పుట:Venoba-Bhudanavudyamamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

45


భాగము దానమివ్వవలయును. నెలకు 50 రూపాయిలు మొదలు 150 రూపాయిలవరకు ఆదాయముగలవారు రూపాయికి రెండు పైసల చొప్పున అనగా 32 వ భాగము యివ్వవలయును. నెలకు 150 రూపాయలనుండి 250 రూపాయలవరకు ఆదాయంగలవారు రూపాయికి మూడుపైసలు చొప్పున అనగా 21. వ భాగం యివ్వవలయును. ఈ విధముగా ఆదాయములో అధికమైన ప్రతి వందరూపాయిలకు రూపాయిలో ఒకపైసా అధికంగా దానమివ్వవలయును. ఈ విధముగనే అడుగడుగు వేసుకుంటూ, చిట్ట చివరకు ఆదాయములో ఆరవభాగమును దానమివ్వవలయును.

జీవనదానము.

భూదాన, సంపత్తిదానములతోపాటు, యీ యజ్ఞములో అనేక యితరదానము లుత్పత్తి అవుచూ, సర్వవ్యాప్తి నొందసాగెను. మానవుడైన ప్రతివాడు దానమివ్వగల శక్తిగల్గివున్నాడని విశదపరుపబడెను. సర్వోత్కృష్టమైన, విస్తృతమైన యీ యజ్ఞ సాఫల్యతకు జీవితము నర్పించ వలసిన ఆవశ్యకత క్రమక్రమంగా గుర్తింపబడెను. దీనినుండియె "జీవనదాన" మను శాఖ భూదానయజ్ఞములో వుత్సన్నమాయెను.

1954 సo|| ఏప్రెల్ మాసములో, బుద్ధగయలో సర్వోదయ సమ్మేళనము జరిగెను. చరిత్ర ప్రసిద్ధి నొందదగిన, యీసమ్మేళనమునకు దేశము నలుమూలలనుండి భూదాన కార్యకర్తలు సమావేశమై వుద్యమ వ్యాప్తిగురించి చర్చించిరి. ప్రధానామాత్యులు, కాంగ్రెసు అధ్యక్షులు అయిన శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, రాష్ట్రపతి శ్రీ రాజేంద్రప్రసాదు యీ సమావేశముసకు హాజరైరి. ఒకదినము సమావేశములో, బీహారు భూదాన సేకరణ గురించి చర్చించు సమయమున, తమ కోటాను పూర్తి చేయలేకపోయినామనే విచారముతో ప్రజా సోషలిస్టు నాయకులు, బీహారు భూదాన వుద్యమములో ముఖ్యులైన శ్రీ జయప్రకాష్ నారాయణ రుగ్ధకంఠముతో, ఆవేదనతో పూజ్య వినోబాజీని సరిగా వుపయోగించుకొనలేక పోయితిమని, దీనికి కార్యకర్తలే కారకులని, రాజకీయ భేదాలుకూడ దీనికి అవకాశ మిచ్చినవని, కనుక కార్యకర్తలు సర్వస్వము సమర్పణచేసిన గాని, వుద్యమము వ్యాప్తి చెందజాలదని, కాన తన జీవితమంతే. యీ వుద్యమమునకు సమర్పించుచున్నామని నుడివిరి.