పెద్ద దూలగొండ:- తీగె దొంకలమీద ప్రాకును.
దీనిఆకులు చిక్కుడాకుల వలె నుండును. వీనిపై మెత్తని రోమములు గలవు. ఆకులు దేహమునకు దగిలినచో దురద పెట్టును. ఈ దురద, రోమముల లోనుండి వచ్చు ద్రవ పదార్థము మన చర్మము పై బడుటచే గలుగు చున్నది. మృగము లేవియు దీనిని తినకుండ సంరక్షించుకొనుటకై ఇది యొక మార్గము.
గులాబి కుటుంబము.
ఈకుటుంబపు మొక్కలు శీతలదేశములలో ఎక్కువగా పెరుగుచున్నవి కాని మన దేశములో అంతగా లేవు. కొన్నిటి ఆకులు లఘు పత్రములు, కొన్నిటివి మిశ్రమ పత్రములు కాని అన్నిటి యందును ఒంటరి చేరిక్యే. ఆకులకు గణుపు పుచ్చములు గలవు. పుష్పములు చిక్కుడు పువ్వు వలె నుండక సరాళముగ నుండును. పుష్ప కోశము నందును దళ వలయము నందును అయిదేసి రేకులున్నవి. ఇవి మొగ్గలో అల్లుకొని యుండును. కింజల్కములు చాల గలవు. ఇవి పుష్ప కోశము నంటి యుండును. అండాశయము లొకటైనను ఎక్కువగా నైనను నుండును. కాయలు కొన్నిటిలో కండ కాయలుగను కొన్నిటిలో ఎండు కాయలుగను వున్నవి. ఈ కుటుంబములో ఉపయుక్త మైన మొక్కలు గలవు.