పుట:VrukshaSastramu.djvu/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దిరిశనచెట్టు:- బాటల యందు నీడనిచ్చుకొరకు బాతెదరు. వీని పువ్వులు గుత్తులు గుత్తులుగా నుండును. పువ్వు మంచి వాసనయు గలదు. ఆకులు పక్షవైఖరిగ నున్నవి. చిట్టియాకులు పగలంతయు విప్పారి యుండి సాయంత్రమందు ముణుచుకొనును. ఆకులును కొంచెము క్రిందకు వాలి నిద్ర బోవుచున్నట్లు దోచును. కనుకనే వీనిని నిద్ర గన్నేరు చెట్లని కూడ కొందరందురు. అట్లు ముణుచుకొనుట చేత బగలు నీడయు రాత్రి వెన్నెలయు కూడ ద్రోవపై పడును గాన సాధారణముగ నీనినే పాటెదరు.

నిద్రగన్నేరను పేరుతోడనే మరియొక్క మొక్క గలదు. ఇది మిక్కిలి చిన్నమొక్క. దీని యాకులు చింతాకుల కంటె సన్నంగానుండును. దీని చిట్టి యాకు నొక దానిని తాకితిమా, దగ్గరనున్న వన్నియు ముణుచుకొని పోవును. ఒక యాకునకు దగ్గిరిగా అగ్గి పుల్లను వెలిగించిన యెడల నాకులన్నియును, వేడెక్కువగ సోకిన యెడల కొమ్మ గూడ ముణుచుకొనును. చెట్లకు గూడ మన వలెనె స్పర్శ గ్రహణ శక్తి యు మనవలెనె కష్టసుఖముల నెరుంగుటయు గలవని సూచించుట కిదియే దృష్టాంతము.