పెసలును మెరక పంటయె. వీనికి మినుములకంటే నెక్కువ నీరు గావలయును. ఇవి వాని కంటెను కొంచము ముందుగా బండును. పెసలకు మినుములంత వాడకము లేదు.
కుంకుమపెసల పంట:- బొంబాయి ఉత్తర హిందూస్థానములందు గలదు. వీని నితర పైరులతో చల్లెదరు. వర్షమంతగా నవసరము లేదు. 4 నెలలకు బంటకు వచ్చును. వీనిని పప్పుగా కంటె బచ్చి కాయలనే కూరగా నెక్కువ వాడెదరు. దీని రొట్ట పశువులకు బలమునిచ్చును.
పిల్లి పెసరగింజలు:- కూడ బాగుగ నుండును కాని, మొక్క అంతగా ఫలింపమిచే సేద్యముచేయరు. వీనికి నీరెక్కువ కావలయును. ఇవి నీటి యొడ్డునను వరి చేలలోని బెరుగును.
మినుము:- మొక్కలు మిక్కిలి గుబురుగా నుండి 3, 4 అడుగుల వరకు గూడ బెరుగును. మినుముల పంటకు నీరంతగా అక్కరలేదు. విత్తనములు జల్లుటకు పూర్వము ఒక వర్షము కురిసిన చాలును. సాధారణముగ పల్లపు నేలలందు వరి పంటయైన తరువాత జల్లుదురు. కొన్ని చోట్ల ప్రత్తి మొదలగు నితర పైరులతో గలిపి చల్లెదరు. ఇవి నల్ల మట్టి నేలలో బాగుగా బండును. కందులతరువాత మినుము