Jump to content

పుట:Yogasanamulu.djvu/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

లంక సూర్యనారయణ

పద్మాసనము చేయు పద్ధతి:

రెండు కాళ్ళను ముందుకు చాచి కూర్చుండవలయును. కుడికాలి మడమను క్రిందనుండి పట్టుకొని ఎడమ తొడ మూలమందు పైన ఉంచవలయును. అటులనే ఎడమ పాదమును కుడికాలి తొడ మూలమందు పై భాగమున ఉంచ వలయును. రెండు చేతులను ఆయా ప్రక్కలనున్న మోకాళ్ళ మీద ఉంచ వలయును. మోకాళ్ళు నేలకు తాకునట్లు ఉంచ వలయును. శిరస్సు, మెడ, తల ఈ మూడును తిన్నగా ఉంచవలయును. శ్వాసను స్వేచ్చగా పీల్చుచు విడుచుచు ఉండవచ్చును. అటులనే చాలసేపు శరీరమును బాధ కలుగకుండా ఉండునట్లు కూర్చొనుట అలవరచుకొన వలయును. ప్రారంభమున కొన్ని దినముల వరకు ఎక్కువసేపు కూర్చొనిన యడల పాదముల యందు తిమ్మెరలు వచ్చును. కాలక్రమమున అలవాటు పడిన కొలది సుఖముగా ఉండును. దృష్టిని నాసికాగ్రమున గాని, భ్రూమధ్యమున గాని ఉంచవచ్చును.

8. స్వస్తికాసనము:

కూర్చొని కుడికాలి పాదమును ఎడమ తొడ ప్రక్కగా నేలను ఆన్చియు ఎడమకాలి పాదమును కుడికాలి తొడకును పిక్కకును నడుమ నుంచి వెన్ను, మెడ, శిరస్సు ఒకే సరళ రేఖలో ఉన్నట్లు నిలువుగా ఉంచవలయును. చేతులను రెండింటిని ఆయా వైపున వున్న మోకాలి పైనగాని లేదా నాభి స్థానమునకు దిగువను ఒక చేతిపై మరియొకటి వుంచి కూర్చొనునది. దృష్టిని నాసికాగ్రమునగాని భ్రూమధ్యమున