పుట:VrukshaSastramu.djvu/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరునా డుదయమున కదిగట్టిపడును. దీనినే ముక్కలు ముక్కలుగా కోసి అమ్ముదురు. ఈచెట్టు నుండి జిగురు కూడ వచ్చును. ఈ జిగురు తుమ్మ జిగురు కంటె మంచిది. దీని కలపయు బలమైనదియె. ఇంటి వాసములకును, చక్రములు నాగళ్ళు రోళ్ళు మొదలగు వానికిని బనికి వచ్చును.

షీకాయి చెట్టు:- ముండ్ల పొదవలె బెరుగును. లేత యాకులు పుల్లగా నుండును గాన చింత చిరుగు వలెనే పచ్చళ్ళు చేసి కొందురు. ఈ పచ్చడిని పత్స్యముగ కూడ ఉపయోగించెదరు. కాయలు కుంకుడుకాయల వలెనే రుద్దుకొనుటకు పనికి వచ్చును.

గానుగ చెట్టు:- మన దేశములో చాలచోట్ల పెరుగుచున్నది. దీని చిట్టి ఆకులు పెద్దవిగనే యుండును. పువ్వులు తెల్లగానైనను కొంచము నీలము రంగుగానైననుండును. వికసించిన తరువాత త్వరగా రేకులు రాలి పోవును. కాయ బాదము కాయవలె నుండునుగాని మిక్కిలి పలుచగా నుండును. కాయ లెండినను బ్రద్దలు కావు. గింజలనుండి తీసిన చమురు చర్మవ్యాధులకును, తల నొప్పి కీళ్ళనొప్పులకును పనికి వచ్చును. ఆకులతో దమ్ము చేసిన యెడల పొలములు సారవంత మగును.