పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన కాలమందలి మతధర్మముల స్థితి 57

ప్రపంచమున ననేకు లుండుట మీ రెఱుఁగనిదికాదు. కావున నే నిందు ధర్మమనుపదమును న్యాయమను నర్ధమందుపయోగింప లేదు. సామాన్యవ్యవహారములో నీ రెండుపదములును ఒకటిగానే వాడఁబడు. చున్నను మనమిప్పడు కొంత భేదమును గల్పింపవలసియున్నది. న్యాయము. మనుష్యుని హృదయమందు సహజముగా జనించు దయ, ఔదార్యము మొదలగు నుదారభావములచే నిర్ణయింపఁబడును. ధర్మము ఒకజాతికో, వ్యక్తికో యోగ క్షేమములు కలుగవలయునని తప్పక యాచరింపవలసినదిగా పెద్దలు ఏర్పఱచిన నియమము. న్యాయము ఎవరికిని కష్టనష్టములు రాకుండఁ బ్రయత్నించును. ధర్మము ఎవరి కష్టసుఖములను గమనింపదు. న్యాయము ధర్మము గావచ్చును ధర్మము న్యాయము కావచ్చును. కాని అయియే తీరవలయునని నిర్బంధములేదు. శైవునిజూచిన సచేలస్నానము చేయవలయుననుట వైష్ణవుని ధర్మము. కాని న్యాయముకాదు. పంచములనుగూడ మనవంటి మనుష్యులనుగా భావించి దగ్గఱకుఁ జేర్చుట న్యాయము ; కాని హిందువుల ధర్మముకాదు. అనఁగా, న్యాయము మనుష్యజాతి సామాన్యము ; ధర్మము అవాంతరభేదములకు చేరినది. న్యాయము నకు ఇహలోకమందు దృష్టి ధర్మమునకు పరలోకమందు, కావున న్యాయము సార్వకాలికము ; ధర్మము మార్పులకు లోఁగునది. పరలోకదృష్టి చాలవఱకు నశించిన యీ కాలమందు ధర్మము నశించుచున్నది. పరలోకము అతీంద్రియ వస్తువుగావున దానియందు నమ్మికగలవారు తమ యనుభవముకొలఁది, అను మానము కొలఁది, దానిని సాధించుటకు వేఱువేఱు మార్గములను వెదకుదురు. వెదక లేనివారు తమ కెవరియందు గౌరవముగలదో వారిమాటనమ్మి వారు చెప్పిన త్రోవ నడతురు. ధర్మభేదమిట్లేర్పడును. ప్రకృతము ఆ నమ్మిక చాలవఱకు నశించు చున్నది గావున ఈ భిన్నధర్మములును మనలో నశించుచున్నవి. ఇందుచే మనకు నష్టమా లాభమా యను విషయము ఎవరియంతకు వారే పరలోకయాత్ర యొదిగి వచ్చినప్పడు, నిర్ణయించుకోవలెనుగాని వేఱుమార్గము గానను. అది యట్లుండనిండు.

ప్రాచీనులు మోక్ష కాంక్షులంటిని. అనఁగా ఆధునికులకు మాత్రము మోక్ష మక్కరలేదా ! మోక్షమునుగోరుట మనుష్యస్వభావము. కోరక యుండుట యసా ధ్యము. తక్కిన జీవరాసులకంటె మనుష్యునకు విమర్శము ఊహ యను రెండు. మనోధర్మము లెక్కువగా నుండుటచే, ఫలమున్నను లేకున్నను చూచినవిషయము. లను విమర్శించుట, తెలియనిదాని నూహించుట, అతనికి సహజములైనవి. దశ దిక్కులందు ఇన్నివిధములనికాని, యింతసంఖ్య గలవనికాని, తెలియరాని చరా చరవస్తువు లెచ్చటఁజూచినను గలవు. వానిలో గొన్నిపరస్పరము మిత్రములు ; కొన్ని శత్రువులు ; కొన్ని రెండును గానివి. ఇవి యేల యున్నవి ? రూపము, రుచి, వన్నె, పరిమాణము, గుణము, శక్తి మొదలగు నన్ని విషయములందును ఇవి యొకదానివలె నొకటి యుండకపోవుట యేల? ఇవి పరస్పర సుఖదుఃఖముల నెందుకు కలిగించును? ఇవి పుట్టుట, పెరుగుట, చచ్చుట యేల? మఱియు అట్లనఁగా నేమి? వీని యసంఖ్య క్రియలన్నియు తమంతటనే జరుగుచున్నవా? వీనిని మార్పసాధ్యము లేదా?-ఇత్యాదిప్రశ్నలకు ప్రత్యుత్తరమును గోరుట, తెలియక పోయిన నేమో చింతపడుట మాసవధర్మము. ఇట్లు తెలియవలెనను నాశ గలిగియు తెలియలేకపోవుట మనుష్యునకుఁగల యన్నిబంధములలో మొదటిబంధము. చలి వేఁడులు, పుట్టుచావులు మొదలగు