పుట:VrukshaSastramu.djvu/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

251

జీలకఱ్ఱ విస్తారముగా పంజాబు దేశములో పైరగు చున్నది. దీని ఆకులును చీలి యున్నవి. పువ్వులు గుత్తులే. జీల కఱ్ఱను పోపులలోను ఔషధములలోను వాడుచున్నాము.

శతపుష్పము మొక్క చాలతోటులనే పెరుగుచున్నది. దానిని కొన్ని చోట్ల పైరు చేయు చున్నారు. కాయలను నీళ్ళలో గలిపి బట్టి పట్టి చమురు తీయుదురు. ఆ చమురును ఔషధములలోను సువాసన నిచ్చుటకు సబ్బులు చేయుటలోను వాడు చున్నారు. దీని ఆకులు కూడ సువాసన గల వగుటచే కూర లందు వాడుచున్నారు.

మండూక పర్ణి
- మన దేశము నందంతటను పెరుగు చున్నది. దీని ఆకుల నెండబెట్టి పొడి గొట్టి చిరకాలము నుండియు ఔషధములలో వాడు చున్నారు. ఈ పొడిని లోపలకు ఇచ్చుటయు ఇతర మందులతో కలిపి పైకి రాయుటయు కూడ గలదు. ఇది చర్మ వ్యాధులకు బాగుగ పని చేయునందురు.

ఇంగువ మొక్కలు ఆపుగనిస్థాను, పెరిష్యాదేశప్రాంతములందు ఎక్కువగా మొలచును. ఇవి ఉన్నతప్రదేశములందును, రాతినేలలందును మొలచును. చాల పెద్దదిగ ఎదిగిన మొక్క నాలుగడుగులకంటె ఎక్కువ ఎత్తుండదు.