Jump to content

బ్రహ్మానందము/శృంగారశతకము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు!

శృంగారపద్యపంచాశత్తు

(స్త్రీవాక్యము)

ఉ.

శ్రీకరుగా మహారసికశేఖరుగా గరుణామయాత్ముగా
లౌకికవైదికాదిసకలాసుకలాపునిగా సుమూర్తిగా
బాకటకీర్తిగా సకలపండితివంద్యగుణప్రవర్తిగా
లోకులు నిన్నుఁ జెప్ప వినవోనయితింగద నీవనాయవా?


చ.

అలుకలు మానరా యధర మానరా నన్నెద నమ్ము గానరా
చెలిమిక బల్కరా నెనరు యక్కర కమ్మ యొయార మొల్కరా
యెలమిగ నేలరా రతుల చేకొనరా యిక తాళజాలరా
నెలవు గణింపరా కరుణ నిల్పర నామన వాలకింపరా.


చ.

పలుమరు దూతికాసమితిని బంచిన రావుర నీ మనంబులో
పల నెనరింత లేక విరిబంతుల బంపిన మానుకోక యా
వలపుల మందుమారి యిట నలకల కల్గుటగాక దానిమా
యలకును జిక్క నాయకులరా యిటురా నటరాజశేఖరా.


చ.

నిను గనుగొన్నదే మొదలు నిద్దురకంటికిరాదు కూడు గూ
రెనయగ నింపుగాదు సఖు లెందఱుగూడిన ప్రొద్దువో దికే
మనియెద జిల్కకాదు మది నంటిన కామము నిల్వనీదు క్రొ
న్ననవిలుకానికూటముల నన్నలరించర ప్రాణవల్లభా!


చ.

నను బిగియార కౌగిట మనం బలగారగ మంనుంచి మించి క్రొ
న్ననవిలుకానికూటముల నర్మిలి గూడిననాటి వేడుకల్
మనమున నెంచి యెంచి యొకమాటు నినుం గనుగోదలంచి నే
బనివడి కాచుకొంటిఁ దలవాకిలి యిల్లుగ జీవితేశ్వరా!

చ.

అనఘుడ నిన్ను బాసినది యాదిగ నే దిగులొంది కుంది నె
మ్మనముని గంది వందిగతి మాటకి మాటికి వేడుకొన్న నీ
మనసు కరుంగదాయెఁ జలమా ఫలమా ననువంటి బేలపై
గనికరముంచ కిప్పగిది గాసిలఁజేసితి వేమి సేతురా.


ఉ.

చిత్తజుమేల్ శరాళికి విశేషవరాళికిఁ జల్లగాలికిన్
మత్తమరాళికిన్ శశిసమగ్రకరాళికిని నిత్యముం ద్వదా
యత్తమునౌ విరాళికి శుకాళి పికాళికి జిక్కి తింక నీ
చిత్తమ నాదుభాగ్య మికఁ జెప్పెడి దేమి రసజ్ఞశేఖరా.


ఉ.

నీసముదారబాహువులనీటును మాటలగోటు నూగుదే
ర్మీసము దీరు మోముకళ మేటివిలాసము ఱొమ్ముబాగు మేల్
హాసము సౌరు నెన్నడ యొయారము గన్నులసోయగంబు ను
ల్లాసము నెంచిన న్మది గలంగెడు తాళనురా మనోహరా!


ఉ.

నీ సరసత్వము న్నెనరు నేర్చును నోర్పును నీటిగోటులున్
నీ సుగుణస్వభావమును నీదు ప్రభావము నీ రసోక్తులున్
నీ సొగసైన చర్యయును నెమ్మది నెంచి నిరంతరంబు బే
రాస నినున్ రతింగలియు నాత్మ దలంచెదరా సుహృద్వరా.


చ.

ఎలమిని చిన్ననాడు మన మిద్దర మొద్దికఁ బల్లకూటమం
దలి బుడుత ల్గనుంగొనగ దర్పకుసాము ఘటింపుచుండ నొ
జ్జలు గని మీకునుం జదువు సామును రెం డొనగూడె నింక మీ
రలసితి రింటి కేగి సుఖమందు డటన్నది యాది లేదుగా?


చ.

కుసుమశరార్తికి న్మిగుల గుందితి గందితి వేడి నెన్నలం
భసలరసమ్ములం జెవులు బ్రామితి నోమితి మేలు నీకుగా
విసువక నీ కువాదములు వింటిని నిప్పుడు నీదుపోడుముల్
మసలక నింకనైన రతిమన్నన నన్నలయింపు మోప్రియా.


ఉ.

చూడ వదేమిరా మొగము జూడ్కులరంగ జూచిమా
టాడ వదేమిరా మనమునందున జెందినయట్టి కోపమున్

వీడ వదేమిరా మిగుల వేడగ, జూడగనుందు వింతె నన్
గూడ వదేమిరా రతులఁ గోరిన కోరికలేత్త నాయకా!


ఉ.

బాళి మనంబునం బొసగు బల్కిన నీదగు నోటిముత్యముల్
రాలునటోయి? నీదగు కరంటు గరంబు దెమల్చి పట్టగా
బోలదటోయి? నిన్ను బ్రియపూర్వక మొప్ప రతిం గఱంపగా
జాలనటోయి? జాల మిక చా లిటు రమ్ము విటాన్వయాగ్రణీ!


ఉ.

చందురునంద మొందిన పసందగు ముద్దుమొగంబు డంబు ద
ళ్కుందనం బెసంగు నునుకుందనముం. దిలకించు మేను మేల్
జెందు మృధుస్ఫురక్మధువు జిందు రసోష్ట మెడంద విస్త్రుతం
బంధము జూడ నాత్మ నెనయం దమి మీఱె విలాసమన్మథా!


చ.

చిలుకలు గూరు తత్తరిలఁ జిత్తజు డమ్ముల నేయ గండుతే
టులు విడిమ్రోయ వేడిగ గడు న్వడగాడ్పులు డాయ జందురుం
డలయక గాయ నీవిరహ మగ్గలమాయె బరాకు సేయగా
వలదిక రార నా వలపు వడ్డికి బాఱెడి ప్రాణనాయకా!


చ.

సలిపితి వెంతయుం జెలిమి సంగతిమీఱ ననంగశాస్త్రముం
దెలిపితి వంతరంగమున దేవతగా నతిగౌరవంబునన్
నిలిపితి వెప్పుడు న్భళిర! నిక్కము మక్కువ లల్లదానిపై
నిలిపితి విట్టి నీమనసుమర్మ మెఱుంగగనైతిఁ జెల్వుడా!


ఉ.

మారుడు గ్రూరుడయ్యె నల మందసమీరుడు ఘోరుడయ్యె గ
ర్పూరము నీరమయ్యె నలరున్ శుకవారము వైరమయ్యెఁ గం
జారి మదారియయ్యె నికనైన ననుం గరుణించి నాపయిం
గూరిమిమీఱ గూడి రతి గొబ్బున నేలగదయ్య వల్లభా!


ఉ.

ఆసలు గొల్పి నిన్ను విడనాడ నటంచు దుటారిపల్కులన్
బాసలు జేసి యిప్పు డెడబాసి ప్రియం బెదరోసి దానియిల్
డాసి మనోజుబారి నను దక్కగ ద్రోసితివౌర యింక నీ
మోస మెఱుంగనయ్యె చల మీ మది నాపయి నాయకాగ్రణీ!

చ.

చిలుకల మూకకు న్మరునిచిల్కులతాఁకును నంచరాకకున్
నెల బలుకాకకున్ గడిది నెమ్ముల కేకకు మాలి మూకకున్
జలదళివీకకున్ సుమరజంబుల సోకుకు గాలిఢాకకున్
గళవళ మందితింక ననుపుము ప్రేమ భుజంగరత్నమా!


ఉ.

కారము నీవు న మ్మరువికారము నే నితరాంగనారతా
చారము నీవు నెంతయు విచారము నే నలకొమ్మ మెచ్చు సిం
గారము నీవు జాల నయగారము నేను వహించి మించి యు
న్నార మటుండ నాయ మగునా రమణా! మదనాభసుందరా!


ఉ.

చెక్కిలి నొక్కి మోవిసుధ చిక్కగ గ్రోలి కవుంగలించి న
మ్మక్కన స్తనద్వయము మర్దనముల్ ఘటియించి యూరువుల్
దక్క బెనంచి మేలి సురతంబులలో నిరతంబు దేల్చు నీ
మక్కువ నెందు దాచితివి మంచియె నీ కిటు సేత పల్లవా!


చ.

సరగున నొక్కయూరువును సందిట నుంచి వెసం దిటంబుగా
బెరతొడ బైలు సేసి కుచపీడనకుం గయిదార్చి పేర్మి తోం
తదికిట ధిత్త ధింధిమిత థంగు తళంగని తారమానవి
స్ఫురితమనోజనాట్యమున బొల్పుగ నన్ గఱగించవేమిరా?


ఉ.

కోప మదే మదేభవరకుంభకుచాయనికాయజాతసం
తాపనివారణోచితవిధంబులు నాయెడ కట్టిపెట్టి నీ
వా పలుగాకి నాసవతియందు మనంబిడి దానియింటనే
కాపుర మున్నవాడ విల కాపురుషంబలె భావజాకృతీ!


ఉ.

ఓపడతీ! నిన న్విడువనోప నటం చిట బాసజేసి నీ
వాపగరాలిబాళి గని యాపగరాని విరాళి బూని నా
పాపము బోసుకోదలఁపఁ బాడియె నన్నిటు లేచ నాయమే
రా పగవాడవా యికను ఱాపులు మానర పల్లవోత్తమా!


ఉ.

అక్కట! నీవు నన్నిటుల నాఱడికత్తి జేయఁగా మరుం
డక్కటికంబు మాని చలమూని కనర్మదిఁబూని తియ్యని

ల్లెక్కిడి పూపుటమ్ముల నహీనత నెమ్మెయి గాడనేయ నే
నెక్కుడు గాసినొందితి నిక నేమని తెల్పుదు మారసుందరా!


చ.

వలచితి నిన్ను నే జిరుతప్రాయమునాడె మనంబులోపలం
దలచితి నిన్ను నే గలదైవముగా దమి గారవంబునన్
గొలిచితి రేబగళ్లు మది గొంకక నీవిడునట్టియాజ్ఞలో
నిలిచితి నిట్టి నన్నెడబాయ నీకు హితంబటరోరి నాయకా!


చ.

కటకట! మన్మథుం డెదురుగా నిలువంబడి హుంకరించి యొ
క్కన కటకధ్వనుల్ ప్రబలగా విలునమ్ములు జూప జూచితిం
దటడటమంచు బెల్లదరెఁ దానిదె గుండియ యేమిసేతు నీ
విట విటరాయ వచ్చి వెఱపెల్ల హరించి భరింపుమా కృపన్.


ఉ.

ఎన్నడు నేర్చివాడవుర యీమటుమాయల? తోట కేగి నే
గ్రన్నన వత్తునందు నయగారపుమాటల నమ్మపల్కి యా
చిన్నెలమారి యింటి కటు జేరి రతం బొనరించి ప్రీతి సం
పన్నునిబోలె వచ్చితివి భావజమోహన భావుకాకృతీ!


చ.

సరముల చెక్కులుం బెదవి జాల్కొనునొక్కులు గందుచెక్కులుం
గర మరగంటి సొక్కులు మొగమ్మున గుంకుమచుక్కలు న్మహో
త్తరమగు తత్తరమ్మునకు దార్కొను వాక్కులు బెక్కు లెంచ నీ
సరసత తెల్లమయ్యి నెఱజాణవు టక్కులమారినాయకా!


చ.

వలచిననన్ను మోహమను వారధి ముంచియు నీళ్ళకంటె బల్
పలుచన చేసినాడవు భళా! నెన రెంచనివాడవైతి నీ
వలపును దాచ నైతి మరువాడిశరమ్ము లురమ్ము నాటి నీ
చల మిక మాని పూని రతి సంభ్రమ మొప్ప భరింపు మోపతీ!


ఉ.

నమ్మినదానరా నిను మనమ్మున నిమ్మున నీకు నాదు మే
నమ్మినదానరా నను నయమ్ముని నొమ్మున నేలకుండినన్
గమ్మనివింటిజోదు బలగమ్ములతో దన పూవుటమ్ము పా
ల్గమ్మని కంటగించు నల దానికి నే నెటు లోర్తు దెల్పరా!

ఉ.

నీదగు కౌగిటం బెనగనీగదరా యెద రాయి జేసుకో
గా దగునా మరుం డలుక గారియ బెట్టదొడంగె నిన్నునుం
గాదనువారలుం గలరె గాసిల జేసిన నాయ మొప్పదే
యాదరవృత్తి నన్ను నిక నాదుకొనంగ ననంగమోహనా!


ఉ.

అమ్మక చెల్ల! యీ విరహ మగ్గలయ్యెను నాదుమేను నీ
కమ్మక సెల్ల దింక విను మారడి సేయక వేగ వచ్చి నీ
వమ్మకరాంకుకేళి నను నాదట గూడుము దానిబాసలున్
నమ్మకురాపులు న్వలన ద న్మకురా ముకురాననాస్మరా!


చ.

ఇల మగవారిమాట మది నెంతయు నమ్మగ వార్థిమూటగా
బలుకుట నిక్క మయ్యెను సుబద్దములన్నివి సున్న యయ్యె నీ
వలన నికేమి సేతు జెలువం బటవీస్థలి గాయునట్టి వె
న్నెల యయి యున్నచో సఖుడ! నెమ్మి ననున్ రతి దేల్చకుండినన్.


ఉ.

నాయనురాగ మెంచ కిటు నన్నలయించుట నీకు నాయమా
నాయనుమాన మించుకయి నామదినుంచక యున్నదానగా
నాయపరాధ మెన్నడయినా యొనరించితినా దపింపఁగా
నాయె పరాకు సేయదగునా యిక నా వెగులార్చి బ్రోవరా!


చ.

కడకను స్వాతివర్షకణకాంక్ష వహించిన శుక్తిరీతి నె
క్కుడురతి దాఘనోదయము గోరు మయూరిభాంతి నిచ్చ నె
న్నడు గుముద ప్రియాగము నర్మిలగోరు చకోరిదారి ని
ల్కడ భవదాగిమనంబునకు గాచితిరా విటవంశచంద్రమా!


చ.

నుడివెద నొక్కమాట సుమనోరతి నారతినాథుకేళిలో
దడయక నన్నువంటి సురతాలలితాంగిని గూడితేని నీ
నడక సువర్ణమందున సుంగంధము గల్గినయట్లు గాపు న
న్విడవక నేలుమా నెవరు వీడకుమా నలకూబరోత్తమా!


చ.

చిలుకహుమాయిరౌతు పలుసేతల నాతని కత్తికోతలం
గొలగొనవీను కోయిలలకూతల తుమ్మెద ద్రిమ్ముమోతలన్

వలనగు వాతపోతముల వాతల వెన్నెల విట్టుఘాతలన్
దలగకనయ్యె నయ్య యిక దద్దయు నొద్దిక నుద్ధరించుమా!


ఉ.

ఎంతని వేడుకొన్న నొకయింతయిన న్నెనరెంచ, వౌర నీ
యంత కృపావిహీనుఁ డిల నారయగల్గునె? కాని బోధనో
దంతము లెల్ల నీమది సదా సుఖదాయి గురూపదేశ సి
ద్ధాంతములయ్యెనో తెలియదాయెగదా వగ దార్చబోకురా!


ఉ.

కంతు దురాపతావహతి గందితి గుందితి నింకనైన నా
చెంతకు వచ్చి యిచ్చగలచింత యొకించుక లేక మాన్చి నీ
పంతము చెల్లగా సురతిపద్ధతి యుద్ధతి నన్ను గెల్చినం
గాంతుడ! నిన్ను మెచ్చవలెఁగా కవితాతరితీపు లేలరా!


ఉ.

కంతుల నవ్వసంతుని మృగాంకుని సంతుని నావలాననీ
కాంతుని నజ్జయంతుని ముఖాముఖి గెల్వగజాలు రూపమా
వంతుని నిన్ను బాసి వలవంత నిదెంతని తాళుదాన నా
చెంత నిరంతరస్థితి వసించగదే రసికావతంసమా!


చ.

మనవి వినంగ రాదటర మాటికి వేడిన నీమనమ్ములో
గనికర మింత లేదటర కాయజనాయకపీడితాత్మనై
తి ననగ నీకు వాదటర తియ్యని నానునుమోవి యానర
మ్మని పిలువంగ చేదటర? హా రసికాన్వయవార్ధిచంద్రమా!


ఉ.

నిన్నటిరేయి నాకలను నీవల నీప్రియురాలి గూడి నా
యున్న నికేతనంబునకు నొయ్యన వచ్చిన నట్లయంత నీ
నన్నలినాక్షి యానతి నయమ్మున నన్ రతిగూడి నట్ల క
న్గొన్నది నిక్కమౌనటుల కోర్కెలు కూర్పు భుజంగపుంగవా!


చ.

మది నుడివోవ కూర్మి ననుమానము మానక సూనకార్ముక
ప్రదరవితానఘాతముల బాల్పడనీయవటంచు జాల నె
మ్మది గని యిప్పుడుంటి ననుమానము నయెడ బూని యక్కటా
తుది గరుణావిహీనమతి దోపగ జేసితి వేమి సేతురా?

చ.

కామిని నైన నన్నిటుల గాసిలజేయుట దోషమంచు నీ
యామినికైన వచ్చి మది వచ్చిన మచ్చిక నేలకున్న న
క్కాముని పూవుటమ్ముల వకావకలై యెద వ్రయ్యమందు నో
సామి! నెన ర్మనంబున వశమ్ముగ జేసి యశమ్ము గాంచరా!


చ.

స్మరసమరూప! మున్ను విరిశయ్యను దీయనినెయ్య మొందగా
నిరువుగ బవ్వళించి మనమిద్దర మంగజసంగరంబునం
గరము విచిత్ర వైఖరుల గాంచుచు బిగ్గగ గౌగలించి సౌ
ఖ్యరససుధ న్మునింగిన వగ ల్మది నెంచకపోతివౌగదా!


చ.

పొలతికి నొక్కరీతి మది బూసలలోపలి దారముంబలెన్
మెలగు విభుండు గల్గుట సుమీ తొలినోముఫలంబు భాగ్యమున్
దలకొని యున్నివారలకు దక్కువ లేటికి గల్గు నావలెం?
బలుచదనంబు గంటి నిను భావమున న్నెఱనమ్మి సామిగా.


ఉ.

నీకు జిరాయువున్ బల మనింద్యసరోగదృఢాంగకీర్తమే
ధాకలనానులబ్ధియు విశుద్ధతరప్రతిభాప్రభావముం
బ్రాకటువైభవంబు రతిరాజగురూన్నతసత్కృపారతిం
జేకురుగాక నన్ను రతి జేకొని యేలుమయా సుధీమయా!


చ.

పొలుపగు వాడుటాకు విడివోని కడాని పసిండిపూత పో
కలును లవంగముల్ వలపు గప్పెడు కప్పురపల్కు లేలకుల్
చలువమిరింపుగింజలు బసన్ జెలువొందగ బైడితట్టలన్
వెలయగ నించితిన్ రతుల వీడె మొనర్తుము రార సామిగా!


ఉ.

పుక్కిట వీడె మిచ్చి నునుపొక్కిలి చక్కిలిగింత పెట్టి వే
జెక్కిలి నొత్తి ముద్దిడి ఖచిక్కని చక్కనిమోవి నొక్కి నా
చొక్కపుగొప్పు పట్టి తమి నొక్కువ నక్కువ నన్ను జేర్చి యా
చక్కెరవింటిజోదునెరసాధనచే దనియించితౌ సఖా!


చ.

అవనిని వారకామినులకై మృదులాలితశబ్దయుక్తి దోఁ
ట విజయరాఘవుండు బ్రకటంబుగ నేబదివృత్తపద్యముల్

కవు లలరన్ రచించె మిగుల న్వగరాండ్రు స్వయ పల్లవ
ప్రవరుల గూర్చు విన్నపము పల్కగఁ దా నుపయోగమౌటకున్.

స్త్రీవాచ్యము సంపూర్ణము.

 

శ్రీరస్తు

శృంగారపద్యపంచాశత్తు

(పురుషవాక్యము)

ఉ.

శ్రీపతిపుత్రశాస్త్రము ల శష మెఱుంగుచు గూడుచు న్నెరా
యోపికమీద నున్న మనయొద్దికఁ గన్నుల జూడలేక హా
పాపపుదైవ మిద్దఱిని బాపగజేసెఁ గటా! కఠోరుడై
యాపగరాని యీవిరహ మగ్గలమయ్యెగదే దలోదరీ!


ఉ.

అప్రియ మూని వచ్చెఁ గనుమంగమి న్గను లెఱ్ఱజేసి దా
నప్రతిమ న్వనప్రియచయంబదె త్రుళ్ళుచు బండ్లు గోరుచున్
దీవ్రరతిన్ శుకాళి పరతెంచె నదే బలు గాము పోల్కి దా
నప్రభుఁడై మరుండు శ్రమ నందగ జేసె గురంగులోచనా!


చ.

అలకలదేండ్ల నన్నెడల నంచన జూపులదూపు కోపులం
బలుకుల జిల్కల న్గెలిచి పల్మరు ద న్గడురూపహీనుగా
నిలిపిన ని న్నెదుర్చుటకు నేరడు మారుడు నన్గలంచె బు
గ్కులమగు నీపరిగ్రహణ గల్గిన గెల్వనె వాని మానినీ!

ఉ.

ఆవలరాయ డొక్కట నహంకృతి ఝుంకృతి మీఱునారిచే
జేవరహించు నించువిలు జేకొని యార్చి పేర్మి రో
షావిలమానసాప్తి గుసుమాస్త్రపరంపర నింపు నన్ను గై
కో వదియేమొ నీదు చనుగొండలమాటున దాచియో చెలీ!


ఉ.

ఓరు పొకింత లేక దయ యుంచ క్రొన్ననవిల్తుబారికిం
దారిచి తేరకత్తె కనుదారి చిరాకు నిడంగ మేల నా
దారకశారికాపికశుకాళులు గూయ వినంగజాల నా
హా రమణీసుమాంబకునిహారమణీ రతిశాస్త్రనైపుణీ!


చ.

కలుముల కొండలంత గలుగం గఠినాత్మత నర్థి కింత మే
ల్వొలయగనీక పైగమము ల్లగియాసలు దెల్పు లోభిరా
జులుబలె నీదునిబ్బరపుజొక్కపుగుబ్బచను ల్మనంబునం
దలయగజేయుచున్న వకటా యకటా వికటంబు లేలనే!


చ.

కడకట వెన్న వంటి మది గన్నన రాయిగ జేసుకొంటి వి
క్కటికితనమ్ము నాకయి దగం నలకొంటివి నేరమన్న నొ
క్కట ననుబట్టి నీజడను గట్టి ఫెటేలని చెంపగొట్టి పు
క్కిట విడెమిచ్చి కౌగిట బిగించి సుశిక్షితు జేయరాదటే!


ఉ.

కోపమటే మనోజశరకుంఠితభావుడనైన నామన
స్తాపము దీర్ప కూరక వితాతరితీపుల బ్రొద్దుపుచ్చె దీ
పాపమి మేరగాదు నయభావముతో రతి నేలు మింక గో
కోపమచారుపీనకుచసోదకమేఘకచావిలాసినీ!


ఉ.

తాళఫలోపమానకుచతాళగజాల నటన్న నింత కాం
తాలెము బూన నీకు ఘనతాలలిమీఱ రతిం గఱంచి చిం
తాలసవృత్తి మాన్పక వితాలఘుభావము గాంచె బల కాం
తాలసమైన బ్రీతి వలదా కలవా యిటువంటి కాగతుల్.


ఉ.

చక్కర మెక్కు పక్కిదొర జక్కిగదా వడినెక్కి పూని తా
జిక్కని చిక్కటారి మొల జెక్కి మదిం దన దక్కి యొక్కటన్

మిక్కుటమైన యుక్కుగడు నెక్కువ దక్కరిమారు డక్కటా!
ముక్కును మూతిజూడకిటు ముంచెగదే శరపాళి బాలికా!


ఉ.

నామది నిన్ను జీవముగ నమ్ముటకా పగరాలిపోలికం
గాముని కప్పగించితివి కట్టడిదా! విధాత నీమనం
బేమిటి జేసెనో యెఱుఁగ నింత దలంచినదాన వయ్యయో!
యేమిటి కింతనన్ను భ్రమియించితివే వెలికూర్మిలన్ మదిన్.


ఉ.

నీనునుమోవి నీతళుకునిద్దపుటద్దపుముద్దుచెక్కులున్
నీ నగుమోము నీకులుకునిబ్బరపుంవుబ్బుగుబ్బ లో
మానిని చూడ కోర్వదమా కరమా దరమా నమేనియౌ
మేనున మేను జేర్చి రతి మేకొను మేనులు మేలు మేలనన్.


ఉ.

పంకజగంధి! నీ పెదవిపానక మానక తాళజాల నీ
మంకుతనమ్ము నెమ్మదిని మానకయుండుట నీతిగాదు నీ
వింక రయంబుతోడుత మదీప్సితముం గొనసాగజేసి నీ
కింకరుడైన నాపయిని గిన్క వహింపక ప్రేమ నింపుమా!


చ.

పలుకులుముద్దు నెమ్మొగముబాగు పిఱుందులసోయగంబు జ
న్నులగమకంబు గన్నులవినోదము జేతులసుందరంబుఁ జె
క్కులజిగి కౌనులలేతవగ కొప్పువిలాసము మోవిఠీవి మై
చెలువము నామదిం దవిలి చిక్కులు బెట్టెడు నన్ను యుగ్మలీ!


ఉ.

భావజు డుగ్రమూర్తి యయి బాపురె! పచ్చనిఱెక్కపక్కెరన్
ఠీవి వహించు జక్కని వడిన్ దుమికింపుచు నట్టె చేరి బ
ల్మావిచిగుర్పుటా ఝుళువు లన్నను దల్లడమందజేసె నిం
కేవిధి దాళువాడ గృప నియ్యవె నాక భయంబు తొయ్యలీ!


చ.

పిలుపులయింపు ముద్దుగనుపెంపు జనుంగవ యుబ్బరింపు జె
క్కుల చెమరింపు మైపులక గుంపు వదల్పని కౌగలింపు గ
న్నుల దయనింపు గీలుజడ వొంపు దలంపులు వేడనింపు దీ
కలయిక సొంపు నే మరువగా గలనా వసంతమా!

ఉ.

నీ సరసానులాపములు నీ రతిబంధకళాకలాపముల్
నీ సొగసైన చూపులును నీ నెఱజాణతనంబు కోపులున్
నీ సిరు లూనులాసమును నీ మిరుకారు తనూవిలాసమున్
నీ సునయానువర్తముగ గణింప దరంబటె మంజుభాషిణీ!


చ.

ననిచిన వేడ్కతోడ నొకనా డురుకాండపటాంతరంబునన్
ననవిలుకానిసాధన యొనర్చుతరిం బరులేగుదేర వా
రిని దెరబైట నిల్పి తగురీతి సదుత్తర మిచ్చుచు న్ననుం
గని "పనిజూచుకొ" మ్మనినకల్కితనం బెద నెంతు గామినీ!


చ.

సిగముడి వీడి క్రొవ్విరులు జింద బొమ ల్ముడిజెంద నందమౌ
మొగమున స్వేదబిందువులు మూగ సరమ్ములు దూగ నూర్పు లె
చ్చగ గుచముల్ నటింప గటి సందడిసేయ నలగ్న ముల్కగా
జిగిబిగి మీఱ నీవు మగసేత యొనర్చిన దెంతు గామినీ!


చ.

వెలదిరొ! యొక్కనాడు మగవేసము దాల్చి వివోదలీల వె
న్నెల చెలువార గాయుతఱి నీవు ననుం గయిదండ బూని స
న్నల నరుణాచలేశుతిరుణాల గనుంగొనవచ్చు నీదు చి
న్నెలు బలువన్నెలుం దలప నేర్తునె నెమ్మది బాటలాధరీ!


చ.

మదనునిబారి కోరువక మాటికి నీచమగట్టు డాసి త
త్సదనముపై గరంబిడ నిసర్జన సేయుచు జూడ కావలన్
వదనము ద్రిప్ప మెత్తపడు నిన్ను బదంపడి చూచి నవ్వి పై
కదనున జేరి కూడినహొయ ల్మది యాదికి వచ్చెనే చెలీ!


ఉ.

కమ్మలుడాలు చెక్కుల ధగద్ధగలీన దనూరుచు ల్దిశల్
గ్రమ్ముబులాకి ముక్కున దళత్తళలూన లసన్నిటాలభా
గమ్మున దళ్కుబొట్టెగింజ కచ్చలాన నటించునాటి నీ
యెమ్మెల నే దలంతు రమణీ తరుణీసులోచనా!


చ.

సౌరుదొరంగు కాశి బురుసాపనిచీర ధరించి హోన్బుటే
దారిహొఱంగుఱైక బిగిదట్టపుగుబ్బపయిన్ బిగించి

దారపురంగు చౌకము ముదంబున గేల ధరించి చాల నొ
య్యారపులీల నాకడ బ్రియమ్మున నిల్చిన దెంతు బాలికా!


ఉ.

ఫ్రంచిబుటాహొరంగుగల బావడపై గుజరాతి హోనర్జీ
యంచు రహించుచీర చెలు వారగ మల్చవుజంటకుట్టు రా
ణించిన జంట జాల్రవిక నిగ్గులుదేఱగ నొక్కనాఁడు నా
యంచున నిల్చు నీదు సొగ సాత్మ దలంచెద హంసగామినీ!


ఉ.

గుత్తపుతాపితారవిక గుబ్బగవ ర్బలుడంబు నింపగా
ముత్తెపుమేల్సరంబు యురము న్నెఱయింపఁగ జాఫరారాపసల్
హత్తిన పావడిం దళతళన్గనునారణి చీర గుల్కగా
జిత్తజు మత్తదంతివలెఁ జేరవె నన్నును బంభరాలకా!


ఉ.

నిగ్గులు దేఱు సౌరు కుతి నీజగిపావడపైని వెల్లడాన్
సన్ననివల్వఁ గట్టి బిగిచన్నుల వెన్నెలఱైక బూని మో
మొగ్గని చాదుబొట్టు దగి యొప్పుగ ముద్దులు గుల్క నాడకన్
జగ్గమనంగ నిల్చిన పసందుఁ దలంచెద సుందరీమణీ!


ఉ.

చూపుల కింపొనర్చు నెఱ సోయగమా కడిందివేడ్కతో
దోపులుగాగ నొక్కనిశి దొమ్మిగ నిద్దర ముద్ది మీఱ పూ
దూపువజీరుసాధన లెదుర్కొని సేయగ నీవు ఫైలవా
నొప్పు లెసంగ నిన్ను బయికొన్నవగల్ మరువంగ నేర్తునే?


ఉ.

జానుబొసంగ మేన జిగి నాపొడి నల్గిడి కీనుకాబు న
ద్దానపురారు పావడ నితంబునం దగ హోన్గరీ కుసుం
బా నెఱిచల్వ మేల్ముసుగు వైచి తురష్కవధూటి పోల్కి చా
నా! నను గూడలేదె యొకనా డది నామది నాటకుండునే!


ఉ.

సంపఁగినూనె నున్మెఱుగు దాల్కొన గొప్పిడి యందు వాసనల్
నింపెడు పూవులం దురిమి నెన్నుదుటం దిలకంబు గన్నులన్
సొంపుగ గజ్జలం బెసఁగ సొమ్ములమాని శరాయిపూని నీ
వింపుగ నాదు చెంగట రహించిన దెంచెదఁ జంచలేక్షణా!

ఉ.

కులుకు మిఠారపు న్వలువగుబ్బలు కేలన నూని తేనియలో
జిలుకు రువాఠంపు బెదవి నూరుపుటూరువుల్ నెలా
మెలకువతో బెనంచి రతి మేకొన మై పులకింప బావురా
పలుకులు పల్కగా వినెడు భాగ్యము గూర్చకపోతి వంగనా?


ఉ.

నిన్ను మనమ్మునన్ దలచి నీరజలోచన సాయకాహతిన్
ఖిన్నత నొంది నీప్రియసఖి న్నితవృత్తిని బాతిమాలి నీ
యున్న నివాసభూమికి నయోన్నతి దోడుకపొమ్మటన్న నా
విన్నప మాలకింప కది వేఱుగ జూచె గదే మనఃప్రియా!


చ.

అమవసకంచు నీ వరుగ నంతట నుండియు దాళలేక నే
సుమశరుబారి జిక్కి కడు స్రుక్కి మహావిరహాగ్ని బొక్కి బ
ల్తమి తల నెక్కి ధైర్య మెదఁ దక్కి దురంతనిరంతరాసుతా
పమున గలంగినాడ నను బాలన సేయగరాదె ప్రేయసీ!


ఉ.

విందుగదా భవన్మధురవిశ్రుతవాక్యపరంపర న్సదా
విందుగదా తవాధరనవీనసుధారసధార లెప్పుడుం
గందుగదా సుధాకరసఖంబగు నీదుముఖంబు నంటినం
గందుగదా లతాంతము వగందగు నీనునుమేను కోమలీ!


చ.

అతివరొ నీదుపొందు సతమంచు మది న్నెఱనమ్మియున్న నా
మతి పరికింపలేక పలుమారు ననుం బెఱవానిగా మనో
గతులఁ దలంచి నీవు కనికారము మాని పరా కొనర్చి బ
ల్వెతలఁ గలంచినావు హితమే యిది నీకు? వినీలకుంతలా!


ఉ.

కాయజుఁ డమ్ములేయఁ జిలుకల్ రొదచేయ మరుత్కిశోరముల్
డాయ మధువ్రతంబులు చెడాచెడి మ్రోయ వనప్రియంబులుం
గూయ జకోరమిత్రు డెద గొంకక వెన్నెల గాయ దాళరా
దాయె మనంబుం దమక మగ్గలమాయె సుధాకరాననా!


చ.

కుసుమసుగంధి స్వర్ణనిభకోమలదేహలతా సుబాహ సా
రనసదళనేత్ర గంబుగళ రాజముఖి న్నవపల్లవాధరన్

భసలవినీలకుంతల సుభద్రగజేంద్రసమానయాన ని
న్నసదృశమైసప్రీతి మది నంగట వర్ణన జేతు సుందరీ!


చ.

కపట మొకింతయేని మది గల్గదు నీకని నమ్మియుంటి నా
కిపు డెరుంగగ వచ్చే నిక నేటికి మాటలు చాలుజాలు నీ
కృప బలమయ్యె నావలపు గేలి యోనర్చితి వెట్టులైన నీ
వపరిమితంబు లైనసిరు లంది సుఖింపగ గోరుదున్ సఖీ!


చ.

రమణి మదీయమోహతిమిరంబు భవన్ముఖపూర్ణచంద్రబిం
బము గనుగొన్న! బాయునని బాళిమెయి న్నిను జేరవచ్చినన్
విముఖత జూప నాయమగునే యిక నేవగ నే సహింతు నీ
తమకము నన్ను సాదరహితస్ఫురదూక్తుల దెల్పరాదటే!


ఉ.

సమ్మతి మీఱ నీచెలిమి శాశ్వతమంచు మనమ్ములోపలన్
నమ్మితి మున్ను నమ్ము నెలనాగలపై గల కూర్మి లెల్ల బో
జిమ్మితి నిన్ను నెప్పు డెద జేర్చితి నిట్టి ననుం దుటారివై
గమ్మనివింటివా డిడెడుగాసికి బాల్పడ జేసితౌగదే!


ఉ.

కొమ్మ! నినున్ రతిం గలయఁగోరి సమీపము జేరి నన్ను దే
కొమ్మని మేనితాప మరగొబ్బున గమ్మనిమోవిపానక
మ్మిమ్మని కాముసాధనల కిమ్మని నెమ్మని వేడుకొన్న బో
పొమ్మని యీగతిం గసరబోలునె నన్ను దయవిహీనవై?


ఉ.

నవ్వుల కాడుమాటల నమ్మున గిన్క వహించి యూరకే
రవ్వల బెట్టజూడకు తిరమ్ముగ నామన వాలకింపవే
చివ్వకు కాలు ద్రవ్వకనె చేసినతప్పు శమింపరాదటే
పువ్విలుకాని బార ననుఁ బొక్కగ జేయకు కంబకందరీ!


ఉ.

మంచిగుణంబు కల్గినది మాట యొకింతయె దప్ప దెంతయున్
వంచనలేదు కూర్మి మది వాడగ నీదుమనంబు నిర్మలం
బంచు దలంచి సీకహరహం బొనరించితి సేవ యందుకా
పంచశరాంకప్రహతి బాల్పడ చేసితి హాకళావతీ!

ఉ.

కెంపుకనుల్ గనంగ నుడికింపకు సారెకు మారుబారి బో
కింపకు వేఱుగాగ బరికింపకు నమ్మినవారి నిట్లు జం
కింపకు లేనిపల్కు లొలికింపకు నేరములున్న నాత్మనం
కింపకు బల్విరాళి నళికింపకు బెంపకు కిన్క తొయ్యలీ!


ఉ.

ఇంపు దొరంగి సారె యలయింపకు మారునిరేచ నన్ను డా
యింపకు కోప మిచ్చ నెలయింపకు మున్పటినేస్త మెల్ల మా
యింపకు బోవఁ దల్చి విసయింపకు నీవిరహాగ్ని గాసి సే
యింపకు మీర్ష్యబుద్ధి వహియింపక మ్రొక్కెదనామనోహరీ!


ఉ.

నిద్దరవోవ నిన్నుగని నెక్కొనుమోహము నిల్చలేక నీ
ముద్దుముగంబుపై మొగము మోపినయంతనె కన్ను విచ్చి న
న్నొద్దిక గ్రుచ్చి గౌగిటను నూరక రక్తి గఱంచ కూరకే
గద్దిరిపల్కులం గసరఁగావలెనా? లలనాశిరోమణీ!


ఉ.

కంటకవృత్తి దుంటవిలుకాడు బలంబుల వెంటనంటి పూ
వింట శరంబు లూని వెనువెంట ననుం దఱుమంగ జొచ్చె వా
ల్గంటిరొ! యొంటి జిక్కితిని గావవె జంట వహించి, యన్న 'న
న్నంటగరా'దటంచు మొగ మావలఁ ద్రిప్పెద వెంత దంటవే?


ఉ.

అంటిన మేను గందునటె యాస బొసంగగఁ మోవి ముద్దు నే
గొంటనె తేనె చిందునటె గోరిక లూరగ నీముఖాబ్జముం
గంటనె దృష్టి యొందునటె గాడరముల్ బచరించి సారెకుం
గొంటితంబునన్ మరునికోలలఁ దార్చకు ప్రాణనాయకీ!


ఉ.

నాపలు కాదరింపవె ఘనంబుగ బ్రేమము నింప వెంతయున్
గోపము డించ విచ్చగల కోర్కె వచింపవు నాదు చిత్తసం
తాప మడంప వాత్మ ననుతాపము బెంపపు వేడవేడ రా
రాపులు జేసె దింతపొగరా నగరా పగదానవా సఖీ!


ఉ.

వేమఱుఁ గిన్క బూనదగవే మరుధాటికి దాళజాల రా
వే మరు లూనినాడ గదవే మరు గేటికి గోర్కి దెల్పుకో

వేమఱపేల నేలుకొనవే మరుమాటలనైన దెల్పవే
వేమరులున్నవే నుడువవే మరలించవె మోము నాదెసన్.


చ.

విచికిలగంధి! నీపెదవి విందొనరించి విడెంబొసంగి నీ
రుచిర కుదోరుతల్పమున రూఢిగ నన్బవళింపజేసినన్
రచనలుమీఱ బంధనకళల న్నను గూడితి వేమి దెల్పుదుం
గనరుచిధూతమేచకఘనావికచాంబుజపత్రలోచనా.


చ.

భువి విటకాండ్రకింపు మది బుట్టగ స్వోచితవృత్తి మీఱ దో
ట విజయరాఘవాఖ్యకవి డంబుగ దా రచియించె హృద్యమా
ర్ణవరసపూర్ణలాలితసుధామధురోక్తుల రక్తి గుల్కగా
రవమున జేకొనుండు కవిరాజులు తప్పులు పట్ట కెంతయున్.

(పురుషవాక్యము సంపూర్ణము)