Jump to content

పోతన తెలుగు భాగవతము/పంచమ స్కంధము (ప్రథమాశ్వాసము)/ప్రియవ్రతుని బ్రహ్మ దర్శనంబు

వికీసోర్స్ నుండి


తెభా-5.1-3-క.
"భూనాథుఁ డుత్తరాత్మజుఁ
డై పరీక్షిన్నరేంద్రుఁ భిమన్యు సుతుం
డానందమంది ఘన సు
జ్ఞానుండగు శుకునిఁ గాంచి రసతఁ బలికెన్.

టీక:- భూనాథుడు = రాజు {భూ నాథుడు - భూమికి భర్త, రాజు}; ఉత్తరాత్మజుడు = ఉత్తరయొక్క పుత్రుడు; ఐన = అయిన; పరీక్షిత్ = పరీక్షిత్తు అనెడి; నరేంద్రుడు = మహారాజు {నరేంద్రుడు - నరులలో ఇంద్రునివంటివాడు, మహారాజు}; అభిమన్య = అభిమన్యుని; సుతుండు = పుత్రుడు; ఆనందమున్ = సంతోషమును; అంది = పొంది; ఘన = గొప్ప; సు = మంచి; జ్ఞానుండు = జ్ఞానము గలవాడు; అగు = అయిన; శుకునిన్ = శుకుని; కాంచి = చూచి; సరసతన్ = మనోహరముగా; పలికెన్ = పలికెను.
భావము:- ఉత్తరాభిమన్యుల కుమారుడైన పరీక్షిన్నరేంద్రుడు మహాజ్ఞాని అయిన శుకమహర్షిని చూచి సంతోషంతో సరసంగా ఇలా అన్నాడు.

తెభా-5.1-4-వ.
"మునీంద్రా! పరమభాగవతుండు నాత్మారాముండునైన ప్రియవ్రతుండు గృహంబున నుండి యెట్లు రమించె? కర్మబంధంబు లయిన పరాభవంబులు గల గృహంబుల యందు ముక్తసంబంధు లైన పురుషులకు సంతోషంబు గానేర; దుత్తమశ్లోకుం డైన పుండరీకాక్షుని పాదచ్ఛాయం జేసి నిర్వృతచిత్తులైన మహాత్ములు కుటుంబంబునందు నిస్పృహత చేయుదురు; గానఁ బ్రియవ్రతునికి సంసారంబునందుఁ దగులంబు గలుగు టెట్లు? దారాగారసుతాదు లందుఁ దగులంబు గలుగ వానికి నెట్లు సిద్ధి గలుగు? శ్రీహరియం దస్ఖలితమతి యెట్లు గలుగు? నీ సంశయంబుఁ దేట పఱపు"మని పరీక్షిన్నరేంద్రు డడిగిన శుకయోగీంద్రుం డిట్లనియె.
టీక:- ముని = మునులలో; ఇంద్రా = ఇంద్రునివంటివాడ; పరమ = అత్యుత్తమ; భాగవతుండు = భాగవతానుయాయి; ఆత్మారాముండును = ఆత్మ యందే ఆనందము అనుభవించెడివాడు; ఐన = అయినప్పటికి; ప్రియవ్రతుండు = ప్రియవ్రతుడు; గృహంబునన్ = నివాసము; నుండి = నుండి; ఎట్లు = ఏ విధముగ; రమించె = అనుభవించెను; కర్మ = కర్మలవలని; బంధంబుల్ = బంధములు; అయిన = అయినట్టి; పరాభవంబులు = అవమానములు; కల = కలిగిన; గృహంబుల్ = నివాసముల; అందున్ = లో; ముక్త = వదలివేసిన; సంబంధులు = బంధములు కలిగి ఉండెడివారు; ఐన = అయిన; పురుషుల్ = మానవుల; కున్ = కు; సంతోషంబున్ = సంతోషము; కానేరదు = కలుగుట అసాధ్యము; ఉత్తమశ్లోకుండు = హరి {ఉత్తమ శ్లోకుండు - ఉత్తములచేత శ్లోకుండు (స్తుతింపబడువాడు), విష్ణువు}; ఐన = అయిన; పుండరీకాక్షునిన్ = హరిని {పుండరీ కాక్షుడు - పుండరీకములు (పద్మములు) వంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; పాద = పాదముల యొక్క; ఛాయన్ = నీడ; చేసి = వలన; నిర్వృత = ఊరట చెందిన; చిత్తులు = మనసు గలవారు; ఐన = అయిన; మహాత్ములు = గొప్పవారు; కుటుంబంబున్ = కుటుంబము; అందున్ = ఎడల; నిస్పృహత = కోరిక లేకుండుటను; చేయుదురు = కలిగి ఉంటారు, అవలంబింతురు; కానన్ = కనుక; ప్రియవ్రతున్ = ప్రియవ్రతుని; కిన్ = కి; సంసారంబున్ = సంసారము; అందున్ = ఎడల; తగులంబున్ = లాలస; కలుగుటన్ = కలుగుట; ఎట్లు = ఏ విధముగ అగును; దార = భార్య; ఆగార = ఇల్లు; సుత = బిడ్డలు; ఆదులు = మొదలగువాని; అందున్ = ఎడల; తగులంబున్ = లాలస; కలుగన్ = కలుగగా; వాని = వాని; కిన్ = కి; ఎట్లు = ఏ విధముగ; సిద్ధి = సిద్ధి; కలుగు = కలుగును; శ్రీహరి = విష్ణుని; అందు = అందు; అస్ఖలిత = చెదరని; మతి = బుద్ధి; ఎట్లు = ఏ విధముగ; కలుగున్ = కలుగును; ఈ = ఈ; సంశయంబున్ = అనుమానమును; తేటపఱుపుము = తీర్చుము; అని = అని; పరీక్షిత్ = పరీక్షిత్తు అనెడి; నరేంద్రుడు = మహారాజు; అడిగినన్ = అడుగగా; శుక = శుకుడు అనియెడి; యోగి = యోగులలో; ఇంద్రుడున్ = ఇంద్రునివంటివాడ; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; =
భావము:- “మునీంద్రా! పరమభాగవతుడు, ఆత్మారాముడు అయిన ప్రియవ్రతుడు గృహస్థాశ్రమంలో ఉండి ఎలా సుఖాలను అనుభవించాడు? కర్మబంధాలై అవమానాలకు నెలవైన గృహస్థాశ్రమం, బంధాలు త్రెంచుకున్న మానవులకు సంతోషాన్నివ్వదు. ఉత్తములు కీర్తించే విష్ణుదేవుని అడుగుజాడలలో పయనిస్తూ చిత్తశాంతిని పొందినవారు కుటుంబ జీవితం పట్ల అనాసక్తులుగా ఉంటారు. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అంటే మమకారం పెంచుకున్నవానికి మోక్షసిద్ధి ఎలా కలుగుతుంది? శ్రీహరిమీద ఎలా గురి కుదురుతుంది? ఈ సందేహాన్ని తీర్చు స్వామీ!” అని పరీక్షిత్తు ప్రశ్నించగా శుకమహర్షి ఇలా అన్నాడు.

తెభా-5.1-5-క.
"హరి చరణాంబుజ మకరం
సావేశిత మనః ప్రధానుండగు స
త్పురుషుఁ డొకవేళ విఘ్నముఁ
బొసినఁ దన పూర్వ మార్గమును విడువఁ డిలన్

టీక:- హరి = విష్ణుమూర్తి; చరణ = పాదములు యనెడి; అంబుజ = పద్మముల; మకరంద = మకరందపు; రస = రుచి; ఆవేశిత = ఆవేశించిన; మనః = మనసే; ప్రధానుండు = ముఖ్యముగా కలవాడు; అగు = అయిన; సత్ = మంచి; పురుషుడు = మానవుడు; ఒకవేళ = ఏ కారణముచేతనైన; విఘ్నమున్ = ఆటంకమును; పొరసినన్ = పొందినను; తన = తన యొక్క; పూర్వ = మొదటి; మార్గమును = మార్గమును; విడువడు = వదలడు; ఇలన్ = భూమిపైన.
భావము:- “విష్ణుమూర్తి పాదపద్మాల మకరంద రసపానంలో లీనమై పరవశించిన మనస్సు కలిగిన మంచి మనుష్యుడు ఒకవేళ ఆటంకాలు అడ్డు తగిలినా తన పూర్వ మార్గాన్ని వదలి పెట్టడు.

తెభా-5.1-6-క.
ణీవల్లభ! విను మా
వరుఁడు ప్రియవ్రతుండు నారదముని స
చ్చణోపసేవఁ జెందుచు
రుదుగ నధ్యాత్మ సత్రయాగంబందున్.

టీక:- ధరణీవల్లభ = రాజా {ధరణీవల్లభుడు - ధరణీ (భూమికి) వల్లభుడు (భర్త), రాజు}; వినుమా = వినుము; నరవరుడు = రాజు {నరవరుడు - నరులకు వరుడు (భర్త), రాజు}; ప్రియవ్రతుండు = ప్రియవ్రతుడు; నారద = నారదుడు యనెడి; ముని = ముని; సత్ = సత్యమైన; చరణ = పాదముల; సేవన్ = సేవించుటను; చెందుచున్ = కలిగుండి; అరుదుగన్ = అపూర్వముగా; అధ్యాత్మ = ఆధ్యాత్మిక; సత్రయాగంబున్ = సత్రయాగము; అందున్ = లో.
భావము:- రాజా! పరీక్షిత్తు! విను. రాజైన ప్రియవ్రతుడు నారద మహర్షి పాదసేవ చేస్తూ ఒకసారి అధ్యాత్మ సత్త్రయాగం చేయడానికి సంకల్పించి…

తెభా-5.1-7-సీ.
దీక్షితుండై ధరిత్రీపాలనముఁ దండ్రి-
నిచిన సుజ్ఞాన భంగ మనుచు
నంగీకరింపమి నంతయుఁ దెలిసి ప-
ద్మాసనుఁ డతనికి తుల రాజ్య
మందుల మిక్కిలి యాసక్తిఁ బుట్టింతు-
నుచును దన చిత్తమందుఁ దలఁచి
తారకాపరివృతతారాధిపుని మాడ్కి-
శ్రుతులతోఁ గూడి యచ్యుత విభూతి

తెభా-5.1-7.1-తే.
హంసవాహనుఁ డగుచు నింద్రాదు లెల్లఁ
దిసి సేవింప బ్రహ్మలోమున నుండి
న్మునీంద్రులు దన్నుఁ బ్రశంసచేయ
ల్లనల్లన యుడువీథి రుగు దెంచె.

టీక:- దీక్షితుండు = దీక్షవహించినవాడు; ఐ = అయ్యి; ధరిత్రీ = భూమిని; పాలనమున్ = పాలించుటయందు; తండ్రి = జనకుడు; పనిచిన = నియమించగా; సు = మంచి; జ్ఞాన = విజ్ఞానమునకు; భంగము = అడ్డగించును; అనుచున్ = అనుచూ; అంగీకరింపమి = ఒప్పుకొనకపోవుటచే; అంతయున్ = సమస్తమును; తెలిసి = తెలిసికొని; పద్మాసనుడు = బ్రహ్మదేవుడు {పద్మాసనుడు - పద్మము ఆసనముగాగలవాడు, బ్రహ్మ}; అతని = అతని; కిన్ = కి; అతుల = సాటిలేని; రాజ్యము = రాజ్యము; అందులన్ = ఎడల; మిక్కిలి = అధికమైన; ఆసక్తిన్ = ఆసక్తిని; పుట్టింతున్ = కలిగించెదను; అనుచున్ = అనుచూ; తన = తనయొక్క; చిత్తము = మనసు; అందున్ = లో; తలచి = భావించి; తారకా = తారలచే; పరివృత = చుట్టబడిన; తారాధిపుని = చంద్రుని {తారాధిపుడు - తారకలకు అధిపుడు (ప్రభువు), చంద్రుడు}; మాడ్కిన్ = వలె; శ్రుతుల్ = వేదముల; తోన్ = తోటి; కూడి = కలసి; అచ్యుత = విష్ణుమూర్తిచే ప్రసాదించబడిన; విభూతిన్ = వైభవముకలిగి.
హంస = హంసను; వాహనుడు = వాహనముగా కలవాడు; అగుచున్ = అగుచూ; ఇంద్ర = ఇంద్రుడు; ఆదులు = మొదలగువారు; ఎల్లన్ = అందరు; కదిసి = చేరి; సేవింపన్ = స్తుతించుచుండగా; బ్రహ్మలోకమునన్ = బ్రహ్మలోకము; నుండి = నుండి; సత్ = సత్యమైన; ముని = మునులలో; ఇంద్రులు = ఇంద్రునివంటివారు; తన్నున్ = తనను; ప్రశంస = కీర్తించుట; చేయన్ = చేస్తుండగా; అల్లనల్లనన్ = మెల్లగా; ఉడు = ఆకాశ; వీథిన్ = మార్గమున; అరుగుదెంచెన్ = వచ్చెను.
భావము:- (ప్రియవ్రతుడు సత్త్రయాగానికి) దీక్ష వహించగా రాజ్యపాలనను చేపట్టవలసిందిగా తండ్రి ఆజ్ఞాపించినా అది తన జ్ఞానానికి ఆటంకమని భావించి అంగీకరించలేదు. ఇదంతా తెలుసుకున్న బ్రహ్మదేవుడు ప్రియవ్రతునికి రాజ్యపాలన పట్ల ఆసక్తిని కలిగించడానికి సంకల్పించి, ఇంద్రాదులు తనను సేవిస్తుండగా, సన్మునీంద్రులు సన్నుతిస్తుండగా, చుక్కలతో కూడిన చంద్రునిలాగా వేదాలతో కూడి వెలిగిపోతూ, హంస వాహన మెక్కి సత్యలోకంనుండి మెల్లమెల్లగా తారాపథంలో బయలుదేరి వచ్చాడు.

తెభా-5.1-8-వ.
మఱియు నయ్యై మార్గంబుల యందు సిద్ధ సాధ్య గంధర్వ చారణ గరుడ కింపురుషు లిరుదెసల స్తోత్రంబులు చేయుచుండ గంధమాదనద్రోణులం బ్రకాశంబు నొందించుచు జనుదెంచిన పద్మాసనునకు నారదుండు స్వాయంభువ ప్రియవ్రతులతోఁ గూడి ముకుళిత కరకమలుండై యెదురు చనుదెంచి సంస్తుతి స్తబకంబులం బూజించిరి; విరించి సంతసించి ప్రియవ్రతునిం జూచి నవ్వుచు నిట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకను; అయ్యై = ఆయా; మార్గంబుల = దారులలో; అందున్ = లో; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; గంధర్వ = గంధర్వులు; చారణ = చారణులు; గరుడ = గరుడులు; కింపురుష = కింపురుషులు; ఇరుదెసలన్ = రెండుప్రక్కల; స్తోత్రంబులున్ = కీర్తించుట; చేయుచుండన్ = చేయుచుండగా; గంధమాదన = గంధమాదనము యనెడి; ద్రోణులన్ = పర్వతశ్రేణులకు; ప్రకాశంబున్ = కాంతి; ఒందించుచున్ = పొందించుచు; చనుదెంచిన = వచ్చిన; పద్మాసనుడు = బ్రహ్మదేవుని {పద్మాసనుడు - పద్మము ఆసనముగా గలవాడు, బ్రహ్మ}; కున్ = కి; నారదుండు = నారదుడు; స్వాయంభువ = స్వాయంభువుడు; ప్రియవ్రతుల = ప్రియవ్రతులు; తోన్ = తోటి; కూడి = కలిసి; ముకుళిత = మోడ్చిన; కర = చేతులు యనెడి; కమలుండు = పద్మములు కలవాడు; ఐ = అయ్యి; ఎదురు = ఎదురు; చనుదెంచి = వచ్చి; సంస్తుతి = స్తుతించుట; స్తబకంబులన్ = స్తోత్రములతో; పూజించిరి = పూజచేసిరి; విరించి = బ్రహ్మదేవుడు; సంతసించి = సంతోషించి; ప్రియవ్రతునిన్ = ప్రియవ్రతుని; చూచి = చూసి; నవ్వుచున్ = నవ్వుతూ; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = అనియె.
భావము:- ఇంకా ఆయా దారుల కిరువైపులా నిల్చి సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, చారణులు, గరుడులు, కింపురుషులు స్తుతిస్తూ ఉండగా, గంధమాదన పర్వతం చరియలను ప్రకాశింపజేస్తూ బ్రహ్మదేవుడు వస్తూ ఉండగా చూసి నారదుడు స్వాయంభువ ప్రియవ్రతులతో పాటు చేతులు జోడిస్తూ ఎదురేగి స్తుతులనే పూలగుత్తులతో పూజించాడు. బ్రహ్మ సంతోషించి ప్రియవ్రతుణ్ణి చూసి నవ్వుతూ ఇలా అన్నాడు.

తెభా-5.1-9-క.
"హరి నా ముఖమున నీకును
మెఱిఁగింపంగఁ బనిచెఁ గావున నిదె సు
స్థి మతి విను మంతయు శ్రీ
రి వాక్యముగా నెఱింగి వనీనాథా!

టీక:- హరి = నారాయణుడు; నా = నా యొక్క; ముఖమునన్ = నోటి ద్వారా; నీకునున్ = నీకు; కరమున్ = గట్టిగా; ఎఱిగింపంగన్ = తెలుపుటకు; పనిచెన్ = నియమించెను; కావునన్ = కనుక; ఇదె = ఇదిగో; సుస్థిర = నిశ్ఛలమైన; మతిన్ = బుద్ధితో; వినుము = వినుము; అంతయున్ = అంతటిని; శ్రీహరి = విష్ణుమూర్తి యొక్క; వాక్యమున్ = మాటలు; కాన్ = అగునట్లు; ఎఱింగి = తెలిసికొని; అవనీనాథ = రాజా {అవనీనాథుడు - అవని (భూమికి) నాథుడు (ప్రభువు), రాజు}.
భావము:- “రాజా! విష్ణుమూర్తి నా నోటితో నీకు చెప్పమన్న విషయాన్ని చెప్తున్నాను. అందుచేత నా మాటలను శ్రీహరి మాటలుగానే భావించి నిశ్చలమైన మనస్సుతో విను.

తెభా-5.1-10-ఆ.
కోరి వేడ్క నీవు నాదుండును నేను
నందఱమును నీశ్వరాజ్ఞఁ బూని
యుడుగ కెపుడు జేయనున్నవారము గాన
తని యాజ్ఞఁ దప్ప లవి గాదు.

టీక:- కోరి = నిశ్చయించుకొని; వేడ్కన్ = ఆపేక్షతో; నీవున్ = నీవు; నారదుండునున్ = నారదుడు; నేనున్ = నేను; అందఱమునున్ = అందరము; ఈశ్వరున్ = భగవంతుని; ఆజ్ఞన్ = ఆజ్ఞను; పూని = పూని; ఉడుగుక = వదలక; ఎపుడున్ = ఎల్లప్పుడును; చేయనున్నవారము = చేసెడివారము; కాన = కనుక; అతని = అతని; ఆజ్ఞన్ = ఆజ్ఞను; తప్పన్ = దాటుటకు; అలవిగాదు = వీలుకాదు.
భావము:- నీవు, నారదుడు, నేను అందరం శ్రీహరి ఆజ్ఞను మీరక ప్రవర్తించే వాళ్ళమే. కనుక అతని ఆజ్ఞను తప్పరాదు.

తెభా-5.1-11-వ.
మఱియు శ్రీహరి యాజ్ఞను జీవుండు తపోవిద్యలను యోగ వీర్య జ్ఞానార్థ ధర్మంబులను దనచేత నొరులచేతం దప్పింప సమర్థుండు గాఁ; డుత్పత్తి స్థితి నాశంబులకు శోకమోహభయసుఖదుఃఖంబులకు నీశ్వరాధీనుండెకాని జీవుండు స్వతంత్రుండు గాఁడు; శ్రీహరి వాగ్రూపంబు లయిన శ్రుతులందు గుణత్రయం బను రజ్జువున బంధింపంబడిన యస్మదాదులము ముకుఁద్రాటిచేఁ బశువు మనుష్యులకు వశంబయిన చందంబున నీశ్వరాజ్ఞం బ్రవర్తించుచుందుము; నరుండు సుఖదుఃఖానుభవంబులకు నీశ్వరాధీనుండు; నేత్రంబులు గలవాని చేతఁ దివియంబడిన యంధుండును బోలె నీశ్వరుం డిచ్చిన సుఖదుఃఖంబు లనుభవించుచున్నవారము; స్వప్నంబునం గన్న పదార్థంబు మేల్కాంచి మిథ్యగాఁ దలంచిన చందంబున మోక్షార్థియైన సుజ్ఞానవంతుండు ప్రారబ్ధ సుఖదుఃఖంబు లనుభవించుచు దేహాంతరారంభ కర్మంబులం బాయనొల్లఁడు; వనవాసి యైనను జితేంద్రియుండు గాకుండెనేనిఁ గామాది సహితుం డగుటంజేసి సంసారబంధంబులు గలుగు; గృహస్థాశ్రమంబందును జితేంద్రియుండై యాత్మ జ్ఞానంబుగల పురుషునకు మోక్షంబు సిద్ధించు; శత్రువుల గెలువ నిశ్చయించిన పురుషుండు దుర్గం బాశ్రయించి శత్రువుల జయించిన మాడ్కిని మోక్షార్థి యగు నీవును గృహాశ్రయుండ వగుచు శ్రీనారాయణ చరణారవిందంబు లను దుర్గం బాశ్రయించి యరిషడ్వర్గంబు జయించి ముక్తసంగుండవై యీశ్వర కల్పితంబు లగు భోగంబు లననుభవించి ముక్తింజెందు; మనినఁ ప్రియవ్రతుండు త్రిభువన గురుండయిన చతురానను వాక్యంబు లవనతమస్తకుం డై బహుమాన పూర్వకంబుగ నంగీకరించె; నంత.
టీక:- మఱియున్ = ఇంకను; శ్రీహరి = నారాయణుని; ఆజ్ఞనున్ = ఆజ్ఞను; జీవుండు = మానవుడు; తపస్ = తపస్సు; విద్యలను = విద్యలను; యోగ = యోగము; వీర్య = వీరత్వము; జ్ఞాన = విజ్ఞానము; అర్థ = సంపదలు; ధర్మంబులనున్ = ధర్మములను; తన = తన; చేతన్ = చేత; ఒరుల్ = ఇతరుల; చేతన్ = చేతను; తప్పింపన్ = తప్పించుటకు; సమర్థుండు = సామర్థ్యము గలవాడు; కాడు = కాడు; ఉత్పత్తి = సృష్టి; స్థితి = స్థితి; నాశంబుల్ = లయముల; కున్ = కు; శోక = విచారము; మోహ = మోహము; భయ = భయము; సుఖ = సుఖము; దుఃఖంబుల్ = దుఃఖములు; కున్ = కు; ఈశ్వర = భగవంతునిపైన; ఆధీనుండె = ఆధారపడువాడె; కాని = కాని; జీవుండు = మానవుడు; స్వతంత్రుండు = స్వాతంత్రము కలవాడు; కాడు = కాడు; శ్రీహరి = నారాయణుని; వాక్ = వాక్కుల, మాటల; రూపంబుల్ = రూపమున ఉండునవి; అయిన = అయినట్టి; శ్రుతులు = వేదములు; అందున్ = అందు; గుణత్రయంబున్ = త్రిగుణములు; అను = అనెడి; రజ్జువునన్ = తాడుతో; బంధింపబడిన = కట్టబడినట్టి; అస్మదాదులము = మావంటివారము; ముకుద్రాటి = ముకుతాడు, కళ్ళెము; చేతన్ = వలన; పశువు = గొడ్డు; మనుష్యుల్ = మానవుల; కున్ = కు; వశంబున్ = లొంగినది; అయిన = అయిన; చందంబునన్ = విధముగ; ఈశ్వర = భగవంతుని; ఆజ్ఞన్ = ఆజ్ఞను; వర్తించుచుందుము = అనుసరించి నడచెదము; నరుండు = మానవుడు; సుఖ = సుఖముల; దుఃఖా = దుఃఖముల; అనుభవంబుల్ = అనుభవముల; కున్ = కి; ఈశ్వర = భగవంతునిపైన; ఆధీనుండు = ఆధారపడిన వాడు; నేత్రంబులున్ = కన్నులు, చూపు; కల = కలిగిన; వాని = వాని; చేతన్ = వలన; తివియంబడిన = తీసురొని వె
భావము:- ఇంకా శ్రీహరి ఆజ్ఞానుసారం జీవుడు తపస్సు చేయడం, విద్యలు నేర్చుకొనడం, యోగాన్ని అభ్యసించడం, శౌర్యాన్ని ప్రదర్శించడం, జ్ఞానాన్ని సంపాదించడం, ఆర్థిక వనరులను సమకూర్చుకొనడం, ధర్మం పాటించడం మొదలైన కర్మలు చేస్తాడు. ఈ కర్మాదులకు కర్త దేవుడే కాని జీవుడు కాడు. అటువంటప్పుడు వీటినుండి ఎవడైనా తప్పుకోవడం కాని, మరొకరిని తప్పించడం కాని శక్యం కాని పని. పుట్టడానికి కాని, చావడానికి కాని, భయానికి కాని, సుఖానికి కాని, దుఃఖానికి కాని ఈశ్వరుడే కర్త. జీవుడు కానే కాడు. శ్రీహరి వాక్కులే వేదాలు. మన మందరం సత్త్వరజస్తమో గుణాలనే ముప్పేటల త్రాటితో కట్టబడిన వాళ్ళం. ముకుతాడు వేసిన పశువులు యజమాని చెప్పు చేతలలో ఉండే విధగా మనం ఈశ్వరాజ్ఞకు లోబడి ఉంటాము. మానవుని సుఖ దుఃఖాలకు ఈశ్వరుడే కర్త. కళ్ళున్నవాడు గుడ్డివాణ్ణి ఎలా నడిపిస్తాడో అలాగే ఈశ్వరుడు మనలను నడిపిస్తాడు. అతనికి లోబడి, అతడు ప్రసాదించిన సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాము. కలలో చూచిన పదార్థాలను నిద్ర మేలుకొన్న తరువాత అబద్ధమని అనుకున్నట్లు ముక్తి కోసం ప్రయత్నించే జ్ఞాని తాను పొందవలసిన సుఖ దుఃఖాలను అనుభవిస్తూ రాబోయే కర్మఫలాలకు దూరంగా ఉంటాడు. అడవికి పోయినా ఇంద్రియ వ్యాపారాలను జయించలేక కామాదులకు లొంగిన వానికి సంసార బంధాలే మిగులుతాయి. గృహస్థాశ్రమంలో ఉన్నా ఇంద్రియాలను జయించి ఆత్మజ్ఞానం కలిగిన పురుషునికి మోక్షం తప్పక సిద్ధిస్తుంది. శత్రువులను గెలవడానికి సిద్ధమైనవాడు కోటలోనే ఉండి వారిని జయించినట్లుగా మోక్షం కోరే పురుషుడు గృహస్థాశ్రమంలో ఉంటూ శ్రీమన్నారాయణుని చరణారవిందాలనే కోటను ఆశ్రయించి కామక్రోధాది అరిషడ్వర్గాన్ని జయిస్తాడు. అలాగే నీవు కూడా ఈశ్వర కల్పితాలైన భోగాదులను అనుభవిస్తూ ముక్త సంగుడవై ముక్తిని దక్కించుకో” అన్నాడు. అప్పుడు ప్రియవ్రతుడు ముల్లోకాలకు గురువైన బ్రహ్మదేవుని వాక్యాలను తలవంచి గౌరవపూర్వకంగా అంగీకరించాడు. అప్పుడు…

తెభా-5.1-12-ఆ.
రసిజాసనుండు స్వాయంభువుని చేత
ధికమైన పూజలంది నార
దుండు నా ప్రియవ్రతుండును జూడంగఁ
నియెఁ దనదు పూర్వ దనమునకు.

టీక:- సరసిజాసనుండు = బ్రహ్మదేవుడు {సరసి జాసనుండు - సరసిజము (పద్మము) ఆసనుండు (ఆసనముగా గలవాడు), బ్రహ్మదేవుడు}; స్వాయంభువుని = స్వాయంభువుని; చేతన్ = చేత; అధికము = అధికము; ఐన = అయిన; పూజలున్ = సేవలను; అంది = పొంది; నారదుండున్ = నారదుడును; ఆ = ఆ; ప్రియవ్రతుండునున్ = ప్రియవ్రతుడు; చూడంగన్ = చూచుచుండగా; చనియెన్ = వెళ్ళెను; తనదు = తన యొక్క; పూర్వ = తొలి; సదనమున్ = నివాసమువ; కున్ = కు.
భావము:- బ్రహ్మ స్వాయంభువ మనువు శ్రద్ధాభక్తులతో చేసిన పూజ లందుకొని, ప్రియవ్రతుడు, నారదుడు చూస్తుండగా తన లోకానికి బయలుదేరాడు.

తెభా-5.1-13-ఆ.
త్యసంధుఁడైన స్వాయంభువుం డను
నువు బ్రహ్మచేత న్ననఁ దగ
నంది యంత నారదానుమతంబునఁ
దు సుతుని రాజ్యమును నిలిపె.

టీక:- సత్యసంధుఁడు = సత్యము నందు లగ్నమైనవాడు; ఐన = అయినట్టి; స్వాయంభువుండు = స్వాయంభువుడు; అను = అనెడి; మనువు = మనువు {మనువు - వైవస్వాది చతుర్దశ మనువు లందలివాడు}; బ్రహ్మ = బ్రహ్మదేవుని; చేతన్ = చేత; మన్ననన్ = గౌరవములను; తగన్ = మిక్కిలిగా; అంది = పొంది; అంతన్ = అంతట; నారద = నారదుని; అనుమతంబునన్ = అనుమతితో; తనదు = తమ యొక్క; సుతునిన్ = పుత్రుని; రాజ్యమునను = రాజ్య మందు; నిలిపెన్ = నియమించెను.
భావము:- సత్యసంధుడైన స్వాయంభువ మనువు బ్రహ్మ సంకల్పంతో నారదుని అనుమతితో తన కుమారుడైన ప్రియవ్రతునికి రాజ్యభారాన్ని అప్పగించాడు.

తెభా-5.1-14-వ.
ఇట్లు స్వాయంభువమనువు భూచక్ర పరిపాలనంబునకుఁ బ్రియ వ్రతునిఁ బట్టంబు గట్టి విషమంబులగు విషయంబుల వలన విముక్తుండై వనంబునకుం జనియె; నంత.
టీక:- ఇట్లు = ఈ విధముగ; స్వాయంభువ = స్వాయంభువుడు యనెడి; మనువు = మనువు; భూచక్ర = భూమండలమును; పరిపాలనంబున్ = పరిపాలించుట; కున్ = కు; ప్రియవ్రతునిన్ = ప్రియవ్రతుని; పట్టంబున్ = పట్టాభిషిక్తునిగా; కట్టి = నియమించి; విషమంబులున్ = దాటరానివి; అగు = అయిన; విషయంబుల్ = ఇంద్రియార్థ విషయముల; వలన = నుండి; విముక్తుండు = విడివడినవాడు; ఐ = అయ్యి; వనంబున్ = అడవుల; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అంత = అంతట.
భావము:- ఈ విధంగా స్వాయంభువ మనువు భూచక్రాన్ని పరిపాలించడానికి ప్రియవ్రతునికి పట్టాభిషేకం చేసి, దాటరాని ఇంద్రియార్థాల నుండి బయటపడి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అప్పుడు…

తెభా-5.1-15-మ.
ణీవల్లభుఁ డా ప్రియవ్రతుఁడు మోదం బందుచున్ లీల నీ
శ్వవాక్యంబునఁ గర్మతంత్ర పరుఁడై సంగంబులం బాపు శ్రీ
రిపాదాంబుజ చింతనం దగిలి నిత్యానందముం బొంది దు
ర్భ రాగాదులఁ బాఱఁదోలి ప్రజలం బాలించె నత్యున్నతిన్.

టీక:- ధరణీవల్లభుడు = రాజు {ధరణీవల్లభుడు - ధరణీ (భూమికి) వల్లభుడు (భర్త), రాజు}; ప్రియవ్రతుడు = ప్రియవ్రతుడు; మోదంబున్ = సంతోషమును; అందుచున్ = పొందుతూ; లీలన్ = లీలవలె; ఈశ్వర = భగవంతుని; వాక్యంబునన్ = ఆజ్ఞానుసారము; కర్మ = కర్మములను; తంత్ర = చేయుట యందు; పరుడు = లగ్నమైనవాడు; ఐ = అయ్యి; సంగంబులన్ = బంధనములను; బాపు = పోగొట్టెడి; శ్రీహరి = నారాయణుని; పాద = పాదములు యనెడి; అంబుజ = పద్మముల ఎడల; చింతనన్ = ధ్యానము నందు; తగిలి = లగ్నమై; నిత్య = శాశ్వతమైన; ఆనందమున్ = ఆనందమును; పొంది = పొంది; దుర్భర = భరింపరాని; రాగ = రాగము, లాలస; ఆదులన్ = మొదలగువానిని; పాఱదోలి = వదలివేసి; ప్రజలన్ = లోకులను; పాలించెన్ = పరిపాలించెను; అతి = మిక్కిలి; ఉన్నతిన్ = ఔన్నత్యముతో.
భావము:- రాజైన ప్రియవ్రతుడు భగవంతుని ఆదేశంతో కర్మతంత్రపరుడైనా శ్రీహరి పాదపద్మాలను స్మరిస్తూ, రాగద్వేషాలను వదలిపెట్టి అనుదినం నిత్యానందాన్ని అనుభవిస్తూ ప్రజలను గొప్పగా పరిపాలించాడు.