ప్రజ్ఞా ప్రభాకరము/ఆవేదన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

౧౮

ఆవేదన

రెండు మూఁడు నెల లింటికడ నుండి నేను మాతమ్ములతో మద్రాసు చేరితిని. కొన్నాళ్ళు మా బావగారింటను, గొన్నాళ్ళు హోటలులోను భుజించుచుంటిమి. ఇంటికి వెళ్లి ఇల్లాలిని వెంటగొని వచ్చితిని. అంతకు పూర్వము నేను చెందిన వెఱపు మఱపునఁ బడెను. గార్హస్ధ్యముతో ప్రాచ్య లిఖితపుస్తకశాలగ్రంధపఠనీత్సాహముతో కాలము గడచుచుండెను. అప్పటికి చాటుపద్యములు చాలా చేర్చి "చాటు పద్యమణిమంజరి" యని పేర గ్రంధముగా సంధానింతిని. వానిని ముద్రించి ప్రకటించుటలో శ్రీ రెంటాల వెంకట సుబ్బారావు గారు నాకు చాలా సహాయము చేసిరి. వేయి రిప్లై కార్డుల మిఁ ద (కార్డు కాని వెల) నోటీసు, పుస్తక మాపేక్షించువారు వ్రాయుటకు పై అడ్రసులో పోస్టు చేయించిరి. వెంట వెంటనే వేయి పుస్తకములు నమ్ముడు పోయెను. ఇట్లు నేను పుస్తక వ్యాపారము చేయుదు నని దుఃఖించిన పుస్తక వ్యాపారు లున్నారు. దీని తర్వాత, ప్రబంధరత్నావళి, భాస నాటకములు, కొన్ని ప్రకటింపఁ బూనితిని. కానీ ఇవియెల్ల ' నీవు వ్యాపారము చేయాలనే? మా కిచ్చిన మే మమ్మి సోమ్మిత్తుము గదా' యని కోరు పుస్తక వ్యాపారులకు, అప్పటికి నేను మరల అనారోగ్యగ్రస్తుఁడ నగుట, తర్వాత దేశాటనము చేయవలసినవాఁడ నగుట యేర్పడడుటచే అమ్మి వేసితిని. ఆ పుస్తక విక్రయము వల్ల వచ్చు నా యతిచే సుఖముగానే జీవిత యాత్ర గడపు చుంటిని. తమ్ము లిర్వురలో ఒకరు స్టాన్లీ రాయపురం మెడికల్ స్కూలులోను, ఇంకొకరు ఆయుర్వేద కళాశాలలోను తర్వాత చదివిరి గాని యప్పటికి కెలెట్ హైస్కూలులో చదువుచు నా దగ్గఱనే ఉండిరి. సుఖముగా జీవయాత్ర సాగుచుండెను.

శ్రీ రామేశంగారికి నటేశన్ , రామయ్యగారు ఇత్యాది గ్రంధ విక్రేతలు మిత్రులు. వారు విక్రయమునకు తెప్పించు గ్రంధముల నన్నింటిని వారము చదివి యిచ్చుటకు వా రింటికి దెచ్చుకొని పుస్తకము లేమాత్రము చెడకుండ చదివి వారి లిచ్చి వేయుచుండెడివారు. ఆ గ్రంధవిషయముల గూర్చి మిత్రుల కందరికి తెలియజెప్పుచుండెడివారు. వారు గ్రంధములను జదువుట పుస్తక విక్రేతల కధికలాభాపాదక మగుచుండెడిది. వారి గ్రంధపఠనోత్సాహము నాకును జక్కిలిగింత గొల్పినది. లైబ్రరి నుండి ముద్రిత గ్రంధముల దెచ్చుకోనుచుండెడివాఁ డును. ఒకటే చదువు! అప్పటి నా వయస్సిరువాడియాఱు.

అప్పుడు తెలుఁ గు దేశమున పెక్కు చోట్ల కలరా వ్యాపించియున్నది. మద్రాసులోను కలరా ఉన్నది. బందరులో మా బావ గారి తల్లి కలరా వచ్చి మృతిచెందెను. మద్రాసు నుండి మా బావగారు, మా తోబుట్టువు ఆమెగారి యౌర్ధ్వ దైహికమునకు బందరు వెళ్ళిరి. వారు తిరిగివచ్చునప్పు డక్కడ నుండి కొన్ని మొక్కజొన్న కండెలు తెచ్చిరి. వారి రాక తెలిసి ఆఫీసు నుండి యింటికి వచ్చిన తర్వాత వారి యింటికి వెళ్ళి అక్కడి కష్ట సుఖములు విచారించి వచ్చితిని. వచ్చునప్పుడు మా వారీయఁ గా మొక్కజొన్న కండెలు తెచ్చితిని. రాత్రి మే మందఱము వానిని భుజించితిమి. నిద్రలో రాత్రి రెండు గంటల వేళ నాకు మెలఁ కువ, శరీరమంతా అలకడి. కలరా వ్యాధి కృమి ఆ మొక్కజొన్న కండెలతో అంటి వచ్చి నాలో చొచ్చినట్టు, నాకు కలరా వచ్చినట్టు బావన. బహిర్భూమికి వెళ్ళ వలసెను. రాత్రి గనుక నే నున్న చోటు (తిరువళిక్కేణి సాతానివీధి తుది మేడ) కొబ్బరి తోటలు గలది గనుక ఇల్లు విడిచి బైతికే వెళ్ళితిని. వట్టి గాలియే అమితముగా వెళ్ళెను, గాని విరేచనము కాలేదు. ఇంటికి వచ్చి యీజి చైరులో కూర్చుంటిని. ఒడలెల్ల కంపించిపోవు చుండెను. నాల్గు మూఁ డు గజముల దూరమున - బందరులో కలరాతో చనిపోయిన మా బావగారి తల్లిగారు అఱువది యేండ్ల వృద్ధ ధూమ్ర దుఃఖితాగ్రహ విష్టాననముతో ప్రత్యక్ష మగుచుండెను. చీకాకు కలిగెను.

అంతకు ముం దట్టి దుర్దర్శనము నే నెన్నఁడు నెఱుఁగను. నిద్ర రాక చీకాకుతోనే ఆ రాత్రి గడపితిని. ప్రొద్దుట శరీర మంతయు కీలుకీలు విఱిచినట్టు నొప్పి. పదిగంటల వేళ ఆఫీసుకు పోవలెను గాన భోజనము చేయబోయితిని. ఒక ముద్ద మ్రింగితినో లేదో ఒడలెల్ల అదరి చల్లబడి పోయి మృత్యు ముఖమున నున్నట్లయితిని. తమ్ములు స్కూలుకు వెళ్ళిరి. నేఁడు హైకోర్టు జడ్జిగా నున్న చింతకుంట రాఘవరావుగారు నేను నొక యింటనే యుంటిమి. డాక్టరు నారాయణస్వామి నాయని గారిని రాఘవ రావుగారే పిలుచుకొని వచ్చిరి. ఆయన పరీక్షించి విరేచనములకు మంది చ్చి జబ్బేమి లేదని వెడలి పోయెను.

అప్పటికేమొదటిమహాసంగ్రామ మారంభ మయి సాగుచున్నది. ఆ యుద్ధమున గూర్చి క్షోభ నాలో తీవ్రముగాస సాగుజొచ్చినది. నా యనారోగ్యము దుర్భరముగా నుండెను. డాక్టరు నంజుండరావుగారు మందిచ్చుచుండిరి. అట్లు నాల్గయిదురోజులు గడచిన తర్వాత నొకనాఁడు నా దేహ మెల్ల చిమ్మచీకట్లు క్రమ్ముచున్న ట్లయి ఒడలెల్ల ధారలుగా చెమటలు దిగజారి లోన నుండి తీవ్ర బలము, ప్రజ్ఞ పోగారు చున్నట్టయ్యెను. నంజుండరావుగారు నరములకు, గుండెకు బలము కలుగుటకు మందిచ్చు చున్నారు గాన దాని కార్యమది యనుకొంటిని. ఆనాఁడు తివ్రోత్సహముతో నుంటిని. నంజుండరావుగారు కొనాళ్ళు సెలవు పెట్టి స్వగ్రామమునఁ గొన్నాళ్లుండి రమ్మనిరి. నెల కాఁ బోలు సెలవు పెట్టితిని. ఇంటికి నే నొక్కఁ డనే పయనమయితిని. తమ్ములు, భార్య మద్రాసు లోనే యుండిరి.

బందరులో గురువర్యులగు శ్రీ వెంకట శాస్త్రి గారికి కాబోలు నేదో బంగారువస్తువు వారు సొమ్ము పంపగా చేయించుచుంటిని. దానిని తీసికొని వచ్చుటకై ఆఫీసునుండి సాయంకాల మా ఱుగంటల వేళ టౌనులోని కరిగితిని. చెన్నకేశవస్వామి గుడి ప్రాంతముల నున్నది యా సెట్టిగారి యిల్లు. నేను వెళ్ళి సొమ్మిచ్చి వస్తువులను దీసికొని. మీ సోదరుఁ డేడి యని యా సెట్టిగారి నడుగగా నేఁ టికి పదునై రోజుల క్రిందట ఆతఁడు శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయమునకు రాత్రి పదిగంటల వేళ వెళ్ళి యక్కడ పూజోత్స వాదులు దర్శించుచుండగా ఎమ్డెన్ గుండు దెబ్బ వినవచ్చెను. ఒక గుండలోని తునకు కన్యకాపర మేశ్వరి దేవాలయా వరణలో పడెను. దాని వెల్తురు చూచినతోడినే గుండె పగిలి నెత్తురు వాంతో చేసికొని చనిపోయెను. అని సవి స్తరముగా నా సెట్టిగారు చెప్పిరి.

అది వినఁ గానే నాకు మరల శరీర మెల్ల సదరిపోయి చల్లబడి మృత్యుకల్ప మయిన స్థితి కల్గెను. నా వికృతి నా సెట్టిగారి కెఱుఁగనీయక వెంటనే యటనుండి వెడలి గోవిందప్పనాతని వీధి మొగనే యొంటరిగా కాపుర మున్న శ్రీ పురాణం సూర్యనారాయణశాస్త్రి గారి తోడ్పాటు కై వారి యింటి కి వెళ్ళితిని. చాల నీరసించి యెట్లో చేరగల్గితిని. ఉదయము పది గంటలకు చేసిన భోజనము అంతకు ముం దాకలి కూడ తీవ్రముగా నుండెను. అప్పటికి హొటలు, కాఫీ వగైరాల యలవాటు నాకు లేదు. వడిగా ట్రాము మిద నన్నిల్లు చేర్పాగోరీతిని. ఆయన కాశీ విజయనగర నివాసాభ్యస్తమయిన 'భంగు'పాన పారాయణుఁడు. అది నూఱి త్రాగి కాని కదలఁజాల ననెను. అవస్థపడుచు గూర్చింటిని. భంగుతయారు చేసికొని త్రాగి నాతో బయలు దేరి నన్ను మా యింటికి చేర్చిరి. ఎమ్డెన్ గుండ్ల దెబ్బలు నాటికి పదిపదునైదునాళ్ళకు ముందు రాత్రి వేళ పారిస్ కార్నరులో తగులుట, ముందుగా ఎమ్డెన్ నౌకవారు మదరాసు నగరముప్తె తీవ్రమయిన టార్చిలైటు ప్రసరింపజేయుట నాయనారోగ్యారంభావస్ధలో నుండి యెఱుగజాల నయితిని, మర్నాడు రెల్ల జెప్ప కొనుట వింటిని. అంతదాక ఇండియానుండి కృత్రిమయత్నములతో యుద్దభటులను గొనిపోవుట, కసాయివారికి మేకల నర్పించినట్లు యుద్దభూమిలో వీరిని బలియిచ్చుట, దేశ దౌర్భాగ్యము వినిగూర్చి విచారమే కాని ఇండియాలోనే యుద్దవికృతులు గానవచ్చుట యెవ్వరు గాని ఊహింపని విషయము, యుద్దచింత నన్నల్ల కల్లోలములలో ముంచి వేసి నది, నాడు బాలయ్య సెట్టిగారి యింట ఫిరంగిగుండ్లముక్క లూరెల్ల బడుట దాని చూచి నిండు జివి యాకస్మికముగా చనిపోవుట వినప్తె యుద్దమున నిండుజివులు గుండు దెబ్బలు, ఈటే పోట్లు వాగ్తెరాలు తగిలినప్పుడు చెందు మరణయాతన నా దేహముననే గోచరించుచున్నట్టు తోపసాగినది. క్షణ క్షణమును నాకు మరణయతనయే, ప్రతిదేశలేశములోను, ప్రతికాలలేశములోను నాకు మృత్యుభయమే, చచ్చిన చావూ కాక బ్రదికిన బ్రదుకు కాక చావుబ్రతుకుల సందులో ఊగులాట యయ్యెను.

--- ---