పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 38

ద్రవ్యము వెచ్చపెట్టుట, అడిగినది లేదనక యిచ్చుట, చేత లేనప్పడు న్యాయా న్యాయ మార్గములు రెంటిచేతను ద్రవ్యము " సంపాదించుట, భట్రాజులో బ్రాహ్మలో ప్రాఁతపద్యములు పేరులు మార్చి చెప్పినను ఆ పొగడ్తలకు నంతోషించి బహుమానములు చేయుట, ప్రణయమున్నచోట ప్రాణముల నిచ్చుట, కోపము వచ్చినప్పడు కుత్తుక కోఁతలతోనే కసిదీర్చుకొనుట-ఇవన్నియు నిప్పటికిని వారి రాజసగుణములు, పూఁత మెఱుఁగులు, వీcపు వెనుకటి మూటలు, మొగమోటపు మౌనములును ప్రాయికముగ వీరెఱుఁగరు. వీరిలో ప్రబలులైనవారు నేఁటికిని 'ప్రభురెడ్లు' అని వ్యవహరింపఁ బడుచున్నారు.

వేమన యిట్టి పల్లెటూరి ప్రభురెడ్ల గుంపునకుఁజేరి, అన్నవస్త్రములకు గొదవ లేక, అప్పునప్పుల పాలుగాక, భూమి కాణి గలిగి, ఆవులు గొఱ్ఱెలు సమృద్ధిగాఁగల మంచి నెమ్మదియైన సంసారమందు జన్మించినవాఁడని యూహింపవలసి యున్నది.

     " ఆ, నేయిలేని తిండి నీయాస కనువది
            కూరలేని తిండి కుక్కతిండి" (2307)

          "పప్పలేనికూడు పరుల కనహ్యము"(2407)

ఆని చెప్పఁగల వాఁడుఁ బీదసంసారి గానేరఁడు. మఱియు -

         "పెట్టి పోయలేని వట్టిదేబెలు భూమిC
           బుట్టిరేమి వారు గిట్టిరేమి" (2597)

         "నద్దిమిగులనింట సంసారమేలరా " (650)
         "ఆప్పలేని వాఁడె యధిక బలుడు" (2407)

అను మంచి సంసార ధర్మముల నితఁడు బాగుగా నెఱిఁగినవాఁడు. తల్లిదండ్రులు చదువుకొన్న పండితులు గాక పోయినను, చదువుకొన్న పండితులు, పౌరాణికులు, కవులు మొదలగువారి కాశ్రయమిచ్చు స్వభావము గలవారు గావున, వేమన చిన్న నాఁటినుంచి తమ యింటికి వచ్చి పోవుచుండు చదువరుల, కవుల సహవాసమున సంస్కారమును బొందినవాఁడు. మఱియు నా కాలమున కొంచెమన్నవస్త్రములకుఁ గల కాఁపవారందఱును వ్రాఁత చదువుల నేర్చియుండిరనుటలో సందేహములేదు. కాని, రామరాజభూషణాదులవలె అవి కేవల పాండిత్య నంపాదనకై యుపయో గించిన వారరుదు. సిద్ధములైన మతనీతి తత్త్వములను దెలిసికొనుటకు వలసినంత దేశభాషా పరిశ్రమము సామాన్యజనుల కావశ్యకముగాఁ దలఁపఁబడుచుండెను. అట్టితత్వములను వ్యాప్తిచేయుట కేర్పడినవే పురాణములు. మొన్న మొన్నటి వఱకును పల్లెటూళ్ళలో ప్రతినిత్యమును కొంత ప్రొద్దైనను పురాణములు చదివియో చదివించియో కాలక్షేపము చేయనిరెడ్డి యుండలేదు. కావున వేమన సామాన్యముగ వ్రాఁత చదువులు చక్కగా వచ్చువఱకును కొన్నాళ్ళు బడిపంతుల బెత్తపు దెబ్బలు తిని, తరువాత భారతము, రామాయణము, బసవపురాణము, శివపురాణము మొదలగు గ్రంథములను పలుమాఱు తండ్రిగారికి చదివి వినిపించి యుండును. పురాణములందలి కథలలో సామాన్యముగ నందఱు నెఱుఁగని కథల నితఁడెఱిఁగినట్లు అనేక పద్యములు తెల్పును. పాదరసమువంటి ప్రతిభాశక్తి కలవాఁడగుటచే, తిక్కన మొదలగు వారి గ్రంథములు ఊరక యెవరికొఱకో పారా యణము చేయక వాని యర్ధమును గ్రహించువఱకు వదలకుండెనని తోఁచు చున్నది