Jump to content

పుట:Wikipedia Gurinchi Meeku Telusa?.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీటిలో చేర్చే సమాచారంపై ఫౌండేషనుకు ఎలాంటి నియంత్రణా లేదు. సమాచారాన్నంతా స్వచ్ఛందంగా పనిచేసే వాడుకరులే పరస్పరం సహకరించుకుంటూ, సంప్రదించుకుంటూ సమాచారం చేరుస్తారు. ఈ వాడుకరులందరినీ కలిపి సముదాయం అంటారు. సమాచార ఎంపిక, విశ్వసనీయత, కాపీహక్కుల పాలన, వాడుకరుల పరస్పర వ్యవహార సరళి వంటి పలు అంశాలకు సంబంధించి ఈ సముదాయాలే నియమ నిబంధనలను ఏర్పరచుకుని పనిచేస్తాయి. ఈ వెబ్సైట్లలో సమాచారాన్ని చేర్చే వాడుకరులకు కూడా ఈ సమాచారంపై ఏ హక్కు ఉండదు. ప్రచురితమైన సమాచారమంతా సర్వ మానవాళికీ చెందుతుంది.

2022 లో ఫౌండేషను వికీమీడియా ఎంటర్ప్రైస్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీనిద్వారా వికీ ప్రాజెక్టుల్లో ఉచితంగా లభించే సమాచారాన్నే సంస్థలు నేరుగా పెద్దయెత్తున API ల ద్వారా అందుకునే సౌలభ్యాన్ని కల్పించింది. ఫౌండేషను ఈ సేవను ఉచితంగా ఇవ్వదు, విక్రయిస్తుంది. గూగుల్ వంటి సంస్థలు దీన్ని వాడుకుంటున్నాయి.

వికీమీడియా ఇతర ప్రాజెక్టులు

వికీమీడియా ఫౌండేషను వారు వికీపీడియా మాత్రమే కాకుండా, విజ్ఞానానికి సంబంధించిన పలు ఇతర ప్రాజెక్టులను కూడా నిర్వహిస్తోంది. వికీపీడియా లాగానే ఆ ప్రాజెక్టులు కూడా వివిధ భాషలలో ఉన్నాయి. తెలుగులో కింది ప్రాజెక్టులు ఉన్నాయి:

1. వికీసోర్స్: కాపీహక్కులు లేని పుస్తకాల గ్రంథాలయం

2. విక్షనరీ: ఉచిత నిఘంటువు

3. వికీవ్యాఖ్య: ప్రముఖుల వ్యాఖ్యలను ఒకచోట చూపించే నెలవు

4. వికీబుక్స్: కొత్తగా పుస్తకాలు రాసి ప్రజలకు ఉచితంగా అందించాలనుకునే వారికి ఇది చక్కటి స్థలం


వికీపీడియా గురించి మీకు తెలుసా? 31