచుచున్న 'ప్రజ్ఞా ప్రభాకరము'.

    నన్నున్ వర్ణన సేయఁ గా వలవ దన్నా!కన్నయందాఁ క మిఁ
    ద న్నీవర్ణన మెందు కిందులకుఁ గొందాఁ కం బ్రతిక్షింపు మం
    చు న్నన్గూర్చిన యుష్మదాజ్ఞాకు నేదుర్చూపై గృహద్వారామం
    దున్నాఁ డం గనరాఁ గదే కనుట కర్హు ౯ నన్నుఁ జేయంగ దే!

కుంభకోణమున నపూర్వము, నసాధరణము నయినా మహాత్తర యోగమును నెలకొలిపి యమృతత్వసిద్ధి ప్రసాదమును దమశిష్యులకు నొసఁగఁ బ్రతినపూనిన మహాయోగి వర్యులగు తమ గురుదేవుల గూర్చి శ్రీ శాస్త్రి గారు రచించిన పద్యమిది! శ్రీ శాస్త్రిగా రాయోగమునఁ జేరిన కొలఁది కాలమున కెపుడో శ్రీ మాస్టరు గారి మహి మాదిక మున వర్ణించుచు నేదో పత్రికలోఁ బ్రశంసా పద్యములను గొన్నిటిని రచించి ప్రకటించి రఁట! అది తెలిసి శ్రీ మాస్టరు గారి తమ్ముఁ బూర్ణముగా నెఱుఁగుదాఁక నట్టి రచనము లేవియుఁ గావింపఁ దగ దని శ్రీ శాస్త్రి గారిని మందలించి రఁట! ఈ విషయము నెఱుకపఱచునదే పయిపద్యము. అటుపిమ్మట నెన్నఁ డును వారు శ్రీ వారిని గూర్చి ఎత్తి రచనము గావింపలేదు.

1948వ సంవత్సరమున తిరుపతిలో శ్రీ శాస్త్రి గారి షష్ట్యబ్దపూర్త్యుత్సవము జరగినది. షష్టిపూర్తి నాఁడు ప్రాతరుపాసన సమయమున వారు.

   ' వచ్చెను నేఁటి కర్వదగు వర్షము పుట్టువుఁ దొట్టి, గర్భముం
    జొచ్చుటదొట్టి నాకరయఁ జూచిన నేఁటి కె షష్టిపూర్తి, యీ
    వచ్చిన యేడు నిండిన ధ్రువంబుగఁ గాఁ గల షష్టిపూర్తితో
    నిచ్చట నాకుఁ గావలయు నిష్టికిఁ బూర్తియు సృష్టిపూర్తియున్.'

అని వేఁడి గురుదేవులను బ్రార్థించిరి. అపుడు ' నిన్నటివఱకు ప్రభాకరుఁ డవుగా నుండిన నీవు నేఁటి నుండి ప్రజ్ఞా ప్రభాకరుఁడవు. నన్ను గూర్చి వ్రాయఁగలయ్యోగ్యత నీకుఁ గలిగినది 'అనిశ్రీవారుద్బోధించినట్లుతెలియనయ్యెను. నాఁడేవారు' ప్రజ్ఞాప్రభాకరము' రచనమునకుఁదొడఁగిరి. తమకుఁ గలిగిన యోగానుభూతులను వివరించుచు వేయిపుటల గ్రంధముగాఁ దోలిసంపుటమును, నీయోగము వలన నుపకారము పడసిన మిత్రులమొక్కయు, శిష్యులయొక్క యుననుభవములను, వారే వ్రాసిన వానిని, వేయించుట గ్రంధముగా రెండవ సంపుటముగా 'ప్రజ్ఞా ప్రభాకరము'ను వెలయించుట వారి సంకల్పము. అందుకై తొడఁగి రచనము కుపక్రమించి కొంతవఱకు సాగించిరి. మిత్రులకడ నుండియు, నాప్తులకడ నుండియు, శిష్యులకడ నుండియు వారి వారి యనుభవములను దెలుపు వృత్తాంతములను గూడఁ దెప్పించిరి.

తలమునుక లగు కార్యకలాపములలో నెట్లో తీరిక చేసికొని శ్రీ వారీ గ్రంధరచనము ను దినమున కొక కొంతగా సాగించుచునే యుండిరి. కాని యన్నమాచార్యుల కిర్తనముల ప్రచురణము, తదుత్సవాదికముల నిర్వహణము, కుమారసంభవో త్తర హరివంశ వ్యాఖ్యానములు రచనము, తిరుపతిలో మ్యూజియమునకై యమూల్యవస్తువుల సేకరణము-ఇత్యాది కార్యకలా ములలో దలమునుక లగుచుండుటచే నీ గ్రంధరచనము నేఁడు ప్రకటించు చున్నంత వఱకు మాత్రమే కొనసాగినది.ఇంతలో మ్యూజియమున కయిన వస్తు సేకరణ ప్రయత్నమున వారు బౌతికమున వీడుటయు మా దుర దృష్టము! కడకు దుఃఖపుఁ బుక్కిలింతగా మాకు దక్కినది యీ గ్రంధము! శ్రీవారి యోగ జీవితమునకు సంబంధించిన యీ రచనము వారి ప్రధమ వర్ధంతి నాఁటికి వెల్వఱచుట మా సంకల్పము.

శ్రీ శాస్త్రి గారితో స్వయము నాకుఁ బదునై దేండ్లకు మించిన పరిచయము కలదు. 1939లో వారు మదరాసు విడిచి తిరుపతి వెళ్ళిన తరువాత మదరాసునకు వారు వచ్చునపుడెల్ల మాయింటనే బస చేయు చుండువారు. వారియోగ చికిత్స వలన నారోగ్యము పడసిన నాఁట నుండియుఁ బరుమభక్తితో నేను వారి ననువర్తించు చుండడివాఁడను. వైద్యులకుఁ గుదుర్పరాని రోగాములతో బాధపడుచున్నవా రెందఱో శ్రీ వారి యోగచికిత్స వలన నారోగ్యము పడసి యానందముతో నుండుట నే నెఱుఁగుదును.

వారి యాధ్యాత్మిక శక్తి యెంత పటిష్ఠ మో తెలుపుట కొక సత్య సంభవము నుదా హరింతును.

అన్నమాచార్యుల ప్రధమ వర్ధంత్యుత్సవము తిరుపతిలో మహా వైభవముగా సాగు చుండినది. మదరాసు ఉన్నత న్యాయస్దానమున ప్రధాన న్యాయమూర్తులు శ్రీ పాకాల వెంకటరాజమన్నారుగా రధ్యక్షత వహించిరి. రెండవదినమున సాయంకాలము శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి పాటకచ్చేరి జరగుచుండినది. వేలకొలదిఁ జనము విఱుగఁబడి వచ్చియుండిరి. సభాస్ధలము క్రిక్కిఱిసి యుండినది వాతావరణమల్లకల్లోల ముగనుండెను. కాఱుమబ్బులు క్రమ్ముకొన్నవి. తుపాను వాయువులు వీవసాగినవి. ఉత్సవ ప్రాంగణ మంతయు దుమ్మెత్తి పోయు చుండెను. వేలకొలఁది జనము. స్రీలు, శిశువులు, వృద్ధులుపలువురుండిరి. ప్రాణభీతి! సభలోఁబెద్దగ్లోలయ్యెను. రసాభాసమగు నని శ్రీ శాస్త్రిగారు వెంటనే లేచి మైకు దగ్గఱకు వెళ్లి 'వర్ష మురాదు! మనమందఱము నేకమనస్కతతోఁ బ్రార్థించు చున్నప్పుడు తద్విరుద్ధముగా వర్ష మెట్లు రాఁగలదు. మబ్బులు విచ్చిపోఁ గలవు. గాలిహొరు తగ్గును. కూర్చుండుఁడు! వాన రాదు! రాదు! రాదు!' అని మమ్మాఱు నొక్కి చెప్పిరి. ఆశ్చర్యము! శ్రీ వారి దివ్య సంకల్ప బలమేమో కాని వెంటనే మబ్బులు తొలఁగిపోయినవి. గాలి హొరు తగ్గినది. వర్షము రాలేదు. కచ్చేరి జయప్రదముగా సాగింది. వారి యాధ్యాత్మిక శక్తి ప్రభావ మట్టిది! ప్రకృతి విజయ మన నిట్టిది యేకదా! ఆహొ! యిట్టివి శ్రీవారి విషయమున మా యె ఱుకలో నెన్నియో!!

అమృతత్వసిద్ధికై సాధనము సలుపు నీ యోగమ యొక్క మహాత్త్వము చెప్ప నలవి కాదు. యోగమహిమమును గూర్చియు, తత్ స్దాపకులగు గురుదేవుల దివ్య ప్రభావమును గూర్చియు శ్రీ శాస్త్రి గారు రచించిన యీ గ్రంధము ముద్రిత మయిన యెడల నెందఱకో యీ యోగ విషయము తెలియగోరువారికి నుపకరముగా నుండు నని దీనిని బ్రకటింప నుత్సహించితిని. యోగ విషయము తెలియగోరువారి కిది మిక్కిలి తోడ్పడఁ గలదని నా విశ్వాసము.

శ్రీవారి యోగానుభావములను గూర్చియుఁ, దమకు శ్రీ వారితోఁ గల 'పరిచయ సందర్భములను గూర్చియు ననేక విశేషాంశములు తెలుపుచు శ్రద్ధాంజలి'వ్రాసిన శ్రీ కేఒత్త వెంకటే శ్వరరావు గారికి మే మెంతయుఁ గృతజ్ఞులము. ఈ గ్రంధ ముద్రణ సందర్భమున శ్రీ శాస్త్రి గారి శిష్యులు శ్రీ తిమ్మావ జ్ఝల కోదండ రామయ్యగారు మాకు మిక్కిలి సహాయపడిరి. వారికి మా కృతజ్ఞత!

అలఁతి కాలములో ససిగా సర్వాంగ సుందరముగా అచ్చొంత్తించి యీ గ్రంధమును శ్రీ వారి ప్రధమవర్ధంతి నాఁటికి మా కందఁజేసిన 'వెల్డను ప్రెస్సు'వారి నభినందిచుచున్నారము.

మదరాసు
                  
ఖర
                                                                                                                                                                            కంభంపాటి సత్యనారాయణ.
శ్రావణ బహుళ విదియ