ప్రజ్ఞా ప్రభాకరము/కాకిపగ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కాకిపగ

పది పదుమూఁడేండ్ల వయసు వాఁ డను. అప్పటికి చల్లపల్లిలోఁ జదువుకొనుటకు వెళ్ళియుందు ననుకొందును. నాకు చింతచిగురు పప్పుకూర యన్నఁ బ్రియము. మా యింటి దొడ్డిలో నున్న చింత చెట్టు గుబురుగాఁ జిగిర్చి యగ్ని జ్వాలలు రేగుచున్నట్లు మిలమిల చిగుళ్ళతో మెఱయూ చుండెను.' ఆ చిగురు కోసి తెత్తును, కూర వండి పెట్టు' మని మాయమ్మగారిని కోరితిని. గోడమీద నెక్కి చిగురు కోయుచు చేతి కందని కొమ్మ నొక కొంకికఱతో వంగ లాగఁ జొచ్చితిని. ఆ కొమ్మ ప్రక్కలఁ గాకిగూ డున్నది కాబోలును! నాకుఁ గానరాలేదు. ఒక కాకి యఱచుచు నినుపమేకుతోఁ గొట్టినట్టు కావు కావని యఱచుచు ఇంక నెన్నింటినో కాకుల రప్పించు కొనెను. ఒకటే గగ్లోలు! కంగారు పడి గోడ దిగి యింటిలోనికి వచ్చి వేసితిని. ఆ మర్నాడే నేను చల్లపల్లి వెళ్ళిపోయితిని.

తదాది నే నెప్పు డింటికి వచ్చినను నీకాకి పగ ప్రత్య క్షమయ్యెడిది. మఱచి దొడ్డిలోనికి వెళ్ళితినా కాకి ముక్కుతో నా తలమీదఁ గొట్టిన దన్నమాటే! భోజనము చేసి చేయి కడుగు కొనుచో నా నెత్తిమీద నా కాకి రెట్ట వేయుటయు ముక్కుతో పోడుచుటయు జరిగెడివి. కొన్ని సమయములో తల మీఁద యారోఁతకు మరల స్నానము చేయ వలయుచుండును. ఈ కాకి పగ నన్నుఁ బది పండ్రెండేండ్లు బాధించినది. ఎఱిఁగి నే నేమియు నా కాకికి అపకృతి చేయ లేదు. దాని గూటికిని గూడ నెట్టికీడును జరుగ లేదు. కాని దానిపగ మాత్రము నాపై ప్రబలముగా భహువత్సర ములు సాగినది. మద్రాసు వచ్చిన తర్వాత నెలనెలకు నే నింటికిఁ బోవుటయుఁ దప్పెను. ఆ చింత చెట్టు నెండిపోయెను. ఆ కాకికూడ వేఱుచోటికిఁ జేరెనో! ఏమయ్యేనో! ఈ కధ నెందు కిక్కడ వ్రాసితి ననఁగా నిది నాకుఁ జాల వివేకము గఱపి బహుసమయములలో భావ విధిలో విహరించుచుండిన యధార్ధ గాధ!

ఇటీవల బసవపురాణాది గ్రంధముల ముద్రణ సందర్భములందు నాపై తీవ్రముగాఁ గోపము ప్రకటించి యిప్పటికిఁ బ్రకటించుచున్న వారియెడ నేను వర్తింపవలసిన తీరును కాకి పగ నాకు పాఠము చెప్పినది. ఎంత తీవ్రముగా విరోధించిన వారిపయిననను బ్రతివిరోధము పాటింపక, యంతరంగమున నాత్మీయత నే పాటించుచు నను రాగామునే సాగించుచుఁ దెలియఁ జెప్పఁ దగిన దానిని (కొందఱే అట్లు చెప్పఁదగినవా రగుదురు) సమ్ముఖములో సుదృఢముగానే తెలియఁ జెప్పుచు నుండునో నావిద్వేషము, వారికిఁ దెలియ కుండనే యంతరంగ మునఁజొచ్చి నెలకొనుచున్న యీయనురాగముచే రేపఁబడి మఱింత రేగి ప్రతిఘటనము లేమిచే నిర్వీర్యమయి కాలక్రమమున నీరసించి యాఱిపోగలదు. ఇందు కనేకానుభవములు నా కీటివలివి కలవు. ఇట్లు ప్రవర్తింపఁ గల్గుటకు నాలో గురుదేవుల యనుగ్రహమును, శ్రీ గాంధిగారి దివ్య చారిత్రమును 'అంత ర్బహిశ్చ'నాకు జాగ్రత్తను గొల్పనవి.

--- ---