పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన సంసార స్థితిగతులు 39

       "ఆ. కబ్బ మొకటి పూని గడగడ చదివిన
            లోనియర్థ మెట్లు తానెఱుంగు,
            ఎఱుకమాలు చదువ లేటికో తెల్పరా విశ్వ." (929)

అని యితఁడు తరువాత నెవనికో యుపదేశించెను. ఇంతేకాక తానుగూడ, ఆ గ్రంథకర్తలవలెను, తమ 'ఆస్థానము'నకు, వచ్చిపోవుచుండు కవులవలెను, కవిత్వము చేయవలెనని సంకల్పించుకొని యుండును. మన యదృష్టముచే వేమన్న చదువు పురాణములు దాఁటి కావ్యశాస్త్రములకు పోయినదిగాదు గావున, చిక్కులేని, ధారాళమైన భావముమీఱిన భాష కాని భాషనుమీరిన భాపముగాని లేని నిష్కల్మష మైన పురాణ కవితాశయ్యయే యతనికి లభించినది. కాని తానేమి వ్రాయవల యునో యింకను ఏర్పడలేదు. నాలుక తీఁటమాత్ర మపరిమితముగాఁ గలదు. అది యూరకుండనీక యుద్రేకించుచున్నది. కాని ఛందోవ్యాకరణాదు లేవియు నేర్వ లేదు. మఱియు పద్యములు వ్రాయుటకు నివి యావశ్యకములను భావమే అతని ఎప్పటికిని-దోఁచియుండదేమో! కావున పల్లెటూరివారు ఇతనివంటి నవయవ్వనులు, మనసుకు వచ్చిన విషయముపై తమయూహ కందిన నడకలో, ఇప్పటికిని కపిలెపదములల్లు నట్లు, ఇతఁడును, అంతకన్న మేలైన విదా సంస్కారము గలదు గావున విషయ నిర్బంధములేక, తెలుఁగు పద్యముల నెల్ల చిన్నదియు కొంతవరకు పాటలవలె స్పష్టమైన లయగతి గలదియునగు 'ఆట వెలఁది'లో రచనచేయ మొదలిడినాఁడు. ఇతని చిన్నతనపు పద్యములేవియో మన మెఱుఁగము గాని, యింత ధారాళమైన రచన ప్రకృతి దత్తమైన వరప్రసాదమే కావునను, అది యాకస్మికముగా నొకనాఁడు పొంగిపొరలివచ్చు నీటిబుగ్గ వంటిది కాదు గావునను, చిన్ననాఁట నుండియే యితనికా వాడుక కలదని మన మూహింప వలసియున్నది.

దీనికి తోడు ఇతనికి కొంత సంగీత విద్యయందును అభిరుచి లభించినది. కవలకు పండితుల కెట్లో అట్లే గాయకులకును ఆ కాలపురెడ్లు ఆశ్రయభూతులు. కావున తమయూరిలో జరిగిన పాటకచ్చేరీలలో నెల్ల ఆగ్రాసనము వహించిన పెద్ద రెడ్డిగారి ప్రక్కలో చిన్న వేమారెడ్డియు కూర్చుండి తదేక ధ్యాసముతో వినుచుండె ననుట నిస్సందేహము.

       "క. గంగాధరుఁడే దైవము, సంగీతమె చెవులకింపు..." (1233)
అందును—
       "క, విద్యలలోపల నీతియు, వాద్యంబులలోన వీణ...." (3507)

అని నిర్ణయించు కొన్నాఁడు. సూక్ష్మములైన విషయములు గ్రహింపవలయు నను తీవ్రభావము గలవానికి తప్ప తక్కినవానికి " వీణ" యం దభిరుచి కలుగుట యసాధ్యము, సంగీతమందును ఒక్కొక్కరి కొక్కొక్క రాగము రుచించును. కవిచౌడప్ప రాగంబులలో గాంభీర్యముగల రాగము కాంభోజి' యనెను. భట్టు మూర్తియు *కాంభోజీరాగ విపంచికారవసుధాపూరంబు' అని దానియంచే పక్ష పాతము చూపెను. మనకవులలో నింకెవఁడో 'సావేరి' ని అంగీకరించినట్లు జ్ఞప్తి, వేమన్నకు 'తోడి పై ఆభిమానము. దానియోగ్యతను గ్రహించుట కందఱికి శక్తిలేదఁట : 'దున్నపోతునకును తోడిరాగంబేల' (2040) అనుచున్నాఁడు. ఏమోచాలదను అతృప్తి, జుగుస్స తనయశక్తిచేఁ గలిగిన దైన్యము, దానికితోడు కార్యసాధనమునందలి పట్టుదల, స్వాతంత్ర్యర క్తి-ఇత్యాదిభావములు చూపుటకు