ప్రజ్ఞా ప్రభాకరము/చేకూడుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

౨౬

చేకూడుట

మరల సంజవేళ కక్కడివారు శిష్యులు పలువురు విచ్చేసిరి. భగవద్ఘట్ట మను పేరి కావేరీతీరఘట్టముననే శ్రీ వారి సన్ని వేశమున కెదురుగా వెలయుచున్న యోగ శాలలో ఎల్లరును గూడి యోగసాధన చేయుట జరగుచుండెను. చాలగా వాచి యున్న నా చేయి నాఁటి సంజ ప్రార్ధనమున నెంతో చక్క బడెను. వాపు తీపు తగ్గెను. నాలో లోలోపల నెక్కడో చిఱువెల్గు గోచరించు న్నట్టును స్వప్న ప్రాయముగా లీలగాఁ గొంత గోచరింపఁ దొడగెను. శరీరము బ్యాటరీ పెట్టి నరముల నెల్ల నూగించి వేసినట్టు గొప్ప యూపు కలిగెను. చేతులు వాని యంతట నవియే లేచి నమస్కరించెను. కాని కుడిచేత నింకను బాధ గోచరించుచుండెను. టక్కు టక్కు మని జబ్బు యెముక యదురు తెలియుచుండెను.

శరీరము నింత తీవ్రసంచలన మేమిటి? ఇది యెక్కడ నుండి యారంభమై జరగుచున్నది? ఇంతదాఁక నెన్ని శ్లోకములో, ఎన్ని మంత్రములో, ఎన్ని ధ్యానములో, ఎన్ని క్షేత్రములో, ఎన్ని దేవతాదర్శనములో, ఎందఱ యాశ్రాయ ములో జరపితిని గాని యిట్టి విశేష మెక్కడ గాని యెప్పుడు గాని జరగుట యెఱుఁగ నైతినే! ఒకతూరి ప్రార్ధన మాత్రముచే నింత జరగుట యేమిది? అస్తినాస్తి విచికిత్సా స్పదముగా నున్న పరతత్వము అస్తి యని స్పష్టముగా ననుభవింప నగు చున్నట్లున్నదే? దీని లోఁ తేదో తెలిసికొనవలెను గదా! త్రోవ దొరకినది గదా! నా ప్రార్ధనమును లోన నెవరో వినుచున్నట్టు_ సమాధానము చెప్పుచున్నట్టు_అనుగ్రహించు చున్నట్టు అగుచున్న దేమి వింత? నా జబ్బు నాకు చాలా ఉపకారమే చేసెనా యేమి! ఇక నా జబ్బు కుదిరినట్టే తోఁచు చున్నదే! ఏమి యానందము! ఏమియు లేకున్నచో నాచేయి యింత వాచుటేమి? నావశము తప్పి చేతులు లేచి నమస్కరించు టేమి? చే కూడుట యేమి? 'చేకూడుట' అన్నపదము కల్పించినవా రెవరు? ఈ రెండు చేతులు లేచి కలసి నమస్కరించుటను సూచించునదిగా నేర్పడినదా యేమి చేకూడు, కైకూడు పదకల్పనము? నే నారోగ్యవంతుఁడ నగుచో మా వారెంత సంతోషింతురు! మావారి నందఱను నిందుఁ జేర్పఁ గల్లుదునా యేమి? ఇత్యాది భావము లాధ్యానసమయమున మెఱపులు మెఱసినట్లు నాలోఁ జెలరేగ సాగెను. ఆనాఁటిస్థితి నా కొక జన్మ మబ్బిన ట్టుండెను. ధ్యానావసాన సమయమున నాయుత్సాహ మక్కడి మిత్రులకుఁ దెలిపితిని. అక్కడివారు వారి వారి యనుభూతి విశేషములఁ గొన్నింటిఁ జెప్పిరి.

--- ---