ప్రజ్ఞా ప్రభాకరము/వెంకటశాస్త్రిగారికడ విద్యావ్యాసంగము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వెంకటశాస్త్రిగారికడ విద్యావ్యాసంగము

శ్రీ సోమనాధ శాస్త్రులు గారిని వీడుట సమ్మతము గాకున్నము శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారు క్రొత్తగా బందరు హైస్కూలులో నంద్రోపాద్యాయులుగా విచ్చేసి యుండుట చేతనే, శ్రీ సోమనాధశాస్త్రుగారి దగ్గఱ సహధ్యాయులగా చదువుచున్నవారము ముగ్గురము అవ్వారిసుబ్రహ్మాణ్య శాస్త్రి, పిసిపాటి వెంకటరామశాస్త్రి, నేను బందరులో శ్రీ వారి సన్నిధిని జదువుకొన నుత్సాహపడితిమి. తొలియిద్దఱు ముందు బందరు చేరి సందర్భములు చూచుకొని నన్ను రమ్మందుమని వెడలిరి. వారి ప్రోత్సాహమున కొలది నాళ్ళకు నేనును బందరు చేరితిని. అప్పటికి నా వయస్సు పదునాఱేండ్లయి యుండును.

తెలుఁగున నా కేమేని యెఱుక యేర్పడెనన్నచో నది శ్రీ వెంకటశాస్త్రిగారి గురుతాను గ్రహప్రాప్తమే. వారి దగ్గఱ పుస్తకము పట్టి చదివినదానికంటె వారి ముఖతఃవినోదగోష్టిలో విని నేర్చినది చాలా. ఆధ్రాత్మిక విషయమున బందరు వాసమునఁ గాని శ్రీ శాస్త్రిగారి సన్నిధిని గాని నాకు కలిగిన యుద్బోధ మేమియు లే దనియే యనవలెను. అంతే కాదు. శ్రీ శాస్త్రిగారి సన్నిధిని అవధానాధారణలు, పద్యరచనలు, ఉపన్యాసవినోదములు,కవితాకల్పనములు,వాదప్రతివాదములు, అహంతలు, మమతలు బలసి ఆధ్యాత్మచింత యంతర్దాన మందిన దనవలెను. శ్రీ శాస్త్రిగారు మాయమర్మము నెఱుఁగని స్వచ్చ హృదయులు. బందరు రాక పూర్వము వారి తీరు' దేశాటనం పండితమిత్రతా చ' అన్న శ్లోకము చొప్పున చాతుర్యమూలములు గలదై వర్తిల్లినది. అప్పటి దేశాటన పండితమిత్రతా రాజసభా ప్రవేశాదులు వారు చెప్పును వచ్చును, మేము వినను వచ్చును, కాని పండిత మిత్రుతకుఁ దర్వాతిదయు, రాజసభాప్రదేశమునకుఁ బూర్వపు దియు నగు చాతుర్యమూలము వారు చాటు చేయక సవిస్తరముగాఁ జెప్పుచుండెడివారు. నేను సిగ్గునఁ జిదికి పోవుచుండెడి వాఁడను.

ఆ కాలముననే మా యన్నగారికి వివాహము జరిగినది. ఆ వివాహము జరపినవారు, నా పెద తండ్రిగారి బావమఱఁది, సంగీత సాహిత్య విద్యారసికులు , దివిసీమలోని చోడవర గ్రామమున నెలకొన్న వారు, శ్రీలంక నాగేశ్వర శాస్త్రిగారు. వారికి నా మిఁద చాల వాత్సల్యము. ఆయన విధురులు. సంతతి లేదు. విద్యావినోదులే కాక వేశ్యావినో దులును. మా యన్నగారి వివాహము తర్వాతఁ గోన్నాళ్ళ కొక పుత్రస్వీకారము కూడ వారు చేసికొనిరి. ఈ కుఱ్ఱవాని కుపనయనము చేసిరి. ఆ వివాహమునకు నుపనయన మునకును గొప్పగా బోగపు మేళములు ప్రాతస్సయంకాలము లందు, రాత్రులందుఁ గూడ జరుగసాగినవి. వానినిఁ జూచుట కుద్యో గులు పలువురు వచ్చుట జరగెను. ఉపనయనము జరిగిన తర్వాత కొన్నాళ్ళు నన్నక్కడ నిర్బంధించి వారు నిలుపు కొనిరి. సంస్కృత నాటక కధలు, కాదంబరీ కధ నన్ను మా మేనమామగారు వేశ్యాపరివారితు లయి చెప్పగోరు చుండిరి. నేనును చెప్పు చుంటిని. ఎన్నా ళ్ళక్క డుండుట? పదినాళ్ళయిన తర్వాత ఆ యూరనుండి మా యూరకి వచ్చి వేసితిని.

ఆ వేశ్యల శృంగారములు, ఆటపాటలు, నేను కధలు చెప్పుచున్నప్పుడు వారు నెఱ పిన సౌహార్ధము, వారిహాస్యగాడు, బ్రాహ్మణ వృద్ధుడు, మా మేనమామగారు నన్ను ప్రతి వత్సరము వేసగి సెలవులలో- శ్రీ వెంకటశాస్త్రిగారు బందరు విడిచి వెళ్లుదురుగాన- తమ యూరికి వచ్చి యుండుమని కోరుట నన్ను ముగ్ధుని జేసి వైచినవి. మా యూర విడిచి బందరు కేగి వారపు మెదుకులు తినుచు చదువుకొనుట వెగటు గొల్పసాగినది. ఇల్లు విడిచి పదునాఱుమైళ్ళు బందరు నడచి వెళ్ళుట యెప్పుడును పరిపాటియే యైనను నాకప్పుడది చాల బాధ గొల్పినది. ఒకటి రెండు ఫర్లాంగులు వెళ్ళుటే నాకు చాల కష్టమయ్యేను. అక్కడ నొక బురద కాల్వ దాటవలెను. వెనుకకు తిరిగి పోవుదునా యని తోఁ చెను. బట్టల సర్దు కొనుచు కొంచెము సేపు కూర్చుండియోచించితిని. ఎన్నో చీకాకులు రేగినవి. శ్రీ వీరేశలింగము పంతులుగారి ప్రహసనములు, ఉపన్యాసములు నంతకుముందు చదివి యుంటిని. వేశ్యల గూర్చి వారి వ్రాసిన వెల్ల తలఁపునఁ బాఱినవి. ఇక నిట్టి గోష్టులకెన్నఁడు గాని పోరాదనిశపధము చేసికొంటిని. క్రీ. 1904 ప్రాంతములో మాట యిది. అటు తర్వాత నే నెన్నఁ డను వేస్యాభినయ దర్శనమునకుఁ బోయి నట్టెఱుక లేదు.

బందరులో చదువుకొనుచుండుకాలమున నేను శ్రీకొండవెంకటప్పయ్యపంతులుగారి యింటను, శ్రీ వల్లూరి సూర్యనారాయణ రావుగారి యింటను వసించుచుండువాఁడను. వారి కప్పుడు నాపైఁ జాలవాత్సల్యము. శ్రీ సూర్యనారాయణరావు గారు వారిజీవితా వసానముదాఁక నాయోగక్షేమములు కనిగొనుచుండువారు.వారి ప్రేరణమున నే నేను మద్రాసు చేరితిని. అప్పటికి నాకు పదునెనిమిదవ యేడు. వారు శ్రీ రెంటాల సుబ్బావారు గారికి నన్ను గూర్చి జాబు వ్రాసిరి.

--- ---