Jump to content

పుట:Wikipedia Gurinchi Meeku Telusa?.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదాలున్నాయి కదా మనకు. విడిగా వాటికి అర్థం లేదు, కానీ జంటగా చక్కటి అర్థాన్నిస్తాయి. అలాంటి జమిలి పదాలే హవాయీ భాషలో కూడా ఉన్నాయి. వాటిలో వికివికి అనే మాట ఒకటి. దాని అర్థం చకచక/గబగబ అని. ఆశ్చర్యంగా ఉందా? ఔను, నిజమే!

హవాయి విమానాశ్రయంలో ఈ మాట విన్న వార్డ్ కన్నింగ్ హామ్ అనే పెద్దాయనకు అది నచ్చి, 1995 లో తన వెబ్ సైట్ కు ఆ పేరు పెట్టాడు. ఎవరైనా మార్పుచేర్పులు చేసేలా, ఆ మార్పులు కూడా చకచకా చెయ్యగలిగేలా వెబ్ సైట్ ను తయారుచేస్తూ దానికి వికివికివెబ్ అని పేరు పెట్టాడు. ఆ వికీ అనే పేరునే తరువాత వికీపీడియాకు కూడా వాడారు. వికివికి +ఎన్సైక్లోపీడియా = వికీపీడియా అన్నమాట! వికీపీడియా ప్రస్తుతం 353 భాషల్లో ఉంది. తెలుగులో వికీపీడియా 2003 డిసెంబరులో మొదలైంది. మనం దీన్ని గబగబపీడియా అనో చకచకవిజ్ఞానం అనో కూడా అనుకోవచ్చు. తెలుగు వికీపీడియాకు అది ప్రత్యేకం!

స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం

వికీపీడియా అనేది ఎన్సైక్లోపీడియా పేరును అనుసరిస్తూ పెట్టిన పేరు. 2001 లో జిమ్మీ వేల్స్ అనే అమెరికనుకు వచ్చిందీ స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ఆలోచన. ఎవరైనా రాయగలిగేదీ, చదువుకునేందుకు ఇంటర్నెట్ లో అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేదీ ఈ స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. కార్య సాధకుడవడం చేత ఆలోచన వచ్చాక ఇక ఊరుకోలేదు, జిమ్మీ. తన ఆలోచనకు ఆకారమిస్తూ వికీపీడియాకు శ్రీకారం చుట్టాడు. అప్పటికే తాను రూపొందిస్తూ ఉన్న నుపీడియా అనే విజ్ఞాన సర్వస్వాన్ని పేరు మార్చి వికీపీడియాగా మొదటగా ఇంగ్లీషు భాషలో మొదలుపెట్టాడు. వికీపీడియా చాలా త్వరగా ప్రజల మన్నలను పొందింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగి విశ్వవ్యాప్తమైంది. జర్మను, జపనీసు, స్పానిషు, ఫ్రెంచి, ఇటాలియను, రష్యను, చైనీసు ఇలా ప్రపంచ వ్యాప్తంగా అనేక ఇతర భాషల్లోనూ వికీపీడియాలు మొదలయ్యాయి. గొప్ప గొప్ప వ్యాసాలెన్నో

వికీపీడియా గురించి మీకు తెలుసా? 11