ప్రజ్ఞా ప్రభాకరము/వేంకటేశ్వరస్వామి దర్శనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

౧౬

వేంకటేశ్వరస్వామి దర్శనము

అప్పటి నా జీవితాశలు రెండు. మా తల్లిదండ్రు లేప్పుడో మ్రొక్కు కొన్న శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామి ని దర్శించుట యొకటి. నాకు పసితనము నాఁట నుండియు దేవాలయముల కరుగుటగాని, అక్కడ స్వామి దర్శనము లభించునని నమ్ముట కానియిచ్చ్జ గొల్పని ముచ్చట. తిరువళిక్కేణిలో గాని మైలాపూరులో గాని దేవళములలోనికి స్వామిదర్శనార్ధమై యెన్నఁడు గాని నేనై వెళ్ళి యెఱుఁ గను. కానీ యప్పుడప్పు డేవో నా మనోభావనములను పద్యములతో తిరువళిక్కేణి పార్ధ సారధి స్వామి స్తుతిగా వెల్ల డించుట కలదు. యాట్టి వానికి నాకు తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శన మున ముచ్చట యంత తీవ్రముగా నేల కలిగెనో నాఁడు గుర్తింప గుదురలేదు.' కలౌ వేంకటనాయకః' అన్న శ్లోకాంశము నన్ను క్రమ్ముకొన్నది.

మే మందఱము మ్రొక్కు చెల్లించుకొనుటకు అనఁ గా చిరంజీవి మాతమ్మునికి శంకరున కుపనయనము స్వామి సన్నిధిని చేయుటకు బయలు దేరితిమి. మద్రాసునుండి బయలు దేరి తిరిపతికి వచ్చుటలో నిజముగా నాకు స్వామి సన్నిధి కే వచ్చుచున్నంత యుప్పొంగు. అఖిలాండ నాయకుఁ డగువాని, విశ్వమును విష్ణువును, వషట్కారుని, భూత భవ్య భవత్ర్పభువును కన్నులార కంతును గదా! ధన్యుఁ డ నగుదును గదా! అదుగో ఇదిగో చేరబోవుచున్నాను అని మురియఁ జొచ్చితిని. అప్పుడే తీవ్రానరోగ్యవిము క్తుఁడ నయితిని గాన దౌర్బల్యము ప్రబలముగా నున్నను నీ యుత్సాహము నన్ను ద్బోదింపఁ గా స్వామి పై నేవో పద్యములు పయనములో రచింపఁ దొడఁ గితిని. తిరుచానూరిలో నుపనయనము జరపితిమి. స్టేషను నుండి యెండలో నాయూరు చేరుటలో మా యన్నగారి కుమారైకు పసిబిడ్డకు తీవ్ర జ్వరము వచ్చెను. జ్వరము తగ్గుదాఁక నేనదే చేయుదునని కూర్చుండి పద్యములతో స్వామి స్తుతి చేయఁ జొచ్చితిని. జ్వరము కొన్ని గంటలలో తగ్గిపోయెను. పద్యములు చాల రచింతిని. వాణిలో నొకటి రెండు:-

చుఱ్ఱని మేను కాలెఁగనుచూడ్కి వికారము దోచె నన్నకుం
గుఱ్ఱది యాఱుమాసములకూన యిదెక్కడి వేకిసోకొ మా
మొఱ్ఱల నాలకింపుము నమోనమ! యప్పన నీకు నప్పనా
చిఱ్ఱున చీదకుండ సుఖసిద్ధికిఁ దార్పుమి బిడ్డఁ దేర్పుమి!

జ్వరము తగ్గినపై

అంకిలి లేనిభక్తి మనసారఁ దలంచి నమస్కరించి మా
సంకట మార్పవే యన వెసన్ సుఖ మిచ్చి యనుగ్రహించి తో
కింకరకల్పకంబ! పరికించితి నీమహనీయతన్ ' కలౌ
వెంకటనాయకో' యను సువిశ్రుతసూక్తియధార్ద భావము న్.

ఆనందముతో నందఱము గొండ లెక్కితిమి. వృద్ధులు గాన మా నాయనగారంతకు ముందు పలుతూరులుస్వామి దర్శనము చేసిన వారు గాన దిగువతిరుపతిలోనే కొలఁ ది కాలము క్రిందటనే కట్టిన' పుష్పతోట' సత్రములో నుండిరి. స్వామి దర్శనముకై యువ్విళ్ళూరుచు వెళ్ళితిని. కాని యక్కడ నా కెంత తంటాలుపడినను స్వామిమూర్తి దర్శనము లభింపలేదు. మద్రాసు నుండి మహంతుగారికి, వారిదగ్గఱ నుండి కొండమీది యుద్యోగులకు జాబు గొని వెళ్ళితిమి. కాన యక్కడ వలయు సౌకర్యములు లభించెను. మా వారందఱు కొంత యలజడి, త్రొక్కట మును జెందినను స్వామి దర్శనము ససిగాఁ జేసికొని తనిసిరి. నేను చాలసేపు స్వామి మూర్తిని చూడ యత్నించి విఫలమనోరధుఁ డ నయితిని. ఎంత యత్నించినను చెదరి చీకటి గానవచ్చెను కాని నా కక్కడ స్వామి మూర్తి గోచరింపదయ్యెను. చాల నిరుత్సాహముచెందితిని. దౌర్బల్యముచే నక్కడి మూర్తి దర్శనమునాకు కనులు మిఱుమిట్లు గొనియుండు నని, స్వామికి నాకు నడుమ దివ్వె వెలుఁ గుండుటచే నది యడ్డు వచ్చి మూర్తినిగానరానియా దయ్యెనని నా పాపకర్మముచే దర్శనము లభింపలేదని పరిపరి యోచనలు, వాని కేవో యాపవాదములు తోఁచ సాగెను. ఏమి తోఁచినను స్వామి గోచరింపఁ డయ్యెనే కదా యన్న యారాటము నన్ను వీడలేదు.

ఈసందర్భ మీగ్రంధము రచించునాఁటి కించుమించుగా నల్వదియేండ్లకు పూర్వము జరిగినది. 1910 వ సంవత్సరము నాఁ టి దీ వృత్తాంతము. తర్వాత 1930 నుండి తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి ని గూర్చి కొంత యెఱుక నాకుఁ గలుగ సాగెను. 1949 నాఁ టి కింకనెన్నో విషయములు గోచరింపచెను. వాణి నాయాసందర్భములలో సక్రమముగా వివరింతును.