Jump to content

పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము/అవధూతసంభాషణ

వికీసోర్స్ నుండి

అవధూతసంభాషణ

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము)
రచయిత: పోతన


తెభా-11-92-ఉ.
పంజనాభుఁ డుద్ధవునిపైఁ గల కూర్మిని జెప్పె నొప్ప నెం
దంకిలి లేక యన్నిదిశలందుఁ జరించుచు నిత్యతృప్తుఁడై
శంరవేషధారి యొక సంయమి యా యదురాజుఁ జేర నే
వంనునుండి వచ్చి తన వానికి నిట్లనె నర్థి నేర్పడన్‌.

టీక:- పంకజనాభుడు = కృష్ణుడు {పంకజనాభుడు - పద్మము నాభియందు కలవాడు, విష్ణువు}; ఉద్దవుని = ఉద్దవుని; పైన్ = మీద; కల = ఉన్నట్టి; కూర్మిని = చెలిమిచేత; చెప్పెన్ = చెప్పను; ఒప్పన్ = చక్కగా; ఎందున్ = ఎక్కడ; అంకిలి = అడ్డు; లేక = లేకుండ; అన్ని = అన్ని; దిశలు = చోట్లకు; చరించుచున్ = తిరుగుతు; నిత్య = ఎల్లప్పుడు; తృప్తుడు = సంతృప్తిచెందినవాడు; ఐ = అయ్యి; శంకర = పరమశివుని; వేష = వేషమును; ధారి = ధరించినవాడు; ఒక = ఒకానొక; సంయమి = యోగి; ఆ = ఆ యొక్క; యదు = యదు; రాజున్ = రాజుని; చేరెన్ = దగ్గరకు వచ్చెను; ఏ = ఏ; వంక = వైపు; నుండి = నుండి; వచ్చితి = వచ్చావు; అని = అని; వాని = అతని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అర్థి = ఆసక్తి; ఏర్పడన్ = కనబడునట్లుగా.
భావము:- పద్మనాభుడు శ్రీకృష్ణుడు ఉద్ధవుని మీద కల ప్రేమతో ఇలా చెప్పాడు. “ఒకప్పుడు యదురాజు దగ్గరకు ఎక్కడినుండో శంకరవేషాన్ని ధరించిన ఒక యోగి వచ్చాడు. అతడు అడ్డులేక సకల దిక్కుల తిరిగుతుంటాడు. ఎప్పుడు సంతృప్తితో ఉంటాడు. యదురాజు ఆ యోగికి మర్యాదచేసి “ఎక్కడ నుండి వచ్చారు” అని ఆసక్తితో అడిగాడు.

తెభా-11-93-క.
ధూత వల్కె నంతటఁ
"బ్రవిమల విజ్ఞాన నిపుణ వ్యులు గురువుల్‌
విలిన నిరువదినలువురు
నిన్‌ విజ్ఞాని నైతి"ని పల్కుటయున్‌.

టీక:- అవధూత = అవధూత; పల్కెన్ = అనెను; అంతటన్ = అప్పుడు; ప్రవిమల = పరిశుద్ధమైన; విజ్ఞాన = మిక్కిలి జ్ఞానము; నిపుణ = నైపుణ్యముగల, నేర్పుగల; భవ్యుల్ = యోగ్యులు; గురువుల్ = గురువులు; తవిలినన్ = పూని; ఇరువదినలువురు = ఇరవైనాలుగుమంది (24); అవనిన్ = లోకమునందు; విజ్ఞానిన్ = మిక్కిలి జ్ఞానంగలవాడను; ఐతిని = అయ్యాను; అని = అని; పల్కుటయున్ = చెప్పగా.
భావము:- యోగి ఇలా అన్నాడు. “నిర్మలమైన విజ్ఞానంలో నిపుణులైన భవ్యులు ఇరవైనలుగురు నాకు గురువులు. వారివలన నేను విజ్ఞానిని అయినాను.” అని యోగి అనగా...

తెభా-11-94-వ.
అంత యదుప్రవరుండు “దేహి లోభమోహాదులవర్జించి జనార్దనుని నే విధంబునం జేరవచ్చు? నెఱింగింపు” మనిన నతం డిట్లనియె.
టీక:- అంత = అప్పుడు; యదు = యాదవ; ప్రవరుండు = వంశస్థుడు; దేహి = శరీరధారి; లోభ = లోభము; మోహ = మోహము; ఆదులన్ = మున్నగువానిని; వర్జించి = విడిచిపెట్టి; జనార్దనుని = నారాయణుని; ఏ = ఏ; విధంబునన్ = విధముగ; చేరవచ్చున్ = చేరగలము; ఎఱింగింపుమ = తెలుపుము; అనినన్ = అని అడుగగా; అతండు = అతను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- దానికి యదురాజు “శరీరధారి లోభం మోహం మొదలగు వాటిని వదలి ఏవిధంగా విష్ణువును చేరగలడు. తెలియజెప్పండి.” అంటే, అవధూత ఇలా అన్నాడు.

తెభా-11-95-సీ.
"రధన పరదార రదూషణాదులఁ-
రవస్తుచింతదాఁ రిహరించి
ముదిమిచే రోగము లుదయింప కటమున్న-
నువు చంచలతను గులకుండ
బుద్ధిసంచలతచేఁ బొదలక యట మున్న-
శ్లేష్మంబు గళమునఁ జేరకుండ
క్తియుక్తుల మది న్నగిల్లక మున్న-
క్తి భావనచేతఁ బ్రౌఢుఁ డగుచు

తెభా-11-95.1-తే.
దైత్యభంజను దివ్యపాదారవింద
జన నిజభక్తి భావనఁ బ్రాజ్ఞుఁ డగుచు
వ్యయానందమును బొందు నుదినంబు
తఁడు కర్మవిముక్తుఁడౌ నఘచరిత!

టీక:- పర = ఇతరుల; ధన = ధనమును కోరుట; పర = ఇతరుల; దార = భార్యను కోరుట; పర = ఇతరులను; దూషణ = నిందించుట; ఆదులన్ = మున్ననవానిని; పర = ఇతరుల; వస్తు = వస్తువులందు; చింతన్ = అపహరించ ఆలోచన; తాన్ = తను; పరిహరించి = వదలివేసి; ముదిమి = ముసలితనము; చేన్ = చేత; రోగములు = జబ్బులు; ఉదయింపకట = పుట్టక; మున్న = ముందే; తనువున్ = శరీరమున; చంచలతనున్ = వణుకుట; తగులకుండ = కలుగముందే; బుద్ధి = మనస్సు; సంచలతన్ = చెదరుట; చేన్ = చేత; పొదలక = పెరిగిపోవుటకు; అట = అంతకు; మున్న = ముందే; శ్లేష్మంబు = కఫము; గళమునన్ = గొంతులో; చేరకుండ = చేరకముందే; శక్తి = బలము; యుక్తుల = సామర్థ్యములందు; మది = బుద్ధి; సన్నగిలక = క్షీణించక; మున్న = ముందే; భక్తి = భక్తితోకూడిన; భావన = ఆలోచనల; చేతన్ = వలన; ప్రౌఢుడు = నైపుణ్యముకలవాడు; అగుచున్ = ఔతు.
దైత్యభంజనున్ = నారాయణుని {దైత్యభంజనుడు - రాక్షసులను సంహరించువాడు, విష్ణువు}; దివ్య = దివ్యమైన; పాద = పాదములు అను; అరవింద = పద్మముల; భజన = పూజించుట; నిజ = తన; భక్తి = భక్తిభావనలందు; ప్రాజ్ఞుడు = యుక్తాయుక్తవిచక్షణుడు; అగుచున్ = ఔతు; అవ్యయ = తరగని; ఆనందమును = ఆనందమును; పొందును = పొందుతాడు; అనుదినంబున్ = ఎల్లప్పుడు; అతడు = అట్టివాడు; కర్మవిముక్తుడు = మోక్షముపొందినవాడు; ఔను = అగును; అనఘచరిత్ర = పాపములేనివర్తనుడా.
భావము:- “ఓ సచ్చరిత్రా! విను. ఇతరులను నిందించకుండా, పరుల ధనాలను కాంతలను కోరకుండా, ఇతరుల వస్తువులు అపహరించే ఆలోచన లేకుండా జీవించాలి. ముసలితనం పైనపడి రోగాలు పుట్టక ముందే, శరీరంలో కంపం మొదలవక ముందే, బుద్ధి చంచలం కాక ముందే, గొంతులో శ్లేష్మం చేరక ముందే, శక్తియుక్తులు సన్నగిల్లక ముందే, ధృఢమైన భక్తిభావనతో దానవాంతకుని దివ్యమైన చరణపద్మాలను భజిస్తూ ఉండాలి. యుక్తాయుక్త జ్ఞానం కలిగి ఉండి, అవ్యయమైన ఆనందాన్ని అనుదినమూ పొందుతూ ఉండాలి. అట్టివాడు భవబంధ విముక్తుడు అవుతాడు.

తెభా-11-96-ఉ.
దాలయందుఁ, బుత్త్ర ధన ధాన్యము లందు ననేక భంగులం
గూరిమి సేయు మర్త్యుఁ డతి ఘోర వియోగజ దుఃఖమగ్నుఁడై
నేరుపు దక్కి, చిక్కువడి నీతి వివేక విహీనుడై మనో
భాముతోఁ గపోతపతి భంగి నిజంబుగ బోవు నష్టమై.

టీక:- దారల = భార్యల; అందున్ = ఎడల; పుత్ర = బిడ్డల; ధన = ధనముల; ధాన్యముల = సంపదల; అందున్ = ఎడల; అనేక = పెక్కు; భంగులన్ = విధములుగ; కూరిమి = మమత్వము; చేయు = చేసెడి; మర్త్యుడు = మానవుడు; అతి = మిక్కిలి; ఘోర = భయంకరమైన; వియోగ = ఎడబాటువలన; జ = పుట్టిన; దుఃఖ = దుఃఖమునందు; మగ్నుడు = మునిగినవాడు; ఐ = అయ్యి; నేరుపు = బయటపడు నేర్పు; తక్కి = లేకుండ; చిక్కుపడి = చిక్కుకుపోయి; నీతి = నీతి; వివేక = తెలివి; విహీనుడు = లేనివాడు; ఐ = అయ్యి; మనః = మనసునందు; భారము = భారము; తోన్ = తోటి; కపోతపతి = మగపావురము; భంగిన్ = వలె; నిజంబుగన్ = తథ్యముగ; పోవున్ = పోవును; నష్టము = నశించినవాడు; ఐ = అయ్యి.
భావము:- భార్యాబిడ్డలపై, ధనధాన్యములపై అతి మోహం పెంచుకునే మానవుడు, భయంకరమైన వియోగ దుఃఖాలలో కొట్టుమిట్టాడతాడు. ఏమి చేయాలో తెలియని స్థితికి చేరతాడు. ఆ బంధాలలో చిక్కుకుపోయి నీతి, వివేకాలు కోల్పోతాడు. ఆఖరికి కథలోని కపోతము వలె మనోవ్యథతో తప్పక నష్టపోతాడు.

తెభా-11-97-వ.
ఇందుల కొక్క యితిహాసంబు గలదు; మహారణ్యంబున నొక్క కపోతంబు దారసమేతంగా నొక్క నికేతనంబు నిర్మించి యన్యోన్య మోహాతిరేకంబునఁ గొంతకాలంబునకు సంతానసమృద్ధిగలదియై యపరిమితంబు లయిన పిల్లలు దిరుగాడుచుండఁ గొన్ని మాసంబులు భోగానుభవంబునం బొరలుచుండఁ గాలవశంబున నొక్క లుబ్ధకుం డురు లొడ్డిన నందు దారాపత్యంబులు దగులువడిన ధైర్యంబు వదలి మోహాతిరేకంబునం గపోతంబు కళత్ర పుత్త్ర స్నేహంబునం దాను నందుఁజొచ్చి యధికచింతాభరంబునం గృశీభూతంబయ్యెఁ; గావున నతితీవ్రంబయిన మోహంబు గొఱగా దట్లు గాన నిరంతర హరిధ్యానపరుండై భూమి పవన గగన జల కృపీట భవ సోమ సూర్య కపోత తిలిప్స జలధి శలభ ద్విరేఫ గజ మధు మక్షికా హరిణ పాఠీన పింగళా కురర డింభక కుమారికా శరకృ త్సర్ప లూతా సుపేశకృత్సముదయంబులు మొదలుగాఁ గలవాని గుణగణంబు లెఱింగికొని యోగీంద్రులు మెలంగుదు; ”రనిన.
టీక:- ఇందుల = దీనికి; ఒక్క = ఒకానొక; ఇతిహాసము = జరిగినకథ; కలదు = ఉన్నది; మహా = ఒకానొక గొప్ప; అరణ్యంబునన్ = అడవిలో; ఒక్క = ఒకానొక; కపోతంబు = పావురము; దార = పెంటితో; సమేతంగా = కూడినదిగా; ఒక్క = ఒకానొక; నికేతనంబు = నివాసమును; నిర్మించి = ఏర్పరచుకొని; అన్యోన్య = ఒకరిమీదొకరికి కల; మోహా = వ్యామోహము యొక్క; అతిరేకంబునన్ = అతిశయముతో; కొంత = కొన్ని; కాలంబున్ = దినముల; కున్ = కు; సంతాన = పిల్లలు; సమృద్ధి = నిండుగా; కలది = పొందినది; ఐ = అయ్యి; అపరిమితంబులు = అనేకములైనవి; అయిన = ఐన; పిల్లలు = పిల్లలు; తిరుగాడుచుండన్ = అటునిటు తిరుగుతుండగ; కొన్ని = కొన్ని; మాసంబులు = నెలలు; భోగ = భోగములను; అనుభవంబునన్ = అనుభవించుటలో; పొరలుచుండగ = గడపుతుండగా; కాలవశంబునన్ = కాలప్రభావముచేత; ఒక్క = ఒకానొక; లుబ్దకుండు = బోయవాడు; ఉరులు = వల; ఒడ్డినన్ = వేయగా; అందున్ = దానిలో; దారా = భార్య, పెంటి; అపత్యంబులు = పిల్లలు; తగులుపడినన్ = తగుల్కొనగా; ధైర్యంబు = స్థైర్యము; వదలి = సడలి; మోహ = మోహము; అతిరేకంబునన్ = అతిశయముతో; కపోతంబు = పావురము; కళత్ర = భార్య; పుత్ర = సంతానములమీది; స్నేహంబునన్ = చెలిమిచేత; తానున్ = తనుకూడ; అందున్ = దానిలో; చొచ్చి = దూరి; అధిక = మిక్కిలి; చింతా = విచారపు; భరంబునన్ = దుఃఖమునందు; కృశీభూతంబు = చిక్కిపోయినది; అయ్యెన్ = అయినది; కావునన్ = కనుక; అతి = మిక్కిలి; తీవ్రంబు = గాఢము; అయిన = ఐన; మోహంబు = వ్యామోహము; కొఱ = మేలు; కాదు = కాదు; అట్లు = ఆ విధముగ; కాన = అగుటచేత; నిరంతర = ఎల్లప్పుడు; హరి = విష్ణు; ధ్యాన = భక్తి; పరుండు = ఆసక్తి కలవాడు; ఐ = అయ్యి; భూమి = భూమి; పవన = గాలి; గగన = ఆకాశము; జల = నీరు; కృపీటభవ = అగ్ని {కృపీటభవము - కృపీట (ఉదకమున) భవము (పుట్టినది), అగ్ని}; సోమ = చంద్రుడు; సూర్య = సూర్యుడు; కపోత = పావురము; తిలిప్స = కొండచిలువ; జలధి = సముద్రము; శలభ = మిడుత; ద్విరేఫ = తుమ్మెద; గజ = ఏనుగు; మధు = తేనెటీగ; హరిణ = లేడి; పాఠీన = తాబేలు; పింగళా = ముంగీస; కురర = లకుముకిపిట్ట; డింభక = బాలుడు; కుమారికా = ఆడపిల్ల; శరకృత్ = విలుకాడు; సర్ప = పాము; లూతా = సాలీడు; సుపేశకృత్ = కందిరీగ; సముదయంబులు = సమూహములు; మొదలుగాకల = మొదలైన; వాని = వాటి; గుణ = గుణముల; గణంబులు = సమూహములు; ఎఱింగికొని = తెలిసికొని; యోగి = యోగులలో; ఇంద్రులు = ఉత్తములు; మెలంగుదురు = ప్రవర్తింతురు; అనినన్ = అనగా.
భావము:- దీనికి ఒక ఇతిహాసము ఉంది. చెప్తా విను. ఒక పెద్ద అడవిలో ఒక పావురం భార్యతో కలసి ఒక నివాసాన్ని ఏర్పరచుకుంది. ఆ కపోత దంపతులు ఒకరి మీద ఒకరు చాలా మోహంతో ఉండేవారు. కొంతకాలానికి వాటికి సమృద్ధిగా సంతానం కలిగింది. పిల్లలన్నీ అటుఇటూ తిరుగుతూ ఉంటే సంతోషంతో ఆ భోగానుభవంతో కొన్నినెలలు గడిచాయి. ఇలా ఉండగా, ఒకనాడు కాలవశాన ఒక బోయ వచ్చి వల వేశాడు. ఆ వలలో ఆడపావురము పిల్లలు చిక్కుకున్నాయి. మగపావురం ధైర్యం వదలి మోహంతో భార్యా బిడ్డలమీద స్నేహంతో తాను కూడా ఆ వలలో ప్రవేశించి విచారంతో కృశించి నశించి పోయింది. కాబట్టి, దేని యందు మరీ తీవ్రమయిన మోహం మంచిది కాదు.
అందుకనే యోగీంద్రులు ఎప్పుడు హరిధ్యానంపై ఆసక్తి కలిగి ఉంటారు. భూమి, గాలి, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురం, కొండచిలువ, సముద్రం, మిడుత, తుమ్మెద, ఏనుగు, తేనెటీగ, లేడి, తాబేలు, ముంగిస, లకుమికిపిట్ట, బాలుడు, బాలిక, బాణాలు చేసేవాడు, పాము, సాలీడు, కందిరీగ (ఇరవై నాలుగు) మొదలగు వాటి గుణగణాలు తెలుసుకుని మెలగుతూ ఉంటారు.”

తెభా-11-98-క.
వి తెలియవలయు నాకును
బ్రవిమలమతి వీనిఁ దెలియఁ లుకు మనంగాఁ
విరము వినుమని కృష్ణుఁడు
వినయుఁడగు నుద్ధవునికిఁ య్యనఁ జెప్పెన్‌.

టీక:- ఇవి = వీటిని; తెలియవలయు = తెలిసికొనవలెను; నా = నా; కును = కు; ప్రవిమల = నిర్మలమైన; మతిన్ = బుద్ధితో; వీనిన్ = వీటిని; తెలియన్ = తెలియ; పలుకుము = చెప్పుము; అనంగాన్ = అని అడుగగా; వివరముగన్ = వివరముగ; వినుము = వినుము; అని = అని అడుగగా; కృష్ణుడు = కృష్ణుడు; సవినయుడు = వినమ్రుడు; అగు = ఐన; ఉద్దవుని = ఉద్దవుని; కిన్ = కి; చయ్యన = చటుక్కున; చెప్పెన్ = చెప్పెను.
భావము:- ఇలా శ్రీకృష్ణుడు చెప్పగా, “ఇవి ఏమిటో తెలుసుకోవాలని ఉంది, నిర్మలమతితో వీటి గురించి తెలియచెప్పండి.” అని ఉద్ధవుడు అడిగాడు. అప్పుడు వినమ్రుడైన ఉద్ధవునితో శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు.

తెభా-11-99-వ.
ఇవ్విధంబున భూమివలన సైరణయు, గంధవహునివలన బంధురంబగు పరోపకారంబును, విష్ణుపదంబువలనఁ గాలసృష్ట గుణసాంగత్యంబు లేమియు, నుదకంబువలన నిత్యశుచిత్వంబును, నసితపథునివలన నిర్మలత్వంబును, నిశాకర ప్రభాకరుల వలన నధికాల్పసమత్వజీవ గ్రహణ మోక్షణంబులును, గపోతంబులవలనఁ గళత్ర పుత్ర స్నేహంబును, నజగరంబువలన స్వేచ్ఛా విహారసమాగతాహారంబును, వననిధివలన నుత్సాహ రోషంబులును, శలభంబువలన శక్త్యనుకూల కర్మాచరణంబును, భృంగంబువలన సారమాత్రగ్రహణ విశేషంబును, స్తంబేరమంబువలనం గాంతావైముఖ్యంబును, సరఘవలన సంగ్రహ గుణంబును, హరిణంబువలనం జింతాపరత్వంబును, జలచరంబువలన జిహ్వాచాపల్యంబును, బింగళవలన యథాలాభసంతుష్టియుఁ, గురరంబువలన మోహపరిత్యాగంబును, డింభకువలన విచారపరిత్యాగంబును, గుమారికవలన సంగత్యాగంబును, శరకారునివలనం దదేకనిష్ఠయు, దందశూకంబువలనం బరగృహవాసంబును, నూర్ణనాభివలన సంసారపరిత్యాగంబును, గణుందురువలన లక్ష్యగత జ్ఞానంబు విడువకుండుటయుననంగల వీని గుణంబు లెఱింగి మఱియుఁ గామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంబు లను నరిషడ్వర్గంబుల జయించి, జరామరణవిరహితంబుగా వాయువశంబు సేసి, గాత్రపవిత్రత్వంబుకొఱకు షట్కర్మ నిరతుండయి, పుర నగర గ్రామంబులు పరిత్యజించి పర్వతారణ్యంబుల సంచరించుచు, శరీర ధారణార్థంబు నియతస్వల్పభోజనుండై, ఖేద మోదంబులు సరియకా భావించి లోభమోహంబులు వర్జించి, నిర్జితేంద్రియుం డయి నన్నె కాని యొండెఱుంగక యాత్మ నిష్ఠచేఁ బవిత్రాంతఃకరణుండైన యోగి నాయందు గలయుం గావున.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగ; భూమి = భూమి; వలన = నుండి; సైరణ = సహనము; గంధవహుని = వాయువు {గంధవాహుడు - గంధమును వహించువాడు, వాయువు}; వలన = వల్ల; బంధురంబు = దట్టమైనది, ఒప్పినది; అగు = ఐన; పరోపకారంబును = పరోపకారము; విష్ణుపదంబు = ఆకాశము; వలన = వలన; కాల = కాలముచే; సృష్ట = సృష్టించబడిన; గుణ = గుణములతో; సాంగత్యంబు = కూడియుండుట; లేమియును = లేకపోవుట; ఉదకంబు = నీరు; వలన = వలన; నిత్య = ఎప్పుడు; శుచిత్వంబును = శుచిగా ఉండుట; అసితపథుని = అగ్ని; వలన = వలన; నిర్మలత్వంబును = నిర్మలంగా ఉండుట; నిశాకర = చంద్ర {నిశాకర - రాత్రిని కలుగజేయువాడు, చంద్రుడు}; ప్రభాకరుల = సూర్యుల {ప్రభాకరుడు - ప్రకాశము కలుగజేయువాడు, సూర్యుడు}; వలన = వలన; అధిక = అధికములందు; అల్ప = అల్పములందు; సమత్వ = సమభావముగల; జీవ = జీవితము; గ్రహణ = తీసుకొనుట; మోక్షణంబులును = విడుచుటలు; కపోతంబు = పావురము; వలన = వలన; కళత్ర = భార్యా; పుత్ర = సంతానములందలి; అస్నేహంబును = మిత్రత్వత్యాగమును; అజగరంబు = కొండచిలువ {అజగరము - మేకను మింగునది. కొండచిలువ}; వలన = వలన; స్వేచ్ఛా = ఇష్టానుసార; విహార = తిరుగుతు; సమాగత = లభించిన; ఆహారంబును = ఆహారాన్ని స్వీకరించుట; వననిధి = సముద్రము {వననిధి - వనము (నీటి)కి నిధివంటిది, సముద్రము}; వలన = వలన; ఉత్సాహ = ఉత్సాహము; రోషంబులును = రోషములు; శలభంబు = మిడుత; వలన = వలన; శక్తి = శక్తికి; అనుకూల = అనుకూలమైన; కర్మాచరణంబును = పనిచేయుట; భృంగంబు = తుమ్మెద {భృంగము - నీలిమను భరించునది, తుమ్మెద}; వలన = వలన; సార = సారము; మాత్ర = మాత్రమే; గ్రహణ = స్వీకరించెడి; విశేషంబును = నేర్పు; స్తంబేరమంబు = ఏనుగు {స్తంబేరము - స్తంబముల (పొదల) యందు రమించునది, ఏనుగు}; వలనన్ = వలన; కాంతా = స్త్రీల యెడ; వైముఖ్యంబును = విముఖత; సరఘ = తేనెటీగ; వలన = వలన; సంగ్రహణంబును = కూడబెట్టుటను; హరిణంబు = లేడి; వలన = వలన; చింతా = ఆలోచించుటలో; పరత్వంబును = నిమగ్నమగుటను; జలచరంబు = తాబేలు {జలచరంబు - నీటచరించునది, తాబేలు}; వలన = వలన; జిహ్వా = రుచుల యెడ; చాపల్యంబునున్ = చపలత్వము; పింగళ = ముంగిస; వలన = వలన; యథాలాభ = దొరికినదానితో; సంతుష్టియున్ = తృప్తిపడుట; కురరంబు = లకుముకిపిట్ట; వలన = వలన; మోహ = వ్యామోహమును; పరిత్యాగంబును = విడిచిపెట్టుట; డింభకు = బాలుని; వలన = వలన; విచార = సంతాపములను; పరిత్యాగంబును = వదలివేయుట; కుమారిక = బాలిక; వలన = వలన; సంగ = సంగమ; త్యాగంబును = విసర్జనము; శరకారుని = బాణాలు వేయువాని; వలనన్ = వలన; తదేకనిష్ఠయున్ = ఏకాగ్రత; దందశూకంబు = పాము {దందశూకము - కుత్సితమైన దంశనము (కరచుట) కలది, సర్పము}; వలన = వలన; పర = ఇతరుల; గృహ = నివాసములలో; వాసంబును = నివసించుట; ఊర్ణనాభి = సాలెపురుగు {ఊర్ణనాభి - బొడ్డున అరటినార వంటి దారము కలది, సాలెపురుగు}; వలన = వలన; సంసార = సంసారబంధాలలో; పరిత్యాగంబును = చిక్కుపడకుండుట; కణుందురు = కందిరీగ; వలన = వలన; లక్ష్యగత = లక్ష్యంపై గురి కలిగియుండు; జ్ఞానంబున్ = జ్ఞానమును; విడువకుండుటయున్ = వదలకుండుట; అనంగల = అనెడి; వీని = వీటి; గుణంబులున్ = గుణములను; ఎఱింగి = తెలిసికొని; మఱియున్ = ఇంకను; కామ = కామము; క్రోధ = క్రోధము; లోభ = లోభము; మోహ = మోహము; మద = మదము; మాత్సర్యంబులు = మాత్సర్యములు; అను = అనెడి; అరిషడ్వర్గంబులన్ = ఆరుశత్రువులను; జయించి = జయించి; జరా = ముసలితనము; మరణ = చావులు; విరహితంబుగా = దరిచేరకముందే; వాయువశంబు = ప్రాణాయామములు; చేసి = చేసికొని; గాత్ర = శరీరము యొక్క; పవిత్రంబు = పరిశుద్ధి; కొఱకు = కోసము; షట్కర్మ = షట్కర్మలందు {షట్కర్మలు - 1యజనము 2యాజనము 3అధ్యయనము 4అధ్యాపనము 5దానము 6ప్రతిగ్రహము అనెడి ఆరు రకముల పనులు}; నిరతుండు = ఆసక్తి కలవాడు; అయిన = ఐ; పుర = పురములు; నగర = పట్టణములు; గ్రామంబులు = ఊర్లు; పరిత్యజించి = వదలివేసి; పర్వత = పర్వతములు; అరణ్యంబులన్ = అడవులలోను; సంచరించుచు = తిరుగుతు; శరీర = దేహము; ధారణా = నిలుపుట; అర్థంబున్ = కోసము; నియత = నియమింపబడిన; స్వల్ప = కొద్దిపాటి; భోజనుండు = భోజనము చేసినవాడు; ఐ = అయ్యి; ఖేద = దుఃఖము; మోదంబులున్ = సంతోషములు; సరియ = సమానము; కాన్ = ఐనట్లు; భావించి = తలచి; లోభ = లోభము; మోహంబులున్ = మోహములను; వర్జించి = విడిటిపెట్టి; నిర్జిత = జయింపబడిన; ఇంద్రియుండు = ఇంద్రియములు కలవాడు; అయి = అయ్యి; నన్నె = నన్నుమాత్రమే; కాని = తప్పించి; ఒండు = మరొకటి; ఎఱుంగక = ఎరుగక; ఆత్మనిష్ఠ = ఆత్మయోగము; చేన్ = చేత; పవిత్ర = పవిత్రమైన; అంతఃకరణుండు = మనస్సు కలవాడు; ఐన = అయినట్టి; యోగి = యోగసాధకుడు; నా = నా; అందున్ = లోన; కలయున్ = లీనమగును; కావునన్ = కనుక.
భావము:- ఈ విధంగా, 1. భూమివలన సహనము; 2. వాయువువలన పరోపకారము; 3. ఆకాశమువలన కాలముచే సృష్టించబడిన గుణాలతో సాంగత్యం లేకపోవడం; 4 నీటివలన ఎప్పుడు శుచిగా ఉండటం; 5. అగ్నివలన నిర్మలంగా ఉండటం; 6. 7. చంద్ర, సూర్యులవలన సర్వసమత్వము; 8. పావురంవలన భార్యాబిడ్డల యందు స్నేహత్యాగము; 9. కొండచిలువవలన ఇష్టప్రకారం తిరుగుతూ అందిన ఆహారాన్ని మాత్రమే స్వీకరించటం; 10. సముద్రంవలన ఉత్సాహ రోషములు; 11. మిడుతవలన శక్తికి తగిన పనిచేయటము; 12. తుమ్మెదవలన సారమును మాత్రమే గ్రహించటం; 13. ఏనుగువలన స్త్రీ వైముఖ్యము; 14. తేనెటీగవలన సంగ్రహణము; 15. లేడివలన విచారపరత్వమ; 16. తాబేలువలన జిహ్వాచాపల్యము; 17. ముంగిసవలన దొరికిన దానితో తృప్తిపడటం; 18. లకుమికిపిట్టవలన మోహ పరిత్యాగము; 19. బాలునివలన విచార పరిత్యాగము; 20. బాలికవలన సంగ విసర్జనము; 21. బాణాలు చేసేవాని వలన ఏకాగ్రత; 22. పామువలన ఇతరుల ఇండ్ల యందు నివసించటం; 23. సాలెపురుగువలన సంసార బంధాలలో చిక్కుపడక ఉండటము; 24. కందిరీగవలన లక్ష్యజ్ఞానము విడువక ఉండుట; నేర్చుకోవాలి.
ఈ గుణాలు గ్రహించుకుని కామం, క్రోధం, లోభం, మోహం, మదం మాత్సర్యం, అనే అరిషడ్వర్గము (ఆరుగురు శత్రువులు) జయించాలి ముసలితనం రాకుండా చావు లేకుండా ప్రాణవాయువును వశం చేసుకోవాలి. శరీరము పవిత్రంగా ఉండడం కోసం యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహం అను వాటి మీద ఆసక్తి కలగి, పట్టణాలను గ్రామాలను నగరాలను వదలి కొండల యందు అడవులయందు తిరుగుతూ ఉండాలి. దేహం నిలవటానికి సరిపడ కొద్దిపాటి ఆహారం తీసుకుంటూ ఉండాలి. సంతోషం దుఃఖం రెంటినీ సమానంగా భావిస్తూ లోభాన్నీ మోహాన్నీ వదలాలి. ఇంద్రియాలను జయించాలి. నన్నే తప్ప మరొకటి ఎరుగక ఆత్మనిష్ఠతో పవిత్రమైన అంతఃకరణం కలిగి ఉండాలి. అట్టి యోగి నన్ను చేరగలుగుతాడు నా యందే కలుస్తాడు.

తెభా-11-100-క.
మోహితుఁడై వసుకాంక్షా
వాహినిలోఁ జిక్కి క్రూరశుఁడౌ మనుజుం
డూహాపోహ లెఱుంగక
దేము నలఁగంగఁ జేయు దీనత నెపుడున్‌.

టీక:- మోహితుడు = మోహమునకు వశుడు; ఐ = అయ్యి; వసు = సంపదలందు; కాంక్షా = వాంఛ అనెడి; వాహిని = ప్రవాహము; లోన్ = అందు; చిక్కి = చిక్కుకొని; క్రూర = క్రూరమైన భావాలకు; వశుడు = లొంగిపోయెడివాడు; ఔ = అగు; మనుజుండు = మానవుడు; ఊహ = లేనిది ఉన్నదనుకొనుట; అపోహ = ఉన్నదానిని మరొకటిగా భ్రమించుట, లేనిది ఉన్నట్లు భ్రమించుట; ఎఱుంగక = గుర్తించుకొనలేక; దేహమున్ = శరీరమును; నలగంగన్ = అలసిపోవునట్లు; చేయున్ = చేసికొనును; దీనతన్ = దీనత్వముతో; ఎపుడున్ = ఎల్లప్పుడు.
భావము:- మోహానికి వశుడై ధనవాంఛ అనే ప్రవాహంలో చిక్కుకున్నవాడు, క్రూరభావాలకు లొంగిపోయే వాడు అయిన మానవుడు ఊహాపోహలు తెలియక దీనుడై శరీరాన్ని సంకటాలు పడుతూ ఉంటాడు.

తెభా-11-101-వ.
ఇందులకుఁ బురాతన వృత్తాంతంబు గలదు; సావధానచిత్తుండవై వినుము; మిథిలా నగరంబునఁ బింగళ యను గణికారత్నంబు గలదు; దానివలనం గొంత పరిజ్ఞానంబుఁ గంటి? నదెట్లనిన నమ్మానిని ధనకాంక్ష జేసి యాత్మసఖుని మొఱంగి ధనం బిచ్చువానిం జేకొని నిజనికేతనాభ్యంతరంబునకుం గొనిచని రాత్రి నిద్రలేకుండుచుఁ బుటభేదన విపణిమార్గంబులఁ బర్యటనంబు సలుపుచు నిద్రాలస్య భావంబున జడనుపడి, యర్థాపేక్షం దగిలి తిరిగి యలసి, యాత్మ సుఖంబు సేయునతండె భర్త యని చింతించి నారాయణు నిట్లు చింతింప నతని కైవల్యంబు సేరవచ్చు నని విచారించి, నిజశయనస్థానాదికంబు వర్జించి వేగిరంబ వాసుదేవ చరణారవింద వందనాభిలాషిణియై దేహంబు విద్యుత్ప్రకారం బని చింతించి పరమతత్త్వంబు నందుఁ జిత్తంబు గీలుకొలిసి ముక్తురాలయ్యె నని యెఱింగించి.
టీక:- ఇందుల = దీని; కున్ = కి; పురాతన = ప్రాచీన; వృత్తాంతంబు = కథ; కలదు = ఉన్నది; సావధాన = శ్రద్ధగా ఉన్న; చిత్తుండవు = మనస్సుకలవాడవు; ఐ = అయ్యి; వినుము = వినుము; మిథిలానగరంబునన్ = మిథిలానగరములో; పింగళ = పింగళ; అను = అనెడి; గణికా = వేశ్యలలో; రత్నంబు = ఉత్తమురాలు; కలదు = ఉన్నది; దాని = ఆమె; వలనన్ = వలన; కొంత = కొంత; పరిజ్ఞానంబున్ = విజ్ఞానమును; కంటిన్ = పొందాను; అది = అది; ఎట్లు = ఎలా; అనినన్ = అంటే; ఆ = ఆ; మానిని = యువతి; ధన = డబ్బు మీది; కాంక్షన్ = వాంచ; చేసి = వలన; ఆత్మ = తన; సఖుని = ప్రియుణ్ణి; మొఱంగి = మోసపుచ్చి; ధనంబున్ = డబ్బులు; ఇచ్చు = ఇచ్చెడి; వానిన్ = వాడిని; చేకొని = మరిగి; నిజ = తన; నికేతన = ఇంటి; అభ్యంతరంబున్ = లోపలి; కున్ = కి; కొని = తీసుకొని; చని = వెళ్ళి; రాత్రి = రాత్రులందు; నిద్ర = నిద్ర; లేకుండుచు = పోకుండ; పుటభేదన = పట్టణపు; విపణి = వ్యాపార; మార్గంబులన్ = వీథులలో; పర్యటనంబు = తిరుగుట; సలుపుచున్ = చేస్తూ; నిద్రా = నిద్రకి; ఆలస్యభావంబునన్ = జాగుజరుగుటచేత; జడనుపడి = నీరసపడిపోయి; అర్థా = ధన; ఆపేక్షన్ = కాంక్షకు; తగిలి = తగుల్కొని; తిరిగి = తిరిగి తిరిగి; అలసి = అలసిపోయి; ఆత్మన్ = తనకు; సుఖంబు = సౌఖ్యములు; చేయున్ = చేసెడి; అతండె = అతనుమాత్రమే; భర్త = భర్త; అని = అని; చింతించి = ఆలోచించుకొని; నారాయణున్ = విష్ణుమూర్తిని; ఇట్లు = ఈ విధముగ; చింతింపన్ = స్మరించినచో; అతని = అతని; కైవల్యంబు = పరమపదమును; చేరవచ్చును = చెందవచ్చును; అని = అని; విచారించి = తర్కించుకొని; నిజ = తన; శయనస్థాన = పడకటిల్లు; ఆదికంబున్ = మొదలైనవాటిని; వర్జించి = విడిచిపెట్టి; వేగిరంబ = తొందరలోనే; వాసుదేవ = వాసుదేవుని; చరణ = పాదములనెడి; అరవింద = పద్మములకు; వందన = నమస్కరించవలెనని; అభిలాషిణి = కోరుకొనునామె; ఐ = అయ్యి; దేహంబు = శరీరము; విద్యుత్ = మెరుపు; ప్రకారంబు = వంటిది; అని = అని; చింతించి = తర్కించుకొని; పరమతత్త్వంబు = పరమాత్మ; అందున్ = అందు; కీలుకొలిపి = లగ్నముచేసి; ముక్తురాలు = మోక్షముపొందినామె; అయ్యెన్ = అయినది; అని = అని; ఎఱింగించి = తెలియజెప్పి.
భావము:- దీనికొక ప్రాచీన కథ ఉంది. శ్రద్ధగా విను. మిథిలానగరంలో పింగళ అనే వేశ్యామణి ఉంది. ఆమె వలన కొంత పరిజ్ఞానాన్ని పొందాను. ఎలాగ అంటే, ఆ వనిత డబ్బుమీది ఆశతో తన ప్రియుడిని మోసపుచ్చి ధనమిచ్చే మరొక విటుడిని మరిగింది. వాడిని తన ఇంటికి తీసుకువెళ్ళింది. వాడితో రాత్రిళ్ళు నిద్రలేకుండా ఊర్లమ్మట, వీధులమ్మట విహరించింది. నిద్ర లేకపోవటం వలన బాగా నీరసించింది. ధనకాంక్షతో తిరిగితిరిగి అలసిపోయింది. చివరకు ఆత్మసుఖం కలిగించేవాడే భర్త అని గ్రహించుకుంది. నారాయణుడిని కనుక ఇలా చింతిస్తే కైవల్యాన్ని చెందగలను కదా, అని విచారించింది. తన శయన గృహాన్ని, సమస్త సంపదలను త్యజించింది. వాసుదేవుడి పాదపద్మాలకు నమస్కరించి తరించాలనే అభిలాష కలిగినదై, శరీరం మెరుపులా అశాశ్వతమైన దని నిశ్చయించుకుంది. పరతత్వం మీద మనస్సు లగ్నంచేసుకుని, ముక్తురాలైంది. అని శ్రీకృష్ణుడు వివరించాడు.

తెభా-11-102-క.
దేము నిత్యము గా దని
మోముఁ దెగఁ గోసి సిద్ధమునివర్తనుఁడై
గేము వెలువడి నరుఁడు
త్సామునుం జెందు ముక్తిసంపద ననఘా!

టీక:- దేహము = శరీరము; నిత్యము = శాశ్వతమైనది; కాదు = కాదు; అని = అని; మోహమున్ = మోహమును; తెగగోసి = కత్తిరించిపారేసి; సిద్ధ = సిద్ధులు; ముని = మునులు మార్గమున; వర్తనుడు = అనుసరించువాడు; ఐ = అయ్యి; గేహమున్ = ఇల్లు; వెలువడి = విడిచిపెట్టి; నరుడు = మానవుడు; ఉత్సాహమును = ఉత్సాహముతో; చెందున్ = పొందును; ముక్తి = ముక్తి అనెడి; సంపదన్ = సంపదను; అనఘా = పాపరహితుడా.
భావము:- ఓ పుణ్యాత్ముడా! ఉద్ధవా! దేహం శాశ్వతమైనది కాదని గ్రహించి, మోహాన్ని కత్తిరించి పారేసి, సిద్ధులు మునులు చరించే మార్గాన్ని అనుసరించి, సంసారం వదలిన మానవుడు మోక్షలక్ష్మిని పొందుతాడు.

తెభా-11-103-వ.
మఱియు నొక్క విశేషం బయిన పురాతనపుణ్యకథ వినుము; కనకావతీపురంబున నొక్క ధరామరుని కన్యకారత్నంబు గల; దవ్వ ధూతిలకంబు రత్నసమేతంబు లగు కంకణంబులు ధరియించి బంధుజనంబులకుఁ బరమాహ్లాదంబుగా నన్నంబు గావించుట కొఱకు శాలితండులంబులు దంచునప్పుడు ముసలగ్రహణభారంబునఁ గంకణంబు లతిరావంబుగా మ్రోయుచుండ నప్పరమపతివ్రత యందులకు నసహ్యపడి యన్నియు డులిచి యొక్కటి నిలిపె; నట్లుగావునఁ దత్తఱపడక భగవదాయత్తంబైన యేకచిత్తంబునం బ్రసన్నచిత్తులై నరులు ముక్తులగుదురు; గావున నవిద్యావిద్యలు నా మాయగా విచారించి, కేవల పశుమార్గులు కాక షడ్గుణైశ్వర్య సంసన్నులైన యోగీశ్వరుల పగిది సుఖంబు గోరక యుండు వారలు ముక్తులగుదురు; సర్వంబును విష్ణుమాయగాఁ దెలియు” మని యుద్ధవునికిం జెప్పిన నతండు “దేవా! నీరూపం బేలాగునం గానవచ్చు”ననిన నతం డిట్లనియె; “భక్తిభావనపరాయణుండై కృపారస తత్పరుండై మితభాషణుండై బొంకక కర్మంబులు మదర్పణంబుగాఁ జేసిన యతండు భాగవతుఁడనం బరఁగు; మత్కథలును మజ్జన్మకర్మంబులును వినుచు మత్సేవకులైన భాగవతులం జూచి తన గృహంబునకుం గొనిపోయి, మజ్జన పూజన భోజన శయనా సనాదికంబులఁ బరితుష్టులం జేసిన యతండైనను భాగవతుండనఁ బడు; నిట్లెంతకాలంబు జీవించు, నంతకాలంబును నడపునతండు మద్రూపంబున వైకుంఠనిలయంబు నొందు; నదియునుం గాక గంధ పుష్ప ధూప దీప నైవేద్యంబుల లక్ష్మీసమేతుండనై, శంఖ చక్ర గదాశార్‌ఙ్గాది యుక్తుఁడ నైన నన్ను శుక సనకాది యోగీంద్రులును, నంబరీష విభీషణ రుక్మాంగదులు మొదలు గాఁగల భాగవతులును, శాస్త్రాచారచోదితులు గాక భక్తి భావనావిశేషంబున నేమఱక నిత్యంబును జింతనాయత్తులై యెఱింగిరి; మధురాపురంబునకు హలాయుధ సమేతుండనై యే నరుగుచో, గోపిక లోపికలు లేక భక్తియోగంబునఁ జింతించి ముక్తలై; రిది భక్తియోగప్రకా రం” బని యుద్ధవునికిం జెప్పిన.
టీక:- మఱియున్ = ఇంకా; ఒక్క = ఒక; విశేషంబు = విశిష్టము; అయిన = ఐన; పురాతన = ప్రాచీన; పుణ్య = పుణ్యవంతమైన; కథ = వృత్తాంతము; వినుము = వినుము; కనకావతీ = కనకావతి అనెడి; పురంబునన్ = పురమునందు; ఒక్క = ఒకానొక; ధరామరుని = బ్రహ్మణుని {ధరామరుడు - భూమిపైని అమరుడు (దేవుడు), విప్రుడు}; కన్యకా = పడతియైన; రత్నంబు = ఉత్తమురాలు; కలదు = ఉన్నది; ఆ = ఆ యొక్క; వధూ = యువతి; తిలకంబు = శ్రేష్ఠురాలు; రత్న = మణులు; సమేతంబులు = కలవి; అగు = ఐన; కంకణంబులున్ = చేతికంకణములను; ధరియించి = ధరించి; బంధు = బంధువులైన; వారల = వారి; కున్ = కి; పరమ = మిక్కిలి; ఆహ్లాదంబు = సంతోషము; కాన్ = అగునట్లు; అన్నంబున్ = అన్నమును; కావించుట = వండుట; కొఱకు = కోసము; శాలితండులంబులు = వడ్లు, వరిబియ్యము; దంచున్ = దంచెడి; అప్పుడు = సమయమునందు; ముసల = రోకలిని; గ్రహణ = పట్టుకొనెడి; భారంబునన్ = బరువులవలన; కంకణంబులు = కంకణములు; అతి = మిక్కిలిగ; రావంబున్ = చప్పుడు; కాన్ = అగుచు; మ్రోయుచుండన్ = శబ్దముచేయుచుండటచే; ఆ = ఆ; పరమ = ఉత్కృష్టమైన; పతివ్రత = పతివ్రత; అందుల = దాని; కున్ = కి; అసహ్యపడి = అసహ్యముచెంది; అన్నియు = అన్నిటిని; డులిచి = ఒలిచితీసేసి; ఒక్కటి = ఒకే ఒక్కటి మాత్రమ; నిలిపెన్ = ఉంచుకొనెను; అట్లు = అలా; కావునన్ = ఔటచేత; తత్తఱపడక = తికమకపడక; భగవత్ = భగవంతునికి; ఆయత్తంబు = అర్పించినది; ఐన = అయిన; ఏక = ఏకైగ్రమైన; చిత్తంబునన్ = మనసుతో; ప్రసన్న = శాంత; చిత్తులు = మనస్సుకలవారు; ఐ = అయ్యి; నరులు = మానవులు; ముక్తులు = ముక్తిపొందినవారు; అగుదురు = ఔతారు; కావునన్ = అందుచేత; అవిద్య = అవిద్య; విద్యలున్ = విద్యలను; నా = నా యొక్క; మాయ = మాయ; కాన్ = ఐనట్లు; విచారించి = తెలుసుకొని; కేవల = కేవలం; పశు = జంతువుల; మార్గులు = వలెనుండువారు; కాక = కాకుండ; షడ్గుణ = షడ్గుణములు అను {షడ్గుణములు - 1ఐశ్వర్యము 2వీర్యము 3యశస్సు 4జ్ఞానము 5సిరి 6వైరాగ్యము}; ఐశ్వర్య = ఐశ్వర్యములు; సంపన్నులు = సమృద్ధిగా కలవారు; ఐన = అయిన; యోగి = యోగులలో; ఈశ్వరుల = ఉత్తముల; పగిది = వలె; సుఖంబున్ = భౌతిక సౌఖ్యములను; కోరక = కోరకుండ; ఉండు = ఉండెడి; వారలు = వారు; ముక్తులు = మోక్షముపొందినవారు; అగుదురు = ఔతారు; సర్వంబును = సమస్తమును; విష్ణు = విష్ణుమూర్తి; మాయ = మాయ; కాన్ = ఐనట్లు; తెలియుము = తెలిసికొనుము; అని = అని; ఉద్ధవుని = ఉద్దవుని; కిన్ = కి; చెప్పినన్ = చెప్పగా; అతండు = అతను; దేవా = భగవంతుడా; నీ = నీ యొక్క; రూపంబు = స్వరూపము; ఏలాగునన్ = ఏ విధముగ; కానవచ్చును = చూడవచ్చును; అనినన్ = అని అడుగగా; అతండు = అతను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; భక్తి = భక్తి; భావన = భావన యందు; పరాయణుండు = నిష్ఠకలవాడు; ఐ = అయ్యి; కృపారస = దయారసము; తత్పరుండు = కలవాడు; ఐ = అయ్యి; మిత = పరిమితముగా; భాషణుండు = మాట్లాడువాడు; ఐ = అయ్యి; బొంకక = అబద్ధమాడక; కర్మంబులు = సమస్తమైన కర్మలు; మత్ = నాకు; అర్పణంబు = అర్పించినవి; కాన్ = ఐనట్లు; చేసిన = ఆచరించెడి; అతండు = అతను; భాగవతుడు = భాగవతుడు; అనన్ = అని; పరగున్ = ప్రసిద్ధుడగును; మత్ = నా యొక్క; కథలును = కథలు; మత్ = నా యొక్క; జన్మ = జననములు; కర్మంబులు = లీలావిశేషములు; వినుచున్ = వింటు; మత్ = నా యొక్క; సేవకులు = భక్తులు; ఐన = అయిన; భాగవతులన్ = భాగవతులను; చూచి = చూసి; తన = తన యొక్క; గృహంబున్ = ఇంటి; కున్ = కి; కొనిపోయి = తీసుకువ వెళ్ళి; మజ్జన = స్నానము చేయించుట; పూజన = పూజించుట; భోజన = భోజనము పెట్టుట; శయన = పరుండజేయుట; ఆసన = కూర్చుండబెట్టుట; ఆదికంబులన్ = మొదలగువానితో; పరితుష్టులను = సంతృప్తులను; చేసిన = చేసెడి; అతండు = అతను; ఐనను = అయిన; భాగవతుండు = భాగవతుడు; అనబడున్ = అనబడును; ఇట్లు = ఈ విధముగ; ఎంత = ఎంత; కాలంబున్ = కాలము; జీవించున్ = జీవిస్తాడో; అంత = అంత; కాలంబున్ = కాలమువరకు; నడపున్ = ఆచరించెడి; అతండు = అతను; మత్ = నా యొక్క; రూపంబునన్ = స్వరూపముతో; వైకుంఠ = వైకుంఠ; నిలయంబున్ = పదమును; ఒందును = పొందును; అదియునున్ = అంతే; కాక = కాకుండ; గంధ = గంధము; పుష్ప = పూలు; ధూప = ధూపము; దీప = దీపము; నైవేద్యంబులన్ = నైవేద్యాలతో; లక్ష్మీ = లక్ష్మీదేవితో; సమేతుండున్ = కూడి ఉండువాడు; ఐ = అయ్యి; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గద; శార్ఙ్గ = శార్ఙ్గము యను విల్లు; ఆది = మున్నగువానితో; యుక్తుండు = కలిగి ఉండువాడు; ఐన = అయిన; నన్ను = నన్ను; శుక = శుకడు; సనకాది = సనకాదులైన; యోగి = యోగులలో; ఇంద్రులును = ఉత్తములు; అంబరీష = అంబరీషుడు; విభీషణ = విభీషణుడు; రుక్మాంగదులు = రుక్మాంగదుడు; మొదలుగాగల = మొదలైన; భాగవతులును = భాగవతులు; శాస్త్ర = శాస్త్రములచేత; ఆచార = ఆచారములచేత; చోదితులు = మాత్రమేనడపబడువారు; కాక = కాకుండ; భక్తి = భక్తి; భావనా = భావన యొక్క; విశేషంబునన్ = విశిష్టతచే; ఏమఱక = ఏమరుపాటు చెందకుండ; నిత్యంబునున్ = ఎప్పుడు; చింతనా = స్మరించుటలో; ఆయత్తులు = లగ్నమైనవారు; ఐ = అయ్యి; ఎఱింగిరి = తెలుసుకొన్నారు; మధురాపురంబున్ = మధురానగరమున; కున్ = కు; హలాయుధ = బలరామునితో {హలాయుధుడు - నాగలి ఆయుధముగా కలవాడు, బలరాముడు}; సమేతుండను = కూడినవాడను; ఐ = అయ్యి; ఏన్ = నేను; అరుగుచోన్ = వెళ్తుంటే; గోపికలు = యాదవస్త్రీలు; ఓపికలులేక = విరహమునుతట్టుకొనలేక; భక్తియోగంబునన్ = భక్తియోగముతో; చింతించి = నన్నేస్మరించుచు; ముక్తలు = ముక్తిపొందినవారు; ఐరి = అయ్యారు; ఇది = ఇది; భక్తియోగ = భక్తియోగము యొక్క; ప్రకారంబు = వివరము; అని = అని; ఉద్దవుని = ఉద్దవుని; కిన్ = కి; చెప్పినన్ = చెప్పగా.
భావము:- ఇంకొక విశేషమైన పురాతన పుణ్యకథ చెప్తాను, విను. కనకావతీనగరంలో ఒక ఉత్తమమైన బ్రాహ్మణ కన్యక ఉంది. ఆ కాంతారత్నం తన చేతులకు రత్నాలు పొదిగిన కంకణాలు ధరించేది. ఒకనాడు వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. వారికి వండిపెట్టాలి అని బియ్యం కోసం వడ్లు ఇంట్లో రోకలితో వడ్లు దంచుతూ ఉంటే, ఆమె కంకణాలు గల్లుగల్లు మని చప్పుడు చేయసాగాయి. ఆ చప్పుడుకు చీకాకు పడింది. అందుకని, ఆ పరమపతివ్రత చేతికి ఒక్క గాజు మాత్రమే ఉంచి మిగతావన్నీ తీసేసి అవతల పెట్టి, చప్పుడు కాకుండా తన పని పూర్తిచేసుకుంది. అలాగే తత్తరపడక భగవంతుడికి అర్పించిన ఏకాగ్రమైన చిత్తంతో ప్రసన్న మనస్కులై మానవులు ముక్తులవుతారు. కనుక అవిద్య విద్య రెండు నా మాయగా తెలుసుకుని కేవలం పశుమార్గులు కాకుండా ఐశ్వర్యం వీర్యం యశస్సు జ్ఞానం సిరి వైరాగ్యం అనే షడ్గుణాలు కలిగిన యోగీశ్వరుల లాగా, సుఖాన్ని కోరకుండా ఉండే వాళ్ళు ముక్తులవుతారు. సర్వం విష్ణుమాయ అని గ్రహించు.” అని ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. అప్పుడు అతను. “దేవా! నీ రూపాన్ని ఎలా చూడగలము.” అని అడిగాడు
అందుకు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “ఉద్ధవా! భక్తిభావన యందు ఆసక్తి, దయారసము కలిగి; మితభాషణుడై, అబద్ధమాడక, సమస్త కర్మలు మదర్పణంగా చేసేవాడు భాగవతుడు అనబడతాడు. నా కథలు, నా జననం, నా లీలావిలాసాలు వింటూ నా సేవకులైన భాగవతులను తిలకించి. తమ ఇంటికి తీసుకుని వెళ్ళి, పూజించి స్నాన భోజన శయనాసనాదులతో వారిని సంతృప్తిపరచిన వాడు కూడ భాగవతుడు అనబడతాడు. చివరికి, జీవితాంత కాలం ఇదే విధంగా ఉండేవాడు నా రూపంతో వైకుంఠంలో నివసిస్తాడు.
అదీకాక శంఖచక్రగదాధరుడను, లక్ష్మీ సమేతుడను అయిన నన్ను; శాస్త్రంతో ఆచారంతో సంబంధం లేకుండా ఎప్పుడూ విశేషించిన భక్తితో ఏమరుపాటు రాకుండా గంథం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం మొదలైనవి సమర్పిస్తూ ధ్యానిస్తూ శుకుడు, సనకుడు మొదలైన యోగీంద్రులు; అంబరీషుడు, విభీషుణుడు, రుక్మాంగదుడు మున్నగు భాగవతులు తెలుసుకున్నారు. మధురాపురానికి బలరాముడితో కలసి నేను వెళ్ళగా నా విరహాన్ని భరించలేని గోపికలు భక్తియోగంతో నన్నే చింతించి ముక్తిపొందారు. ఇది భక్తి యోగ వివరం.” అని ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు.

తెభా-11-104-క.
"ధ్యానం బేక్రియ నిలుచును?
ధ్యానం బే రీతిఁ దగు? నుదాత్తచరిత్రా!
ధ్యాప్రకార మంత య
నూనంబుగఁ జెప్పు మయ్య యుర్వీరమణా!"

టీక:- ధ్యానంబు = ధ్యానము; ఏ = ఏ; క్రియన్ = విధముగ; నిలుచును = నిలబడుతుంది; ధ్యానంబు = ధ్యానము; ఏ = ఏ; రీతిన్ = విధమైతే; తగున్ = తగినదై ఉండును; ఉదాత్తచరిత్ర = గొప్పప్రవర్తనగలవాడా; ధ్యాన = ధ్యానము యొక్క; ప్రకారంబు = విషయము; అంతయు = సమస్తమును; అనూనంబుగన్ = పూర్తిగా; చెప్పుము = తెలియజెప్పుము; అయ్య = నాయనా; ఉర్వీరమణ = కృష్ణా {ఉర్వీరమణ - భూమికి భర్త, విష్ణువు}.
భావము:- అప్పుడు శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు ఇలా అడిగాడు. “ఓ ఉదాత్తచరిత్రా! భూదేవీకళత్రా! ధ్యానం ఎలా నిలుబడుతుంది? ఎలా ఉంటే ధ్యానం అవుతుంది? ఆ ధ్యానం గురించి వివరంగా నాకు చెప్పు.”

తెభా-11-105-వ.
అని యడిగిన నయ్యాదవేంద్రుం డిట్లని పలుకం దొడంగె; “దారు మధ్యభాగంబున ననలంబు సూక్ష్మరూపంబున వర్తించు చందంబున నందంబై సకలశరీరుల యందు నచ్ఛేద్యుండు నదాహ్యుండు నశోష్యుండునైన జీవుండు వసించి యుండు” ననిన హరికి నుద్ధవుం డిట్లనియె; “సనక సనందనాది యోగీంద్రులకు యోగమార్గం బేరీతి నానతిచ్చితి, వది యేవిధం? బానతీయవే” యని యభ్యర్థించిన నతం డిట్లనియె; “వారలు చతుర్ముఖు నడిగిన నతండు, “నేనును దెలియనేర” ననిన వారలు విస్మయం బందుచుండ నేనా సమయంబున హంసస్వరూపుండ నై వారల కెఱింగించిన తెఱుంగు వినుము; పంచేంద్రియంబులకు దృష్టం బయిన పదార్థం బనిత్యంబు; నిత్యదృష్టి బ్రహ్మం బని తెలియవలయు; దేహి కర్మార్జిత దేహుండై సంసారమమతలు నిరసించి, నిశ్చలజ్ఞాన యుక్తుండై మత్పదప్రాప్తుండగు; స్వప్నలబ్ధ పదార్థంబు నిజంబు గాని క్రియఁ గర్మానుభవపర్యంతంబు కళేబరంబు వర్తించు నని సాంఖ్యయోగంబున సనకాదుల కెఱింగించిన విని, బ్రహ్మ మొదలైన దేవత లెఱింగిరి; వారివలన భూలోకంబునఁ బ్రసిద్ధం బయ్యె; నదిగావున నీవును నెఱింగికొని, పుణ్యాశ్రమంబులకుం జను; మస్మదీయ భక్తియుక్తుండును, హరిపరాయణుండునైన యతని చరణరజఃపుంజంబు తన శరీరంబు సోఁకజేయు నతండును, ముద్రాధారణపరులకును హరి దివ్యనామంబులు ధరియించు వారలకు నన్నోదకంబుల నిడు నతండును, వాసుదేవభక్తులం గని హర్షించు నతండును, భాగవతు” డని చెప్పి మఱియు “సర్వసంగపరిత్యాగంబు సేసి, యొండెఱుంగక నన్నే తలంచు మానవునకు భుక్తి ముక్తి ప్రదాయకుండనై యుండుదు” నని యానతిచ్చిన నుద్ధవుండు “ధ్యాన మార్గంబే రీతి? యానతీయవలయు” ననిన హరి యిట్లనియె; ఏకాంత మానసులై హస్తాబ్జంబు లూరుద్వయంబున సంధించి, నాసాగ్రంబున నీక్షణంబు నిలిపి, ప్రాణాయామంబున నన్ను హృదయగతుంగాఁ దలంచి, యష్టాదశ ధారణాయోగసిద్ధు లెఱింగి, యందణిమాదులు ప్రధాన సిద్ధులుగాఁ దెలిసి, యింద్రియంబుల బంధించి, మనం బాత్మయందుఁ జేర్చి, యాత్మనాత్మతోఁ గీలించిన బ్రహ్మపదంబుఁ బొందు; భాగవతశ్రేష్ఠు లితరధర్మంబులు మాని నన్నుం గాంతురు; తొల్లి పాండునందనుఁడగు నర్జునుండు యుద్ధరంగంబున విషాదంబు నొంది యిట్ల యడిగిన నతనికి నేఁ జెప్పిన తెఱం గెఱింగించెదఁ; జరాచరభూతంబయిన జగంబంతయు మదాకారంబుగా భావించి, భూతంబులందు నాధారభూతంబును, సూక్ష్మంబులందు జీవుండును, దుర్జయంబులందు మనంబును, దేవతలందుఁ బద్మగర్భుండును, వసువులందు హవ్యవాహుండును, నాదిత్యులందు విష్ణువును, రుద్రులందు నీలలోహితుండును, బ్రహ్మలందు భృగువును, ఋషులందు నారదుండును, ధేనువులందుఁ గామధేనువును, సిద్ధులయందుఁ గపిలుండును, దైత్యులయందుఁ బ్రహ్లాదుండును గ్రహంబులందుఁ గళానిధియును, గజంబులయం దైరావతంబును, హయంబులయం దుచ్చైశ్శ్రవంబును, నాగంబులందు వాసుకియును, మృగంబులందుఁ గేసరియు, నాశ్రమంబులందు గృహస్థాశ్రమంబును, వర్ణంబులయం దోంకారంబును, నదులందు గంగయు, సాగరంబుల యందు దుగ్ధసాగరంబును, నాయుధంబులందుఁ గార్ముకంబును, గిరు లందు మేరువును, వృక్షంబుల యందశ్వత్థంబును, నోషధుల యందు యవలును, యజ్ఞంబుల యందు బ్రహ్మయజ్ఞంబును, వ్రతంబులం దహింసయు, యోగంబులం దాత్మయోగంబును, స్త్రీల యందు శతరూపయు భాషణంబులయందు సత్యభాషణంబును, ఋతువులందు వసంతాగమంబును, మాసంబులలో మార్గశీర్షంబును, నక్షత్రంబులలో నభిజిత్తును, యుగంబులందుఁ గృతయుగంబును, భగవదాకారంబులందు వాసుదేవుండును, యక్షుల లోఁ గుబేరుండును, వానరులం దాంజనేయుండును, రత్నంబు లందుఁ బద్మరాగంబును, దానంబులలోనన్నదానంబును, దిథు లయం దేకాదశియు, నరులయందు వైష్ణవుండై భాగవతప్రవర్తనం బ్రవర్తించువాఁడును, నివియన్నియు మద్విభూతులుగా నెఱుంగు"మని కృష్ణుం డుద్ధవునకు నుపన్యసించిన వెండియు నతం డిట్లనియె.
టీక:- అని = అని; అడిగిన = అడిగినట్టి; ఆ = ఆ ప్రసిద్ధుడైన; యాదవేంద్రుండు = కృష్ణుడు {యాదవేంద్రుడు - యాదవుల ప్రభువు, కృష్ణుడు}; పలుకన్ = చెప్పుట; తొడంగెన్ = మొదలిడెను; దారు = కఱ్ఱల; మధ్యభాగంబునన్ = లోపలిప్రదేశములో; అనలంబు = అగ్ని; సూక్ష్మ = సూక్ష్మమైన; రూపంబునన్ = రూపములో; వర్తించు = ఉండెడి; చందంబునన్ = విధముగ; అందంబు = కలిసి ఉన్నది; ఐ = అయ్యి; సకల = సర్వ; శరీరులు = దేహధారులు; అందున్ = లోను; అచ్చేద్యుండున్ = ముక్కలుచేయరానివాడు; అదాహ్యుండన్ = కాల్పరానివాడు; అశోష్యుండున్ = ఎండింపరానివాడు; ఐన = అయినట్టి; జీవుండు = జీవాత్మ; వసించి = నివసిస్తూ; ఉండును = ఉండును; అనినన్ = అనగా; హరి = కృష్ణుని; కిన్ = కి; ఉద్దవుండు = ఉద్దవుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; సనక = సనకుడు {సనకాదులు - 1సనక 2సనందన 3సనత్కుమార 4సనత్సుజాతులుఅను బ్రహ్మదేవుని కుమారులు}; సనందదన = సనందనుడు; ఆది = మొదలగు; యోగి = యోగులలో; ఇంద్రులు = శ్రేష్ఠుల; కున్ = కు; యోగమార్గంబు = యోగమార్గమును; ఏ = ఏ; రీతిన్ = విధముగ; ఆనతిచ్చితివి = చెప్పితివి; అది = అది; ఏ = ఎలాంటి; విధంబు = మార్గము; ఆనతీయవే = చెప్పుము; అని = అని; అభ్యర్థించినన్ = వేడుకొనగా; అతండు = అతను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; వారలు = వారు; చతుర్ముఖున్ = బ్రహ్మదేవుని {చతుర్ముఖుడు - నాలుగు మోముల వాడు, బ్రహ్మ}; అడిగినన్ = అడుగగా; అతండు = అతను; నేనునున్ = నేను కూడ; తెలియనేరను = ఎరుగను; అనినన్ = అనగా; వారలు = వారు; విస్మయంబున్ = ఆశ్చర్యమును; అందుచుండ = ఆశ్చర్యపోతుండగా; నేనున్ = నేను; ఆ = ఆ యొక్క; సమయంబునన్ = సమయమునకు; హంస = హంస యొక్క; స్వరూపుండను = రూపము ధరించినవాడను; ఐ = అయ్యి; వారలు = వారి; కిన్ = కి; ఎఱింగించిన = తెలిపిన; తెఱంగున్ = విధమును; వినుము = వినుము; పంచేంద్రియంబుల్ = పంచేంద్రియముల; కున్ = కు; దృష్టంబు = కనబడునది; అయిన = ఐన; పదార్థంబు = వస్తువులెల్ల; అనిత్యంబు = శాశ్వతమైనది కాదు; నిత్య = నిశ్చలమైన; దృష్టి = జ్ఞానము; బ్రహ్మంబు = పరబ్రహ్మ; అని = అని; తెలియవలయున్ = తెలిసికొనవలెను; దేహి = జీవుడు; కర్మ = చేసిన కర్మలచే; ఆర్జిత = సంపాదించుకొన్న; దేహుండు = దేహము కలవాడు; ఐ = అయ్యి; సంసార = సంసారమందలి; మమతలు = మమకారాల్ని; నిరసించి = వదలి; నిశ్చల = చలించని; జ్ఞాన = జ్ఞానము; యుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి; మత్ = నా యొక్క; పద = స్థానాన్ని; ప్రాప్తుండు = చెందినవాడు; అగు = అగును; స్వప్న = కలలో; లబ్ధ = దొరికిన; పదార్థంబు = వస్తువులెల్ల; నిజంబు = నిజమైనవి; కాని = కానట్టి; క్రియన్ = విధముగనే; కర్మానుభవంబు = కర్మానుభవము; పర్యంతంబు = అయినదాకా; కళేబరంబు = దేహము; వర్తించును = నడస్తుంటుంది; అని = అని; సాంఖ్యయోగంబున = సాంఖ్యయోగమార్గములో; సనకాదులు = 1సనకుడు 2సనందనుడు 3సనత్కుమారుడు 4సనత్సుజాతుడు అను బ్రహ్మకుమారులైన దేవర్షులు; కున్ = కు; ఎఱింగించినన్ = తెలియపర్చగా; విని = విని; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; మొదలైన = మొదలైన; దేవతలు = దేవతలు; ఎఱింగిరి = తెలిసికొనిరి; వారి = వారి; వలన = వలన; భూలోకంబునన్ = భూలోకములోకూడ; ప్రసిద్ధంబు = పేరుపొందినది; అయ్యెన్ = అయినది; అదిగావున = కాబట్టి; నీవును = నీవుకూడ; ఎఱింగికొని = తెలిసికొని; పుణ్య = పుణ్యవంతమైన; ఆశ్రమంబులు = ఆశ్రమముల; కున్ = కు; చనుము = వెళ్ళుము; అస్మదీయ = నా యందలి; భక్తి = భక్తి; యుక్తుండును = కలవాడు; హరి = విష్ణుమూర్తి యందు; పరాయణుండును = ఆసక్తికలవాడు; ఐన = అయినట్టి; అతని = వాని; చరణ = పాద; రజస్ = ధూళి; పుంజంబు = సమూహము; తన = తన యొక్క; శరీరంబున్ = దేహమును; సోకన్ = తగులునట్లు; చేయున్ = చేసెడి; అతండును = వాడు; ముద్రా = శంఖచక్రాదిముద్రలను; ధారణ = ధరించుటందు; పరులకును = ఆసక్తికలవారి; కున్ = కి; హరి = నారాయణుని; దివ్య = మహిమాన్వితమైన; నామంబులున్ = నామములను; ధరియించు = ధరించెడి; వారలు = వారి; కున్ = కి; అన్న = ఆహారము; ఉదకంబులన్ = నీళ్ళను; ఇడు = ఇచ్చెడి; అతండును = వాడు; వాసుదేవ = కృష్ణ; భక్తులన్ = భక్తులను; కని = చూసి; హర్షించున్ = ఆనందపడెడి; అతండును = వాడు; భాగవతుడు = భాగవతుడు; అని = అని; చెప్పి = చెప్పి; మఱియు = ఇంకను; సర్వసంగపరిత్యాగంబు = సన్యాసము {సర్వసంగపరిత్యాగము - అన్ని తగులములను పూర్తిగా విడిచిపెట్టుట, సన్యాసము}; చేసి = చేసి; ఒండు = వేరెవరిని; ఎఱుంగక = తెలిసికొనక; నన్నే = నన్నుమాత్రమే; తలంచు = స్మరించెడి; మానవుని = మానవుడి; కున్ = కి; భుక్తి = ఇహలోక జీవిక; ముక్తి = పరలోక మోక్షము; ప్రదాయకుండను = ఇచ్చెడివాడను; ఐ = అయ్యి; ఉండుదున్ = ఉంటాను; అని = అని; ఆనతిచ్చిన = తెలుపగా; ఉద్దవుండు = ఉద్దవుడు; ధ్యానమార్గంబు = ధ్యానము యొక్క; మార్గంబు = విధానము; ఏ = ఏ; రీతి = విధము; ఆనతీయవలయును = చెప్పుము; అనినన్ = అని అడుగగా; హరి = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఏకాంత = ఏకాగ్రమైన; మానసులు = మనస్సుకలవారు; ఐ = అయ్యి; హస్త = చేతులు అనెడి; అబ్జంబులు = పద్మములను; ఊరు = తొడల; ద్వయంబునన్ = జంట మీద; సంధించి = స్థిరపరచి; నాస = ముక్కు; అగ్రంబునన్ = కొస యందు; ఈక్షణంబున్ = దృష్టిని; నిలిపి = నిలిపి; ప్రాణాయామంబునన్ = ప్రాణాయామముతో; నన్నున్ = నన్ను; హృదయ = హృదయములో; గతున్ = ఉన్నవానిగా; తలంచి = భావించుకొని; అష్టాదశ = పద్దెనిమిది (18) {అష్టాదశసిద్ధులు - అణిమాది ఎనిమిది (8) గౌణసిద్ధులు పది (10) (చూ. అనుయుక్తములు)}; ధారణా = ధారణలచే లభించు; యోగసిద్ధులు = యోగసిద్ధులను; ఎఱింగి = తెలిసికొని; అందు = వానిలో; అణిమాదులు = అష్టసిద్ధులు {అణిమాది - అష్టసిద్ధులు - 1అణిమ 2మహిమ 3లఘిమ 4గరిమ 5ప్రాప్తి 6ప్రాకామ్యము 7ఈశత్వము 8వశిత్వము}; ప్రధాన = ముఖ్యమైన; సిద్ధులు = సిద్ధులు; కాన్ = ఐనట్లు; తెలిసి = తెలిసికొని; ఇంద్రియంబులన్ = ఇంద్రియవ్యాపారములను; బంధించి = నిరోధించి; మనంబున్ = మనస్సును; ఆత్మ = ఆత్మ; అందు = అందు; చేర్చి = చేర్చి; ఆత్మన్ = ఆత్మను; ఆత్మ = పరమాత్మతో; కీలించినన్ = లగ్నముచేసినచో; బ్రహ్మపదంబున్ = బ్రహ్మపదమును; పొందున్ = పొందును; భాగవత = భాగవతులలో; శ్రేష్ఠులు = ఉత్తములు; ఇతర = ఇతర; ధర్మంబులు = విషయములు; మాని = వదలివేసి; నన్నున్ = నన్నే; కాంతురు = పొందెదరు; తొల్లి = పూర్వము; పాండు = పాండురాజు; నందనుడు = పుత్రుడు; అగు = ఐన; అర్జునుండు = అర్జునుడు; యుద్ధరంగంబునన్ = రణరంగములో; విషాదంబున్ = విచారమును; ఒంది = పొంది; ఇట్లు = ఈ విధముగ; అడిగిన = అడిగితే; అతని = అతని; కిన్ = కి; నేన్ = నేను; చెప్పిన = చెప్పినట్టి; తెఱంగున్ = వివరమును; ఎఱింగించెద = చెప్పెదను; చరా = చలనముకలవి; అచర = చలనములేనివి; భూతంబు = జీవులు కలది; అయిన = అగు; జగంబు = లోకము; అంతయున్ = సమస్తమును; మత్ = నా యొక్క; ఆకారంబు = స్వరూపము; కాన్ = అయినట్లు; భావించి = తలచి; భూతంబులు = భూతములు; అందున్ = లో; ఆధారభూతంబును = ఆధారభూతము; సూక్ష్మంబులు = సూక్ష్మమైన వాని; అందున్ = లో; జీవుండును = జీవుడు; దుర్జయులు = జయింపరాని వాటి; అందున్ = లో; మనంబును = మనస్సు; దేవతలు = దేవతలు; అందున్ = లో; పద్మగర్భుండును = బ్రహ్మదేవుడు; వసువులు = అష్ట వసువులు {అష్టవసువులు - 1ద్రోణుడు 2ప్రాణుడు 3ధ్రువుండు 4అర్కుండు 5అగ్ని 6దోషుండు 7వస్తువు 8విభావసువు (ఇంకొక క్రమము) 1ఆవుడు 2ధ్రువుడు 3సోముడు 4అధ్వరుడు 5అనిలుడు 6ప్రత్యూషుడు 7అనలుడు 8ప్రభాసుడు}; అందున్ = లో; హవ్యవాహుండును = అగ్ని {హవ్యవాహుడు - హవ్యమును మోసుకుపోవు వాడు, అగ్నిహోత్రుడు}; ఆదిత్యులు = ద్వాదశ ఆదిత్యులు {ద్వాదశాదిత్యులు - 1ఇంద్రుడు 2ధాత 3పర్జన్యుడు 4త్వష్ట 5పూషుడు 6అర్యముడు 7భగుడు 8వివస్వంతుడు 9విష్ణువు 10అంశుమంతుడు 11వరుణుడు 12మిత్రుడు}; అందున్ = లో; విష్ణువును = విష్ణువు; రుద్రులు = ఏకాదశ రుద్రులు {ఏకాదశరుద్రులు - 1అజుడు 2ఏకపాదుడు3అహిర్బుద్న్యుడు 4త్వష్ట 5రుద్రుడు 6హరుడు 7శంభుడు 8త్రయంబకుడు 9అపరాజితుడు 10ఈశానుడు 11త్రిభువనుడు (మరొక క్రమము) 1అజైకపాదుడు 2అహిర్బుథ్న్యుడు 3త్వష్ట 4రుద్రుడు 5హరుడు 6త్రయంబకుడు 7వృషాకపి 8శంభుడు 9కపర్ది 10మృగవ్యాధుడు 11శర్వుడు (కశ్యపబ్రహ్మ వలన సురభి యందు జన్మించినవారు)}; అందు = లో; నీలలోహితుండును = శివుడు {నీలలోహితుడు - కంఠమున నీలము కేశములందు ఎరుపు కలవాడు, శివుడు (బ్రహ్మ హోమము చేయునపుడు లలాటమునందలి స్వేద బిందువు అగ్నియందు పడి నల్లని రంగు కలదై పిమ్మట ఎఱ్ఱనయ్యెనని పురాణ ప్రసిద్ధి)}; బ్రహ్మలు = నవ బ్రహ్మలు {నవబ్రహ్మలు - ప్రజాపతులు - భృగువు, పులస్థ్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, మరీచి}; అందు = లో; భృగువు = భృగువు; ఋషులు = ఋషులు; నారదుండును = నారదుడు; ధేనువులు = పాలు ఇచ్చు ఆవులు; అందున్ = లో; కామధేనువును = కామధేనువు; సిద్ధులు = సిద్ధులు; అందున్ = లో; కపిలుండును = కపిలుడు; దైత్యులు = దైత్యులు; అందున్ = లో; ప్రహ్లాదుండును = ప్రహ్లాదుడు; గ్రహములు = నవ గ్రహములు {నవగ్రహములు - 1సూర్యుడు 2చంద్రుడు 3అంగారకుడు4బుధుడు 5బృహస్పతి 6శుక్రుడు 7శని 8రాహువు 9కేతువు}; అందున్ = లో; కళానిధియును = చంద్రుడు; గజంబులు = గజములు {అష్టదిగ్గజములు - 1ఐరావతము 2పుండరీకము 3వామనము 4కుముదము 5అంజనము 6పుష్పదంతము 7సార్వభౌమము 8సుప్రతీకము}; అందున్ = లో {అష్టదిగ్గజముల భార్యలు - 1అభ్రము 2కపిల 3పింగళ 4అనుపమ 5తామ్రపర్ణి 6శుభ్రదంతి 7అంగన 8అంజనావతి}; ఐరావతంబును = ఐరావతము; హయంబులు = గుఱ్ఱములు; అందు = లో; ఉచ్చైశ్రవంబును = ఉచ్చైశ్రవము; నాగంబులు = నాగములు; అందున్ = లో; వాసుకియును = వాసుకి; మృగంబులు = జంతువులు; అందున్ = లో; కేసరియున్ = సింహము; ఆశ్రమంబులు = ఆశ్రమముల; అందున్ = లో; గృహస్థాశ్రమంబును = గృహస్థాశ్రమము; వర్ణంబుల = అక్షరముల; అందున్ = లో; ఓంకారంబును = ఓంకారము; నదులు = నదులు; అందున్ = లో; గంగయున్ = గంగ; సాగరంబుల = సముద్రముల; అందున్ = లో; దుగ్దసాగరంబునున్ = పాలసముద్రము; ఆయుధంబులు = ఆయుధములు; అందున్ = లో; కార్ముకంబును = ధనుస్సు; గిరులు = పర్వతములు; అందు = లో; మేరువును = మేరుపర్వతము; వృక్షంబుల = చెట్ల; అందున్ = లో; అశ్వత్థంబును = అశ్వత్థవృక్షము; ఓషధుల = ఫలించగనే నశించెడి చెట్ల; అందున్ = లో; యవలును = యవధాన్యము; యజ్ఞంబుల = యాగముల; అందున్ = లో; బ్రహ్మయజ్ఞంబును = బ్రహ్మయజ్ఞము; వ్రతంబులు = వ్రతములు; అందున్ = లో; అహింసయున్ = అహింస; యోగంబులు = యోగములు; అందు = లో; ఆత్మయోగంబును = ఆత్మయోగము; స్త్రీల = స్త్రీల; అందున్ = లో; శతరూపయు = శతరూప; భాషణంబుల = పలుకుల; అందున్ = లో; సత్య = సత్యమును; భాషణంబును = పలుకుట; ఋతువులు = ఋతువులు; అందున్ = లో; వసంతాగమంబును = వసంతఋతువు; మాసంబుల = మాసంబుల; లో = లో; మార్గశీర్షంబును = మార్గశిరము; నక్షత్రంబుల = నక్షత్రముల; లోనన్ = అందు; అభిజిత్తును = అభిజిత్తు; యుగంబులు = యుగములు; అందున్ = లో; కృతయుగంబును = కృతయుగము; భగవత్ = భగవంతుని; ఆకారంబుల = అవతారములలో; వాసుదేవుండును = కృష్ణుడు; యక్షుల = యక్షుల; లోన్ = అందు; కుబేరుండును = కుబేరుడు; వానరులు = వానరుల; అందు = లో; ఆంజనేయుండును = ఆంజనేయుడు; రత్నంబు = రత్నములు; అందున్ = లో; పద్మరాగంబును = పద్మరాగము; దానంబుల = దానముల; లోన్ = అందు; అన్నదానంబును = అన్నదానము; తిథుల = తిథుల {తిథులు - 1పాడ్యమి 2విదియ 3తదియ 4చవితి 5పంచమి 6షష్ఠి 7సప్తమి 8అష్టమి 9నవమి 10దశమి 11ఏకాదశి 12ద్వాదశి 13త్రయోదశి 14చతుర్దశి 15అమావాస్య లేక పౌర్ణమి}; అందున్ = లో; ఏకాదశియున్ = ఏకాదశి; నరుల = మానవుల; అందున్ = లో; వైష్ణవుండు = వైష్ణవసంప్రదాయకుడు; ఐ = అయ్యి; భాగవత = భాగవతుల; ప్రవర్తనన్ = పద్దతిలో; ప్రవర్తించు = జీవించు; వాడును = వాడు; ఇవి = ఇవి; అన్నియున్ = అన్ని; మత్ = నా యొక్క; విభూతులు = అవతారాలు. రూపములు; కాన్ = ఐనట్లు; ఎఱుంగుము = తెలియుము; అని = అని; కృష్ణుండు = కృష్ణుడు; ఉద్దవున్ = ఉద్దవుని; కున్ = కి; ఉపన్యసించిన = విస్తరించిచెప్పగా; వెండియున్ = మళ్ళీ; అతండు = అతను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;


భావము:- అలా అడిగిన ఉద్ధవుడికి యాదవ ప్రభువు శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. “కఱ్ఱ లోపల అగ్ని సూక్ష్మరూపంలో ఉండే విధంగా, సకల శరీరాలలోను అచ్ఛేద్యుడు అదాహ్యుడు అశోష్యుడు అయిన జీవుడు నివసిస్తూ ఉంటాడు.” అనగా ఉద్ధవుడు మరల ఇలా అడిగాడు. “సనకుడు సనందుడు మున్నగు యోగీంద్రులకు యోగమార్గం ఏ విధంగా బోధించావు? ఆ మార్గం ఎలాంటిదో నాకు చెప్పు.” అంత శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “వారు మొదట ఈ విషయం గురించి బ్రహ్మదేవుడిని అడిగారు. అతడు తనకు కూడ తెలియదు అన్నాడు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడుతుంటే, నేను ఆ సమయంలో హంస రూపం ధరించి వాళ్ళకు చెప్పాను. ఆ వివరం చెప్తాను శ్రద్ధగా విను.
పంచేంద్రియాలకూ కనిపించే పదార్థమంతా అనిత్యం. నిత్యమైనది బ్రహ్మం మాత్రమే. పూర్వజన్మ కృత కర్మలచేత లభించిన శరీరం కలవాడైన దేహి, సంసార మందు మమకారాన్ని వదలి నిశ్చలమైన జ్ఞానం పొంది, నా స్థానాన్ని ప్రాప్తిస్తాడు. కలలో దొరికిన పదార్ధం నిజం కానట్లుగా, కర్మానుభవం అయిన దాకా శరీరం ఉంటుంది. అని సాంఖ్య యోగాన్ని సనకాదులకు చెప్పాను. అది వినిన బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు తెలుసుకున్నారు. ఆ యోగం వారి వలన భూలోకంలో ప్రసిద్ధమైంది. కాబట్టి, నీవు తెలుసుకుని పుణ్యాశ్రమాలకు వెళ్ళు. ఇంకా, నా మీద భక్తి ఆసక్తికలవారి పాదరేణువులు తన శరీరానికి సోకించుకుండేవాడు; శంఖమూ చక్రమూమొదలైన ముద్రలను ధరించేవాడు; హరిదివ్యనామాలు ధరించేవారికీ అన్నమూ నీళ్ళూ ఇచ్చేవాడు; విష్ణుభక్తులను కాంచి సంతోషించేవాడు కూడ భాగవతుడు అని తెలియుము. అన్ని సంగాలను వదలి, ఇతరము ఎరుగక, నన్నేతలచే మానవునకు భుక్తినీ, ముక్తినీ ఇస్తాను.” అని బోధించాడు. అంత, ఉద్ధవుడు ధ్యానమార్గ స్వరూపం చెప్ప మని మళ్ళీ అడిగాడు. శ్రీహరి ఇలా అన్నాడు.
“ఏకాంతంగా కూర్చుని తొడలమీద చేతులు కలిపి పెట్టుకుని, ముక్కు చివర చూపు నిలిపి, ప్రాణాయామంతో నన్ను హృదయంలో ఉన్నవాడిగా భావించి. పద్దెనిమిది విధాల ధారణా యోగసిద్ధులను తెలుసుకుని, అందు అణిమ మొదలైన వానిని ప్రధాన సిద్ధులుగా గ్రహించి, ఇంద్రియాలను బంధించి, మనస్సును ఆత్మలో చేర్చి, ఆత్మను పరమాత్మతో లగ్నంచేసి, బ్రహ్మపదాన్మి పొందే భాగవతశ్రేష్ఠులు ఇతర విషయాలు మాని నన్నే పొందుతారు.
ఇంతకుముందు పాండుకుమారుడైన అర్జునుడు రణరంగంలో విషాదం పొంది, ఇలానే అడిగితే, అతనికి చెప్పిందే నీకూ చెప్తున్నాను విను. చరచరాత్మకం అయిన ఈ ప్రపంచమంతా, నా ఆకారంగా భావించి భూతాలలో ఆధారభూతము సూక్ష్మములందు జీవుడు, దుర్జనమైన వాటిలో మనస్సు, దేవతలలో బ్రహ్మదేవుడు, వసువులలో అగ్ని, ఆదిత్యులలో విష్ణువు, రుద్రులలో నీలలోహితుడు, బ్రహ్మలందు భృగువు, ఋషులందు నారదుడు, ధేనువులందు కామధేనువు, సిద్ధులలో కపిలుడు, దైత్యులలో ప్రహ్లదుడు, గ్రహాలలో చంద్రుడు, ఏనుగులలో ఐరావతము, గుఱ్ఱములలో ఉచ్ఛైశ్రవము, నాగులలో వాసుకి, మృగములలో సింహము, ఆశ్రమములలో గృహస్థాశ్రమము, వర్ణములలో ఓంకారము, నదులలో గంగ, సముద్రములలో పాలసముద్రము, ఆయుధములలో ధనస్సు, కొండలలో మేరువు, చెట్లలో అశ్వత్థము, ఓషధులలో యవలు, యజ్ఞములలో బ్రహ్మయజ్ఞము, వ్రతములలో అహింస, యోగములలో ఆత్మయోగము, స్త్రీలలో శతరూప, పలుకులలో సత్యము, ఋతువులందు వసంతము, మాసములలో మార్గశిరము, నక్షత్రములలో అభిజిత్తు, యుగములలో కృతయుగము, భగవదాకారములలో వాసుదేవుడు, యక్షులలో కుబేరుడు, వానరులలో ఆంజనేయుడు, రత్నములందు పద్మరాగము, దానములలో అన్నదానము, తిథులయందు ఏకాదశి, నరులలో వైష్ణవ భాగవతుడు ఇవి అన్నీ నా విభూతులుగా తెలుసుకో.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశించాడు. మళ్ళీ ఉద్ధవుడు ఇలా అడిగాడు.

తెభా-11-106-క.
ర్ణాశ్రమధర్మంబులు
నిర్ణయముగ నాన తిమ్ము నీరజనాభా!
ర్ణరసాయనముగ నవి
ర్ణింపుము, వినెద నేఁడు నరుహనేత్రా!

టీక:- వర్ణ = చతుర్వర్ణముల {చాతుర్వర్ణములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర వర్ణములు}; ఆశ్రమ = చతురాశ్రమముల {చతురాశ్రమములు - 1బ్రహ్మచర్య 2గృహస్థ 3వానప్రస్థ 4సన్యాస ఆశ్రమములు}; ధర్మంబులున్ = ధర్మములు; నిర్ణయముగన్ = నిర్దిష్టమైనదిగా; ఆనతిమ్ము = తెలియజెప్పుము; నీరజనాభా = కృష్ణా {నీరజనాభుడు - నీరజము (పద్మము) నాభిని కలవాడు, విష్ణువు}; కర్ణ = చెవులకు; రసాయనముగన్ = ఇంపుగ; అవి = వాటిని; వర్ణింపుము = వివరించిచెప్పుము; వినెద = వింటాను; నేడు = ఇవాళ; వనరుహనేత్రా = పద్మాక్షా, కృష్ణా.
భావము:- “పద్మనాభా! కమలలోచనా! చతుర్వర్ణములు చతురాశ్రమములు వాటి ధర్మములు నిర్ణయించి చెవులకింపు అయ్యేలా చెప్పు వింటాను.”

తెభా-11-107-వ.
అనినం గృష్ణుండు నాలుగు వర్ణంబుల యుత్పత్తియు నాలుగాశ్రమంబుల కిట్టిట్టి వర్హంబు లనియును, నాలుగు వేదంబులం జెప్పిన ధర్మంబులును, బ్రవృత్తి నివృత్తి హేతువు లగు పురాణేతిహాస శాస్త్రంబులును, వైరాగ్యవిజ్ఞానంబులును నివి మొదలుగాఁ గలవన్నియు నెఱిగించి, “సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ” యను నుపనిషత్తుల్యంబగు గీతావచన ప్రకారంబున నెవ్వఁడేని నా యందు మతి గలిగి వర్తించు వాఁడు నేనని పలుకంబడుఁ; బెక్కు విధంబుల వాదంబు లేల? యని యెందును దగులువడక నామీఁదఁ దలంపు గలిగి వర్తింపు” మనిన నుద్ధవుం డిట్లనియె.
టీక:- అనినన్ = అని అడుగగా; కృష్ణుండు = కృష్ణుడు; నాలుగువర్ణంబుల = చాతుర్వర్ణముల; ఉత్పత్తియున్ = పుట్టుక; నాలుగాశ్రమంబుల = చతురాశ్రమముల; కున్ = కు; ఇట్టట్టివి = వేటివివాటికిఇలాంటివి; అర్హంబులు = తగినవి; అనియును = అని; నాలుగువేదంబులన్ = చతుర్వేదములందు {చతుర్వేదములు - 1ఋగ్వేదము 2యజుర్వేదము 3సామవేదము 4అధర్వణవేదము}; చెప్పిన = చెప్పినట్టి; ధర్మంబులునున్ = ధర్మములు; ప్రవృత్తి = ప్రవృత్తిమార్గము; నివృత్తి = నివృత్తిమార్గము; హేతువులు = కారణభూతులు; అగు = ఐన; పురాణ = పురాణములు {పురాణములు - అష్టాదశ పురాణములు}; ఇతిహాస = ఇతిహాసములు; శాస్త్రంబులును = శాస్త్రములు; వైరాగ్య = వైరాగ్యము; విజ్ఞానంబులును = విజ్ఞానములు; ఇవి = ఇవి; మొదలుగాన్ = మున్నగునవి; కలవి = ఉన్నవి; అన్నియున్ = అన్ని; ఎఱిగించి = తెలిపి; సర్వ = అన్ని; ధర్మాన్ = ధర్మములను; పరిత్యజ్య = విడిచిపెట్టి; మమ = నన్ను; ఏకం = మాత్రమే; శరణం = శరణు; వ్రజ = పొందుము; అను = అనెడి; ఉపనిషత్ = ఉపనిషత్తులతో; తుల్యంబు = సమానమయినది; అగు = ఐన; గీతా = భగవద్గీత యందలి; వచన = వాక్యము; ప్రకారంబునన్ = ప్రకారముగ; ఎవ్వడేనిన్ = ఎవరైతే; నా = నా; అందున్ = అందు; మతిన్ = బుద్ధి; కలిగి = ఉండి; వర్తించు = ప్రవర్తించెడి; వాడు = అతడు; నేను = నేనే; అని = అని; పలుకంబడున్ = చెప్పబడుతాడు; పెక్కు = అనేక; విధంబుల = రకముల; వాదంబులు = తగవులు; ఏలన్ = ఎందుకు; అని = అని; ఎందునున్ = దేనిలో; తగులుపడక = లగ్నముకానీక; నా = నా; మీదన్ = మీదనే; తలంపు = మనసుపెట్టుట; కలిగి = కలిగి; వర్తింపుము = నడచుకొనుము; అనినన్ = అని చెప్పగా; ఉద్దవుండు = ఉద్దవుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా అడిగిన ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు నాలుగు వర్ణాల పుట్టుక; నాలుగు ఆశ్రమాలకూ తగిన పద్ధతులు; నాలుగు వేదాలలో చెప్పిన ధర్మాలు; ప్రవృత్తి నివృత్తి హేతువులయిన పురాణములు, ఇతిహాసములు, శాస్త్రములు; వైరాగ్య విజ్ఞానములు; మొదలైనవన్నీ తెలిపాడు. “సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ” ధర్మంబులు సకలం విడిచి నన్నొక్కనినే శరణు పొందు అనే ఉపనిషత్తులతో సమానమయిన గీతాప్రవచనం ప్రకారం. నాయందు మనస్సు కలిగి ప్రవర్తించేవాడు నేనని చెప్పబడతాడు. పలువిధాలైన వాదాలెందుకు ఇతరత్రా మనస్సు లగ్నం కానీయకుండా, నామీదనే తలపు కలిగి నడచుకో. అనగా ఉద్ధవుడు ఇలా అన్నాడు.

తెభా-11-108-క.
తెలియనివి కొన్ని సెప్పితి;
తెలియంగల వెల్ల నింకఁ దెలుపుము కృష్ణా!
నెఱిఁగి మెలఁగవలయును
లినాసనజనక! భక్తతపదయుగళా!

టీక:- తెలియనివి = నాకు తెలియనివి; కొన్ని = కొన్ని; చెప్పితి = చెప్పావు; తెలియంగల = ఇంకాతెలుసుకోవలసినవి; ఎల్లన్ = అన్నిటిని; ఇంకన్ = ఇంకా; తెలుపుము = తెలియజేయుము; కృష్ణా = కృష్ణా; వలను = ఒప్పిదము, విధానము; ఎఱిగి = తెలిసి; మెలగవలయును = నడచుకొనవలెను; నళినాసనజనక = కృష్ణా {నళినాసనజనకుడు - నళినాసనుని (బ్రహ్మ యొక్క) జనకుడు, విష్ణువు}; భక్తనతపదయుగళా = కృష్ణా {భక్తనతపదయుగళుడు - భక్తులుచే నుతింపబడు పాదముల జంట కలవాడు, విష్ణువు}.
భావము:- “బ్రహ్మదేవుడిని కన్నతండ్రి! భక్తులు నమస్కరించే పాదద్వయం కల శ్రీకృష్ణా! తెలియనివి కొన్ని చెప్పావు. ఇంకా తెలియవలసినవి ఏవైనా ఉంటే తెలుపు. వాటిని తెలుసుకుని కృతార్ధుడను అవుతాను.”

తెభా-11-109-వ.
అని యుద్ధవుం డడగినం బ్రబుద్ధమనస్కుం డయిన పుండరీకాక్షుండు “నీ ప్రశ్నంబులు దుర్లభంబు లయినను వినుము; నియమ శమ దమాదులు దపంబును సుఖదుఃఖంబులు స్వర్గ నరకంబులుననం బరఁగినవి యెవ్వి, దరిద్రుం డెట్టివాఁ డీశ్వరుండెవ్వం, డని నీవు నన్నడిగిన యర్థంబు లెల్ల వేఱువేఱ వివరించెద; మౌనవ్రత బ్రహ్మచర్య క్షమా జప తపంబులును, నతిథిసత్కారంబును, బరహితంబును, జౌర్యాదిరహితత్వంబును ననునివి మొదలైనవి నియమంబు లనందగు; నింద్రియనిగ్రహంబును, శత్రుమిత్ర సమత్వంబును, శమం బనం బరఁగు; మూఢజనులకు జ్ఞానోపదేశంబును, గామ్యత్యాగంబును, సమదర్శనంబును, వైష్ణవ సమూహంబులతోడి భక్తియుఁ, బ్రాణాయామంబును, జిత్తశుద్ధియు నను నివి కలిమివిద్య యనంబడు; శమదమాది గుణరహితుండును, మద్భక్తి విరహితుండును నగుట యవిద్య యనందగుఁ; జిత్తశుద్ధి గలిగి నిత్యతృప్తుండౌట దమం; బిట్టి నియమాది గుణ సహితత్వంబును మద్భక్తియుక్తియు ననునదియే సుఖంబు; నన్నెఱుంగలేక తమోగుణంబునం బరఁగుటయె దుఃఖం బనంబడు; బంధు గురు జనంబుల యెడ భేదబుద్ధి నొంది, శరీరంబు నిజగృహంబుగా భావించినవాఁడె దరిద్రుం; డింద్రియ నిరసనుండును, గుణ సంగ విరక్తుండు నైనవాఁడె యీశ్వరుండు; నాయందుఁ దలంపు నిలిపి, కర్మయోగంబునందును, భక్తి యోగంబునందును వాత్సల్యంబు గలిగి జనకాదులు కైవల్యంబుఁ జెందిరి; భక్తియోగంబునం జేసి బలి ప్రహ్లాద ముచుకుందాదులు పరమ పదప్రాప్తులై; రది గావున నిది యెఱింగి నిరంతర భక్తియోగం బధికంబుగా నీ మనంబున నిలుపుము; మృణ్మయంబైన ఘటంబున జలంబులు జాలుగొను తెఱంగున దినదినంబునకు నాయువు క్షయం బై మృత్యువు సన్నిహితం బై వచ్చుఁ గావున నిది యెఱింగి నిరంతంరంబును నన్నేమఱక తలంచుచుండు నతండు నాకుం బ్రియుండు.
టీక:- అని = అని; ఉద్దవుండు = ఉద్దవుడు; అడిగినన్ = అడుగగా; ప్రబుద్ధమనస్కుండు = జ్ఞానాత్మకుండు; అయిన = ఐన; పుండరీకాక్షుండు = కృష్ణుడు; నీ = నీ యొక్క; ప్రశ్నంబులు = ప్రశ్నలు; దుర్లభంబులు = కష్టసాధ్యమైనవి; అయినను = అయినప్పటికి; వినుము = వినుము; నియమ = నియమములు; శమ = శమము; దమ = దమము; ఆదులున్ = మున్నగునవి; తపంబును = తపస్సు; సుఖ = సుఖములు; దుఃఖంబులున్ = దుఃఖములు; స్వర్గ = స్వర్గము; నరకంబులున్ = నరకములు; అనన్ = అనగా; పరగినవి = తెలియబడునవి; ఎవ్వి = ఏవి; దరిద్రుండు = దరిద్రుడు; ఎట్టి = ఎటువంటి; వాడు = వాడు; ఈశ్వరుండు = ఈశ్వరుండంటే; ఎవ్వండు = ఎవరు; అని = అని; నీవు = నీవు; నన్ను = నన్ను; అడిగిన = ప్రశ్నంచిన; అర్థంబులు = విషయములు; ఎల్లన్ = అన్నిటిని; వేఱువేఱ = విడివిడిగ; వివరించెద = వివరించెదను; మౌనవ్రత = మౌనవ్రతము; బ్రహ్మచర్య = బ్రహ్మచర్యము; క్షమా = ఓర్పు; జప = జపము; తపంబులునున్ = తపస్సులు; అతిథి = అతిథులను; సత్కారంబును = ఆదరించుట; చౌర్య = దొంగతనము; ఆది = మున్నగునవి; రహితంబునున్ = లేకపోవుట; అను = అనెడి; ఇవి = ఇవి; మొదలైనవి = అలాంటివి; నియమంబులు = నియమములు; అనందగున్ = అనవచ్చును; ఇంద్రియనిగ్రహంబును = ఇంద్రియనిగ్రహము; శత్రు = శత్రువుల ఎడ; మిత్ర = మిత్రుల ఎడ; సమత్వంబును = సమానభావము; శమంబు = శమము; అనన్ = అని; పరగున్ = తెలియబడును; మూఢులు = మూఢజనుల; కున్ = కు; జ్ఞాన = జ్ఞానమును; ఉపదేశంబును = ఉపదేశించుట; కామ్య = కోరికలను; త్యాగంబును = వదలుట; సమదర్శనంబు = అన్నిటియందు సమదృష్టి; వైష్ణవ = విష్ణుభక్తుల; సమూహంబుల = సమూహముల; తోడి = తోటి; భక్తియున్ = భక్తి; ప్రాణాయామంబును = ప్రణాయామము; చిత్త = మనస్సు; శుద్ధియున్ = నిర్మలత్వము; అను = అనెడి; ఇవి = ఇవి; కలిమి = కలిగి ఉండుట; విద్య = విద్య; అనంబడు = అంటారు; శమ = శమము; దమ = దమము; ఆది = మున్నగువాని; గుణ = లక్షణములు; రహితుండును = లేనివాడు; మత్ = నా యందు; భక్తి = భక్తి; విరహితుండును = లేనివాడు; అగుట = ఐ ఉండుట; అవిద్య = అవిద్య; అనందగున్ = అనవచ్చును; చిత్తశుద్ధి = మనోనైర్మల్యము; కలిగి = ఉండి; నిత్య = ఎప్పుడు; తృప్తుండు = తృప్తిచెందినవాడు; ఔట = అగుట; తమంబు = తమము; ఇట్టి = ఇటువంటి; నియమ = నియమము; ఆది = మున్నగు; గుణ = గుణములు; సహిత్వంబును = కలిగి ఉండుట; మత్ = నా యందు; భక్తి = భక్తి; యుక్తియున్ = కలిగి ఉండుట; అనునదియే = అన్నదే; సుఖంబు = సుఖము; నన్ను = నన్ను; ఎఱుంగ = తెలిసికొన; లేక = లేక; తమోగుణంబునన్ = తమోగుణములో; పరగుట = ఉండుటే; దుఃఖంబు = దుఃఖము; అనంబడు = అనబడుతుంది; బంధు = బంధువులందు; గురు = పెద్దవారైన; జనంబులన్ = వారి; ఎడన్ = అందు; భేద = వ్యతిరిక్త; బుద్ధిన్ = భావమును; ఒంది = పొంది; శరీరంబున్ = దేహము; నిజ = శాశ్వతమైన; గృహంబు = నివాసము; కాన్ = ఐనట్లు; భావించిన = తలచెడి; వాడె = అతడుమాత్రమే; దరిద్రుండు = దరిద్రుడు; ఇంద్రియ = ఇంద్రియాలను; నిరసనుండును = జయించినవాడు; గుణ = గుణములతో; సంగ = తగులమునందు; విరక్తుండున్ = అనాసక్తుడు; ఐన = అయినట్టి; వాడె = అతనె; ఈశ్వరుండు = ఈశ్వరుడు; నా = నా; అందున్ = ఎడల; తలంపు = మనస్సు; నిలిపి = నిలుపుకొని; కర్మయోగంబున్ = కర్మయోగము; అందును = లో; భక్తియోగంబున్ = భక్తియోగము; అందునున్ = అందు; వాత్సల్యంబు = అభిమానము; కలిగి = ఉండి; జనక = జనకుడు; ఆదులున్ = మున్నగువారు; కైవల్యంబున్ = మోక్షమును; చెందిరి = పొందిరి; భక్తియోగంబునన్ = భక్తియోగము; చేసి = వలన; బలి = బలిచక్రవర్తి; ప్రహ్లాద = ప్రహ్లాదుడు; ముచుకుంద = ముచుకుందుడు; ఆదులున్ = మున్నగువారు; పరమపద = ముక్తిమార్గమును; ప్రాప్తులు = పొందినవారు; ఐరి = అయ్యారు; అదిగావున = కాబట్టి; ఇది = ఇది; ఎఱింగి = తెలిసికొని; నిరంతర = ఎప్పుడు; భక్తియోగంబు = భక్తియోగము; అధికంబుగా = ఎక్కువగా; నీ = నీ యొక్క; మనంబునన్ = మనస్సునందు; నిలుపుము = ధరించుము; మృణ్మయంబు = మట్టితో చేయబడినది; ఐన = అయిన; ఘటంబునన్ = పచ్చికుండలోని; జలంబులు = నీళ్ళు; జాలుగొను = కారిపోయెడి; తెఱంగునన్ = విధముగ; దినదినంబునకు = ప్రతిరోజు; ఆయువు = ఆయుష్షు; క్షయంబు = తరిగిపోయినది; ఐ = అయ్యి; మృత్యువు = చావు; సన్నిహితంబు = దగ్గరపడెడిది; ఐ = అయ్యి; వచ్చును = జరుగును; కావున = కనుక; ఇది = దీనిని; ఎఱింగి = తెలిసికొని; నిరంతరంబును = ఎల్లప్పుడు; నన్ను = నన్ను; ఏమఱక = ఏమరుపాటుచెందకుండ; తలంచుచున్ = స్మరించుచు; ఉండు = ఉండెడి; అతండు = వాడు; నా = నా; కున్ = కు; ప్రియుండు = ఇష్టుడు.
భావము:- ఇలా ఉద్ధవుడు అడుగగా జ్ఞానాత్మకుడైన శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. “ఉద్ధవా! నీ ప్రశ్నలు సామాన్య మైనవి కావు. అయినా విను, చెప్తాను. యమ నియమాలూ శమదమాలు మొదలైనవి ఏవి? తపమనగా ఏమి? సుఖదుఃఖాలు స్వర్గనరకాలూ ఏవి? దరిద్రుడు అంటే ఎట్టివాడు? ఈశ్వరు డంటే ఎవరు? అని నీవు అడిగిన విషయాలన్నీ విడివిడిగా వివరిస్తాను.
మౌనవ్రతము, బ్రహ్మచర్యము, ఓర్పు, జపము, తపము, అతిధులను సత్కరించుట, పరహితము, దొంగతనమూ మొదలైనవి లేకుండుట, ఇటువంటివి నియమాలు అనబడతాయి. ఇంద్రియాలను వశంలో ఉంచుకోవటం, శత్రువులందు మిత్రులందు సమభావంతో ఉండటం శమము. మూఢులకు జ్ఞానాన్ని ఉపదేశించటము, కోరికలను వదలటం, సమదర్సనం, వైష్ణవభక్తి, ప్రాణాయామం, మనోనిర్మలత్వం వీటిని విద్య అంటారు. శమదమాది గుణాలు లేకపోవటం, నామీద భక్తి లేకపోవటం, అవిద్య అంటారు, చిత్తశుద్ధి కలిగి ఎప్పుడు తృప్తిగా ఉండటం దమము. ఇటువంటి నియమాలు గుణాలు కలిగి, నామీద భక్తి కలిగి ఉండటమే సుఖము. నన్ను తెలుసుకోలేక తమోగుణముతో ఉండటమే దుఃఖము. బంధువులందు గురువులందు భేదబుద్ధి పొంది శరీరాన్ని తన ఇల్లుగా భావించేవాడే దరిద్రుడు. ఇంద్రియాలను జయించి గుణసంగములలో విరక్తుడైన వాడే ఈశ్వరుడు.
నా మీద మనసును నిలిపి కర్మయోగమందు, భక్తియోగమందు అభిమానం కలిగిన జనక మహారాజు మొదలైన వాళ్ళు మోక్షం పొందారు. భక్తియోగం సాధించి బలి, ప్రహ్లాదుడు, ముచుకుందుడు మున్నగువారు పరమపదాన్ని పొందారు. కనుక, ఈ విషయాల్ని తెలుసుకుని ఎప్పుడూ భక్తియోగాన్ని ఎక్కువగా నీ మనసులో నింపుకో. మట్టికుండకు చిల్లుపడితే నీళ్ళు కారిపోవునట్లు దినదినము ఆయువు తరిగిపోతూ చావు దగ్గరపడుతు ఉంటుంది. కాబట్టి, ఇది ఎరిగి ఎప్పుడూ ఏమరక నన్ను స్మరిస్తూ ఉండేవాడు, నాకు ప్రియుడు.

తెభా-11-110-క.
ర్భమునఁ బరిజ్ఞానము
నిర్భరమై యుండు జీవునికిఁ దుది నతఁ డా
విర్భూతుఁ డైనఁ జెడు నం
ర్భావంబైన బోధ మంతయు ననఘా!

టీక:- గర్భమునన్ = గర్భములో ఉన్నప్పుడు; పరిజ్ఞానము = విజ్ఞానము; నిర్భరము = నిండుగా ఉన్నది; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; జీవుని = మానవున; కిన్ = కు; అతడు = అతను; ఆవిర్భూతుడు = జన్మించినవాడు; ఐనన్ = కాగానే; చెడున్ = నశించిపోవును; అంతర్భావంబు = లోననుండునది; ఐన = అయిన; బోధము = జ్ఞానము; అంతయున్ = సమస్తము; అనఘా = పాపరహితుడా.
భావము:- ఉద్ధవా! గర్భంలో ఉన్నప్పుడు జీవుడికి పూర్తి జ్ఞానం ఉంటుంది. కడుపులోంచి భూమిమీద పడగానే ఆ జ్ఞానమంతా పోతుంది.

తెభా-11-111-వ.
అట్లు గావున జనుండు బాల్య కైశోర కౌమార వయోవిశేషంబుల వెనుకనైననుం, బెద్దయైన వెనుకనైనను, నన్నెఱింగెనేనిఁ గృతకృత్యుండగుఁ; సంపద్గర్వాంధుం డైన నంధకారకూపంబునం బడు; వానిం దరిద్రునింగాఁ జేసిన జ్ఞానియై యస్మత్పాదారవింద వందనాభిలాషియై ముక్తుండగు; నట్లుగావున దేహాభిమానంబు వర్జించి యైహికాముష్మిక సుఖంబులఁ గోరక మనంబు గుదియించి యే ప్రొద్దు నన్నుఁ దలంచువాఁడు వైకుంఠపద ప్రాప్తుండగు; నేను నతని విడువంజాలక వెనువెంట నరుగుదు; నారదాది మునులు భక్తి భావంబునం జేసి నా రూపం బై” రని యుద్ధవునకుం జెప్పిన, నతండు మఱియు నిట్లనియె.
టీక:- అట్లుగావున = కాబట్టి; జనుండు = మానవుడు; బాల్య = పసిపిల్లవానిగ ఉన్న; కైశోర = పిల్లవానిగా ఉన్న; కౌమార = యువకుడుగా ఉన్న; వయోవిశేషంబులన్ = అవస్థలందుగాని; వెనుకన్ = తరువాత; ఐననున్ = అయిన; పెద్ద = పెద్దవాడు; ఐన = అయిన; వెనుకన్ = తరువాత; ఐననున్ = అయినప్పటికి; నన్ను = నన్ను; ఎఱింగెనేని = తెలిసికొనినచో; కృతకృత్యుండ = ధన్యుడు; అగున్ = అగును; సంపత్ = సంపదలున్నవన్న; గర్వ = గర్వముచేత; అంధుండు = గుడ్డివాడు; ఐనన్ = అయినచో; అందకార = చీకటి; కూపంబునన్ = నూతిలో; పడున్ = పడిపోవును; వానిన్ = అటువంటివాడిని; దరిద్రునిన్ = బీదవాడు; కాన్ = ఔనట్లు; చేసినన్ = చేసినచో; జ్ఞాని = జ్ఞానముకలవాడు; ఐ = అయ్యి; అస్మత్ = నా యొక్క; పాద = పాదములనెడి; అరవింద = పద్మములను; వందనా = నమస్కరించుటందు; అభిలాషి = కోరిక కలవాడు; ఐ = అయ్యి; ముక్తుండు = మోక్షముపొందినవాడు; అగున్ = అగును; అట్లుగావున = కాబట్టి; దేహా = శరీరమునందు; అభిమానంబు = మమత్వము; వర్జించి = వదలిపెట్టి; ఐహిక = ఈ లోకమునకు చెందిన; ఆముష్మిక = పరలోకమునకలిగెడి; సుఖంబులన్ = సుఖములను; కోరక = ఆశించక; మనంబున్ = మనస్సును; కుదియించి = నిగ్రహించి; ఏప్రొద్దు = ఎల్లప్పుడు; నన్నున్ = నన్నే; తలంచు = స్మరించెడి; వాడు = వాడు; వైకుంఠపద = విష్ణులోకమును; ప్రాప్తుండు = పొందినవాడు; అగున్ = అగును; నేనున్ = నేను; అతనిన్ = అతనిని; విడువంజాలక = వదలలేక; వెనువెంటన్ = కూడకూడ; అరుగుదున్ = పోయెదను; నారద = నారదుడు; ఆది = మున్నగు; మునులు = ఋషులు; భక్తిభావంబునన్ = భక్తిభావము; చేసి = వలన; నారూపంబు = సారూప్యంబుపొందినవారు; ఐరి = అయ్యారు; అని = అని; ఉద్దవున్ = ఉద్దవుని; కున్ = కి; చెప్పినన్ = చెప్పగా; అతండు = అతను; మఱియున్= ఇంకా; ఇట్లు = ఇలా; అనియె = అనెను.
భావము:- అందుచేత, మానవుడు పసివానిగా కాని, పిల్లవానిగా కాని, యువకునిగ కాని, పెద్దవాడు అయిన పిమ్మట కాని నన్ను తెలుసుకుంటే కృతార్థుడు అవుతాడు. సంపదలు ఉన్నాయని గర్వంతో గ్రుడ్డివాడు అయితే చీకటిబావిలో పడతాడు. అటువంటివాడిని దరిద్రునిగా చేస్తే, జ్ఞాని అయి నా పాదపద్మాలకు నమస్కరించాలనే అభిలాష కలుగుతుంది. మోక్షం పొందుతాడు. శరీరము మీద అభిమానము వదలి ఈ లోకానికి పరలోకానికి చెందిన సుఖాలను కోరక మనస్సును నిగ్రహించుకొని, ఎల్లవేళలా నన్ను స్మరించేవాడు వైకుంఠాన్ని పొందుతాడు. నేనూ అతనిని విడచిపెట్టలేక వాని వెనువెంటనే వెళ్ళుతుంటాను. నారదుడు మున్నగు మునులు భక్తిభావం వలన నా సారూప్యం పొందారు.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పగా అతడు మరల ఇలా అన్నాడు.

తెభా-11-112-క.
య్యా! దేవ! జనార్దన!
నెయ్యంబున సృష్టికర్త నేర్పరియై తా
నొయ్యన నడపును నెవ్వఁడు
య్యన నెఱిఁగింపవయ్య! ర్వజ్ఞనిధీ!

టీక:- అయ్యా = తండ్రీ; దేవ = భగవంతుడా; జనార్దన = కృష్ణా; నెయ్యంబునన్ = మైత్రితో; సృష్టికర్తన్ = బ్రహ్మదేవుని; నేర్పరి = సమర్థుడు; ఐ = అయ్యి; తాన్ = అతను; ఒయ్యనన్ = చక్కగా; నడుపున్ = నడిపించును; ఎవ్వడు = ఎవరు; సయ్యన = శీఘ్రమే; ఎఱిగింపవు = తెలియజెప్పుము; అయ్య = తండ్రి; సర్వజ్ఞనిధీ = కృష్ణా {సర్వజ్ఞనిధి - సర్వజ్ఞత్వమున (సమస్తము ఎరుగుట)కే నిధివంటివాడు, విష్ణువు}.
భావము:- “స్వామీ! దేవదేవా! వాసుదేవా! జనార్ధనా! నీవు సర్వజ్ఞుడవు. సృష్టికర్తను ఎవరు నేర్పుతో నడుపుతాడో ఆనతీయవలసింది.”

తెభా-11-113-వ.
అనుటయు హరి యుద్ధవునకుం జెప్పె; “నట్లు మత్ప్రేరితంబులై మహదాది గుణంబులు గూడి యండం బై యుద్భవించె; నా యండంబువలన నేనుద్భవించితి; నంత నా నాభివివరంబున బ్రహ్మ యుదయించె; సాగరారణ్య నదీ నద సంఘంబులు మొదలుగాఁ గల జగన్నిర్మాణంబు లతనివలనం గల్పించితి; నంత శతానందునకు శతాబ్దంబులు పరిపూర్ణం బైన ధాత్రి గంధంబునందడంగు; నా గంధం బుదకంబునం గలయు; నా యుదకంబు రసంబున లీనంబగు; నా రసంబు తేజోరూపంబగు; నా తేజంబు రూపంబున సంక్రమించు; నా రూపంబు వాయువందుం గలయు; వాయువు స్పర్శగుణసంగ్రాహ్యం బైన స్పర్శగుణం బాకాశంబున లయంబగు; నా యాకాశంబు శబ్దతన్మాత్రచే గ్రసియింపఁబడిన నింద్రియంబులు మనోవైకారిక గుణంబులం గూడి యీశ్వరునిం బొంది, యీశ్వరరూపంబు దాల్చు; నేను రజస్సత్త్వతమోగుణ సమేతుండనై త్రిమూర్తులు వహించి, జగదుత్పత్తి స్థితి లయ కారణుండనై వర్తిల్లుదుఁ; గావున నీ రహస్యంబు నీకు నుపదేశించితిఁ, బరమపావనుండవుఁ బరమభక్తి యుక్తుండవుఁ గ”మ్మని చెప్పె; నంత.
టీక:- అనుటయున్ = అని అడుగగా; హరి = కృష్ణుడు; ఉద్దవున్ = ఉద్దవుని; కున్ = కి; చెప్పెన్ = చెప్పెను; అట్లు = అలా; మత్ = నాచే; ప్రేరితంబులు = ప్రేరేపింపబడినవి; ఐ = అయ్యి; మహదాది = చతుర్వింశతితత్వంబుల {మహదాది - చతుర్వింశతితత్వంబులు, (1)మహత్తు (1)పురుషుడు (1)ప్రకృతి (5)పంచభూతములు (5)పంచతన్మాత్రలు (5)పంచకర్మేంద్రియములు (5)పంచజ్ఞానేంద్రియములు మరియు (1)అంతఃకరణము మొత్తము 1+1+1+5+5+5+5+1 = 24}; కూడి = కూడుకొని; అండంబు = అండము, బ్రహ్మాండము; ఐ = అయ్యి; ఉద్భవించెన్ = ఏర్పడెను; ఆ = ఆ యొక్క; అండంబు = బ్రహ్మాండము; వలన = వలన; నేనున్ = నేను; ఉద్భవించితిన్ = పుట్టితిని; అంత = తరువాత; నా = నా యొక్క; నాభివివరంబునన్ = బొడ్డురంధ్రమునండి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఉదయించె = పుట్టెను; సాగర = సముద్రాలు; అరణ్య = అడవులు; నదీ = నదులు; నద = నదములు; సంఘంబులు = సమూహములు; మొదలుగా = మొదలైనవి అన్ని; కల = ఉన్నట్టి; జగత్ = ప్రపంచములోని; నిర్మాణంబులు = సృష్టి అంతా; అతని = అతని; వలనన్ = వలన; కల్పించితి = సృష్టింపజేసితిని; అంతన్ = అప్పుడు; శతానందున్ = బ్రహ్మదేవుని {శతానందుడు - బ్రహ్మదేవుడు, వ్యు.శత+ఆ+నంద+అణ్, కృ.ప్ర., పలువురిని ఆనందపెట్టువాడు}; కున్ = కి; శత = వంద (100); అబ్దంబులు = సంవత్సరములు; పరిపూర్ణంబు = పూర్తయినకాలము; ఐన = జరిగేక; ధాత్రి = భూమి; గంధంబునన్ = గంధగుణములో; అడంగున్ = అణగిపోవును; ఆ = ఆ; గంధంబున్ = గంధము; ఉదకంబునన్ = నీటిలో; కలయున్ = లీనమగును; ఆ = ఆ; ఉదకంబున్ = నీరు; రసంబునన్ = రసగుణములో; లీనంబు = కలిసిపోయినది; అగున్ = అగును; ఆ = ఆ; రసంబున్ = రసము; తేజస్ = తేజస్సు యొక్క; రూపంబు = రూపమును దరించినది; అగున్ = అగును; తేజంబున్ = తేజస్సు; రూపంబునన్ = రూపగుణమున; సంక్రమించున్ = లయమైపోవును; ఆ = ఆ; రూపంబున్ = రూపము; వాయువు = వాయువు; అందున్ = లో; కలయున్ = కలిసిపోవును; వాయువు = వాయువు; స్పర్శగుణ = స్పర్శగుణముచే; సంగ్రాహ్యము = లయంచేసుకోబడినది; ఐనన్ = కాగా; స్పర్శగుణంబు = స్పర్శగుణము; ఆకాశంబునన్ = ఆకాశములో; లయంబు = లీనమైనది; అగున్ = అగును; ఆ = ఆ; ఆకాశంబున్ = ఆకాశము; శబ్దతన్మాత్ర = శబ్దగుణముచే; గ్రసియింపబడినన్ = లయంచేసుకోబడగా; ఇంద్రియంబులు = ఇంద్రియాలు; మనః = మనస్సు; వికారికగుణంబులన్ = వికారములతో; కూడి = కలిసి; ఈశ్వరునిన్ = భగవంతుని; పొంది = చెంది; ఈశ్వర = భగవంతుని; రూపంబున్ = స్వరూపమును; తాల్చున్ = ధరించును; నేనున్ = భగవంతుడనైననేను; రజస్ = రజోగుణము; సత్త్వ = సత్త్వగుణము; తమోగుణ = తమోగుణములతో; సమేతుండను = కూడినవాడను; ఐ = అయ్యి; త్రిమూర్తులు = త్రిమూర్తులరూపములు {త్రిమూర్తులు - 1బ్రహ్మ 2విష్ణు 3మహేశ్వరుడు}; వహించి = ధరించి; జగత్ = లోకముల; ఉత్పత్తి = సృష్టి; స్థితి = స్థతి; లయ = లయములకు; కారణుండను = కారణభూతుండను; ఐ = అయ్యి; వర్తిల్లుదున్ = ఉండుదును; కావున = కాబట్టి; ఈ = ఈ యొక్క; రహస్యంబు = రహస్యమును; నీ = నీ; కున్ = కు; ఉపదేశించితి = తెలియపర్చితిని; పరమ = అత్యంత; పావనుండవు = పవిత్రుడవు; పరమ = మిక్కిలి; భక్తి = భక్తి; యుక్తుండవు = కలవాడవుగా; కమ్ము = అగుము; అని = అని; చెప్పెన్ = చెప్పెను; అంత = అప్పుడు.
భావము:- అనగా శ్రీహరి ఉద్ధవుడితో ఇలా అన్నాడు. “ఆవిధంగా నాచేత ప్రేరేపించబడి మహత్తు మొదలైన గుణాలు అన్నీ కలసి ఒక అండంగా ఏర్పడ్డాయి; ఆ అండం నుంచి నేను పుట్టాను; అంతట నా నాభిలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. సముద్రాలు, అరణ్యాలు, నదులు, నదములు మొదలైన ప్రపంచ మంతా అతని చేత నేనే నిర్మింప చేసాను. ఆ బ్రహ్మదేవుడికి నూరేండ్లు నిండిన తర్వాత భూమి గంధంలో అణగిపోతుంది; గంధం నీటిలో కలుస్తుంది; ఆ నీరు రసములో లీనమవుతుంది; ఆ రసం తేజస్సు రూపాన్ని ధరిస్తుంది; ఆ తేజస్సు రూపము నందు సంక్రమిస్తుంది; ఆ రూపం వాయువులో కలుస్తుంది; ఆ వాయువు స్పర్శగా మారుతుంది; ఆ స్పర్శగుణం ఆకాశంలో లయమవుతుంది; ఆ ఆకాశం శబ్ద తన్మాత్రచే లోగొనబడుతుంది; ఇంద్రియాలు మనోవికార గుణాలతో కూడి ఈశ్వరునిలో లీనమై ఈశ్వర రూపాన్ని ధరిస్తాయి.
భగవంతుడనైన నేను రజస్సు సత్త్వము తమస్సు అనే మూడు గుణాలతోకూడి మూడుమూర్తులు ధరించి సృష్టి పుట్టుకకూ, ఉనికికీ, నాశనానికి కారణుడై వర్తిస్తాను. ఈ రహస్యాన్ని నీకు ఉపదేశించాను. కాబట్టి, పరమ పావనుడవు పరమ భక్తియుక్తుడవు కావలసింది.” ఇలా చెప్పిన కృష్ణుని పలుకులు విని ఉద్ధవుడు ఇలా ప్రశ్నించాడు.

తెభా-11-114-ఆ.
రూపు లేని నీకు రూఢిగా యోగులు
రూపు నిల్పి నిన్ను రుచిరభక్తిఁ
గొల్చి యుండ్రు; వారికోర్కుల నిచ్చెద
వేమిలాగు? నాకు నెఱుఁగఁ బలుకు.

టీక:- రూపు = ఆకృతి; లేని = లేనట్టి; నీ = నీ; కున్ = కు; రూఢిగా = నిశ్చయంగా; యోగులు = మహర్షులు; రూపు = ఒక ఆకారాన్ని; నిల్పి = స్థిరపరచి; నిన్నున్ = నిన్ను; రుచిర = ఒప్పిదమైన; భక్తిన్ = భక్తితో; కొల్చి = సేవించుచు; ఉండ్రు = ఉంటారు; వారి = వారి యొక్క; కోర్కులన్ = కోరికలను; ఇచ్చెదవు = తీర్చెదవు; ఏమిలాగు = ఏలాగున; నాకున్ = నాకు; ఎఱుగన్ = తెలియునట్లు; పలుకు = చెప్పుము.
భావము:- “రూపంలేని నీకు యోగులు ఒక ఆకారాన్ని రూఢీగా నిలిపి స్థిరమైన భక్తితో నిన్ను కొలుస్తూ ఉంటారు. నీవు వారి కోరికలు ఎలా తీరుస్తావు. నాకు తెలుపుము.”

తెభా-11-115-వ.
అని యుద్ధవుం డడిగిన నారాయణుం డిట్లనియె; “నేను సర్వవర్ణంబులకు సమంబైన పూజాప్రకారం బెఱింగించెద; నాచారంబునంజేసి యొకటిఁ బాషాణమృణ్మయదారువులం గల్పించి, నా రూపంబుగా నిల్పికొని కొందఱు పూజింతురు; కాంస్య త్రపు రజత కాంచన ప్రతిమావిశేషంబు లుత్తమంబు; లిట్లు నా ప్రతిమారూపంబు లందు మద్భావంబుంచి కొల్చినవారికి నేఁ బ్రసన్నుండనగుదు; నీ లోకంబున మనుష్యులకు ధ్యానంబు నిలువనేరదు; గావునం బ్రతిమా విశేషంబు లనేకంబులు గలవు; వానియందు సౌందర్యసారంబులు మనోహరంబులునైన రూపంబుల మనఃప్రసన్నుండనై నే నుండుదుఁ; గావున దుగ్ధార్ణవశాయిఁగా భావించి ధౌతాంబరాభరణ మాల్యానులేపనంబులను, దివ్యాన్న పానంబులను, షోడశోక్త ప్రకారంబుల రాజోపచారంబులను, బాహ్యపూజా విధానంబుల నాచరించి మత్సంకల్పితంబు లైన పదార్థంబులు సమర్పించి, నిత్యంబును నాభ్యంతరపూజావిధానంబులం బరితుష్టునిం జేసి; దివ్యాంబరాభరణ మాల్యశోభితుండును, శంఖ చక్ర కిరీటాద్యలంకార భూషితుండును, దివ్యమంగళవిగ్రహుండునుగాఁ దలంచి ధ్యానపరవశుండైన యతండు నాయందుఁ గలయు; నుద్ధవా! నీ వీ ప్రకారంబు గరిష్ఠనిష్ఠాతిశయంబున యోగనిష్ఠుండవై, బదరికాశ్రమంబు సేరి మత్కథితం బైన సాంఖ్యయోగం బంతరంగంబున నిల్పుకొని, కలియుగావసాన పర్యంతంబు వర్తింపు” మని యప్పమేశ్వరుండానతిచ్చిన నుద్ధవుండు నానందభరితాంతరంగుం డై తత్పాదారవిందంబులు హృదయంబునం జేర్చుకొని, పావనంబైన బదరికాశ్రమంబునకు నరిగె” నని శుకుండు పరీక్షిన్నరేంద్రునకుం జెప్పుటయు.
టీక:- అని = అని; ఉద్దవుండు = ఉద్దవుడు; అడిగినన్ = అడుగగా; నారాయణుండు = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; నేను = నేను; సర్వ = అన్ని; వర్ణంబుల = జాతులవారి; కున్ = కి; సమంబు = తగినది; ఐన = అయిన; పూజా = పూజించెడి; ప్రకారంబు = పద్దతిని; ఎఱిగించెదన్ = తెలియజెప్పెదను; ఆచారంబునన్ = తమ ఆచారం ప్రకారము; ఒకటి = ఒక రూపును; పాషాణ = రాతితోగాని; మృణ్మయ = మట్టితోగాని; దారువులన్ = చెక్కతోగాని; కల్పించి = తయారుచేసుకొని; నా = నా యొక్క; రూపంబు = స్వరూపము; కాన్ = ఐనట్లు; నిల్పికొని = ప్రతిష్టించుకొని; కొందఱు = కొంతమంది; పూజింతురు = పూజిస్తారు; కాంస్య = కంచుతోగాని; త్రపు = సీసంతోగాని; రజత = వెండితోగాని; కాంచన = బంగారముతోగాని; ప్రతిమా = చేయబడిన విగ్రహముల; విశేషంబులు = రకములు; ఉత్తమంబులు = శ్రేష్ఠమైనవి; ఇట్లు = ఈ విధముగ; నా = నా యొక్క; ప్రతిమా = విగ్రహ; రూపంబులు = రూపముల; అందున్ = లో; మత్ = నన్నుగా; భావంబున్ = తలచుట; ఉంచి = ధరించి; కొల్చిన = పూజించిన; వారి = వారల; కిన్ = కు; నేన్ = నేను; ప్రసన్నుండను = ప్రసన్నమైనవాడను; అగుదున్ = ఔతాను; ఈ = ఈ; లోకంబునన్ = ప్రపంచములో; మనుష్యులు = మానవుల; కున్ = కు; ధ్యానంబు = ధ్యానము; నిలువనేరదు = స్థిరముగా ఉండదు; కావునన్ = కాబట్టి; ప్రతిమా = విగ్రహములలో; విశేషంబులు = విధములు; అనేకంబులు = ఎన్నో; కలవు = ఉన్నాయి; వాని = వాటి; అందున్ = లో; సౌందర్యసారంబులు = అందమైనవి; మనోహరంబులున్ = చక్కటివి; ఐన = అయిన; రూపంబులన్ = విగ్రహములలో; మనః = మనస్ఫూర్తిగా; ప్రసన్నుండను = ప్రసన్నమైనవాడను; ఐ = అయ్యి; నేన్ = నేను; ఉండుదున్ = ఉంటాను; కావునన్ = కనుక; దుగ్దార్ణవ = పాలసముద్రమునందు; శాయిగా = శయనించినవానిగా; భావించి = భావించి; ధౌత = శుభ్రమైన; అంబర = వస్త్రములు; ఆభరణ = భూషణములు; మాల్య = పూలదండలు; అనులేపనంబులను = మైపూతలను; దివ్య = మంచి; అన్న = అన్నములు; పానంబులను = పానీయములను; షోడశోక్తప్రకారంబుల = షోడశోపచారములతో {షోడశోపచారములు - 1ఆవాహనము 2ఆసనము 3పాద్యము 4అర్ఘ్యము 5ఆచమనీయము 6స్నానము 7వస్త్రము 8యజ్ఞపవీతము 9గంధము 10పుష్పము 11ధూపము 12దీపము 13నైవేద్యము 14తాంబూలము 15నమస్కారము 16ప్రదక్షిణము}; రాజ = రాజులకు తగిన; ఉపచారంబులను = సేవలతో; బాహ్య = బాహ్యమైన; పూజా = పూజించెడి; విధానంబులన్ = పద్ధతులను; ఆచరించి = చేసి; మత్ = నా చేత; సంకల్పితంబులు = ఏర్పాటుచేయబడినవి; ఐన = అయిన; పదార్థంబులు = పదార్థములను; సమర్పించి = సమర్పించి; నిత్యంబును = ప్రతిదినము; అభ్యంతర = మానసులోనే; పూజా = పూజించెడి; విదానంబులన్ = విధానములతో; పరితుష్టునిన్ = సంతుష్టునిగా; చేసి = చేసి; దివ్య = గొప్ప; అంబర = వస్త్రములు; ఆభరణ = భూషణములు; మాల్య = పూలదండలుచే; శోభితుండును = ప్రకాశించువాడును; శంఖ = శంఖము; చక్ర = చక్రము; కిరీట = కిరీటము; ఆది = మొదలైన; అలంకార = ఆలంకారములచే; భూషితుండును = అలంకరింపబడినవాడు; దివ్య = దివ్యమైన; మంగళ = శుభకరమైన; విగ్రహుండును = స్వరూపము కలవాడు; కాన్ = ఐనట్లు; తలంచి = భావించి; ధ్యాన = ధ్యానమునందు; పరవశుండు = మైమరచినవాడు; ఐన = అయిన; అతండు = అతను; నా = నా; అందున్ = లో; కలయున్ = లీనమగును; ఉద్దావా = ఉద్దవుడా; నీవు = నీవు; ఈ = ఈ; ప్రకారంబునన్ = విధముగ; గరిష్ట = అధికమైన; నిష్ఠా = యోగనిష్ఠ; అతిశయంబునన్ = తీవ్రతతో; యోగనిష్ఠుండవు = యోగనిష్ఠగలవాడవు; ఐ = అయ్యి; బదరికా = బదరిక అనెడి; ఆశ్రమంబున్ = ఆశ్రమము; చేరి = చేరి; మత్ = నాచే; కథితంబు = చెప్పబడినది; ఐన = అయినట్టి; సాంఖ్యయోగంబున్ = సాంఖ్యయోగమును; అంతరంగంబునన్ = మనస్సులో; నిల్పుకొని = ధరించి; కలియుగ = కలియుగము; అవసాన = అంతమగు; పర్యంతంబున్ = వరకు; వర్తింపుము = ఉండుము; అని = అని; ఆ = ఆ; పరమేశ్వరుండు = కృష్ణుడు; ఆనతిచ్చినన్ = చెప్పగా; ఉద్దవుండు = ఉద్దవుడు; ఆనంద = ఆనందముతో; భరిత = నిండిన; అంతరంగుండు = మనస్సుకలవాడు; ఐ = అయ్యి; తత్ = అతని; పాద = పాదములనెడి; అరవిందంబులు = పద్మములు; హృదయంబునన్ = మనస్సులో; చేర్చుకొని = చేర్చుకొని; పావనంబు = పవిత్రమైనది; ఐన = అగు; బదరికాశ్రమంబున్ = బదరికాశ్రమమున; కున్ = కు; అరిగెను = వెళ్ళను; అని = అని; శుకుండు = శుకుడు; పరీక్షిత్ = పరీక్షిత్తు అనెడి; నరేంద్రున్ = రాజున; కున్ = కు; చెప్పుటయు = చెప్పెను;
భావము:- ఉద్ధవుడు ఇలా అడుగగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “నేను అన్ని వర్ణాలవారు అనుసరించ తగ్గ పూజా పద్ధతి చెప్తాను, విను. రాతితో కాని, మట్టితో కానీ, కొయ్యతో కానీ తమ ఆచారం ప్రకారం ఒక ఆకారం కల్పించి ఒక పేరుపెట్టి కొందరు పూజిస్తారు. కంచుతో కానీ, సీసంతో కానీ, వెండితో కానీ, బంగారంతో కానీ చేసిన ప్రతిమలు శ్రేష్ఠమైనవి. ఈవిధంగా నా ప్రతిరూపాలలో నా భావాన్ని ఉంచి కొలచిన వారికి, నేను ప్రసన్నుడను అవుతాను. ఈ లోకంలో మానవులకు ధ్యానం నిలువదు కనుక, ఎన్నో విధాలుగా ఉండే దేవతా ప్రతిమలలో బాగా అందంగా ఉండే రూపాలలో నేను ప్రసన్నుడనై ఉంటాను. కాబట్టి, క్షీరసాగరంలో పడుకున్నవానిగా భావించి; శుభ్రమైన వస్త్రాలను, ఆభరణాలను, పూలదండలను, మైపూతలను అర్పించి దివ్యమైన అన్నపానాలు, షోడశోపచారాలతో రాజోపచారాలు, బాహ్యమైన పూజలు చేసి నాకిష్టమైన పదార్ధాలను సమర్పించి కానీ; లేదా ప్రతిదినము మానసిక పూజాపద్ధతులతో కాని సంతుష్టి పరచి నన్ను దివ్యమైన వస్త్రాలు, భూషణాలు పూలదండలు ధరించి ప్రకాశిస్తూ; శంఖము, చక్రము, కిరీటము, మొదలైన వానితో అలంకృతుడనైన మంగళవిగ్రహునిగా భావించి ధ్యానపరవశుడు అగు నా భక్తుడు నా యందు కలుస్తాడు. ఉద్ధవా! నీవు ఇటువంటి తీవ్రతరమైన యోగనిష్ఠతో బదరికాశ్రమం చేరు. నేను చెప్పిన సాంఖ్యయోగాన్ని మనస్సులో నిలుపుకుని కలియుగం చివరి దాకా ఉండు.” అని పరమేశ్వరుడు ఆనతీయగా ఉద్ధవుడు మనసు నిండా ఆనందం పొంగిపొర్లింది. శ్రీకృష్ణుని పాదపద్మాలను హృదయాన చేర్చుకుని పవిత్రమైన బదరికాశ్రమానికి వెళ్ళాడు.” అని శుకముని మహారాజు పరీక్షిత్తునకు చెప్పాడు.

తెభా-11-116-క.
చెప్పిన విని రాజేంద్రుఁడు
సొప్పడ శ్రీకృష్ణుకథలు చోద్యము గాఁగం
జెప్పినఁ దనియదు చిత్తం
బొప్పఁగ మునిచంద్ర! నాకు యోగులు మెచ్చన్‌.

టీక:- చెప్పినన్ = చెప్పగా; విని = విని; రాజేంద్రుడు = మహారాజు; చొప్పడన్ = తగినట్లు; శ్రీకృష్ణు = శ్రీకృష్ణుని; కథలు = వృత్తాంతములు; చోద్యము = అద్భుతము; కాగన్ = కలుగునట్లు; చెప్పినన్ = చెప్పినచో; తనియదు = తృప్తిచెందదు; చిత్తంబు = మనస్సు; ఒప్పుగన్ = పూర్తిగా; ముని = మునులలో; చంద్ర = ఉత్తముడా; నా = నా; కున్ = కు; యోగులు = యోగులు; మెచ్చన్ = మెచ్చేవిధముగ.
భావము:- ఆ శుకబ్రహ్మ పలుకులు వినిన రాజేంద్రుడు, “మునీశ్వరా! శ్రీకృష్ణుడి కథలు చాలా అద్భుతంగా ఉంటాయి. యోగులు మెచ్చేలా మీరెంత చెప్పినా నేను ఎంత విన్నా తనివితీరడం లేదు.

తెభా-11-117-తే.
అంతటను గృష్ణుఁ డేమయ్యె? రసిచూడ
దువు లెట్టులు వర్తించి రేర్పడంగ,
ద్వారకాపట్టణం బెవ్విమున నుండె
మునివరశ్రేష్ఠ! యానతీ ముదముతోడ.

టీక:- అంతటన్ = తరువాత; కృష్ణుండు = కృష్ణుడు; ఏమి = ఏమి; అయ్యెన్ = అయినాడు; అరసిచూడ = తరచిచూసినచో; యదువులు = యాదవులు; ఎట్టులు = ఏవిధముగ; వర్తించిరి = ఉండిరి; ఏర్పడంగ = తెలియునట్లు; ద్వారకాపట్టణంబు = ద్వారకానగరము; ఏ = ఏ; విధముననున్ = విధముగ; ఉండెన్ = ఉన్నది; ముని = మునులలో; వర = ఉత్తములలో; శ్రేష్ఠా = శ్రేష్ఠమైనవాడా; ఆనతీ = చెప్పుము; ముదము = సంతోషము; తోడన్ = తోటి.
భావము:- మునివర్యా! అటుపిమ్మట శ్రీకృష్ణుడు ఎమయ్యాడు? యాదవులు ఏం చేసారు? ద్వారకపట్టణం ఏమయింది? అన్నివిషయాలూ ఆనతీయవలసినది.”