పుట:Venoba-Bhudanavudyamamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11



2

గాంధీజీ మరణానంతరము తమకార్యక్రమ నిర్వహణమునకె నిర్మాణ కార్యకర్తలెల్లరు 1948 సం||లో "సేవాగ్రాం"లో సమావేశమైరి. ఆ సమావేసములో వినోబాజీ సూచనానుసారము “సర్వోదయ సమాజం" స్థాపింపబడెను. వార్షిక సమావేశములు జరుపుకొనుటకు సర్వోదయ సిద్ధాంత వ్యాప్తికై సర్వవిధముల కృషి సల్పుటకు నిర్ణయించుకొనిరి.

ప్రధమ వార్షిక సమావేశము 1949 సం||లో ఇండోరుకి సమీపములో నున్న "రాయ్”లో జరిగెను. అసమావేశములో వినోబాజీ సర్వోదయ సిద్ధాంతముల గురించి విపులీకరించిరి. సర్యోదయ సమాజ కార్యక్రమముల నిర్వహణకై "సర్వసేవా సంఘ" మను సంస్థను ప్రారంభించిరి. ద్వితీయ వార్షిక సమావేశము ఒరిస్సాలోని "ఆంగుల్" వద్ద జరిగెను. ఇందు వినోబాజీ పాల్గొనలేకపోయెను. తృతీయ వార్షిక సమావేశము హైద్రాబాదులోని "శివరాంపల్లి"లో 1951 సం|| ఏప్రిల్ 8, 9, 10, 11 తేదీలలో జరుపుటకు నిర్ణయింపబడెను. దీని నిర్వహణకై "సర్వసేవా సంఘము" సేవాగ్రాములో సమావేశమయ్యెను. ఈ సమావేశములో వినోబాజీ శివరాంపల్లి సమావేశములో పాల్గొనుటకు తమ ఆయిష్టతను వెల్లడించిరి. కాని శ్రీ శంకరరావుదేవ్ మొదలగువారు ప్రారంభకులు, ప్రోత్సాహకులు అయిన వినోబాజీ పొల్గొన యిష్టపడక పోయిన, యీసమావేశములు ఆనవసరమని తెల్పుటచే, వినోబాజీ ఆఖరకు కాలి నడకతో ప్రయాణముచేసి, శివరాంపల్లి సమావేశములో పాల్గొనుటకు అంగీకరించిరి. 1951 సం|| మార్చి 8 తేదీన తమ ఆశ్రమము నుండి బయలుదేరి, 315 మైళ్లు ప్రయాణముచేసి, 1951 సం|| ఏప్రెల్ 7 తేదీన వినోబాజీ శివరాంపల్లె చేరిరి. దినమునకు 10, 12 మైళ్లు నడచుచు, ఆయా గ్రామములు చేరగనే గ్రామమంతయు సంచరించి, వారి కష్టసుఖములను విచారించుచుండెడివారు. సాయింకాల ప్రార్థన సమావేశములో గ్రామ ప్రజలు పాల్గొనుచుండెడివారు. ప్రార్థనానంతరము వినోబాజీ గ్రామ రాజ్యము, సర్వోదయము గురించి వుపన్యసించుచుండెడివారు. కొద్దిదినములలోనే వినోబాజీ తమ రక్షకుడని ప్రజలు గుర్తింపసాగిరి. కార్యక్రమ నిర్వహణకై, ఒకవిశిష్ట వుద్దేశ్యముతో కాలినడకను ప్రజలను సమీపించిన ప్రధమవ్యక్తి వినోబాజీయే.