భారతీయ భాషల్లో వికీపీడియా
2001 లో ఇంగ్లీషుతో మొదలైన వికీపీడియా, నిదానంగా ఇతర భాషలకూ విస్తరించి, ఇప్పుడు 350 కు పైగా భాషల్లో తయారవుతోంది. అందులో తెలుగూ ఒకటి. దాంతోపాటు హిందీ, సంస్కృతం, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఒరియా, అస్సామీ, ఉర్దూ, ఇలా దాదాపుగా అన్ని ప్రముఖ భారతీయ భాషల్లోనూ వికీపీడియా తయారవుతోంది. వ్యాసాల సంఖ్య పరంగా ఉర్దూ, తమిళం, హిందీ, బెంగాలీ మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఒకప్పుడు 7 వ స్థానంలో ఉన్న తెలుగు వికీపీడియా 2024 లో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ముందుకు సాగి ఐదవ స్థానానికి చేరింది. ఈ క్రమంలో లక్ష వ్యాసాల మెట్టును కూడా అధిరోహించింది. చకచకా రెండవ లక్ష చేరుకోడానికి, మరో రెండు స్థానాలు ముందుకు వెళ్ళడానికీ ఒకటే మార్గం - మీరు కూడా వికీపీడియాలో రాయడమే.
వికీపీడియాలో ఏమేం రాస్తున్నారు
తెలుగు వికీపీడియా (తెవికీ) వెబ్ అడ్రసు: http://te.wikipedia.org. చరిత్ర, సంస్కృతి, ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు... ఇలా ఎన్నో విషయాలపై రాస్తున్నారు. లక్షా ముప్పై వేలకు పైగా వాడుకరులు (అంటే యూజర్లు) లక్షకు పైగా వ్యాసాల మీద ప్రస్తుతం పని చేస్తున్నారు. ప్రఖ్యాత రచయితలు, సంఘసేవకులూ కూడా వికీపీడియాలో రాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని ప్రతీ ఒక్క గ్రామానికీ సంబంధించిన విలువైన సమాచారం తెవికీలో లభిస్తుంది. మరే ఇతర వెబ్సైటులోనూ ఒకేచోట ఇంత సమాచారం లభించదు.
వికీపీడియా గురించి మీకు తెలుసా? 13