ప్రజ్ఞా ప్రభాకరము/శాస్త్రము - అనుభూతి

వికీసోర్స్ నుండి

శాస్త్రము - అనుభూతి

శ్రీసోమనాధశాస్త్రులుగారి తపస్వితపై నాకు మహాభక్తి! కాని వారి ననువర్తింప వలెనని కాని, అనువర్తించినచోఁ గడ తేరఁ గల్గుదు నని కాని నాకు తోఁచ లేదు. యోగ సూత్రములను బాఠము చెప్పునపుడువారు తాము యోగ చెడిన దనియు, ఆపద్ధతుల ననుభూతికిఁ దెచ్చుకొనఁ జాల మయితి మనియుఁ జెప్పిరి. వారి కే సాధ్యము కాని చో మమ్ముదీనిఁ జదివించు టేల యని నాకుఁ దోచెను. కాని కోపింతు రని వారి నడుగ నయితిని. మఱొక నాఁడు నా ప్రశ్నమును వారే వేసికొని " మిలో నెవరయిన వీనిని సాధింపఁ గల రేమో యత్నించి చూడండి. సరియయినగురువు దొరకు నేమో చూడండి. నా కనుభూతి కలుగనంత మాత్రాన శాస్త్ర మప్రమాణ మనుకోకండి. మీరుగా సాహిసించకండి" అనిరి. ఆ మాట నాలోఁ జొచ్చుకొని పోయినది. వారు మంత్రయోగమయులు. అనుష్టానమున గాఢతత్పరతయే కాని వారికి దాని ఫలిత మేమి అన్న యోచనమే యుండెడిది కాదు. చేయవలసినది గనుక చేయుచుండుటయే. ఇటీవల వారి తపఃప్రయత్నమును గూర్చి యోచించుటలో నేతదర్దక మగునుపనిషద్వాక్యము సమాధాయకముగాఁ దోఁ చినది. నేను నా యిర్వది యెనిమిదవ వత్సరమున భృక్త రహిత తారక రాజయోగమునఁ జేరి యబ్బురపు టనుభూతులను బడయుచుండఁ గా వారు సజీవులుగా తపోమయులుగా విరాజిల్లు చునే యుండిరి. తఱచుగా నేను స్వగ్రామమునకు వెళ్ళినపుడు చల్లపల్లి వెళ్ళియూ, వారు వారి యల్లుఁ గూతుళ్లు వర్ధిల్లుచున్న మా స్వగ్రామ మగు పెదకళ్ళేపల్లికి విచ్చేసినపుడు సందర్శించియు నా విషయముల వారికి నెఱింగించుచునే యుంటిని. వా రేంతో కుతూహలముతోఁ దాము గూడ నాతో నొకతూరి కుంభకోణము వచ్చి శ్రీ వారిని దర్శించి సంభాషించి యేమేమో పడయవలయు నని యుత్సాహ పడుచు వచ్చిరి. వారి కీయోగసంపర్కము కలుగఁ జేయవలె నని కోరిక నాకును నుండెడిది. కాని యదియు జరగలేదు.

వారు భౌతికశరీరము విడిచినపిదప నాముప్పది యెనిమిదవ నొకనాఁ డు నాధ్యాన సమయమున శ్రీ వారును, మా నాయనగారును, మామామగారును, నాతో పాటుధ్యానానుభూతిలో నుండుట కొన్ని నిమిషములపాటు గోచరించెను. ఈ మువ్వురకు నిట్టి యనుభూతి కలుగుఁ గా కానీ బహువారములు నా ప్రార్ధనమునఁ గోరుకొనుచుండెడివాఁ డను. కాన యా యనుభూతి నాకు ముదము గొల్పినది.

--- ---