ఈ పుట ఆమోదించబడ్డది
250
- అండ కోశము
- - అండాశయము నీచము. 2 గదులు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క గింజ కలదు. కీలములు రెండు. కాయ విభజన ఫలము.
ఈ కుటుంబములోని మొక్కలన్నియు ఏక వార్షికములే. అవి ఏడాది లోపుగనే పుష్పించి చచ్చి పోవును. పత్రములు చీలి యుండును. వాని మీద రోమములు లేవు. పుష్పమంజరులు గుత్తులు. పుష్ప కోశమునకు దంతములు గలవు. అవి యన్నియు సమముగా లేవు. పువ్వులు సరళములు కావు. కాయలపైన చార లున్నవి.
కొత్తిమెరిని మన దేశమందంటను పైరు చేయు చున్నారు. దానిని సదా మొలపించుదురు గాని దనియములకై యైనచో కొన్ని ఋతువులలోనే పైరు బాగుండును. ఇతర కాలములలో పంట అంత సంవృద్ధిగా వుండదు. కొత్తి మెరికి సువాసన యుండుటచే దానిని కరివేపాకు వలెనే కూర, పులుసులలో వాడు కొను చున్నాము. ధనియములు గింజలు కావు. అవి కాయలే. ఒక్కొక్క కాయ రెండుగా చీలును. గింజలు లోపలి నుంది పైకి వచ్చుట లేదు.
ధనియములకు కూడ మంచి వాసనే కలదు. వానిని ఔషధములలో కూడ ఉపయోగింతురు. ఐరోపా దేశస్తులు వీటి నుండి చమురు తీయు చున్నారు.