పుట:Venoba-Bhudanavudyamamu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9


దీనివలన వారి అంతర్వాణీకి తృప్తిలభించలేదు. పౌనారునకు తిరిగివెళ్లిరి. దీర్ఘ చింతనానంతరము, శారీరక శ్రమతోకూడిన స్వయంపోషకత్వమును తమ ఆశ్రమములో ప్రవేశబెట్టిరి, పొలములో స్వయముగా రోజుకి 8, 10 గంటలు పనిచేసెడివారు. దానిని వారు "కాంచనముక్తి" అనెడివారు. ధన బానిసత్వమునుండి విడువబడి, సాంఘిక, ఆర్థిక, నైతిక , విజ్ఞాన శక్తులను సక్రమ మార్గములో సద్వినియోగ పరచుటయే దీని ప్రధాన వుద్దేశ్యము. ఈవిధమైన కార్యకలాపము 1953 సం|| ఏప్రెల్ వరకు కొనసాగింప బడినది. భూదాన యజ్ఞప్రారంభముతో యీ నిస్వార్థ సేవకుల దృష్టి సమాజ సమస్యను పరిష్కరించు వైపు మరలింపబడెను.

1930–31 సం||లో వినోబాజీ భగవద్గీతను సంస్కృత భాష నుండి మరాటీకి తర్జుమానొనర్చి, దానికి "గీతలు" (గీతామాత) అనిపేరిడిరి. వినోబాజీకి గీతకున్న సంబంధము వర్ణనాతీతము. తామెల్లప్పుడు గీతా సముద్రములో యీదులాడు చుందుమని, వాస్తవమునకు గీతతమ మాతృదేవి అని వినోబాజీ అంటూవుంటారు.

(గీతనామాతృదేవత, నేను ఆమె ఆమాయక పుత్రుణ్ణి. నాపొరబాట్లల్లో, దుఃఖాల్లో, ఆమెనన్ను తన ఒడిలోనికి లేవనెత్తును.)

1932 సం||లో "దులయే" జైలులో నున్నప్పుడు గీతపై, వినోబాజీ యిచ్చిన ప్రవచనము, "గీతా ప్రవచనము" అను అత్యద్భుత పుస్తక రాజముగా వెలువడెను. అది హిలదీ, గుజరాతీ, ఒరియా, సింధి, కన్నడం, తెలుగు, తమిళం, మలియాళం, ఉర్దు. బెంగాలీ, భాషలలోనికి తర్జుమా చేయబడెను. నవభారతములో యీగ్రంధమునకున్న విశిష్టత మరే గ్రంధమునకు లేదనవచ్చును. ఇదేగాక, వినోబాజీ అనేక వుత్క్రంధములను రచించిరి. 1949 సం||లో "సర్వోదయ" అను హిందీ మాసపత్రికను ప్రారంభించిరి. మరియొక ముఖ్యమైన మాసపత్రిక. మరాటీలోనున్న "సేవక్" దీనికి వారి కార్యదర్శి, దామోదరదాసు ముండాడ సంపాదకులు ఇది పౌనారు ఆశ్రమంలోనే, లోక నాగరి లిపిలో అచ్చు కాబడుచున్నది. దేవనాగరి లిపిలో వినోబాజీ చూపిన శాస్త్రీయమై, నవీన అభివృద్ధి మార్గములిందు వుదహరించబడుచుండును. వినోబాజీ బహు భాషా ప్రవీణులు. వారి మాతృభాష అయిన, మరాటీ భాషతో సరిసమానముగా గుజురాతీ, హిందీ బాషలలో పాండిత్యముగలదు. ఉర్దు, బెంగాలీ, ఒరియా,